కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 19

“మాట్లాడుతూనే ఉండు, ఆపకు”

“మాట్లాడుతూనే ఉండు, ఆపకు”

పౌలు కష్టపడి పని చేసుకుంటూనే, పరిచర్యకు మొదటి స్థానం ఇచ్చాడు

అపొస్తలుల కార్యాలు 18:1-22 ఆధారంగా

1-3. అపొస్తలుడైన పౌలు కొరింథుకు ఎందుకు వచ్చాడు? ఆయన ముందు ఏ సవాళ్లు ఉన్నాయి?

 క్రీస్తు శకం 50 చివర్లో అపొస్తలుడైన పౌలు కొరింథుకు వచ్చాడు. అది చాలా సంపన్న నగరం, అక్కడ వ్యాపారాలు బాగా జరిగేవి. ఆ నగరంలో చాలామంది గ్రీకులు, రోమన్లు, యూదులు ఉండేవాళ్లు. a పౌలు వ్యాపారం కోసమో, ఉద్యోగం కోసమో అక్కడికి రాలేదు, అంతకంటే ముఖ్యమైన పని కోసం వచ్చాడు. అదే, దేవుని రాజ్యం గురించి సాక్ష్యం ఇవ్వడం. మరి పౌలు ఆ నగరంలో ఎక్కడ ఉంటాడు? తనను తాను పోషించుకోవడానికి ఏం చేస్తాడు? వేరేవాళ్లకు భారంగా ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. దేవుని వాక్యం గురించి ప్రకటిస్తున్నందుకు ప్రజలు తన అవసరాల్ని చూసుకోవాలని ఆయన అనుకోలేదు. మరి ఆయన ఏం చేస్తాడు?

2 పౌలుకు డేరాలు తయారుచేసే పని వచ్చు, అయితే ఆ పని అంత తేలికేం కాదు. ఆయన కష్టపడి పని చేస్తూ తన కాళ్ల మీద తను నిలబడాలనుకున్నాడు. మరి ఈ మహా నగరంలో ఆయనకు పని దొరుకుతుందా? ఉండడానికి ఒక ఇల్లు దొరుకుతుందా? ఇలాంటి సవాళ్లు ఉన్నా, పౌలు మనసు మాత్రం ప్రకటనా పని నుండి పక్కకు మళ్లలేదు.

3 పౌలు కొరింథులో చాలాకాలం ఉన్నాడని, అక్కడ మంచి ఫలితాలు వచ్చాయని లేఖనాలు చెప్తున్నాయి. కొరింథులో పౌలు చేసిన పరిచర్యను పరిశీలిస్తే, మనం కూడా మన ప్రాంతంలో దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేసే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.

“వాళ్ల వృత్తి కూడా డేరాలు తయారుచేయడమే” (అపొ. 18:1-4)

4, 5. (ఎ) కొరింథులో పౌలు ఎవరి ఇంట్లో ఉన్నాడు, ఆయన ఏం పని చేశాడు? (బి) పౌలుకు ఆ పని ఎలా వచ్చు?

4 పౌలు కొరింథుకు వచ్చిన కొంతకాలానికి, ఆతిథ్యం ఇచ్చే విషయంలో మంచి పేరున్న ఒక జంటను కలిశాడు. వాళ్లే అకుల, ప్రిస్కిల్ల. ఈ అకుల పుట్టుకతోనే యూదుడు. ప్రిస్కిల్లను ప్రిస్క అని కూడా పిలుస్తారు. “క్లౌదియ చక్రవర్తి యూదులందర్నీ రోము విడిచివెళ్లమని ఆజ్ఞాపించడంతో” ఈ జంట కొరింథుకు వచ్చారు. (అపొ. 18: 1, 2) ఈ జంట పౌలును తమ ఇంటికి ఆహ్వానించారు. అంతేకాదు, తమతో కలిసి పని చేసుకోనిచ్చారు. బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్ల వృత్తి కూడా డేరాలు తయారుచేయడమే కాబట్టి పౌలు వాళ్లింట్లో ఉండి వాళ్లతో కలిసి పనిచేశాడు.” (అపొ. 18:3) పౌలు కొరింథులో ఉన్నంతకాలం మంచి మనసున్న ఈ జంట ఇంట్లోనే ఉన్నాడు. బహుశా వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడే, పౌలు పవిత్రశక్తి సహాయంతో కొన్ని ఉత్తరాల్ని రాసి ఉండవచ్చు. b

5 “గమలీయేలు పాదాల దగ్గర చదువు నేర్చుకున్న” పౌలుకు డేరాలు తయారుచేసే పని ఎలా వచ్చు? (అపొ. 22:3) మొదటి శతాబ్దంలోని యూదులు, తమ పిల్లల్ని పెద్ద చదువులు చదివించినా, ఏదోక పని కూడా నేర్పించేవాళ్లు. దాన్ని చిన్నతనంగా భావించేవాళ్లు కాదు. పౌలు సొంత ఊరు కిలికియలోని తార్సు. డేరాల కోసం ఉపయోగించే గుడ్డను తయారు చేయడంలో ఆ ఊరుకు మంచి పేరుంది. పౌలు యువకుడిగా ఉన్నప్పుడే ఆ పనిని నేర్చుకుని ఉంటాడు. ఆ పని అంత తేలికేం కాదు. డేరాల కోసం ఉపయోగించే గుడ్డ చాలా మందంగా ఉంటుంది. దాన్ని నేయడం, కత్తిరించడం, కుట్టడం కష్టమైన పని.

6, 7. (ఎ) పౌలు డేరాలు తయారు చేసే పనిలోనే మునిగిపోయాడా? పని విషయంలో అకుల, ప్రిస్కిల్ల కూడా ఆయన లాంటి స్ఫూర్తినే చూపించారని ఎలా చెప్పవచ్చు? (బి) ఆ ముగ్గురి ఆదర్శాన్ని నేడు క్రైస్తవులు ఎలా పాటిస్తున్నారు?

6 పౌలు డేరాలు తయారు చేసే పనిలోనే మునిగిపోలేదు. మంచివార్తను “ఉచితంగా” ప్రకటిస్తూ, తనను తాను పోషించుకోవడానికి మాత్రమే ఈ పని చేశాడు. (2 కొరిం. 11:7) మరి అకుల, ప్రిస్కిల్ల సంగతేంటి? క్రైస్తవులుగా వాళ్లు కూడా అలాంటి స్ఫూర్తినే చూపించారు. నిజానికి క్రీస్తు శకం 52 లో, పౌలు కొరింథును విడిచి వెళ్లేటప్పుడు అకుల, ప్రిస్కిల్ల కూడా అన్నీ విడిచిపెట్టి ఆయనతో పాటు ఎఫెసుకు వెళ్లారు. ఎఫెసులో అకుల, ప్రిస్కిల్ల ఇంట్లోనే సంఘం కలుసుకునేది. (1 కొరిం. 16:19) తర్వాత వాళ్లు మళ్లీ రోముకు వెళ్లి, ఎఫెసుకు తిరిగొచ్చేశారు. ఉత్సాహవంతమైన ఈ జంట రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చారు. వాళ్లు తమ అవసరాల కన్నా ఎదుటివాళ్ల అవసరాల్నే ఎక్కువగా పట్టించుకున్నారు. అందుకే “అన్యజనులు ఉన్న సంఘాల వాళ్లంతా” ఆ జంటకు కృతజ్ఞతలు చెప్పారు.—రోమా. 16:3-5; 2 తిమో. 4:19.

7 నేడు చాలామంది క్రైస్తవులు పౌలు, అకుల, ప్రిస్కిల్ల ఉంచిన మంచి ఆదర్శాన్ని పాటిస్తున్నారు. పరిచర్యను ఉత్సాహంగా చేసే సహోదర సహోదరీలు తాము “ఎవ్వరికీ భారంగా ఉండకూడదని” కష్టపడి పని చేస్తున్నారు. (1 థెస్స. 2:9) చాలామంది పయినీర్లు ప్రకటనా పనికి మొదటి స్థానం ఇస్తూ, తమ అవసరాలు తీర్చుకోవడానికి పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లోని పయినీర్లు సంవత్సరంలో కొన్ని నెలలు ఉద్యోగం చేస్తూ, మిగతా నెలల్లో పరిచర్యను ఎక్కువగా చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న కృషిని తప్పకుండా మెచ్చుకోవాలి. అకుల, ప్రిస్కిల్ల లాగే నేడు చాలామంది సహోదర సహోదరీలు ప్రాంతీయ పర్యవేక్షకుల్ని తమ ఇంట్లో ఉంచుకుంటున్నారు. అలా “ఆతిథ్యం ఇస్తూ ఉండడం” తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని, కొత్త బలాన్ని నింపుతుందని ఆ సహోదర సహోదరీలకు తెలుసు.—రోమా. 12:13.

‘కొరింథీయుల్లో చాలామంది విశ్వాసముంచడం మొదలుపెట్టారు’ (అపొ. 18:5-8)

8, 9. ఉత్సాహంగా చేస్తున్న ప్రకటనా పనిని యూదులు వ్యతిరేకించినప్పుడు పౌలు ఏం చేశాడు? ఆయన ఎక్కడ నుండి ప్రకటించడం మొదలుపెట్టాడు?

8 పౌలు డేరాలు తయారు చేసే పనిలో మునిగిపోలేదు అని చెప్పడానికి మరో కారణం కూడా ఉంది. కొంతకాలం తర్వాత సీల, తిమోతి మాసిదోనియ నుండి వచ్చేశారు. వాళ్లు వస్తూ-వస్తూ పౌలుకు అవసరమైన వాటిని సమృద్ధిగా తీసుకొచ్చారు. (2 కొరిం. 11:9) పౌలు ఇక వెంటనే, “తన సమయాన్నంతా వాక్యాన్ని ప్రకటించడంలోనే గడిపాడు.” (అపొ. 18:5) అయితే, పౌలు ఉత్సాహంగా చేస్తున్న ప్రకటనా పనికి యూదుల నుండి వ్యతిరేకత వచ్చింది. క్రీస్తు గురించిన రక్షణ సందేశాన్ని వాళ్లు అంగీకరించలేదు. దాంతో వాళ్ల నిర్ణయానికి వాళ్లే బాధ్యులని తెలియజేస్తూ పౌలు తన వస్త్రాల్ని దులిపేసుకొని ఆ వ్యతిరేకులతో ఇలా అన్నాడు: “మీకు ఏం జరిగినా ఆ బాధ్యత మీదే. మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని. ఇప్పటినుండి నేను అన్యజనుల దగ్గరికి వెళ్తాను.”—అపొ. 18:6; యెహె. 3:18, 19.

9 మరి పౌలు ఇప్పుడు ఎక్కడ ప్రకటిస్తాడు? సమాజమందిరం పక్కనే తీతియు యూస్తు అనే వ్యక్తి ఇల్లు ఉండేది. ఆయన బహుశా యూదునిగా మారిన అన్యజనుడై ఉంటాడు. ఆయన పౌలును తన ఇంటికి ఆహ్వానించాడు. కాబట్టి పౌలు, సమాజమందిరంలో కాకుండా యూస్తు ఇంట్లో నుండి ప్రకటించడం మొదలుపెట్టాడు. (అపొ. 18:7) పౌలు కొరింథులో ఉన్నంతకాలం అకుల, ప్రిస్కిల్ల వాళ్ల ఇంట్లోనే ఉండేవాడు, అయితే ప్రకటనా పనిని యూస్తు ఇంట్లో నుండి చేసేవాడు.

10. ఇక అన్యజనులకు మాత్రమే ప్రకటిస్తానని పౌలు అనుకోలేదని ఎలా చెప్పవచ్చు?

10 “ఇప్పటినుండి నేను అన్యజనుల దగ్గరకు వెళ్తాను” అని పౌలు అన్నాడు. అయితే వినడానికి ఇష్టం చూపించే యూదులు, యూదులుగా మారిన అన్యజనుల సంగతేంటి? వాళ్లకు కూడా బోధించడం ఆపేస్తాడా? లేదు, పౌలు అలా చేయలేదని చెప్పవచ్చు. ఎందుకంటే, “సమాజమందిరం అధికారి క్రిస్పు, అతని ఇంటివాళ్లందరూ ప్రభువు మీద విశ్వాసముంచారు.” అంతేకాదు సమాజమందిరంలోని ఇంకొంతమంది యూదులు కూడా క్రైస్తవులుగా మారి ఉంటారు. బైబిలు ఇలా చెప్తుంది: “మంచివార్త విన్న కొరింథీయుల్లో చాలామంది విశ్వాసముంచి, బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు.” (అపొ. 18:8) కొరింథులో కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘం తీతియు యూస్తు ఇంట్లో కలుసుకునేది. సాధారణంగా లూకా, విషయాల్ని అవి జరిగిన క్రమంలోనే రాసేవాడు. ఒకవేళ ఈ విషయాన్ని కూడా ఆయన అలానే రాసివుంటే యూదులు, యూదులుగా మారిన అన్యజనులు క్రైస్తవులుగా మారడం పౌలు తన వస్త్రాల్ని దులిపేసుకున్న తర్వాతే జరిగి ఉంటుంది. దీన్నిబట్టి పౌలు పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకోవడానికి ఇష్టపడ్డాడని, మంచివార్త వినాలని కోరుకునే వాళ్లందరికీ సంతోషంగా ప్రకటించాడని తెలుస్తుంది.

11. చర్చీలకు వెళ్లేవాళ్లకు ప్రకటిస్తున్నప్పుడు మనం పౌలు ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు?

11 నేడు చాలా ప్రాంతాల్లో తాము క్రీస్తును అనుసరిస్తున్నాం అని చెప్పుకునే చర్చీలు ఉన్నాయి. ఈ చర్చీలు, తమ దగ్గరికి వచ్చే ప్రజల్ని ఎన్నో ఏళ్లుగా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చీల మిషనరీలు తమ సభ్యుల్ని పెంచుకోవడానికి గట్టిగా కృషిచేశారు. క్రైస్తవులమని చెప్పుకునేవాళ్లు తరచూ దేవునితో స్నేహం కన్నా మత ఆచారాలకే ఎక్కువ విలువిస్తారు. మొదటి శతాబ్దం నాటి కొరింథులోని యూదుల పరిస్థితి కూడా అదే. కానీ లేఖనాల్ని అర్థం చేసుకునేలా పౌలు వాళ్లకు సహాయం చేశాడు. ఆయనలాగే నేడు మనం కూడా, ప్రజలకు ఇప్పటికే బైబిల్లో తెలిసిన కొన్ని విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకునేలా సహాయం చేస్తాం. వాళ్లు మనల్ని వ్యతిరేకించినా లేదా వాళ్ల మత బోధకులు మనల్ని హింసించినా మనం ఆ పనిని ఆపం. ఎందుకంటే మనం ప్రకటిస్తున్న వాళ్లల్లో చాలామందికి “దేవుని విషయంలో ఆసక్తి ఉంది,” కానీ “ఆ ఆసక్తి సరైన జ్ఞానానికి అనుగుణంగా లేదు.” కాబట్టి మనం అలాంటి వాళ్లను వెతికి, వాళ్లకు సహాయం చేయాలి.—రోమా. 10:2.

“ఈ నగరంలో నా మీద విశ్వాసం ఉంచబోయేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు” (అపొ. 18:9-17)

12. పౌలుకు ఏ దర్శనం వచ్చింది? అది ఆయన్ని ఎలా బలపర్చింది?

12 కొరింథులో ప్రకటనా పనిని కొనసాగించాలా లేదా అని పౌలు ఆలోచించి ఉంటాడు. కానీ ఒకరోజు రాత్రి యేసు దర్శనంలో కనిపించి మాట్లాడినప్పుడు పౌలు మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి ఉంటాయి. యేసు ఇలా చెప్పాడు: “భయపడకు. మాట్లాడుతూనే ఉండు, ఆపకు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు హాని జరిగేలా ఎవరూ నీ మీద దాడిచేయరు. ఈ నగరంలో నా మీద విశ్వాసం ఉంచబోయేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు.” (అపొ. 18:9, 10) ఆ మాటలు పౌలును ఎంత బలపర్చి ఉంటాయో కదా! స్వయంగా యేసే పౌలుకు ఏ హానీ జరగకుండా కాపాడతానని మాటిచ్చాడు. అంతేకాదు, తన మీద విశ్వాసం ఉంచబోయేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని చెప్పాడు. ఆ దర్శనం వచ్చిన తర్వాత పౌలు ఏం చేశాడు? బైబిలు ఇలా చెప్తుంది: “పౌలు ఒకటిన్నర సంవత్సరాల పాటు అక్కడే ఉండి, వాళ్ల మధ్య దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు.”—అపొ. 18:11.

13. న్యాయపీఠం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు పౌలుకు ఏం గుర్తొచ్చి ఉంటుంది? కానీ ఆయన ఏ నమ్మకంతో ఉండవచ్చు?

13 పౌలు కొరింథులో దాదాపు ఒక సంవత్సరం ఉన్న తర్వాత, యేసు ఇచ్చిన మాట మీద ఆయన నమ్మకం మరింత బలపడే సంఘటన ఒకటి జరిగింది. ‘యూదులు పౌలు మీద మూకుమ్మడిగా దాడిచేసి, న్యాయపీఠం ముందుకు తీసుకెళ్లారు.’ (అపొ. 18:12) ఆ న్యాయపీఠాన్ని బిమా అని పిలుస్తారు. ఈ న్యాయపీఠం బహుశా కొరింథులోని మార్కెట్‌ స్థలం మధ్యలో ఉండేది. ఇది తెలుపు, నీలం రంగు ఉన్న పాలరాతితో కట్టిన స్టేజీ అని, దానిమీద అందమైన ఆకారాలు చెక్కి ఉండేవి అని కొంతమంది అంటారు. ఈ న్యాయపీఠం ముందు చాలామంది కలుసుకోవడానికి సరిపడా పెద్ద స్థలం ఉండేది. సమాజమందిరానికి, దాని పక్కనే ఉన్న యూస్తు ఇంటికి ఇది బహుశా కొన్ని అడుగుల దూరంలోనే ఉండి ఉంటుందని కొంతమంది చరిత్రకారులు నమ్ముతారు. పౌలును న్యాయపీఠం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, బహుశా ఆయనకు స్తెఫనును రాళ్లతో కొట్టి చంపడం గుర్తొచ్చి ఉంటుంది. ఈ స్తెఫనును మొదటి క్రైస్తవ హతసాక్షి అని అంటారు. ఒకప్పుడు సౌలుగా పిలవబడిన పౌలు ‘స్తెఫను హత్యను ఆమోదించాడు.’ (అపొ. 8:1) ఇప్పుడు పౌలుకు కూడా స్తెఫనుకు జరిగినట్టే జరుగుతుందా? లేదు. ఎందుకంటే యేసు ఇలా మాటిచ్చాడు: “నీకు హాని జరిగేలా ఎవరూ నీ మీద దాడిచేయరు.”—అపొ. 18:10.

“ఆ మాటలు అన్నాక, అతను వాళ్లను న్యాయపీఠం ముందు నుండి వెళ్లగొట్టాడు.”—అపొస్తలుల కార్యాలు 18:16

14, 15. (ఎ) యూదులు పౌలు మీద ఏ నేరం మోపారు, గల్లియోను ఆ కేసును ఎందుకు కొట్టిపారేశాడు? (బి) సొస్తెనేసుకు ఏం జరిగింది? దానివల్ల బహుశా ఆయన తర్వాత ఎలా మారుంటాడు?

14 పౌలును న్యాయపీఠం ముందు నిలబెట్టినప్పుడు ఏం జరిగింది? అక్కడ జడ్జి గల్లియోను. ఆయన అకయ ప్రాంతానికి స్థానిక అధిపతి, అలాగే రోమా తత్వవేత్త అయిన సెనెకాకు అన్నయ్య. యూదులు పౌలు మీద ఈ నేరం మోపారు: “ఇతను చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించమని ప్రజలకు నేర్పిస్తున్నాడు.” (అపొ. 18:13) ఇంకోమాటలో చెప్పాలంటే, క్రైస్తవులుగా మారమని కొంతమంది యూదుల్ని బలవంతపెడుతూ పౌలు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని యూదులు ఆరోపించారు. అయితే పౌలు ఏ ‘తప్పూ’ చేయలేదని, ఏ ‘ఘోరమైన నేరమూ’ చేయలేదని గల్లియోను గమనించాడు. (అపొ. 18:14) యూదుల గొడవల్లో తలదూర్చకూడదని గల్లియోను అనుకున్నాడు. అందుకే పౌలు తన వాదనను వినిపించుకునే అవకాశం ఇవ్వకుండానే, ఈ కేసును కొట్టిపారేశాడు! దాంతో యూదుల కోపం కట్టలు తెంచుకుంది. వాళ్లు క్రిస్పు స్థానంలో సమాజమందిర అధికారి అయిన సొస్తెనేసు మీద ఆ కోపాన్ని చూపించారు. అతన్ని పట్టుకొని, “న్యాయపీఠం ముందు అతన్ని కొట్టడం మొదలుపెట్టారు.”—అపొ. 18:17.

15 సొస్తెనేసును కొడుతుంటే గల్లియోను ఎందుకు ఆపలేదు? ఆ అల్లరిమూకను పౌలు మీదికి రెచ్చగొట్టింది సొస్తెనేసే అయ్యుంటాడని, కాబట్టి ఆయనకు తగిన శాస్తే జరుగుతుందని బహుశా గల్లియోను అనుకుని ఉంటాడు. ఆ అల్లరిమూక వెనక సొస్తెనేసు ఉన్నా, లేకపోయినా అది మంచికే దారితీసి ఉంటుందని చెప్పవచ్చు. కొన్నేళ్ల తర్వాత, కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరంలో సొస్తెనేసు అనే సహోదరుడి గురించి పౌలు రాశాడు. (1 కొరిం. 1:1, 2) ఈ సొస్తెనేసు, కొరింథులో దెబ్బలు తిన్న సొస్తెనేసు ఒకడే అయ్యుంటాడా? ఒకవేళ అయ్యుంటే మాత్రం, ఆ రోజు జరిగిన సంఘటన వల్ల సొస్తెనేసు క్రైస్తవుడిగా మారి ఉండవచ్చు.

16. “మాట్లాడుతూనే ఉండు, ఆపకు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను” అని యేసు అన్న మాటలు మనకు ఏ ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి?

16 ఒక విషయం గుర్తుంచుకోండి. పౌలు ప్రకటిస్తున్న సందేశాన్ని యూదులు వ్యతిరేకించిన తర్వాతే, యేసు పౌలుతో ఇలా అన్నాడు: “భయపడకు. మాట్లాడుతూనే ఉండు, ఆపకు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను.” (అపొ. 18:9, 10) మనం ప్రకటిస్తున్న సందేశాన్ని ఎవరూ వినకపోతే, మనం కూడా ఆ మాటల్ని మనసులో ఉంచుకోవడం మంచిది. యెహోవా హృదయాల్ని చదవగలడని, సరైన హృదయస్థితి ఉన్నవాళ్లను తన దగ్గరికి ఆకర్షించుకుంటాడని ఎప్పుడూ మర్చిపోవద్దు. (1 సమూ. 16:7; యోహా. 6:44) మానకుండా ప్రకటిస్తూ ఉండడానికి ఈ మాటలు మనకు ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయో కదా! ప్రతీ సంవత్సరం లక్షలమంది, అంటే రోజుకు కొన్ని వందలమంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. “అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి” అనే ఆజ్ఞను పాటిస్తున్న వాళ్లందరికీ యేసు ఈ మాటిస్తున్నాడు: “ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.”—మత్త. 28:19, 20.

“యెహోవాకు ఇష్టమైతే” (అపొ. 18:18-22)

17, 18. పౌలు ఎఫెసుకు ప్రయాణిస్తున్నప్పుడు బహుశా వేటి గురించి ఆలోచించి ఉంటాడు?

17 గల్లియోను తీసుకున్న నిర్ణయం వల్ల, కొరింథులో కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘం ఏ వ్యతిరేకతా లేకుండా ప్రశాంతంగా ఉందా? ఏమో మనకు తెలీదు. అయితే “పౌలు ఇంకా చాలా రోజులు అక్కడున్నాక,” కొరింథు సహోదరులకు వీడ్కోలు చెప్పాడు. ఆయన క్రీస్తు శకం 52 మొదట్లో, కొరింథుకు తూర్పున 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంక్రేయ ఓడరేవుకు వెళ్లి, అక్కడి నుండి సిరియాకు వెళ్లాలనుకున్నాడు. కెంక్రేయలో “పౌలు తన మొక్కుబడి తీర్చుకోవడానికి తలవెంట్రుకలు కత్తిరించుకున్నాడు.” c (అపొ. 18:18) తర్వాత అకుల, ప్రిస్కిల్లతో కలిసి ఏజియన్‌ సముద్రం మీదుగా ఆసియా మైనరులో ఉన్న ఎఫెసుకు బయల్దేరాడు.

18 పౌలు కెంక్రేయ నుండి ఓడలో వెళ్తూ, కొరింథులో జరిగిన విషయాల గురించి ఆలోచించి ఉంటాడు. అక్కడ ఆయన ఎన్నో తీపి జ్ఞాపకాల్ని, ఎంతో సంతృప్తిని పొందాడు. ఆయన 18 నెలల కష్టానికి మంచి ఫలితాలు వచ్చాయి. అక్కడ ఒక సంఘం ఏర్పడింది, ఆ సంఘం యూస్తు ఇంట్లో కలుసుకునేది. విశ్వాసులైన వాళ్లలో యూస్తు, క్రిస్పు, అతని ఇంటివాళ్లు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లు క్రైస్తవులయ్యేలా పౌలే సహాయం చేశాడు, కాబట్టి ఆయన వాళ్లను ఎంతో ప్రేమించాడు. ఆ తర్వాతి కాలంలో పౌలు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ, వాళ్లను తన హృదయం మీద చెక్కబడిన సిఫారసు ఉత్తరం అని అన్నాడు. మనం కూడా యెహోవా గురించి నేర్చుకునేలా ఎవరికైతే సహాయం చేశామో వాళ్లను ఎక్కువగా ప్రేమిస్తాం. మన ‘సిఫారసు ఉత్తరం’ లాంటి ఆ సహోదర సహోదరీల్ని చూసినప్పుడు మన హృదయం సంతోషంతో ఉప్పొంగుతుంది!—2 కొరిం. 3:1-3.

19, 20. ఎఫెసుకు వచ్చీ రాగానే పౌలు ఏం చేశాడు? ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకునే విషయంలో మనం ఆయన నుండి ఏం నేర్చుకోవచ్చు?

19 ఎఫెసుకు వచ్చీ రాగానే పౌలు తన పనిని మొదలుపెట్టేశాడు. ఆయన “సమాజమందిరంలోకి వెళ్లి లేఖనాలు అర్థంచేసుకునేలా యూదులకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.” (అపొ. 18:19) అయితే ఈసారి పౌలు ఎఫెసులో కొన్ని రోజులే ఉన్నాడు. వాళ్లు పౌలును ఇంకొన్ని రోజులు అక్కడే ఉండమని బ్రతిమాలినా, ఆయన “ఒప్పుకోలేదు.” ఎఫెసులోని వాళ్లకు వీడ్కోలు చెప్తూ పౌలు ఇలా అన్నాడు: “యెహోవాకు ఇష్టమైతే మళ్లీ మీ దగ్గరికి వస్తాను.” (అపొ. 18:20, 21) ఎఫెసులో ఇంకా చాలామందికి ప్రకటించాలని పౌలుకు తెలుసు. ఆయన మళ్లీ రావాలనుకున్నాడు, కానీ ఆ విషయాన్ని యెహోవాకే వదిలేశాడు. ఈ విషయంలో కూడా పౌలు మనకు మంచి ఆదర్శం. ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకోవడానికి మనం కృషి చేయాలి. అదే సమయంలో మనం ఎప్పుడూ యెహోవా నిర్దేశం మీద ఆధారపడుతూ, ఆయన ఇష్టానికి తగ్గట్టు మనల్ని మనం మలచుకోవాలి.—యాకో. 4:15.

20 అకుల, ప్రిస్కిల్ల ఎఫెసులో ఉండిపోయారు. పౌలు మాత్రం ఓడ ఎక్కి కైసరయకు వచ్చాడు. తర్వాత ఆయన వెళ్లి సంఘాన్ని పలకరించాడు. బహుశా అది యెరూషలేము సంఘం అయ్యుండవచ్చు. (అపొ. 18:22) ఆ తర్వాత ఆయన తన మిషనరీ యాత్రను ఎక్కడి నుండైతే మొదలుపెట్టాడో ఆ ప్రాంతానికి, అంటే సిరియాలోని అంతియొకయకు వచ్చాడు. దాంతో ఆయన రెండవ మిషనరీ యాత్ర విజయవంతంగా పూర్తయింది. మరి ఆయన చివరి మిషనరీ యాత్ర ఎలా ఉండబోతుంది?