కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అపఖ్యాతిపాలైన వేశ్యకు తీర్పుతీర్చుట

అపఖ్యాతిపాలైన వేశ్యకు తీర్పుతీర్చుట

అధ్యాయం 33

అపఖ్యాతిపాలైన వేశ్యకు తీర్పుతీర్చుట

దర్శనము 11—ప్రకటన 17:1-18

అంశం: మహాబబులోను చివరకు తనపై తిరుగబడి తననే నాశనం చేసే ఎఱ్ఱని క్రూరమృగంపై స్వారీచేస్తుంది

నెరవేర్పుకాలం: 1919 నుండి మహాశ్రమలవరకు

1. ఏడుగురు దూతలలో ఒకరు యోహానుకు ఏమి బయల్పరచును?

యెహోవా నీతియుక్తమైన కోపము సంపూర్తిగా, అంటే మొత్తం యేడు పాత్రలు కుమ్మరింపబడాలి. ఆరవదూత ప్రాచీన బబులోనుమీద తనపాత్రను కుమ్మరించినప్పుడు, అంతిమ యుద్ధమైన ఆర్మగిద్దోనుకు త్వరితగతిన సంఘటనలు జరుగుతుండగా, అది సరిగ్గా మహాబబులోను మీదికివచ్చే తెగులును సూచిస్తుంది. (ప్రకటన 16:1, 12, 16) బహుశ, ఈ దూతయే యెహోవా తన నీతియుక్తమైన తీర్పును ఎందుకు, ఎలా తీరుస్తాడోనని యిప్పుడు బయలు పరుస్తున్నాడు. తర్వాత యోహాను తాను విని, చూస్తున్న దాని విషయంలో ఆశ్చర్యపడుతున్నాడు: “ఆ యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను.—నీవిక్కడికి రమ్ము, విస్తార జలములమీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను; భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి.”—ప్రకటన 17:1, 2.

2. ఆ మహావేశ్య (ఎ) ప్రాచీన రోముకాదని, (బి) పెద్ద వ్యాపారంకాదని (సి) మతసంబంధమైనదని ఏ సాక్ష్యాధారమున్నది?

2 “మహావేశ్య”! ఆ పేరు ఎందుకంత విస్మయమొందిస్తుంది? ఎవరామె? కొందరు యీ సాదృశ్యమైన వేశ్యను ప్రాచీన రోము అని నమ్మారు. అయితే రోము రాజకీయ శక్తిగదా. ఈ వేశ్య భూలోక రాజులతో వ్యభిచరిస్తుంది, యిందులో రోమా రాజులు కూడ తప్పక ఉన్నారు. అంతేగాక, దాని నాశనం తర్వాత “భూరాజులు” దాన్ని చూచి ప్రలాపిస్తారని చెప్పబడింది. గనుక ఆమె రాజకీయ శక్తికాదు. (ప్రకటన 18:9, 10) ఇంకనూ, ప్రపంచ వర్తకులు దాన్నిచూచి ప్రలాపిస్తున్నారు గనుక అది లోకవర్తకులను సూచించడంలేదు. (ప్రకటన 18:15, 16) అయినా, ‘దాని మాయామంత్రములచేత జనములు మోసపోయారు’ అని మనం చదువుతాము. (ప్రకటన 18:23) దీన్నిబట్టి, ఆ మహావేశ్య ప్రపంచ వ్యాప్తంగానున్న మతసంబంధమైన సంస్థయై ఉంటుందని స్పష్టమౌతుంది.

3. (ఎ) మహావేశ్య రోమన్‌ కాథోలిక్‌ చర్చి లేక క్రైస్తవమత సామ్రాజ్యములన్ని కలిసిన దానికంటెను యింకా ఎక్కువైనదానినే ఎందుకు సూచించాలి? (బి) తూర్పుదేశాల్లోని అనేకమతాల్లోను, క్రైస్తవమత సామ్రాజ్యంలోని శాఖల్లోను బబులోను సిద్ధాంతాలు ఏమేమి కనబడతాయి? (సి) క్రైస్తవమత సామ్రాజ్యంలోని సిద్ధాంతాలు, ఆచార అలవాట్లయొక్క ఆరంభాన్ని గూర్చి రోమన్‌ కాథోలిక్‌ కార్డినల్‌ జాన్‌ హెన్రీ న్యూమెన్‌ ఏమని అంగీకరించారు? (అథఃస్సూచి చూడండి.)

3 ఏ మతసంస్థ? కొందరనుకున్నట్లు అది రోమన్‌ కాథోలిక్‌ చర్చా? లేక అది మొత్తం క్రైస్తవమత సామ్రాజ్యమా? లేదు, తాను జనములన్నింటిని మోసగించాలంటే అది వీటికంటె పెద్దదై వుండాలి. నిజానికది పూర్తి ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమై యున్నది. బబులోను మర్మములలో దాని ఆరంభం ఉందనడానికి, భూలోకమంతటనున్న మతాలలో అనేకమైన బబులోను ఆచారఅలవాట్లు చోటుచేసుకోవడమే దానికి నిదర్శనం. ఉదాహరణకు, మానవాత్మ అమర్త్యమని, నరకాగ్ని, త్రిత్వదేవుని యందలి నమ్మకం అనేక తూర్పుదేశ మతాలలోను క్రైస్తవమత సామ్రాజ్యంలోని పలుశాఖలలోను కనబడుతోంది. ప్రాచీన బబులోను పట్టణంలో 4,000 సంవత్సరాల క్రితం తయారైన అబద్ధమతం, యుక్తంగానే మహాబబులోను అని పిలువబడి, ఆధునిక కాలంలో బహుగా విస్తరించింది. అపురూపంగా తయారైంది. * అయిననూ, అదెందుకు “మహావేశ్య” అని అసహ్యమైన పేరుతో పిలువబడుతోంది?

4. (ఎ) ప్రాచీన ఇశ్రాయేలీయులు ఏయే విధాలుగా వ్యభిచరించారు? (బి) మహాబబులోను ఏ విశేషమైన పద్ధతిలో వ్యభిచారం చేసింది?

4 బబులోను (లేక బాబేలు అంటే “తారుమారు” అని అర్థం) నెబుకద్నెజరు కాలంలో మహోన్నత స్థాయికి చేరుకుంది. అది వెయ్యికంటె ఎక్కువైన దేవాలయాలు, గుళ్లతో మత-రాజకీయ రాజ్యంగా ఉండెను. దాని యాజకత్వము గొప్ప అధికారాన్ని చెలాయించింది. బబులోను ప్రపంచాధిపత్యంగా ఉండకుండా ఎంతో కాలమైనప్పటికీ, మతపరమైన మహాబబులోను యింకా జీవిస్తూనేవుంది, ప్రాచీన బబులోనువలె అదిప్పటికి రాజకీయ విషయాలలో ప్రాబల్యంచూపి, వాటిని నడిపించాలని యింకనూ ప్రయత్నిస్తూనే వుంది. కానీ రాజకీయాలతో కలిసిన మతాన్ని దేవుడు అంగీకరిస్తాడా? హెబ్రీలేఖనాలలో, ఇశ్రాయేలు జనాంగం అబద్ధ ఆరాధనలో పాల్గొన్నప్పుడు, యెహోవాయందు నమ్మకముంచక, జనాంగములతో పొత్తుపెట్టుకున్నప్పుడు వారు వ్యభిచారం చేసినట్లు చెప్పబడ్డారు. (యిర్మీయా 3:6, 8, 9; యెహెజ్కేలు 16:28-30) మహాబబులోను కూడ వ్యభిచారం చేస్తోంది. ప్రాముఖ్యంగా, అది భూలోక రాజుల నుండి పలుకుబడిని అధికారాన్ని పొందడానికి ఏది యుక్తమని అనుకుంటుందో దాన్నిచేస్తుంది.—1 తిమోతి 4:1.

5. (ఎ) మతగురువులు ఎటువంటి పేరుప్రఖ్యాతిని ప్రేమిస్తారు? (బి) పేరుప్రఖ్యాతుల కొరకు ఆశించడం, యేసుక్రీస్తు చెప్పిన మాటలకు ఎందుకు పూర్తి భిన్నంగా ఉన్నది?

5 ఈనాడు, మతనాయకులు తరచూ ప్రభుత్వంలో ఉన్నత స్థానం కొరకు ప్రచారం చేస్తుంటారు, కొన్ని దేశాల్లోనైతే, ఉన్నత పదవులనలంకరించి ప్రభుత్వంలోనే పాలక సభ్యులౌతున్నారు. ఇద్దరు ప్రొటెస్టెంట్‌ మతగురువులు 1988 లో అమెరికా అధ్యక్షపదవి కొరకు ప్రాకులాడారు. మహాబబులోనులోని నాయకులు పేరుప్రఖ్యాతిని ప్రేమిస్తారు; ప్రముఖ రాజకీయవేత్తలతో వారు తీయించుకున్న ఫోటోలతో వార్తాపత్రికల్లో కనబడతారు. దానికి భిన్నంగా, యేసు రాజకీయ సంబంధాన్ని ఖండిస్తూ, తన శిష్యులను గూర్చి యిలా అన్నాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.”—యోహాను 6:15; 17:16; మత్తయి 4:8-10; అలాగే యాకోబు 4:4 కూడ చూడండి.

ఆధునిక-కాల ‘వేశ్యాతనము’

6, 7. (ఎ) జర్మనీలో హిట్లర్‌ నాజీపార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది? (బి) వాటికన్‌ నాజీజర్మనీ పార్టీతో చేసిన ఒడంబడిక హిట్లర్‌ ప్రపంచాధిపత్యాన్ని అందుకోవడానికి ఎలా సహాయపడింది?

6 ఆ మహావేశ్య రాజకీయాల్లో తలదూర్చడం మూలంగా, మానవజాతికి అమిత దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. ఉదాహరణకు, హిట్లర్‌ జర్మన్‌ అధినేత కావడానికి నడిపించిన విషయాలను అంటే చరిత్ర పుస్తకాలనుండి ఎవరైనా చెరిపివేయడానికి ఇష్టపడే అసహ్యమైన వాస్తవాలను పరిశీలించండి. నాజీపార్టీ 1924మే నాటికి జర్మన్‌ ప్రభుత్వంలో 32 సీట్లను కలిగివుండేది. ఈ సీట్లు 1928మే నాటికి 12కు దిగజారాయి. అయితే, 1930 లో ప్రపంచమంతా మహా కరవు ఏర్పడి, తీవ్రస్థాయికి చేరినప్పుడు నాజీలు జూలై 1932 లో జరిగిన ఎన్నికల్లో 608 సీట్లకుగాను 230 సీట్లు సంపాదించి, అద్భుతరీతిగా పునరాగమనం చేశారు. ఆ వెంటనే, ఒక పోప్‌కుచెందిన మతాచార్యుడును, మాజీ వైస్‌ చాన్సలర్‌ అయిన, ఫ్రాంజ్‌ వోన్‌ పాపెన్‌, నాజీలకు అండగానిలిచాడు. వోన్‌ పాపెన్‌ క్రొత్త పవిత్ర రోమా సామ్రాజ్యాన్ని గూర్చి కలలుకన్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. వైస్‌చాన్స్‌లర్‌గా తాను పదవిని చేపట్టిన స్వల్పకాలంలో ఏమీ సాధించలేదు, అందుకే అతడు నాజీలద్వారా మరల అధికార పీఠాన్ని అధిష్టించాలనుకున్నాడు. జనవరి 1933 నాటికి, అతడు పారిశ్రామిక రంగాల నుండి మద్దతు కూడగట్టుకొని జనవరి 30, 1933 లో హిట్లర్‌ జర్మనీకి చాన్సలర్‌గా నియుక్తుడయ్యేలా చేయడానికి యుక్తితోకూడిన పథకాలతో మభ్యపెట్టి, మద్దతు సంపాదించి పెట్టాడు. తాను వైస్‌చాన్సలర్‌గా నియమించబడ్డాడు, జర్మనీలోని కాథోలిక్‌ మతస్థులనుండి మద్దతుపొందునట్లు హిట్లర్‌ అతన్ని వాడుకున్నాడు. అధికారానికొచ్చిన రెండు నెలల్లోనే హిట్లర్‌ పార్లమెంటును రద్దుచేసి, వేలాదిమంది ప్రతిపక్ష నాయకుల్ని కాన్‌సెన్‌ట్రేషన్‌ క్యాంపులకు తరలించాడు, యూదులను అణగదొక్కాలంటూ బహిరంగ ప్రచార దండయాత్ర సాగించాడు.

7 కార్డినల్‌ పాసెల్లి (తర్వాత పోప్‌పాయిస్‌ XII అయ్యాడు) వాటికన్‌కు నాజీ జర్మనీకి మధ్య రోములో జూలై 20 1933న ఒక ఒడంబడిక జరిపి దానిపై సంతకాలు చేసినప్పుడు, అధికారంలో దూసుకువస్తున్న నాజీ ప్రభుత్వంయెడల వాటికన్‌ ఆసక్తి బహిర్గతమైంది. వోన్‌ పాపెన్‌ హిట్లర్‌ తరఫున సంతకం చేసాడు, మరియు పాసెల్లి అక్కడ వొన్‌పాపెన్‌కు పాయిస్‌ క్రమములోనున్న గ్రాండ్‌క్రాస్‌ అను ఒక ఉత్తమ బిరుదునిచ్చి సత్కరించాడు. * సేటన్‌ ఇన్‌ టాప్‌ హేట్‌ అనే పుస్తకంలో టైబర్‌ కోవిస్‌ యీ విషయాన్ని గూర్చి వ్రాస్తూ యిలా చెబుతున్నాడు: “ఆ ఒడంబడిక హిట్లర్‌కు గొప్ప విజయాన్ని చేకూర్చింది. అది ఆయనకు బయటి ప్రపంచంనుండి వచ్చిన మొదటి మానసిక మద్దతుగా పనిచేసింది, అదికూడ అత్యంత ఉన్నత మూలంనుండి వచ్చింది.” ఈ ఒడంబడిక మూలంగా, జర్మన్‌ కాథోలిక్‌ సెంటర్‌ పార్టీకి తన మద్దతును ఉపసంహరించుకొని, హిట్లర్‌ ఏకైక పార్టీని “సంపూర్ణరాజ్యంగా అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది.” * అంతేకాకుండా, దాని ఆర్టికల్‌ 14 యిలా పేర్కొన్నది: “సాధారణ రాజకీయ విషయాల్లో ఏ సంశయంలేదని రాజు నియమించిన గవర్నరు నిర్ధారించిన తర్వాత మాత్రమే ఆర్చిబిషప్‌లు, బిషప్‌లు, మరియు అటువంటివారి నియామకాలు మొదలైనవి జరుగుతాయి.” (పోప్‌ పాయిస్‌ XI, “పరిశుద్ధ సంవత్సరం”గా ప్రకటించిన) 1933వ సంవత్సరం నాటికి, హిట్లర్‌ ప్రపంచాధినేత కావడానికి వాటికన్‌ మద్దతు ముఖ్యాంశంగా తయారైంది.

8, 9. వాటికన్‌, కాథోలిక్‌చర్చి మరియు దాని మతగురువులు నాజీక్రూరపాలనకు ఎలా స్పందించారు? (బి) జర్మన్‌ కాథోలిక్‌ బిషప్‌లు II ప్రపంచ యుద్ధకాలంలో ఏమని చెప్పారు? (సి) మత-రాజకీయ కలయిక ఫలితమేమిటి?

8 కొద్దిమంది మతగురువులు, సన్యాసినులు, హిట్లర్‌ దురాగతాలను ఎదిరించి—అందుకు బాధననుభవించిననూ—వాటికన్‌, కాథోలిక్‌ చర్చీ దాని మతగురువులంతా, ప్రపంచ కమ్యూనిజం వ్యాప్తిచెందకుండా ఒక అడ్డుబండగా ఉంటుందని వారు తలంచిన నాజీ క్రూరపాలనకు చురుకుగా లేక మౌనంగా మద్దతునిచ్చారు. వాటికన్‌లో శోభాయమానంగా ఆసీనుడై, పోప్‌ పాయిస్‌ XII, యూదులమీద మారణహోమం, యెహోవాసాక్షులమీద, మరితరులపైన హింసను నిర్ధ్వందంగా కొనసాగనిచ్చాడు. పోప్‌ జాన్‌ పాల్‌ II, మే 1987 లో జర్మనీని సందర్శించినప్పుడు ఒక నమ్మకస్థుడైన మతగురువు నాజీపాలనకు వ్యతిరేకంగా తీసుకున్న స్థానాన్నిబట్టి ఆయనను పొగడడం వింతగావుంది. హిట్లర్‌ క్రూరపాలనా కాలంలో వేలాదిమంది యితర మతగురువులు ఏం చేస్తున్నట్లో మరి? సెప్టెంబర్‌ 1939 లో IIవ ప్రపంచ యుద్ధం చెలరేగినప్పుడు, జర్మన్‌ కాథోలిక్‌ బిషప్పులు విడుదల చేసిన ఒక ఉత్తరం యీ విషయంలో అధిక వివరణ నిస్తుంది. అందులో ఒక భాగమిలావుంది: “ఈ నిర్ణయాత్మక ఘడియలో మేము కాథోలిక్‌ సైనికులకిచ్చే సలహా ఏమంటే వారు రాజుకు విధేయులై తమ విధిని తాము నిర్వర్తించాలి, తాము త్యాగం చేసుకోవడానికి సిద్ధపడివుండాలి. దైవకృప యీ యుద్ధాన్ని విజయపథానికి నడపాలని చేసే మనఃపూర్వక ప్రార్థనలలో పాల్గొనాలని నమ్మకమైనవారిని మేము అర్థిస్తున్నాము.”

9 కాథోలిక్‌లు నడిపిన అటువంటి రాజకీయతంత్రం, గత 4,000 సంవత్సరాలుగా మతం అధికారం, అవకాశం పొందేందుకు రాజకీయరంగాన్ని అర్థించడంలో నిర్వహించిన వ్యభిచారపాత్రను వివరిస్తుంది. అలాంటి మత-రాజకీయ బంధం అనేది యుద్ధం, హింస, మానవులకు విపరీతమైన దుఃఖాన్నే తెచ్చాయి. ఆ వేశ్యకు యెహోవా చేయబోవు తీర్పు సమీపమైందని తెలుసుకోవడానికి మానవులెంత ఆనందించగలరోగదా. త్వరలో అది జరుగును గాక!

విస్తారజలములమీద కూర్చుండుట

10. మహాబబులోను రక్షణకొరకు చూస్తున్న “విస్తారజలములు” ఏమిటి, వాటికేమి సంభవిస్తోంది?

10 ప్రాచీన బబులోను అనేక జలములు అనగా యూఫ్రటీసు, నదిమీద అనేక కాలువలమీద కూర్చున్నది. అవి దానికి రక్షణగా ఉండెను, మరియు అవి ఒకే రాత్రిలో ఎండిపోయేంతవరకు వాణిజ్యపరమైన లాభార్జనకు మూలంగా ఉండెను. (యిర్మీయా 50:38; 51:9, 12, 13) మహాబబులోను కూడ రక్షణకు ఐశ్వర్యంకొరకు “విస్తారమైన జలముల” వైపు చూస్తుంది. ఈ సాదృశ్యమైన జలములు “ప్రజలు, జనసమూహములు, జనములు, ఆయా భాషలుమాటలాడువారు,” అంటే తాను అధికారం చెలాయించి, ధనసంపత్తిని పొందిన వందలాదికోట్ల మానవులే. అయితే యీ జలములుకూడ ఎండిపోతున్నాయి, లేక మద్దతును ఉపసంహరించు కుంటున్నాయి.—ప్రకటన 17:15; అలాగే కీర్తన 18:4; యెషయా 8:7 పోల్చండి.

11. (ఎ) ప్రాచీన బబులోను ఎలా ‘భూనివాసులను మత్తిల్ల’ జేసింది? (బి) మహాబబులోను ఎలా ‘భూనివాసులను మత్తిల్ల’ చేసియున్నది?

11 ఇంకనూ, ప్రాచీన బబులోను “యెహోవా చేతిలో సర్వభూమికి మత్తుకలిగించు బంగారు పాత్రయైయుండెను.” (యిర్మీయా 51:7) ప్రాచీన బబులోను ఇరుగుపొరుగు దేశాలను యుద్ధంలో జయించి, మత్తెక్కిన మనుష్యులవలె బలహీనులనుగా చేసి, అవి యెహోవా కోపాగ్నిని మ్రింగేలా చేసింది. ఆ విషయంలో అది యెహోవా ఉపకరణంగా పనిచేసింది. మహాబబులోను కూడ, ప్రపంచసామ్రాజ్యంగా తయారయ్యేంతగా విజయాలు సాధించింది. అయితే నిశ్చయంగా అది దేవుని ఉపకరణం కాదు. బదులుగా, తాను మతసంబంధమైన వ్యభిచారం చేస్తున్న “భూరాజుల”కు సేవచేస్తుంది. అది తన అబద్ధ సిద్ధాంతాలను, సమ్మోహిత ఆచారాలను ఉపయోగిస్తూ ప్రజలను, అంటే “భూజనులను” మత్తులుగాచేసి వారు తమ రాజులకు ఊరకనే ఊడిగం చేసేలా ఉపయోగించుకుంటూ రాజులను తృప్తిపరుస్తుంది.

12. (ఎ) జపాన్‌లో మహాబబులోనులోని ఒక భాగం II ప్రపంచ యుద్ధకాలంలో ఎలా ఎంతో రక్తపాతానికి కారకురాలైంది? (బి) జపాన్‌లో “జలములు” ఎలా మహాబబులోనుకు మద్దతును ఉపసంహరించుకున్నాయి, దానిఫలితమేమిటి?

12 జపాన్‌లోని షింటోమతం ఇందుకు చక్కని మాదిరి. సిద్ధాంతాలు నూరిపోయబడిన జపాన్‌ సైనికుడు చక్రవర్తికి—సర్వోన్నత షింటో దేవునికి—తన ప్రాణాన్నైనా యివ్వడం అత్యున్నత గౌరవమని భావిస్తాడు. లొంగిపోవడం అవమానకరమని తలంచిన 15,00,000 మంది జపాన్‌ సైనికులు IIవ ప్రపంచ యుద్ధకాలంలో, ఒక వ్యక్తి కొరకు ప్రాణాలనర్పించారు. అయితే జపాన్‌ పరాజయం పాలైనందున చక్రవర్తి హిరొహిటొ తన దైవత్వాన్ని త్యజించాడు. దీని ఫలితంగా మహాబబులోనులో ఓ భాగమైన షింటోను బలపరచే “జలములు” తమ మద్దతును ఉపసంహరించు కోవడం జరిగింది—అయ్యో, పసిఫిక్‌ యుద్ధరంగంలో బకెట్ల బకెట్ల రక్తాన్ని చిందించడానికి అనుమతించిన తర్వాత యిలాజరగడం ఎంత శోచనీయం! ఇలా షింటోమతం బలహీనపడడం మూలాన ఇటీవలి కాలంలో ఒకనాడు అనేకులు షింటోమతస్థులుగాను, బౌద్ధులుగాను ఉన్న 1,77,000 కంటె ఎక్కువ మంది జపానీయులు సర్వోన్నతుడైన యెహోవాకు సమర్పిత పరిచారకులయ్యేందుకు మార్గం సుగమమైంది.

వేశ్య మృగంపై స్వారీ చేస్తుంది

13. దూత ఆత్మవశుడైన యోహానును అరణ్యానికి కొనిపోయినప్పుడు ఆయన ఏ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూస్తాడు?

13 మహా వేశ్యను, దాని భవిష్యత్‌ను గూర్చి ప్రవచనం యింకా ఏమి బయల్పరుస్తుంది? యోహాను యిప్పుడు తెలియజేసే విధంగా, యింకా స్పష్టమైన దృశ్యం కనబడుతోంది: “అప్పుడతడు [దూత] ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, యేడు తలలును పది కొమ్ములునుగల ఎఱ్ఱని మృగముమీద కూర్చుండిన యొక స్త్రీని చూచితిని.”—ప్రకటన 17:3.

14. యోహాను అరణ్యానికి కొనిపోబడడం ఎందుకు యుక్తమై యున్నది?

14 యోహాను ఎందుకు అరణ్యానికి కొనిపోబడ్డాడు? ప్రాచీన బబులోను నాశనాన్నిగూర్చి చేయబడిన తొలి ప్రకటన “సముద్ర తీరముననున్న అడవిదేశమును గూర్చి” యని వర్ణించబడింది. (యెషయా 21:1, 9) ప్రాచీన బబులోనుకున్న జలరక్షణంతా నిర్జీవంగా మారుతుందని యిది తగిన హెచ్చరిక చేసింది. అందుచేత, మహాబబులోను వినాశనాన్ని చూడడానికి యోహాను అరణ్యానికి కొనిపోబడడం యుక్తమే. అది కూడ పాడైపోయి నిర్జనంగా మారాలి. (ప్రకటన 18:19, 22, 23) అయినా, యోహాను అక్కడ తాను చూసేదాన్నిబట్టి ఆశ్చర్యపోతున్నాడు. ఆ మహావేశ్య ఒంటరిగాలేదు! అది ఒక మహాగొప్ప మృగంమీద కూర్చున్నది!

15. ప్రకటన 13:1 లోని క్రూరమృగమునకు ప్రకటన 17:3 లోని మృగానికి ఏమేమి తేడాలున్నాయి?

15 ఈ క్రూరమృగానికి ఏడుతలలు పదికొమ్ములు ఉన్నాయి. ఇది యోహాను ముందుచూసిన ఏడుతలలు పదికొమ్ములున్న క్రూరమృగము వంటిదేనా? (ప్రకటన 13:1) కాదు, కొన్ని తేడాలున్నాయి. ఇది ఎఱ్ఱని క్రూరమృగము, ముందున్న క్రూరమృగము వలెగాక దీనికి కిరీటాలున్నట్లు చెప్పబడలేదు. ఏడు తలలమీద మాత్రమే గాక, అది “దేవదూషణలుగల నామములతో నిండుకొని”యున్నది. అయినప్పటికీ, యీ క్రొత్త క్రూరమృగానికి ముందున్నదానికి సంబంధముండి తీరాలి; వాటిమధ్యగల సారూప్యాలు కూడ సమంగా ఉన్నట్లు చెప్పబడుతున్నాయి.

16. ఎఱ్ఱని క్రూరమృగము ఏమైయున్నది, దాని ఉద్దేశమును గూర్చి ఏమి తెలుపబడింది?

16 మరైతే యీ ఎఱ్ఱని క్రూరమృగమేమై యున్నది? అది గొఱ్ఱెపిల్లవంటి రెండుకొమ్ములుగల ఆంగ్లో-అమెరికన్‌ క్రూరమృగము విజ్ఞప్తిమేరకు తయారైన క్రూరమృగముయొక్క ప్రతిమయై వుంటుంది. ప్రతిమ తయారైన తర్వాత, రెండుకొమ్ములుగల క్రూరమృగము యీ క్రూరమృగముయొక్క ప్రతిమకు జీవమివ్వడానికి అనుమతించబడింది. (ప్రకటన 13:14, 15) యోహాను యిప్పుడు ప్రాణంతో ఉండి శ్వాసిస్తున్న ప్రతిమను చూస్తున్నాడు. రెండు కొమ్ములుగల క్రూరమృగము 1920 లో తెచ్చిన నానాజాతి సమితిని అది సూచిస్తుంది. ఈ సమితి “మనుష్యులందరికి న్యాయంచేకూర్చి, యుద్ధాన్ని శాశ్వతంగా నిర్మూలించే న్యాయస్థానమై వుంటుంది” అని అమెరికా అధ్యక్షుడు విల్సన్‌ కలలు కన్నాడు. రెండవప్రపంచ యుద్ధానంతరం అది మరల లేపబడినప్పుడు, దాని అధికారిక శాసనం ప్రకారం అది “అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడవలసి” యుండెను.

17. (ఎ) ఎఱ్ఱని క్రూరమృగము ఎలా దేవదూషణ నామములతో నిండుకొనియున్నది? (బి) ఆ ఎఱ్ఱని క్రూరమృగము మీద స్వారీ చేసేదెవరు? (సి) బబులోను మతం, నానాజాతిసమితి, దాని తర్వాత వచ్చిన సమితితో ప్రారంభంనుండే ఎలా సంబంధం కల్గియుండెను?

17 ఈ సాదృశ్యమైన క్రూరమృగం దూషణకరమైన నామములతో ఎలా నిండుకొనివుంది? అంటే తన రాజ్యం మాత్రమే నెరవేర్చగలదని దేవుడు చెబుతున్నదానిని నెరవేర్చడానికి—దేవుని రాజ్యానికి ప్రత్యామ్నాయంగా మానవులు యీ అంతర్జాతీయ విగ్రహాన్ని నిలబెట్టడం మూలంగా అది దైవదూషణకరమైన నామములతో నిండుకొనివుందని చెప్పవచ్చును. (దానియేలు 2:44; మత్తయి 12:18, 21) అయినా, యోహాను దర్శనంలోని ప్రత్యేకత ఏమంటే ఆ మహాబబులోను ఎఱ్ఱని క్రూరమృగము మీద కూర్చుంది. ప్రవచనం ప్రకారం, బబులోను సంబంధిత మతం, ముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యము, నానాజాతిసమితి దానితర్వాత వచ్చిన సమితితో సంబంధం పెట్టుకొనివుంది. డిశంబరు 18, 1918 నాటికే అమెరికాలోని క్రైస్తవ చర్చీల జాతీయ సభ ఒక తీర్మానంచేసింది, అందులో కొంతభాగమిలా చెబుతుంది: “అటువంటి సమితి ఒక రాజకీయ తాత్కాలిక ప్రయోజనాలకు మాత్రమేకాదు, అది భూమ్మీద దేవుని రాజ్యమే . . . దానికి చర్చి తన సహృదయాన్ని పంచియివ్వవచ్చు; అలాయివ్వకపోతే నానాజాతిసమితి మనజాలదు. . . . నానాజాతిసమితి సువార్తలో పాతుకొనివుంది, సువార్తవలె, ‘భూమికి సమాధానం రావాలి, మనుష్యులకు మంచి జరగాలి’ అన్నదే దాని ధ్యేయం.”

18. క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు నానాజాతి సమితికి మద్దతునిస్తున్నట్లు ఎలా కనబరచుకున్నారు?

18 జనవరి 2, 1919, సాన్‌ ఫ్రాన్‌సిస్కో క్రానికల్‌ మొదటి పేజీలోనే పెద్దఅక్షరాల్లో యిలా ఉంది: “విల్సన్‌యొక్క నానాజాతి సమితిని స్వీకరించాలని పోప్‌ అభ్యర్థిస్తున్నాడు.” అక్టోబరు 16, 1919, నాడు పెద్దపెద్ద శాఖలకు చెందిన 14,450 మంది మతగురువులు సంతకాలు చేసిన ఒక వినతి పత్రాన్ని అమెరికా దేశపు సెనెట్‌కు సమర్పించి, “నానాజాతిసమితి ఒప్పందం యిమిడియున్న పారిస్‌ ఒప్పందాన్ని ఆమోదించాలని” ఆ సంస్థకు విన్నవించారు. అమెరికా సెనెట్‌ ఆ ఒప్పందాన్ని ఆమోదించక పోయినప్పటికీ క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు నానాజాతిసమితి కొరకు ప్రచారం చేస్తూనే వచ్చారు. మరి నానాజాతి సమితి ఎలా ప్రారంభోత్సవం జరుపుకుంది? స్విట్జర్లాండ్‌నుండి నవంబరు 15, 1920 లో విడుదలైన వార్తలో యిలావుంది: “ఈ ఉదయం పదకొండు గంటలకు జెనీవాలోని చర్చి గంటలన్నీ మ్రోగడంతో నానాజాతి సమితి మొట్టమొదటి సమావేశం ప్రారంభమౌతుందని ప్రకటింపబడింది.”

19. ఎఱ్ఱని క్రూరమృగము ఎప్పుడు ప్రత్యక్షమైంది, యోహాను తరగతి ఎటువంటి చర్యగైకొన్నది?

19 రాబోవు మెస్సీయ రాజ్యమును ఆశతో అంగీకరించిన ఒక గుంపు, అంటే భూమ్మీదనున్న యోహాను తరగతి, ఎఱ్ఱని క్రూరమృగాన్ని సన్మానించడంలో క్రైస్తవమత సామ్రాజ్యముతో భాగంవహించిందా? లేనేలేదు! ఆదివారం, సెప్టెంబరు 7, 1919 లో సీడార్‌ పాయింట్‌, ఓహాయోలో జరిగిన యెహోవా ప్రజల సమావేశమందు “క్రుంగిన మానవజాతికి నిరీక్షణ” అనే బహిరంగ ప్రసంగం యివ్వబడింది. ఆ మరునాడు, వాచ్‌టవర్‌ సొసైటీ అధ్యక్షుడు జె.యఫ్‌.రూథర్‌ఫర్డ్‌, దాదాపు 7,000 మంది సమావేశమైన వారినుద్దేశించి యిచ్చిన ప్రసంగాన్ని శాండస్కీ స్టార్‌-జర్నల్‌ అనే పత్రిక ఉటంకిస్తూ యిలా చెప్పింది: “నానాజాతిసమితి మీద ప్రభువు ఆగ్రహం నిశ్చయంగా వ్యక్తమౌతుంది . . . ఎందుకంటే కాథోలిక్‌ మరియు ప్రొటెస్టెంట్‌ మతగురువులు—దేవుని ప్రతినిధులని చెప్పుకుంటూ—ఆయన పథకాన్ని వదిలిపెట్టి నానాజాతిసమితిని బలపర్చారు, దాన్ని భూమ్మీద క్రీస్తు రాజ్యమని పొగిడారు.”

20. మతగురువులు నానాజాతి సమితిని “భూమ్మీద దేవుని రాజకీయ సంబంధమగు రాజ్యమని” పొగడుట ఎందుకు దూషణకరమై యుండెను?

20 నానాజాతిసమితి ఘోరవైఫల్యం, అటువంటి మానవనిర్మిత సంస్థలు భూమ్మీద దేవుని రాజ్యంలో ఒక భాగంకానేరవని మతగురువులకు సూచించియుండాలి. అలాచెప్పుకోవడమెంత దూషణకరమో! అంటే, ఆ నానాజాతిసమితి పెద్ద అతుకుల బొంత కావడానికి దేవుడు ఒక భాగస్వామి అన్నట్లుగానే ఉంది యీకథ. దేవుని విషయంలోనైతే “ఆయన కార్యములు సంపూర్ణములు.” తమలో అనేకులు నాస్తికులుగావుండి, జగడమాడుకునే రాజకీయ నాయకులతోకూడిన రాజ్యంకాదుగానీ—క్రీస్తుపాలించు యెహోవా పరలోక రాజ్యంద్వారానే—ఆయన శాంతిని తెచ్చి తనచిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమియందును నెరవేరేలాగున చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 32:4; మత్తయి 6:10.

21. నానాజాతి సమితి తర్వాత వచ్చిన ఐక్యరాజ్యసమితికి మద్దతునిస్తూ, పొగడుతుందని ఏది చూపిస్తుంది?

21 మరి నానాజాతిసమితి తర్వాతవచ్చిన ఐక్వరాజ్యసమితి సంగతేమిటి? అది స్థాపించ బడినప్పటినుండి, దానిమీదకూడ మహావేశ్య స్వారీచేస్తుంది, ప్రత్యక్షంగా దాంతో సంబంధం కల్గివుంది, దానిని నడిపించాలని ప్రయత్నిస్తోంది. ఉదాహరణకు, దాని 20వ వార్షికోత్సవం నాడు, అంటే 1965 లో రోమన్‌ కాథోలిక్‌ మరియు ఈస్ట్రన్‌ ఆర్థొడాక్స్‌ చర్చి, వీరితోపాటు ప్రొటెస్టెంట్‌వారు, యూదులు, హిందువులు, బౌద్ధులు, ముస్లింలు—భూమ్మీదనున్న రెండువందల కోట్ల జనాబాకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటూ—ఐక్యరాజ్య సమితికి తామిచ్చే మద్దతును, ఘనతను వేడుకగా ఆచరించడానికి శాన్‌ఫ్రాన్‌సిస్కోలో సమావేశమయ్యారు. అక్టోబరు 1965 లో పోప్‌ పాల్‌ VI ఐక్యరాజ్యసమితిని దర్శించి, దాన్ని “అంతర్జాతీయ సంస్థలన్నింటిలోను అత్యంత పెద్దది” అని వర్ణిస్తూ యింకా యిలా అన్నాడు: “భూలోక మానవులు శాంతి ఒప్పందాలకు చివరి నిరీక్షణగా ఐక్యరాజ్యసమితి వైపే తిరుగుతారు.” మరో పోప్‌ సందర్శించినప్పుడు, అంటే 1979 అక్టోబరులో పోప్‌ జాన్‌ పాల్‌ II, ఐక్యరాజ్యసమితి నుద్దేశించి యిలా అన్నాడు: “ఐక్యరాజ్యసమితి శాంతికి న్యాయానికి నిత్యం అత్యున్నత స్థానంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.” ప్రాముఖ్యమైన విషయమేమంటే, పోప్‌ తన ప్రసంగంలో యేసుక్రీస్తును గూర్చి లేక దేవుని రాజ్యాన్ని గూర్చి ఒక్క మాటైనా మాట్లాడలేదు. ది న్యూయార్క్‌ టైమ్స్‌ చెప్పినట్లు, 1987 సెప్టెంబరులో తాను అమెరికా దేశాన్ని సందర్శించినప్పుడు, “జాన్‌ పాల్‌ నూతన ప్రపంచవ్యాప్త ఐకమత్యాన్ని . . . వృద్ధిచేయడంలో ఐక్యరాజ్యసమితి వహించబోవు స్థానాన్ని గూర్చి బహువిస్తారంగా మాట్లాడాడు.”

పేరు, ఒక మర్మము

22. (ఎ) ఆ మహావేశ్య స్వారీచేయడానికి ఎటువంటి మృగాన్ని ఎన్నుకున్నది? (బి) మహాబబులోను అనే సాదృశ్యమైన వేశ్యను యోహాను ఎలా వర్ణిస్తున్నాడు?

22 మహావేశ్య తాను స్వారీచేయడానికి ఒక భయంకరమైన మృగాన్ని ఎన్నుకున్నదని త్వరలోనే అపొస్తలుడైన యోహాను తెలుసుకోబోతున్నాడు. అయిననూ, మొదట ఆయన అవధానం మహాబబులోను వైపే తిరుగుతుంది. అది అందంగా అలంకరించుకుంది, కానీ అదెంత అసహ్యంగా ఉందో! ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొని యుండెను. దాని నొసట దానిపేరు ఈలాగు వ్రాయబడి యుండెను—మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని.”—ప్రకటన 17:4-6ఎ.

23. మహాబబులోను పూర్తిపేరేమిటి, దాని ప్రాముఖ్యతేమిటి?

23 రోములో ఉన్న అలవాటు ప్రకారం యీ వేశ్య తన నొసటగల పేరునుబట్టి గుర్తింపబడుతోంది. * అది పొడవైన పేరు: “వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.” ఆ పేరు “ఒక మర్మము,” గూఢార్థమును కల్గివుంది. అయితే దేవుని నిర్ణయకాలంలో దాని మర్మము బయలు పర్చబడుతుంది. నిజానికి, ఈ వర్ణనారూపకమైన పేరుయొక్క పూర్తి ప్రాముఖ్యతను యెహోవా సేవకులు యీనాడు గ్రహించడానికి దూత యోహానుకు తగినంత సమాచారాన్ని యిస్తున్నాడు. మహా బబులోను అంటే అబద్ధమతమంతా అని మనం గుర్తిస్తాం. అది “వేశ్యలకు తల్లి” ఎందుకంటే క్రైస్తవమత సామ్రాజ్యంలోనున్న పలుశాఖలతోసహా, లోకంలోని అబద్ధమతాలన్నీ ఆత్మీయ వ్యభిచారంలో దాన్ని అనుకరిస్తూ దాని కుమార్తెలవలె ఉన్నారు. అది ఏహ్యమైన వాటికి తల్లియే అంటే విగ్రహారాధన, అభిచారం, సోదెచెప్పడం, జ్యోతిష్యం, హస్తసాముద్రికం, నరబలి, దేవదాసీతనం, అబద్ధ దేవతల గౌరవార్థం త్రాగుబోతుతనం, మరితర అసహ్యకార్యాలుచేసే తిరుగుబాటు సంతానానికి జన్మనిచ్చిందన్నమాట.

24. మహాబబులోను “ధూమ్రరక్తవర్ణముగల వస్త్రములు ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడి” యుండుట ఎందుకు తగియున్నది?

24 మహాబబులోను “ధూమ్ర రక్తవర్ణము,” రాజవస్త్రాల రంగులున్న దుస్తులను ధరించుకున్నది, మరియు “బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడి”నది. ఆ వర్ణన ఎంత చక్కగా సరిపోయింది! అందమైన భవంతులను, అరుదైన విగ్రహాలను, తైలవర్ణచిత్రాలను, అమూల్యమైన ప్రతిమలను, మరితర మతసంబంధమైన ఐశ్వర్యము, యీ లోకమతాలు సముపార్జించిన అపారమైన ఆస్తిపాస్తులు, డబ్బంతటిపై ఒక్కసారి దృష్టిసారించండి. వాటికన్‌లోను, అమెరికాలోను కేంద్రీకృతమైయున్న దూరదర్శిని సువార్త ప్రచార సామ్రాజ్యంలో లేక తూర్పుదేశాల్లోని విశేషమైన గుళ్లుగోపురాలలోను, మహాబబులోను అపారమైన ఆస్తులను గడించింది—కొన్నిసార్లు పోగొట్టుకుంది.

25. (ఎ) ‘ఏహ్యమైన కార్యములతో నిండిన సువర్ణపాత్ర’లోనివి దేనిని సూచిస్తున్నాయి? (బి) ఆ సాదృశ్యమైన వేశ్య ఏ భావంలో మత్తిల్లియున్నది?

25 ఆ వేశ్య చేతిలో ఉన్నదాన్ని యిప్పుడు చూడండి. “తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతో నిండిన” ఒక సువర్ణపాత్రను పట్టుకొనియుండుట యోహాను చూచి ఊపిరి బిగపట్టుకొని యుండవచ్చును! అది సమస్త జనులను తన మోహోద్రేకముతో కూడిన “వ్యభిచారమద్యమును” త్రాగించినపాత్ర యిదే. (ప్రకటన 14:8; 17:2) దాని పై ఆకారం అందంగానేవుంది, గానీ లోపల అసహ్యమైనవి, అపవిత్రమైనవి ఉన్నాయి. (మత్తయి 23:25, 26 పోల్చండి.) ఆ మహావేశ్య జనములను మోసగించి, వారిని తన వశంచేసుకోవడానికి తాను ఉపయోగించిన అసహ్యమైన అభ్యాసములు, అబద్ధాలు అందులో ఉన్నాయి. యోహాను యింకా చూసిన అసహ్యకరమైన దేమంటే, ఆ వేశ్య తానే దేవుని దాసుల రక్తముతో మత్తిల్లియున్నది! నిజానికి, “ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెనని” తర్వాత మనం చదువుతాము. (ప్రకటన 18:24) ఎంత గొప్ప రక్తాపరాధమోగదా!

26. మహాబబులోను రక్తాపరాధియనడానికి ఏ సాక్ష్యాధారమున్నది?

26 శతాబ్దాలతరబడి, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం సముద్రాలంత రక్తాన్ని చిందించింది. ఉదాహరణకు, మధ్యయుగంలో జపాన్‌నందలి క్యోటోలోని దేవాలయాలను కోటలుగా మార్చారు, అందులో యుద్ధ-సన్యాసులు, “బుద్ధుని పవిత్ర నామాన్ని” ఉచ్చరిస్తూ, వీధులన్నీ ఎఱ్ఱగా రక్తంతో ఏరులై పారేవరకు యుద్ధం చేశారు. ఈ 20వ శతాబ్దంలో, క్రైస్తవమత సామ్రాజ్యపు మతగురువులు వారివారి దేశాల సేనలతోపాటు నడిచారు, వీరు ఒకరినొకరు చంపుకున్నారు, కనీసం పదికోట్లమంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు 1987 లో అమెరికా మాజీ అధ్యక్షుడైన నిక్సన్‌ యిలా అన్నాడు: “ఈ 20వ శతాబ్దమే చరిత్రయంతటిలోకెల్లా అత్యధిక రక్తాన్ని చిందించింది. శతాబ్దారంభం కాకముందు జరిగిన యుద్ధాలన్నింటిలోను చంపబడిన వారందరికంటె ఎక్కువ యీ శతాబ్దంలోని యుద్ధాల్లో చంపబడ్డారు.” వీటన్నింటిలోను ప్రపంచమతాలు భాగం వహించినందుకుగాను దేవుడు వారికి ప్రతికూల తీర్పు తీరుస్తాడు; “నిరపరాధులను చంపు చేతులు” యెహోవాకు హేయములు. (సామెతలు 6:16, 17) అంతకు ముందు యోహాను బలిపీఠంనుండి వచ్చిన కేకలను యిలా విన్నాడు: “నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.” (ప్రకటన 6:10) వేశ్యలకును, భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లియైన మహాబబులోను, ఆ ప్రశ్నకు సమాధానము చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు అది పీకలలోతు కష్టాల్లో కూరుకు పోతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 3 భ్రష్టమైన క్రైస్తవమత సామ్రాజ్యంయొక్క అనేక క్రైస్తవేతర సిద్ధాంతాలు, ఆచారాలు, అభ్యాసాలనుగూర్చి తెల్పుతూ, 19వ శతాబ్దపు రోమన్‌ కాథోలిక్‌ కార్డినల్‌ జాన్‌ హెన్రీ న్యూమెన్‌ తన ఎస్యే ఆన్‌ ద డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ క్రిష్టియానిటీ అనే పుస్తకంలో యిలా వ్రాశాడు: “దేవాలయాలను ఉపయోగించడం, వాటిని ప్రత్యేకంగా ఒక సెయింట్‌కు సమర్పించడం, వాటిని అప్పుడప్పుడు చెట్లకొమ్మలతో అలంకరించడం, ధూపదీపాలు, క్రొవ్వొత్తులు వెలిగించడం; రోగంనుండి కోలుకున్న తర్వాత మొక్కుబడి ప్రకారం విరాళాలివ్వడం; పవిత్రజలం; శరణాలయాలు; పవిత్రదినములు కాలములు, క్యాలెండర్ల నుపయోగించడం, ఊరేగింపులు, పొలాలను దీవించడం; మతాచార్యుల దుస్తులు, గుండుగీయించుకోవడం, పెండ్లి ఉంగరం, తూర్పుకు తిరగడం, తర్వాతికాలంలో వచ్చిన ప్రతిమలు, బహుశ క్రైస్తవమతగురువుల ఉచ్ఛాఠణ, కైరీ ఎలిసన్‌ [“ప్రభువా, కరుణించుము” అనే కీర్తన] అనేవన్నియు అన్యమూలములను కల్గివున్నాయి, వాటిని చర్చిలోనికి అనుమతించి పరిశుద్ధపరచారు.”

అట్టి విగ్రహారాధనను పరిశుద్ధపర్చేబదులు, “సర్వశక్తిగల ప్రభువు” (యెహోవా, NW) క్రైస్తవులను యిలా హెచ్చరిస్తున్నాడు: “వారిమధ్యనుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడి.”—2 కొరింథీయులు 6:14-18.

^ పేరా 7 విలియం యల్‌. షీరర్‌ వ్రాసిన ది రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ ది థర్డ్‌ రీక్‌ అనే చారిత్రాత్మక పుస్తకం, “జర్మనీలో హిట్లర్‌ అధికారానికి రావడానికి ఏ వ్యక్తి వహించనంత బాధ్యత” వొన్‌పాపెన్‌ వహించాడని తెల్పుతుంది. జనవరి 1933 లో మాజీ జర్మన్‌ చాన్సలర్‌, వొన్‌ స్ల్కెచర్‌ వొన్‌ పాపెన్‌ను గూర్చి యిలా చెప్పాడు: “యూదా ఇస్కరియోతు పక్కన అతడు పరిశుద్ధుడుగాను ఇతడు పచ్చిమోసగాడుగాను నిరూపించుకుంటాడు.”

^ పేరా 7 ఆత్మల క్షేమార్థమై తాను అపవాదితోనైనా సంప్రదింపులు జరుపుతానని పోప్‌ పాయిస్‌ XI, మే 14, 1929న, మోండ్రగోన్‌ కాలేజి నుద్దేశించి ప్రసంగిస్తూ అన్నాడు.

^ పేరా 23 రోమా రచయిత సెనెకా తప్పిదస్థురాలైన యాజకురాలితో చెప్పిన మాటలను (స్వేతె పేర్కొన్నవాటిని) పోల్చండి: “అమ్మాయీ, నీవు అవమానకరమైన యింటిలోనున్నావు . . . నీ పేరు నీ నొసట వ్రేలాడుతుంది; నీ అసహ్యమైన క్రియకు నీవు డబ్బు తీసుకుంటున్నావు.”—కాన్‌ట్రోవ్‌. i, 2.

[అధ్యయన ప్రశ్నలు]

[237వ పేజీలోని బాక్సు]

చర్చిల్‌ ‘వేశ్యాతనాన్ని’ బహిర్గతం చేశాడు

తన పుస్తకమైన ది గాదరింగ్‌ స్టామ్‌ లో (1948), విన్‌స్టన్‌ చర్చిల్‌ నివేదించేదేమంటే, “ఆస్ట్రియా రాజకీయాలలో ప్రసిద్ధిచెందిన వ్యక్తులను ఆకర్షించడానికి లేక అణగద్రొక్కడానికి,” హిట్లర్‌, ఫ్రాంజ్‌ వొన్‌ పాపెన్‌ను వియన్నాకు మంత్రిగా నియమించాడు. వియన్నాలోని అమెరికా మంత్రి వొన్‌ పాపెన్‌ను గూర్చి చెప్పినదాన్ని చర్చిల్‌ యిలా ఎత్తివ్రాస్తున్నాడు: “అత్యంత ధైర్యంగాను, దుర్బుద్ధితోను . . . మంచి కాథోలిక్‌గా తనకున్న ప్రతిష్టతను కార్డినల్‌ ఇన్నిట్జర్‌ వంటి ఆస్ట్రియా వారితో పరిచయం చేసుకోవడానికి తాను సంకల్పించి యున్నట్లు . . . పాపెన్‌ నాతో చెప్పడం మొదలుపెట్టాడు.”

ఆస్ట్రియా ఓడిపోయి, హిట్లర్‌ సైన్యాలు వియన్నాలోనికి దూసుకుపోయిన తర్వాత, కాథోలిక్‌ కార్డినల్‌ ఇన్నిట్జర్‌ ఆస్ట్రియాలోని చర్చీలన్నింటిమీద స్వస్తికా జెండాను ఎగురవేయాలని, గంటలు మ్రోగించాలని, అడాల్ఫ్‌ హిట్లర్‌ జన్మదిన గౌరవార్థం ఆయన కొరకు ప్రార్థించాలని ఆజ్ఞాపించాడు.

[238వ పేజీలోని బాక్సు]

జర్మనీ కొరకు ‘యుద్ధప్రార్థన’

ఈ అంశంమీద, యీ క్రింది శీర్షిక డిశంబరు 7, 1941 ది న్యూయార్క్‌ టైమ్స్‌ మొదటి ప్రతిలో ప్రచురింపబడింది:

“ఫుల్దాలోని కాథోలిక్‌ బిషప్పులు దీవెనను, విజయాన్ని అడుగుతున్నారు . . . ఫుల్దాలో సమావేశమైన జర్మన్‌ కాథోలిక్‌ బిషప్పుల సభ, అన్ని ఆరాధనా సమయాల్లోని ప్రారంభంలోను అంతంలోను చదువవలసిన ప్రత్యేక ‘యుద్ధప్రార్థన’ను ప్రవేశపెట్టాలని సిఫారస్సు చేసింది. ప్రార్థనలో జర్మన్‌ సైన్యాలను దీవించి, సైనికులందరి ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడవలెననే అభ్యర్థన యిమిడివుంది. ‘భూమి, సముద్రము, గగనతలములోనుండే జర్మన్‌ సైనికులను కనీసం నెలకొక్కసారైనా ఆదివారం ప్రత్యేక ప్రార్థనా కూటంలో జ్ఞాపకం చేసుకోవాలని’ బిషప్పులు కాథోలిక్‌ మతగురువులకు ఉపదేశించారు.”

ఆ శీర్షిక ఆ వార్తాపత్రికలోని తర్వాతి ప్రతులనుండి తొలగించబడింది. డిశంబరు 7, 1941, నాజీ జర్మనీ సైనిక కూటమి భాగమైన జపాన్‌, పెరల్‌ హార్బర్‌వద్ద అమెరికా యుద్ధనౌకపై దాడిచేసింది.

[244వ పేజీలోని బాక్సు]

“దేవదూషణమైన నామములు”

రెండు కొమ్ములుగల క్రూరమృగము మొదటి ప్రపంచయుద్ధం తర్వాత నానాజాతిసమితిని ప్రతిపాదించినప్పుడు, మతసంబంధమైన ప్రియులనేకులు వెంటనే దీనికి మతపరమైన అనుమతినివ్వడానికి ప్రయత్నించారు. తత్ఫలితంగా, ఆ నూతన శాంతి సంస్థ “దేవదూషణ నామములతో నిండు”కొన్నది.

“క్రైస్తవత్వము మంచితనాన్ని అందించగలదు, అదే [నానాజాతి] సమితి వెన్నెముక, గనుక ఒప్పందాన్ని చిత్తుకాగితంనుండి దేవుని రాజ్యముయొక్క ఉపకరణంగా మార్చగలదు.”—ది క్రిష్టియన్‌ సెంచరీ, యు.యస్‌.ఎ., జూన్‌ 19, 1919, పేజి 15.

“నానాజాతి సమితి యొక్క ఉద్దేశము, లోకానికి ఓ మంచి క్రమపద్ధతి నేర్పరచాలనే దేవుని రాజ్యసంకల్పం లాగానేవుంది అంటే అంతర్జాతీయ తత్సంబంధాలు కలిగివుండాలనే సంకల్పానికి సమంగా ఉన్నది . . . ‘నీరాజ్యము వచ్చునుగాక’ అని క్రైస్తవులందరూ ప్రార్థించేది దానికొరకే.”—ది క్రిస్టియన్‌ సెంచరీ, యు.యస్‌.ఎ., సెప్టెంబరు 25, 1919, పేజి 7.

“నానాజాతి సమితి ఆయువుపట్టు క్రీస్తు రక్తమే.”—డా. ఫ్రాంక్‌ క్రేన్‌, ప్రొటెస్టెంట్‌ పరిచారకుడు, యు.యస్‌.ఎ.

“ది [నేషనల్‌] కౌన్సిల్‌ [కాంగ్రిగేషనల్‌ చర్చీలకు సంబంధించింది] యిప్పుడు అందుబాటులోనున్న ఏకైక రాజకీయ ఉపకరణమని [నానాజాతి సమితి చేసిన] ఆ ఒప్పందానికి మద్దతునిస్తుంది, దాని ద్వారానే యేసుక్రీస్తు ఆత్మ, జనముల వ్యవహారాలకు అభ్యాసయోగ్యమైన వాటిని అమలుపరచడంలో గొప్ప అవకాశాన్ని కనుగొనవచ్చు.”—ది కాంగ్రిగేషనలిస్ట్‌ అండ్‌ అడ్వాన్స్‌, యు.యస్‌.ఎ., నవంబరు 6, 1919, పేజి 642.

“ఆ సమావేశం మెథడిస్టులందరికి యిస్తున్న పిలుపేమంటే, తండ్రియైన దేవుడు మరియు దేవుని భూలోక సంతానము వ్యక్తపరిచిన అభిప్రాయాన్నే కల్గివున్న [నానాజాతి సమితి] ఉద్దేశాలను హత్తుకొని, వాటిని ఉన్నతపరుస్తూ ఉండాలి.”—ది వెస్లియన్‌ మెథడిస్ట్‌ చర్చి, బ్రిటన్‌.

“మనం యీ ఒప్పందానికి సంబంధించిన తీర్మానాలను, అవకాశాలను ఆశలను పరిశీలిస్తే, అందులో యేసుక్రీస్తు యొక్క బోధలోని ముఖ్యాంశాలన్నీ ఉన్నాయి: దేవునిరాజ్యం ఆయన నీతి . . . అంతకంటె తక్కువేమీలేదు.”—డిశంబరు 3, 1922 లో జెనీవానందు నానాజాతి సమితి ప్రారంభ సమావేశంలో కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ యిచ్చిన ప్రసంగము.

“ఈ దేశములోని నానాజాతిసమితి కూటమి, మానవ సంబంధమైన మిషనరీ సంస్థకున్నటువంటి పవిత్రమైన హక్కునే కల్గివుంది, ఎందుకంటే, అదే యిప్పుడు, జనములకు సమాధానకర్తయగు క్రీస్తుపాలనకు అత్యంత సమర్థవంతమైన రాయబారిగా పనిచేస్తుంది.”—డా. గార్వీ, కాంగ్రిగేష్నలిస్ట్‌ పరిచారకుడు, బ్రిటన్‌.

[236వ పేజీలోని చిత్రం]

(For fully formatted text, see publication)

లోకవ్యాప్తంగా నమ్మబడుతున్న అబద్ధసిద్ధాంతాలు బబులోనులో ఆరంభాన్ని కల్గివున్నాయి

బబులోను

త్రిత్వములు లేక త్రిత్వదేవుళ్లు

మానవాత్మ మరణాన్ని తప్పించుకుంటుంది

అభిచారం—“మృతుల”తో మాట్లాడుట

ఆరాధనలో విగ్రహాలను ఉపయోగించడం

దయ్యాలను వెళ్లగొట్టడానికి మంత్రాలను ఉపయోగించుట

శక్తివంతమైన యాజకత్వం ద్వారా పాలించుట

[239వ పేజీలోని చిత్రం]

ప్రాచీన బబులోను అనేక జలములమీద కూర్చుండెను

ఆ మహావేశ్య యీనాడు కూడ “విస్తారమైన జలములమీద” కూర్చున్నది

[241వ పేజీలోని చిత్రం]

మహాబబులోను భయంకరమైన క్రూరమృగముమీద కూర్చున్నది

[242వ పేజీలోని చిత్రం]

మతసంబంధమైన వేశ్య భూరాజులతో వ్యభిచరించింది

[245వ పేజీలోని చిత్రం]

ఆ స్త్రీ “పరిశుద్ధుల రక్తముచేతను మత్తిల్లి” యున్నది