కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 21

“ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను”

“ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను”

పౌలు పరిచర్యలో ఉత్సాహం చూపించాడు, పెద్దలకు సలహాలు ఇచ్చాడు

అపొస్తలుల కార్యాలు 20:1-38 ఆధారంగా

1-3. (ఎ) ఐతుకు ఎలా చనిపోయాడో వివరించండి. (బి) పౌలు ఏం చేశాడు? అది పౌలు గురించి మనకు ఏం తెలియజేస్తుంది?

 పౌలు త్రోయ సంఘంలోని చాలామంది సహోదర సహోదరీల్ని ఒక మేడ గదిలో కలుసుకున్నాడు. అది మూడు అంతస్తుల ఇల్లు. తర్వాతి రోజు పౌలు అక్కడి నుండి వెళ్లిపోతాడు కాబట్టి, చాలాసేపటి నుండి వాళ్లతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ-మాట్లాడుతూ మధ్యరాత్రి అయిపోయింది. ఆ గదిలో చాలా దీపాలు వెలిగించి ఉన్నాయి కాబట్టి ఆ గది అంతా కాస్త వెచ్చగా ఉండి ఉంటుంది. ఇంకా పొగ కూడా ఉండి ఉంటుంది. ఐతుకు అనే అబ్బాయి కిటికీ దగ్గర కూర్చున్నాడు. పౌలు మాట్లాడుతున్నప్పుడు ఐతుకు మెల్లగా నిద్రలోకి జారుకుని, ఆ మూడో అంతస్తు నుండి కిందికి పడిపోయాడు!

2 లూకా ఒక డాక్టరు కాబట్టి, బహుశా ఆయన అందరికన్నా ముందు పరుగెత్తుకుని వెళ్లి ఆ అబ్బాయికి ఏమైందో చూసి ఉండవచ్చు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఐతుకు “చనిపోయి ఉన్నాడు.” (అపొ. 20:9) అయితే ఒక అద్భుతం జరిగింది. పౌలు ఆ అబ్బాయి మీద పడుకొని అక్కడున్న వాళ్లతో ఇలా అన్నాడు: “కంగారుపడకండి, ఇతను బ్రతికే ఉన్నాడు.” చనిపోయిన ఐతుకును పౌలు బ్రతికించాడు!—అపొ. 20:10.

3 దేవుని పవిత్రశక్తి ఎంత గొప్పగొప్ప పనులు చేయగలదో ఈ సంఘటన చూపిస్తుంది. ఆ అబ్బాయి చనిపోవడంలో పౌలు తప్పేం లేదు. అయినా, అక్కడున్న వాళ్లు బాధగా తిరిగి వెళ్లకూడదని, జరిగిన దాన్నిబట్టి యెహోవా మీద వాళ్ల విశ్వాసం తగ్గిపోకూడదని పౌలు అనుకున్నాడు. ఐతుకును తిరిగి బ్రతికించడం ద్వారా పౌలు ఆ సంఘంలోని వాళ్లను ఓదార్చాడు, బలపర్చాడు. అలా, పరిచర్యలో ఉత్సాహంగా కొనసాగేలా వాళ్లకు సహాయం చేశాడు. పౌలు ప్రతీ ఒక్కరి ప్రాణాన్ని విలువైనదిగా చూస్తూ, బాధ్యతగా నడుచుకున్నాడు. ఆయన అన్న ఈ మాటలు మీకు గుర్తుకురావచ్చు: “ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను.” (అపొ. 20:26) మనం కూడా ఆయన ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చో ఇప్పుడు చూద్దాం.

పౌలు “మాసిదోనియకు ప్రయాణం మొదలుపెట్టాడు” (అపొ. 20:1, 2)

4. ఎఫెసులో ఇంతకుముందు పౌలు ఏ భయంకరమైన సంఘటనను ఎదుర్కొన్నాడు?

4 మనం ముందు అధ్యాయంలో చూసినట్టు, పౌలు ఒక భయంకరమైన సంఘటనను ఎదుర్కొన్నాడు. ఆయన ఎఫెసులో పరిచర్య చేస్తున్నప్పుడు పెద్ద అలజడి రేగింది. అర్తెమి దేవి విగ్రహాల్ని తయారుచేసి, అమ్మే వాళ్లందరూ కలిసి ఆ అలజడిని సృష్టించారు! అయితే, “అలజడి తగ్గిపోయాక పౌలు శిష్యుల్ని పిలిపించాడు. తర్వాత వాళ్లను ప్రోత్సహించి, వాళ్లకు వీడ్కోలు చెప్పి, మాసిదోనియకు ప్రయాణం మొదలుపెట్టాడు.”—అపొ. 20:1.

5, 6. (ఎ) మాసిదోనియలో పౌలు ఎంతకాలం ఉండి ఉంటాడు? అక్కడ ఆయన ఏం చేశాడు? (బి) తోటి సహోదర సహోదరీల్ని పౌలు ఎలా చూశాడు?

5 పౌలు మాసిదోనియకు వెళ్తున్నప్పుడు రేవు పట్టణమైన త్రోయలో ఆగి, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. కొరింథుకు వెళ్లిన తీతు వెనక్కి తిరిగొచ్చి తనను అక్కడ కలుస్తాడని పౌలు అనుకున్నాడు. (2 కొరిం. 2:12, 13) అయితే తీతు రావడం లేదని అర్థమైనప్పుడు, ఆయన మాసిదోనియకు వెళ్లిపోయాడు. బహుశా ఆయన అక్కడ దాదాపు ఒక సంవత్సరం పాటు ఉండి ఉంటాడు. పౌలు ‘అక్కడి శిష్యుల్ని చాలా మాటలతో ప్రోత్సహించాడు.’ a (అపొ. 20:2) చివరికి తీతు పౌలును మాసిదోనియలో కలిశాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరానికి వాళ్లు చక్కగా స్పందించారనే మంచి కబురును ఆయన తీసుకొచ్చాడు. (2 కొరిం. 7:5-7) దాంతో పౌలు వాళ్లకు ఇంకో ఉత్తరాన్ని రాశాడు. దాన్ని మనం కొరింథీయులకు రాసిన రెండో ఉత్తరం అని అంటాం.

6 ఎఫెసు, మాసిదోనియలోని సహోదరులకు పౌలు ఎలా సహాయం చేశాడు? లూకా దాని గురించి రాస్తున్నప్పుడు “ప్రోత్సహించి,” “ప్రోత్సహించాక” అనే పదాల్ని ఉపయోగించాడని గమనించండి. పౌలు తన తోటి సహోదరుల్ని ఎంతగా ప్రేమించాడో ఆ పదాలు తెలియజేస్తున్నాయి. ఇతరుల్ని చిన్నచూపు చూసిన పరిసయ్యులకు, సహోదరుల్ని తన తోటి పనివాళ్లుగా చూసిన పౌలుకు ఎంత తేడా ఉందో కదా! (యోహా. 7:47-49; 1 కొరిం. 3:9) సహోదరుల్ని గట్టిగా మందలించాల్సి వచ్చినప్పుడు కూడా పౌలు వాళ్లను తక్కువ చేసి మాట్లాడలేదు.—2 కొరిం. 2:4.

7. నేడు పెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు పౌలు ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు?

7 నేడు పెద్దలు, ప్రాంతీయ పర్యవేక్షకులు పౌలు ఆదర్శాన్ని పాటించడానికి కృషి చేస్తున్నారు. ఎవరినైనా గట్టిగా సరిదిద్దాల్సి వచ్చినా, బలపర్చే విధంగానే మాట్లాడడానికి వాళ్లు ఎప్పుడూ కృషి చేస్తారు. సహోదర సహోదరీల పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్లను ప్రోత్సహించడానికే ప్రయత్నిస్తారు కానీ, వాళ్లతో కఠినంగా మాట్లాడరు. అనుభవం గల ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా అంటున్నాడు: “మన సహోదర సహోదరీల్లో చాలామంది సరైనదే చేయాలని కోరుకుంటారు. కానీ వాళ్లు రకరకాల ఆందోళనలతో, భయాలతో పోరాడుతూ కృంగిపోతున్నారు. అలాంటి సందర్భాల్లో ఏది సరైనదో తెలీక వాళ్లు తికమక పడుతుంటారు.” పెద్దలు అలాంటి సహోదర సహోదరీల్ని బలపర్చేవాళ్లుగా ఉండవచ్చు.—హెబ్రీ. 12:12, 13.

పౌలును “చంపడానికి యూదులు కుట్ర పన్నారు” (అపొ. 20:3, 4)

8, 9. (ఎ) ఓడ ఎక్కి సిరియాకు వెళ్లాలనుకున్న ఆలోచనను పౌలు ఎందుకు మార్చుకున్నాడు? (బి) యూదులు పౌలు మీద ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకున్నారు?

8 పౌలు మాసిదోనియ నుండి కొరింథుకు వెళ్లాడు. b అక్కడ మూడు నెలలు ఉన్న తర్వాత కెంక్రేయకు వెళ్లి, ఓడలో సిరియాకు వెళ్లాలనుకున్నాడు. ఆయన అక్కడి నుండి యెరూషలేముకు వెళ్లి, అవసరంలో ఉన్న సహోదరులకు విరాళాలు అందించడం తేలికౌతుంది. c (అపొ. 24:17; రోమా. 15:25, 26) అయితే “తనను చంపడానికి యూదులు కుట్ర పన్నారు” అని తెలుసుకున్న పౌలు తన ఆలోచనను మార్చుకున్నాడు!

9 యూదులు పౌలు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే, వాళ్ల దృష్టిలో ఆయన యూదా మతాన్ని విడిచిపెట్టిన మతభ్రష్టుడు. ఇంతకుముందు కొరింథులో ఆయన చేసిన పరిచర్య వల్ల సమాజమందిరం అధికారి అయిన క్రిస్పు క్రైస్తవుడిగా మారాడు. (అపొ. 18:7, 8; 1 కొరిం. 1:14) ఇంకో సందర్భంలో, యూదులు పౌలు మీద తప్పుడు ఆరోపణలు వేసి అకయ ప్రాంతానికి స్థానిక అధిపతి అయిన గల్లియోను ముందుకు తీసుకెళ్లారు. అయితే గల్లియోను ఆ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. దాంతో యూదుల కోపం ఇంకా పెరిగిపోయింది. (అపొ. 18:12-17) పౌలు త్వరలోనే దగ్గర్లోని కెంక్రేయకు వచ్చి, ఓడ ఎక్కుతాడని కొరింథులోని యూదులు ఊహించి ఉంటారు. అందుకే అక్కడ ఆయన్ని చంపడానికి కుట్ర పన్నారు. మరి పౌలు ఏం చేస్తాడు?

10. పౌలు కెంక్రేయకు వెళ్లకపోవడం పిరికితనమా? వివరించండి.

10 పౌలు తన భద్రతను, తన మీద నమ్మకంతో ఇచ్చిన విరాళాల భద్రతను మనసులో పెట్టుకుని కెంక్రేయకు వెళ్లకూడదని అనుకున్నాడు. బదులుగా వచ్చిన దారిలోనే, అంటే మాసిదోనియ గుండా తిరిగెళ్లాలనుకున్నాడు. అయితే రోడ్డు ప్రయాణంలో కూడా కొన్ని ప్రమాదాలు ఉంటాయి. ఆ రోజుల్లో, బందిపోటు దొంగలు దారిలో మాటువేసి ఉండేవాళ్లు. దారిలో ఉండే హోటళ్లలో కూడా భద్రత ఉండేది కాదు. కానీ కెంక్రేయకు వెళ్లే బదులు, కొంచెం కష్టమైనా రోడ్డు ప్రయాణమే చేయాలని పౌలు నిర్ణయించుకున్నాడు. మంచి విషయం ఏంటంటే ఆయన ఒక్కడే వెళ్లడం లేదు, ఆయనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్లు ఎవరంటే: అరిస్తార్కు, గాయియు, సెకుందు, సోపత్రు, తిమోతి, త్రోఫిము, తుకికు.—అపొ. 20:3, 4.

11. భద్రతను మనసులో పెట్టుకుని మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటాం? ఈ విషయంలో యేసు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచాడు?

11 పౌలులాగే నేడు మనం కూడా, పరిచర్య చేస్తున్నప్పుడు మన భద్రతను మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో సహోదరులు పరిచర్యకు ఒంటరిగా వెళ్లే బదులు, గుంపుగా లేదా కనీసం ఇద్దరిద్దరిగా వెళ్తారు. మరి హింస సంగతేంటి? క్రైస్తవులుగా మనం హింసల్ని తప్పించుకోలేం అని మనకు బాగా తెలుసు. (యోహా. 15:20; 2 తిమో. 3:12) అలాగని మనం మొండిగా ప్రమాదాల్ని కొనితెచ్చుకోం. యేసు ఉదాహరణ గురించి ఆలోచించండి. ఒకసారి యెరూషలేములో వ్యతిరేకులు ఆయన్ని రాళ్లతో కొట్టాలనుకున్నారు. అప్పుడు “యేసు దాక్కొని, ఆలయంలో నుండి బయటికి వెళ్లిపోయాడు.” (యోహా. 8:59) తర్వాత యూదులు యేసును చంపాలనుకున్నప్పుడు, ఆయన ‘యూదుల మధ్య బహిరంగంగా తిరగడం మానేశాడు. ఆయన అక్కడి నుండి ఎడారికి దగ్గర్లో ఉన్న నగరానికి వెళ్లాడు.’ (యోహా. 11:54) అవసరమైనప్పుడు, యేసు తనను తాను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అలా దేవుని ఇష్టాన్ని చేసే విషయంలో ఏ అడ్డంకీ రాకుండా చూసుకున్నాడు. నేడు క్రైస్తవులు కూడా అలాగే ఉంటారు.—మత్త. 10:16.

“చెప్పలేనంత సంతోషించారు” (అపొ. 20:5-12)

12, 13. (ఎ) ఐతుకు తిరిగి బ్రతికినప్పుడు సంఘంలో ఉన్న వాళ్లందరికీ ఎలా అనిపించింది? (బి) ఇష్టమైనవాళ్లు చనిపోవడం వల్ల బాధలో ఉన్నవాళ్లకు బైబిలు ఏమని మాటిస్తోంది?

12 పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు మాసిదోనియ గుండా కలిసి ప్రయాణించారు. తర్వాత వాళ్లు ఏదో ఒక చోట విడిపోయి ఉంటారు. మళ్లీ వాళ్లంతా త్రోయలో కలుసుకున్నారని అర్థమౌతుంది. d బైబిలు ఇలా చెప్తుంది: ‘మేము ఐదు రోజుల్లో త్రోయకు చేరుకొని వాళ్లను కలుసుకున్నాం.’ e (అపొ. 20:6) ఈ అధ్యాయం మొదట్లో చూసినట్టు, ఐతుకు అనే అబ్బాయిని పౌలు బ్రతికించింది ఇక్కడే. ఐతుకు తిరిగి బ్రతికినప్పుడు తోటి సహోదరులకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి! వాళ్లు “చెప్పలేనంత సంతోషించారు” అని లూకా రాశాడు.—అపొ. 20:12.

13 నిజమే అలాంటి అద్భుతాలు ఇప్పుడు జరగవు. అయితే, చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారని బైబిలు మాటిస్తోంది. ఇష్టమైనవాళ్లు చనిపోవడం వల్ల బాధలో ఉన్నవాళ్లకు ఆ నిరీక్షణ ‘చెప్పలేనంత సంతోషాన్ని’ ఇస్తుంది. (యోహా. 5:28, 29) ఒకసారి ఆలోచించండి: ఐతుకు అపరిపూర్ణుడు కాబట్టి, మళ్లీ కొంతకాలానికి ఆయన చనిపోయాడు. (రోమా. 6:23) కొత్త లోకంలో దేవుడు తిరిగి బ్రతికించే వాళ్లందరికీ, చావు అనేదే లేకుండా ఎప్పటికీ జీవించే అవకాశం ఉంటుంది! ఇంకా, యేసుతో పాటు పరిపాలించడానికి పరలోకానికి వెళ్లే వాళ్లందరికీ అమర్త్యత దొరుకుతుంది. (1 కొరిం. 15:51-53) అభిషిక్త క్రైస్తవులు, వేరే గొర్రెలు తమ నిరీక్షణను బట్టి ‘చెప్పలేనంత సంతోషిస్తారు.’—యోహా. 10:16.

“బహిరంగంగా ఇంటింటా” (అపొ. 20:13-24)

14. మిలేతులో ఎఫెసు పెద్దల్ని కలుసుకున్నప్పుడు పౌలు వాళ్లతో ఏమన్నాడు?

14 పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు త్రోయ నుండి అస్సుకు వెళ్లారు. తర్వాత అస్సు నుండి మితులేనే, కీయొసు, సమొసు, మిలేతుకు చేరుకున్నారు. పెంతెకొస్తు పండుగ కల్లా యెరూషలేముకు చేరుకోవాలని పౌలు అనుకున్నాడు. అందుకనే ఆయన ఈసారి ఎఫెసులో ఆగలేదు. అయితే పౌలు ఎఫెసులోని పెద్దలతో మాట్లాడాలనుకున్నాడు. కాబట్టి, మిలేతుకు వచ్చి తనను కలవమని కబురు పంపించాడు. (అపొ. 20:13-17) వాళ్లు వచ్చినప్పుడు పౌలు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఆసియా ప్రాంతంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి మీ మధ్య ఎలా నడుచుకున్నానో మీకు బాగా తెలుసు. నేను పూర్తి వినయంతో, కన్నీళ్లతో, యూదులు పన్నిన కుట్రల వల్ల కష్టాలు పడుతూ ప్రభువుకు సేవ చేశాను. మీకు మంచి చేసే దేన్నీ నేను మీకు చెప్పకుండా ఉండలేదు, మీకు బహిరంగంగా ఇంటింటా బోధించకుండా ఉండలేదు. అయితే, పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగమని, మన ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచమని యూదులకు, గ్రీకు వాళ్లకు పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చాను.”—అపొ. 20:18-21.

15. ఇంటింటి పరిచర్య వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

15 ఈ రోజుల్లో, మనం వేర్వేరు పద్ధతుల్లో ప్రకటిస్తున్నాం. పౌలులాగే మనం ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకటిస్తాం. అంటే బస్‌స్టాపుల్లో, వీధుల్లో, మార్కెట్లలో ప్రకటిస్తాం. అయినా ప్రకటించడానికి మనం ఉపయోగించే ముఖ్యమైన పద్ధతి, ఇంటింటి పరిచర్య. ఎందుకు? ఒక కారణం, అలా ఇంటింటికి వెళ్లి ప్రకటించడం వల్ల రాజ్య సందేశాన్ని వినే అవకాశం ప్రతీ ఒక్కరికి మళ్లీమళ్లీ దొరుకుతుంది. దేవునికి పక్షపాతం లేదనడానికి ఇదొక రుజువు. అంతేకాదు, దేవున్ని తెలుసుకోవాలనే కోరిక నిజంగా ఉన్నవాళ్లకు, ఇంటింటి పరిచర్యలో వాళ్ల అవసరాలకు తగ్గట్టు వ్యక్తిగతంగా సహాయం చేయగలుగుతాం. ఇంటింటి పరిచర్య వల్ల మనం కూడా ప్రయోజనం పొందుతాం. దానివల్ల మన విశ్వాసం బలపడుతుంది, సహనం పెరుగుతుంది. చెప్పాలంటే, నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నం “ఇంటింటా, బహిరంగంగా” ఉత్సాహంగా ప్రకటించడం.

16, 17. పౌలు ఎలా ధైర్యం చూపించాడు, నేడు క్రైస్తవులు ఆయన ఆదర్శాన్ని ఎలా పాటిస్తున్నారు?

16 యెరూషలేములో ఏయే ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో తనకు తెలీదని పౌలు ఎఫెసు పెద్దలకు చెప్పాడు. ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “అయితే, నా ప్రాణం నాకు ఏమాత్రం ముఖ్యమైనదని నేను అనుకోవట్లేదు. ఈ పరుగుపందాన్ని, ప్రభువైన యేసు నుండి నేను పొందిన పరిచర్యను పూర్తి చేయాలన్నదే నా కోరిక. ఆ పరిచర్య ఏమిటంటే, దేవుని అపారదయకు సంబంధించిన మంచివార్త గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వడమే.” (అపొ. 20:24) పౌలు చాలా ధైర్యం చూపించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా అంటే ఆయన ఆరోగ్యం బాగోలేకపోయినా, హింస ఎదురైనా దేవుడు తనకు అప్పగించిన పనిని చేయడం ఆపలేదు.

17 నేడు కూడా క్రైస్తవులు రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కొన్ని దేశాల్లో సహోదరులు నిషేధాన్ని, హింసను ఎదుర్కొంటున్నారు. ఇంకొంతమంది మానసిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. పిల్లలేమో స్కూల్లో తోటివాళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, యెహోవాసాక్షులు పౌలులాగే ధైర్యంగా ఉంటూ ‘మంచివార్త గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇస్తున్నారు.’

‘మీ విషయంలో, మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి’ (అపొ. 20:25-38)

18. పౌలు ఎవరి రక్తం విషయంలోనూ దోషి కాకుండా ఎలా ఉన్నాడు? ఎఫెసు పెద్దలు కూడా ఆయనలా ఎలా ఉండవచ్చు?

18 తన ఉదాహరణను గుర్తుచేస్తూ, ఎఫెసు పెద్దలకు పౌలు కొన్ని సూటైన సలహాలు ఇచ్చాడు. వాళ్లు ఇక ఆయన్ని చూడడం ఇదే చివరిసారి కావచ్చని చెప్పాడు. తర్వాత ఆయన ఇలా అన్నాడు: ‘ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను. నేను దేవుని ఇష్టమంతటినీ మీకు చెప్పకుండా ఉండలేదు.’ పౌలులాగే, ఎఫెసు పెద్దలు కూడా ఎవరి రక్తం విషయంలోనూ దోషులు కాకుండా ఎలా ఉండవచ్చు? ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు మీ విషయంలో, అలాగే దేవుని సంఘాన్ని కాయడం కోసం పవిత్రశక్తి మిమ్మల్ని ఎవరి మధ్య పర్యవేక్షకులుగా నియమించిందో ఆ మంద అంతటి విషయంలో శ్రద్ధ తీసుకోండి. దేవుడు ఆ సంఘాన్ని తన సొంత కుమారుడి రక్తంతో కొన్నాడు.” (అపొ. 20:26-28) పౌలు వాళ్లను ఇంకా ఇలా హెచ్చరించాడు: ‘క్రూరమైన తోడేళ్ల లాంటి వాళ్లు మీలో ప్రవేశిస్తారు. వాళ్లు శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకెళ్లాలని తప్పుడు బోధలు బోధిస్తారు.’ మరి పెద్దలు ఏం చేయాలి? పౌలు ఇలా చెప్పాడు: “ఎప్పుడూ మెలకువగా ఉండండి. నేను మూడు సంవత్సరాల పాటు మానకుండా రాత్రింబగళ్లు మీలో ఒక్కొక్కరికి కన్నీళ్లతో ఉపదేశమిచ్చానని గుర్తుపెట్టుకోండి.”—అపొ. 20:29-31.

19. మొదటి శతాబ్దం చివరి కల్లా మతభ్రష్టత్వం ఎలా మొదలైంది? అది తర్వాతి శతాబ్దాల్లో ఎలా పెరిగిపోయింది?

19 మొదటి శతాబ్దం చివరికల్లా సంఘంలో “క్రూరమైన తోడేళ్ల లాంటి వాళ్లు” ప్రవేశించారు. దాదాపు క్రీస్తు శకం 98 లో అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “ఇప్పటికే చాలామంది క్రీస్తువిరోధులు వచ్చారు . . . వాళ్లు మన మధ్యే ఉండేవాళ్లు, కానీ మనల్ని వదిలి వెళ్లిపోయారు, వాళ్లు మనవాళ్లు కాదు. వాళ్లు మనవాళ్లయితే మనతోనే ఉండేవాళ్లు.” (1 యోహా. 2:18, 19) మూడవ శతాబ్దం కల్లా మతభ్రష్టత్వం ఎంతగా పెరిగిపోయిందంటే, క్రైస్తవమత సామ్రాజ్యంలో నాయకుల గుంపు ఒకటి తయారైంది. నాలుగో శతాబ్దంలో, రోమా చక్రవర్తి అయిన కాన్‌స్టంటైన్‌ భ్రష్టుపట్టిన ఈ క్రైస్తవత్వానికి చట్టపరమైన గుర్తింపును ఇచ్చాడు. మతనాయకులు బైబిలు బోధల్ని అన్యమత ఆచారాలతో, నమ్మకాలతో కలిపేసి “తప్పుడు బోధలు” బోధించారు. పైగా వాటికి ‘క్రైస్తవ బోధలు’ అని పేరు పెట్టారు. నేటికీ క్రైస్తవమత సామ్రాజ్యంలో ఆ మతభ్రష్టత్వం కనిపిస్తుంది.

20, 21. పౌలు ఎలా నిస్వార్థంగా సేవ చేశాడు, నేడు పెద్దలు ఆయనలా ఎలా ఉండవచ్చు?

20 సంఘాన్ని తమ సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకునే మతనాయకులకు, పౌలుకు ఎంతో తేడా ఉంది. సంఘానికి భారంగా ఉండకూడదని పౌలు తనను తాను పోషించుకోవడానికి కష్టపడి పనిచేశాడు. పౌలు తోటి విశ్వాసులకు సేవ చేశాడు, కానీ వాళ్ల నుండి డబ్బు ఆశించలేదు. తనలాగే సహోదర సహోదరీలకు నిస్వార్థంగా సేవ చేయమని పౌలు ఎఫెసులోని పెద్దలకు సలహా ఇచ్చాడు. ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: ‘మీరు బలహీనంగా ఉన్నవాళ్లకు సహాయం చేయాలని, ప్రభువైన యేసు చెప్పిన మాటలు మనసులో ఉంచుకోవాలని అన్ని విషయాల్లో మీకు చూపించాను. యేసే స్వయంగా ఇలా చెప్పాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”’—అపొ. 20:35.

21 నేడు పెద్దలు పౌలులాగే నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. తమ దగ్గరికి వచ్చే ప్రజల్ని దోచుకుని ధనవంతులయ్యే చర్చీ నాయకులకు, సంఘ పెద్దలకు ఎంతో తేడా ఉంది. సంఘాన్ని కాసే పనిని దేవుడు తమకు అప్పగించిన బాధ్యతలా పెద్దలు చూస్తారు. వాళ్లు ఆ పనిని ఏమీ ఆశించకుండా చేస్తారు. గర్వానికి, పదవుల కోసం పోరాడే నైజానికి క్రైస్తవ సంఘంలో ఏమాత్రం చోటులేదు. “సొంత మహిమ” కోసం పాకులాడే వాళ్లు ఏదోక రోజు దెబ్బతింటారు. (సామె. 25:27) అహంకారం అవమానానికే దారితీస్తుంది.—సామె. 11:2.

‘వాళ్లంతా చాలా ఏడ్చారు.’—అపొస్తలుల కార్యాలు 20:37

22. ఏది పౌలును ఎఫెసు పెద్దలకు దగ్గర చేసింది?

22 పౌలు చూపించిన నిజమైన ప్రేమే సహోదరులకు ఆయన్ని దగ్గర చేసింది. ఆయన బయల్దేరాల్సిన సమయం వచ్చినప్పుడు “వాళ్లంతా చాలా ఏడ్చి, పౌలును కౌగిలించుకొని, ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు.” (అపొ. 20:37, 38) పౌలులాగే నిస్వార్థంగా సంఘం కోసం కష్టపడేవాళ్లను నేడు క్రైస్తవులు ఎంతో ప్రేమిస్తారు, గౌరవిస్తారు. పౌలు ఆదర్శం నిజంగా మన హృదయాల్ని కదిలిస్తుంది. “ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను” అని పౌలు అన్నాడు. (అపొ. 20:26) ఆయన అలా అనడం గొప్పలు చెప్పుకోవడమో, ఎక్కువ చేసి చెప్పుకోవడమో కాదని మనందరం ఖచ్చితంగా ఒప్పుకుంటాం.

b బహుశా కొరింథుకు వెళ్లిన ఈ సందర్భంలోనే పౌలు రోమీయులకు ఉత్తరం రాసి ఉంటాడు.

d అపొస్తలుల కార్యాలు 20:5, 6 వచనాల్లో లూకా “మా,” “మేము” అనే పదాల్ని ఉపయోగించాడు. దాన్నిబట్టి పౌలు త్రోయకు వెళ్తున్న దారిలో ఫిలిప్పీలో ఆగి, లూకాను వెంటబెట్టుకొని బయల్దేరాడని అర్థమౌతుంది.—అపొ. 16:10-17, 40.

e ఫిలిప్పీ నుండి త్రోయకు రావడానికి ఇదివరకు వాళ్లకు రెండు రోజులే పట్టింది. కానీ ఈసారి ఐదురోజులు పట్టింది. బహుశా ఈదురు గాలుల వల్ల ఈసారి ప్రయాణం ఆలస్యం అయ్యుంటుంది.—అపొ. 16:11.