కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 7

“యేసు గురించిన మంచివార్త” ప్రకటించడం

“యేసు గురించిన మంచివార్త” ప్రకటించడం

మంచివార్త ప్రచారకుడిగా ఫిలిప్పు మనకు ఆదర్శం ఉంచాడు

అపొస్తలుల కార్యాలు 8:4-40 ఆధారంగా

1, 2. మొదటి శతాబ్దంలో, వ్యతిరేకులు శిష్యుల నోరు నొక్కేయాలని చూసినా ఏం జరిగింది?

 హింస ఉప్పెనలా విరుచుకుపడింది. సౌలు, “సంఘం మీద క్రూరంగా దాడిచేయడం మొదలుపెట్టాడు.” (అపొ. 8:3) దాంతో శిష్యులు వేర్వేరు ప్రాంతాలకు చెదిరిపోయారు. క్రైస్తవత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనే సౌలు కల నిజమౌతుందేమో అని కొంతమందికి అనిపించి ఉండవచ్చు. కానీ ఎవ్వరూ ఊహించనిది ఒకటి జరిగింది. ఏంటది?

2 చెదిరిపోయిన శిష్యులు, తాము వెళ్లిన ప్రాంతాలన్నిటిలో “వాక్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.” (అపొ. 8:4) ఒక్కసారి ఆలోచించండి! వ్యతిరేకులు హింసను తీసుకొచ్చి శిష్యుల నోరు నొక్కేయాలనుకున్నారు, కానీ నిజానికి మంచివార్త ఇంకా ఎక్కువగా వ్యాపించింది! శిష్యుల్ని చెదరగొట్టడం ద్వారా, వ్యతిరేకులు తమకు తెలీకుండానే రాజ్య ప్రకటనా పని సుదూర ప్రాంతాలకు వెళ్లేలా సహాయపడ్డారు. మనకాలంలో కూడా అలాంటి అనుభవాలే ఉన్నాయి.

“చెదిరిపోయినవాళ్లు” (అపొ. 8:4-8)

3. (ఎ) ఫిలిప్పు ఎవరు? (బి) సమరయలో చాలామందికి మంచివార్త ఎందుకు తెలీదు? అయితే, సమరయలో ఏం జరుగుతుందని యేసు చెప్పాడు?

3 అలా ‘చెదిరిపోయినవాళ్లలో’ ఒకరు ఫిలిప్పు. a (అపొ. 8:4; “ ‘మంచివార్త ప్రచారకుడైన’ ఫిలిప్పు” అనే బాక్సు చూడండి.) ఆయన సమరయ నగరానికి వెళ్లాడు. ఆ ప్రాంతంలో చాలామందికి అప్పటివరకు మంచివార్త తెలీదు. ఎందుకంటే యేసు మొదట్లో అపొస్తలులకు ఇలా చెప్పాడు: “సమరయులకు చెందిన ఏ నగరంలోకీ ప్రవేశించకండి. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ల దగ్గరికే వెళ్తూ ఉండండి.” (మత్త. 10:5, 6) త్వరలోనే, సమరయలో కూడా పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వబడుతుందని యేసుకు తెలుసు. కాబట్టి పరలోకానికి వెళ్లే ముందు, ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.”—అపొ. 1:8.

4. ఫిలిప్పు చెప్పిన మంచివార్త విన్నప్పుడు, సమరయులకు ఎలా అనిపించింది? వాళ్లకు అలా అనిపించడానికి కారణం ఏమై ఉండవచ్చు?

4 ఫిలిప్పుకు సమరయ ప్రాంతం “కోతకు సిద్ధంగా” ఉన్న పొలంలా అనిపించింది. (యోహా. 4:35) ఆయన చెప్తున్న మంచివార్త, అక్కడి ప్రజలకు కొత్త ఊపిరి పోసింది. ఎందుకు? యూదులు సాధారణంగా సమరయులతో మాట్లాడరు, కొంతమందైతే వాళ్లను ఈసడించుకునే వాళ్లు. కానీ ఫిలిప్పు చెప్తున్న మంచివార్తలో యూదులు-సమరయులు అనే తేడా లేకపోవడం, పరిసయ్యుల ఆలోచనా విధానానికి అది చాలా వేరుగా ఉండడం అక్కడి ప్రజలు గమనించారు. ఉత్సాహంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సమరయులకు ప్రకటించడం ద్వారా పరిసయ్యులకు ఉన్న వివక్ష తనకు ఏమాత్రం అంటలేదని ఫిలిప్పు చూపించాడు. అందుకే, ఫిలిప్పు మాటల్ని వినడానికి “ప్రజలు గుంపులుగుంపులుగా” రావడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు.—అపొ. 8:6.

5-7. క్రైస్తవులు వేర్వేరు చోట్లకు చెదిరిపోయినా, మంచివార్తను ఎలా ప్రకటించారో ఉదాహరణలు చెప్పండి.

5 మొదటి శతాబ్దంలోలాగే, ఇప్పుడు కూడా వ్యతిరేకులు హింస ద్వారా దేవుని ప్రజల నోరు నొక్కేయలేకపోయారు. వాళ్లు క్రైస్తవుల్ని జైలుకు పంపించినా లేదా వేరే దేశానికి పంపించినా, దానివల్ల నిజానికి రాజ్య సందేశం కొత్తకొత్త చోట్లకు చేరుకుంది. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, యెహోవాసాక్షులు నాజీ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో అసాధారణ రీతిలో సాక్ష్యం ఇచ్చారు. అక్కడ సాక్షుల్ని కలిసిన ఒక యూదుడు ఇలా చెప్తున్నాడు: “ఖైదీలుగా ఉన్న యెహోవాసాక్షుల ధైర్యం చూశాక, వాళ్ల విశ్వాసం లేఖనాలపై ఆధారపడిందని నాకు నమ్మకం కలిగింది. అందుకే నేను కూడా యెహోవాసాక్షిని అయ్యాను.”

6 కొన్నిసార్లయితే, ఏకంగా హింసిస్తున్న వాళ్లకే యెహోవాసాక్షులు మంచివార్త ప్రకటించారు, వాళ్లు కూడా చక్కగా స్పందించారు. ఉదాహరణకు, ఫ్రాంజ్‌ డెష్‌ అనే సహోదరుణ్ణి ఆస్ట్రియాలోని గ్యూసెన్‌ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుకు తరలించినప్పుడు, ఆయన అక్కడి అధికారుల్లో ఒకరితో బైబిలు స్టడీ చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యెహోవాసాక్షుల సమావేశంలో వాళ్లిద్దరు కలుసుకున్నారు. ఇప్పుడు, వాళ్లిద్దరూ మంచివార్త ప్రచారకులే. వాళ్లకు ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో ఊహించండి!

7 హింస వల్ల క్రైస్తవులు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్లిపోయినప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ఉదాహరణకు 1970లలో, మలావీలోని చాలామంది సాక్షులు మొజాంబిక్‌కి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పుడు వాళ్లు మొజాంబిక్‌లో ఉత్సాహంగా సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాతి కాలంలో, మొజాంబిక్‌లో వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా ప్రకటనా పని ఆగకుండా కొనసాగింది. ఫ్రాన్సెస్కో కొయానా అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నిజమే, మాలో కొంతమందిమి ప్రకటనా పని కారణంగా చాలాసార్లు అరెస్టు అయ్యాం. కానీ చాలామంది రాజ్య సందేశాన్ని చక్కగా వినడం మేము చూశాం. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు సహాయం చేసినట్టే, దేవుడు మాకు కూడా సహాయం చేస్తున్నాడని నమ్మకం కలిగింది.”

8. యుద్ధం, ఆర్థిక సంక్షోభం వంటివాటి వల్ల రాజ్య సందేశం ఎక్కువమందికి ఎలా చేరుకుంది?

8 అయితే క్రైస్తవత్వం సుదూర ప్రాంతాలకు చేరడానికి హింస ఒక్కటే కారణం కాదు. ఈమధ్య కాలంలో రాజకీయ మార్పులు, ఆర్థిక సంక్షోభం కారణంగా ఎన్నో దేశాల ప్రజలకు, రకరకాల భాషల వాళ్లకు మంచివార్త వినే అవకాశం దొరికింది. యుద్ధాల వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల కొంతమంది ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆ కొత్త ప్రాంతంలో వాళ్లు బైబిలు స్టడీ తీసుకుంటున్నారు. అలా ఎక్కువమంది శరణార్థులు రావడం వల్ల వేరే భాషా క్షేత్రాలు తెరుచుకుంటున్నాయి. మీ ప్రాంతంలోని వేర్వేరు ‘దేశాల, గోత్రాల, జాతుల, భాషల’ ప్రజలకు ప్రకటించడానికి మీరు కృషి చేస్తున్నారా?—ప్రక. 7:9.

“ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” (అపొ. 8:9-25)

“అపొస్తలులు ఎవరి మీదైనా చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందుతున్నారని సీమోను చూశాడు, కాబట్టి అతను అపొస్తలులకు డబ్బు” ఇవ్వాలనుకున్నాడు.—అపొస్తలుల కార్యాలు 8:18

9. సీమోను ఎవరు? ఆయనకు ఫిలిప్పు చేసే పని ఎందుకు నచ్చి ఉండవచ్చు?

9 ఫిలిప్పు సమరయలో చాలా అద్భుతాలు చేశాడు. ఉదాహరణకు ఆయన రోగుల్ని బాగుచేశాడు, చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు. (అపొ. 8:6-8) ఫిలిప్పుకున్న ఈ అద్భుతమైన వరాలు సీమోను అనే వ్యక్తికి బాగా నచ్చాయి. అతను ఇంద్రజాలం చేసేవాడు. అతని మీద ప్రజలకు ఎంత గౌరవం ఉండేదంటే, వాళ్లు “ఇతను దేవుని శక్తి” అనేవాళ్లు. అయితే ఫిలిప్పు చేసిన అద్భుతాల్లో దేవుని అసలైన శక్తిని కళ్లారా చూశాక సీమోను విశ్వాసి అయ్యాడు. (అపొ. 8:9-13) అయితే, క్రైస్తవుడిగా మారిన సీమోనుకు ఒక పరీక్ష ఎదురైంది. ఏంటది?

10. (ఎ) పేతురు యోహానులు సమరయలో ఏం చేశారు? (బి) పేతురు, యోహాను చేతులు ఉంచినప్పుడు కొత్త శిష్యులు పవిత్రశక్తిని పొందడం చూసి, సీమోను ఏం చేశాడు?

10 సమరయలో చాలామంది దేవుని వాక్యాన్ని అంగీకరించారని అపొస్తలులు విన్నప్పుడు పేతురును, యోహానును అక్కడికి పంపించారు. (“ పేతురు ‘పరలోక రాజ్యం తాళంచెవుల్ని’ ఉపయోగించాడు” అనే బాక్సు చూడండి.) పేతురు, యోహాను సమరయకు రాగానే కొత్త శిష్యుల మీద చేతులు ఉంచారు, అప్పుడు వాళ్లలో ప్రతీ ఒక్కరు పవిత్రశక్తిని పొందారు. b అది చూసి, సీమోను చాలా ఆశ్చర్యపోయాడు. అతను అపొస్తలులతో “నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందేలా, ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అన్నాడు. సీమోను ఈ పవిత్రమైన అవకాశాన్ని డబ్బుతో కొనుక్కోగలను అనుకున్నాడో ఏమో, దానికోసం డబ్బులు కూడా ఇవ్వబోయాడు.—అపొ. 8:14-19.

11. పేతురు సీమోనును ఏమని సరిదిద్దాడు? అప్పుడు సీమోను ఏం చేశాడు?

11 పేతురు సీమోనును గట్టిగానే సరిదిద్దాడు. ఆయన ఇలా అన్నాడు: “నీ వెండి నీతోపాటు నాశనమైపోవాలి. ఎందుకంటే, దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతిని నువ్వు డబ్బుతో కొనుక్కోగలనని అనుకున్నావు. ఈ విషయంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే దేవుని ముందు నీ హృదయం సరిగ్గా లేదు.” పశ్చాత్తాపపడి, క్షమాపణ కోసం ప్రార్థించమని పేతురు సీమోనును ప్రోత్సహించాడు. పేతురు ఇలా అన్నాడు: “యెహోవాను పట్టుదలగా వేడుకో. బహుశా ఆయన నీ హృదయంలోని చెడ్డ ఆలోచనను క్షమిస్తాడేమో.” సీమోను చెడ్డవాడు కాదని తెలుస్తుంది. అతను సరైనదే చేయాలని కోరుకున్నాడు కానీ, ఆ క్షణంలో పక్కదారి పట్టాడు. అందుకే అతను అపొస్తలుల్ని ఇలా వేడుకున్నాడు: “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా దయచేసి నా కోసం యెహోవాను వేడుకోండి.”—అపొ. 8:20-24.

12. అబద్ధ క్రైస్తవులు పదవుల కోసం ఏం చేస్తుంటారు?

12 పేతురు సీమోనుకు ఇచ్చిన సలహా నుండి ఇప్పుడున్న క్రైస్తవులందరూ ఒక పాఠం నేర్చుకోవచ్చు. సంఘంలో సేవావకాశాల్ని కొనుక్కోవడం లేదా అమ్మడం తప్పు అని అది గుర్తుచేస్తుంది. అబద్ధ క్రైస్తవుల్లో మాత్రం ఈ అలవాటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు, ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (1878) ఇలా చెప్తుంది: ‘పోప్‌లను ఎన్నుకునేటప్పుడు, ఆ పదవిని డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్లు అని తెలుస్తుంది. చాలామంది ఏమాత్రం సిగ్గుపడకుండా అలా కొనుక్కునేవాళ్లు. పైగా ఆ విషయాన్ని దాచిపెట్టేవాళ్లు కూడా కాదు.’

13. సంఘంలో సేవావకాశాలు అమ్మకుండా లేదా కొనకుండా క్రైస్తవులు ఎలా జాగ్రత్తపడాలి?

13 క్రైస్తవులు సంఘంలో సేవావకాశాల్ని అమ్మకుండా లేదా కొనకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు బాధ్యతల్లో ఉన్న వాళ్లను బహుమతులతో, పొగడ్తలతో ముంచెత్తి సేవావకాశాలు పొందడానికి ప్రయత్నించకూడదు. బాధ్యతల్లో ఉన్న వాళ్లు కూడా డబ్బున్న వాళ్లమీద పక్షపాతం చూపించకూడదు. అవి రెండూ తప్పే. నిజానికి, దేవుని సేవకుల్లో ప్రతీఒక్కరు “తక్కువవాడిలా” నడుచుకోవాలి, యెహోవా పవిత్రశక్తి తమకు సేవావకాశం ఇచ్చేంతవరకు వేచి ఉండాలి. (లూకా 9:48) “సొంత మహిమ” కోసం పాకులాడే వాళ్లకు దేవుని సంస్థలో చోటు లేదు.—సామె. 25:27.

“నువ్వు చదువుతున్నది నీకు అర్థమౌతోందా?” (అపొ. 8:26-40)

14, 15. (ఎ) ‘ఇతియోపీయుడైన అధికారి’ ఎవరు? ఫిలిప్పు అతన్ని ఎలా కలిశాడు? (బి) ఫిలిప్పు చెప్పింది విన్నాక అతను ఏం చేశాడు? అతను బాప్తిస్మం తీసుకోవడం ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదని ఎందుకు చెప్పవచ్చు? (అధస్సూచి చూడండి.)

14 యెహోవా దూత ఫిలిప్పుతో, యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారిలోకి వెళ్లమని చెప్పాడు. ‘ఎందుకు?’ అని ఫిలిప్పుకు అనిపించి ఉంటుంది. అయితే, ఇతియోపీయుడైన అధికారిని కలిసిన కాసేపటికే ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. (“ నిజంగానే ‘నపుంసకుడా’?” అనే బాక్సు చూడండి.) అతను రథంలో కూర్చుని “యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా” చదువుతున్నాడు. అతన్ని కలుసుకునేలా యెహోవా పవిత్రశక్తి ఫిలిప్పును నడిపించింది. ఫిలిప్పు అతని రథం పక్కనే పరుగెత్తుతూ, “నువ్వు చదువుతున్నది నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు. అందుకు అతను, “ఎవరో ఒకరు విడమర్చి చెప్పకపోతే నాకెలా అర్థమౌతుంది?” అన్నాడు.—అపొ. 8:26-31.

15 ఆ ఇతియోపీయుడు తనతోపాటు రథం ఎక్కి కూర్చోమని ఫిలిప్పును అడిగాడు. వాళ్లిద్దరు ఏమేం మాట్లాడుకున్నారో ఆలోచించండి! యెషయా ప్రవచనంలో ఉన్న “గొర్రె” లేదా “సేవకుడు” ఎవరు అనేది చాలాకాలం పాటు రహస్యంగానే ఉండిపోయింది. (యెష. 53:1-12) అయితే, ఆ “గొర్రె” లేదా “సేవకుడు” యేసుక్రీస్తే అని ఫిలిప్పు ఆ ఇతియోపీయుడికి వివరించాడు. క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజున బాప్తిస్మం తీసుకున్న వాళ్లలాగే, వెంటనే ఏం చేయాలో యూదుడిగా మారిన అన్యజనుడైన ఈ ఇతియోపీయుడికి అర్థమైంది. అతను ఫిలిప్పును, “ఇదిగో! ఇక్కడ నీళ్లు ఉన్నాయి; నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?” అని అడిగాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఫిలిప్పు ఆ ఇతియోపీయుడికి బాప్తిస్మం ఇచ్చాడు. c (“ ‘నీళ్లలో’ బాప్తిస్మం ఇవ్వడం” అనే బాక్సు చూడండి.) తర్వాత, పవిత్రశక్తి ఫిలిప్పును కొత్త నియామకం కోసం అష్డోదుకు నడిపించింది. అక్కడ కూడా ఆయన మంచివార్త ప్రకటిస్తూ ఉన్నాడు.—అపొ. 8:32-40.

16, 17. నేడు ప్రకటనా పనిలో దేవదూతలు ఎలా సహాయం చేస్తున్నారు?

16 ఫిలిప్పు చేసిన లాంటి పనినే చేసే గొప్ప అవకాశం నేడు క్రైస్తవులకు ఉంది. వాళ్లు ప్రయాణిస్తున్నప్పుడు గానీ, ఎవరినైనా అనుకోకుండా కలిసినప్పుడు గానీ రాజ్య సందేశాన్ని ప్రకటిస్తారు. చాలా సందర్భాల్లో, అలా మంచి మనసున్న వాళ్లను కలవడం అనేది అనుకోకుండా జరిగిందైతే కాదు. ఎందుకంటే “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు” సువార్త అందేలా దేవదూతలు ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నారని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (ప్రక. 14:6) ప్రకటనా పనిని నిర్దేశించడంలో దేవదూతల పాత్ర గురించి యేసు కూడా చెప్పాడు. గోధుమలు-గురుగుల ఉదాహరణలో, కోతకాలంలో అంటే ఈ వ్యవస్థ ముగింపులో దేవదూతలు కోత కోస్తారని యేసు చెప్పాడు. అంతేకాదు, ‘ఆ దూతలు ఇతరులు పాపం చేయడానికి కారణమయ్యేవాళ్లను, చెడ్డపనులు చేసేవాళ్లను ఆయన రాజ్యంలో నుండి తొలగిస్తారు’ అని కూడా యేసు చెప్పాడు. (మత్త. 13:37-41) అదేసమయంలో, యెహోవా దేవదూతల్ని ఉపయోగించి అభిషిక్తుల్ని, అలాగే ‘వేరే గొర్రెలకు’ చెందిన ‘గొప్పసమూహాన్ని’ ఆకర్షిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు.—ప్రక. 7:9; యోహా. 6:44, 65; 10:16.

17 దేవదూతలు ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నారు అనడానికి రుజువు ఏంటంటే, మనం పరిచర్యలో కలిసినప్పుడు కొంతమంది, ‘ఇప్పుడే దేవునికి ప్రార్థిస్తున్నాం ఇంతలో మీరు వచ్చారు’ అని చెప్తుంటారు. ఒక అనుభవం గమనించండి. ఇద్దరు సాక్షులు ఒక చిన్న పిల్లవాడితో కలిసి ఇంటింటి పరిచర్య చేస్తున్నారు. మధ్యాహ్నం అయినప్పుడు ఆ ఇద్దరు సాక్షులు ప్రకటనా పని ఆపేసి వెళ్లిపోదాం అనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు ఉత్సాహంతో ఇంకో ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. అప్పుడు ఒకామె తలుపు తీయడంతో, ఆ సాక్షులు ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ‘బైబిల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసేలా ఎవరో ఒకరిని పంపించమని ఇప్పుడే దేవునికి ప్రార్థిస్తున్నాను, ఇంతలో మీరు వచ్చారు’ అని ఆమె వివరించింది. వెంటనే బైబిలు స్టడీ మొదలైంది!

“దేవా! నువ్వు నిజంగా ఉంటే, దయచేసి నాకు సహాయం చేయి”

18. పరిచర్య చేసే అవకాశాన్ని మనం ఎందుకు తేలిగ్గా తీసుకోకూడదు?

18 మనకాలంలో ప్రకటనా పని కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోంది. దేవదూతలతో కలిసి ఆ పని చేసే గొప్ప అవకాశం క్రైస్తవులుగా మీకుంది. ఆ అవకాశాన్ని తేలిగ్గా తీసుకోకండి. “యేసు గురించిన మంచివార్త” ప్రకటించడంలో పట్టుదలగా కృషిచేస్తే, మీరు గొప్ప ఆనందం పొందుతారు.—అపొ. 8:35.

a ఈయన అపొస్తలుడైన ఫిలిప్పు కాదు. ఈ పుస్తకంలోని 5వ అధ్యాయంలో చూసినట్టు, యెరూషలేములో గ్రీకు మాట్లాడే విధవరాళ్లకు, హీబ్రూ మాట్లాడే విధవరాళ్లకు ప్రతీరోజు ఆహారం పంచిపెట్టడానికి నియమించబడిన ‘మంచిపేరు ఉన్న ఏడుగురు పురుషుల్లో’ ఈ ఫిలిప్పు ఒకడు.—అపొ. 6:1-6.

b సాధారణంగా ఆ కాలంలో, కొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పవిత్రశక్తితో అభిషేకించబడేవాళ్లు లేదా పవిత్రశక్తిని పొందేవాళ్లు అని తెలుస్తుంది. అలా, భవిష్యత్తులో యేసుతో కలిసి పరలోకంలో రాజులుగా, యాజకులుగా పరిపాలించే అవకాశం వాళ్లకు దొరికేది. (2 కొరిం. 1:21, 22; ప్రక. 5:9, 10; 20:6) అయితే సమరయలోని ఈ కొత్త శిష్యులు పవిత్రశక్తిని, దాని అద్భుతమైన వరాల్ని పొందడం బాప్తిస్మం తీసుకున్నప్పుడు జరగలేదు కానీ, పేతురు యోహానులు వచ్చి చేతులు ఉంచిన తర్వాతే జరిగింది.

c అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. అతను ఒక యూదుడిగా మారిన అన్యజనుడు. కాబట్టి లేఖనాల గురించి, ముఖ్యంగా మెస్సీయ ప్రవచనాల గురించి అతనికి ఇదివరకే తెలుసు. ఇప్పుడు దేవుని ఉద్దేశంలో యేసు పాత్ర ఏంటో తెలుసుకున్నాక, ఇక ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకున్నాడు.