కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 22

“యెహోవా ఇష్టమే జరగాలి”

“యెహోవా ఇష్టమే జరగాలి”

యెహోవా ఇష్టమే చేయాలని నిర్ణయించుకుని పౌలు యెరూషలేముకు వెళ్లాడు

అపొస్తలుల కార్యాలు 21:1-17 ఆధారంగా

1-4. పౌలు యెరూషలేముకు ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది?

 మిలేతులో అందరూ కన్నీళ్లతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటున్నారు. ఎఫెసులో ఉన్న పెద్దల్ని పౌలు, లూకా ఎంతో ప్రేమించారు. అందుకే వాళ్లను విడిచివెళ్లడం మనసుకు కష్టంగా అనిపించింది. పౌలు, లూకా ఓడ ఎక్కేశారు, ప్రయాణానికి కావల్సినవన్నీ వాళ్లతోపాటు తీసుకెళ్తున్నారు. యూదయలోని క్రైస్తవులకు సహాయంగా అందించాల్సిన విరాళాల్ని కూడా వాళ్లతో తీసుకెళ్తున్నారు. వాటిని వీలైనంత త్వరగా అందించాలని వాళ్లు కోరుకుంటున్నారు.

2 పౌలు, లూకాతో పాటు మిగతా ఏడుగురు సహోదరులు కూడా ఓడ ఎక్కేశారు. గాలి తెరచాపను ముందుకు తోస్తోంది. ఓడ మెల్లగా ఒడ్డుకు దూరమౌతూ ఉంది. ఒడ్డు దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఎఫెసు పెద్దల్ని వాళ్లు చూస్తూ ఉన్నారు. (అపొ. 20:4, 14, 15) ఒకరికొకరు కనిపించనంత దూరం వెళ్లేవరకు వాళ్లు చేతులు ఊపుతూనే ఉన్నారు.

3 పౌలు ఎఫెసులోని పెద్దలతో కలిసి దాదాపు మూడేళ్లు పనిచేశాడు. కానీ ఇప్పుడు పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడు. అక్కడ తన పరిస్థితి ఎలా ఉండబోతుందో పౌలుకు కొంతవరకు తెలుసు. ఇంతకుముందు, ఆయన ఆ పెద్దలతో ఇలా అన్నాడు: “పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం నేను యెరూషలేముకు వెళ్తున్నాను. అయితే అక్కడ నాకు ఏమి జరుగుతుందో నాకు తెలీదు. ఒకటి మాత్రం తెలుసు. నా కోసం సంకెళ్లు, శ్రమలు ఎదురుచూస్తున్నాయని పవిత్రశక్తి ప్రతీ నగరంలో నాకు మళ్లీమళ్లీ సాక్ష్యమిస్తోంది.” (అపొ. 20:22, 23) ప్రమాదం పొంచి ఉన్నా, పౌలు ‘పవిత్రశక్తి నిర్దేశానికి’ కట్టుబడి యెరూషలేముకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పౌలుకు తన ప్రాణం ముఖ్యమే, కానీ దేవుని ఇష్టాన్ని చేయడం అంతకన్నా ముఖ్యం.

4 మీకు కూడా పౌలులాగే అనిపిస్తుందా? మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఇష్టాన్నే చేస్తామని మాటిచ్చాం. అపొస్తలుడైన పౌలు ఆదర్శాన్ని పరిశీలించి మనం ఎంతో నేర్చుకోవచ్చు.

“కుప్ర ద్వీపం” దాటి వెళ్లాం (అపొ. 21:1-3)

5. పౌలు, ఆయనతో ఉన్నవాళ్ల ప్రయాణం ఎలా కొనసాగింది?

5 పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు ఎక్కిన ఓడ “వేగంగా ప్రయాణించి నేరుగా కోసు ద్వీపానికి” చేరుకుంది. గాలులు ఓడకు అనుకూలంగా వీయడంతో వాళ్లు అదేరోజు అక్కడికి చేరుకోగలిగారు. (అపొ. 21:1) బహుశా ఆ రోజు రాత్రి అక్కడ ఓడకు లంగరు వేసి ఉంటారు. తర్వాతి రోజు రొదుకి, పతరకి చేరుకున్నారు. ఈ పతర ఆసియా మైనరుకు దక్షిణాన ఉన్న తీర పట్టణం. సహోదరులందరూ అక్కడ దిగి, సరుకులు తీసుకెళ్లే వేరే పెద్ద ఓడలోకి ఎక్కారు. ఆ ఓడ ఫేనీకేలో ఉన్న తూరు పట్టణానికి వెళ్తుంది. వాళ్లు ప్రయాణిస్తుండగా దారిలో ఎడమ వైపు “కుప్ర ద్వీపం కనిపించింది,” వాళ్లు దాన్ని దాటి వెళ్లారు. (అపొ. 21:3) ఇంతకీ లూకా ఈ వివరాన్ని ఎందుకు రాశాడు?

6. (ఎ) కుప్ర ద్వీపం కనిపించినప్పుడు పౌలుకు ఎలా అనిపించి ఉంటుంది? (బి) యెహోవా మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాడో, మీకు ఎలా సహాయం చేశాడో గుర్తుచేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?

6 బహుశా పౌలు ఆ ద్వీపాన్ని చూపిస్తూ, అంతకుముందు అక్కడికి వెళ్లినప్పుడు జరిగినవాటి గురించి మిగతా సహోదరులకు చెప్పి ఉంటాడు. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం పౌలు తన మొదటి మిషనరీ యాత్రలో బర్నబాతో, యోహాను అనే పేరున్న మార్కుతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ ఎలుమ అనే మంత్రగాడు వాళ్ల పరిచర్యను వ్యతిరేకించాడు. (అపొ. 13:4-12) ఆ ద్వీపాన్ని చూస్తూ అక్కడ జరిగినవాటి గురించి తలచుకోవడం, బహుశా తర్వాత జరగబోయే వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని, బలాన్ని పౌలుకు ఇచ్చివుంటుంది. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాడో, శ్రమల్ని సహించేలా ఎలా సహాయం చేశాడో అప్పుడప్పుడు సమయం తీసుకుని గుర్తుచేసుకోవడం వల్ల మనం కూడా ప్రయోజనం పొందుతాం. అప్పుడు దావీదులాగే మనం కూడా ఇలా అంటాం: “నీతిమంతునికి ఎన్నో కష్టాలు వస్తాయి, అయితే వాటన్నిటి నుండి యెహోవా అతన్ని కాపాడతాడు.”—కీర్త. 34:19.

‘మేము శిష్యుల కోసం వెతికాం, వాళ్లు కనిపించారు’ (అపొ. 21:4-9)

7. తూరుకు చేరుకున్న తర్వాత పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు ఏం చేశారు?

7 సహోదర సహోదరీలతో కలిసి ఉండడాన్ని పౌలు ఎంతో ఇష్టపడ్డాడు. ఎందుకంటే అలా ఉండడం ముఖ్యమని ఆయన అనుకున్నాడు. తూరుకు చేరుకున్న తర్వాత, ‘మేము శిష్యుల కోసం వెతికాం, వాళ్లు కనిపించారు’ అని లూకా రాశాడు. (అపొ. 21:4) తూరులో క్రైస్తవులు ఉన్నారని వాళ్లకు తెలుసు. అందుకే సహోదరుల్ని వెతికి, కనుక్కుని బహుశా వాళ్లతో ఉండి ఉంటారు. సత్యంలోకి రావడం వల్ల మనకు దొరికిన గొప్ప ఆశీర్వాదాల్లో ఒకటి, మనం ఎక్కడికి వెళ్లినా మనల్ని ప్రేమగా ఆహ్వానించే క్రైస్తవ సహోదరులు ఉంటారు. దేవున్ని ప్రేమించే, సరైన ఆరాధనను చేసే మనకు ప్రపంచమంతటా స్నేహితులున్నారు!

8. అపొస్తలుల కార్యాలు 21:4 లో ఉన్న మాటల అర్థం ఏంటి?

8 తూరులో ఏడు రోజులు ఉన్నప్పుడు ఏం జరిగిందో లూకా ఇలా రాశాడు: “పవిత్రశక్తి వాళ్లకు [తూరులో ఉన్న సహోదరులకు] తెలియజేసిన దాన్నిబట్టి, యెరూషలేములో అడుగుపెట్టొద్దని వాళ్లు పౌలుకు పదేపదే చెప్పారు.” (అపొ. 21:4) బహుశా ఈ విషయం మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. యెహోవా తన మనసు మార్చుకున్నాడా? పౌలును యెరూషలేముకు వెళ్లొద్దని చెప్తున్నాడా? లేదు. యెరూషలేములో పౌలు శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవిత్రశక్తి తెలియజేసింది, అంతేకానీ ఆ నగరానికి వెళ్లొద్దని చెప్పలేదు. పౌలు యెరూషలేముకు వెళ్తే ప్రమాదంలో పడే అవకాశం ఉందని తూరులో ఉన్న సహోదరులు పవిత్రశక్తి ద్వారా సరిగ్గానే అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్లు పౌలుకు ఏమన్నా అవుతుందేమో అనే భయంతో, ఆయన్ని అక్కడికి వెళ్లొద్దని బ్రతిమాలారు. పౌలును ఆ ప్రమాదం నుండి తప్పించాలనే మంచి ఉద్దేశంతోనే వాళ్లు అలా చెప్పారు. కానీ పౌలు యెహోవా ఇష్టాన్ని చేయాలనుకున్నాడు కాబట్టి, యెరూషలేముకు వెళ్లడం మానుకోలేదు.—అపొ. 21:12.

9, 10. (ఎ) తూరులో ఉన్న సహోదరులు బ్రతిమాలినప్పుడు, పౌలుకు బహుశా ఎవరి అనుభవం గుర్తొచ్చి ఉంటుంది? (బి) నేడు లోకంలో చాలామంది ఎలాంటి మతాన్ని ఇష్టపడతారు? కానీ అది యేసు చెప్పిన మాటలకు ఎలా భిన్నంగా ఉంది?

9 యెరూషలేముకు వెళ్లొద్దని సహోదరులు బ్రతిమాలినప్పుడు పౌలుకు బహుశా యేసు అనుభవం గుర్తొచ్చి ఉంటుంది. యేసు ఒక సందర్భంలో ‘తను యెరూషలేముకు వెళ్లాలని, ఎన్నో బాధలు అనుభవించి చంపబడాలని’ తన శిష్యులకు చెప్పాడు. అప్పుడు పేతురు యేసు మీద ప్రేమతో “ప్రభువా, అలా మాట్లాడొద్దు. నీకు అలా జరగనే జరగదు” అని అన్నాడు. దానికి యేసు, “సాతానా! నా వెనక్కి వెళ్లు. నువ్వు నా దారికి అడ్డుగా ఉన్నావు. నువ్వు దేవుని ఆలోచనల మీద కాకుండా మనుషుల ఆలోచనల మీద మనసు పెడుతున్నావు” అన్నాడు. (మత్త. 16:21-23) దేవుడిచ్చిన నియామకాన్ని అంగీకరించి, తన ప్రాణాన్ని బలిగా అర్పించాలని యేసు తీర్మానించుకున్నాడు. యేసులాగే, పౌలు కూడా దేవుని ఇష్టాన్నే చేయాలని తీర్మానించుకున్నాడు. అపొస్తలుడైన పేతురుకు ఉన్నలాంటి మంచి ఉద్దేశాలే, తూరు సహోదరులకు కూడా ఉన్నాయి. కానీ వాళ్లు దేవుని ఇష్టాన్ని అర్థం చేసుకోలేకపోయారు.

యేసును అనుసరించాలంటే మనం త్యాగాలు చేయాలి

10 ఈ లోకంలో చాలామంది వాళ్లకు కష్టం అనిపిస్తే, ఎంత ముఖ్యమైన వాటినైనా పక్కన పెట్టేస్తారు. ఏ నియమాలూ పెట్టకుండా, తమకు నచ్చినట్టు ఉండనిచ్చే మతాన్నే చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ తన శిష్యులు వాళ్లకు భిన్నంగా ఉండాలని యేసు చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా, తన హింసాకొయ్యను మోస్తూ నన్ను అనుసరిస్తూ ఉండాలి.” (మత్త. 16:24) యేసును అనుసరించడమే తెలివైన పని, సరైన పని, కానీ అదంత తేలికేం కాదు.

11. తూరులోని సహోదరులు పౌలును ప్రేమిస్తున్నారని, ఆయనకు మద్దతిస్తున్నారని ఎలా చూపించారు?

11 పౌలు, లూకా, మిగతా సహోదరులు బయల్దేరాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ లూకా రాసిన వివరాలు చదివితే, తూరులోని సహోదరులు పౌలును ఎంతగా ప్రేమించారో, ఆయన పరిచర్యకు మద్దతివ్వాలని ఎంతగా కోరుకున్నారో అర్థమౌతుంది. పురుషులు, స్త్రీలు, పిల్లలతో సహా అందరూ వీడ్కోలు చెప్పడానికి సముద్రం వరకు వచ్చారు. అక్కడ అందరూ మోకరించి ప్రార్థన చేసిన తర్వాత, వీడ్కోలు చెప్పుకున్నారు. ఆ తర్వాత పౌలు, లూకా, మిగతా సహోదరులు ఓడ ఎక్కి తొలెమాయికి వెళ్లారు. అక్కడ సహోదరుల్ని కలిసి ఒకరోజు ఉన్నారు.—అపొ. 21:5-7.

12, 13. (ఎ) యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగే విషయంలో ఫిలిప్పు ఎలా మంచి ఆదర్శం? (బి) నేడు క్రైస్తవ తండ్రులకు ఫిలిప్పు ఎలా మంచి ఆదర్శం?

12 తర్వాత పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు కైసరయకు వెళ్లారని, అక్కడ “మంచివార్త ప్రచారకుడైన ఫిలిప్పు ఇంట్లో” ఉన్నారని లూకా రాశాడు. a (అపొ. 21:8) వాళ్లు ఫిలిప్పును చూసినప్పుడు చాలా సంతోషించి ఉంటారు. దాదాపు 20 ఏళ్ల క్రితం యెరూషలేములో కొత్తగా క్రైస్తవ సంఘం ఏర్పడినప్పుడు, ఆహారాన్ని పంచిపెట్టడానికి అపొస్తలులు నియమించిన వాళ్లలో ఫిలిప్పు కూడా ఉన్నాడు. ఆయన చాలాకాలం నుండి ఉత్సాహంగా ప్రకటిస్తున్నాడు. హింస వచ్చి శిష్యులు చెదిరిపోయినప్పుడు, ఫిలిప్పు సమరయకు వెళ్లి ప్రకటించాడని గుర్తుచేసుకోండి. తర్వాత ఆయన ఇతియోపీయుడైన అధికారికి ప్రకటించి, బాప్తిస్మం ఇచ్చాడు. (అపొ. 6:2-6; 8:4-13, 26-38) దేవుని సేవలో నమ్మకంగా కొనసాగే విషయంలో ఫిలిప్పు మంచి ఆదర్శం!

13 పరిచర్యలో ఫిలిప్పు ఉత్సాహం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే, లూకా ఫిలిప్పు గురించి చెప్తూ “మంచివార్త ప్రచారకుడు” అనే మాటను ఉపయోగించాడు. దాన్నిబట్టి, ఫిలిప్పు కైసరయలో కూడా అంతే ఉత్సాహంగా ప్రకటిస్తున్నాడని అర్థమౌతుంది. అంతేకాదు ఆయన నలుగురు కూతుళ్లు ప్రవచిస్తున్నారు. అంటే, వాళ్లు తమ నాన్న అడుగుజాడల్లో నడిచారని తెలుస్తుంది. b (అపొ. 21:9) తన కుటుంబం యెహోవాను ప్రేమించేలా, ఆయన్ని సేవించేలా సహాయం చేయడానికి ఫిలిప్పు చాలా కష్టపడి ఉంటాడు. నేడు కూడా క్రైస్తవ తండ్రులు ఫిలిప్పులాగే ఉత్సాహంగా పరిచర్య చేస్తూ, తమ పిల్లలకు ఆదర్శం ఉంచాలి. అంతేకాదు, పరిచర్యను ప్రేమించేలా తమ పిల్లలకు సహాయం చేయాలి.

14. పౌలు తన తోటి క్రైస్తవుల్ని కలిసినప్పుడు వాళ్లు ఎలా ప్రయోజనం పొందారు? ఇప్పుడు మన ముందు కూడా ఏ అవకాశాలు ఉన్నాయి?

14 వెళ్లిన ప్రతీచోట పౌలు తోటి విశ్వాసుల కోసం వెతికి, వాళ్లతో సమయం గడిపాడు. వాళ్లు కూడా అంతే ప్రేమగా పౌలును, ఆయనతో ఉన్నవాళ్లను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. అలా వాళ్లు ‘ఒకరి విశ్వాసం వల్ల ఒకరు ప్రోత్సాహం పొందారు’ అనడంలో ఏ సందేహం లేదు. (రోమా. 1:11, 12) నేడు మన ముందు కూడా అలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మన ఇల్లు చిన్నగా, సాదాసీదాగా ఉన్నాసరే ప్రాంతీయ పర్యవేక్షకునికి, ఆయన భార్యకు మనం ఆతిథ్యం ఇవ్వవచ్చు. అలాచేస్తే మనం ఎన్నో ప్రయోజనాలు పొందుతాం.—రోమా. 12:13.

“చనిపోవడానికి కూడా నేను సిద్ధమే” (అపొ. 21:10-14)

15, 16. అగబు ఏ సందేశం చెప్పాడు? అది విన్నవాళ్లకు ఎలా అనిపించింది? అప్పుడు వాళ్లు ఏం చేశారు?

15 పౌలు ఫిలిప్పు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి అగబు వచ్చాడు. ఫిలిప్పు ఇంట్లో ఉన్నవాళ్లకు ఆయన ఒక ప్రవక్త అని తెలుసు. క్లౌదియ చక్రవర్తి కాలంలో, ఆయన ఒక గొప్ప కరువు గురించి ప్రవచించాడు. (అపొ. 11:27, 28) ‘ఇంతకీ అగబు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నాడు?’ అని అక్కడున్న వాళ్లందరూ బహుశా ఆలోచనలో పడివుంటారు. అందరూ చూస్తుండగా, ఆయన పౌలు నడికట్టు తీసుకున్నాడు. నడుం చుట్టూ కట్టుకునే ఈ బెల్టు లాంటి వస్త్రంలో డబ్బులు, చిన్నచిన్న వస్తువులు పెట్టుకోవచ్చు. అగబు ఈ నడికట్టుతో తన కాళ్లు, చేతులు కట్టేసుకుని పిడుగు లాంటి ఈ సందేశం చెప్పాడు: “దేవుడు తన పవిత్రశక్తి ద్వారా ఇలా చెప్తున్నాడు: ‘ఈ నడికట్టు ఎవరిదో అతన్ని యెరూషలేములో ఉన్న యూదులు ఇలా బంధిస్తారు. వాళ్లు అతన్ని అన్యజనుల చేతికి అప్పగిస్తారు.’”—అపొ. 21:11.

16 పౌలు యెరూషలేముకు వెళ్తాడని, అక్కడ యూదులు ఆయన్ని “అన్యజనుల చేతికి అప్పగిస్తారు” అని ఆ ప్రవచనం స్పష్టం చేసింది. ఆ ప్రవచనం విన్న వాళ్లందరి గుండెల్లో రాయిపడినట్టు అయింది. లూకా ఇలా రాశాడు: “ఆ మాటలు విన్నప్పుడు మేము, అక్కడున్నవాళ్లు కలిసి పౌలును యెరూషలేముకు వెళ్లొద్దని వేడుకోవడం మొదలుపెట్టాం. అప్పుడు పౌలు, ‘మీరెందుకు ఇలా ఏడుస్తూ నా గుండెను బలహీనం చేస్తున్నారు? ప్రభువైన యేసు పేరు కోసం యెరూషలేములో బంధించబడడానికే కాదు చనిపోవడానికి కూడా నేను సిద్ధమే’ అన్నాడు.”—అపొ. 21:12, 13.

17, 18. యెరూషలేముకు ఖచ్చితంగా వెళ్లాలనుకుంటున్నానని పౌలు ఎలా చూపించాడు? సహోదరులు ఏం చేశారు?

17 అక్కడి పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. లూకాతో సహా సహోదరులందరూ పౌలును వెళ్లొద్దని బ్రతిమాలుతున్నారు, కొంతమందైతే ఏడుస్తున్నారు కూడా. వాళ్లు తనను ఎంత ప్రేమిస్తున్నారో, తన గురించి ఎంత ఆందోళన పడుతున్నారో పౌలు అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన వాళ్లను నొప్పించకుండా ‘మీరెందుకు నా గుండెను [లేదా, నా నిశ్చయాన్ని] బలహీనం చేస్తున్నారు?’ అని అన్నాడు. ఇంతకుముందు, తూరు సహోదరులు బ్రతిమాలినప్పుడు పౌలు తన నిర్ణయం విషయంలో స్థిరంగా ఉన్నాడు. ఇప్పుడు కైసరయ సహోదరులు కూడా ఎంత బ్రతిమాలినా, కన్నీళ్లు పెట్టుకున్నా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. బదులుగా తను అక్కడికి ఎందుకు వెళ్లాలో వివరించాడు. పౌలు ఎంతో ధైర్యాన్ని, పట్టుదలను చూపించాడు! యేసులాగే, పౌలు కూడా యెరూషలేముకు వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నాడు. (హెబ్రీ. 12:2) పౌలు హతసాక్షిగా చనిపోవాలని అనుకోవట్లేదు. కానీ ఒకవేళ క్రీస్తు అనుచరుడిగా అలా చనిపోవాల్సి వస్తే, అది కూడా పౌలు దృష్టిలో గొప్ప గౌరవమే!

18 మరి సహోదరులు ఏం చేశారు? వాళ్లు పౌలు నిర్ణయాన్ని గౌరవించారు. మనం ఇలా చదువుతాం: “అతను ఎంతకీ ఒప్పుకోకపోయే సరికి, మేము అతన్ని ఒప్పించే ప్రయత్నం మానేసి, ‘యెహోవా ఇష్టమే జరగాలి’ అన్నాం.” (అపొ. 21:14) పౌలు యెరూషలేముకు వెళ్లడం ఇష్టంలేని సహోదరులు, ఆయన్ని ఎలాగైనా ఆపాలని పట్టుబట్టలేదు. వాళ్లు పౌలు మాట విన్నారు, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించారు, యెహోవా ఇష్టాన్ని అర్థం చేసుకుని దాన్ని అంగీకరించారు. అది వాళ్లకు కష్టంగా అనిపించినా, అలా చేశారు. చావు పొంచి ఉన్నాసరే, పౌలు యెరూషలేముకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సహోదరులు ఆయన మీద ప్రేమతో ఆయన్ని ఆపడానికి ప్రయత్నించకపోయుంటే, ఆ ప్రయాణం ఇంకా తేలికై ఉండేది.

19. పౌలుకు జరిగినదాని నుండి మనం ఏ ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు?

19 పౌలుకు జరిగినదాని నుండి మనం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఎవరైనా దేవున్ని సేవించడానికి త్యాగాలు చేస్తుంటే, మనం వాళ్లను ఆపడానికి ప్రయత్నించకూడదు. కేవలం ప్రాణాల మీదికి వచ్చే విషయాల్లోనే కాదు, మిగతా విషయాల్లో కూడా మనం దీన్ని మనసులో పెట్టుకోవాలి. ఉదాహరణకు, పిల్లలు యెహోవా సేవను ఎక్కువగా చేయడం కోసం ఇల్లు విడిచి దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు, చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులకు కష్టంగానే అనిపించింది. అయినా పిల్లల ఉత్సాహాన్ని నీరుగార్చకూడదని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండులో ఉంటున్న ఫిల్లిస్‌ అనే సహోదరి అనుభవం పరిశీలించండి. ఆమె కూతురికి ఆఫ్రికాలో మిషనరీగా సేవచేసే అవకాశం దొరికింది. అప్పుడు ఫిల్లిస్‌కి ఎలా అనిపించింది? ఆమె ఇలా గుర్తుచేసుకుంది: “అప్పుడు నాకు దుఃఖం ముంచుకొచ్చింది, తను నాకు దూరంగా వెళ్లిపోతుందనే మాటను జీర్ణించుకోలేకపోయాను. నాకు ఒకపక్క బాధగా అనిపించినా, తను తీసుకున్న నిర్ణయం బట్టి గర్వంగా అనిపించింది. దాని గురించి నేను చాలా ప్రార్థించాను. అది తన నిర్ణయం, నేను దాన్ని మార్చాలనుకోలేదు. నిజం చెప్పాలంటే, రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వమని నేనే కదా తనకు నేర్పించింది!” ఫిల్లిస్‌ ఇంకా ఇలా చెప్తుంది: “గత 30 ఏళ్లుగా తను వేర్వేరు దేశాల్లో సేవ చేసింది. తను దేవుని సేవలో నమ్మకంగా కొనసాగుతున్నందుకు నేను ప్రతీరోజు యెహోవాకు థాంక్స్‌ చెప్తాను.” త్యాగాలు చేయడానికి ముందుకొచ్చిన సహోదర సహోదరీల్ని ప్రోత్సహించడం ఎంత మంచిదో కదా!

త్యాగాలు చేస్తున్న సహోదర సహోదరీల్ని ప్రోత్సహించడం మంచిది

“సహోదరులు మాకు సంతోషంగా స్వాగతం పలికారు” (అపొ. 21:15-17)

20, 21. పౌలు సహోదరులతో ఉండడానికి ఇష్టపడ్డాడని ఎలా చెప్పవచ్చు? ఆయన ఎందుకలా ఉండాలనుకున్నాడు?

20 పౌలు బయల్దేరడానికి సిద్ధమయ్యాడు. ఆయనతో పాటు కైసరయలో ఉన్న సహోదరులు కూడా వెళ్లారు. స్నేహితుల్లా వాళ్లు ఆయనకు అండగా నిలిచారు. యెరూషలేముకు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి వెళ్లిన ప్రతీచోట పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు సహోదర సహోదరీలతో సమయం గడపడానికి ప్రయత్నించారు. వాళ్లు తూరులో సహోదరుల్ని కలుసుకుని అక్కడ ఏడు రోజులు ఉన్నారు. తొలెమాయిలో సహోదర సహోదరీల్ని పలకరించి ఒకరోజు ఉన్నారు. కైసరయలో ఫిలిప్పు ఇంట్లో చాలా రోజులు ఉన్నారు. తర్వాత పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు యెరూషలేముకు వెళ్తుంటే, కైసరయ నుండి కొంతమంది సహోదరులు వాళ్లకు తోడుగా వెళ్లారు. వాళ్లు యెరూషలేముకు చేరుకున్నప్పుడు, తొలి శిష్యుల్లో ఒకరైన మ్నాసోను ఇంట్లో ఉన్నారు. “సహోదరులు మాకు సంతోషంగా స్వాగతం పలికారు” అని లూకా రాశాడు.—అపొ. 21:17.

21 పౌలు తన సహోదర సహోదరీలతో ఉండడానికి ఇష్టపడ్డాడని అర్థమౌతుంది. నేడు మనం సహోదర సహోదరీల నుండి ఎలా ప్రోత్సాహం పొందుతామో, అపొస్తలుడైన పౌలు కూడా అలాగే ప్రోత్సాహం పొందాడు. యెరూషలేములో యూదులు పౌలును చంపేయాలనేంత కోపంతో ఉన్నారు. ఆ వ్యతిరేకుల్ని ఎదుర్కోవడానికి కావాల్సినంత ప్రోత్సాహం, బలం ఆయనకు దొరికింది.