అధ్యాయం 17
‘లేఖనాలు అర్థంచేసుకునేలా సహాయం చేయడానికి ప్రయత్నించాడు’
లేఖనాల్ని ఆధారం చేసుకుని చక్కగా బోధించడం; బెరయ వాళ్ల మంచి ఆదర్శం
అపొస్తలుల కార్యాలు 17:1-15 ఆధారంగా
1, 2. ఫిలిప్పీ నుండి థెస్సలొనీకకు ఎవరెవరు వెళ్తున్నారు? వాళ్లు దేని గురించి ఆలోచిస్తుండవచ్చు?
ఫిలిప్పీ నుండి పౌలు, సీల, తిమోతి ముగ్గురూ బయల్దేరి థెస్సలొనీకకు వెళ్తున్నారు. అది 130 కిలోమీటర్ల ప్రయాణం. వాళ్లు రోమన్లు వేసిన మంచి దారిలో, ఎన్నో కొండల్ని దాటుకుంటూ ప్రయాణిస్తున్నారు. ఆ దారిలో వాళ్లతో పాటు సైనికులు, వ్యాపారులు, రకరకాల పనులు చేసుకునే వాళ్లు కూడా వెళ్తున్నారు. ప్రయాణికుల మాటలతో, రథాల చప్పుళ్లతో, జంతువుల అరుపులతో ఆ దారి అంతా గోలగోలగా ఉంది. ఈ ప్రయాణం అంత తేలికేం కాదు. పౌలుకు, సీలకు అయితే అది మరీ కష్టమైన ప్రయాణం. ఎందుకంటే ఫిలిప్పీలో పౌలు, సీల చాలా దెబ్బలు తిన్నారు, వాళ్ల గాయాలు ఇంకా మానలేదు.—అపొ. 16:22, 23.
2 అంత దూరం నడుచుకుంటూ వెళ్లాలంటే కాస్త విసుగ్గానే ఉంటుంది, కానీ వాళ్లు ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వెళ్తున్నారు. బహుశా చెరసాల అధికారి, అతని కుటుంబం విశ్వాసులుగా మారడం గురించి వాళ్లు మాట్లాడుకుని ఉంటారు. ఆ అనుభవం వల్ల, మంచివార్తను ప్రకటిస్తూనే ఉండాలనే వాళ్ల కోరిక ఇంకా బలపడి ఉంటుంది. వాళ్లు అలా నడుచుకుంటూ సముద్ర తీరంలో ఉన్న థెస్సలొనీక దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నగరంలోని యూదులు ఏం చేస్తారా అని ఆలోచించి ఉంటారు. ఫిలిప్పీలోని యూదుల్లాగే ఈ నగరంలోని యూదులు కూడా వాళ్ల మీద దాడి చేస్తారా? కొడతారా?
3. ప్రకటించడానికి పౌలు ధైర్యం కూడగట్టుకోవడం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
3 ఆ తర్వాతి కాలంలో, పౌలు థెస్సలొనీకయులకు ఉత్తరం రాస్తూ అప్పుడు తనకు ఎలా అనిపించిందో చెప్పాడు. ఆయన ఇలా రాశాడు: “మేము ఫిలిప్పీలో ఉండగా మొదట్లో బాధలు అనుభవించాం, అవమానాలపాలయ్యాం. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయినాసరే, మన దేవుని సహాయంతో మేము ధైర్యం కూడగట్టుకుని, ఎంతో వ్యతిరేకత మధ్య మీకు దేవుని గురించిన మంచివార్తను ప్రకటించాం.” (1 థెస్స. 2:2) ఈ మాటల్ని బట్టి, ఫిలిప్పీలో జరిగింది చూశాక థెస్సలొనీక నగరంలో కూడా అలాంటిదే జరగవచ్చని పౌలు అనుకుని ఉంటాడని తెలుస్తుంది. పౌలు పరిస్థితిని మీరు అర్థం చేసుకోగలరా? మంచివార్తను ప్రకటించడం మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? తనకు బలాన్ని ఇవ్వమని, ధైర్యాన్ని కూడగట్టుకునేలా సహాయం చేయమని పౌలు యెహోవాకు ప్రార్థించి ఉంటాడు. మీరు కూడా అలా చేసేలా పౌలు ఆదర్శం సహాయం చేస్తుంది.—1 కొరిం. 4:16.
అపొ. 17:1-3)
‘లేఖనాలు అర్థంచేసుకునేలా సహాయం చేయడానికి ప్రయత్నించాడు’ (4. పౌలు థెస్సలొనీకలో మూడు వారాల కంటే ఎక్కువ రోజులే ఉండి ఉంటాడని ఎలా చెప్పవచ్చు?
4 పౌలు థెస్సలొనీకలో ఉన్నప్పుడు, మూడు వారాలపాటు ప్రతీ విశ్రాంతి రోజున సమాజమందిరంలో ప్రకటించాడని అపొస్తలుల కార్యాలు పుస్తకం చెప్తుంది. అంటే దానర్థం, పౌలు ఆ నగరంలో కేవలం మూడు వారాలే ఉన్నాడనా? కాదు. పౌలు ఆ నగరానికి వచ్చీరాగానే సమాజమందిరానికి వెళ్లి ఉంటాడని మనం ఖచ్చితంగా చెప్పలేం. అంతేకాదు థెస్సలొనీకయులకు రాసిన ఉత్తరాన్ని చదివితే పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు తమను తాము పోషించుకోవడానికి కష్టపడి పని చేశారని తెలుస్తుంది. (1 థెస్స. 2:9; 2 థెస్స. 3:7, 8) అలాగే పౌలు థెస్సలొనీకలో ఉన్నప్పుడు, ఆయనకు కావల్సిన వాటిని ఫిలిప్పీలోని సహోదరులు రెండుసార్లు పంపించారు. (ఫిలి. 4:16) కాబట్టి ఆయన థెస్సలొనీకలో మూడు వారాల కంటే ఎక్కువ రోజులే ఉండి ఉంటాడని చెప్పవచ్చు.
5. వినేవాళ్లను ఆలోచింపజేసేలా పౌలు ఎలా మాట్లాడాడు?
5 పౌలు ధైర్యాన్ని కూడగట్టుకుని సమాజమందిరంలో ఉన్నవాళ్లకు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన తన అలవాటు ప్రకారం ‘లేఖనాలు అర్థంచేసుకునేలా అక్కడి వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు. క్రీస్తు బాధలు పడడం, మృతుల్లో నుండి బ్రతకడం అవసరమని వివరిస్తూ, లేఖనాల ద్వారా రుజువు చేస్తూ ఉన్నాడు. “నేను మీకు ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తు” అని వాళ్లకు చెప్పాడు.’ (అపొ. 17:2, 3) వినేవాళ్లకు కేవలం ఆసక్తిగా అనిపించాలనే కాదు, వాళ్లను ఆలోచింపజేసేలా పౌలు మాట్లాడాడు. సమాజమందిరంలో ఉన్నవాళ్లకు లేఖనాలు బాగా తెలుసని, వాళ్లు వాటిని గౌరవిస్తారని పౌలుకు తెలుసు. అయితే వాళ్లకు లేఖనాల అర్థం తెలీదు. అందుకే ఆయన వాళ్లకు లేఖనాలు అర్థం చేసుకునేలా సహాయం చేశాడు, వాటిని వివరించాడు, నజరేయుడైన యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ లేదా క్రీస్తు అని లేఖనాలు చూపించి రుజువు చేశాడు.
6. లేఖనాల్ని అర్థం చేసుకునేలా యేసు ఎలా సహాయం చేశాడు? అప్పుడు శిష్యులకు ఎలా అనిపించింది?
6 పౌలు యేసును అనుకరించాడు. యేసు ఎప్పుడూ లేఖనాల్ని ఉపయోగించే బోధించాడు. ఉదాహరణకు యేసు పరిచర్య చేస్తున్నప్పుడు, లేఖనాలు చెప్తున్నట్టు మానవ కుమారుడు బాధలు అనుభవించాలని, చనిపోవాలని, తిరిగి బ్రతికించబడాలని తన అనుచరులకు వివరించాడు. (మత్త. 16:21) ఆయన చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత తన అనుచరులకు కనిపించాడు. చెప్పాలంటే అదే ఒక పెద్ద రుజువు. అయినా, యేసు ఇంకొన్ని రుజువులు ఇచ్చాడు. “మోషే, ప్రవక్తలందరూ రాసిన వాటితో మొదలుపెట్టి లేఖనాలన్నిటిలో తన గురించి రాయబడిన వాటిని” యేసు కొంతమంది శిష్యులకు వివరించాడు. అప్పుడు ఆ శిష్యులకు ఎలా అనిపించింది? వాళ్లు ఇలా అన్నారు: “దారిలో ఆయన మనతో మాట్లాడుతూ, లేఖనాల అర్థాన్ని విడమర్చి చెప్తున్నప్పుడు లోలోపల మన హృదయాలు మండుతున్నట్టు మనకు అనిపించలేదా?”—లూకా 24:13, 27, 32.
7. లేఖనాల ఆధారంగా బోధించడం ఎందుకు ముఖ్యం?
7 దేవుని వాక్యంలో ఉన్న సందేశానికి చాలా శక్తి ఉంది. (హెబ్రీ. 4:12) యేసు, పౌలు, మిగతా అపొస్తలుల్లాగే నేడున్న క్రైస్తవులు కూడా బైబిలు ఆధారంగానే బోధిస్తారు. అంటే మనం కూడా ప్రజలకు లేఖనాలు అర్థం చేసుకునేలా సహాయం చేస్తాం, వాటిని వివరిస్తాం; మనం ఏం మాట్లాడినా బైబిలు తెరిచి వాళ్లకు రుజువు చూపిస్తాం. ఎందుకంటే, మనం చెప్తున్న సమాచారం మన సొంతది కాదు. బైబిల్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా మన సొంత ఆలోచనల్ని కాదుగానీ, దేవుడు చెప్పే వాటినే బోధిస్తున్నామని గుర్తించేలా ప్రజలకు సహాయం చేస్తాం. మనం ప్రకటిస్తున్న సందేశం పూర్తిగా దేవుని వాక్యం మీదే ఆధారపడి ఉందని, అది నమ్మదగినదని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పౌలులాగే ధైర్యంగా ప్రకటించడానికి అది మనకు సహాయం చేస్తుంది.
“కొంతమంది విశ్వాసులయ్యారు” (అపొ. 17:4-9)
8-10. (ఎ) థెస్సలొనీక ప్రజలు మంచివార్తకు ఎలా స్పందించారు? (బి) కొంతమంది యూదులు పౌలు మీద ఎందుకు అసూయపడ్డారు? (సి) పౌలును వ్యతిరేకించిన యూదులు ఏం చేశారు?
8 పౌలు ఇప్పటికే హింసలు ఎదుర్కొన్నాడు కాబట్టి, యేసు అన్న ఈ మాటలు ఎంత నిజమో ఆయనకు అర్థమై ఉంటుంది: “దాసుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాడని నేను మీతో అన్న మాట గుర్తుపెట్టుకోండి. వాళ్లు నన్ను హింసించారంటే మిమ్మల్ని కూడా హింసిస్తారు; నా మాటలు పాటించారంటే మీ మాటలు కూడా పాటిస్తారు.” (యోహా. 15:20) యేసు చెప్పినట్లే, థెస్సలొనీకలో పౌలు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు వేర్వేరు విధాలుగా స్పందించారు. కొంతమంది వాక్యాన్ని అంగీకరించారు, ఇంకొంతమంది వ్యతిరేకించారు. మంచిగా స్పందించిన వాళ్ల గురించి లూకా ఇలా రాశాడు: “వాళ్లలో [యూదుల్లో] కొంతమంది విశ్వాసులయ్యారు [క్రైస్తవులయ్యారు]; వాళ్లు పౌలుతో, సీలతో సహవసించారు. అంతేకాదు దైవభక్తి ఉన్న చాలామంది గ్రీకువాళ్లు, ఎంతోమంది ప్రముఖులైన స్త్రీలు కూడా విశ్వాసులై వాళ్లతో సహవసించారు.” (అపొ. 17:4) లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఈ కొత్త శిష్యులు ఎంత సంతోషించి ఉంటారో కదా!
9 పౌలు చెప్పిన మాటలు కొంతమందికి నచ్చినా, మరి కొంతమందికి మాత్రం కోపం తెప్పించాయి. పౌలు చెప్పేది విని “చాలామంది గ్రీకువాళ్లు” క్రైస్తవులుగా మారడం చూసి, థెస్సలొనీకలోని కొంతమంది యూదులు అసూయపడ్డారు. వాళ్లు ఆ గ్రీకువాళ్లను యూదులుగా మార్చాలనుకున్నారు. అందుకే వాళ్లకు హీబ్రూ లేఖనాల్ని బోధిస్తూ, వాళ్లు తమ శిష్యులని అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి పౌలు ఎక్కడి నుండో తమ సమాజమందిరానికి వచ్చి, ఆ గ్రీకువాళ్లను దోచుకెళ్తున్నట్టు యూదులకు అనిపించింది. అందుకే వాళ్లకు పిచ్చి కోపం వచ్చింది.
10 ఆ తర్వాత ఏం జరిగిందో లూకా ఇలా చెప్పాడు: “యూదులు అసూయతో నిండిపోయి, పనీపాటా లేకుండా సంతలో తిరిగే కొంతమంది చెడ్డవాళ్లను పోగుచేశారు; ఆ యూదులు ఒక అల్లరిమూకను తయారుచేసి, నగరంలో అలజడి రేపడం మొదలుపెట్టారు. వాళ్లు యాసోను ఇంటి మీద దాడి చేశారు. పౌలును, సీలను ఆ అల్లరిమూక ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. పౌలు, సీల కనిపించకపోయేసరికి వాళ్లు యాసోనును, కొంతమంది సహోదరుల్ని నగర పాలకుల దగ్గరికి ఈడ్చుకెళ్లి ఇలా అరిచారు: ‘లోకాన్ని తలకిందులు చేసిన ఈ మనుషులు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వాళ్లను తన ఇంట్లో అతిథులుగా ఉంచుకున్నాడు. యేసు అనే ఇంకో రాజు ఉన్నాడని చెప్తూ వీళ్లందరూ కైసరు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.’” (అపొ. 17:5-7) అల్లరిమూక చేసిన దాడివల్ల పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు ఏం చేయాల్సి వచ్చింది?
11. పౌలు, అలాగే మిగతా సహోదరుల మీద యూదులు ఏ నిందల్ని వేశారు, వాళ్లకు వ్యతిరేకంగా ఏ చట్టాన్ని ఉపయోగించాలనుకున్నారు? (అధస్సూచి చూడండి.)
11 పౌలును, సీలను వదిలించుకోవడానికి యూదులు ఒక అల్లరిమూకను వాళ్లమీదికి ఉసిగొల్పారు. అల్లరిమూక చేసే పనులు చాలా దారుణంగా ఉంటాయి. ఉప్పెనలా ముంచుకొచ్చే అల్లరిమూకను ఆపడం చాలా కష్టం. అలా ఆ యూదులు నగరంలో “అలజడి” సృష్టించారు. పౌలు, అలాగే మిగతా సహోదరులు ఘోరమైన పనులు చేశారని, వాళ్లు శిక్షకు అర్హులని అధికారులను నమ్మించడానికి యూదులు ప్రయత్నించారు. మొదటిగా, వాళ్లు ‘లోకాన్ని తలకిందులు చేస్తున్నారు’ అనే నిందను వేశారు. కానీ అది నిజం కాదు. ఇక యూదులు వేసిన రెండవ నిందకైతే ఖచ్చితంగా శిక్షపడుతుంది. “యేసు అనే ఇంకో రాజు ఉన్నాడని చెప్తూ” వాళ్లు చక్రవర్తి ఆజ్ఞల్ని మీరుతున్నారు అని ఆరోపించారు. a
12. థెస్సలొనీకలోని క్రైస్తవుల మీద చేసిన ఆరోపణలు చాలా ప్రమాదకరమైనవి అని ఎందుకు చెప్పవచ్చు?
12 శాస్త్రులు, పరిసయ్యులు కూడా యేసు మీద ఇలాంటి ఆరోపణలే చేశారని గుర్తుచేసుకోండి. వాళ్లు పిలాతుతో ఇలా అన్నారు: “ఇతను మా దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు . . . తనే క్రీస్తు అనే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు.” (లూకా 23:2) యేసును శిక్షించకుండా వదిలేస్తే పిలాతు రోమా చక్రవర్తిని మోసం చేస్తూ, వేరొక రాజుకు మద్దతిస్తున్నాడని చక్రవర్తి అనుకునే ప్రమాదం ఉంది. అందుకే పిలాతు భయపడి, యేసుకు మరణ శిక్ష వేశాడు. థెస్సలొనీకలోని క్రైస్తవుల మీద కూడా అలాంటి నిందల్నే వేశారు కాబట్టి, వాళ్ల ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఒక రెఫరెన్సు పుస్తకం ఇలా చెప్తుంది: ‘ఈ ఆరోపణ చాలా తీవ్రమైంది, చక్రవర్తికి వెన్నుపోటు పొడుస్తున్నాడని ఒక వ్యక్తి మీద కేవలం అనుమానం వచ్చినా సరే, ఆ వ్యక్తిని చంపేస్తారు.’ మరి యూదుల కుట్ర ఫలించిందా?
13, 14. (ఎ) అల్లరిమూక ప్రకటనా పనిని ఎందుకు ఆపలేకపోయింది? (బి) యేసులాగే పౌలు కూడా ఎలా జాగ్రత్తగా ఉన్నాడు? మనం ఆయన ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు?
13 అల్లరిమూక థెస్సలొనీకలో ప్రకటనా పనిని ఆపలేకపోయింది. ఎందుకు? ఒక కారణం: పౌలు, సీల వాళ్లకు దొరకలేదు. అంతేకాదు, యూదులు చేసిన ఆరోపణలు నిజమని నమ్మడానికి సరిపడా ఆధారాలు నగర పాలకులకు కనిపించలేదు. వాళ్ల ముందు నిలబెట్టిన యాసోను దగ్గర, మిగతా సహోదరుల దగ్గర “జామీను” (బహుశా బెయిల్ లాంటిది) తీసుకుని వాళ్లను వెళ్లనిచ్చారు. (అపొ. 17:8, 9) “పాముల్లా అప్రమత్తంగా, పావురాల్లా కపటం లేకుండా ఉండండి” అని యేసు ఇచ్చిన సలహాను పాటించి, పౌలు ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. దానివల్ల వేరే నగరానికి వెళ్లి, ప్రకటనా పనిని కొనసాగించగలిగాడు. (మత్త. 10:16) పౌలు ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు అన్నంత మాత్రాన ఆయన మొండిగా, జాగ్రత్త లేకుండా ప్రకటించాడని కాదు. మరి ఆయన ఆదర్శాన్ని నేడు మనమెలా పాటించవచ్చు?
14 నేడు కూడా క్రైస్తవ మతనాయకులు తరచూ అల్లరిమూకల్ని యెహోవాసాక్షుల మీదికి ఉసిగొల్పుతున్నారు. మనం ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నాం అని, దేశ ద్రోహులం అని నిందల్ని మోపుతున్నారు. అధికారులు వాటిని నమ్మి, మనల్ని హింసించాలి అనే ఉద్దేశంతోనే అలా చేస్తున్నారు. మొదటి శతాబ్దంలోని వ్యతిరేకుల్లాగే, నేడు కూడా వాళ్లు మనమీద అసూయతోనే అవన్నీ చేస్తున్నారు. ఏదేమైనా నిజ క్రైస్తవులమైన మనం సమస్యల్ని కొనితెచ్చుకోం. కోపంగా, ఆలోచించకుండా ప్రవర్తించే వాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండడానికే మనం ప్రయత్నిస్తాం, మన పనిని ప్రశాంతంగా కొనసాగించాలని అనుకుంటాం. గొడవలు సద్దుమనిగాక, బహుశా మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్తాం.
“నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపించారు” (అపొ. 17:10-15)
15. మంచివార్తను విన్నప్పుడు బెరయ వాళ్లు ఏం చేశారు?
15 పౌలు, సీల సురక్షితంగా ఉండాలని థెస్సలొనీక సహోదరులు ఆలోచించారు. అందుకే వాళ్లను దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెరయకు పంపించారు. అక్కడికి వెళ్లిన తర్వాత, పౌలు సమాజమందిరంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. లూకా ఇలా రాశాడు: “థెస్సలొనీకలోని వాళ్లకన్నా బెరయలో ఉన్న యూదులు నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపించారు. అందుకే వాళ్లు ఎంతో ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. తాము విన్న విషయాలు నిజమో కాదో తెలుసుకోవడానికి వాళ్లు ప్రతీరోజు లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధిస్తూ వచ్చారు.” (అపొ. 17:10, 11) మంచివార్తను చక్కగా వినే అలాంటి వాళ్లు దొరికినప్పుడు పౌలు ఎంత సంతోషించి ఉంటాడో కదా! అయితే, సత్యాన్ని అంగీకరించిన థెస్సలొనీకలోని క్రైస్తవుల్ని ఇది తక్కువ చేసి మాట్లాడుతుందా? కానే కాదు. కొంతకాలం తర్వాత థెస్సలొనీక వాళ్ల గురించి పౌలు ఇలా రాశాడు: “మేము మానకుండా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే, మీరు మా దగ్గర దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని మనుషుల వాక్యంలా కాకుండా దేవుని వాక్యంలా స్వీకరించారు. అది నిజంగా దేవుని వాక్యమే. ఆ వాక్యమే విశ్వాసులైన మీ మీద గొప్ప ప్రభావం చూపిస్తోంది.” (1 థెస్స. 2:13) మరి, బెరయ వాళ్లు “నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపించారు” అని లూకా అంత ప్రత్యేకంగా ఎందుకు రాశాడు?
16. బెరయ వాళ్లు “నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపించారు” అని అనడం ఎందుకు సరైనది?
16 పౌలు చెప్పేవి కొత్తగా అనిపించినా, బెరయ వాళ్లు ఆయన చెప్తున్న దాన్ని అనుమానించలేదు, ఆయనతో వాదించలేదు. అలాగని, గుడ్డిగా అన్నీ నమ్మేయలేదు. వాళ్లు ముందుగా, పౌలు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విన్నారు. తర్వాత, పౌలు చెప్పినవి లేఖనాలతో సరిపోతున్నాయో లేదో పరిశీలించారు. పైగా వాళ్లు విశ్రాంతి రోజున మాత్రమే కాదు, ప్రతీ రోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేశారు. కొత్తగా నేర్చుకున్న వాటి ప్రకారం, లేఖనాల్లోని మిగతా విషయాల్ని కూడా “ఎంతో ఆసక్తితో” పరిశీలించారు. ఆ తర్వాత, వినయం చూపిస్తూ మార్పులు చేసుకుని “చాలామంది విశ్వాసులయ్యారు.” (అపొ. 17:12) కాబట్టి బెరయలో ఉన్నవాళ్లు “నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపించారు” అని లూకా అనడం సరైనదే!
17. బెరయ వాళ్ల ఆదర్శం ఎందుకు అంత గొప్పది? క్రైస్తవులుగా మారి చాలాకాలం అయినా, మనం వాళ్ల ఆదర్శాన్ని ఎలా పాటిస్తూ ఉండవచ్చు?
17 మంచివార్తకు వాళ్లు స్పందించిన విధానం దేవుని వాక్యంలో రాయబడుతుందని, అది మనకు గొప్ప ఆదర్శంగా ఉంటుందని బెరయ వాళ్లు ఊహించి ఉండరు. పౌలు, యెహోవా ఏం కోరుకున్నారో బెరయ వాళ్లు సరిగ్గా అదే చేశారు. నేడు మనం కూడా వినేవాళ్ల విషయంలో అలాగే కోరుకుంటాం. తమ విశ్వాసం దేవుని వాక్యం ఆధారంగా బలంగా ఉండాలంటే, వాళ్లు బైబిల్ని జాగ్రత్తగా పరిశీలించాలని మనం ప్రోత్సహిస్తాం. అయితే, మనం క్రైస్తవులుగా మారిన తర్వాత నేర్చుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపించాల్సిన అవసరం ఇక ఉండదా? ఎంతమాత్రం కాదు. రోజులు గడుస్తుండగా యెహోవా నేర్పించే వాటిని ఆసక్తిగా నేర్చుకోవడం, వాటిని వెంటనే పాటించడం ఇంకా ముఖ్యం. అలా చేయడం ద్వారా తన ఇష్టానికి తగ్గట్టు మనల్ని మలచమని, మనకు శిక్షణ ఇవ్వమని యెహోవాకు చెప్తాం. (యెష. 64:8) ఆ విధంగా మనం దేవుని ఇష్టాన్ని చక్కగా చేస్తాం, ఆయన్ని పూర్తిగా సంతోషపెడతాం.
18, 19. (ఎ) పౌలు బెరయ నుండి ఎందుకు వెళ్లిపోయాడు? కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మనం ఆయన్ని ఎలా అనుకరించవచ్చు? (బి) తర్వాత పౌలు ఎక్కడ, ఎవరికి ప్రకటించబోతున్నాడు?
18 పౌలు బెరయలో ఎక్కువ కాలం లేడు. బైబిలు ఇలా చెప్తుంది: “పౌలు బెరయలో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని థెస్సలొనీకలో ఉన్న యూదులకు తెలిసినప్పుడు, బెరయలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టి అలజడి రేపడానికి వాళ్లు అక్కడికి వచ్చారు. అప్పుడు సహోదరులు వెంటనే పౌలును సముద్రతీరం వరకు పంపించారు. సీల, తిమోతి మాత్రం అక్కడే ఉండిపోయారు. అయితే, పౌలుతో పాటు ఉన్నవాళ్లు అతన్ని ఏథెన్సు వరకు తీసుకెళ్లారు. కానీ వీలైనంత త్వరగా సీలను, తిమోతిని తన దగ్గరికి రమ్మని చెప్పమంటూ పౌలు వాళ్లకు నిర్దేశాలు ఇచ్చాడు. దాంతో అతని వెంట వచ్చినవాళ్లు బయల్దేరి వెళ్లిపోయారు.” (అపొ. 17:13-15) మంచివార్తను ప్రకటించకుండా ఆపడానికి వ్యతిరేకులు ఎంత పట్టుదలగా ప్రయత్నిస్తున్నారో కదా! వాళ్లు పౌలును థెస్సలొనీక నుండి తరిమేయడం చాలదన్నట్టు, బెరయకు వచ్చి ఇక్కడ కూడా అదే అలజడిని సృష్టించాలని ప్రయత్నించారు. కానీ వాళ్లు అనుకున్నట్టు జరగలేదు. తాను ప్రకటించాల్సిన ప్రాంతం చాలా పెద్దదని పౌలుకు తెలుసు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ప్రకటించవచ్చు అని ఆయన వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. నేడు ఎవరు ఎంత గట్టిగా ప్రయత్నించినా, మనం మాత్రం మంచివార్తను ప్రకటించడం ఆపకూడదని అంతే బలంగా నిశ్చయించుకుందాం!
19 థెస్సలొనీకలో, బెరయలో ఉన్న యూదులకు ప్రకటించిన తర్వాత మంచివార్తను ధైర్యంగా ప్రకటించడం, లేఖనాల్ని అర్థం చేసుకునేలా సహాయం చేయడం ఎంత ప్రాముఖ్యమో పౌలు ఖచ్చితంగా తెలుసుకుని ఉంటాడు. మనం కూడా దాని ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. తర్వాత పౌలు ఏథెన్సులో ఉన్న అన్యజనులకు ప్రకటించబోతున్నాడు. పౌలు ఇప్పటివరకు ప్రకటించిన వాళ్ల నమ్మకాలకు, ఏథెన్సు ప్రజల నమ్మకాలకు చాలా తేడా ఉంది. మరి ఏథెన్సు ప్రజలు మంచివార్త వింటారా? దాని గురించి తర్వాతి అధ్యాయంలో చూస్తాం.
a ఆ కాలంలో, రోమా చక్రవర్తులు నియమించిన చట్టం ప్రకారం “వేరే ఒక కొత్త రాజు గానీ, కొత్త రాజ్యం గానీ వస్తుందని ఎవ్వరూ అనకూడదు; ముఖ్యంగా రోమా చక్రవర్తికి బదులుగా వచ్చే రాజు లేదా రాజ్యం గురించి అస్సలు మాట్లాడకూడదు” అని ఒక బైబిలు పండితుడు చెప్పాడు. పౌలు తన ప్రకటనా పని ద్వారా ఈ ఆజ్ఞను మీరాడని యూదులు తప్పుడు ఆరోపణ చేశారు. “ అపొస్తలుల కార్యాలు పుస్తకంలో చెప్పబడిన కైసరులు” అనే బాక్సు చూడండి.