అధ్యాయం 5
“మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే”
అపొస్తలులు నిజ క్రైస్తవులందరికీ చక్కని ఆదర్శం ఉంచారు
అపొస్తలుల కార్యాలు 5:12–6:7 ఆధారంగా
1-3. (ఎ) అపొస్తలుల్ని మహాసభ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ల ముందున్న అసలు ప్రశ్న ఏంటి? (బి) అపొస్తలుల ధైర్యం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?
మహాసభ నాయకులు కోపంతో రగిలిపోతున్నారు! యేసు అపొస్తలులు ఆ మహాసభ ముందు విచారణ కోసం నిలబడి ఉన్నారు. వాళ్లను ఎందుకు విచారిస్తున్నారు? ప్రధాన యాజకుడూ, మహాసభ అధ్యక్షుడూ అయిన యోసేపు కయప వాళ్లతో కోపంగా ఇలా అన్నాడు: “ఆ పేరున ఇక బోధించవద్దని మేము మీకు గట్టిగా ఆజ్ఞాపించాం.” కయప కనీసం తన నోటితో యేసు పేరును పలకడానికి కూడా ఇష్టపడట్లేదు. కయప ఇంకా ఇలా అన్నాడు: “మీరు మీ బోధతో యెరూషలేమును నింపేశారు. మీరు ఆ వ్యక్తి చావుకు మమ్మల్ని బాధ్యుల్ని చేయాలనుకుంటున్నారు.” (అపొ. 5:28) ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన ఇలా అంటున్నాడు: ప్రకటించడం ఆపేయండి, లేదంటే శిక్ష తప్పదు!
2 ఇప్పుడు అపొస్తలులు ఏం చేస్తారు? ప్రకటించమని వాళ్లకు ఆజ్ఞాపించింది, స్వయంగా దేవుని నుండి అధికారం పొందిన యేసే. (మత్త. 28:18-20) అపొస్తలులు మనుషుల భయానికి లొంగిపోయి, మౌనంగా ఉంటారా? లేక ధైర్యంగా నిలబడి, ప్రకటనా పనిని కొనసాగిస్తారా? ఇప్పుడు వాళ్ల ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే: వాళ్లు దేవునికి లోబడతారా లేక మనుషులకా? అపొస్తలుడైన పేతురు ఇంకో ఆలోచన లేకుండా అపొస్తలులందరి తరఫున ధైర్యంగా, సూటిగా మాట్లాడాడు.
3 ప్రకటించవద్దని మహాసభ బెదిరించినప్పుడు అపొస్తలులు ఏం చేశారో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే, ప్రకటించమనే ఆజ్ఞ నిజ క్రైస్తవులమైన మనందరికీ వర్తిస్తుంది. దేవుడు అప్పగించిన ఈ పని చేస్తున్నప్పుడు, మనకు కూడా వ్యతిరేకత రావచ్చు. (మత్త. 10:22) వ్యతిరేకులు మన పనిపై హద్దులు పెట్టవచ్చు లేదా మన పనిని నిషేధించవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? అపొస్తలులు ఎలా ధైర్యం చూపించారో, మహాసభ విచారణ చేస్తున్నప్పుడు అసలేం జరిగిందో తెలుసుకుంటే మనం ప్రయోజనం పొందుతాం. a
‘యెహోవా దూత చెరసాల తలుపులు తెరిచాడు’ (అపొ. 5:12-21ఎ)
4, 5. కయప, అలాగే ఇతర సద్దూకయ్యులు ఎందుకు ‘అసూయతో నిండిపోయారు’?
4 మహాసభ ప్రకటించవద్దని మొదటిసారి చెప్పినప్పుడు, పేతురు యోహానులు ఏమన్నారో మీకు గుర్తుందా? వాళ్లు ఇలా అన్నారు: “మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.” (అపొ. 4:20) ఆ మొదటి విచారణ తర్వాత, పేతురు యోహానులు మిగతా అపొస్తలులతో కలిసి ఎప్పటిలాగే ఆలయంలో ప్రకటించారు. అపొస్తలులు రోగుల్ని బాగుచేయడం, చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం లాంటి గొప్పగొప్ప అద్భుతాలు చేశారు. వాళ్లు, ఆలయంలో తూర్పు వైపున చాలామంది యూదులు కలుసుకునే “సొలొమోను మంటపంలో” వాటిని చేశారు. ఆఖరికి, పేతురు నీడ పడి కూడా రోగులు బాగై ఉంటారు! బాగైన చాలామంది మంచివార్త విని, ఆధ్యాత్మికంగా కూడా బాగవ్వాలని కోరుకున్నారు. దానివల్ల, “చాలామంది స్త్రీపురుషులు ప్రభువు మీద విశ్వాసముంచి శిష్యులయ్యారు.”—అపొ. 5:12-15.
5 కయప ఒక సద్దూకయ్యుడు. ఆయన, అలాగే ఇతర సద్దూకయ్యులు “అసూయతో నిండిపోయి” అపొస్తలుల్ని జైల్లో వేయించారు. (అపొ. 5:17, 18) వాళ్లకు ఎందుకంత కోపం వచ్చింది? సద్దూకయ్యులు పునరుత్థానాన్ని అస్సలు నమ్మరు, కానీ అపొస్తలులేమో యేసు పునరుత్థానం అయ్యాడని బోధిస్తున్నారు. యేసు మీద విశ్వాసం ఉంచితేనే రక్షణ సాధ్యమని అపొస్తలులు చెప్తున్నారు. ప్రజలందరూ వాళ్లు చెప్పేది విని యేసును నాయకుడిగా అంగీకరిస్తే రోమన్లు ఏం చేస్తారో అని సద్దూకయ్యులు భయపడుతున్నారు. (యోహా. 11:48) దాంతో, ఎలాగైనాసరే అపొస్తలుల నోరు మూయించాలని వాళ్లు అనుకున్నారు!
6. మనకాలంలో యెహోవా సేవకుల మీదికి హింసను ఉసిగొల్పుతున్నది ఎవరు? దాన్ని చూసి మనం ఎందుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు?
6 మనకాలంలో కూడా, యెహోవా సేవకుల మీదికి హింసను ఉసిగొల్పుతున్నది ముఖ్యంగా మతనాయకులే. వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి, మన ప్రకటనా పనిని ఆపేలా ప్రభుత్వాల్ని, మీడియాను ఉసిగొల్పుతుంటారు. దాన్ని చూసి మనం ఆశ్చర్యపోవాలా? లేదు. ఎందుకంటే, మతనాయకులు బోధిస్తున్న అబద్ధాల్ని ప్రకటనా పని ద్వారా మనం బయటపెడుతున్నాం. మంచి మనసున్న ప్రజలు మనం చెప్పే బైబిలు సత్యాలు విని బైబిలుకు వ్యతిరేకమైన ఆచారాల్ని, నమ్మకాల్ని విడిచిపెట్టేస్తున్నారు. (యోహా. 8:32) మరి, ఆ మతనాయకులు అసూయ ద్వేషాలతో నిండిపోవడంలో ఆశ్చర్యం ఏముంది?
7, 8. దేవదూత చెప్పిన మాటలు విన్నప్పుడు, అపొస్తలులకు ఎలా అనిపించి ఉంటుంది? మనం ఏ ప్రశ్న వేసుకోవాలి?
7 తెల్లవారితే ఆ అపొస్తలుల్ని విచారణకు తీసుకెళ్తారు. ఆ రాత్రి, వాళ్లు జైల్లో కూర్చుని ఇక తమకు మరణశిక్ష తప్పదని అనుకుంటుండవచ్చు. (మత్త. 24:9) కానీ ఆ రాత్రి ఊహించనిది ఒకటి జరిగింది, ‘యెహోవా దూత చెరసాల తలుపుల్ని తెరిచాడు.’ b (అపొ. 5:19) అంతేకాదు దేవదూత స్పష్టంగా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: ‘మీరు ఆలయానికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఉండండి.’ (అపొ. 5:20) అది విన్నప్పుడు, తాము చేసేది సరైనదే అనే నమ్మకం అపొస్తలుల్లో బలపడి ఉంటుంది. అంతేకాదు, ఏం జరిగినా సరే ప్రకటనా పని మాత్రం చేస్తూనే ఉండాలి అనే కోరిక వాళ్లలో పెరిగి ఉంటుంది. అలా బలమైన విశ్వాసంతో, ధైర్యంతో అపొస్తలులు “తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు.”—అపొ. 5:21.
8 మనలో ప్రతీఒక్కరం ఈ ప్రశ్న వేసుకోవాలి: ‘అపొస్తలులకు ఎదురైన పరిస్థితే నాకూ వస్తే, నేను వాళ్లలా విశ్వాసంతో, ధైర్యంతో ప్రకటనా పనిని కొనసాగిస్తానా?’ ఈ ప్రాముఖ్యమైన పనిలో దేవదూతల మద్దతు ఉంటుందని మనకు తెలుసు కాబట్టి, మనం “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యమిస్తూ ఉంటాం.—అపొ. 28:23; ప్రక. 14:6, 7.
“మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు” (అపొ. 5:21 బి-33)
9-11. ప్రకటించవద్దని మహాసభ గట్టిగా ఆజ్ఞాపించినప్పుడు అపొస్తలులు ఏం చేశారు? వాళ్లు నిజ క్రైస్తవులకు ఎలా ఆదర్శం ఉంచారు?
9 ఉదయం కయప, అలాగే మహాసభలోని ఇతర నాయకులు అపొస్తలుల్ని విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రాత్రి జైల్లో ఏం జరిగిందో వాళ్లకు తెలియక, ఖైదీల్ని తీసుకురమ్మని అధికారుల్ని పంపించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి జైలు భద్రంగా తాళం వేసి ఉంది, “భటులు తలుపుల దగ్గరే నిలబడి ఉన్నారు,” కానీ ఖైదీలు మాత్రం తప్పించుకున్నారు. అది చూసి ఆ అధికారులు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారో కదా! (అపొ. 5:23) అపొస్తలులు ఆలయంలో యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారన్న సంగతి కాసేపటికి ఆలయ పర్యవేక్షకునికి తెలిసింది. అంటే ఏ పని చేసినందుకు వాళ్లను జైల్లో వేశారో, అదే పనిని వాళ్లు మళ్లీ చేస్తున్నారు! అప్పుడు ఆలయ పర్యవేక్షకుడు, అధికారులు వెంటనే ఆలయంలోకి వెళ్లి ఆ ఖైదీల్ని తీసుకుని మహాసభకు తిరిగొచ్చారు.
10 ఈ అధ్యాయం మొదట్లో చూసినట్లుగా, కోపంతో రగిలిపోతున్న మతనాయకులు ప్రకటించవద్దని అపొస్తలులకు ఖరాఖండిగా చెప్పారు. మరి అపొస్తలులు ఏం చేశారు? అపొస్తలులందరి తరఫున, పేతురు ధైర్యంగా ఇలా అన్నాడు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.” (అపొ. 5:29) అలా అపొస్తలులు, తర్వాత్తర్వాత నిజ క్రైస్తవులందరూ పాటించడానికి ఒక మంచి ఆదర్శం ఉంచారు. మానవ పరిపాలకులకు మనం లోబడాలి. అయితే దేవుడు వద్దని చెప్పినదాన్ని వాళ్లు చేయమన్నా, లేదా దేవుడు చేయమని చెప్పినదాన్ని వాళ్లు వద్దన్నా, మనం వాళ్లకు లోబడాల్సిన అవసరం లేదు. ఒకవేళ “పై అధికారాలు” మన ప్రకటనా పనిని నిషేధించినా, మనకు మంచివార్త ప్రకటించే పని అప్పగించింది దేవుడే కాబట్టి మనం ఆ పనిని ఆపం. (రోమా. 13:1) దానికి బదులు తెలివిగా, నేర్పుగా దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ ఉంటాం.
11 అపొస్తలులు అంత ధైర్యంగా జవాబిచ్చే సరికి, ఆ నాయకుల కోపం తారాస్థాయికి చేరుకుంది. దాంతో వాళ్లు “అపొస్తలుల్ని చంపాలనుకున్నారు.” (అపొ. 5:33) అపొస్తలులు కూడా తమకు చావు తప్పదని అనుకొని ఉండవచ్చు. కానీ వాళ్లు ఊహించని విధంగా సహాయం అందబోతుంది!
“మీరు దాన్ని నాశనం చేయలేరు” (అపొ. 5:34-42)
12, 13. (ఎ) గమలీయేలు తోటి నాయకులకు ఏ సలహా ఇచ్చాడు? అప్పుడు వాళ్లు ఏం చేశారు? (బి) ఈ రోజుల్లో యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేయవచ్చు? ఒకవేళ “నీతిమంతులుగా ఉన్నందుకు బాధలుపడాల్సి వచ్చినా” మనం ఏం గుర్తుంచుకోవచ్చు?
12 “ప్రజలందరూ గౌరవించే ధర్మశాస్త్ర బోధకుడు” అయిన గమలీయేలు ఆ మహాసభలో లేచి మాట్లాడాడు. c ఆయనకు తోటి నాయకుల్లో చాలా గౌరవం ఉన్నట్టుంది. ఎందుకంటే, ఆయనే స్వయంగా “అపొస్తలుల్ని కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించాడు.” (అపొ. 5:34) గతంలో జరిగిన కొన్ని తిరుగుబాట్ల గురించి చెప్తూ, నాయకులు చనిపోయిన వెంటనే ఆ గుంపులు ఎలా చెల్లాచెదురయ్యాయో ఆయన వివరించాడు. అపొస్తలుల నాయకుడైన యేసు ఈమధ్యే చనిపోయాడు కాబట్టి, వాళ్ల విషయంలో కాస్త ఓపిక చూపించమని గమలీయేలు మహాసభకు చెప్పాడు. ఆయన ఆలోచింపజేసేలా ఈ మాట అన్నాడు: “ఈ మనుషుల జోలికి వెళ్లకండి, వాళ్లను అలా వదిలేయండి. ఈ ఆలోచన గానీ ఈ పని గానీ మనుషుల నుండి వచ్చినదైతే అది నాశనమైపోతుంది. కానీ అది దేవుని నుండి వచ్చినదైతే, మీరు దాన్ని నాశనం చేయలేరు. చివరికి మీరు దేవునితోనే పోరాడేవాళ్లు అవుతారేమో.” (అపొ. 5:38, 39) దాంతో మహాసభ నాయకులు ఆయన మాట విన్నారు. కాకపోతే వాళ్లు అపొస్తలుల్ని కొట్టించి, “ఇకమీదట యేసు పేరున మాట్లాడవద్దని ఆజ్ఞాపించి” పంపించేశారు.—అపొ. 5:40.
13 అప్పట్లో గమలీయేలును ఉపయోగించుకున్నట్టే, యెహోవా ఇప్పుడు కూడా తన ప్రజలకు సహాయం చేయడానికి అధికారంలో ఉన్నవాళ్లను ఉపయోగించవచ్చు. (సామె. 21:1) తను అనుకున్నది జరిగించడానికి ఆయన తన పవిత్రశక్తిని ఉపయోగించి శక్తివంతమైన పాలకుల్ని, జడ్జీల్ని, చట్టాలు చేసేవాళ్లను కదిలించగలడు. (నెహె. 2:4-8) ఒకవేళ ఆయన అలా చేయకపోయినా, మనం “నీతిమంతులుగా ఉన్నందుకు బాధలుపడాల్సి వచ్చినా,” రెండు విషయాలు గుర్తుంచుకోవచ్చు. (1 పేతు. 3:14) ఒకటి, ఆ బాధలు తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని యెహోవా ఇస్తాడు. (1 కొరిం. 10:13) రెండు, దేవుని పనిని ‘నాశనం చేయడం’ లేదా అడ్డుకోవడం శత్రువుల తరం కాదు.—యెష. 54:17.
14, 15. (ఎ) దెబ్బలు తిన్నప్పుడు అపొస్తలులు ఏం చేశారు? ఎందుకు? (బి) యెహోవా ప్రజలు హింసను సంతోషంగా సహిస్తారు అనడానికి ఒక ఉదాహరణ చెప్పండి.
14 దెబ్బలు పడగానే అపొస్తలులు డీలాపడిపోయి, ఇక ప్రకటించడం ఆపేద్దాం అనుకున్నారా? లేదు! వాళ్లు “సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు.” (అపొ. 5:41) “సంతోషిస్తూ వెళ్లిపోయారా?” అదేంటి? దెబ్బలు తిన్నందుకు కాదుగానీ, యెహోవాకు యథార్థంగా ఉన్నందుకు, యేసు అడుగుజాడల్లో నడిచినందుకు వాళ్లు సంతోషించారు.—మత్త. 5:11, 12.
15 మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే, మనం కూడా మంచివార్త కోసం బాధలుపడాల్సి వచ్చినప్పుడు, సంతోషంగా సహిస్తాం. (1 పేతు. 4:12-14) అంటే, ఎవరైనా మనల్ని బెదిరిస్తే, హింసిస్తే, లేదా జైల్లో వేస్తే మనకు సంతోషం కలుగుతుందని కాదుగానీ, మనం యెహోవాకు యథార్థంగా ఉన్నందుకు సంతోషిస్తాం. ఉదాహరణకు, హెన్రిక్ డోర్నిక్ అనే సహోదరుని అనుభవం గమనించండి. ఆయన ఎన్నో ఏళ్లపాటు తీవ్రమైన హింసను సహించాడు. 1944, ఆగస్టులో అధికారులు ఆయన్ని, వాళ్ల అన్నయ్యను కాన్సన్‌ట్రేషన్ క్యాంపులో వేశారు. ఆ సహోదరుల్ని హింసించినవాళ్లు ఇలా అన్నారు: “వీళ్లు చనిపోవాల్సి వచ్చినా సంతోషంగా చనిపోతారు గానీ అస్సలు రాజీపడరు.” సహోదరుడు హెన్రిక్ ఇలా వివరిస్తున్నాడు: “బాధలుపడి చనిపోవడం నాకు సంతోషాన్ని ఇవ్వదు గానీ, యెహోవాకు యథార్థంగా ఉన్నాను అనే సంతృప్తితో, ధైర్యంతో వాటిని సహించడం నాకు సంతోషాన్ని ఇస్తుంది.”—యాకో. 1:2-4.
16. పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అపొస్తలులు ఎలా చూపించారు? వాళ్లలాగే ఇప్పుడు మనం కూడా ఎలా ప్రకటిస్తున్నాం?
16 అపొస్తలులు ఇక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా, ప్రకటనా పని మొదలుపెట్టారు. వాళ్లు ఏమాత్రం భయపడకుండా “ప్రతీరోజు ఆలయంలో, అలాగే ఇంటింటా . . . యేసు గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.” d (అపొ. 5:42) ఉత్సాహం గల ఆ క్రైస్తవులు పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలని బలంగా నిర్ణయించుకున్నారు. యేసుక్రీస్తు చెప్పినట్టే, వాళ్లు ప్రజల ఇళ్లకు వెళ్లి మంచివార్త ప్రకటించారు. (మత్త. 10:7, 11-14) అలా ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తూ, యెరూషలేము మొత్తాన్ని వాళ్ల బోధతో నింపేశారు. అపొస్తలుల్లాగే ఇప్పుడు యెహోవాసాక్షులు కూడా ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తారని చాలామందికి తెలుసు. మనం కూడా మనకు ఇచ్చిన ప్రాంతంలో ప్రతీ ఇంటికి వెళ్లడం ద్వారా పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలి, మంచివార్త వినే అవకాశం ప్రతీఒక్కరికి ఇవ్వాలి అని కోరుకుంటున్నామని చూపిస్తాం. మన ఇంటింటి పరిచర్యను యెహోవా దీవించాడా? దీవించాడు! అంతానికి దగ్గరౌతున్న ఈ సమయంలో, లక్షలమంది రాజ్యం గురించిన మంచివార్తను అంగీకరించారు. వాళ్లలో ఎక్కువ శాతం మంది మంచివార్తను మొదటిసారి విన్నది, యెహోవాసాక్షులు వాళ్ల తలుపు తట్టినప్పుడే.
“అవసరమైన పని” చూసుకోవడానికి అర్హులైన పురుషులు (అపొ. 6:1-6)
17-19. క్రైస్తవ సంఘంలో ఏ సున్నితమైన సమస్య మొదలైంది? అపొస్తలులు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు?
17 అయితే, కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘానికి బయటి నుండే కాకుండా, లోపలి నుండి కూడా ఒక సమస్య చాప కింద నీరులా వచ్చిపడింది. ఏంటది? బాప్తిస్మం తీసుకున్న వాళ్లలో చాలామంది, వేర్వేరు దేశాల నుండి యెరూషలేముకు వచ్చినవాళ్లే. వాళ్లు వెంటనే తిరిగెళ్లే బదులు, అక్కడే ఉండి ఎక్కువ విషయాలు నేర్చుకోవాలనుకున్నారు. వాళ్లకు కావల్సినవి చూసుకోవడానికి, యెరూషలేములో ఉన్న శిష్యులు ఇష్టపూర్వకంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. (అపొ. 2:44-46; 4:34-37) ఆ సమయంలో, చాలా సున్నితమైన సమస్య ఒకటి మొదలైంది. “ప్రతీరోజు ఆహారం పంచిపెడుతున్నప్పుడు” గ్రీకు భాష మాట్లాడే విధవరాళ్లు ‘నిర్లక్ష్యానికి గురయ్యారు.’ (అపొ. 6:1) హీబ్రూ భాష మాట్లాడే విధవరాళ్లు మాత్రం నిర్లక్ష్యానికి గురికాలేదు. బహుశా దానికి కారణం పక్షపాతమే అయ్యుంటుంది. ఆ సమస్యను అలాగే వదిలేస్తే, సంఘం ముక్కలైపోయే ప్రమాదం ఉంది.
18 రోజురోజుకీ ఎదుగుతున్న క్రైస్తవ సంఘానికి, అపొస్తలులు పరిపాలక సభగా సేవ చేస్తున్నారు. కాబట్టి, ఆహారం పంచిపెట్టడం కోసం తాము “దేవుని వాక్యాన్ని బోధించే పనిని ఆపడం సరైనది కాదు” అని వాళ్లు అనుకున్నారు. (అపొ. 6:2) ఆ సమస్యను పరిష్కరించడం కోసం “పవిత్రశక్తితో, తెలివితో నిండిన” ఏడుగురు పురుషుల్ని వెతకమని, వాళ్లను ఈ “అవసరమైన పని” మీద నియమిస్తామని అపొస్తలులు మిగతా శిష్యులకు చెప్పారు. (అపొ. 6:3) ఆహారం పంచిపెట్టే పనికి, అర్హులైన పురుషులు ఎందుకు కావాలి? ఎందుకంటే, వాళ్లు కేవలం ఆహారం పంచిపెట్టడమే కాదు డబ్బులు లెక్క చూసుకోవాలి, అవసరమైన వాటిని కొనాలి, ప్రతీది జాగ్రత్తగా రాసిపెట్టుకోవాలి. అప్పుడు శిష్యులు ఏడుగురు సహోదరుల పేర్లు సిఫారసు చేశారు. వాళ్ల గురించి ప్రార్థనాపూర్వకంగా పరిశీలించిన తర్వాత, అపొస్తలులు వాళ్లను “అవసరమైన పని” మీద నియమించారు. e ఆ ఏడుగురు పురుషులకు గ్రీకు పేర్లు ఉండడం, గ్రీకు విధవరాళ్లకు ఓదార్పును ఇచ్చి ఉంటుంది.
19 ఆ ఏడుగురు పురుషులకు ఆహారం పంచిపెట్టే పని అప్పగించారు కాబట్టి, ఇక వాళ్లు మంచివార్త ప్రకటించాల్సిన అవసరం లేదా? ఎంతమాత్రం కాదు! వాళ్లలో ఒకరైన స్తెఫను మంచివార్తను ఉత్సాహంగా, ధైర్యంగా ప్రకటిస్తాడనే పేరు సంపాదించుకున్నాడు. (అపొ. 6:8-10) అలాగే, ఆ ఏడుగురిలో ఇంకొకరైన ఫిలిప్పుకు “మంచివార్త ప్రచారకుడు” అనే పేరు వచ్చింది. (అపొ. 21:8) కాబట్టి ఆ నియామకం వచ్చాక కూడా, ఆ ఏడుగురు దేవుని రాజ్యం గురించి ఉత్సాహంగా ప్రకటించి ఉంటారని తెలుస్తోంది.
20. అపొస్తలులు పాటించిన పద్ధతినే మనకాలంలోని దేవుని ప్రజలు ఎలా అనుసరిస్తున్నారు?
20 మనకాలంలోని యెహోవా ప్రజలు కూడా అపొస్తలులు పాటించిన పద్ధతినే అనుసరిస్తున్నారు. పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపిస్తూ, యెహోవా తెలివికి తగ్గట్టు జీవించే సహోదరుల్ని సంఘ బాధ్యతల కోసం సిఫారసు చేస్తారు. బైబిలు చెప్తున్న అర్హతల్ని చేరుకున్న ఆ సహోదరుల్ని, పరిపాలక సభ నిర్దేశం కింద సంఘాల్లో పెద్దలుగా లేదా సంఘ పరిచారకులుగా నియమిస్తారు. f (1 తిమో. 3:1-9, 12, 13) ఆ అర్హతల్ని చేరుకున్న వాళ్లను పవిత్రశక్తే నియమించిందని మనం చెప్పవచ్చు. ఆ సహోదరులు కష్టపడి పనిచేస్తూ, ఎన్నో ‘అవసరమైన పనుల్ని’ చూసుకుంటారు. ఉదాహరణకు, పెద్దలు సంఘంలో నమ్మకమైన వృద్ధ సహోదర సహోదరీలకు ఏదైనా అవసరమైతే, దానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. (యాకో. 1:27) ఇంకొంతమంది పెద్దలు రాజ్యమందిరాలు కట్టడంలో, సమావేశాలు ఏర్పాటు చేయడంలో సహాయం చేస్తారు. అలాగే, స్థానిక ఆసుపత్రి అనుసంధాన కమిటీతో కలిసి పనిచేస్తారు. కాపరి సందర్శనాలు చేయడంలో, బోధించడంలో బిజీగా ఉన్న పెద్దలకు సంఘ పరిచారకులు ఎన్నో పనుల్లో సహాయం చేస్తారు. అలాంటి అర్హులైన సహోదరులందరూ సంఘంలో, సంస్థలో తమకు ఎన్ని బాధ్యతలు ఉన్నా, దేవుని రాజ్యం గురించి ప్రకటించే పనిని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.—1 కొరిం. 9:16.
“దేవుని వాక్యం వ్యాప్తిచెందుతూ ఉంది” (అపొ. 6:7)
21, 22. కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘాన్ని యెహోవా దీవించాడని ఎలా స్పష్టమైంది?
21 బయటి నుండి హింస వచ్చినా, ఐక్యతను పాడుచేసే ఒక సమస్య లోపలి నుండే పుట్టుకొచ్చినా, కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘం యెహోవా సహాయంతో తట్టుకుని నిలిచింది. యెహోవా ఆ సంఘాన్ని దీవిస్తున్నాడని స్పష్టమైంది. ఎందుకంటే, బైబిలు ఇలా చెప్తుంది: “దేవుని వాక్యం వ్యాప్తిచెందుతూ ఉంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వాసులయ్యారు.” (అపొ. 6:7) క్రైస్తవ సంఘం అభివృద్ధిని తెలిపే ఇలాంటి రిపోర్టులు అపొస్తలుల కార్యాలు పుస్తకంలో చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి మాత్రమే. (అపొ. 9:31; 12:24; 16:5; 19:20; 28:31) ఇప్పుడు కూడా, వేర్వేరు దేశాల్లో రాజ్య ప్రకటనా పని ఎలా ముందుకు వెళ్తుందో చెప్పే రిపోర్టులు విన్నప్పుడు, మనకు ఎంత ప్రోత్సాహంగా ఉంటుందో కదా!
22 అయితే కోపంతో ఉన్న ఆ యూదా నాయకులు అపొస్తలుల్ని అంతటితో విడిచిపెట్టలేదు. హింస ఉప్పెనలా రాబోతోంది. త్వరలోనే, స్తెఫను తీవ్రమైన హింసకు బలి అవ్వబోతున్నాడు. దాని గురించి తర్వాతి అధ్యాయంలో చూస్తాం.
a “ మహాసభ—యూదుల ఉన్నత న్యాయస్థానం” అనే బాక్సు చూడండి.
b అపొస్తలుల కార్యాలు పుస్తకంలో దేవదూతల గురించి దాదాపు 20 చోట్ల సూటిగా ప్రస్తావించారు. వాటిలో ఇది మొదటిది. దీనికంటే ముందు, అపొస్తలుల కార్యాలు 1:10 లో దేవదూతల గురించి ఉంది. కాకపోతే అక్కడ సూటిగా లేదుగానీ, ‘తెల్లని వస్త్రాలు వేసుకున్న మనుషులు’ అని ఉంది.
c “ గమలీయేలు—రబ్బీల్లో అత్యంత గౌరవనీయుడు” అనే బాక్సు చూడండి.
d “ ‘ఇంటింటా’ ప్రకటించడం” అనే బాక్సు చూడండి.
e ఈ “అవసరమైన పని” ముఖ్యమైన బాధ్యత కాబట్టి, ఆ ఏడుగురికి సంఘ పెద్దలకు ఉండే లేఖన అర్హతలు ఉండి ఉండవచ్చు. అయితే, క్రైస్తవ సంఘంలో పెద్దల్ని లేదా పర్యవేక్షకుల్ని నియమించడం ఖచ్చితంగా ఎప్పటినుండి మొదలైందో బైబిలు చెప్పట్లేదు.
f మొదటి శతాబ్దంలో, సంఘ పెద్దల్ని నియమించే అధికారం కొంతమంది సహోదరులకు ఉండేది. (అపొ. 14:23; 1 తిమో. 5:22; తీతు 1:5) ఇప్పుడు పరిపాలక సభ ప్రాంతీయ పర్యవేక్షకుల్ని నియమిస్తుంది. ఆ ప్రాంతీయ పర్యవేక్షకులు సంఘ పెద్దల్ని, సంఘ పరిచారకుల్ని నియమిస్తారు.