కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 1

“వెళ్లి … శిష్యుల్ని చేయండి”

“వెళ్లి … శిష్యుల్ని చేయండి”

అపొస్తలుల కార్యాలు పుస్తకానికి పరిచయం, దాన్నుండి నేర్చుకునే పాఠాలు

1-6. వేర్వేరు పరిస్థితుల్లో సాక్షులు ఎలా ప్రకటిస్తున్నారో ఒక ఉదాహరణ చెప్పండి.

 ఘానాలో ఉంటున్న రిబ్కా అనే అమ్మాయి, స్కూల్‌నే తను ప్రకటించే ప్రాంతంగా చేసుకుంది. రిబ్కా ఎప్పుడూ స్కూల్‌ బ్యాగ్‌లో బైబిలు ప్రచురణలు పెట్టుకెళ్లేది. సమయం దొరికినప్పుడల్లా, తోటి పిల్లలకు సాక్ష్యం ఇచ్చే అవకాశాల కోసం చూసేది. చాలామందితో బైబిలు స్టడీలు కూడా మొదలుపెట్టింది.

2 ఆఫ్రికా తూర్పు తీరానికి దగ్గర్లో ఉన్న మడగాస్కర్‌ అనే ద్వీపంలో, ఇద్దరు పయినీర్లు దాదాపు 25 కిలోమీటర్లు ఎండలో నడిచి ఒక మారుమూల పల్లెటూరికి వెళ్లేవాళ్లు. అక్కడ, ఆసక్తి చూపించిన వాళ్లతో చాలా బైబిలు స్టడీలు చేసేవాళ్లు.

3 పరాగ్వే, పరానా నదుల పక్కన నివసిస్తున్న ప్రజల్ని చేరుకోవడానికి పరాగ్వేలో ఉన్న సాక్షులు, ఇంకో 15 దేశాల సాక్షులతో కలిసి ఒక పడవ తయారు చేశారు. అది 45 టన్నుల బరువున్న పెద్ద పడవ. అందులో, 12 మంది నివసించడానికి సరిపడా గదులు ఉన్నాయి. ప్రకటనా పనిని ఎంతో ప్రేమించే సహోదర సహోదరీలు, ఆ పడవలోనే వేర్వేరు ఊళ్లకు వెళ్లి మంచివార్త ప్రకటించారు. ఆ ఊళ్లకు వెళ్లడానికి పడవ ప్రయాణం తప్ప వేరే దారి లేదు.

4 ఉత్తర అమెరికాలో ఉన్న అలాస్కాలోని సాక్షులు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఉపయోగించుకుని మంచివార్త ప్రకటించారు. వేసవి కాలంలో టూరిస్టులు పెద్దపెద్ద ఓడల్లో వేర్వేరు దేశాల నుండి అక్కడికి వచ్చేవాళ్లు. కాబట్టి అక్కడి సాక్షులు, ఓడరేవు దగ్గర వేర్వేరు భాషల్లో బైబిలు ప్రచురణలు కనిపించేలా పెట్టి, నిలబడేవాళ్లు. అంతేకాదు, వాళ్లు చిన్న విమానంలో మారుమూల గ్రామాలకు వెళ్లి అల్యూట్‌, అతబాస్కన్‌, సిమ్షియన్‌, ట్లింగిట్‌ జాతుల ప్రజలకు కూడా మంచివార్త ప్రకటించారు.

5 అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న లారీ అనే సహోదరుడు, ఒక నర్సింగ్‌ హోమ్‌లో ఉంటున్నాడు. ఆయన ఆ నర్సింగ్‌ హోమ్‌నే తను ప్రకటించే ప్రాంతంగా చేసుకున్నాడు. యాక్సిడెంట్‌ వల్ల చక్రాల కుర్చీలోనే ఉండిపోవాల్సి వచ్చినా, ఆయన ఎప్పుడూ వేరేవాళ్లతో దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ, కొత్తలోకంలో తను మళ్లీ నడుస్తానని చెప్తూ ఉంటాడు.—యెష. 35:5, 6.

6 ఉత్తర మయన్మార్‌లో జరిగే ప్రాంతీయ సమావేశానికి వెళ్లడానికి, కొంతమంది సాక్షులు మాండలే అనే ఊరి నుండి పడవలో బయల్దేరారు. అది మూడు రోజుల ప్రయాణం. మంచివార్త ప్రకటించాలనే కోరికతో వాళ్లు బైబిలు ప్రచురణల్ని తీసుకెళ్లి, వాటిని తోటి ప్రయాణికులకు ఇచ్చారు. అంతేకాదు, పడవ ఏదైనా ఊరి దగ్గర ఆగినప్పుడు వాళ్లు దిగి, ఆ ఊర్లో ప్రకటించి మళ్లీ వెంటనే వచ్చి పడవ ఎక్కేవాళ్లు. తిరిగి వచ్చేసరికి, వాళ్లు ప్రకటించడానికి పడవలో కొత్త ప్రయాణికులు ఉండేవాళ్లు.

7. యెహోవాసాక్షులు దేవుని రాజ్యం గురించి ఏయే పద్ధతుల్లో ప్రకటిస్తారు? వాళ్ల లక్ష్యం ఏంటి?

7 ఆ సహోదర సహోదరీల్లాగే, ప్రకటనా పనిని ఎంతో ప్రేమించే యెహోవా ఆరాధకులు ప్రపంచవ్యాప్తంగా “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇస్తున్నారు. (అపొ. 28:23) వాళ్లు ఇంటింటికి వెళ్తారు, వీధిలో ప్రజల్ని కలుస్తారు, ఉత్తరాలు రాస్తారు, ఫోన్‌లో మాట్లాడతారు. బస్సులో వెళ్తున్నా, పార్కులో నడుస్తున్నా, పనిచేసే చోట కాస్త ఖాళీ దొరికినా దేవుని రాజ్యం గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లు ప్రకటించే పద్ధతులు వేరు కావచ్చు, కానీ వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటే. అదేంటంటే, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్లకు మంచివార్త ప్రకటించడం.—మత్త. 10:11.

8, 9. (ఎ) వేగంగా ముందుకు సాగుతున్న రాజ్య ప్రకటనా పని ఒక అద్భుతం అని ఎందుకు చెప్పవచ్చు? (బి) మనం ఏ ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచించాలి? దానికి జవాబు తెలుసుకోవాలంటే ఏం చేయాలి?

8 లక్షలమంది యెహోవాసాక్షులు, 235 కన్నా ఎక్కువ దేశాల్లో మంచివార్త ప్రకటిస్తున్నారు. వాళ్లలో మీరూ ఒకరా? అలాగైతే, వేగంగా ముందుకు సాగుతున్న రాజ్య ప్రకటనా పనిలో మీకూ వంతు ఉన్నట్టే! యెహోవా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఈ పని ఒక అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అంటే ప్రభుత్వం నిషేధించినా, విపరీతమైన హింస వచ్చినా వాళ్లు దేవుని రాజ్యం గురించి అన్నిదేశాల ప్రజలకు పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇస్తున్నారు.

9 మనం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే: ఎన్ని ఆటంకాలు వచ్చినా, చివరికి సాతాను వ్యతిరేకత తెచ్చినా రాజ్య ప్రకటనా పని ఎందుకు ఆగిపోలేదు? ఆ ఆసక్తికరమైన ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే, మనం క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి వెళ్లాల్సిందే. ఎంతైనా, ఇప్పుడు యెహోవాసాక్షులు చేస్తున్న పని, అప్పట్లో వాళ్లు మొదలుపెట్టిందే.

సరిహద్దులు దాటుకుంటూ వందల ఏళ్లు సాగే పని

10. యేసు ఏ పనికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు? ఆ పని గురించి ఆయనకు ఏం తెలుసు?

10 క్రైస్తవ సంఘాన్ని స్థాపించిన యేసుక్రీస్తు, దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు, అదే తన జీవితంగా బ్రతికాడు. ఆయన ఒకసారి ఇలా అన్నాడు: “నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.” (లూకా 4:43) తను మొదలుపెట్టిన ఈ పనిని తానొక్కడే పూర్తి చేయలేడని యేసుకు తెలుసు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, రాజ్యం గురించిన మంచివార్త “అన్నిదేశాల్లో” ప్రకటించబడుతుంది అని ఆయన అన్నాడు. (మార్కు 13:10) మరి ఈ పనిని ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు?

“వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి.”—మత్తయి 28:19

11. యేసు తన శిష్యులకు ఏ ముఖ్యమైన పని అప్పగించాడు? ఆ పని చేయడానికి వాళ్లకు ఏ సహాయం అందుబాటులో ఉంది?

11 చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత యేసు తన శిష్యులకు కనిపించాడు. ఆయన వాళ్లకు ఈ ముఖ్యమైన పని అప్పగించాడు: “మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి. ఇదిగో! ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.” (మత్త. 28:19, 20) “నేను . . . మీతో ఉంటాను” అని చెప్పడం ద్వారా ప్రకటించే పనిలో, శిష్యుల్ని చేసే పనిలో తోడుగా ఉంటానని యేసు తన శిష్యులకు చెప్తున్నాడు. వాళ్లకు ఆయన సహాయం కావాలి. ఎందుకంటే, యేసు ముందే చెప్పినట్టు వాళ్లను ‘అన్నిదేశాల ప్రజలు ద్వేషిస్తారు.’ (మత్త. 24:9) శిష్యులకు ఇంకో సహాయం కూడా అందుబాటులో ఉంది. అదేంటంటే, యేసు పరలోకానికి వెళ్లే ముందు, “భూమంతటా” సాక్ష్యం ఇవ్వడానికి పవిత్రశక్తి వాళ్లకు బలాన్ని ఇస్తుందని చెప్పాడు.—అపొ. 1:8.

12. మనకు ఏ ముఖ్యమైన ప్రశ్నలు రావచ్చు? మనం వాటికి జవాబులు ఎందుకు తెలుసుకోవాలి?

12 మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు: అపొస్తలులు, మొదటి శతాబ్దంలోని ఇతర శిష్యులు యేసు ఇచ్చిన పనిలో చేయగలిగినదంతా చేశారా? ఇంత తక్కువమంది స్త్రీపురుషులు, విపరీతమైన హింస వచ్చినా కూడా దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇచ్చారా? శిష్యుల్ని చేసే పనిలో వాళ్లకు నిజంగా యెహోవా, యేసు, దేవదూతలు సహాయం చేశారా? పవిత్రశక్తి నిజంగా వాళ్లకు బలాన్ని ఇచ్చిందా? ఈ ముఖ్యమైన ప్రశ్నలకు, ఇలాంటి ఇతర ప్రశ్నలకు బైబిల్లోని అపొస్తలుల కార్యాలు పుస్తకంలో జవాబులు ఉన్నాయి. మనం ఆ జవాబులు తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే, తను అప్పగించిన పని “ఈ వ్యవస్థ ముగింపు వరకు” కొనసాగుతుందని యేసు మాటిచ్చాడు. కాబట్టి, ఆ పని చేయాల్సిన బాధ్యత నిజ క్రైస్తవులందరికీ, అంటే చివరి రోజుల్లో జీవిస్తున్న మనకు కూడా ఉంది. అందుకే, అపొస్తలుల కార్యాలు పుస్తకంలో ఉన్న ఆసక్తికరమైన కథ గురించి మనం తెలుసుకోవాలని కోరుకుంటాం.

అపొస్తలుల కార్యాలు పుస్తకానికి పరిచయం

13, 14. (ఎ) అపొస్తలుల కార్యాలు పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆయనకు ఆ వివరాలు ఎలా తెలుసు? (బి) అపొస్తలుల కార్యాలు పుస్తకంలో ఏముంది?

13 అపొస్తలుల కార్యాలు పుస్తకాన్ని ఎవరు రాశారు? దాన్ని ఎవరు రాశారో ఆ పుస్తకంలో లేదు. కానీ దాని ప్రారంభ మాటల్ని చూస్తే, లూకా సువార్త రాసిన వ్యక్తే దీన్ని కూడా రాశాడని అర్థమౌతుంది. (లూకా 1:1-4; అపొ. 1:1, 2) అందుకే “ప్రియమైన వైద్యుడు,” చరిత్రను జాగ్రత్తగా పరిశోధించేవాడు అయిన లూకానే దాని రచయిత అని చాలాకాలం నుండి ప్రజలు నమ్ముతున్నారు. (కొలొ. 4:14) అపొస్తలుల కార్యాలు పుస్తకంలో దాదాపు 28 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే, క్రీస్తు శకం 33లో యేసు పరలోకానికి వెళ్లిన దగ్గర నుండి, దాదాపు క్రీస్తు శకం 61లో అపొస్తలుడైన పౌలు రోములో బందీగా ఉన్నంత వరకు జరిగిన సంఘటనలు ఇందులో ఉన్నాయి. లూకా ఈ పుస్తకంలో కొన్ని చోట్ల “వాళ్లు” అని, ఇంకొన్ని చోట్ల “మేము” అని అన్నాడు. దాన్నిబట్టి, ఆయన రాసిన చాలా సంఘటనల్లో ఆయన కూడా ఉన్నాడని తెలుస్తుంది. (అపొ. 16:8-10; 20:5; 27:1) అన్నిటినీ జాగ్రత్తగా పరిశోధించే లూకా ఖచ్చితంగా పౌలు, బర్నబా, ఫిలిప్పు, అలాగే ఈ పుస్తకంలో ఉన్న ఇతర వ్యక్తుల నుండి వివరాలు తెలుసుకుని ఉంటాడు.

14 అపొస్తలుల కార్యాలు పుస్తకంలో ఏముంది? లూకా అంతకుముందు తన సువార్తలో యేసు చెప్పినవి, చేసినవి రాశాడు. అపొస్తలుల కార్యాలు పుస్తకంలోనేమో యేసు అనుచరులు చెప్పినవి, చేసినవి రాశాడు. ‘చదువుకోని సామాన్యుల్లా’ కనిపించే కొంతమంది ఒక అసాధారణమైన పనిని ఎలా చేశారో తెలిపే కథే, అపొస్తలుల కార్యాలు పుస్తకం. (అపొ. 4:13) ఒక్కమాటలో చెప్పాలంటే, పవిత్రశక్తి సహాయంతో లూకా రాసిన ఈ పుస్తకం, క్రైస్తవ సంఘం ఎలా స్థాపించబడిందో, ఎలా అభివృద్ధి అయ్యిందో చెప్తుంది. అంతేకాదు, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఎలా ప్రకటించారో, అంటే ఏ పద్ధతులు ఉపయోగించారో, ఎలాంటి స్ఫూర్తితో ప్రకటించారో ఇందులో ఉంది. (అపొ. 4:31; 5:42) మంచివార్త ప్రకటించడానికి పవిత్రశక్తి వాళ్లకు ఎలా సహాయం చేసిందో కూడా ఈ పుస్తకంలో చూస్తాం. (అపొ. 8:29, 39, 40; 13:1-3; 16:6; 18:24, 25) బైబిలంతటిలో ఉన్న ముఖ్యాంశమే, అపొస్తలుల కార్యాలు పుస్తకంలో కూడా ఉంది. అదే, క్రీస్తు రాజ్యం ద్వారా దేవుని పేరు పవిత్రపర్చబడడం. ఆ రాజ్యం గురించిన మంచివార్త, తీవ్రమైన వ్యతిరేకతను దాటుకుంటూ భూమంతటికీ ఎలా చేరుకుందో ఈ పుస్తకం వివరిస్తుంది.—అపొ. 8:12; 19:8; 28:30, 31.

15. అపొస్తలుల కార్యాలు పుస్తకం చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి?

15 అవును, బైబిల్లోని అపొస్తలుల కార్యాలు పుస్తకం చదవడం ఆసక్తికరంగా ఉంటుంది, అలాగే మన విశ్వాసాన్ని పెంచుతుంది! తొలి క్రైస్తవులు చూపించిన ఉత్సాహం, ధైర్యం గురించి ఆలోచించినప్పుడు మన హృదయాలు ఉప్పొంగుతాయి. మనకు కూడా వాళ్లలాంటి విశ్వాసం చూపించాలని అనిపిస్తుంది. అప్పుడు, “వెళ్లి . . . శిష్యుల్ని చేయండి” అని యేసు అప్పగించిన పనిని మనం ఇంకా బాగా చేయగలుగుతాం. అపొస్తలుల కార్యాలు పుస్తకాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి, ఇప్పుడు మీరు చదువుతున్న ఈ పుస్తకం సహాయం చేస్తుంది.

లోతుగా అధ్యయనం చేయడానికి సహాయం చేసే పుస్తకం

16. ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి మూడు కారణాలు ఏంటి?

16 అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు తయారు చేశారు? మూడు కారణాలు ఉన్నాయి. (1) రాజ్య ప్రకటనా పనిలో, శిష్యుల్ని చేసే పనిలో యెహోవా తన పవిత్రశక్తి ద్వారా మనకు సహాయం చేస్తాడనే నమ్మకాన్ని పెంచడం. (2) మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల ఉదాహరణలు పరిశీలిస్తూ, పరిచర్య పట్ల మన ఉత్సాహాన్ని పెంచడం. (3) యెహోవా సంస్థ మీద, ప్రకటనా పనిని ముందుండి నడిపిస్తున్నవాళ్ల మీద మన గౌరవాన్ని పెంచడం.

17, 18. ఈ పుస్తకాన్ని ఎలా తయారు చేశారు? ఇందులో ఉన్న బాక్సులు, చిత్రాలు బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఎలా సహాయం చేస్తాయి?

17 ఈ పుస్తకాన్ని ఎలా తయారు చేశారు? ఇందులో ఎనిమిది సెక్షన్‌లు, వాటిలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి. ప్రతీ సెక్షన్‌లో, అపొస్తలుల కార్యాలు పుస్తకంలోని కొంత భాగాన్ని పరిశీలిస్తాం. ప్రతీ అధ్యాయం మొదట్లో ఒక ముఖ్యాంశం ఉంటుంది, దానికింద ఆ అధ్యాయానికి ఆధారంగా ఉండే లేఖనాలు కూడా ఉంటాయి. ఈ పుస్తకంలో ప్రతీ వచనానికి వివరణ ఉండదు కానీ, అపొస్తలుల కార్యాలు నుండి మనం ఏం నేర్చుకోవచ్చో, నేర్చుకున్నవాటిని ఎలా పాటించవచ్చో ఉంటుంది.

18 బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి సహాయం చేసే చిత్రాలు, బాక్సులు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. అందమైన చిత్రాలు, అపొస్తలుల కార్యాలు పుస్తకంలోని సంఘటనల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ, వాటిని ఊహించుకోవడానికి సహాయం చేస్తాయి. చాలా అధ్యాయాల్లో ఉన్న బాక్సులు, అదనపు సమాచారాన్ని ఇస్తాయి. కొన్ని బాక్సుల్లో, విశ్వాసం చూపిస్తూ మంచి ఆదర్శం ఉంచిన వాళ్ల వివరాలు ఉంటాయి. ఇంకొన్ని బాక్సుల్లో, అపొస్తలుల కార్యాలు పుస్తకంలోని ప్రాంతాలు, సంఘటనలు, అలవాట్లు, పద్ధతులు, అలాగే ఇతర వ్యక్తుల గురించి ఎక్కువ వివరాలు ఉంటాయి.

సహోదరులు మీకు ఇచ్చిన ప్రాంతంలో అత్యవసర భావంతో ప్రకటించండి

19. మనం ఎప్పటికప్పుడు ఏ విషయాల్ని పరిశీలించుకోవాలి?

19 మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకోవడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుంది. మీరు ఎంతకాలం నుండి రాజ్యం గురించి ప్రకటిస్తున్నా, ఎప్పటికప్పుడు సమయం తీసుకుని, మీ జీవితంలో దేనికి మొదటిస్థానం ఇస్తున్నారో, పరిచర్య విషయంలో మీ ఉత్సాహం ఎలా ఉందో గమనించుకోవడం మంచిది. (2 కొరిం. 13:5) ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘కొంచెం సమయమే మిగిలి ఉందని గుర్తుంచుకుని నేను అత్యవసర భావంతో ప్రకటిస్తున్నానా? (1 కొరిం. 7:29-31) నేను బలమైన నమ్మకంతో, ఉత్సాహంతో మంచివార్త ప్రకటిస్తున్నానా? (1 థెస్స. 1:5, 6) ప్రకటనా పనిలో, శిష్యుల్ని చేసే పనిలో నేను వీలైనంత ఎక్కువగా పాల్గొంటున్నానా?’—కొలొ. 3:23.

20, 21. మనం చేసే పని ఎందుకు అత్యవసరం? మనందరి నిర్ణయం ఏంటి?

20 ప్రకటించే, శిష్యుల్ని చేసే ముఖ్యమైన పనిని యేసు మనకు అప్పగించాడని ఎప్పుడూ గుర్తుంచుకుందాం. ఒక్కో రోజు గడిచేకొద్దీ మనం అంతానికి దగ్గరౌతున్నాం, కాబట్టి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఆ పని చేయాలి. ఈ వ్యవస్థ ముగింపు చాలా వేగంగా దూసుకొస్తోంది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువమంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మంచివార్త వినే సరైన హృదయస్థితి ఉన్నవాళ్లు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలీదు. (అపొ. 13:48) కాబట్టి, ఆలస్యం కాకముందే అలాంటివాళ్లకు సహాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది.—1 తిమో. 4:16.

21 కాబట్టి, మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే మనం కూడా ఉత్సాహంగా ప్రకటించడం ప్రాముఖ్యం. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తుండగా, పరిచర్య విషయంలో మీ ఉత్సాహం, ధైర్యం రెట్టింపు అవ్వాలని కోరుకుంటున్నాం. అంతేకాదు, “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ” ఉండాలనే మీ నిర్ణయం ఇంకా బలపడాలని ఆశిస్తున్నాం.—అపొ. 28:23.