అధ్యాయం 20
వ్యతిరేకత ఉన్నా “వాక్యం వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది”
దేవుని వాక్యం జయిస్తూ ఉండడానికి అపొల్లో, పౌలు ఎలా కృషి చేశారు?
అపొస్తలుల కార్యాలు 18:23–19:41 ఆధారంగా
1, 2. (ఎ) పౌలుకు, అతని సహచరులకు ఎఫెసులో ఏ ప్రమాదం ఎదురైంది? (బి) ఈ అధ్యాయంలో మనం ఏ విషయాల గురించి పరిశీలిస్తాం?
ఎఫెసులోని వీధుల్లో అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి, జనాలందరూ పరుగులు పెడుతున్నారు. ఒక పెద్ద అల్లరిమూక తయారైంది, వాళ్లు ఏదో అలజడి సృష్టించబోతున్నారు! ఆ అల్లరిమూక పౌలు సహచరుల్లో ఇద్దర్ని పట్టుకుని ఈడ్చుకెళ్తున్నారు. జనాలతో కిటకిటలాడే ముఖ్య వీధి, అక్కడున్న షాపులు ఖాళీ అయిపోయాయి. అందరూ ఆ అల్లరిమూకతో పాటు నగరంలోని నాటకశాలలోకి వెళ్తున్నారు. ఆ నాటకశాల 25,000 మంది పట్టేంత పెద్దది. అసలు ఆ అలజడికి కారణమేంటో చాలామందికి తెలీదు. కానీ తమ ఆరాధ్య దేవత అర్తెమికి, ఆమె ఆలయానికి ఏదో ముప్పు వచ్చిందని వాళ్లు అనుకున్నారు. అందుకే వాళ్లు గొంతు చించుకుని అదేపనిగా ఇలా అరుస్తున్నారు: “ఎఫెసీయుల దేవత అర్తెమి గొప్పది!”—అపొ. 19:34.
2 సాతాను ఈసారి కూడా, అల్లరిమూకల దాడిని ఉపయోగించి, దేవుని రాజ్యం గురించిన మంచివార్త వ్యాప్తి చెందకుండా ఆపాలనుకున్నాడు. అయితే సాతాను పన్నాగాల్లో అది కేవలం ఒకటి మాత్రమే. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల పనిని ఆపడానికి, వాళ్ల ఐక్యతను దెబ్బ తీయడానికి సాతాను ఉపయోగించిన ఇతర పన్నాగాల్ని మనం ఈ అధ్యాయంలో పరిశీలిస్తాం. అంతకన్నా ముఖ్యంగా, సాతాను పన్నాగాలన్నీ బెడిసి కొట్టాయి అని, “యెహోవా వాక్యం ఎంతో గొప్ప రీతిలో వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది” అని తెలుసుకుంటాం. (అపొ. 19:20) ఆ క్రైస్తవులు ఎలా విజయం సాధించగలిగారు? వాళ్ల విజయానికి, నేడు మన విజయానికి ముఖ్యమైన కారణం, మన దేవుడైన యెహోవా. అయితే విజయం సాధించాలంటే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే మన వంతు కృషి మనం చేయాలి. మనం పరిచర్యలో విజయం సాధించడానికి కావాల్సిన లక్షణాల్ని పవిత్రశక్తి సహాయంతో పెంచుకోవచ్చు. ముందుగా, అపొల్లో ఉదాహరణ గురించి పరిశీలిద్దాం.
అపొ. 18:24-28)
“లేఖనాల మీద అతనికి మంచి పట్టు ఉంది” (3, 4. అకుల, ప్రిస్కిల్ల ఏం గుర్తించారు? వాళ్లు అపొల్లోకు ఎలా సహాయం చేశారు?
3 పౌలు తన మూడో మిషనరీ యాత్రను మొదలుపెట్టి ఎఫెసుకు బయల్దేరాడు. ఆ సమయంలో, అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతను ఐగుప్తులోని అలెక్సంద్రియ అనే గొప్ప నగరం నుండి వచ్చాడు. అపొల్లో గురించి చెప్పడానికి చాలా మంచి విషయాలు ఉన్నాయి. అతను ప్రసంగాలు బాగా ఇస్తాడు. అంతేకాదు, “లేఖనాల మీద అతనికి మంచి పట్టు ఉంది.” ఈ అపొల్లో “పవిత్రశక్తి నింపిన ఉత్సాహంతో” సమాజమందిరంలో యూదుల ముందు ధైర్యంగా మాట్లాడాడు.—అపొ. 18:24, 25.
4 అపొల్లో ప్రసంగాల్ని అకుల, ప్రిస్కిల్ల విన్నారు. అతను “యేసుకు సంబంధించిన విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుతూ, బోధిస్తూ” ఉండడం చూసి వాళ్లిద్దరూ ఎంతో సంతోషించి ఉంటారు. అపొల్లో యేసు గురించి సరిగ్గానే బోధిస్తున్నా, అతనికి ఒక ముఖ్యమైన విషయం తెలీదని అకుల, ప్రిస్కిల్ల వెంటనే గుర్తించారు. “యోహాను ప్రకటించిన బాప్తిస్మం గురించి మాత్రమే అతనికి తెలుసు.” అపొల్లో బాగా చదువుకున్నాడు, ప్రసంగాలు చక్కగా ఇస్తాడు; కానీ అకుల, ప్రిస్కిల్ల డేరాలు తయారుచేసే మామూలు పని చేసుకునేవాళ్లు. అయినా అతనికి సహాయం చేయడానికి ఆ జంట వెనకాడలేదు. అకుల, ప్రిస్కిల్ల “అతన్ని తమతో పాటు తీసుకెళ్లి దేవుని మార్గం గురించి ఇంకా ఖచ్చితంగా అతనికి వివరించారు.” (అపొ. 18:25, 26) మరి అపొల్లో ఏం చేశాడు? క్రైస్తవులకు ఉండాల్సిన చాలా ముఖ్యమైన లక్షణాల్లో ఒకటైన వినయాన్ని అతను చూపించాడు.
5, 6. అపొల్లో యెహోవా సేవను ఎందుకు ఇంకా బాగా చేయగలిగాడు? అపొల్లో నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
5 అకుల, ప్రిస్కిల్ల ఇచ్చిన సహాయాన్ని తీసుకోవడం వల్ల అపొల్లో యెహోవా సేవను ఇంకా బాగా చేయగలిగాడు. అతను అకయ ప్రాంతానికి వెళ్లి విశ్వాసులైన వాళ్లకు “ఎంతో సహాయం చేశాడు.” ప్రవచించబడిన మెస్సీయ యేసు కాదు అని వాదించే ఆ ప్రాంతంలోని యూదులకు అపొల్లో మంచి సాక్ష్యం ఇచ్చాడు. లూకా ఇలా రాశాడు: “యేసే క్రీస్తని లేఖనాల నుండి చూపిస్తూ, యూదులు బోధించేది తప్పు అని శక్తివంతమైన మాటలతో అందరిముందు సంపూర్ణంగా రుజువు చేశాడు.” (అపొ. 18:27, 28) క్రైస్తవ సంఘానికి అతను ఒక మంచి దీవెనగా తయారయ్యాడు. “యెహోవా వాక్యం” జయిస్తూ ఉండడానికి అతను కూడా ఒక కారణం. అపొల్లో నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
6 క్రైస్తవులందరికీ ఉండాల్సిన ఒక ముఖ్యమైన లక్షణం వినయం. మనలో ప్రతీ ఒక్కరి దగ్గర ఏదోక వరం ఉంది. కొంతమంది దగ్గర జ్ఞానం, ఇంకొంతమంది దగ్గర అనుభవం, మరికొంతమంది దగ్గర నైపుణ్యాలు ఉన్నాయి. అయితే వీటన్నిటి కన్నా ఎక్కువగా వినయం ఉండాలి. అది లేకపోతే మన వరాలే శాపంలా మారవచ్చు. మనం జాగ్రత్తగా లేకపోతే, మనకున్న వరాల్ని బట్టి మనం గర్విష్ఠుల్లా తయారయ్యే ప్రమాదం ఉంది. (1 కొరిం. 4:7; యాకో. 4:6) మనకు నిజంగా వినయం ఉంటే, వేరేవాళ్లను మనకంటే గొప్పవాళ్లలా చూడడానికి ప్రయత్నిస్తాం. (ఫిలి. 2:3) ఎవరైనా మనల్ని సరిదిద్దితే కోపం తెచ్చుకోం, ఎదుటివాళ్లు చెప్పేవాటిని శ్రద్ధగా వింటాం. పవిత్రశక్తి ద్వారా సంస్థ ఏదైనా కొత్త నిర్దేశం ఇచ్చినప్పుడు, మన సొంత ఆలోచనల్ని పట్టుకుని వేలాడం. మనం వినయంగా ఉన్నంతకాలం యెహోవాకు, ఆయన కుమారునికి ఎంతో ఉపయోగపడతాం.—లూకా 1:51, 52.
7. వినయం చూపించే విషయంలో పౌలు, అపొల్లో మనకు ఎలా ఆదర్శముంచారు?
7 వినయం ఉన్న చోట, పోటీతత్వం అనే మాటే రాదు. తొలి క్రైస్తవుల మధ్య ఐక్యత దెబ్బతీయాలని, వాళ్లందరూ విడిపోతే చూడాలని సాతాను ఎంతగా కోరుకుని ఉంటాడో ఒకసారి ఊహించండి! ఒకవేళ అపొల్లో, పౌలు లాంటి నైపుణ్యవంతమైన, సమర్థవంతమైన బోధకులు ఒకరి మీద ఒకరు ఈర్ష్య పడుతూ, ‘నేను గొప్ప’ అంటే ‘నేను గొప్ప’ అని సంఘంలో పోటీ పడివుంటే సాతానుకు కన్నుల పండుగగా ఉండేది! నిజానికి వాళ్లు ఆ ప్రమాదంలో సులువుగా చిక్కుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, కొరింథులోని క్రైస్తవుల్లో కొంతమంది “నేను పౌలు శిష్యుణ్ణి” అని, ఇంకొంతమంది “నేను అపొల్లో శిష్యుణ్ణి” అని అనడం మొదలుపెట్టారు. మరి సహోదరులు తమవైపే ఉండాలని పౌలు గానీ, అపొల్లో గానీ అనుకున్నారా? లేదు! పౌలు వినయం చూపిస్తూ అపొల్లో చేస్తున్న పనిని మెచ్చుకున్నాడు, అతన్ని గౌరవిస్తూ మరికొన్ని బాధ్యతల్ని అప్పగించాడు. అపొల్లో కూడా పౌలు ఇచ్చిన బాధ్యతల్ని స్వీకరించాడు. (1 కొరిం. 1:10-12; 3:6, 9; తీతు 3:12, 13) కలిసిమెలిసి పని చేయడంలో, వినయం చూపించడంలో పౌలు, అపొల్లో ఎంత మంచి ఆదర్శమో కదా!
‘రాజ్యం గురించి చర్చిస్తూ, ప్రజల్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు’ (అపొ. 18:23; 19:1-10)
8. పౌలు ఎఫెసుకు ఎలా వచ్చాడు? ఎందుకు?
8 మాటిచ్చినట్టే పౌలు ఎఫెసుకు తిరిగొచ్చాడు. a (అపొ. 18:20, 21) కానీ ఆయన ఎలా వచ్చాడో గమనించండి. పౌలు సిరియాలోని అంతియొకయలో ఉన్నాడు. ఆయన అక్కడ నుండి సెలూకయకు వెళ్లి, ఓడ ఎక్కి నేరుగా ఎఫెసుకు వెళ్లవచ్చు. అలాచేస్తే, ఆయన తక్కువ సమయంలోనే ఎఫెసుకు చేరుకోవచ్చు. కానీ ఆయన “సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల గుండా” అంటే, నేల మార్గంలో ప్రయాణిస్తూ ఎఫెసుకు వచ్చాడు. అపొస్తలుల కార్యాలు 18:23, అలాగే 19:1 లో పౌలు చేసిన ప్రయాణాన్ని లెక్కపెడితే దాదాపు 1,600 కిలోమీటర్లు ఉండవచ్చని ఒక అంచనా! ఆయన అంత దూరమైన దారిలో, ఎందుకు కష్టపడి ప్రయాణించాడు? ఎందుకంటే, ‘శిష్యులందర్నీ బలపర్చాలని’ ఆయన కోరుకున్నాడు. (అపొ. 18:23) ఇంతకుముందు చేసిన రెండు మిషనరీ యాత్రల్లాగే, ఈ మిషనరీ యాత్ర కూడా కష్టంగా ఉంటుంది. కానీ తన కష్టం వృథా కాదని ఆయనకు తెలుసు. నేడు ప్రాంతీయ పర్యవేక్షకులు, వాళ్ల భార్యలు అలాంటి స్ఫూర్తినే చూపిస్తున్నారు. ప్రేమతో వాళ్లు చేస్తున్న త్యాగాల్ని మనం తప్పకుండా మెచ్చుకోవాలి.
9. కొంతమంది మళ్లీ ఎందుకు బాప్తిస్మం తీసుకోవాల్సి వచ్చింది? వాళ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
9 పౌలు ఎఫెసుకు రాగానే, బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యుల్లో దాదాపు 12 మందిని కలిశాడు. వాళ్లు యోహాను బోధ ప్రకారం బాప్తిస్మం తీసుకున్నారు, కానీ అది ఇప్పుడు చెల్లదు. అంతేకాదు, వాళ్లకు పవిత్రశక్తి గురించి అంతంత మాత్రమే తెలుసు లేదా అసలేం తెలీకపోవచ్చు. యేసు పేరున బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో పౌలు వాళ్లకు వివరించాడు. వాళ్లు కూడా అపొల్లోలాగే వినయం చూపించి, ఆసక్తిగా నేర్చుకున్నారు. యేసు పేరున బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్లు పవిత్రశక్తిని, కొన్ని అద్భుతమైన వరాల్ని పొందారు. సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని ఇష్టపూర్వకంగా పాటించేవాళ్లు దేవుని ఆశీర్వాదాల్ని పొందుతారని దీన్నిబట్టి స్పష్టంగా అర్థమౌతుంది.—అపొ. 19:1-7.
10. పౌలు సమాజమందిరంలో ప్రకటించడం ఆపేసి, పాఠశాల సభా భవనంలో ప్రకటించడం ఎందుకు మొదలుపెట్టాడు? దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
10 తర్వాత ఏం జరిగింది? పౌలు సమాజమందిరంలో మూడు నెలలు ప్రకటించాడు. ఆయన ‘దేవుని రాజ్యం గురించి చర్చిస్తూ, ప్రజల్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ధైర్యంగా మాట్లాడాడు.’ అయినా, కొంతమంది మొండిగా ఆయన చెప్పేవాటిని వ్యతిరేకించారు. ‘ప్రభువు మార్గాన్ని దూషించే’ అలాంటి వాళ్ల దగ్గర సమయం వృథా చేసుకునే బదులు, పౌలు పాఠశాల సభా భవనంలో రోజూ ప్రసంగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. (అపొ. 19:8, 9) నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా ఆ సమాజమందిరంలో ఉంటే, వాళ్లు ఇప్పుడు ఈ పాఠశాల సభా భవనానికి రావాలి. పౌలులాగే మనం కూడా వాదించే వాళ్లతో, వినడానికి ఇష్టపడని వాళ్లతో సమయం వృథా చేసుకోకూడదు. ప్రోత్సాహాన్ని ఇచ్చే మంచివార్తను వినాలనుకునే గొర్రెల్లాంటి వాళ్లు ఇంకా ఎంతోమంది ఉన్నారు!
11, 12. (ఎ) కష్టపడే విషయంలో, పరిస్థితులకు తగ్గట్టు మారే విషయంలో పౌలు ఎలాంటి ఆదర్శం ఉంచాడు? (బి) నేడు యెహోవాసాక్షులు కూడా ఏం చేస్తున్నారు?
11 పౌలు రోజూ ఆ పాఠశాల సభా భవనంలో ఉదయం దాదాపు 11 గంటల నుండి సాయంత్రం దాదాపు 4 గంటల వరకు ప్రకటించి ఉండవచ్చు. (అపొ. 19:9) బహుశా ఆ సమయంలో ఎండ ఎక్కువగా ఉండేది. ప్రజలు అప్పుడు తమ పనిని ఆపేసి భోజనం చేసేవాళ్లు, విశ్రాంతి తీసుకునే వాళ్లు. ఒకవేళ పౌలు రెండేళ్ల పాటు ప్రతీరోజు అలా ప్రకటించి ఉంటే, ఆయన పరిచర్యలో 3,000 కంటే ఎక్కువ గంటలు (అంటే, నెలకు 125 గంటలు) గడిపి ఉంటాడు. b యెహోవా వాక్యం వ్యాప్తిచెందుతూ, జయిస్తూ ఉండడానికి ఇది ఇంకో కారణం. పౌలు కష్టపడి పనిచేసేవాడు, పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకునేవాడు. ఎక్కడ ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలి అనేదాన్ని ప్రజలకు తగ్గట్టు మార్చుకున్నాడు. దానివల్ల ఏం జరిగింది? “ఆసియా ప్రాంతంలో ఉన్నవాళ్లందరూ అంటే యూదులు, గ్రీకువాళ్లు ప్రభువు వాక్యాన్ని విన్నారు.” (అపొ. 19:10) పౌలు పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇచ్చాడు!
12 నేడు యెహోవాసాక్షులు పౌలులాగే కష్టపడి పనిచేస్తున్నారు, పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకుంటున్నారు. మనం ప్రజలు ఎక్కువగా ఉండే సమయాల్లో, స్థలాల్లో ప్రకటించడానికి ప్రయత్నిస్తాం. మనం వీధుల్లో, మార్కెట్ స్థలాల్లో ప్రకటిస్తాం. టెలిఫోన్ ద్వారా, ఉత్తరాల ద్వారా కూడా సాక్ష్యం ఇస్తాం. ప్రజలు ఇళ్లలో ఎక్కువగా ఎప్పుడు ఉంటారో ఆ సమయంలో ఇంటింటి పరిచర్య చేస్తాం.
చెడ్డదూతలు ఉన్నా, వాక్యం “వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది” (అపొ. 19:11-22)
13, 14. (ఎ) యెహోవా సహాయంతో పౌలు ఏం చేశాడు? (బి) స్కెవ కుమారులు ఏ తప్పు చేశారు? నేడు చర్చీకి వెళ్లే వాళ్లు ఏం అనుకుంటున్నారు?
13 తర్వాత, పౌలు యెహోవా సహాయంతో “ఎన్నో గొప్పగొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు” అని లూకా రాశాడు. ఆఖరికి ప్రజలు పౌలు చేతి రుమాళ్లను, నడికట్లను రోగుల దగ్గరికి తీసుకెళ్లినా వాళ్లు బాగయ్యేవాళ్లు. అంతేకాదు, ప్రజలు వాటితో చెడ్డదూతల్ని కూడా వెళ్లగొట్టేవాళ్లు. c (అపొ. 19:11, 12) చెడ్డదూతలు వెళ్లిపోవడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే కొందరు ఆ పరిస్థితిని ఇంకోలా ఉపయోగించుకోవాలని చూశారు.
14 “చెడ్డదూతల్ని వెళ్లగొడుతూ తిరిగే కొంతమంది యూదులు” పౌలు చేసినట్టే అద్భుతాలు చేయాలనుకున్నారు. వాళ్లలో కొంతమంది యేసు పేరును, పౌలు పేరును ఉపయోగించి చెడ్డదూతల్ని వెళ్లగొట్టాలనుకున్నారు. ఉదాహరణకు, స్కెవ అనే ముఖ్య యాజకుడి ఏడుగురు కుమారులు అలా చేయాలని ప్రయత్నించారు. అప్పుడు “నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు. కానీ మీరెవరు?” అని చెడ్డదూత వాళ్లతో అన్నాడు. అబద్ధాలు చెప్పిన ఆ ఏడుగురి మీదికి చెడ్డదూత పట్టిన వ్యక్తి క్రూరమృగంలా దాడి చేశాడు. దాంతో వాళ్లు బట్టలు లేకుండా, గాయాలతో పారిపోయారు. (అపొ. 19:13-16) ఆ విధంగా “యెహోవా వాక్యం” గొప్ప విజయం సాధించింది. యెహోవా పౌలుకు మాత్రమే ఈ గొప్ప శక్తిని ఇచ్చాడని, అబద్ధ ఆరాధకులకు ఇవ్వలేదని స్పష్టంగా అర్థమైంది. నేడు కూడా, యేసు పేరు ఉపయోగిస్తే చాలు లేదా క్రైస్తవులమని చెప్పుకుంటే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదని ఎన్నో లక్షలమంది అనుకుంటున్నారు. కానీ తండ్రి కోరేవాటిని చేసేవాళ్లకే భవిష్యత్తు విషయంలో ఒక ఆశ ఉంటుందని యేసు స్పష్టంగా చెప్పాడు.—మత్త. 7:21-23.
15. మంత్రతంత్రాల విషయంలో గానీ దానికి సంబంధించిన వస్తువుల విషయంలో గానీ ఎఫెసీయుల ఆదర్శాన్ని మనం ఎలా పాటించవచ్చు?
15 స్కెవ కుమారులకు అద్భుతాలు చేసే శక్తి లేదని అర్థమైనప్పుడు, చాలామంది మంత్ర విద్యను వదిలేసి క్రైస్తవులయ్యారు. ఎఫెసు ప్రజలు మంత్రతంత్రాల్లో బాగా మునిగిపోయి ఉన్నారు. ఆ ప్రజలు మంత్రాలు వేసేవాళ్లు, తాయెత్తులు కట్టుకునేవాళ్లు, అలాగే ఇంద్రజాలానికి సంబంధించిన పుస్తకాల్ని ఉపయోగించేవాళ్లు. అయితే విశ్వాసం ఉంచిన చాలామంది ఎఫెసీయులు ఆ పుస్తకాల్ని బయటికి తీసుకొచ్చి అందరి ముందు కాల్చేశారు. వాటి విలువ మన కాలంలో ఎన్నో లక్షల రూపాయలు ఉంటుంది. d లూకా ఇలా రాశాడు: “అలా యెహోవా వాక్యం ఎంతో గొప్ప రీతిలో వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది.” (అపొ. 19:17-20) అబద్ధమతం మీద, మంత్రతంత్రాల మీద యెహోవాకు, అలాగే ఆయన నిజమైన ఆరాధకులకు ఇది ఎంత గొప్ప విజయమో కదా! విశ్వాసం చూపించిన ఆ ఎఫెసు ప్రజలు నేడు మనకు ఎంతో మంచి ఆదర్శం. నేడు కూడా లోకంలో ఎక్కడ చూసినా మంత్రతంత్రాలు కనిపిస్తున్నాయి. మన దగ్గర వాటికి సంబంధించిన వస్తువు ఏదైనా ఉందని తెలిస్తే, అది ఎంత విలువైనదైనా సరే ఎఫెసీయుల్లాగే దాన్ని వెంటనే పడేస్తాం! అలాంటి అసహ్యమైన పనులకు మనం దూరంగా ఉంటాం.
“పెద్ద అలజడి రేగింది” (అపొ. 19:23-41)
16, 17. (ఎ) దేమేత్రి ఎఫెసులో ఎలా అలజడి రేపాడో వివరించండి. (బి) ఎఫెసీయులు ఎలా ప్రవర్తించారు?
16 సాతాను ఉపయోగించిన ఇంకో పన్నాగం గురించి చెప్తూ లూకా ఇలా రాశాడు: “ప్రభువు మార్గం గురించి పెద్ద అలజడి రేగింది.” నిజంగానే ఒక పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. e (అపొ. 19:23) దానికి కారణం వెండి పనులు చేసుకునే దేమేత్రి. అతను తన తోటి పనివాళ్లందర్నీ పోగుచేశాడు. అతను ముందుగా వాళ్లు అమ్ముతున్న వెండి విగ్రహాల వల్లే వాళ్లకు డబ్బులు వస్తున్నాయని గుర్తుచేశాడు. క్రైస్తవులు విగ్రహాల్ని ఆరాధించరు కాబట్టి, పౌలు చెప్తున్న సందేశం వల్ల వాళ్ల వ్యాపారానికి పెద్ద నష్టం వస్తుందని అందర్నీ రెచ్చగొట్టాడు. అంతేకాదు అక్కడున్న వాళ్లందరూ తమ నగరమే, తమ దేశమే అన్నిటి కన్నా గొప్పవని అనుకుంటారని ఈ దేమేత్రికి తెలుసు. కాబట్టి, ప్రజలందరూ ఈ పౌలు చెప్పేది వింటే తమ అర్తెమి దేవికి, ప్రపంచమంతటా పేరున్న ఆమె ఆలయానికి “విలువే లేకుండా” పోతుందని అన్నాడు.—అపొ. 19:24-27.
17 దేమేత్రి అనుకున్నది సాధించాడు. వెండి పని చేసే వాళ్లందరూ “ఎఫెసీయుల దేవత అర్తెమి గొప్పది!” అని అరవడం మొదలుపెట్టారు. దాంతో ఈ అధ్యాయం మొదట్లో చూసినట్టు నగరమంతా గందరగోళంగా మారింది, అల్లరిమూక గొడవ చేయడం మొదలుపెట్టింది. f పౌలు ప్రాణాలకు తెగించి, నాటకశాలలోకి వెళ్లి జనాలతో మాట్లాడాలనుకున్నాడు. కానీ ఆ నాటకశాలలోకి వెళ్లొద్దని శిష్యులు ఆయన్ని బ్రతిమాలారు. అప్పుడు అలెక్సంద్రు అనే యూదుడు ముందుకొచ్చి జనాలతో మాట్లాడాలనుకున్నాడు. అతను యూదులకు, క్రైస్తవులకు తేడా ఉందని వివరించాలని అనుకుని ఉండవచ్చు. కానీ జనాలెవ్వరూ అతను చెప్పేది వినే పరిస్థితిలో లేరు. అతను యూదుడు అని గుర్తుపట్టినప్పుడు వాళ్లు అతన్ని అస్సలు మాట్లాడనివ్వకుండా “ఎఫెసీయుల దేవత అర్తెమి గొప్పది!” అని రెండు గంటల పాటు గట్టిగట్టిగా అరిచారు. అలాంటి మత పిచ్చి ఉన్నవాళ్లు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్లు ఎదుటివాళ్లు చెప్పేది అస్సలు వినిపించుకోరు.—అపొ. 19:28-34.
18, 19. (ఎ) ఎఫెసు నగర ముఖ్య అధికారి అల్లరిమూకను ఎలా శాంతపర్చాడు? (బి) మన కాలంలో ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు మనల్ని కొన్నిసార్లు ఎలా కాపాడుతున్నాయి? వాళ్లు మనకు సహాయం చేయాలంటే, మన ప్రవర్తన ఎలా ఉండాలి?
18 చివరికి ఆ నగర ముఖ్య అధికారి ప్రజల్ని శాంతపర్చాడు. అతను ఈ సమస్యను తెలివిగా పరిష్కరించాడు. అతను ముందుగా వాళ్ల ఆలయానికి గానీ, దేవతకు గానీ క్రైస్తవులు ఎలాంటి హానీ చేయలేరని హామీ ఇచ్చాడు. తర్వాత పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు అర్తెమి ఆలయానికి వ్యతిరేకంగా ఏ నేరమూ చేయలేదని అన్నాడు. పౌలు, ఆయనతో ఉన్నవాళ్లు చేసేది ఒకవేళ వాళ్లకు నచ్చకపోతే, దాన్ని అధికారుల ముందుకు తీసుకెళ్లాలని కూడా చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యంగా, వాళ్లు ఇలా గొడవ చేస్తూ గుమికూడడం రోమా చట్టానికి వ్యతిరేకం అని గుర్తుచేశాడు. అప్పుడు వాళ్లు వెనక్కి తగ్గారు. అలా ఆ గుంపంతటినీ అతను చెదరగొట్టాడు. ముందూ-వెనకా ఆలోచించకుండా కోపం తెచ్చుకున్న ఆ ప్రజలు, నగర అధికారి తెలివిగా అన్న మాటలకు వెంటనే శాంతించారు.—అపొ. 19:35-41.
19 ఇలా అధికారులు యేసు శిష్యుల్ని కాపాడడం ఇదే మొదటిసారి కాదు, అలాగని ఇదే చివరిసారి కాదు. అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో దాని గురించే చూశాడు. చివరి రోజుల్లో సాతాను యేసు శిష్యుల మీద హింసను నదిలా వెళ్లగక్కుతాడు. దాన్ని భూమి, అంటే ప్రభుత్వాలు లేదా న్యాయ వ్యవస్థలు మింగేస్తాయి. (ప్రక. 12:15, 16) ఆ దర్శనం నేడు మన కాలంలో నెరవేరుతోంది. ఆరాధన కోసం కలుసుకునే విషయంలో, మంచివార్త చెప్పే విషయంలో యెహోవాసాక్షుల హక్కుల్ని నిజాయితీగల జడ్జీలు చాలా కేసుల్లో కాపాడారు. అలాంటి విజయాలకు మన ప్రవర్తన కూడా ఒక కారణం. పౌలు మంచి ప్రవర్తనను బట్టి ఎఫెసులోని కొంతమంది ప్రభుత్వ అధికారులు ఆయన్ని గౌరవించారు, ఆయన్ని కాపాడాలని అనుకున్నారు. (అపొ. 19:31) మనం కూడా నిజాయితీగా, మంచిగా నడుచుకుంటే మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని గౌరవిస్తారు. అది మనకు ఎప్పుడు, ఎలా సహాయ పడుతుందో తెలీదు.
20. (ఎ) మొదటి శతాబ్దంలో, అలాగే నేడు యెహోవా వాక్యం సాధించే విజయాల్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? (బి) మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు?
20 మొదటి శతాబ్దంలో యెహోవా వాక్యం ఎలా “వ్యాప్తిచెందుతూ, జయిస్తూ” వచ్చిందో చదివినప్పుడు ఒళ్లు పులకరించి పోతుంది కదా! నేడు కూడా అలాంటి విజయాల వెనక యెహోవా ఉన్నాడని చూసినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. అలాంటి విజయాల కోసం మీ వంతు కృషి మీరు చేస్తారా? మీరు చేసే కృషి చిన్నదిగా అనిపించినా అది చాలా విలువైనది. ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న పాఠాల్ని గుర్తుపెట్టుకోండి. వినయంగా ఉండండి, సంస్థ ఇచ్చే నిర్దేశాన్ని వెంటనే పాటించండి, కష్టపడి పనిచేయండి, మంత్రతంత్రాలకు దూరంగా ఉండండి. నిజాయితీగా, మర్యాదగా ఉంటూ మీ ప్రవర్తన ద్వారా మంచి సాక్ష్యం ఇవ్వడానికి చేయగలిగినదంతా చేయండి.
a “ ఎఫెసు—ఆసియా ప్రాంతానికి రాజధాని” అనే బాక్సు చూడండి.
b అంతేకాదు, పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు 1 కొరింథీయులు రాశాడు.
c చెమట తన కళ్లల్లోకి కారకుండా ఉండడానికి పౌలు తన నుదుటికి రుమాలు కట్టుకొని ఉంటాడు. పౌలు నడికట్టు కట్టుకోవడాన్ని బట్టి ఆయన తన ఖాళీ సమయాల్లో, బహుశా ఉదయాన్నే డేరాలు తయారుచేసే పని చేసి ఉంటాడని చెప్పవచ్చు.—అపొ. 20:34, 35.
d ఆ పుస్తకాల విలువ 50,000 వెండి నాణేలు అని లూకా రాశాడు. ఒకవేళ అవి దేనారాలైతే, వాటిని సంపాదించడానికి ఆ కాలంలో ఒక వ్యక్తి 50,000 రోజులు పనిచేయాలి. అంటే వారానికి ఏడు రోజులు చొప్పున దాదాపు 137 సంవత్సరాల పాటు పనిచేయాలి.
e పౌలు ఈ సందర్భం గురించే మాట్లాడుతూ, “ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాం” అని కొరింథీయులకు రాశాడని కొంతమంది అంటారు. (2 కొరిం. 1:8) అయితే ఇంతకన్నా ప్రమాదకరమైన ఇంకో సందర్భాన్ని మనసులో పెట్టుకుని పౌలు ఆ మాటలు రాసి ఉండవచ్చు. పౌలు 1 కొరింథీయులు 15:32 లో ‘ఎఫెసులో క్రూరమృగాలతో పోరాడాను’ అని రాశాడు. పౌలు ఎఫెసులోని క్రీడా ప్రాంగణంలో నిజంగానే జంతువులతో పోరాడి ఉండవచ్చు లేదా అలాంటి మనుషుల నుండి వచ్చిన వ్యతిరేకతను ఎదుర్కొని ఉండవచ్చు.
f పని చేసుకునేవాళ్ల గుంపులు లేదా యూనియన్లు చాలా శక్తివంతమైనవి. దాదాపు 100 ఏళ్ల తర్వాత వంటపని చేసుకునేవాళ్ల గుంపు ఒకటి ఎఫెసులో అలాంటి అలజడినే రేపింది.