కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అగ్నితో పుటం వేయబడిన బంగారాన్ని కొనండి

అగ్నితో పుటం వేయబడిన బంగారాన్ని కొనండి

అధ్యాయం 13

అగ్నితో పుటం వేయబడిన బంగారాన్ని కొనండి

లవొదికయ

1, 2. మహిమనొందిన యేసునుండి వర్తమానం అందుకోనైయున్న ఏడు సంఘాల్లో చివరిదేది, మరి ఆ పట్టణపు కొన్ని రూపురేఖలేమిటి?

లవొదికయ, పునరుత్థానుడైన యేసునుండి వర్తమాన మందుకున్న ఏడు సంఘాల్లో చివరిది. అదెంత మనోవికాసం కల్గించే, పురికొల్పునిచ్చే సమాచారమోగదా!

2 ఈనాడు మీరు లవొదికయ శిథిలాలను, ఆలాషహీర్‌కు ఆగ్నేయదిశలో 88 కిలోమీటర్ల దూరంలోనున్న డెనిజ్లి సమీపాన కనుగొంటారు. మొదటి శతాబ్దంలో లవొదికయ సంపన్న పట్టణమే. పెద్ద రోడ్డుకూడలి సమీపానున్న యీపట్టణం బ్యాంకింగ్‌ వ్యవస్థకు, వాణిజ్యానికి ప్రముఖ కేంద్రం. పేరుగాంచిన కంటికాటుక అమ్మకం దాని ధనసంపదకు తోడైంది, అంతేగాక అది నల్లని ఉన్నితో స్థానికంగా తయారు చేయబడిన ఎంతోనాణ్యతగల వస్త్రాలకుకూడ ప్రసిద్ధిచెందిందే. కొద్దిదూరంలోని వేడిగావున్న ఊటలనుండి నీటిని రప్పించడం ద్వారా ఆ పట్టణానికున్న పెద్ద నీటిసమస్య తీరింది. అలా ఆ నీరు పట్టణాన్ని చేరే లోపుగా కొంచెం నులివెచ్చగా మారుతాయి.

3. లవొదికయ సంఘానికి యేసు ఎలా వర్తమానాన్ని ప్రారంభిస్తున్నాడు?

3 లవొదికయ కొలొస్సయికి దగ్గరలోవుంది. పౌలు కొలొస్సయులకు వ్రాస్తూ తాను లవొదికయులకు వ్రాసిన పత్రిక విషయం తెలిపాడు. (కొలొస్సయులు 4:15, 16) పౌలు అందులో ఏమి వ్రాశాడో మనకు తెలియదు, గాని యేసు యిప్పుడు లవొదికయులకు పంపిస్తున్న వర్తమానం మాత్రం వారు ఆత్మీయ హీనస్థితిలోకి దిగజారినట్లు చూపిస్తుంది. అయిననూ, యేసు మామూలుగానే తన అర్హతలనుగూర్చి యిలా చెబుతున్నాడు: “లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము—ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పుసంగతులు.”—ప్రకటన 3:14.

4. యేసు ఎలా “ఆమేన్‌” అవుతున్నాడు?

4 యేసు ఎందుకు తాను “ఆమేన్‌” అని సంబోధించుకుంటున్నాడు? ఈ బిరుదు తన వర్తమానానికి న్యాయపరమైన బలాన్నిస్తుంది. “ఆమేన్‌” అనే యీపదం “నిశ్చయంగా,” “అలా జరుగునుగాక,” అని అర్థమిచ్చే హెబ్రీ పదానికి అక్షరానువాదం, ప్రార్థనలో వ్యక్తపరచబడ్డవాటిని స్థిరపర్చడానికి దాన్ని ప్రార్థనాంతంలో పలికేవారు. (1 కొరింథీయులు 14:16) యేసు “ఆమేన్‌” అయివున్నాడు, ఎందుకంటే తన మచ్చలేని యథార్థత, త్యాగపూరిత మరణం, యెహోవా ప్రశస్తమైన వాగ్దానాలను స్థిరపరచి, అభయమిచ్చాయి. (2 కొరింథీయులు 1:20) అప్పటినుండి, ప్రార్థనలన్నీ యేసుక్రీస్తు ద్వారా యుక్తంగా యెహోవాకే చేయబడుతున్నాయి.—యోహాను 15:16; 16:23, 24.

5. యేసు ఎలా “నమ్మకమైన సత్యసాక్షి” అవుతున్నాడు?

5 యేసు “నమ్మకమైన సత్యసాక్షి” కూడ. యెహోవా దేవుని సేవకునిగా ఆయన పూర్తిగా నమ్మదగినవాడు గనుక ప్రవచనాల్లో ఆయన తరచూ, నమ్మకత్వం, సత్యం, నీతి అనే పదాలతో సంబోధించబడ్డాడు. (కీర్తన 45:4; యెషయా 11:4, 5; ప్రకటన 1:5; 19:11) ఆయన యెహోవాకు మహాగొప్పసాక్షి. నిజానికి, “దేవుని సృష్టికి ఆదియునైన,” వాడుగా, యేసు ఆదినుండి దేవుని మహిమను ప్రకటించాడు. (సామెతలు 8:22-30) భూమ్మీద మానవునిగా ఆయన సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చాడు. (యోహాను 18:36, 37; 1 తిమోతి 6:13) తన పునరుత్థానం తర్వాత, తన శిష్యులకాయన పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానంచేస్తూ, యిలా చెప్పాడు. “మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైయుందురు.” సా.శ. 33నుండి యేసు యీ అభిషక్త క్రైస్తవులు, “ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి,” సువార్త ప్రకటించడానికి వారిని నడిపిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 1:6-8; కొలొస్సయులు 1:23) నిజంగా, యేసు నమ్మకమైన సత్యసాక్షియని పిలువబడుటకు అర్హుడే. లవొదికయలోనున్న అభిషక్త క్రైస్తవులు ఆయన మాటల్ని వినడం ద్వారా ప్రయోజనం పొందగలరు.

6. (ఎ) లవొదికయ సంఘంలోని ఆత్మీయ పరిస్థితిని యేసు ఎలా వర్ణిస్తున్నాడు? (బి) యేసు చూపిన శ్రేష్ఠమైన ఏ మాదిరిని లవొదికయ క్రైస్తవులు అనుసరించుటకు విఫలులయ్యారు?

6 లవొదికయులకు యేసు ఎటువంటి వర్తమానాన్ని కల్గివున్నాడు? ఆయన వారిని ప్రశంసించడంలేదు. నిర్మొహమాటంగా, ఆయన వారితో యిలా అంటున్నాడు: “నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.” (ప్రకటన 3:15, 16) ప్రభువైన యేసునుండి వచ్చే అటువంటి వర్తమానమునకు నీవెలా స్పందిస్తావు? నీవు మేల్కొని నిన్నునీవు పరిశీలించుకొనవా? నిశ్చయంగా, లవొదికయలోనివారు తమ్మునుతాము పురికొల్పుకోవలసి యుండిరి, ఎందుకంటే ఆ ఏమి ఫర్వాలేదనుకుంటూ వారు ఆత్మీయంగా సోమరులయ్యారు. (2 కొరింథీయులు 6:1 పోల్చండి.) క్రైస్తవులుగా వారు అనుకరించవలసిన యేసు, ఎల్లప్పుడూ యెహోవా యెడల, ఆయన సేవయెడల ఎంతో ఆసక్తిని చూపిస్తుంటాడు. (యోహాను 2:17) ఇంకను, ముచ్చెమటలుపోసే మండుటెండలో ఓ గ్లాసు చన్నీళ్లు ఎలా సేదదీర్చేవిగా ఉంటాయో, సాత్వికులాయనను ఎల్లప్పుడూ మృదువుగాను, సాత్వికుడుగాను ఉన్నట్లే గమనించారు. (మత్తయి 11:28, 29) అయితే, లవొదికయలోని క్రైస్తవులు అటువేడిగాలేరు, యిటుచల్లగాలేరు. ఆ పట్టణంలోనికి ప్రవహిస్తున్న నీటివలె వారు గోరువెచ్చగా, నులివెచ్చగావున్నారు. వారు యేసు ‘నోటనుండి ఉమ్మివేయ’బడేంతగా, పూర్తిగా తిరస్కరింపబడడానికే అర్హులైయున్నారు. యేసువలె, ఇతరులకు ఆత్మీయదాహం తీర్చడానికి మనవంతును మనం చేయడానికి మనమెల్లప్పుడూ ఆసక్తితో ప్రయాసపడదామా?—మత్తయి 9:35-38.

“నేను ధనవంతుడను, అని చెప్పుకొనుచున్నావు

7. (ఎ) లవొదికయలోని క్రైస్తవుల అసలు కారణాన్ని యేసు ఎలా గుర్తిస్తున్నాడు? (బి) లవొదికయ క్రైస్తవులు ‘గ్రుడ్డివారును దిగంబరులునై’ యున్నారని యేసు ఎందుకు చెబుతున్నాడు?

7 నిజంగా లవొదికయ సంఘస్థుల సమస్యకుగల అసలు కారణమేమిటి? యేసు తదుపరి చెప్పిన దాన్నిబట్టి మనమొక మంచి తలంపుకొస్తాం: “నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక—నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.” (ప్రకటన 3:17; లూకా 12:16-21 పోల్చండి) ధనసంపదగల పట్టణంలో జీవిస్తున్నందున వారికున్న ధనాన్నిబట్టి వారు నిశ్చింతగా వుండవచ్చు. బహుశ, స్టేడియం, రంగస్థలాలు, వ్యాయామశాలల మూలంగా వారు ప్రభావితులై, “దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారై,” ఉండి వుంటారు. * (2 తిమోతి 3:4) అయితే, ధనవంతులైన లవొదికయులు ఆత్మీయంగా దరిద్రులయ్యారు. వారు ‘పరలోకమందు ధనం దాచుకున్నా’ అది ఏకొద్దిగానో ఉండొచ్చు. (మత్తయి 6:19-21) దేవుని రాజ్యానికి ప్రథమస్థానమిస్తూ వారి కంటిని తేటగా ఉంచుకోలేదు. వారు నిజంగా అంధకారంలో ఉన్నారు, అంధులు, ఆత్మీయ దృష్టి లేనివారు, (మత్తయి 6:22, 23, 33) అంతేగాక, వారికున్న ధనాన్నిబట్టి వారు విలువైన వస్త్రాలను కొన్నప్పటికి యేసు దృష్టికి వారు దిగంబరులే. వారు క్రైస్తవులని వారిని గుర్తించే ఆత్మీయవస్త్రాలు వారియొద్ద లేవు.—ప్రకటన 16:15 పోల్చండి.

8. (ఎ) లవొదికయలోనున్న పరిస్థితే యీనాడు కూడ ఏవిధంగా ఉంది? (బి) ఈ పేరాశగల ప్రపంచంలో కొందరు క్రైస్తవులెలా తమ్మునుతాము మోసపుచ్చుకున్నారు?

8 ఎంతటి నివ్వెరపోయే పరిస్థితోగదా! అయితే మనమీనాడు అటువంటి పరిస్థితినే తరచూ చూడడంలేదా? దీనికిగల మూల కారణమేమిటి? ఇదంతా సంపద, మానవ వనరులమీద అమిత నమ్మకం కల్గివుండడం మూలంగా అటువంటి పరిస్థితిని చూస్తున్నాం. యెహోవాసాక్షులలో కొందరు, క్రైస్తవమతంలో చర్చికెళ్లే వారివలె, అప్పుడప్పుడూ కూటాలకెళ్తూ దేవున్ని ప్రీతిపర్చవచ్చు ననుకుంటూ తమ్మును తాము మోసపుచ్చుకున్నారు. వారు పేరుకుమాత్రమే “వాక్యప్రకారం ప్రవర్తించు” వారైవుండాలని ప్రయత్నిస్తున్నారు. (యాకోబు 1:22) యోహాను తరగతి మాటిమాటికి హెచ్చరిస్తున్నప్పటికి, వారు తమ మనస్సులను అందమైన దుస్తులు, కార్లు, ఇండ్లు మరియు వినోదం, సుఖభోగాలమీద కేంద్రీకరించబడ్డ జీవితంపై నిలుపుతున్నారు. (1 తిమోతి 6:9, 10; 1 యోహాను 2:15-17) ఇదంతా ఆత్మీయ వివేకాన్ని మందగింప జేస్తుంది (హెబ్రీయులు 5:11, 12) వారు తదేకంగా నులివెచ్చగా ఉండేబదులు, “ఆత్మను ఆర్పకుండ” వెలిగించుకుంటూ, “వాక్యమును ప్రకటించు”టలో ఉత్తేజపూరిత ఆసక్తినిచూపే అవసరత వుంది.—1 థెస్సలొనీకయులు 5:19; 2 తిమోతి 4:2, 5.

9. (ఎ) యేసుచెప్పిన ఏ మాటలు నులివెచ్చగానున్న క్రైస్తవులను కదలించాలి, ఎందుకు? (బి) తప్పిపోతున్న “గొర్రెలకు” సంఘమెలా సహాయం చేయగలదు?

9 యేసు యీ నులివెచ్చని క్రైస్తవులనెలా పరిగణిస్తాడు? ఆయన వివేకంగల మాటలు వారిని కదలించాలి. “నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలినవాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగవు.” కనీసం తమ దుస్థితిని గుర్తించలేని రీతిగా వారి మనస్సాక్షి మందగించింది. (సామెతలు 16:2; 21:2 పోల్చండి.) సంఘంలోవుండే యిటువంటి తీవ్రమైన పరిస్థితిని అంతసులభంగా కొట్టిపారవేయలేం. పెద్దలు, వారిచేత నియమించబడ్డవారు ఆసక్తి విషయంలో మంచిమాదిరి చూపిస్తూ, ప్రేమతో కాయుచూ, తప్పిపోయే యిటువంటి “గొర్రెలను” వారికి పూర్వమున్న హృదయపూర్వక సేవాసక్తిని బహుశ పునరుద్ధరించగలరు.—లూకా 15:3-7.

‘ధనవంతులగుటను’ గూర్చిన హెచ్చరిక

10. యేసు తన యొద్దనుండి లవొదికయ క్రైస్తవులను కొనమని వారితో చెప్పిన “బంగారము” ఏమిటి?

10 లవొదికయలో వున్న విచారకర పరిస్థితికి ఏదైనా చికిత్సవుందా? అవును, ఆ క్రైస్తవులు యేసు సలహాను పాటిస్తే దానికి చికిత్సవుంది: “నీవు ధనవృద్ధి చేసికొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును . . . నాయొద్ద కొనుమని నీకుబుద్ధి చెప్పుచున్నాను.” (ప్రకటన 3:18) అగ్నిలో పుటం వేయబడి, సమస్త మస్టు తీసివేయబడిన క్రైస్తవ “బంగారం” వారిని “దేవుని యెడల ధనవంతులుగా” చేస్తుంది. (లూకా 12:21) వారటువంటి బంగారాన్ని ఎక్కడ కొనగలరు? స్థానిక వ్యాపారస్థుల వద్దనుండి కాదుగాని యేసు వద్దనే! “రాబోవు కాలమునకు మంచి పునాదిని తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనముగలవారును, ఔదార్యముగలవారును . . . ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని,” ధనవంతులైన క్రైస్తవులకు ఆజ్ఞాపించాలని అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినప్పుడు ఆ బంగారమంటే ఏమిటో వివరిస్తున్నాడు. వారిలా ప్రయాసపడడం ద్వారానే వారు “వాస్తవమైన జీవము సంపాదించుకొన” గలరు. (1 తిమోతి 6:17-19) ధనసంపన్నులైన లవొదికయులు పౌలు సలహాను పాటించి ఆత్మీయంగా ధనవంతులై ఉండ వలసింది.—సామెతలు 3:13-18 కూడ చూడండి.

11. “అగ్నిలో పుటమువేయబడిన బంగారమును” కొనేవారి ఏ ఆధునిక ఉదాహరణలు మనకున్నవి?

11 “అగ్నిలో పుటము వేయబడిన బంగారమును” కొంటున్నవారి ఆధునికకాల ఉదాహరణ లున్నాయా? అవును ఉన్నాయి. ప్రభువు దినము సమీపిస్తుండగా, బైబిలు విద్యార్థుల చిన్న గుంపొకటి, క్రైస్తవమత సామ్రాజ్యపు అబద్ధబోధలు అంటే త్రిత్వము, అమర్త్యమైన ఆత్మ, నరకాగ్నియాతన, శిశుబాప్తిస్మం, మరియు ప్రతిమల ఆరాధన (సిలువ, మరియ ప్రతిమలతోసహా) విషయంలో మేల్కొనడాని కారంభించారు. బైబిలు సత్యాన్ని చాటిచెప్పడంలో ఈ క్రైస్తవులు యెహోవా రాజ్యమే మానవుల ఏకైక నిరీక్షణయని, యేసు విమోచనా బలియే రక్షణకాధారమని ప్రకటించారు. బైబిల్లో ప్రవచింపబడిన అన్యజనముల కాలములు అంతమయ్యేది 1914 లోనేనని, అప్పుడు రాజకీయ మతసంబంధమైన శక్తులు కదలింపబడతాయని, దాదాపు 40 సంవత్సరాలకు ముందేవారు సూచించారు.— ప్రకటన 1:10; లూకా 21:24-26, కింగ్‌జేమ్స్‌ వెర్షన్‌.

12. మేలుకొంటున్న క్రైస్తవులలో నాయకత్వం వహించిన దెవరు, మరియు పరలోకమందు ధనాన్ని సమకూర్చుటలో ఆయన ఎటువంటి శ్రేష్ఠమైన మాదిరిని చూపించాడు?

12 మేల్కొంటున్న యీ క్రైస్తవులకు నాయకత్వం వహించిన వ్యక్తి చార్లెస్‌ టేజ్‌ రస్సల్‌, ఈయన 1870 దశాబ్దపు ప్రథమార్థంలో అమెరికానందలి పెన్సిల్వేనియాలోని ఆలెఘనీలో (యిప్పుడిది పిట్స్‌బర్గ్‌లో ఓ భాగం) ఒక బైబిల్‌ స్టడీ క్లాస్‌ను ఏర్పాటుచేశారు. ఆయన సత్యాన్వేషణ ప్రారంభించేనాటికి తన తండ్రితో భాగస్వామియై కోటీశ్వరుడయ్యే స్థితికెదిగాడు. అయితే ఆయన తన వ్యాపారాన్నంతా అమ్మివేసి, లోకమంతా దేవుని రాజ్యాన్ని ప్రకటించే నిమిత్తం ఆర్థికసహాయం చేయడానికి ఆ డబ్బంతా ఖర్చుచేశాడు. ఇప్పుడు వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా అనబడే సంస్థకు 1884 లో ఆయన మొట్టమొదటి అధ్యక్షుడయ్యాడు. పశ్చిమ అమెరికా ప్రాంతంలో తన అంతిమ ప్రచారయాత్రలో అలసిపోయి న్యూయార్క్‌నకు తిరుగుప్రయాణం చేస్తూ టెక్సాస్‌లోని ఎల్‌పాపో దగ్గర రైల్లోనే చనిపోయాడు. పరలోకమందు ఆత్మీయ ధనాన్ని సమకూర్చుకొనుటలో ఆయన శ్రేష్ఠమైన మాదిరిని చూపాడు, ఆ మాదిరిని 19వ శతాబ్దాంతంలోని వేలాదిమంది స్వయంత్యాగ పయినీర్‌ సేవకులు అనుసరిస్తున్నారు.—హెబ్రీయులు 13:7; లూకా 12:33, 34; మరియు 1 కొరింథీయులు 9:16; 11:1లను పోల్చండి.

కంటికి ఆత్మీయ కాటుకను పెట్టుకొనుట

13. (ఎ) ఆత్మీయ కంటికాటుక ఎలా లవొదికయుల పరిస్థితిని మెరుగుపరచును? (బి) ఎటువంటి వస్త్రాలను ధరించాలని యేసు సిఫారసు చేస్తున్నాడు?

13 యేసు ఆ లవొదికయులను యిలా చాలాతీవ్రంగా హెచ్చరిస్తున్నాడు: “నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుము.” (ప్రకటన 3:18బి) స్వస్థపరచే స్థానికులవద్దనుండి గాక, యేసు మాత్రమే ఏర్పాటుచేయగల స్వస్థతనిచ్చే కాటుకను కొనడంద్వారా వారు తమ ఆత్మీయ అంధత్వానికి మందును వెదకాలి. ఇది వారు ఆత్మీయ వివేకాన్ని పొందడానికి సహాయపడుతుంది, దేవునిచిత్తాన్ని చేయడానికి వారి దృష్టినిసారించి “నీతిమంతుల మార్గములో” నడుచుకోవడానికి తోడ్పడుతుంది. (సామెతలు 4:18, 25-27) అలా వారు లవొదికయలో స్థానికంగా తయారయ్యే విలువైన నల్లని ఉన్ని వస్త్రాలనుగాక, యేసుక్రీస్తు అనుచరులుగా ఆధిక్యతతో కూడిన గుర్తింపును ప్రకటించే శ్రేష్ఠమైన “తెల్లని వస్త్రములను” ధరించుకోవచ్చును.—1 తిమోతి 2:9, 10; 1 పేతురు 3:3-5 పోల్చండి.

14. (ఎ) మరి 1879నుండి ఏ ఆత్మీయ కంటికాటుక లభిస్తుంది? (బి) యెహోవాసాక్షుల ఆర్థిక సహాయానికి అసలు మూలమెవరు? (సి) విరాళములను వినియోగించడంలో యెహోవాసాక్షులెలా ఇతరులకు భిన్నంగా ఉన్నారు?

14 ఆత్మీయ కాటుక ఆధునిక కాలంలో లభిస్తుందా? నిశ్చయంగా లభిస్తుంది. పాస్టర్‌ రస్సల్‌ అని ఆప్యాయంగా పిలువబడినవ్యక్తి 1879 సంవత్సరములో, యిప్పుడు కావలికోట యెహోవా రాజ్యమును ప్రకటించుచున్నది అని ప్రపంచమంతట పిలువబడుతున్న పత్రికను ప్రారంభించాడు. ఆయన దాని రెండవ సంచిలో యిలా అన్నాడు: “[ఈ పత్రిక] మేము నమ్ముతున్నట్లు దీని మూలకర్త యెహోవా, అందుచేత మద్దతుకొరకు ఇది మనుష్యులను యాచించదు, అర్థించదు. ‘బంగారు, వెండి, పర్వతాలు సమస్తం నావేగదా అని’ చెబుతున్నవాడు దానికి అవసరమయ్యే ఆర్థికసహాయం అందించకపోతే, అప్పుడు మేము యీపత్రికను నిలిపివేయవలసిన సమయం వచ్చిందని అనుకుంటాం.” ఈ 20శతాబ్దపు టెలివిజన్‌ సువార్తికులు కొందరు అపార ధనాన్నార్జించి, సిగ్గుమాలిన (కొన్నిసార్లు అవినీతి ప్రవర్తనతో) సుఖభోగాల ననుభవించారు. (ప్రకటన 18:3 పోల్చండి) అలాకాకుండ, ఈనాడు యెహోవాసాక్షులని పిలువబడుతున్న, బైబిలు విద్యార్థులు అర్థించని ఆర్థిక విరాళాలన్నింటిని, యెహోవా తేనైయున్న రాజ్యాన్ని లోకమంతా ప్రకటించే ఏర్పాట్లకును సేవకును వినియోగించారు. యోహాను తరగతి యీ రోజువరకు కావలికోట, తేజరిల్లు! పత్రికల ప్రచురణను నిర్వహిస్తూనేవుంది, మరి 1993 లో యీ రెండు పత్రికలు కలిపి మొత్తం 2 కోట్ల 90 లక్షలకంటె ఎక్కువ కాపీలు పంచిపెట్టబడ్డాయి. కావలికోట వందకంటె ఎక్కువ భాషల్లో అందుబాటులోవుంది. అబద్ధమత మేమిటో తేటగా చూడడానికిని, సకలజనములకు సువార్త ప్రకటించే అత్యవసరతను గుర్తించడానికి అటువంటి ఆత్మీయ కంటికాటుకను ఉపయోగిస్తున్న నలభై లక్షలకంటె ఎక్కువమంది ఉన్న క్రైస్తవ సంఘానికది అధికార పత్రిక.—మార్కు 13:10.

గద్దింపు, క్రమశిక్షణలనుండి ప్రయోజనం పొందుట

15. లవొదికయలోని క్రైస్తవులకు యేసు ఎందుకు గట్టి సలహా యిస్తున్నాడు, క్రైస్తవ సంఘమెలా దానికి స్పందించాలి?

15 ఇక మనం లవొదికయుల దగ్గరికి వెళ్దాం. యేసు నుండివచ్చే కఠినమైన సలహాకు వారెలా స్పందిస్తారు? వారు ధైర్యంవీడి, ఆయన వారిని తన అనుచరులుగా ఉండాలని కోరుకోవడం లేదని అనుకుంటారా? లేదు, అసలలా అనుకోరు. ఆ వర్తమానమిలా కొనసాగుతోంది: “నేను ప్రేమించు వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.” (ప్రకటన 3:19) యెహోవా నుండివచ్చే క్రమశిక్షణ ఆయన ప్రేమకు నిదర్శనమైనట్లే, యేసు యిచ్చే క్రమశిక్షణ కూడ అలాంటిదే. (హెబ్రీయులు 12:4-7) లవొదికయ సంఘం ఆయన అనురాగంతో కూడిన ఆసక్తిని ఆహ్వానించి వారాయన సలహాను పాటించాలి. వారి నులివెచ్చనితనం పాపంతో సమానమని ఎంచి వారు మారుమనస్సు పొందాలి. (హెబ్రీయులు 3:12, 13; యాకోబు 4:17) వారి పెద్దలు తమ ధనాపేక్షా మార్గాలను విడనాడి వారికి దేవుని నుండి లభించిన కృపావరాన్ని “ప్రజ్వలింప చేయాలి.” ఆత్మీయ కంటికాటుక ప్రభావం పనిచేస్తుండగా, నీటి ఊటలోని చన్నీళ్ల చల్లదనాన్ని పొందినచందాన, సంఘంలోని వారంతా దానినుండి సేదదీర్చు కొందురుగాక.—2 తిమోతి 1:6; సామెతలు 3:5-8; లూకా 21:34.

16. (ఎ) యేసు ప్రేమానురాగాలు యీనాడెలా చూపించబడుతున్నాయి? (బి) మనకు గట్టిసలహా దొరికితే మనమెలా స్పందించాలి?

16 నేడు మన విషయమేమిటి? యేసు ‘లోకమందున్న తనవారిని’ ప్రేమిస్తునే ఉన్నాడు. “యుగసమాప్తివరకు సదాకాలము” ఆయనిలా చేస్తాడు. (యోహాను 13:1; మత్తయి 28:20) ఆయన ప్రేమానురాగాలు ఆధునిక యోహాను తరగతి మరియు క్రైస్తవ సంఘంలోని పెద్దలు లేక నక్షత్రముల ద్వారా చూపించబడుతున్నాయి. (ప్రకటన 1:20) ఈ శోధన కాలంలో, మనమీ లోకపు అవినీతికర మాలిన్యాన్ని, ధనాపేక్షతోకూడిన దురాశను, స్వేచ్ఛా స్వభావాన్ని ఎదిరిస్తూ, దైవిక సంఘంలోనే ఉండడానికి, పిన్నలు పెద్దలైన మనందరికి సహాయం చేయడానికి సంఘపెద్దలెంతో ఆసక్తి గల్గివున్నారు. కొన్నిసార్లు మనం గట్టిసలహా లేక శిక్షను పొందితే, “శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు” అని జ్ఞాపకముంచు కొందాము. (సామెతలు 6:23) మనందరం అసంపూర్ణులం, మనం సరిదిద్దబడి దేవుని ప్రేమలో నిలిచియుండడానికి మారుమనస్సు పొందే ఆసక్తి గల్గివుండాలి.—2 కొరింథీయులు 13:11.

17. ధనం ఎలా మనకు ఆత్మీయంగా అపాయకరం కాగలదు?

17 ధనాపేక్ష, ఐశ్వర్యం, లేదా పేదరికం మనల్ని నులివెచ్చగా చేయడానికి మన మనుమతించకూడదు. ధనం క్రొత్త సేవావకాశాలను తెరచుటలో సహాయపడగలదు, అయితే అందులో అపాయం కూడావుంది. (మత్తయి 19:24) ధనవంతుడు, తాను తరచుగా విరాళాలు యిస్తున్నంత కాలం ఇతరులవలె తాను సువార్తసేవలో అంత ఆసక్తి చూపవలసిన అవసరంలేదని అనుకోవచ్చు. లేదా ధనవంతునిగా తాను అనుగ్రహ పాత్రుడని అనుకోవచ్చు. అంతేగాక, ధనవంతునికి ఇతరులకులేని సుఖభోగాలు, సరదా పనులున్నాయి. అటువంటి సరదాపనులు సమయాన్ని వృధా చేయడమేగాక, అజాగ్రత్తగల వ్యక్తిని క్రైస్తవ పరిచర్యనుండి పడిపోయేలా చేయవచ్చు, అలా చివరకవి ఆ అవివేకిని నులివెచ్చగా చేస్తాయి. మనమలాంటి ఉరులను తప్పించుకుందాం, మరియు నిత్యజీవనిరీక్షణతో, హృదయ పూర్వకంగా “ప్రయాసముతో పాటుపడుదాము.”—1 తిమోతి 4:8-10; 6:9-12.

‘భోజనం చేయుట’

18. యేసు లవొదికయుల ఎదుట ఏ అవకాశాన్ని ఉంచాడు?

18 యేసు యింకా యిలా చెబుతూనే వున్నాడు: “ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.” (ప్రకటన 3:20) లవొదికయలోని క్రైస్తవులు యేసును తమ సంఘంలోనికి ఆహ్వానిస్తే చాలు, వారు తమ నులివెచ్చని స్థితిని జయించడానికి ఆయన వారికి సహాయ పడతాడు!—మత్తయి 18:20.

19. లవొదికయ సంఘంతోపాటు భోజనం చేస్తానని వాగ్దానం చేయడంలో యేసు దేనిని సూచిస్తున్నాడు?

19 యేసు భోంచేస్తానని చెప్పడం, ఆయన తన శిష్యులతో కలిసి భోంచేయడం, నిశ్చయంగా లవొదికయులకు జ్ఞాపకంవచ్చే వుండవచ్చు. (యోహాను 12:1-8) అటువంటి సందర్భాలు, వాటికి హాజరైన వారికెల్లవేళలా ఆత్మీయాశీర్వాదాలు తెచ్చేవి. అలాగే, యేసు పునరుత్థానుడైన తర్వాత ఆయన తన శిష్యులతోపాటు భోజనానికి హాజరైన, గుర్తుంచుకోదగిన సందర్భాలున్నాయి, ఆ సందర్భాలు వారినెంతో బలపర్చాయి. (లూకా 24:28-32; యోహాను 21:9-19) కావున, ఆయన లవొదికయ సంఘం లోనికివచ్చి వారితో భోంచేస్తానని ఆయన అనడం, వారాహ్వానిస్తే వారికి ఆత్మీయాశీర్వాదాల ననుగ్రహిస్తానని వాగ్దానం చేయడమే.

20. (ఎ) ప్రభువు దినము ఆరంభంలో క్రైస్తవమత సామ్రాజ్యం నులివెచ్చని స్థితిమూలంగా ఏమి సంభవించింది? (బి) యేసు తీర్పు క్రైస్తవమత సామ్రాజ్యంపై ఎలా ప్రభావం చూపింది?

20 యేసు లవొదికయులకిచ్చిన ఉపదేశం యినాడు అభిషక్త శేషపు క్రైస్తవులకెంతో ప్రాముఖ్యతను కల్గివుంది. ప్రభువు దినము ఆరంభమైనపుడు క్రైస్తవ మతసామ్రాజ్య మతస్థుల్లో చాలామంది నులివెచ్చగా వుండిరని వీరిలో కొందరికి జ్ఞాపకముంది. మన ప్రభువు రాకడను 1914 లో ఆహ్వానించే బదులు, దాని మతగురువులు మొదటి ప్రపంచయుద్ధ నరమేధంలో తలదూర్చారు, ఆ యుద్ధరంగంలో దిగిన 28 దేశాల్లోని 24 దేశాలు తాము క్రైస్తవులమని చెప్పుకున్నవే. వారి రక్తాపరాధమెంత ఘోరమైందోగదా! ఎక్కువభాగం క్రైస్తవమత సామ్రాజ్యంలోనే చేయబడిన రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, అబద్ధమతం యొక్క పాపాలు “ఆకాశము నంటినవి.” (ప్రకటన 18:5.) అంతేగాక, మతగురువులు మానవజాతి సమస్యలను పరిష్కరించలేని నానాజాతి సమితికి, ఐక్యరాజ్య సమితికి, జాతీయ విచ్ఛిన్నకర, తిరుగుబాటు శక్తులకు మద్దతునిస్తూ, రానైయున్న యెహోవా రాజ్యానికి తమ వెన్ను చూపారు. జాలరి తన వలలో పడిన పనికిమాలిన చేపలను ఏరి పారవేయునట్లే, యేసు యీ మతగురువులను వారికి విరుద్ధంగా తీర్పుతీర్చి, బయట పారవేసి ఎప్పుడో త్రోసిపుచ్చాడు. క్రైస్తవమతసామ్రాజ్య చర్చీల యీనాటి దీనస్థితే దీనికి సాక్ష్యం. దాని తుదిదశ మనకు ఓ హెచ్చరికగా ఉండుగాక!—మత్తయి 13:47-50.

21. యేసు లవొదికయ క్రైస్తవులతో చెప్పిన మాటలకు 1919 నుండి నిజమైన సంఘంలోని క్రైస్తవులెలా స్పందించారు?

21 నిజమైన సంఘంలో సహితం, హుషారునిచ్చే వేడి లేక సేదదీర్చే చల్లని పానీయంవలె గాక, నులివెచ్చగావుండే వారున్నారు. అయినా, యేసు యింకా తన సంఘాన్ని ఆప్యాయంగా ప్రేమిస్తున్నాడు. భోజనానికే అన్నట్లు ఆయనను ఆహ్వానించే, ఆతిథ్యాలోచనతో స్పందించే క్రైస్తవులకు ఆయన అందుబాటులో వున్నాడు. తత్ఫలితంగా, 1919 నుండి బైబిలు ప్రవచనాల భావం విషయంలో వారి కన్నులు స్పష్టంగా తెరువబడి ఉన్నవి. వారు గొప్ప వికాసాన్ని పొందారు.—కీర్తన 97:11; 2 పేతురు 1:19.

22. భవిష్యత్‌లో చేయనున్న ఏ భోజనం యేసు మనస్సులో ఉండివుండవచ్చును, అందులో పాల్గొనేవారెవరు?

22 లవొదికయులను సంబోధిస్తు మాట్లాడుతున్నప్పుడు, మరో భోజనం విషయం యేసు మనస్సులో ఉండియుండొచ్చు. ప్రకటనలో మరోచోట యిలా చదువుతాం: “గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులు.” ఇది, ఆయన అబద్ధమతం మీద తీర్పుతీర్చిన అనంతరం యెహోవాకు స్తుతి చెల్లించడానికి చేసే మహాగొప్ప విజయోత్సవ విందు—యీ విందులో క్రీస్తు, సంపూర్ణంగా పరలోకమందు చేరిన 1,44,000 మందితోకూడిన తన పెండ్లికుమార్తె పాల్గొంటారు. (ప్రకటన 19:1-9) ఆ పురాతన లవొదికయ సంఘంలోని చెవియొగ్గే సభ్యులు—అవును, ఈనాడు నిజమైన అభిషక్త క్రైస్తవులనే పరిశుభ్రమైన గుర్తింపు వస్త్రాలను ధరించిన క్రీస్తుయేసు నమ్మకమైన సహోదరులు—అందరూ పెండ్లికుమారునితోపాటు ఆ పెండ్లివిందులో భోంచేస్తారు. (మత్తయి 22:2-13) ఆసక్తి కల్గివుండడానికి, మారుమనస్సు పొందడానికి, ఎంతటి శక్తిదాయకమైన స్ఫూర్తియోగదా!

జయించువారికి సింహాసనం

23, 24. (ఎ) ఇంకా ఏ బహుమానాన్ని గూర్చి యేసు మాట్లాడుతున్నాడు? (బి) యేసు ఎప్పుడు తన మెస్సీయ సింహాసనంమీద ఆసీనుడయ్యాడు, ఆయనెప్పుడు నామకార్థ క్రైస్తవులపై తీర్పు ప్రారంభించాడు? (సి) తన మరణజ్ఞాపక ఆచరణను స్థాపించినప్పుడు యేసు తన శిష్యులకు ఏ అద్భుతమైన వాగ్దానాన్ని చేశాడు?

23 యేసు యింకో బహుమతిని గూర్చి మాట్లాడుతూ యిలా అంటున్నాడు: “నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనము నందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనము నందు కూర్చుండనిచ్చెదను.” (ప్రకటన 3:21) కీర్తన 110:1, 2 లోని దావీదు మాటలనెరవేర్పు ప్రకారం యథార్థపరుడైన యేసు, లోకాన్ని జయించి, సా.శ. 33 లో పునరుత్థానుడయ్యాడు, తన తండ్రితోపాటు తన పరలోక సింహాసనంమీద ఆసీనుడగుటకై హెచ్చించబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 2:32, 33) మరో ముఖ్యమైన సంవత్సరంలో, అంటే 1914 లో, యేసు రాజుగాను, యాజకునిగాను తన స్వంత మెస్సీయ సింహాసనంపై ఆసీనుడగుటకై వచ్చాడు. తీర్పు 1918 లో నామకార్థ క్రైస్తవులతో ప్రారంభమైంది. ఆ కాలానికి ముందు మరణించిన అభిషక్త విజయులు అప్పుడు పునరుత్థానులై యేసుతోపాటు ఆయన రాజ్యంలో చేరతారు. (మత్తయి 25:31: 1 పేతురు 4:17) తన మరణజ్ఞాపకార్థ ఆచరణను ఏర్పాటు చేసినప్పుడు, యిలా చెబుతూ తనశిష్యులకు దీన్ని వాగ్దానం చేశాడు: “నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.”—లూకా 22:28-30.

24 “పునఃస్థితిస్థాపన” కాలంలో పరిపాలిస్తున్న రాజుతోపాటు కూర్చొని ఆయనతో భాగం వహించడానికి, ఆయన పరిపూర్ణబలి ఆధారంగా విధేయులైన మానవజాతిని ఏదెనులో వున్నటువంటి పరిపూర్ణతకు తేవడానికి—అదెంతటి మహత్తరమైన నియామకమోగదా! (మత్తయి 19:28; 20:28) యోహాను మనకు తెల్పుతున్న రీతిగా, యేసు జయించు వారిని “తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను,” యెహోవా మహిమగల పరలోక సింహాసనం చుట్టున్న సింహాసనాలపై ఆసీనులగునట్లు చేస్తున్నాడు. (ప్రకటన 1:6; 4:4) మనందరం—అభిషక్తులమైనా లేక పరదైసును పునరుద్ధరించే పనిలో భాగంవహించే నిరీక్షణగల నూతన భూసమాజపు వారైనా—యేసు లవొదికయులకు యిచ్చిన వర్తమానాన్ని హృదయానికి తీసుకుందాము.—2 పేతురు 3:13; అపొస్తలుల కార్యములు 3:19-21.

25. (ఎ) ముందు వర్తమానములవలె, యేసు లవొదికయుల కిచ్చిన వర్తమానాన్నెలా ముగిస్తాడు? (బి) యేసు లవొదికయ సంఘానికి చెప్పిన మాటలకు క్రైస్తవులీనాడెలా స్పందించాలి?

25 ముందిచ్చిన వర్తమానముల వలెనే యేసు దీన్నికూడ ఉపదేశంతో కూడిన మాటలతో ముగిస్తున్నాడు: “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక.” (ప్రకటన 3:22) మనం అంత్యకాల తుదిఘట్టంలో జీవిస్తున్నాం. ప్రేమ విషయంలో క్రైస్తవమత సామ్రాజ్యం చల్లగావుందని మనచుట్టూ రుజువుంది. అలాకాకుండ, నిజమైన క్రైస్తవులముగా మనం, లవొదికయ సంఘానికి, అవును సంఘాలకు మన ప్రభువు యిచ్చిన ఏడు వర్తమానములను అమితాసక్తితో విందాం. దీన్ని మనం మన కాలం కొరకు యేసు యిచ్చిన గొప్ప ప్రవచనంలో భాగం వహించడంద్వారా చేయగలం: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:12-14.

26. యేసు యోహానుతో మరల ఎప్పుడు నేరుగా మాట్లాడతాడు, అయితే ఆయన దేనిలో పాల్గొంటాడు?

26 యేసు ఏడు సంఘాలకిచ్చిన వర్తమానాలు ముగిశాయి. ఇక ప్రకటన చివరి అధ్యాయంవరకు ఆయన యోహానుతో మాట్లాడడు, గాని ఆయన అనేక దర్శనాలలో, ఉదాహరణకు, యెహోవా తీర్పులను తీర్చుటలో పాల్గొంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు బయల్పరచిన రెండవ అద్భుతమైన దర్శనాన్ని పరిశీలించడానికి యోహాను తరగతితో మనమిప్పుడు కలుద్దాము.

[అధస్సూచీలు]

^ పేరా 7 లవొదికయ ప్రాంతంలో పురావస్తు శాస్త్రజ్ఞుల త్రవ్వకాలలో యీ స్థలాలు బయటపడ్డాయి.

[అధ్యయన ప్రశ్నలు]

[-73వ పేజీలోని బాక్సు]

ధనాపేక్షకు జ్ఞానానికి పోటి

గత 1956 లో, ఓ విలేఖరి యిలా రాశాడు: ఒక శతాబ్దం ముందు సగటు మనిషికి 72 కోరికలుండేవి, వాటిలో 16 మాత్రం అవసరమైనవిగా పరిగణింపబడ్డాయి. ఈనాడు, సగటు మనిషికి 474 కోరికలున్నాయి, అందులో 94 మాత్రమే అవసరమైనవిగా పరిగణింప బడుతున్నాయి. ఓ శతాబ్దం క్రితం సగటుమనిషి 200 వస్తువులను కొనాలని అమ్మేవారు బలవంత పెట్టేవారు—గానీ యీనాడు 32,000 వస్తువులు అమ్మకపు పోటీకి తట్టుకోవలసిన అవసర మేర్పడింది. మానవుని అవసరాలు కొన్నే—గాని కోరికలు కోకొల్లలు.” ఈనాడు, ధనం ఐశ్వర్యం జీవితంలో ముఖ్యమని ప్రజలకు నూరిపోస్తున్నారు. ఆవిధంగా, అనేకులు ప్రసంగి 7:12 నందలి జ్ఞానయుక్తమైన సలహాను అలక్ష్యం చేస్తున్నారు: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.”

[67వ పేజీలోని చిత్రం]

లవొదికయలోనికి వచ్చే నీళ్లు రుచిలేకుండా నులివెచ్చగా వుండేవి. లవొదికయలోని క్రైస్తవులు అసంతృప్తికరమైన నులివెచ్చని స్వభావాన్ని కల్గియుండిరి.