అధ్యాయం 18
‘తన కోసం వెతికి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు’
ప్రకటించే పద్ధతిని మార్చుకుని, ప్రజలకు ఆసక్తిగా ఉండే విషయాల గురించి పౌలు మాట్లాడాడు
అపొస్తలుల కార్యాలు 17:16-34 ఆధారంగా
1-3. (ఎ) ఏథెన్సులో అపొస్తలుడైన పౌలు హృదయం ఎందుకు రగిలిపోయింది? (బి) పౌలు ఆదర్శాన్ని పరిశీలించి మనం ఏం నేర్చుకోవచ్చు?
పౌలు ఇప్పుడు గ్రీసులోని ఏథెన్సులో ఉన్నాడు. ఆ నగరం పెద్దపెద్ద చదువులకు పెట్టింది పేరు. ఒకప్పుడు ఈ నగరంలో సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ బోధించారు. ఏథెన్సు ప్రజలకు దైవభక్తి ఎక్కువ, వాళ్లు చాలా దేవుళ్లను ఆరాధిస్తారు. కాబట్టి ఆలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, వీధుల్లో ఎక్కడ చూసినా విగ్రహాలు కనిపిస్తాయి. అవన్నీ చూసి పౌలు హృదయం రగిలిపోయింది. ఎందుకంటే, విగ్రహారాధన విషయంలో సత్యదేవుడైన యెహోవా అభిప్రాయం ఏంటో ఆయనకు తెలుసు. (నిర్గ. 20:4, 5) యెహోవాలాగే ఈ నమ్మకమైన అపొస్తలుడికి కూడా విగ్రహాలంటే అసహ్యం!
2 ఏథెన్సులోని సంత లేదా మార్కెట్ స్థలాన్ని అగొరా అని పిలుస్తారు. అక్కడికి వెళ్లినప్పుడు పౌలు అవాక్కయ్యాడు. ఆ సంతలోని ముఖ్య ద్వారం దగ్గరున్న ఒక మూలన హెర్మే దేవుని అసహ్యమైన విగ్రహాలు వరుసగా ఉన్నాయి. ఆ సంతలో ఎటుచూసినా దేవుళ్ల గుడులే కనబడుతున్నాయి. విగ్రహారాధనలో మునిగిపోయిన ఆ ప్రజలకు పౌలు ఎలా ప్రకటిస్తాడు? తన ఆవేశాన్ని అణుచుకొని, ఆ ప్రజలకు ఆసక్తిగా ఉండే వాటిని గమనించి, దానికి తగ్గట్టు మాట్లాడతాడా? నిజమైన దేవున్ని తెలుసుకుని, ఆయన్ని ఆరాధించేలా ఆయన అక్కడ ఎవరికైనా సహాయం చేయగలడా?
3 ఏథెన్సులోని మేధావులతో పౌలు మాట్లాడిన మాటలు అపొస్తలుల కార్యాలు 17:22-31 వచనాల్లో ఉన్నాయి. ఆయన వాళ్లతో తెలివిగా, ఒప్పించే విధంగా, ఆచితూచి మాట్లాడాడు. పౌలు ఆదర్శాన్ని పరిశీలిస్తే ప్రజలకు తగ్గట్టు మాట్లాడుతూ, వాళ్లను ఆలోచింపజేస్తూ, వాళ్లకు అర్థమయ్యేలా ఎలా వివరించవచ్చో నేర్చుకోవచ్చు.
“సంతలో” బోధించడం (అపొ. 17:16-21)
4, 5. పౌలు ఏథెన్సులో ఎక్కడ ప్రకటించాడు, అక్కడ ఎలాంటి ప్రజలున్నారు?
4 దాదాపు క్రీస్తు శకం 50 లో, తన రెండవ మిషనరీ యాత్రలో పౌలు ఏథెన్సుకు వెళ్లాడు. a బెరయ నుండి తిమోతి, సీల ఎప్పుడు వస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈలోపు తన అలవాటు ప్రకారం ‘లేఖనాల్ని అర్థం చేసుకునేలా సమాజమందిరంలో యూదులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు.’ అంతేకాదు, ఏథెన్సులోని అన్యజనులకు ప్రకటించడానికి అక్కడి “సంత” లేదా మార్కెట్ స్థలానికి వెళ్లాడు. (అపొ. 17:17) అది 12 ఎకరాలు లేదా అంతకన్నా పెద్ద స్థలం. అది అక్రొపొలిస్ కొండకు వాయువ్యం (నార్త్ వెస్ట్) వైపు ఉండేది. వ్యాపారం కోసం మాత్రమే కాకుండా, ప్రజలందరూ కలుసుకోవడానికి కూడా మార్కెట్ స్థలాన్ని ఉపయోగించేవాళ్లు. ఇది “వ్యాపారులు, రాజకీయ నాయకులు, మేధావులు, రచయితలు కలుసుకునే ముఖ్యమైన స్థలమని” ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తుంది. ఏథెన్సు ప్రజలు ఇక్కడ కలుసుకుని, లోతైన విషయాల గురించి చర్చించుకోవడానికి ఇష్టపడేవాళ్లు.
5 ఇక్కడి ప్రజల్ని ఒప్పించేలా మాట్లాడడం అంత తేలికేం కాదు. ఆ ప్రజల్లో ఎపికూరీయులు, స్తోయికులు ఉన్నారు. b వాళ్లు వేర్వేరు సిద్ధాంతాల్ని నమ్మేవాళ్లు. జీవం అనుకోకుండా, ఉన్నట్టుండి వచ్చిందని ఎపికూరీయులు నమ్మేవాళ్లు. వాళ్లు జీవితం గురించి ఇలా అనేవాళ్లు: దేవునికి భయపడాల్సిన అవసరం లేదు; చనిపోయాక ఏ బాధ ఉండదు; సంతోషాన్ని సంపాదించుకోవచ్చు, కష్టాల్ని సహించవచ్చు.” మరోవైపు స్తోయికులు, జ్ఞానాన్ని-అవగాహనను సంపాదించుకోవడం చాలా ముఖ్యమని నమ్మేవాళ్లు. వాళ్లు దేవుడు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నమ్మేవాళ్లు. క్రీస్తు శిష్యులు బోధిస్తున్న పునరుత్థానాన్ని ఎపికూరీయులు గానీ స్తోయికులు గానీ నమ్మేవాళ్లు కాదు. పౌలు బోధిస్తున్న అమూల్యమైన సత్యాలకు, ఈ రెండు గుంపుల వాళ్ల నమ్మకాలకు అస్సలు పోలిక లేదు.
6, 7. పౌలు చెప్పింది విన్నప్పుడు గ్రీకు మేధావులకు ఎలా అనిపించింది? నేడు కూడా పరిస్థితి ఎలా ఉంది?
6 పౌలు బోధల్ని విన్న ఆ గ్రీకు మేధావులకు ఎలా అనిపించింది? కొంతమంది ఆయన్ని “వదరుబోతు” అన్నారు. (అపొ. 17:18) ఇక్కడ గ్రీకులో ఉపయోగించిన పదానికి, “విత్తనాలు ఏరుకునేవాడు” అనే అర్థం ఉంది. ఆ గ్రీకు పదాన్ని ఒక పండితుడు ఇలా వివరించాడు: “మొదట్లో ఆ పదాన్ని, అటూ-ఇటూ తిరుగుతూ గింజలు ఏరుకునే చిన్న పక్షి గురించి చెప్పడానికి ఉపయోగించేవాళ్లు. తర్వాతి రోజుల్లో ఈ పదాన్ని, మార్కెట్ స్థలంలో మిగిలిపోయిన ఆహారాన్ని, పనికిరాని వాటిని ఏరుకునే వ్యక్తి గురించి చెప్పడానికి ఉపయోగించేవాళ్లు. అయితే తర్వాత్తర్వాత ఈ పదాన్ని, అక్కడో మాట ఇక్కడో మాట విన్న వ్యక్తి గురించి, ముఖ్యంగా వాటిని అర్థం చేసుకోకుండా తెలివి తక్కువగా మాట్లాడే వ్యక్తి గురించి చెప్పడానికి ఉపయోగించారు.” ఒక్కమాటలో చెప్పాలంటే, పౌలు ఎవరో చెప్పిన వాటిని విని, తల-తోక లేకుండా మాట్లాడుతున్నాడని ఆ మేధావులు అన్నారు. తనకు అలా “వదరుబోతు” అనే పేరు పెట్టినా పౌలు ఏ మాత్రం డీలా పడిపోలేదు.
7 ఈ రోజుల్లో కూడా పరిస్థితి అలానే ఉంది. బైబిల్ని నమ్ముతున్నందుకు యెహోవాసాక్షులమైన మనకు రకరకాల పేర్లు పెడుతున్నారు. ఉదాహరణకు కొంతమంది మేధావులు, టీచర్లు పరిణామం (ఎవల్యూషన్) నిజంగా జరిగిందని, తెలివైన వాళ్లు దాన్ని ఒప్పుకుంటారని చెప్తున్నారు. ఇంకోమాటలో చెప్పాలంటే, దాన్ని నమ్మని వాళ్లందరూ తెలివి తక్కువ వాళ్లని అంటారు. సృష్టికర్త ఉన్నాడనే రుజువులు చూపిస్తూ, బైబిలు గురించి మాట్లాడే మనం తెలివి తక్కువ వాళ్లమని, ‘వదరుబోతులమని’ ప్రజలందరూ అనుకోవాలనేదే వాళ్ల ఉద్దేశం. అయితే మనం డీలాపడిపోం. ఈ భూమ్మీది ప్రాణులన్నిటికీ జీవాన్ని ఇచ్చింది ఒక తెలివైన సృష్టికర్త అని, ఆయనే యెహోవా అని ధైర్యంగా చెప్తాం.—ప్రక. 4:11.
8. (ఎ) పౌలు మాటల్ని విన్న ఇంకొంతమంది ఏమన్నారు? (బి) పౌలును అరేయొపగుకు తీసుకెళ్లారు అనే మాటకు అర్థం ఏమైవుంటుంది? (142వ పేజీలో అధస్సూచి చూడండి.)
8 పౌలు మాటల్ని విన్న ఇంకొంతమందేమో ఇలా అన్నారు: “ఇతను విదేశీ దేవుళ్ల గురించి ప్రకటిస్తున్నట్టున్నాడు.” (అపొ. 17:18) పౌలు నిజంగానే ఏథెన్సు వాళ్లకు కొత్త దేవుళ్ల గురించి ప్రకటిస్తున్నాడా? ఒకవేళ అదే నిజమైతే, అతను ప్రమాదంలో పడ్డట్టే! చాలా ఏళ్ల క్రితం సోక్రటీస్ మీద కూడా ఇదే నింద పడింది. ఆ నిందను బట్టి, ఇంకొన్ని కారణాల్ని బట్టి ఆయన్ని విచారణ చేసి, మరణశిక్ష వేశారు. ఇప్పుడు ఏథెన్సు వాళ్లు పౌలును కూడా అరేయొపగుకు తీసుకెళ్లి, తమకు వింతగా అనిపిస్తున్న బోధల గురించి ఆయన్ని విచారణ చేశారు. c మరి లేఖనాల గురించి ఏమీ తెలియని ఈ ప్రజల ముందు పౌలు తన వాదనను ఎలా వినిపిస్తాడు, వాళ్లకు ఎలా ప్రకటిస్తాడు?
“ఏథెన్సు ప్రజలారా . . . నేను గమనించాను” (అపొ. 17:22, 23)
9-11. (ఎ) ఏథెన్సు ప్రజలు, అలాగే తను ఇష్టపడే విషయాల గురించి పౌలు ఎలా మాట్లాడాడు? (బి) పరిచర్య చేస్తున్నప్పుడు మనం పౌలు ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు?
9 ఏథెన్సులోని విగ్రహాల్ని చూసి, పౌలు హృదయం రగిలిపోయిందని గుర్తుచేసుకోండి. అయితే, విగ్రహారాధన తప్పని ఆయన వెంటనే ఖండించలేదు. బదులుగా ప్రశాంతంగా-నేర్పుగా ఏథెన్సు ప్రజలు, అలాగే తను ఇష్టపడే విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఇలా అన్నాడు: “ఏథెన్సు ప్రజలారా, ఇతరులతో పోలిస్తే అన్ని విషయాల్లో మీకు దైవభక్తి ఎక్కువని నేను గమనించాను.” (అపొ. 17:22) పౌలు తెలివిగా దేవుని మీద వాళ్లకున్న భక్తిని మెచ్చుకున్నాడు. అబద్ధమత బోధల వల్ల మోసపోయిన కొంతమందిలో, సత్యం తెలుసుకోవాలనే కోరిక ఉంటుందని పౌలు గుర్తించాడు. ఒకప్పుడు తను కూడా సత్యం “తెలియక, విశ్వాసం లేక” అలాగే ప్రవర్తించాడని పౌలు గుర్తుంచుకున్నాడు.—1 తిమో. 1:13.
10 తర్వాత, వాళ్లకు దైవభక్తి ఉందనడానికి గల కారణాన్ని పౌలు వివరించాడు. “తెలియని దేవునికి” అనేమాట చెక్కి ఉన్న ఒక బలిపీఠాన్ని చూశానని పౌలు చెప్పాడు. ఒక రెఫరెన్సు ఇలా చెప్తుంది: “తెలియని దేవుళ్లకు బలిపీఠాలు కట్టించే అలవాటు గ్రీకువాళ్లకు, ఇంకొందరికి ఉండేది. ‘ఒకవేళ వేరే దేవుడు ఉండి, తనను పూజించనందుకు కోపమొచ్చి మనల్ని శిక్షిస్తే ఏంటి పరిస్థితి?’ అనే భయంతో వాళ్లు అలా చేసేవాళ్లు.” ఏథెన్సు వాళ్లు ఆ బలిపీఠాన్ని కట్టించారంటే, తమకు తెలియని ఒక దేవుడు ఉన్నాడని వాళ్లు నమ్ముతున్నట్టే. పౌలు దాన్ని ఉపయోగించి, వాళ్లకు మంచివార్తను ప్రకటించాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు తెలియక పూజిస్తున్న ఆ దేవుని గురించే నేను మీకు ప్రకటిస్తున్నాను.” (అపొ. 17:23) పౌలు నేర్పుగా, తిరుగులేని విధంగా మాట్లాడాడు. కొంతమంది నింద వేసినట్టుగా కొత్త దేవుని గురించో, విదేశీ దేవుని గురించో ఆయన ప్రకటించడం లేదు. వాళ్లకు తెలియని దేవుని గురించి, సత్య దేవుని గురించి పౌలు మాట్లాడుతున్నాడు.
11 పరిచర్య చేస్తున్నప్పుడు మనం పౌలు ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు? మనం ఇంటివ్యక్తిని; అతని ఇంటిని, పరిసరాల్ని జాగ్రత్తగా గమనిస్తే, అతనికి దేవుడంటే భక్తి ఉందని చూపించే ఏదోక రుజువు మనకు కనిపించవచ్చు. బహుశా మీరు ఇలా అనవచ్చు: ‘మీకు దేవుని మీద చాలా భక్తి ఉందని అర్థమౌతుంది. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. మీతో కాసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను.’ నేర్పుగా ఇంటి వ్యక్తి నమ్మకాల్ని గుర్తిస్తే, ఇద్దరికీ నచ్చే ఏదోక విషయం గురించి మాట్లాడే అవకాశం దొరకవచ్చు. గుర్తుంచుకోండి: ఒకరి మత నమ్మకాల్ని బట్టి, వాళ్లు ఇక మారరు అని ముందే ఒక ముగింపుకు వచ్చేయకూడదు. ఎందుకంటే, మన సహోదర సహోదరీల్లో చాలామంది ఒకప్పుడు అబద్ధమత నమ్మకాల్లో పాతుకుపోయిన వాళ్లే.
దేవుడు “మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు” (అపొ. 17:24-28)
12. ప్రజలకు తగ్గట్టు, పౌలు తను ప్రకటించే విధానాన్ని ఎలా మార్చుకున్నాడు?
12 ఏథెన్సు ప్రజలు, అలాగే తను ఇష్టపడే విషయాన్ని ఉపయోగించి పౌలు మాట్లాడడం మొదలుపెట్టాడు. మరి ఇప్పుడు ఆయన దాన్ని అలాగే కొనసాగించగలడా? ఆ ప్రజలకు లేఖనాల గురించి అసలేం తెలీదు, కానీ వాళ్లకు గ్రీకు సిద్ధాంతాలు బాగా తెలుసు. అందుకే పౌలు వాళ్లకు తగ్గట్టు, ప్రకటించే విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. మొదటిగా, ఆయన లేఖనాల్ని ఉన్నదున్నట్టు చెప్పకుండా అందులో ఉన్న విషయాల్ని చెప్పాడు. రెండోదిగా “మనకు,” “మనం” లాంటి పదాల్ని ఉపయోగిస్తూ తనను కూడా కలుపుకొని మాట్లాడాడు. మూడోదిగా, గ్రీకు రచనల్లోని కొన్ని మాటల్ని ఉపయోగిస్తూ, ఆయన చెప్పేది వాళ్ల సొంత రచనల్లో కూడా ఉందని చూపించాడు. పౌలు వాళ్లతో ఎంత చక్కగా మాట్లాడాడో ఇప్పుడు పరిశీలిద్దాం. ఏథెన్సు ప్రజలకు తెలియని దేవునికి సంబంధించిన ఏ ముఖ్యమైన సత్యాల్ని పౌలు చెప్పాడు?
13. విశ్వం ఎలా వచ్చిందని పౌలు చెప్పాడు? ఆయన మాటలు ఏ విషయాన్ని స్పష్టం చేశాయి?
13 దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు. పౌలు ఇలా అన్నాడు: “లోకాన్ని, అందులో ఉన్న వాటన్నిటినీ చేసిన దేవుడు ఆకాశానికి, భూమికి ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.” d (అపొ. 17:24) విశ్వం హఠాత్తుగా, ఉన్నట్టుండి రాలేదు. అన్నిటినీ సత్యదేవుడే సృష్టించాడు. (కీర్త. 146:6) ఎథీనా, అలాగే ఇతర దేవుళ్లకు గుళ్లు, గోపురాలు, బలిపీఠాల వల్లే మహిమ వస్తుంది. కానీ ఆకాశాన్ని, భూమిని సృష్టించిన సర్వోన్నత ప్రభువుకు మనుషులు కట్టించిన ఆలయాలు ఏ మాత్రం సరిపోవు. (1 రాజు. 8:27) మనుషులు కట్టిన ఆలయాల కన్నా, మనుషుల చేత్తో చేసిన విగ్రహాల కన్నా నిజమైన దేవుడు చాలాచాలా గొప్పవాడు అని పౌలు మాటలు స్పష్టం చేశాయి.—యెష. 40:18-26.
14. దేవునికి మనుషులు ఇచ్చేవేవీ అవసరం లేదని పౌలు ఎలా వివరించాడు?
14 దేవునికి మనుషులు ఇచ్చేవి అవసరం లేదు. విగ్రహాల్ని పూజించే వాళ్లు ఆ విగ్రహాలకు ఖరీదైన వస్త్రాల్ని, విలువైన కానుకల్ని సమర్పిస్తారు. అంతేకాదు రకరకాల ఆహారాల్ని, పానీయాల్ని వాటి ముందు పెడతారు. అవన్నీ ఆ విగ్రహాలకు అవసరమని వాళ్లు అనుకుంటారు. అయితే, మనుషులు ఇచ్చేవేవీ దేవునికి అవసరం లేదనే అభిప్రాయం పౌలు మాటల్ని వింటున్న కొంతమంది గ్రీకువాళ్లకు ఉండి ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే, ‘తనకేదో అవసరం ఉన్నట్టు దేవుడు మనుషుల సహాయం కోసం ఎదురుచూడడు’ అని పౌలు చెప్పిన మాటను వాళ్లు ఒప్పుకుని ఉంటారు. నిజానికి సృష్టికర్తకు మనుషులు ఇచ్చేవేవీ అవసరం లేదు. బదులుగా, “ఆయనే అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని, అన్నిటినీ ఇస్తున్నాడు.” మనుషులకు కావల్సిన వెలుతురును, వర్షాన్ని, పంటలు పండే మంచి నేలను ఆయనే ఇస్తున్నాడు. (అపొ. 17:25; ఆది. 2:7) కాబట్టి ఇచ్చే స్థానంలో ఉన్న దేవునికి, తీసుకునే స్థానంలో ఉన్న మనుషులు ఇచ్చేవేవీ అవసరం లేదు.
15. ‘మిగతావాళ్ల కన్నా గ్రీకు వాళ్లమైన మనమే గొప్ప’ అనే అభిప్రాయాన్ని పౌలు ఎలా సరిచేశాడు? ఆయన ఆదర్శం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
15 దేవుడు ఒక మనిషిని చేశాడు. ‘మిగతావాళ్ల కన్నా, గ్రీకు వాళ్లమైన మనమే గొప్ప’ అని ఏథెన్సు ప్రజలు అనుకునేవాళ్లు. అయితే మన దేశమే గొప్పది, మన జాతే గొప్పది అనే గర్వం ఉండకూడదని బైబిలు చెప్తుంది. (ద్వితీ. 10:17) సున్నితమైన ఈ విషయాన్ని పౌలు నేర్పుగా, నైపుణ్యంగా చెప్పాడు. దేవుడు “ఒకే ఒక్క మనిషి నుండి అన్నిదేశాల మనుషుల్ని చేశాడు” అని పౌలు అన్నప్పుడు, ఆ ఏథెన్సు ప్రజలు ఖచ్చితంగా ఆలోచనలో పడి ఉంటారు. (అపొ. 17:26) మనుషులందరికీ తండ్రి ఆదాము అని ఆదికాండం పుస్తకం చెప్తోంది. ఆ విషయాన్నే పౌలు ఇక్కడ తెలియజేశాడు. (ఆది. 1:26-28) మనుషులందరూ ఒకే వ్యక్తి నుండి వచ్చినప్పుడు ఒక దేశం లేదా జాతి వాళ్లు, మిగతావాళ్ల కన్నా గొప్పవాళ్లు ఎలా అవుతారు? పౌలు చెప్పేది వింటున్న వాళ్లకు ఆ విషయం ఇప్పుడు అర్థమై ఉంటుంది. పౌలు ఆదర్శం నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. మనం ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు మొండిగా వాదించం, నేర్పుగా మాట్లాడతాం. అలాగని, ప్రజలకు నచ్చేలా చెప్పడం కోసం బైబిలు సత్యాల్ని నీరుగార్చం.
16. మనుషుల విషయంలో సృష్టికర్త ఉద్దేశం ఏంటి?
16 మనుషులు తనకు దగ్గరవ్వాలన్నదే దేవుని ఉద్దేశం. పౌలు మాటల్ని వింటున్న మేధావులు, చాలా ఏళ్లుగా మనిషి పుట్టుకకు గల రకరకాల కారణాల్ని చెప్తూ వస్తున్నారు. కానీ వాళ్లు దేన్నీ సరిగ్గా వివరించలేకపోయారు. అయితే సృష్టికర్త మనుషుల్ని ఎందుకు చేశాడో పౌలు స్పష్టంగా వివరించాడు. అదేంటంటే: “ప్రజలు తన కోసం వెతికి, తడవులాడి, తనను కనుక్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజానికి, ఆయన మనలో ఏ ఒక్కరికీ దూరంగా లేడు.” (అపొ. 17:27) ఏథెన్సు ప్రజలు ఇన్నాళ్లు తెలియక పూజిస్తున్న దేవున్ని తెలుసుకోవడం సాధ్యమే. తన గురించి నిజంగా వెతికి, తెలుసుకోవాలనుకుంటున్న వాళ్లందరికీ ఆయన దగ్గరగా ఉన్నాడు. (కీర్త. 145:18) పౌలు ఇక్కడ “మనలో” అనే పదాన్ని ఉపయోగించాడని గమనించండి. అంటే దేవున్ని “వెతికి, తడవులాడి” కనుక్కోవాల్సిన వాళ్లలో తను కూడా ఉన్నాడని పౌలు చెప్పాడు.
17, 18. దేవునికి దగ్గరవ్వాలని మనుషులు ఎందుకు కోరుకోవాలి? ప్రజలకు తగ్గట్టు పౌలు బోధించిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
17 దేవునికి దగ్గరవ్వాలని మనుషులు కోరుకోవాలి. దానికి గల ఒక కారణాన్ని పౌలు ఇలా చెప్పాడు: “ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం.” పౌలు ఇక్కడ క్రేతుకు చెందిన ఎపిమెనిడిస్ అనే కవి రాసిన మాటల్ని ఉపయోగించాడని కొంతమంది పండితులు అంటారు. ఆయన క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి చెందినవాడు. ఏథెన్సు సంస్కృతిలో ఆయనకు మంచిపేరు ఉంది. దేవునికి దగ్గరవ్వాలని మనుషులు ఎందుకు కోరుకువాలో వివరిస్తూ పౌలు ఇంకో కారణాన్ని చెప్పాడు. పౌలు ఇలా అన్నాడు: “మీ కవులలో కొంతమంది చెప్పినట్టు, ‘మనం కూడా ఆయన పిల్లలమే.’” (అపొ. 17:28) దేవుడే మొదటి మనిషిని సృష్టించాడు, ఆ మనిషి నుండే మనందరం వచ్చాం. కాబట్టి మనుషులందరూ ఆ దేవునికి దగ్గరవ్వాలి. పౌలు తెలివిగా, గ్రీకు కవుల మాటల్ని ఉపయోగిస్తూ ప్రజలకు నచ్చేలా మాట్లాడాడు. e పౌలు ఆదర్శాన్ని పాటిస్తూ మనం కూడా అప్పుడప్పుడు చరిత్ర పుస్తకాల్ని, ఎన్‌సైక్లోపీడియాల్ని, మంచి పేరున్న ఇతర రెఫరెన్సుల్ని కొంతవరకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, కొన్ని అబద్ధమత ఆచారాలు ఎలా వచ్చాయో సాక్షులు కానివాళ్లకు వివరించడానికి మనం వాటిని ఉపయోగించవచ్చు.
18 మనం ఇప్పటి వరకు గమనిస్తే, పౌలు చాలా ముఖ్యమైన సత్యాల్ని ప్రజలకు తగ్గట్టు ఎంతో నేర్పుగా చెప్పాడు. ఇంతకీ ఆయన ఇవన్నీ వాళ్లకు ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పిన తర్వాతి మాటల్ని గమనిస్తే దానికి జవాబు తెలుస్తుంది.
“ప్రజలందరూ పశ్చాత్తాపపడాలి” (అపొ. 17:29-31)
19, 20. (ఎ) మనుషులు తయారుచేసిన విగ్రహాల్ని ఆరాధించడం సరైనది కాదని పౌలు ఎలా తెలివిగా వివరించాడు? (బి) ఏథెన్సు ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి?
19 తెలుసుకున్నదానికి తగ్గట్టు నడుచుకునేలా పౌలు ప్రజల్ని ప్రోత్సహించాడు. ఇంతకుముందు చెప్పిన గ్రీకు కవుల మాటల్ని ఉపయోగించుకుని ఆయన ఇలా వివరించాడు: “మనం దేవుని పిల్లలం కాబట్టి, దేవుడు బంగారంతోనో, వెండితోనో, రాయితోనో చేయబడిన వాటిలా, మనుషుల ఆలోచనల ప్రకారం చేతులతో చేసిన వాటిలా ఉంటాడని అనుకోకూడదు.” (అపొ. 17:29) మనుషుల్ని చేసిందే దేవుడైతే, ఆయన మనుషులు తయారుచేసిన విగ్రహాల్లా ఎందుకు ఉంటాడు? మనుషులు చేసిన విగ్రహాల్ని ఆరాధించడం ఎందుకు సరైంది కాదో పౌలు నేర్పుగా వివరించాడు. (కీర్త. 115:4-8; యెష. 44:9-20) పౌలు తనను కూడా కలుపుకుంటూ ‘మనం అనుకోకూడదు’ అని అన్నమాట, ప్రజలకు దాన్ని ఒప్పుకోవడం తేలిక చేసి ఉంటుంది.
20 వాళ్లు ఏం చేయాలో పౌలు ఇలా స్పష్టంగా చెప్పాడు: “ప్రజలకు తన గురించి తెలియని ఆ కాలాల్ని [అంటే, విగ్రహాల్ని ఆరాధించే వాళ్లను దేవుడు ఇష్టపడతాడు అని అనుకున్న కాలాల్ని] దేవుడు చూసీచూడనట్టు వదిలేశాడు. ఇప్పుడైతే ప్రజలందరూ పశ్చాత్తాపపడాలని ఆయన ప్రకటిస్తున్నాడు.” (అపొ. 17:30) ‘పశ్చాత్తాపపడాలి’ అనే మాట విని కొంతమంది ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ పౌలు ఇప్పటివరకు చెప్పిన మాటలు, దేవుడే వాళ్లకు జీవాన్నిచ్చాడు కాబట్టి వాళ్లు ఆయనకు లెక్క అప్పజెప్పాలి అనే విషయాన్ని స్పష్టం చేశాయి. వాళ్లు దేవున్ని వెతకాలి, ఆయన గురించిన సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ సత్యానికి తగ్గట్టు తమ జీవితాన్ని మార్చుకోవాలి. అంటే విగ్రహారాధన పాపం అని గుర్తించి, దాన్ని విడిచిపెట్టేయాలి.
21, 22. చివర్లో పౌలు ఏ ముఖ్యమైన విషయం చెప్పాడు? అది మనకు ఎలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది?
21 చివర్లో పౌలు ఈ ముఖ్యమైన విషయం చెప్పాడు: “తాను నియమించిన మనిషి ద్వారా ప్రపంచానికి న్యాయంగా తీర్పు తీర్చే ఒక రోజును ఆయన నిర్ణయించాడు. దేవుడు ఆ మనిషిని మృతుల్లో నుండి తిరిగి బ్రతికించడం ద్వారా, ఆ తీర్పు రోజు తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చాడు.” (అపొ. 17:31) తీర్పు తీర్చబడే ఒక రోజు రాబోతుందని వాళ్లు తెలుసుకున్నారు. కాబట్టి నిజమైన దేవున్ని వెతికి, ఆయన్ని కనుగొనడం ఎంత ముఖ్యమో వాళ్లకు అర్థమవ్వాలి! ఆ తీర్పు తీర్చే వ్యక్తి పేరును పౌలు చెప్పలేదు. అయితే ఆయన గురించి ఆశ్చర్యకరమైన విషయాల్ని చెప్పాడు: ఆయన మనిషిగా జీవించాడు, చనిపోయాడు, దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి తిరిగి బ్రతికించాడు!
22 పౌలు చివర్లో అన్న ఆ మాట మనకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తీర్పు తీర్చడానికి దేవుడు నియమించిన వ్యక్తి, పునరుత్థానమైన యేసుక్రీస్తు అని మనకు తెలుసు. (యోహా. 5:22) ఆ తీర్పు రోజు వెయ్యి సంవత్సరాల పాటు ఉంటుందని, అది చాలా దగ్గర్లో ఉందని కూడా మనకు తెలుసు. (ప్రక. 20:4, 6) మనం ఆ తీర్పు రోజుకు భయపడం, ఎందుకంటే నమ్మకమైన వాళ్లుగా తీర్పు పొందినవాళ్లకు అది చెప్పలేనన్ని దీవెనలు తీసుకొస్తుంది. అది తప్పకుండా జరుగుతుంది అనడానికి యేసుక్రీస్తు పునరుత్థానమే గొప్ప రుజువు!
“కొంతమంది . . . విశ్వాసులయ్యారు” (అపొ. 17:32-34)
23. పౌలు మాటల్ని విన్న ప్రజలు ఎలా స్పందించారు?
23 పౌలు మాటలకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. పునరుత్థానం గురించి విని “కొంతమంది ఎగతాళి చేశారు.” ఇంకొంతమంది ఎటూ తేల్చుకోలేక, “దీని గురించి నువ్వు చెప్పేది మేము ఇంకో సమయంలో వింటాం” అని మర్యాదగా అన్నారు. (అపొ. 17:32) అయితే చక్కగా స్పందించిన వాళ్లు కూడా ఉన్నారు. “కొంతమంది పౌలుతో చేరి విశ్వాసులయ్యారు. వాళ్లలో అరేయొపగు న్యాయస్థాన న్యాయమూర్తి దియొనూసి, దమరి అనే స్త్రీ, ఇంకొంతమంది ఉన్నారు.” (అపొ. 17:34) మనకు కూడా పరిచర్యలో అలాంటి అనుభవాలే ఎదురౌతాయి. కొంతమంది మనల్ని ఎగతాళి చేయవచ్చు, ఇంకొంతమంది మర్యాదగా మాట్లాడినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. అయితే కొంతమంది రాజ్య సందేశాన్ని విని, దేవునికి దగ్గరైనప్పుడు మనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.
24. అరేయొపగు దగ్గర పౌలు అన్న మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
24 పౌలు మాటల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజలకు నచ్చేలా ఎలా మాట్లాడాలో, మనం చెప్పేది సత్యం అని ఎలా ఒప్పించాలో నేర్చుకోవచ్చు. అంతేకాదు, అబద్ధమత బోధల వల్ల మోసపోయిన వాళ్లతో ఎలా ప్రశాంతంగా, నేర్పుగా మాట్లాడాలో నేర్చుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన పాఠం ఏంటంటే: ప్రజలకు నచ్చేలా చెప్పాలని, మనం బైబిలు సత్యాల్ని నీరుగార్చం. పౌలు ఆదర్శాన్ని పాటిస్తే మనం పరిచర్యను ఇంకా చక్కగా చేస్తాం, పర్యవేక్షకులేమో సంఘంలో మంచి బోధకులు అవుతారు. అంతేకాదు, ‘దేవున్ని వెతికి, కనుక్కునేలా’ ప్రజలకు మరింత బాగా సహాయం చేస్తాం.—అపొ. 17:27.
a “ ఏథెన్సు—నాటి ప్రపంచ సంస్కృతికి రాజధాని” అనే బాక్సు చూడండి.
b “ ఎపికూరీయులు, స్తోయికులు” అనే బాక్సు చూడండి.
c అక్రొపొలిస్ కొండకు వాయువ్యం (నార్త్ వెస్ట్) వైపు అరేయొపగు కొండ ఉండేది. సాధారణంగా ఏథెన్సు నాయకులు ఈ అరేయొపగు దగ్గర కలుసుకునే వాళ్లు. ఇక్కడ “అరేయొపగు” అనే మాట ఆ నాయకుల గుంపును గానీ లేదా ఆ కొండను గానీ సూచిస్తుండవచ్చు. కాబట్టి పౌలును ఈ కొండ దగ్గరికి తీసుకొచ్చారా లేక ఆ నాయకులు గుంపు కలుసుకునే వేరొక చోటికి, బహుశా మార్కెట్ స్థలానికి తీసుకొచ్చారా అనే విషయంలో పండితులకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి.
d ఇక్కడ “లోకం” అనే మాటకు గ్రీకులో కాస్మోస్ అనే పదాన్ని ఉపయోగించారు. సాధారణంగా బైబిల్లో ఈ పదాన్ని ప్రజల్ని సూచించడానికి ఉపయోగిస్తారు, కానీ గ్రీకువాళ్లేమో ఈ పదాన్ని భౌతిక విశ్వం గురించి మాట్లాడడానికి ఉపయోగిస్తారు. కాబట్టి పౌలు కూడా ఇక్కడ ఈ పదాన్ని, ఆ అర్థంలోనే ఉపయోగించి ఉంటాడు.
e పౌలు ఇక్కడ స్తోయికుల కవి అయిన అరాటస్ రచించిన ఫినామినా అనే కవితలోని మాటల్ని చెప్పాడు. ఇలాంటి మాటలే ఇతర గ్రీకు రచనల్లో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు స్తోయికుల రచయిత అయిన క్లియాంతీస్ రచించిన హిమ్న్ టు జూస్‌లో అలాంటి మాటలు కనిపిస్తాయి.