అధ్యాయం 3
“పవిత్రశక్తితో నిండిపోయారు”
పెంతెకొస్తు రోజున పవిత్రశక్తి కుమ్మరించబడినప్పుడు జరిగిన విషయాలు
అపొస్తలుల కార్యాలు 2:1-47 ఆధారంగా
1. పెంతెకొస్తు పండుగ రోజున యెరూషలేము ఎలా ఉందో వివరించండి.
యెరూషలేము వీధులన్నీ చాలా సందడిగా ఉన్నాయి. a ఆలయంలో బలిపీఠం నుండి పొగ పైకి లేస్తుండగా, లేవీయులు హల్లేల్ కీర్తనలు పాడుతున్నారు (113-118 కీర్తనల్ని హల్లేల్ కీర్తనలు అంటారు). వేర్వేరు చోట్ల నుండి వచ్చిన ప్రజలతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. వాళ్లంతా చాలా దూరం నుండి అంటే ఏలాము, మెసొపొతమియ, కప్పదొకియ, పొంతు, ఐగుప్తు, రోము వంటి దేశాల నుండి వచ్చారు. b ఇంతకీ వాళ్లు ఎందుకు వచ్చారు? పెంతెకొస్తు పండుగకి వచ్చారు. ఆ రోజున ‘మొదటి పంటను యెహోవాకు అర్పిస్తారు.’ (సంఖ్యా. 28:26) ప్రతీ సంవత్సరం బార్లీ కోత ముగిసి, గోధుమ కోత మొదలయ్యే సమయంలో ఈ పండుగ జరుపుకుంటారు. అది సందడిసందడిగా, సంతోషంగా ఉండే సందర్భం.
2. క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజున ఏం జరిగింది?
2 అది క్రీస్తు శకం 33 వసంత కాలం, ఆదివారం, ఉదయం దాదాపు 9 గంటలు. అది చరిత్రలో నిలిచిపోయే రోజు. దాదాపు 120 మంది శిష్యులు ఒక ఇంటి పైనున్న మేడగదిలో కూర్చున్నారు. ఉన్నట్టుండి “ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. అది వేగంగా వీచే బలమైన గాలి శబ్దంలా ఉంది.” (అపొ. 2:2) ఆ ఇల్లంతా హోరుమనే శబ్దంతో నిండిపోయింది. తర్వాత ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. వాళ్లకు అగ్ని లాంటి నాలుకలు కనిపించాయి. వాళ్లలో ఒక్కొక్కరి మీద ఒక్కో నాలుక వాలింది. c అప్పుడు శిష్యులు “పవిత్రశక్తితో నిండిపోయి” వేర్వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు! శిష్యులు ఆ ఇంటి నుండి బయటికి వచ్చి, వీధుల్లో ఉన్న ప్రజలతో మాట్లాడారు. అక్కడికి వచ్చిన “ప్రతీ ఒక్కరి మాతృభాషలో” శిష్యులు మాట్లాడడం విని అందరూ ఆశ్చర్యపోయారు.—అపొ. 2:1-6.
3. (ఎ) క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజు యెహోవా ఆరాధనలో ఒక మైలురాయి అని ఎందుకు చెప్పవచ్చు? (బి) పేతురు తన ప్రసంగం ద్వారా ‘పరలోక రాజ్యం తాళంచెవుల్లో’ మొదటిదాన్ని ఎలా ఉపయోగించాడు?
3 క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజు యెహోవా ఆరాధనలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు, అంటే అభిషిక్తులతో ఏర్పడిన క్రైస్తవ సంఘం పుట్టింది. (గల. 6:16) అయితే ఆ రోజున, వేరే ముఖ్యమైన సంఘటనలు కూడా జరిగాయి. పేతురు ప్రసంగించినప్పుడు, ‘పరలోక రాజ్యం తాళంచెవుల్లో’ మొదటిదాన్ని ఉపయోగించాడు. ఆ మూడు తాళంచెవుల్లో ఒక్కోటి, ఒక్కో గుంపు ప్రజలకు ప్రత్యేక అవకాశాలు తెరుస్తుంది. (మత్త. 16:18, 19) మొదటి తాళంచెవి యూదులకు, యూదులుగా మారిన అన్యజనులకు మంచివార్తను అంగీకరించి, దేవుని పవిత్రశక్తి చేత అభిషేకించబడే అవకాశం తెరిచింది. d అలా వాళ్లు ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో భాగమౌతారు, ఆ తర్వాత మెస్సీయ రాజ్యంలో రాజులుగా, యాజకులుగా సేవ చేయగలుగుతారు. (ప్రక. 5:9, 10) కొంతకాలానికి ఆ అవకాశం సమరయులకు, చివరికి అన్యులకు తెరుచుకుంటుంది. క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజున జరిగిన ముఖ్యమైన సంఘటనల నుండి నేడు మనం ఏం నేర్చుకోవచ్చు?
“శిష్యులందరూ ఒకే చోట ఉన్నారు” (అపొ. 2:1-4)
4. క్రీస్తు శకం 33 లో మొదలైన క్రైస్తవ సంఘానికి, నేటి క్రైస్తవ సంఘానికి పోలికలు ఏంటి?
4 “శిష్యులందరూ ఒకే చోట,” అంటే ఒక మేడగదిలో ఉన్నారు, వాళ్లంతా పవిత్రశక్తితో అభిషేకించబడ్డారు; అలా దాదాపు 120 మందితో క్రైస్తవ సంఘం మొదలైంది. (అపొ. 2:1) ఆ రోజు సాయంత్రం కల్లా, వేలమంది బాప్తిస్మం తీసుకుని క్రైస్తవ సంఘంలో చేరారు. అది కేవలం ఆరంభం మాత్రమే. అలా చిన్న మొక్కలా మొదలైన క్రైస్తవ సంఘం, ఈరోజు వరకు అభివృద్ధి అవుతూనే ఉంది! నేడు కూడా క్రైస్తవ సంఘంలోని దైవభక్తి గల స్త్రీలను, పురుషులను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. వాళ్లు అంతం వచ్చే ముందు ‘అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా రాజ్య సువార్తను భూమంతటా’ ప్రకటిస్తున్నారు.—మత్త. 24:14.
5. మొదటి శతాబ్దంలో గానీ, ఇప్పుడు గానీ క్రైస్తవ సంఘంతో సహవసించడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి?
5 అంతేకాదు అభిషిక్తులకు, అలాగే తర్వాతి కాలంలో వచ్చిన ‘వేరే గొర్రెలకు’ క్రైస్తవ సంఘం ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది. (యోహా. 10:16) సంఘంలో దొరికే అలాంటి ప్రోత్సాహాన్ని పౌలు చాలా విలువైనదిగా చూశాడు. అందుకే ఆయన రోములో ఉన్న క్రైస్తవులకు ఇలా రాశాడు: “మిమ్మల్ని చూడాలని, మీరు స్థిరపడేలా దేవునికి సంబంధించిన ఏదైనా వరాన్ని మీతో పంచుకోవాలని నేను ఎంతో తపించిపోతున్నాను; మనం ఒకరి విశ్వాసం వల్ల ఒకరం ప్రోత్సాహం పొందాలన్నదే నా ఉద్దేశం.”—రోమా. 1:11, 12.
6, 7. అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యం ఇవ్వమని యేసు అప్పగించిన పనిని, ఇప్పుడున్న క్రైస్తవ సంఘం ఎలా చేస్తుంది?
6 మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘం చేసిన పనినే, ఇప్పుడున్న క్రైస్తవ సంఘం కూడా చేస్తుంది. యేసు తన అనుచరులకు ఈ పనిని అప్పగించాడు: “మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.” (మత్త. 28:19, 20) యేసు అప్పగించిన పని కష్టమైనదే అయినా అది సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది.
7 ఆ పని చేయడానికి దేవుడు ఇప్పుడు యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘాన్ని ఉపయోగించుకుంటున్నాడు. వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలకు ప్రకటించడం కష్టమే అయినా, యెహోవాసాక్షులు 1,000 కంటే ఎక్కువ భాషల్లో బైబిలు ప్రచురణలు తయారు చేస్తున్నారు. మీరు క్రైస్తవ సంఘంతో క్రమంగా సహవసిస్తూ ప్రకటించే పనిలో, శిష్యుల్ని చేసే పనిలో పాల్గొంటున్నారా? అలాగైతే, మీరు ఎంతో సంతోషించవచ్చు. ఎందుకంటే, ఈ రోజుల్లో యెహోవా పేరు గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చే గొప్ప అవకాశాన్ని పొందిన కొద్దిమందిలో మీరూ ఒకరు!
8. క్రైస్తవ సంఘం ఒక బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు?
8 ఈ కష్టమైన కాలాల్ని సంతోషంగా సహించడానికి, యెహోవా దేవుడు మనకు ప్రపంచవ్యాప్త సహోదర బృందాన్ని ఇచ్చాడు. పౌలు హెబ్రీ క్రైస్తవులకు ఇలా రాశాడు: “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు మానేయడం కొందరికి అలవాటు, కానీ మనం అలా మానేయకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం, ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా ఇవన్నీ చేద్దాం.” (హెబ్రీ. 10:24, 25) మీరు వేరేవాళ్లను ప్రోత్సహించడానికి, వేరేవాళ్ల నుండి మీరు ప్రోత్సాహం పొందడానికి యెహోవా ఇచ్చిన బహుమతే, క్రైస్తవ సంఘం. కాబట్టి సహోదర సహోదరీలకు దగ్గరగా ఉండండి. కూటాల్ని ఎప్పుడూ మానేయకండి!
‘ప్రతీ ఒక్కరి మాతృభాషలో మాట్లాడడం విన్నారు’ (అపొ. 2:5-13)
9, 10. వేరే భాష వాళ్లకు ప్రకటించడానికి కొంతమంది ఏం చేస్తున్నారు?
9 క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజున యూదులు, యూదులుగా మారిన అన్యజనులు ఎంత ఆశ్చర్యంలో మునిగిపోయి ఉంటారో ఆలోచించండి. వాళ్లలో చాలామందికి బహుశా గ్రీకు భాష గానీ, హీబ్రూ భాష గానీ తెలుసు. అయినా, శిష్యులు అక్కడికి వచ్చిన “ప్రతీ ఒక్కరి మాతృభాషలో” మాట్లాడుతున్నారు. (అపొ. 2:6) మంచివార్తను తమ సొంత భాషలో విన్నప్పుడు, అది ఖచ్చితంగా వాళ్ల హృదయాల్ని తాకి ఉంటుంది. కానీ అద్భుతరీతిలో భాషల్ని మాట్లాడే వరం ఇప్పుడు క్రైస్తవులకు లేదు. అయినా వాళ్లు మంచివార్తను వేర్వేరు భాషల ప్రజలకు ప్రకటించడానికి కృషిచేస్తున్నారు. ఎలా? కొంతమంది ఒక కొత్త భాష నేర్చుకుని, దగ్గర్లో ఉన్న వేరే భాషా సంఘానికి వెళ్తున్నారు. ఇంకొంతమందైతే, వేరే దేశానికి వెళ్లి సేవ చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి.
10 క్రిస్టీన్ అనే సహోదరి ఉదాహరణ గమనించండి. ఆమె ఇంకో ఏడుగురు సాక్షులతో కలిసి గుజరాతీ భాష నేర్చుకుంది. తనతో కలిసి పనిచేసే ఒక అమ్మాయి గుజరాతీ అని తెలిసినప్పుడు, సహోదరి ఆ అమ్మాయిని గుజరాతీ భాషలో పలకరించింది. ఆ అమ్మాయిని అది ఎంతో ఆకట్టుకుంది. అంత కష్టపడి గుజరాతీ భాష ఎందుకు నేర్చుకుంటున్నారో ఆమె తెలుసుకోవాలనుకుంది. అలా సహోదరి మంచి సాక్ష్యం ఇవ్వగలిగింది. ఆ అమ్మాయి సహోదరితో ఇలా అంది: “మీరు ఇంత కష్టమైన భాష నేర్చుకుంటున్నారంటే, ఖచ్చితంగా మీ దగ్గర ఏదో ముఖ్యమైన విషయం ఉండే ఉంటుంది.”
11. వేరే భాష వాళ్లకు ప్రకటించడానికి మనం ఏం చేయవచ్చు?
11 నిజమే, అందరూ వేరే భాష నేర్చుకోలేకపోవచ్చు. అయినా మనందరం వేరే భాష వాళ్లకు ప్రకటించవచ్చు. ఎలా? ఒకటి, మీ ప్రాంతంలో వేరే భాష వాళ్లు ఉంటే, JW లాంగ్వేజ్ యాప్ ఉపయోగించి వాళ్ల భాషలో ఎలా పలకరించాలో నేర్చుకోవచ్చు. అంతేకాదు వాళ్ల ఆసక్తిని పెంచడానికి, ఆ భాషలో ఇంకొన్ని మాటల్ని కూడా నేర్చుకోవచ్చు. రెండు, వాళ్లకు jw.org గురించి చెప్పవచ్చు. అందులో వాళ్ల భాషలో ఉన్న రకరకాల వీడియోల్ని, ప్రచురణల్ని చూపించవచ్చు. వేర్వేరు దేశాల నుండి వచ్చిన ప్రజలకు వాళ్ల “మాతృభాషలో” మంచివార్త ప్రకటించినప్పుడు, మొదటి శతాబ్దంలోని శిష్యులు ఎంతో సంతోషించారు. పరిచర్యలో JW లాంగ్వేజ్ యాప్, jw.org లాంటివి ఉపయోగించినప్పుడు మనం కూడా అంతే సంతోషించవచ్చు.
‘పేతురు లేచి నిలబడ్డాడు’ (అపొ. 2:14-37)
12. (ఎ) యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజున ఎలా నెరవేరాయి? (బి) యేసు చెప్పిన ఏ మాటల్ని బట్టి, శిష్యులు యోవేలు ప్రవచన నెరవేర్పు కోసం ఎదురుచూస్తున్నారు?
12 పేతురు “లేచి నిలబడి,” వేర్వేరు దేశాల నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడాడు. (అపొ. 2:14) దేవుని సహాయంతోనే శిష్యులు అద్భుతరీతిలో వేర్వేరు భాషలు మాట్లాడుతున్నారని, అలా యోవేలు ప్రవక్త చెప్పిన ఈ మాటలు నెరవేరాయని పేతురు వివరించాడు: “నేను నా పవిత్రశక్తిని అన్నిరకాల ప్రజల మీద కుమ్మరిస్తాను.” (యోవే. 2:28) పరలోకానికి వెళ్లకముందు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: ‘నేను తండ్రిని అడుగుతాను, ఆయన మీకు ఇంకో సహాయకుణ్ణి ఇస్తాడు.’ ఆ సహాయకుడు ఎవరో కాదు, ‘పవిత్రశక్తే’ అని కూడా యేసు చెప్పాడు.—యోహా. 14:16, 17.
13, 14. ప్రజల హృదయాల్ని తాకేలా పేతురు ఎలా మాట్లాడాడు? మనం కూడా ఆయనలాగే ఏం చేయవచ్చు?
13 పేతురు తన ప్రసంగం చివర్లో స్థిరంగా ఇలా అన్నాడు: “మీరు కొయ్య మీద శిక్ష వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడని ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి.” (అపొ. 2:36) నిజమే, పేతురు మాటల్ని వింటున్న చాలామంది, యేసును కొయ్య మీద వేలాడదీసినప్పుడు అక్కడ లేరు. కానీ, ఒక జనాంగంగా వాళ్లు చేసిన తప్పు గురించి పేతురు మాట్లాడుతున్నాడు. అయినా, పేతురు తన తోటి యూదులతో గౌరవపూర్వకంగా, హృదయాల్ని తాకేలా మాట్లాడాడని గమనించండి. ప్రజల్ని తప్పుపట్టాలని కాదుగానీ, వాళ్లు పశ్చాత్తాపపడేలా చేయాలన్నదే ఆయన ఉద్దేశం. పేతురు మాటలు విని ప్రజలకు కోపమొచ్చిందా? లేదు. నిజానికి ఆయన మాటలు విన్నప్పుడు, వాళ్లకు “గుండెల్లో పొడిచినట్టు అనిపించింది.” దాంతో వాళ్లు, “ఇప్పుడు మేము ఏంచేయాలి?” అని అడిగారు. బహుశా గౌరవపూర్వకంగా మాట్లాడడం వల్లే పేతురు చాలామంది హృదయాల్ని చేరుకోగలిగాడు, పశ్చాత్తాపపడేలా వాళ్లను కదిలించగలిగాడు.—అపొ. 2:37.
14 పేతురులాగే మనం కూడా హృదయాల్ని తాకేలా మాట్లాడవచ్చు. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్లు చెప్పే ప్రతీ తప్పుడు అభిప్రాయాన్ని మనం సరిచేయాల్సిన అవసరం లేదు. బదులుగా వాళ్లు, అలాగే మనం అంగీకరించే విషయాల్ని మాట్లాడవచ్చు. మనం అలా చేస్తే, నెమ్మది నెమ్మదిగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేలా వాళ్లకు సహాయం చేయగలుగుతాం. మనం పేతురులా మాట్లాడితే, మంచి మనసున్న వాళ్లు చక్కగా స్పందించే అవకాశం ఉంది.
‘మీలో ప్రతీ ఒక్కరు బాప్తిస్మం తీసుకోండి’ (అపొ. 2:38-47)
15. (ఎ) పేతురు ఏమన్నాడు? అప్పుడు ప్రజలు ఏం చేశారు? (బి) పెంతెకొస్తు రోజున మంచివార్తను విన్న వేలమంది, అదే రోజున బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులని ఎందుకు చెప్పవచ్చు?
15 క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజు చాలా అద్భుతంగా సాగింది. ఆ రోజు పేతురు యూదులతో, యూదులుగా మారిన అన్యజనులతో ఇలా అన్నాడు: ‘పశ్చాత్తాపపడండి, మీలో ప్రతీ ఒక్కరు బాప్తిస్మం తీసుకోండి.’ (అపొ. 2:38) ఫలితంగా దాదాపు 3,000 మంది, బహుశా యెరూషలేములో లేదా దాని చుట్టుపక్కల ఉన్న కోనేరుల్లో బాప్తిస్మం తీసుకున్నారు. e ఇదేదో తొందరపాటుగా, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా? దీన్నిబట్టి బైబిలు విద్యార్థులు, సాక్షుల పిల్లలు సిద్ధంగా లేకపోయినా సరే బాప్తిస్మం తీసుకోవడానికి తొందరపడాలా? ఎంతమాత్రం కాదు. గుర్తుంచుకోండి: క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజున బాప్తిస్మం తీసుకున్న యూదులకు, యూదులుగా మారిన అన్యజనులకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివే అలవాటు ఉంది. అలాగే, వాళ్లు యెహోవాకు సమర్పించుకున్న జనాంగానికి చెందినవాళ్లు. అంతేకాదు, వాళ్లు అప్పటికే యెహోవాను ఆరాధించే విషయంలో ఉత్సాహం చూపించారు. ఉదాహరణకు, కొంతమందైతే ఎంతో దూరం ప్రయాణించి, సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ పండుగ కోసం యెరూషలేముకు వచ్చారు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తుకు ఉన్న ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకున్న తర్వాత, ఇప్పుడు వాళ్లు క్రీస్తు శిష్యులుగా బాప్తిస్మం తీసుకుని, ఒక కొత్త పద్ధతిలో దేవుణ్ణి సేవించడానికి సిద్ధంగా ఉన్నారు.
16. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎలా ప్రేమ చూపించారు, త్యాగాలు చేశారు?
16 వాళ్ల మీద యెహోవా ఆశీర్వాదం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, బైబిలు ఇలా చెప్తుంది: “విశ్వాసులైన వాళ్లందరూ కలిసి ఉన్నారు, తమకు ఉన్నవన్నీ ఒకరితో ఒకరు పంచుకున్నారు. వాళ్లు తమ భూముల్ని, ఆస్తిపాస్తుల్ని అమ్మి, వచ్చిన డబ్బును అందరికీ వాళ్లవాళ్ల అవసరాన్ని బట్టి పంచిపెడుతూ ఉన్నారు.” f (అపొ. 2:44, 45) ఖచ్చితంగా నిజ క్రైస్తవులందరూ వాళ్లలాగే ప్రేమ చూపించాలని, త్యాగాలు చేయాలని కోరుకుంటారు.
17. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడానికి ముందు చేయాల్సిన కొన్ని పనులు ఏంటి?
17 ఒక వ్యక్తి యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకునే ముందు కొన్ని పనులు చేయాలని బైబిలు చెప్తుంది. ముందుగా అతను దేవుని వాక్యంలో ఉన్న విషయాల్ని తెలుసుకోవాలి. (యోహా. 17:3) విశ్వాసం చూపించాలి, అలాగే చేసిన తప్పుల విషయంలో నిజంగా బాధపడుతూ పశ్చాత్తాపపడాలి. (అపొ. 3:19) తర్వాత మార్పులు చేసుకుని, దేవుని ఇష్టానికి తగ్గట్టు మంచిపనులు చేయడం మొదలుపెట్టాలి. (రోమా. 12:2; ఎఫె. 4:23, 24) ఆ తర్వాత అతను ప్రార్థనలో దేవునికి సమర్పించుకుని, చివరికి బాప్తిస్మం తీసుకుంటాడు.—మత్త. 16:24; 1 పేతు. 3:21.
18. బాప్తిస్మం తీసుకున్న క్రీస్తు శిష్యులకు ఏ అమూల్యమైన అవకాశం ఉంది?
18 మీరు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్న క్రీస్తు శిష్యులా? అలాగైతే, మీరు సంతోషించవచ్చు. ఎందుకంటే, యెహోవా మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల మీద పవిత్రశక్తిని కుమ్మరించినట్టే, పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చేలా, తన ఇష్టం చేసేలా మిమ్మల్ని కూడా గొప్పగా ఉపయోగించుకోగలడు! అది నిజంగా ఒక అమూల్యమైన అవకాశం.
a “ యెరూషలేము—యూదా మతానికి కేంద్రం” అనే బాక్సు చూడండి.
b “ రోము—ఒక మహా సామ్రాజ్యానికి రాజధాని”; “ మెసొపొతమియలో, ఐగుప్తులో యూదులు”; “ పొంతులో క్రైస్తవత్వం” అనే బాక్సులు చూడండి.
c శిష్యులకు “అగ్ని లాంటి నాలుకలు” కనిపించాయి. అంటే పవిత్రశక్తి వాళ్లలో ప్రతీ ఒక్కరి మీద కుమ్మరించబడినప్పుడు, అది అగ్నిలా కనిపించింది కానీ నిజంగా అగ్ని కాదని స్పష్టమౌతుంది.
d “ యూదులుగా మారిన అన్యజనులు” అనే బాక్సు చూడండి.
e 1993, ఆగస్టు 7న యుక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశంలో కూడా ఇలాగే ఎక్కువమంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆ రోజు మొత్తం 7,402 మంది, ఆరు నీటితొట్లలో బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లందరికీ బాప్తిస్మం ఇవ్వడానికి రెండు గంటల పదిహేను నిమిషాలు పట్టింది.
f దూరదేశాల నుండి వచ్చినవాళ్లు తమ కొత్త విశ్వాసం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు యెరూషలేములోనే ఉండిపోయారు. అప్పుడు శిష్యులు తమకున్న వాటిని వాళ్లతో పంచుకున్నారు. శిష్యులు ఇష్టపూర్వకంగానే అలా పంచుకున్నారు. కాబట్టి, కొందరు అనుకుంటున్నట్టు అది కమ్యూనిస్టు సిద్ధాంతం లాంటిది కాదు.—అపొ. 5:1-4.