అధ్యాయం 16
“మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి”
పవిత్రశక్తి నిర్దేశానికి లోబడడం వల్ల, హింసను సంతోషంగా సహించడం వల్ల వచ్చిన దీవెనలు
అపొస్తలుల కార్యాలు 16:6-40 ఆధారంగా
1-3. (ఎ) పౌలును, ఆయనతో ఉన్నవాళ్లను పవిత్రశక్తి ఎలా నడిపించింది? (బి) ఇప్పుడు మనం ఏం పరిశీలిస్తాం?
కొంతమంది స్త్రీలు మాసిదోనియలోని ఫిలిప్పీ నగరం నుండి బయల్దేరారు. వాళ్లు కాసేపటికే దగ్గర్లో ఉన్న గాంజిటిస్ అనే చిన్న నది దగ్గరికి చేరుకున్నారు. వాళ్లు తమ అలవాటు ప్రకారం ఆ నది ఒడ్డున కూర్చొని ఇశ్రాయేలు దేవునికి ప్రార్థిస్తున్నారు. యెహోవా వాళ్లను గమనిస్తున్నాడు.—2 దిన. 16:9; కీర్త. 65:2.
2 ఇంకోవైపు, ఫిలిప్పీకి తూర్పున 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న గలతీయ ప్రాంతంలోని లుస్త్ర నగరం నుండి పౌలు, సీల, తిమోతి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత వాళ్లు పడమర వైపు వెళ్లే ఒక ప్రధాన రహదారి దగ్గరికి చేరుకున్నారు. రోమన్లు వేసిన ఆ రహదారి ఆసియా ప్రాంతంలోనే ఎక్కువ జనాభా ఉండే చోటుకు తీసుకెళ్తుంది. ఆ దారిలో అడుగుపెట్టి ఎఫెసు, దాని చుట్టుపక్కల నగరాల్లోని వేలమందికి క్రీస్తు గురించిన మంచివార్తను ప్రకటించాలని వాళ్లు అనుకున్నారు. అయితే వాళ్లు ఆ దారిలో అడుగు పెట్టకముందే పవిత్రశక్తి వాళ్లను అడ్డుకుంది. పవిత్రశక్తి వాళ్లను ఎలా అడ్డుకుందో బైబిలు చెప్పట్లేదు. ఆ సమయంలో, పవిత్రశక్తి వాళ్లను ఆసియాలో ప్రకటించనివ్వలేదు. ఎందుకు? ఎందుకంటే పవిత్రశక్తి ద్వారా యేసు పౌలును, ఆయనతో ఉన్నవాళ్లను ఆసియా మైనరు, ఏజియన్ సముద్రం మీదుగా గాంజిటిస్ అనే చిన్న నది దగ్గరికి నడిపించాలనుకున్నాడు.
3 పౌలును, ఆయనతో ఉన్నవాళ్లను యేసు మాసిదోనియకు నడిపించడం నుండి మనం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. దాదాపు క్రీస్తు శకం 49 లో మొదలైన పౌలు రెండవ మిషనరీ యాత్రలోని కొన్ని సంఘటనల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
“దేవుడే మమ్మల్ని పిలిపించాడు” (అపొ. 16:6-15)
4, 5. (ఎ) పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు బితూనియ దరిదాపుల్లోకి వచ్చినప్పుడు ఏం జరిగింది? (బి) వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నారు, దాని ఫలితం ఏంటి?
4 ఆసియాలోకి వెళ్లకుండా పవిత్రశక్తి అడ్డుకోవడంతో పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు ఉత్తరం వైపు తిరిగారు. వాళ్లు బితూనియ నగరాల్లో ప్రకటించాలనుకున్నారు. అక్కడికి వెళ్లడానికి దారులు సరిగ్గా ఉండవు. పైగా జనాభా తక్కువగా ఉండే ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా వెళ్లాలి. అయినా, వాళ్లు ఆ దారిలో కొన్ని రోజులపాటు నడుచుకుంటూ వెళ్లి ఉంటారు. వాళ్లు బితూనియ దరిదాపుల్లోకి వచ్చినప్పుడు పవిత్రశక్తి ద్వారా యేసు వాళ్లను మళ్లీ అడ్డుకున్నాడు. (అపొ. 16:6, 7) ఏం చేయాలో అర్థంకాక వాళ్లు అయోమయంలో పడివుంటారు. ఏం ప్రకటించాలో, ఎలా ప్రకటించాలో వాళ్లకు తెలుసు, కానీ ఎక్కడ ప్రకటించాలో మాత్రం తెలియడం లేదు. ఒకవిధంగా వాళ్లు ఆసియా వైపు వెళ్లే తలుపు తట్టారు, కానీ అది తెరుచుకోలేదు. తర్వాత బితూనియ వైపు వెళ్లే తలుపు తట్టారు, అది కూడా తెరుచుకోలేదు. అయినా, ఏదో ఒక తలుపు తెరుచుకునే వరకు తడుతూనే ఉండాలని పౌలు నిర్ణయించుకున్నాడు. అప్పుడు వాళ్లు అర్థం-పర్థం లేనట్టుగా అనిపించే ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లు పడమర వైపు తిరిగి, ఒక్కో నగరం దాటుకుంటూ 550 కిలోమీటర్లు ప్రయాణించి, త్రోయ ఓడరేవుకు చేరుకున్నారు. అక్కడి నుండి వాళ్లు పడవలో మాసిదోనియకు వెళ్లవచ్చు. (అపొ. 16:8) అక్కడ పౌలు మూడోసారి తలుపు తట్టాడు. అయితే, ఈసారి ఆ తలుపు వెంటనే తెరుచుకుంది!
5 త్రోయ దగ్గర నుండి, సువార్త రచయిత అయిన లూకా కూడా వాళ్లతో కలిసి ప్రయాణించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం జరిగిందో చెప్తూ లూకా ఇలా రాశాడు: “అయితే రాత్రిపూట పౌలుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో, మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి పౌలు ముందు నిలబడి, ‘మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి’ అని వేడుకుంటున్నాడు. పౌలుకు ఆ దర్శనం రాగానే, మాసిదోనియ వాళ్లకు మంచివార్త ప్రకటించడానికి దేవుడే మమ్మల్ని పిలిపించాడని గుర్తించి మేము అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించాం.” a (అపొ. 16:9, 10) మొత్తానికి, ఎక్కడ ప్రకటించాలో పౌలుకు తెలిసిపోయింది. తన ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయకుండా కొనసాగించినందుకు, పౌలుకు ఎంతో సంతోషంగా అనిపించి ఉంటుంది! ఆ నలుగురు వెంటనే పడవ ఎక్కి మాసిదోనియకు వెళ్లారు.
6, 7. (ఎ) పౌలు ప్రయాణంలో జరిగినదాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (బి) పౌలులా మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
6 దీన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకసారి ఆలోచించండి: పౌలు ఆసియాకు బయలుదేరిన తర్వాతే పవిత్రశక్తి అడ్డుకుంది, పౌలు బితూనియ దరిదాపుల్లోకి వచ్చిన తర్వాతే యేసు అడ్డుకున్నాడు, పౌలు త్రోయకు చేరుకున్న తర్వాతే యేసు మాసిదోనియకు నడిపించాడు. సంఘానికి శిరస్సు అయిన యేసు, నేడు మనల్ని కూడా అలాగే నడిపించవచ్చు. (కొలొ. 1:18) ఉదాహరణకు, పయినీరు సేవ మొదలుపెట్టాలని లేదా ప్రచారకుల అవసరం ఎక్కువున్న చోటుకు వెళ్లాలని మీరు కొంతకాలంగా అనుకుంటుండవచ్చు. అయితే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాతే యేసు మనల్ని పవిత్రశక్తి ద్వారా నడిపిస్తాడు. ఎందుకు? ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి: ఒక డ్రైవర్ కారును స్టార్ట్ చేసి ప్రయాణించడం మొదలుపెట్టిన తర్వాతే దాన్ని ఎడమ వైపుకో, కుడి వైపుకో తిప్పగలుగుతాడు. అదేవిధంగా, పరిచర్య ఎక్కువ చేసేలా యేసు మనల్ని నడిపించాలంటే, ముందు మనం ఆ దారిలో ప్రయాణం మొదలుపెట్టాలి.
7 మనం ఎంత ప్రయత్నించినా మన లక్ష్యాన్ని వెంటనే చేరుకోలేకపోతే, అప్పుడేంటి? పవిత్రశక్తి మనల్ని నడిపించట్లేదని, ప్రయత్నించడం ఆపేయాలా? లేదు. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పౌలుకు కూడా సమయం పట్టింది అని గుర్తుంచుకోండి. ఏదో ఒక తలుపు తెరుచుకునే వరకు ఆయన తడుతూనే ఉన్నాడు. ‘సేవచేసే గొప్ప అవకాశం’ అనే తలుపు తెరవబడే వరకు మనం కృషి చేస్తూనే ఉంటే, దేవుడు మన ప్రయత్నాల్ని దీవిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—1 కొరిం. 16:9.
8. (ఎ) ఫిలిప్పీ నగరం ఎలా ఉండేది? (బి) పౌలు “ప్రార్థనా స్థలం” దగ్గర ప్రకటించినప్పుడు ఏం జరిగింది?
8 మాసిదోనియ ప్రాంతానికి చేరుకున్న తర్వాత పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు ఫిలిప్పీ నగరానికి వెళ్లారు. ఆ నగర ప్రజలు తాము రోమా పౌరులమని గర్వంగా చెప్పుకునే వాళ్లు. ఫిలిప్పీ నగరం చిన్నపాటి రోములా ఉండేది. రోమా సైన్యంలో పనిచేసి, రిటైర్ అయినవాళ్లు అక్కడ ఉండేవాళ్లు. నగర ద్వారం బయట, నది ఒడ్డున “ప్రార్థనా స్థలం” ఉంటుంది అనుకొని పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు అక్కడికి వెళ్లారు. b వాళ్లు విశ్రాంతి రోజున అక్కడికి వెళ్లినప్పుడు, కొంతమంది స్త్రీలు దేవున్ని ఆరాధించడం చూశారు. వాళ్లు ఆ స్త్రీలతో మాట్లాడడం మొదలుపెట్టారు. లూదియ అనే స్త్రీ ‘వాళ్లు చెప్పేది వింటూ ఉంది. యెహోవా ఆమె హృదయాన్ని తెరిచాడు.’ ఆ మిషనరీలు చెప్పిన విషయాలు లూదియకు ఎంత నచ్చాయంటే ఆమె, ఆమె ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు. తర్వాత ఆమె పౌలును, ఆయనతో పాటు ఉన్నవాళ్లను తన ఇంట్లో ఉండడానికి ఆహ్వానించింది. c—అపొ. 16:13-15.
9. పౌలు ఆదర్శాన్ని నేడు చాలామంది ఎలా పాటిస్తున్నారు, దానివల్ల ఎలాంటి దీవెనలు పొందారు?
9 లూదియ బాప్తిస్మం తీసుకున్నప్పుడు వాళ్లు ఎంత సంతోషించి ఉంటారో ఒక్కసారి ఊహించండి! మాసిదోనియకు రమ్మనే ఆహ్వానాన్ని అందుకుని అక్కడికి వెళ్లడం మంచిదైంది అని పౌలు అనుకుని ఉంటాడు. పౌలును, ఆయనతో ఉన్నవాళ్లను ఉపయోగించుకుని, దైవభక్తిగల స్త్రీలు చేసిన ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చాడు! నేడు కూడా యౌవనులు, పెద్దవాళ్లు, పెళ్లి కానివాళ్లు, పెళ్లి అయినవాళ్లు ఇలా ఎంతోమంది, అవసరం ఎక్కువున్న చోటుకు వెళ్లి సేవచేస్తున్నారు. నిజమే అలా వెళ్లి సేవ చేసేటప్పుడు, వాళ్లకు కొన్ని కష్టాలు ఎదురౌతాయి. కానీ బైబిలు సత్యాల్ని తెలుసుకుని, వాటిని పాటించే లూదియ లాంటి వాళ్లను చూసినప్పుడు వాళ్లు పడిన కష్టమంతా మర్చిపోతారు. వాళ్లలాగే మీరు కూడా సర్దుబాట్లు చేసుకుని, అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవ చేయగలరా? అలా చేస్తే, మీరు ఎన్నో దీవెనలు పొందుతారు. ఉదాహరణకు, సెంట్రల్ అమెరికాలోని ఒక దేశంలో సేవ చేయడానికి దాదాపు 20 ఏళ్లున్న ఆరెన్ వెళ్లాడు. అలా వెళ్లిన ఎంతోమందిలాగే అతను కూడా ఇలా చెప్తున్నాడు: “వేరే దేశానికి వెళ్లి సేవ చేయడం వల్ల యెహోవాకు నేను బాగా దగ్గరయ్యాను. ఇక్కడి ప్రజలు కూడా చక్కగా వింటారు. నేను ఇప్పుడు ఎనిమిది బైబిలు స్టడీలు చేస్తున్నాను!”
“ప్రజలంతా కలిసి వాళ్ల మీదికి లేచారు” (అపొ. 16:16-24)
10. పౌలును, ఆయనతో ఉన్నవాళ్లను ప్రజలు వ్యతిరేకించేలా చెడ్డదూతలు ఏం చేశారు?
10 అప్పటిదాకా సాతానుకు, అతని చెడ్డదూతలకు అక్కడ ఎదురేలేదు. కానీ ఇప్పుడు ప్రజలు మంచివార్తను వినడం, బాప్తిస్మం తీసుకోవడం చూసి వాళ్లు అస్సలు తట్టుకోలేకపోయారు. అందుకే, ప్రజలు ఆ పనిని వ్యతిరేకించేలా చేయాలని చెడ్డదూతలు అనుకున్నారు. ఆ నగరంలో చెడ్డదూత పట్టిన ఒక పనమ్మాయి, భవిష్యత్తు చెప్తూ తన యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెట్టేది. పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు, ఆ పనమ్మాయి వాళ్ల వెనకాలే వెళ్తూ ఇలా అరుస్తూ ఉంది: “వీళ్లు సర్వోన్నత దేవుని దాసులు. వీళ్లు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు.” పౌలు బోధలకు, ఆ అమ్మాయి మాటలకు రెండిటికీ మూలం దేవుడే అని అనుకునేలా ప్రజల్ని మోసం చేయడానికి చెడ్డదూత ఆమెతో అలా చెప్పించి ఉంటాడు. అలా ఆ చెడ్డదూత, ప్రజల దృష్టిని క్రీస్తు నిజ అనుచరుల నుండి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ పౌలు ఆ చెడ్డదూతను వెళ్లగొట్టి, ఆ అమ్మాయి నోరు మూయించాడు.—అపొ. 16:16-18.
11. పనమ్మాయి నుండి చెడ్డదూతను వెళ్లగొట్టిన తర్వాత పౌలుకు, సీలకు ఏమైంది?
11 ఆ అమ్మాయి తెచ్చే సంపాదన పోయిందని ఆమె యజమానులకు అర్థమైనప్పుడు వాళ్లు కోపంతో ఊగిపోయారు. వాళ్లు పౌలును, సీలను సంతలోకి ఈడ్చుకొచ్చి విచారణ కోసం పాలకుల ముందు నిలబెట్టారు. రోమీయులమని గర్వపడే ఆ పాలకులు యూదుల్ని చిన్న చూపు చూస్తారని ఆ యజమానులకు తెలుసు. కాబట్టి వాళ్లు ఆ పాలకులతో ఒకవిధంగా ఇలా అన్నారు: ‘ఈ యూదులు రోమీయులమైన మనం అంగీకరించలేని ఆచారాల్ని బోధిస్తూ నగరంలో అలజడి రేపుతున్నారు.’ ఆ మాటలు ప్రజల్ని కూడా రెచ్చగొట్టాయి. “ప్రజలంతా [సంతలో ఉన్న వాళ్లంతా] కలిసి వాళ్ల మీదికి [పౌలు, సీల మీదికి] లేచారు.” అప్పుడు, “వాళ్లను కర్రలతో కొట్టమని నగర పాలకులు ఆజ్ఞాపించారు.” ఆ తర్వాత పౌలును, సీలను చెరసాలలో వేశారు. చెరసాల అధికారి వాళ్లను చెరసాల లోపలి గదిలో వేసి, వాళ్ల కాళ్లను బొండలో బిగించాడు. (అపొ. 16:19-24) జైలు అధికారి తలుపు మూసేయగానే, ఆ గది అంతా చీకటితో నిండిపోయింది. పౌలు, సీల కనీసం ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. కానీ యెహోవా అన్నీ చూస్తున్నాడు.—కీర్త. 139:12.
12. (ఎ) హింస గురించి క్రీస్తు అనుచరులు ఏం అర్థం చేసుకున్నారు, ఎందుకు? (బి) నేడు కూడా సాతాను, అతని చెప్పు చేతల్లో ఉన్నవాళ్లు మనల్ని ఎలా వ్యతిరేకిస్తున్నారు?
12 యేసు కొన్నేళ్ల క్రితమే, ప్రజలు తన అనుచరుల్ని “హింసిస్తారు” అని చెప్పాడు. (యోహా. 15:20) కాబట్టి పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు మాసిదోనియలో అడుగుపెట్టినప్పుడే, వ్యతిరేకత రావచ్చని ఊహించి ఉంటారు. అందుకే హింస ఎదురైనప్పుడు, యెహోవా తమను చూసి సంతోషించట్లేదని వాళ్లు అనుకోలేదు; బదులుగా అది సాతాను కోపంతో చేస్తున్న పని అని అర్థం చేసుకున్నారు. ఫిలిప్పీలోని ప్రజల్లాగే, నేడు కూడా సాతాను చెప్పు చేతల్లో ఉన్నవాళ్లు మనల్ని వ్యతిరేకిస్తున్నారు. స్కూల్లో, పని స్థలాల్లో వ్యతిరేకులు మన మీద మోసపూరితంగా తప్పుడు నిందల్ని మోపుతూ, ప్రజల్ని ఉసిగొల్పుతున్నారు. కొన్ని దేశాల్లో మతనాయకులు మనల్ని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో ఇలా చెప్తున్నారు: ‘తరతరాలుగా మనం నమ్ముతూ వస్తున్న వాటికి వ్యతిరేకంగా బోధిస్తూ, ఈ సాక్షులు సమస్యల్ని సృష్టిస్తున్నారు.’ ఇంకొన్ని దేశాల్లో మన తోటి ఆరాధకుల్ని కొడుతున్నారు, జైల్లో వేస్తున్నారు. యెహోవా అవన్నీ చూస్తున్నాడు.—1 పేతు. 3:12.
‘ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకున్నారు’ (అపొ. 16:25-34)
13. “రక్షణ పొందాలంటే నేనేం చేయాలి” అని జైలు అధికారి ఎందుకు అడిగాడు?
13 ఆ రోజు జరిగినవాటి నుండి తేరుకోవడానికి పౌలుకు, సీలకు కొంచెం సమయం పట్టింది. దాదాపు మధ్యరాత్రి సమయంలో, వాళ్లు నొప్పిని మర్చిపోయేంతగా “ప్రార్థిస్తూ, పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు.” అప్పుడు ఉన్నట్టుండి ఒక భూకంపం వచ్చి, చెరసాలను కుదిపేసింది! వెంటనే చెరసాల అధికారి లేచి, చెరసాల తలుపులన్నీ తెరుచుకుని ఉండడం చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని భయపడ్డాడు. ఖైదీలు పారిపోతే శిక్ష ఆ అధికారికి పడుతుంది. అందుకే అతను “తన కత్తి తీసి, తనను తాను చంపుకోబోయాడు.” అప్పుడు పౌలు “అలా చేయకు, మేమంతా ఇక్కడే ఉన్నాం!” అని బిగ్గరగా అరిచాడు. కంగారుపడుతున్న ఆ జైలు అధికారి ఇలా అన్నాడు: “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి?” పౌలు, సీల అతన్ని రక్షించలేరు, కానీ యేసు ఒక్కడే అతన్ని రక్షించగలడు. అందుకే వాళ్లు ఇలా అన్నారు: ‘ప్రభువైన యేసు మీద విశ్వాసముంచు. అప్పుడు నువ్వు, రక్షణ పొందుతావు.’—అపొ. 16:25-31.
14. (ఎ) పౌలు, సీల చెరసాల అధికారికి ఎలా సహాయం చేశారు? (బి) సంతోషంగా హింసను సహించడం వల్ల పౌలు, సీల ఎలాంటి దీవెనలు పొందారు?
14 చెరసాల అధికారి మనస్ఫూర్తిగానే ఆ మాట అన్నాడా? ఆ విషయంలో పౌలుకు ఏ సందేహం లేదు. ఆ అధికారి ఒక అన్యుడు. అతనికి లేఖనాల గురించి ఏమీ తెలీదు. కాబట్టి క్రైస్తవుడిగా అవ్వాలంటే, ముందు అతను కొన్ని ముఖ్యమైన లేఖన సత్యాల్ని తెలుసుకుని, వాటిని అంగీకరించాలి. అందుకే పౌలు, సీల సమయం తీసుకుని అతనికి “యెహోవా వాక్యాన్ని ప్రకటించారు.” లేఖనాల్ని బోధించడంలో వాళ్లు ఎంతగా మునిగిపోయారంటే, బహుశా వాళ్ల దెబ్బల్ని, నొప్పిని మర్చిపోయి ఉంటారు. కానీ, వాళ్ల వీపుల మీద తగిలిన దెబ్బల్ని, చర్మం చీలిపోవడాన్ని గమనించిన ఆ అధికారి వాళ్ల గాయాల్ని శుభ్రం చేశాడు. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా “అతను, అతని ఇంటివాళ్లందరూ బాప్తిస్మం తీసుకున్నారు.” సంతోషంగా హింసను సహించడం వల్ల పౌలు, సీల ఎంత గొప్ప దీవెనలు పొందారో కదా!—అపొ. 16:32-34.
15. (ఎ) నేడు ఎంతోమంది సాక్షులు పౌలు, సీల ఆదర్శాన్ని ఎలా పాటిస్తున్నారు? (బి) మన ప్రాంతంలో ఉన్నవాళ్లను మళ్లీమళ్లీ ఎందుకు కలుస్తూ ఉండాలి?
15 నేడు పౌలు, సీల లాగే ఎంతోమంది సాక్షులు తమ విశ్వాసం కారణంగా జైల్లో ఉన్నప్పటికీ, మంచివార్తను ప్రకటిస్తున్నారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉదాహరణకు మన పని నిషేధించబడిన ఒక దేశంలో, ఒకానొక సమయంలో సాక్షుల్లో 40 శాతం మంది సత్యం నేర్చుకున్నది జైల్లోనే! (యెష. 54:17) ఇంకో విషయాన్ని గమనించండి, భూకంపం వచ్చిన తర్వాతే ఆ చెరసాల అధికారి సహాయం కోసం అడిగాడు. అలాగే నేడు కూడా రాజ్య సందేశాన్ని ఇష్టపడని కొంతమంది, సమస్యలు తమ జీవితాన్ని కుదిపేసిన తర్వాతే మంచివార్త వినడానికి ఇష్టపడవచ్చు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నవాళ్లను మళ్లీమళ్లీ కలుస్తూ ఉండడం ద్వారా, వాళ్లకు సహాయం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని చూపిద్దాం.
“ఇప్పుడేమో రహస్యంగా బయటికి వెళ్లగొడతారా?” (అపొ. 16:35-40)
16. తర్వాతి రోజు ఉదయం, పరిస్థితి శిష్యులకు అనుగుణంగా ఎలా మారింది?
16 తర్వాతి రోజు ఉదయం నగర పాలకులు పౌలును, సీలను విడుదల చేయమని చెప్పారు. కానీ పౌలు వాళ్లతో ఇలా అన్నాడు: “రోమీయులమైన మమ్మల్ని వాళ్లు విచారణ చేయకుండానే అందరిముందు కొట్టి, చెరసాలలో వేశారు. ఇప్పుడేమో రహస్యంగా బయటికి వెళ్లగొడతారా? లేదు, వాళ్లే స్వయంగా వచ్చి మమ్మల్ని బయటికి తీసుకెళ్లాలి.” వాళ్లిద్దరూ రోమా పౌరులని తెలిసినప్పుడు నగర పాలకులు “భయపడ్డారు.” ఎందుకంటే, రోమా పౌరులుగా వాళ్లకున్న హక్కుల్ని ఈ పాలకులు గౌరవించలేదు. d ఇప్పుడు పరిస్థితి శిష్యులకు అనుగుణంగా మారింది. అందరిముందు కొట్టించిన ఆ నగర పాలకులు ఇప్పుడు అదే ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. వాళ్లు పౌలును, సీలను ఫిలిప్పీ నగరం వదిలి వెళ్లిపోమని బ్రతిమాలారు. వాళ్లిద్దరూ దానికి ఒప్పుకున్నారు, అయితే ముందుగా అక్కడ కొత్తగా శిష్యులైన వాళ్లను ప్రోత్సహించారు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయారు.
17. పౌలు, సీల హింసల్ని సహించడం చూసి కొత్తగా శిష్యులైన వాళ్లు ఏ ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుని ఉంటారు?
17 పౌలు, సీల తాము రోమా పౌరులమని ముందే చెప్పుంటే, వాళ్లకు ఆ దెబ్బలు తప్పేవి. (అపొ. 22:25, 26) అయితే తమ రోమా పౌరసత్వాన్ని ఉపయోగించుకుని, క్రీస్తు కోసం పడాల్సిన బాధల్ని వాళ్లు తప్పించుకున్నారని ఫిలిప్పీలోని క్రైస్తవులు అనుకునే అవకాశం ఉంది. మరి రోమా పౌరసత్వం లేని శిష్యుల సంగతేంటి? ఆ చట్టాన్ని ఉపయోగించుకుని దెబ్బలు తప్పించుకునే అవకాశం వాళ్లకు ఉండదు. పౌలు, సీల ఆ శిక్షను అనుభవించడం ద్వారా, హింస ఎదురైనా క్రీస్తు అనుచరులు వాటిని సహించగలరని చూపించారు. అలా, వాళ్లిద్దరూ కొత్తగా శిష్యులైన వాళ్లకు మంచి ఆదర్శం ఉంచారు. అంతేకాదు పౌలు, సీల రోమా పౌరులు అని తెలిసిన తర్వాత, తాము రోమా చట్టాన్ని మీరామని నగర పాలకులు అందరి ముందు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇకమీదట చట్టాన్ని గౌరవించే విషయంలో నగర పాలకులు మరింత జాగ్రత్తగా ఉండేలా, క్రైస్తవులపై అలాంటి దాడులు మళ్లీ జరగకుండా ఉండేలా ఆ సంఘటన సహాయం చేసి ఉంటుంది.
18. (ఎ) పౌలు ఆదర్శాన్ని నేడు క్రైస్తవ కాపరులు ఎలా పాటిస్తున్నారు? (బి) మంచివార్త తరఫున వాదించడానికి, చట్టబద్ధమైన హక్కును సంపాదించుకోవడానికి నేడు మనం ఏం చేస్తాం?
18 నేడు కూడా క్రైస్తవ సంఘంలో, పర్యవేక్షకులు తమ ఆదర్శం ద్వారా సంఘాన్ని నడిపిస్తారు. తోటి ఆరాధకులకు వేటినైతే పాటించమని చెప్తారో పెద్దలు వాటిని ఇష్టంగా పాటించి చూపిస్తారు. పౌలు లాగే మనం కూడా మన చట్టపరమైన హక్కుల్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అని జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఆరాధన విషయంలో మన హక్కుల్ని కాపాడుకోవడానికి అవసరమైతే స్థానిక కోర్టు, జాతీయ కోర్టు, చివరికి అంతర్జాతీయ కోర్టుకైనా వెళ్తాం. మన ఉద్దేశం చట్టాల్ని మార్చడం కాదుగానీ ‘మంచివార్త తరఫున వాదించడం, చట్టబద్ధమైన హక్కును సంపాదించుకోవడమే.’ ఆ సంఘటన జరిగిన పదేళ్ల తర్వాత, ఫిలిప్పీలోని క్రైస్తవులకు ఉత్తరం రాస్తూ పౌలు దాని గురించి చెప్పాడు. (ఫిలి. 1:7) కోర్టు ఏ తీర్పు ఇచ్చినా సరే మనం పౌలు, ఆయనతో ఉన్నవాళ్లలా పవిత్రశక్తి ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లి, ‘మంచివార్త ప్రకటించాలని’ నిర్ణయించుకున్నాం.—అపొ. 16:10.
a “ లూకా—అపొస్తలుల కార్యాలు రచయిత” అనే బాక్సు చూడండి.
b ఫిలిప్పీ నగరంలో ఎక్కువగా రిటైర్ అయిన రోమా సైనికులు ఉండేవాళ్లు. బహుశా అందుకే, సమాజమందిరం కోసం యూదులకు అక్కడ అనుమతి దొరికి ఉండదు. లేదా సమాజమందిరం ఉండాలంటే ఆ ప్రాంతంలో కనీసం 10 మంది యూదా పురుషులు ఉండాలి. ఫిలిప్పీ నగరంలో కనీసం అంతమంది కూడా ఉండి ఉండరు.
c “ ఊదా రంగు వస్త్రాలు అమ్ముకునే లూదియ” అనే బాక్సు చూడండి.
d రోమా చట్టం ప్రకారం, విచారణ చేసిన తర్వాతే ఒక పౌరునికి శిక్ష విధించాలి. సరైన విచారణ జరపకుండా, అపరాధి అని నిరూపించబడకుండా ఏ పౌరుడినీ బహిరంగంగా శిక్షించకూడదు.