కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆశ్చర్యకరమైన మర్మము బయల్పర్చబడింది

ఆశ్చర్యకరమైన మర్మము బయల్పర్చబడింది

అధ్యాయం 34

ఆశ్చర్యకరమైన మర్మము బయల్పర్చబడింది

1. (ఎ) ఆ మహావేశ్యను అది స్వారీచేసే భయంకర దృశ్యాన్ని చూసి ఎలా యోహాను స్పందించాడు, ఎందుకు? (బి) ప్రవచనార్థక దర్శన నెరవేర్పు ప్రకారం సంఘటనలు బయల్పర్చబడుచుండగా, యోహాను తరగతి యీ నాడెలా స్పందిస్తుంది?

ఆ మహావేశ్యను, అది స్వారీచేసే భయంకరమైన మృగాన్ని చూస్తున్నప్పుడు యోహాను ప్రతిస్పందన ఏమిటి? ఆయనే స్వయంగా యిలా సమాధానమిస్తున్నాడు: “నేను దానిచూచి బహుగా ఆశ్చర్యపడితిని.” (ప్రకటన 17:6బి) అలాంటి దృశ్యం మానవ ఊహకు ఎన్నటికీ అందనిది. అయిననూ, అదిగో అక్కడే ఉందది—దూరంగా అరణ్యంలో—భయంకరమైన, ఎఱ్ఱని క్రూరమృగంమీద కూర్చొనివుంది! (ప్రకటన 17:3) ప్రవచనార్థక దృశ్యం యొక్క నెరవేర్పు ప్రకారం సంఘటనలు బయల్పర్చ బడుచుండగా యోహాను తరగతికూడ యీనాడు బహుగా ఆశ్చర్యపడుతోంది. లోకంలోని ప్రజలు చూడగల్గితే, వారు ‘అబ్బా!’ అని అంటారు, లోకపాలకులైతే అది ‘ఊహాతీతమే!’ అని ప్రతిధ్వనించేలా పలుకుతారు. అయితే ఆ దర్శనం 20వ శతాబ్దపు విస్మయమొందించే వాస్తవమౌతుంది. దేవుని ప్రజలు యిప్పటికే ఆ దర్శన నెరవేర్పులో ప్రాముఖ్యమైన భాగం కల్గివున్నారు, మరియు ఆ ప్రవచనం దాని ఆశ్చర్యకరమైన అంతిమ నెరవేర్పుకు చేరుతుందని యిది వారికి అభయమిస్తోంది.

2. (ఎ) యోహాను ఆశ్చర్యానికి సమాధానంగా దూత ఆయనకు ఏమని చెబుతున్నాడు? (బి) యోహాను తరగతికి ఏమి, ఎలా బయల్పర్చబడింది?

2 దూత యోహాను ఆశ్చర్యాన్ని గమనిస్తున్నాడు. యోహానిలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు: “ఆ దూత నాతో ఇట్లనెను—నీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలను పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.” (ప్రకటన 17:7) అవును, దూత యిప్పుడు మర్మమును బయలుపరుస్తాడు! ఆశ్చర్యంతో చూస్తున్న యోహానుకు ఆయన ఆ దర్శనంయొక్క వివిధ రంగాలను, బయల్పర్చ బడనైయున్న ముఖ్య సంఘటనల్ని వివరిస్తాడు. అలాగే, ఈనాడు దూత నడిపింపుక్రింద సేవచేస్తున్న మెలకువగల యోహాను తరగతికి ఆ ప్రవచన భావం బయల్పర్చబడింది. “భావములు చెప్పుట దేవుని అధీనమేగదా?” విశ్వాసియైన యోసేపువలె, మనమూ అలాగే నమ్ముతాము. (ఆదికాండము 40:8; దానియేలు 2:29, 30 పోల్చండి.) దేవుని ప్రజలకు యెహోవా ఆ దర్శన భావాన్ని, వారి జీవితాలపై దాని ప్రభావాన్ని గూర్చి చెప్పేటప్పుడు వారు వేదికమధ్యలో ఉన్నట్లుగా నున్నారు. (కీర్తన 25:14) యుక్తసమయంలో ఆ స్త్రీనిగూర్చిన, క్రూరమృగాన్ని గూర్చిన మర్మాన్ని వారు గ్రహించేలా ఆయన వారికి బయల్పరచాడు.—కీర్తన 32:8.

3, 4. (ఎ) సొసైటి అధ్యక్షుడు 1942 లో ఏ బహిరంగ ప్రసంగమిచ్చాడు, అది ఎఱ్ఱని క్రూరమృగాన్ని ఎలా వివరించింది? (బి) దూత యోహానుతో చెప్పిన ఏ మాటలను అధ్యక్షుడు నార్‌ చర్చించాడు?

3 సెప్టెంబర్‌ 18-20, 1942, రెండో ప్రపంచయుద్ధం ముమ్మరంగా సాగుతున్న సమయంలో, యెహోవాసాక్షులు వారి న్యూ వరల్డ్‌ థియోక్రటిక్‌ అసెంబ్లీని అమెరికాలో జరుపుకున్నారు. సమావేశానికి కేంద్రమైన ఒహాయోలోని క్లెవ్‌లాండ్‌ పట్టణం సమావేశాలు జరిగిన యితర 50 దేశాలతో టెలెఫోను ద్వారా కలుపబడింది, అప్పుడు అత్యధికసంఖ్యలో 1,29,699 మంది హాజరయ్యారు. యుద్ధపరిస్థితులు అనుమతించినచోట, ప్రపంచవ్యాప్తంగా అదే కార్యక్రమముతో ఇతర సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో, ఆ యుద్ధం దేవుని యొక్క అర్మగిద్దోను యుద్ధానికి నడిపిస్తుందని యెహోవా ప్రజల్లో అనేకమంది ఎదురుచూశారు; అందుకే “పీస్‌—కెన్‌ ఇట్‌ లాస్ట్‌?” అనే బహిరంగ ప్రసంగపు ముఖ్యాంశం, మంచి కుతూహలాన్ని రేపింది. మరి దానికి వ్యతిరేకమైనదే రాజ్యాలకు సంభవించనైయున్న దృష్ట్యా, వాచ్‌టవర్‌ సొసైటీ నూతన అధ్యక్షుడు, యన్‌.హెచ్‌.నార్‌ ఆ శాంతినిగూర్చి ఎలా ప్రసంగించాలనుకున్నాడు? * ఎందుకంటే, యోహాను తరగతి దేవుని ప్రవచన వాక్యంలో “మరి విశేష జాగ్రత్త కలిగి” యుండెను.—హెబ్రీయులు 2:1; 2 పేతురు 1:19.

4 “పీస్‌—కెన్‌ ఇట్‌ లాస్ట్‌?” అనే ప్రసంగం ఆ ప్రవచనంపై ఎటువంటి వెలుగును ప్రసరింపజేసింది? దూత యోహానుకు యీ మాటల్లో తెల్పినదానినాధారం చేసుకుని అధ్యక్షుడు నార్‌, ప్రకటన 17:3 లోని ఎఱ్ఱని క్రూరమృగము నానాజాతి సమితేనని స్పష్టంగా తెల్పుతూ, దాని మహోద్రేకపూరిత జీవితాన్ని గూర్చి చర్చించసాగాడు: “నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకివచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది.”—ప్రకటన 17:8ఎ.

5. (ఎ) ఏవిధంగా “ఆ మృగము ఉండెను” గాని ఆ తర్వాత “లేదు”? (బి) “నానాజాతి సమితి అగాధంలోనే ఉండిపోతుందా” అనే ప్రశ్నకు అధ్యక్షుడు నార్‌ ఎలా సమాధానం చెప్పాడు?

5 “ఆ క్రూరమృగము . . . ఉండెను.” అవును, అది నానాజాతి సమితిగా, మొత్తంమీద ఏదోక సమయంలో 63 దేశాల సభ్యత్వంతో, జనవరి 10, 1920నుండి ఉనికిలో ఉండెను. అయితే, జపాన్‌, జర్మనీ, ఇటలీ సభ్యత్వంనుండి విరమించుకున్నాయి, సోవియట్‌ యూనియన్‌ సమితి సభ్యత్వంనుండి తొలగించబడింది. సెప్టెంబర్‌ 1939 లో జర్మనీ నాజీ నియంత రెండో ప్రపంచయుద్ధాన్ని ప్రారంభించాడు. * ప్రపంచశాంతిని తేలేక నానాజాతిసమితి నిష్క్రియయనే అగాధంలోకి పూర్తిగా పడిపోయింది. అది 1942 నాటికి, ఒకప్పుడు ఉండెను అనే స్థాయికి పోయింది. ఈ సంఘటనకు ముందు లేక తర్వాత కాదుగానీ—ఆ క్లిష్ట సమయంలోనే—యెహోవా తన ప్రజలకు ఆ దర్శనం యొక్క పూర్తి భావాన్ని బయల్పర్చాడు. న్యూవరల్డ్‌ థియోక్రటిక్‌ అసెంబ్లీలో, అధ్యక్షుడు నార్‌, ప్రవచనం ప్రకారం, “క్రూరమృగము . . . యిప్పుడు లేదు,” అని ప్రకటించగలిగాడు. తర్వాత ఆయన యీ ప్రశ్న అడిగాడు, “నానాజాతి సమితి అగాధంలోనే ఉండిపోతుందా?” ప్రకటన 17:8, వచనాన్ని ఎత్తిచూపిస్తూ ఆయనిలా సమాధానమిచ్చాడు: “ప్రపంచరాజ్యాల సమాఖ్య మరల పైకివస్తుంది.” యెహోవా ప్రవచనార్థక వాక్యాన్ని రుజువుచేస్తూ అది అలాగే ఖచ్చితంగా జరిగింది!

అగాధమునుండి పైకివచ్చుట

6. (ఎ) ఎఱ్ఱని క్రూరమృగం ఎప్పుడు, ఏ క్రొత్తపేరుతో అగాధంనుండి పైకివచ్చింది? (బి) ఎందుకు ఐక్యరాజ్యసమితి నిజానికి ఎఱ్ఱని క్రూరమృగము యొక్క పునరుజ్జీవమై యున్నది?

6 ఎఱ్ఱని క్రూరమృగము నిజంగా అగాధంనుండి పైకి వచ్చింది. జూన్‌ 26, 1945, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోనందు కరతాళధ్వనులమధ్య 50 దేశాలు ఐక్యరాజ్యసమితి ఒడంబడికను అంగీకరించాయి. ఈ సంస్థ “అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడవలసి” యుండెను. నానాజాతిసమితికి ఐక్యరాజ్యసమితికి అనేక పోలికలుండెను. ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లొపీడియా యిలా చెబుతోంది: “మొదటి ప్రపంచయుద్ధం తర్వాత స్థాపించబడిన నానాజాతిసమితికి ఐక్యరాజ్యసమితికి కొన్నివిషయాలలో పోలికలున్నాయి . . . ఐక్యరాజ్యసమితిని స్థాపించిన అనేక రాజ్యాలే నానాజాతిసమితిని స్థాపించాయి. రాజ్యాలమధ్య శాంతిని నెలకొల్పడానికి సహాయపడేందుకు నానాజాతిసమితి స్థాపించబడినట్లే ఐక్యరాజ్యసమితి కూడ స్థాపించబడింది. ఐక్యరాజ్యసమితిలోని ముఖ్యసభ్యులు మొత్తంమీద నానాజాతిసమితి సభ్యుల్లాంటివారే.” గనుక, ఐక్యరాజ్యసమితి వాస్తవానికి ఎఱ్ఱని క్రూరమృగము యొక్క పునరుజ్జీవమే. దాని 175 దేశాల సభ్యత్వం, నానాజాతిసమితి యొక్క 63 దేశాల సభ్యత్వంకన్న ఎంతో ఎక్కువే; అది తనకు ముందున్న దానికన్న ఎక్కువ బాధ్యతలను కూడ కల్గివుంది.

7. (ఎ) ఈ పునరుజ్జీవమైన ఎఱ్ఱని క్రూరమృగాన్ని చూసి భూనివాసులెందుకు ఆశ్చర్యపోయారు? (బి) ఐక్యరాజ్యసమితి ఏ గురిలో తప్పిపోయింది, దీన్నిగూర్చి దాని సెక్రటరీ జనరల్‌ ఏమన్నాడు?

7 మొదట ఐక్యరాజ్యసమితిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలా ఆశలు పెట్టుకోవడం దూత చెప్పిన మాటల నెరవేర్పు ప్రకారమే జరిగింది: “భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు.” (ప్రకటన 17:8బి) న్యూయార్క్‌ ఈస్ట్‌ రివర్‌ ప్రక్కనున్న దాని మోసపూరిత ప్రధాన కార్యాలయంనుండి బ్రహ్మాండమైన యీ నూతన సంస్థ పనిచేయడాన్ని చూసి భూనివాసులు ఆశ్చర్యపోయారు. అయితే నిజమైన శాంతిభద్రతలు ఐక్యరాజ్యసమితికి దూరమయ్యాయి. ఈ క్రూరమైన అణుయుగంలో,—యం ఎ డి అని సంక్షిప్తపరచిన—“మ్యూచ్యువల్‌ అష్యూర్డ్‌ డిస్ట్రక్షన్‌” అనే బెదరింపు మూలంగా మాత్రమే ప్రపంచశాంతి నెలకొంటున్నది, మరి ఆయుధసేకరణ పోటీ విపరీతంగా పెరుగుతూంది. ఐక్యరాజ్యసమితి దాదాపు 40 ఏండ్లుగా సాగించిన ప్రయత్నం తర్వాత దాని సెక్రటరీ జనరల్‌, జేవియర్‌ పెరెజ్‌ డిక్యులర్‌, 1985 లో యిలా విచారం వెలిబుచ్చాడు: “మనం మరో వింతైన యుగంలో జీవిస్తున్నాం, దాని విషయంలో ఏంచేయాలో మనకు తెలియదు.”

8, 9. (ఎ) ఐక్యరాజ్యసమితి దగ్గర ప్రపంచసమస్యలకు సమాధానాలెందుకు లేవు, దేవుని అనుజ్ఞప్రకారం త్వరలో దానికేమి సంభవిస్తుంది? (బి) దేవుని “జీవగ్రంథములో” ఐక్యరాజ్యసమితి స్థాపకుల, అభిమానుల పేర్లు ఎందుకు వ్రాయబడలేదు? (సి) యెహోవా రాజ్యం దేనిని విజయవంతంగా నెరవేర్చును?

8 ఐక్యరాజ్యసమితి యొద్ద సమాధానాలులేవు. ఎందుకు లేవు? ఎందుకంటే మానవులందరికి ప్రాణదాతయైన వాడు ఐక్యరాజ్యసమితికి ప్రాణంపోయలేదు. దాని జీవితకాలం కొద్దిపాటిదే, ఎందుకంటే దేవుని ఆజ్ఞప్రకారం “అది నాశనమునకు పోవును.” ఐక్యరాజ్యసమితి స్థాపకుల, అభిమానుల పేర్లు దేవుని జీవగ్రంథంలో లిఖించబడలేదు. యెహోవా దేవుడు మానవులతోకాక తన క్రీస్తు రాజ్యంద్వారా నెరవేరుస్తానని వాగ్దానం చేసిన దానిని దేవుని నామాన్ని దూషించే అనేకమంది పాపులు, మర్త్యులగు మానవులు ఎలా ఐక్యరాజ్యసమితి ద్వారా నెరవేర్చగలరు?—దానియేలు 7:27; ప్రకటన 11:15.

9 ఐక్యరాజ్యసమితి నిజానికి, సమాధాన కర్తయగు యేసుక్రీస్తు పాలించే దేవుని మెస్సీయ రాజ్యానికి—అంతంలేని రాజ్యానికి—వ్యతిరేకమైన దూషణకరమగు కృత్రిమరాజ్యం. (యెషయా 9:6, 7) ఐక్యరాజ్యసమితి ఏదోకొంత తాత్కాలిక శాంతిని నెలకొల్పినా, వెంటనే యుద్ధాలు వస్తాయి. ఇది పాపులైన మానవుల సహజ గుణంలోనేవుంది. ‘జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు వారిపేరు వ్రాయబడలేదు.’ క్రీస్తుపాలించే యెహోవా రాజ్యం భూమ్మీద శాంతిని నెలకొల్పడమే గాకుండ, యేసు విమోచనా క్రయధనాన్ని ఆధారం చేసుకొని, దేవుని జ్ఞాపకమందున్న నీతిమంతులు, అనీతిమంతులైన మృతులను లేపుతుంది. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15) ఇందులో సాతాను అతని అనుచరుల దాడులను ఎదిరించి స్థిరంగా నిలబడినవారును, యింకనూ విధేయత చూపవలసిన వారును ఉన్నారు. దేవుని జీవగ్రంథంలో, మహాబబులోనులో పాతుకుపోయి అంటిపెట్టుకొనియున్న వారి పేర్లుగానీ, క్రూరమృగాన్ని ఆరాధిస్తూనే ఉన్నవారి పేర్లుగానీ కచ్చితంగా ఉండవు.—నిర్గమకాండము 32:33; కీర్తన 86:8-10; యోహాను 17:3; ప్రకటన 16:2; 17:5.

శాంతిభద్రతలు—వృధానిరీక్షణ

10, 11. (ఎ) ఐక్యరాజ్యసమితి 1986 లో ఏమని ప్రకటించింది, దానికి ప్రతిస్పందన ఎలావుంది? (బి) శాంతికొరకు ప్రార్థించడానికి ఇటలీలోని ఆస్సీసిలో ఎన్ని “మతవర్గాలు” సమావేశమయ్యాయి, దేవుడు అటువంటి ప్రార్థనలకు జవాబిస్తాడా? వివరించండి.

10 మానవుని నిరీక్షణను బలపర్చే ప్రయత్నంలో, ఐక్యరాజ్యసమితి “మానవాళి భవిష్యత్తును, శాంతిని కాపాడేందుకు” అనే మూలాంశముతో 1986వ సంవత్సరాన్ని “అంతర్జాతీయ శాంతి సంవత్సరము” అని ప్రకటించింది. యుద్ధంచేస్తున్న దేశాలు కనీసం ఒక్క సంవత్సరంవరకైనా యుద్ధం చేయకుండా ఉండాలని కోరబడ్డాయి. వాటిస్పందన ఏమిటి? అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం, 1986 లోనే కనీసం 50 లక్షలమంది సైనికులు యుద్ధంలో చంపబడ్డారు. కొన్ని ప్రత్యేక నాణెములు, జ్ఞాపకార్థ చిహ్నాలు పంచిపెట్ట బడినప్పటికీ, ఆ సంవత్సరంలో ఆదర్శప్రాయమైన శాంతిని నెలకొల్పడానికి దేశాలు ప్రయత్నించలేదు. అయిననూ, ప్రపంచమతాలు—ఐక్యరాజ్యసమితితో ఎల్లప్పుడూ మంచి ఐకమత్యాన్ని వాంఛిస్తూ—ఆ సంవత్సరాన్ని పలుమార్గాల్లో ప్రచారం చేయడానికి పూనుకున్నాయి. జనవరి 1, 1986 లో పోప్‌ జాన్‌ పాల్‌ II ఐక్యరాజ్యసమితి సేవను ప్రస్తుతించి, ఆ క్రొత్త సంవత్సరాన్ని శాంతికి సమర్పించాడు. అక్టోబర్‌ 27న శాంతికొరకు ప్రార్థించునట్లు ప్రపంచమత నాయకులలో అనేకులను ఇటలీలోని ఆస్సీసీలో సమావేశపరచాడు.

11 శాంతికొరకు చేసే అటువంటి ప్రార్థనల్ని దేవుడంగీకరిస్తాడా? సరే, ఆ మతనాయకులు ఏ దేవున్ని ప్రార్థించారు? మీరు వాళ్లనడిగుంటే, ప్రతిగుంపు ఒక్కో పేరు చెప్పివుండేవారు. వివిధ రీతుల్లోచేసే ప్రార్థనల్ని విని, అభ్యర్థనలను అనుమతించడానికి లక్షలాది దేవుళ్లుగల సర్వదేవతాగణమనేది ఒకటుందా? అందులో పాల్గొన్నవారిలో అనేకులు క్రైస్తవమత సామ్రాజ్యంలోని త్రిత్వాన్ని ఆరాధించినవారే. * బౌద్ధులు, హిందువులు, మరితరులు లెక్కలేనంతమంది దేవుళ్లకు ప్రార్థించారు. ప్రసిద్ధిచెందిన కాంటర్‌బరి యొక్క ఆంగ్లికన్‌ ఆర్చిబిషప్‌, బౌద్ధమతము యొక్క దలైలామా, రష్యా ఆర్థోడాక్స్‌ మెట్రోపోలిటన్‌, టోక్యోలోని షింటో మాతాధిపీఠపు సమాజాధ్యక్షుడు, సర్వజీవుల్లోను ఆత్మవుందని విశ్వసించే ఒక ఆఫ్రికామతస్థుడు, మరియు ఈకలతో తయారుచేయబడిన తలపాగాలు ధరించిన యిద్దరు అమెరికన్‌ ఇండియన్‌లు, మొత్తంమీద 12 “మతకుటుంబాలు” సమావేశమయ్యాయి. చెప్పాలంటే, టి.వి.వారు ఎంతో అందంగా చిత్రీకరించడానికి సరిపోయే రంగురంగుల గుంపు అని అనవచ్చును. ఒక గుంపు ఒకసారి 12 గంటలసేపు నిర్విరామంగా ప్రార్థించింది. (లూకా 20:45-47 పోల్చండి.) అయితే, వాటిలో ఏ ప్రార్థనైనా వారిపైన ఆవరించివున్న వర్షపుమేఘాలను దాటిపోయిందా? ఈక్రింది కారణాలనుబట్టి అవి దాటిపోలేదు.

12. ప్రపంచ మతనాయకులు చేసిన శాంతిప్రార్థనలకు దేవుడు ఏ కారణాలనుబట్టి ప్రత్యుత్తరమివ్వలేదు?

12 ‘యెహోవా నామమున నడుచుకొను’ వారితో పోల్చితే, ఆ మతనాయకులలో ఏ ఒక్కరూ బైబిలునందలి మూలభాషలో కనీసం 7,000 సార్లు కనబడే సజీవుడగు దేవుడైన యెహోవాకు ప్రార్థించలేదు. (మీకా 4:5; యెషయా 42:8, 12) * గుంపుగా వారు యేసు నామమున దేవుని ప్రార్థించలేదు, వారిలో అనేకులకు యేసుక్రీస్తు అంటేనే విశ్వాసంలేదు. (యోహాను 14:13; 15:16) వారిలో ఎవ్వరూ మనకాలం కొరకున్న దేవుని చిత్తాన్ని చేయడంలేదు, ఆ చిత్తమేమంటే—ఐక్యరాజ్యసమితి కాదుగానీ—రాబోయే దేవునిరాజ్యమే మానవజాతికి నిజమైన నిరీక్షణయని ప్రపంచమంతా ప్రకటించడమే. (మత్తయి 7:21-23; 24:14; మార్కు 13:10) చాలావరకు వారి మతసంస్థలు, యీ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలతోసహా, చరిత్రలోని రక్తపాతంతోనిండిన యుద్ధాల్లో పాల్గొన్నాయి. అటువంటివారితో దేవుడు యిలా అంటున్నాడు: “మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి.”—యెషయా 1:15; 59:1-3.

13. (ఎ) శాంతికొరకు ప్రపంచ మతనాయకులు ఐక్యరాజ్యసమితితో చేతులు కలపడమెందుకు ప్రాముఖ్యతను కల్గియున్నది? (బి) శాంతికొరకు వేసే యీ కేకలన్నీ దేవుడు ప్రవచించిన ఏ ముగింపుతో ముగిసిపోతాయి?

13 ఇంకనూ, ఈ సమయంలో శాంతికొరకు పిలుపివ్వడంలో మతనాయకులు ఐక్యరాజ్యసమితితో చేతులు కలపడం ఎంతో ముఖ్యం. వారి మతస్థులలో అనేకులు మతాన్ని విడిచిపోతున్న యీ నవీన యుగంలో, వారు తమ స్వప్రయోజనం కొరకు ఐక్యరాజ్యసమితి పలుకుబడిని ఉపయోగించు కోవాలనుకుంటున్నారు. ప్రాచీనకాలంలోని నమ్మకద్రోహులైన ఇశ్రాయేలీయుల నాయకులవలె వారిలా ప్రకటిస్తున్నారు, “సమాధానము లేని సమయమున—సమాధానము, సమాధానమున్నది.” (యిర్మీయా 6:14) నిశ్చయంగా శాంతికొరకు వారు వేసేకేకలు అపొస్తలుడైన పౌలు ప్రవచించిన దానిముగింపుకు మద్దతుగా వేస్తున్నారు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు (యెహోవా NW) దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణీస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు.”—1 థెస్సలొనీకయులు 5:2, 3.

14. ‘శాంతిభద్రతలు!’ అనే కేక ఏ రూపం ధరిస్తుంది, దానివలన మోసగించబడకుండా ఒకడెలా తప్పించుకోగలడు?

14 ‘శాంతి భద్రతల’ కొరకు వేసే యీ ప్రాముఖ్యమైన కేక ఎలాంటి రూపుదిద్దుకుంటుందో? అలా కేకలు వేసేవారు అకస్మాత్తుగా నశించకముందు అది ప్రముఖస్థానం వహిస్తుందని యిక్కడ తెల్పబడింది. కావున, ప్రపంచనాయకులు ముందు ప్రకటించిన ప్రకటనలకన్నా అదెక్కువ ప్రాముఖ్యతను కల్గివుండాలి. నిశ్చయంగా అది భూవ్యాప్తంగా ఉంటుంది. అయిననూ, అది ఉపరితలంకంటె గొప్పదేమీ కాబోదు. నిజానికి లోపలేమీ మార్పుకలుగబోదు. స్వార్థం, ద్వేషం, నేరం, కుటుంబ విచ్ఛిన్నత, అవినీతి, రోగం, దుఃఖం, మరియు మరణం అందులో యింకనూ ఉంటాయి. అందుకే బైబిలు ప్రవచనం విషయంలో మెలకువగా లేనివారిని, వేయబోయే ఆ కేక మోసపుచ్చుతుంది. అయితే నీవు ప్రపంచ సంఘటనల భావమేమిటో తెలిసికొనడంలో మెలకువ కలిగి, దేవుని వాక్యంలోని ప్రవచనార్థక హెచ్చరికలను లక్ష్యపెడితే, అది నిన్ను మోసం చేయదు.మార్కు 13:32-37; లూకా 21:34-36.

[అధస్సూచీలు]

^ పేరా 3 జె.యఫ్‌.రూథర్‌ఫర్డ్‌ జనవరి 8, 1942 లో చనిపోయారు, ఆయన స్థానంలో యన్‌. హెచ్‌. నార్‌ అధ్యక్షుడయ్యారు.

^ పేరా 5 నవంబర్‌ 20, 1940 లో జర్మనీ, ఇటలీ, జపాన్‌, మరియు హంగేరి ఒక “నూతన నానాజాతిసమితి” కొరకు సంతకాలు చేశాయి. నాలుగు రోజుల తర్వాత వాటికన్‌ మతసంబంధమైన శాంతికొరకు, నూతన క్రమముకొరకు మాస్‌ను ప్రసారంచేసి, ప్రార్థనలు చేసింది. ఆ “నూతన సమితి” ఎన్నడూ రూపుదిద్దుకోలేదు.

^ పేరా 11 త్రిత్వమనే సిద్ధాంతం ప్రాచీన బబులోనునుండి వస్తూవుంది, అక్కడే షామేష్‌ అనే సూర్యదేవుడు, సిన్‌ అనే చంద్రదేవుడు, ఇస్తార్‌ అనే నక్షత్ర దేవుడు త్రిత్వదేవుళ్లుగా ఆరాధించబడ్డారు. ఐగుప్తు, ఓసిరిస్‌, ఐసిస్‌, మరియు హోరస్‌ను ఆరాధిస్తూ అదేపద్ధతి ననుసరించింది. అస్సీరీయుల ప్రముఖ దేవుడైన అష్షూరు మూడు శిరస్సులున్నట్లుగా వర్ణించబడ్డాడు. అదేమాదిరిననుసరిస్తూ, దేవునికి మూడు తలలున్నట్లు కాథోలిక్‌ చర్చీలలో విగ్రహాలు కనబడతాయి.

^ పేరా 12 వెబ్‌స్టర్స్‌ థర్డ్‌ న్యూ ఇంటర్నేషనల్‌ డిక్షనరీ 1981, యెహోవా దేవున్ని “గుర్తించబడిన ఏకైక దేవుడును, యెహోవాసాక్షులు ఆరాధించే ఒకే దేవుడు” అని వర్ణిస్తుంది.

[అధ్యయన ప్రశ్నలు]

[250వ పేజీలోని బాక్సు]

విరుద్ధభావంగల “శాంతి”

ఐక్యరాజ్యసమితి 1986వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించినప్పటికీ, మారణాయుధాల సేకరణ పెచ్చుపెరిగిపోయింది. వరల్డ్‌ మిలిటరీ అండ్‌ సోషల్‌ ఎక్స్‌పెండిచర్‌ 1986 విలువైన యీ క్రింది వివరాలందిస్తుంది:

ప్రపంచమంతట 1986 లో సైనికఖర్చు 90 వేలకోట్ల డాలర్లయింది.

ఒకగంటకు అయ్యే సైనిక ఖర్చును సంవత్సరం పొడవునా నిరోధించగల అంటురోగాలవల్ల చనిపోయే 30.5 లక్షలమందికి సరిపడేంత వ్యాధి నిరోధకమందు యివ్వొచ్చు.

ప్రపంచమంతా, ఐదుగురిలో ఒక్కరు కఠిన దారిద్ర్యములో ఉన్నారు. ప్రపంచం రెండు రోజుల్లో ఆయుధాలకొరకు చేసేఖర్చుతో యీ పీడిత జనాబాను ఒక సంవత్సరంవరకు పోషించవచ్చు.

ప్రపంచంలో నిల్వవున్న అణ్వాయుధాల ప్రేలుడుశక్తి చెర్నోబిల్‌నందు సంభవించిన ప్రేలుడుశక్తి కన్న 16,00,00,000 రెట్లు ఎక్కువ.

ఈనాడు ఒక అణుబాంబు 1945 లో హిరోషిమా మీద వేసిన బాంబుకంటె 500 రెట్లు ఎక్కువశక్తిని విడుదల చేయగలదు.

ఈనాటి అణ్వస్త్రశాలలు హిరోషిమాలో ప్రేలినదానికన్నా పదిలక్షల రెట్ల  ఎక్కువశక్తిని కల్గివున్నాయి. అంటే వాటికున్న శక్తి, 3 కోట్ల 80 లక్షలమంది మరణించిన రెండో ప్రపంచయుద్ధంలో విడుదలైన ప్రేలుడు శక్తికన్నా 2,700 రెట్లతో సమానము.

యుద్ధాలు తరచుగాను, ప్రాణాంతకంగాను జరుగుతున్నాయి. యుద్ధమరణాలు 18వ శతాబ్దంలోనైతే 44 లక్షలు, 19వ శతాబ్దంలో 83 లక్షలు, 20వ శతాబ్దంలోని 86 సంవత్సరాలలో 9 కోట్ల 88 లక్షలు సంభవించాయి. పద్దెనిమిదవ శతాబ్దంనుండి యుద్ధమరణాలు ప్రపంచజనాభా పెరుగుదలకంటె ఆరురెట్లు ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి. పందొమ్మిదవ శతాబ్దంకన్న పదిరెట్లు 20వ శతాబ్దంలోని యుద్ధాల్లో మరణిస్తున్నారు.

[247వ పేజీలోని చిత్రం]

ఎఱ్ఱని క్రూరమృగాన్ని గూర్చి ప్రవచించబడినట్లు, రెండో ప్రపంచ యుద్ధకాలంలో నానాజాతిసమితి అగాధంలోనికి పోయింది, గానీ అది ఐక్యరాజ్యసమితిగా పునరుద్ధరించబడింది

[249వ పేజీలోని చిత్రం]

ఐక్యరాజ్యసమితియొక్క “శాంతి సంవత్సరము”నకు మద్దతుగా, ప్రపంచ మతాల ప్రతినిధులు ఇటలీలోని ఆస్సీసిలో వివిధరకాల ప్రార్థనలు చేశారు, గానీ వారిలో ఏ ఒక్కరూ సజీవుడగు దేవుడైన యెహోవాకు ప్రార్థించలేదు