కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడు?”

“ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడు?”

అధ్యాయం 15

“ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడు?”

1. యోహాను దర్శనంలో యిప్పుడేమి జరుగుతుంది?

మహనీయం! మహోన్నతం! వెలుగుతున్న దీపాలు, కెరూబులు, 24 పెద్దలు, మరియు గాజువంటి సముద్రం మధ్యలోనున్న యెహోవా సింహాసనం యొక్క దృశ్యం, అటువంటి గగుర్పాటు కల్గించేదే. అయితే యోహానూ, తర్వాత మీరేం చూస్తున్నారు? యోహాను యీ పరలోక దృశ్యంమీదనే దృష్టి కేంద్రీకరిస్తూ మనకిలా చెబుతున్నాడు: “మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందుగాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తిలేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుంటిని.”—ప్రకటన 5:1-4.

2, 3. (ఎ) ఆ గ్రంథాన్ని ఎవరో ఒకరు విప్పాలని యోహాను ఎందుకు ఆశతో ఎదురు చూస్తున్నాడు, అయితే అలా జరిగే సూచన ఎలా కనబడింది? (బి) మనకాలంలో దేవుని అభిషక్త ప్రజలు దేనికొరకు ఆశతో ఎదురు చూశారు?

2 సర్వసృష్టికర్త సర్వోన్నత ప్రభువగు యెహోవా స్వయంగా ఆ గ్రంథాన్ని పట్టుకుని యున్నాడు. దానినిండా చాలాప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి, ఎందుకంటె, దానివెనుక ముందు వ్రాయబడివుంది. మన కుతూహలం పెరిగింది. మరి ఆ గ్రంథంలో ఏముంది? యెహోవా యోహానుకిచ్చిన ఆహ్వానాన్ని జ్ఞాపకం చేసుకుందాం: “ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదను.” (ప్రకటన 4:1) మిక్కిలి ఆశతో, వాటిని గూర్చి నేర్చుకోవడానికి మనమెదురు చూస్తున్నాం. అయ్యో, ఏంచేద్దాం, ఆ గ్రంథపుచుట్ట గట్టిగా మూయబడి ఏడు ముద్రలతో ముద్రించబడింది!

3 ఆ బలిష్ఠుడైన దూత గ్రంథం విప్పడానికి యోగ్యుడైన వాన్ని కనుగొనునా? కింగ్‌డం ఇంటర్లీనియర్‌ ప్రకారం, ఆ గ్రంథం యెహోవా “కుడిచేతిలోనున్నది.” అంటే ఆయన దీన్ని తన అరచేతి నందుంచు కొనియున్నాడని సూచిస్తుంది. అయితే, పరలోకమందైనను భూమ్మీదనైనను దాన్నివిప్పి, చదవడానికి యోగ్యులెవరూ లేరు. భూమిక్రిందనున్న వారిలో, అంటే మరణించిన నమ్మకస్థులైన సేవకులలో సహితం యిటువంటి ఉన్నత గౌరవం పొందే అర్హుడెవరులేరు. గనుక యోహాను నిజంగా కలవరపడడంలో ఆశ్చర్యంలేదు! బహుశ “త్వరలో సంభవింపనైయున్న” వాటిని గూర్చి ఆయన తెలుసుకోలేడేమో. మన కాలంలోకూడ, ప్రకటన మీద తన వెలుగును ప్రకాశింపజేసి, సత్యాన్ని బయట పెట్టాలని దేవుని అభిషక్త ప్రజలు ఆశతో ఎదురుచూశారు. తన ప్రజలను ‘గొప్పరక్షణ’ మార్గంలో నడిపించడానికి, ప్రవచన నెరవేర్పుగా ఆయన దీన్ని నియమిత కాలంలో క్రమేణి వృద్ధిచేస్తాడు.—కీర్తన 43:3, 5.

యోగ్యుడు

4. (ఎ) ఆ గ్రంథాన్ని, దాని ముద్రలను విప్పే యోగ్యుడెవరని కనుగొనబడింది? (బి) యోహాను తరగతి, వారి సహచరులు ఏ బహుమానం, ఆధిక్యతలో యిప్పుడు భాగం వహిస్తున్నారు?

4 అవును, ఆ గ్రంథాన్ని విప్పగల యోగ్యుడు ఉన్నాడు! యోహాను యిలా తెల్పుతున్నాడు: “ఆ పెద్దలలో ఒకడు—ఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతోచెప్పెను.” (ప్రకటన 5:5) కాబట్టి యోహాను ఆ కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఈనాడు యోహాను తరగతివారు, నమ్మకస్థులైన వారిసహచరులు ఆత్మీయ వికాసం కొరకు వేచివుంటూనే, దశాబ్దాల తరబడి అనేక శ్రమలను సహించారు. ఆ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి యీనాడు మనమెంతటి ధన్యులం, మరియు దాని సమాచారాన్ని ప్రకటించుట ద్వారా దాని నెరవేర్పులో భాగంవహించుట మనకెంతటి ఆధిక్యతోగదా!

5. (ఎ) యూదాను గూర్చి ఏ ప్రవచనం చెప్పబడింది, యూదా వంశీయులు ఎక్కడ పరిపాలించారు? (బి) షిలోహు ఎవరు?

5 అవును, ఆయన “యూదా గోత్రపు సింహము”! యూదాగోత్రపు మూలపురుషుడైన యాకోబు తన నాల్గవ కుమారుడైన యూదాను గూర్చి పలికిన యీ ప్రవచనం యోహానుకు సుపరిచితమే: “యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడుసింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు. అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.” (ఆదికాండము 49:9, 10) దేవుని ప్రజల రాజవంశం యూదానుండి ఆరంభమైంది. దావీదు మొదలుకొని ఆ పట్టణాన్ని బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసేంతవరకు యూదా వంశీయులే పరిపాలించారు. గానీ వారిలో ఎవ్వరును యూదా ప్రవచించిన షిలోహు కాదు. షిలోహు అంటే “స్వాస్థ్యకర్త [హక్కుదారుడు]” అని అర్థం. ప్రవచనార్థకంగా, ఈ నామము ఇప్పుడు దావీదు రాజ్యక్రమానికి శాశ్వత వారసుడైన యేసును సూచిస్తుంది.—యెహెజ్కేలు 21:25-27; లూకా 1:32, 33; ప్రకటన 19:16.

6. యేసు ఎలా యెష్షయి “అంకురము” మరియు దావీదుకు “చిగురు” అయ్యాడు?

6 “దావీదుకు చిగురు” అన్నమాటను యోహాను వెంటనే గుర్తిస్తున్నాడు. వాగ్దానం చేయబడిన మెస్సీయ ప్రవచనార్థకంగా “యెష్షయి మొద్దునుండి చిగురు [రాజైన దావీదు తండ్రి] . . . అంకురము,” మరియు “ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరుచిగురు” అని రెండు బిరుదులతోను పిలువబడుతున్నాడు. (యెషయా 11:1, 10) యెష్షయి కుమారుడైన దావీదు రాజ వంశీయునిగా జన్మించినందున యేసు యెష్షయి వేరుచిగురయ్యాడు. అంతేగాక, యెష్షయి అంకురముగా దావీదు రాజవంశాన్ని ఆయనే మరల చిగురించేలాచేసి, దానికి జీవమిచ్చి శాశ్వతంగా పోషిస్తున్నాడు.—2 సమూయేలు 7:16.

7. సింహాసనాసీనుడైన వానినుండి ఆ గ్రంథాన్ని తీసికొనే యోగ్యత యేసుకు దేనివల్ల కలుగుతుంది?

7 యేసే, ఓ పరిపూర్ణ మానవునిగా, సర్వోత్కృష్టమైన రీతిలో అత్యంత తీవ్రమైన హింసల్లోను యెహోవాను యథార్థంగా సేవించాడు. ఆయన సాతాను సవాళ్లకు సమాధానమిచ్చాడు. (సామెతలు 27:11) అలా, తాను బలియై మరణించిన రోజుకు ముందు రాత్రి అన్నట్లే, యేసు యిలా అనగలిగాడు: “నేను లోకమును జయించియున్నాను.” (యోహాను 16:33) ఈ కారణంచేతనే యెహోవా పునరు నుడైన యేసుకు “పరలోకమందును భూమిమీదను . . . సర్వాధికారము” యిచ్చాడు. దేవుని సేవకులందరిలో ఆయనొక్కడే ఆ గ్రంథాన్ని, దాని ప్రాముఖ్యమైన సమాచారాన్ని బహిరంగపర్చే దృష్టితో విప్పడానికి అర్హుడైయున్నాడు.—మత్తయి 28:18.

8. (ఎ) రాజ్యం విషయంలో యేసు యోగ్యతను ఏది చూపిస్తుంది? (బి) ఆ గ్రంథాన్ని విప్పగల యోగ్యున్ని యోహానుకు ఆ 24 మంది పెద్దల్లో ఒకరు చూపించడం ఎందుకు యుక్తంగా వుంది?

8 నిజానికి, యేసే ఆ గ్రంథాన్ని విప్పవలెననేది యుక్తం. ఆయన 1914 నుండి దేవుని మెస్సీయ రాజ్యానికి రాజుగా నియమితుడయ్యాడు. మరి ఆ గ్రంథం ఆ రాజ్యాన్ని, అది నెరవేర్చనైయున్న దాన్నిగూర్చి ఎంతో బయల్పరుస్తుంది. యేసు యీ భూమ్మీదనున్నపుడు ఆ రాజ్య సత్యాన్నిగూర్చి ఎంతో సాక్ష్యమిచ్చాడు. (యోహాను 18:36, 37) ఆ రాజ్యం వచ్చేలా దానికొరకు ప్రార్థించండని ఆయన తన శిష్యులకుపదేశించాడు. (మత్తయి 6:9, 10) ఆయన, క్రైస్తవ శకారంభంలో ప్రారంభమైన యీ రాజ్యసువార్త ప్రకటనను ఆరంభించాడు, ఆ ప్రకటనా పని అంత్యకాలంలో అంతమౌతుందని ప్రవచించాడు. (మత్తయి 4:23; మార్కు 13:10) అలాగే, యేసే ఆ ముద్రలను విప్పేవాడని 24 పెద్దలు యోహానుకు బయల్పరచడం యుక్తం. ఎందుకు? ఎందుకంటె, తన రాజ్యంలో క్రీస్తుతోపాటు సహవారసులుగా, యీ పెద్దలు కిరీటాలు ధరించి సింహాసనాసీనులౌతారు.—రోమీయులు 8:17; ప్రకటన 4:4.

‘వధించబడిన గొఱ్ఱెపిల్ల’

9. ‘సింహాసనమునకు మధ్యలో’ సింహానికి బదులు ఏది నిలబడడాన్ని యోహాను చూశాడు, ఆయన దాన్నెలా వర్ణిస్తున్నాడు?

9 యోహాను యీ “యూదా గోత్రపు సింహము”వైపు చూడడానికిటు తిరుగుతాడు. అయితే, ఎంత ఆశ్చర్యం! పూర్తిగా వేరైన అలంకారిక ఆకారం అగుపడుతుంది: “మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమియందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.”—ప్రకటన 5:6.

10. యోహాను చూచిన “గొఱ్ఱెపిల్ల” ఎవరు, మరి ఆ పేరెందుకు తగియున్నది?

10 సింహాసనం ప్రక్కన, నాలుగు జీవులు, 24 మంది పెద్దలు వలయంగా ఏర్పడినదానిలో, అంటే సరిగ్గా వారి మధ్యలోనే గొఱ్ఱెపిల్ల ఉంది! ఈ గొఱ్ఱెపిల్ల “యూదాగోత్రపు సింహము,” దావీదు “చిగురు” అని నిస్సంశయంగా యోహాను వెంటనే గుర్తిస్తాడు. మరి 60 సంవత్సరాల క్రితం యీ యేసును “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని బాప్తిస్మమిచ్చు యోహాను అక్కడ చూస్తున్న యూదులకు పరిచయం చేసిన సంగతి ఆయనకు తెలుసు. (యోహాను 1:29) తన భూజీవితమంతటిలోను, యేసు నిర్దోషమైన గొఱ్ఱెపిల్లవలె—లోకమాలిన్యం తనకంటకుండా నిర్మలంగా వున్నాడు—అందుచేతనే ఆయన తన నిర్దోషమైన ప్రాణాన్ని మానవజాతికి అర్పించగలిగాడు.—1 కొరింథీయులు 5:7; హెబ్రీయులు 7:26.

11. మహిమనొందిన యేసును “వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల”గా తెల్పడం ఎందుకు అగౌరవంకాదు?

11 మహిమనొందిన యేసును “వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల”యని అనడం కించపరచేదిగా, లేదా అగౌరవంగా వుందా? లేనేలేదు! యేసు మరణంవరకు నమ్మకంగా వుండడం నిజానికి సాతానుకు గొప్ప అపజయం, యెహోవాకు గొప్ప విజయం తెచ్చింది. యేసును యీవిధంగా పోల్చడం ఆయన సాతాను లోకాన్ని జయించాడని స్పష్టంగా తెల్పుతుంది, మరియు యెహోవాకు, యేసుక్రీస్తుకు మానవజాతియెడలగల ప్రగాఢమైన ప్రేమకు జ్ఞాపక చిహ్నంగా వున్నది. (యోహాను 3:16; 15:13; కొలొస్సయులు 2:15 పోల్చండి.) యేసు అలా వాగ్దానం చేయబడిన సంతానంగా సూచించబడ్డాడు, ఆ గ్రంథాన్ని విప్పే విశేష అర్హత గల్గివున్నాడు.—ఆదికాండము 3:15.

12. గొఱ్ఱెపిల్ల ఏడు కొమ్ములు దేనిని సూచిస్తున్నాయి?

12 ఈ “గొఱ్ఱెపిల్ల” యెడల మనకున్న అభినందనకు మరేంకూడ తోడౌతుంది? ఆయనకు ఏడు కొమ్ములున్నాయి. బైబిల్లో కొమ్ములు తరచూ శక్తికి లేక అధికారానికి గుర్తు, మరి ఏడు అనేది సంపూర్ణతకు సూచన. (1 సమూయేలు 2:1, 10; కీర్తన 112:9; 148:14 పోల్చండి.) గనుక, గొఱ్ఱెపిల్లకున్న ఏడు కొమ్ములు యెహోవా యేసుకిచ్చిన సంపూర్ణ శక్తిని సూచిస్తున్నాయి. ఆయన “సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమేగాక రాబోవు యుగము నందును . . . ఎంతో హెచ్చుగా” ఉన్నాడు. (ఎఫెసీయులు 1:20-23; 1 పేతురు 3:22) యెహోవా ఆయనను 1914 నుండి పరలోక రాజుగా సింహాసనాసీనుని చేసినప్పటినుండి యేసు ముఖ్యంగా అట్టి అధికారాన్ని, రాజ్యాధికారాన్ని కల్గివున్నాడు.—కీర్తన 2:6.

13. (ఎ) గొఱ్ఱెపిల్ల ఏడు కన్నులు దేనిని సూచిస్తున్నాయి? (బి) గొఱ్ఱెపిల్ల ఏం చేయడానికి ఆరంభించింది?

13 అంతేగాక, “దేవుని యేడు ఆత్మలు” అని అర్థమిచ్చే గొఱ్ఱెపిల్ల ఏడు కన్నులచేత సూచించబడిన పరిశుద్ధాత్మతో యేసు సంపూర్ణంగా నింపబడి యున్నాడు. యెహోవా తన భూలోక దాసుల కనుగ్రహించే చురుకైన శక్తికి మధ్యవర్తి యేసే. (తీతు 3:6) నిజానికి, ఈ శక్తి ద్వారానే ఆయన పరలోకంనుండి భూమ్మీద జరిగేవాటిని పరిశీలిస్తున్నాడు. తన తండ్రివలె యేసు పరిపూర్ణమైన పరిజ్ఞానం కల్గివున్నాడు. ఆయన దృష్టినేదియు తప్పించుకోలేదు. (కీర్తన 11:4; జెకర్యా 4:10 పోల్చండి.) ఈ కుమారుడు—లోకాన్ని జయించిన యథార్థపరుడు; యూదా గోత్రపు కొదమ సింహం; దావీదు వేరుచిగురు మానవజాతికి తనప్రాణాన్ని అర్పించినవాడు; పూర్ణాధికారం గలవాడు; పరిశుద్ధాత్మను నిండుగా కల్గివున్నవాడు; యెహోవానుండి పరిపూర్ణ పరిశీలనాశక్తిని పొందినవాడు—అవును, నిజంగా ఈయనే యెహోవా చేతినుండి ఆ గ్రంథాన్ని తీసికోగల ప్రత్యేక అర్హతగలవాడు. యెహోవా మహాగొప్ప సంస్థలో యీ సేవను చేపట్టడానికి ఆయన వెనుకాడునా? లేదు! బదులుగా, “ఆయనవచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలోనుండి ఆ గ్రంథమును తీసికొనెను.” (ప్రకటన 5:7) ఇష్టపూర్వక సమ్మతిని తెల్పడానికి ఎంతటి శ్రేష్ఠమైన మాదిరి!

స్తుతి గీతాలు

14. (ఎ) నాలుగు జీవులు, 24 మంది పెద్దలు, యేసు ఆ గ్రంథాన్ని తీసుకొనడానికెలా స్పందిస్తారు? (బి) యోహాను 24 మంది పెద్దలను గూర్చి పొందే సమాచారం వారి గుర్తింపు స్థానాన్ని ఎలా నిర్దారించాయి?

14 మరి యెహోవా సింహాసనం చుట్టున్నవారి స్పందనెలావుంది? “ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలును, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలును పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.” (ప్రకటన 5:8) దేవుని సింహాసనం యెదుటనున్న నాలుగు కెరూబులవంటి జీవులవలె, ఆ 24 మంది పెద్దలుకూడ యేసు అధికారాన్ని ఒప్పుకుంటూ సాగిలపడిరి. అయితే యీ పెద్దలు మాత్రమే వీణెలను, ధూపపాత్రలను కల్గివున్నారు. * వారు మాత్రమే యిప్పుడు క్రొత్తకీర్తన పాడుచున్నారు. (ప్రకటన 5:9) అలా వారు వీణెలు ధరించి, క్రొత్తకీర్తన పాడుతున్న దేవుని ఇశ్రాయేలు అనబడే 1,44,000 మందిని పోలియున్నారు. (గలతీయులు 6:16; కొలొస్సయులు 1:12; ప్రకటన 7:3-8; 14:1-4) అంతేగాక, పూర్వం ఇశ్రాయేలీయుల యాజకులు యెహోవాకు గుడారంలో ధూపం వేసినట్లే, ఆ 24 పెద్దలు పరలోకంలో యాజకధర్మం జరిగిస్తున్నట్లు చూపబడుతున్నారు—పూర్వపు యాజకధర్మం దేవుడు మోషే ధర్మశాస్త్రాన్ని యేసు మరణకొయ్యకు కొట్టి తీసివేయడంతో అంతమైంది. (కొలొస్సయులు 2:14) ఇదంతాచూచి మనమే నిర్ణయానికి వస్తాం? ఇక్కడ విజయులైన అభిషక్తులు ‘దేవునికిని క్రీస్తుకును యాజకులై, రాజులుగా వెయ్యేండ్లు ఆయనతోపాటు పరిపాలించే చివరి నియామక స్థానాల్లోవున్నట్లు మనమనుకోవాలి.’—ప్రకటన 20:6.

15. (ఎ) ఇశ్రాయేలీయులలో ఎవరు మాత్రమే గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ఆధిక్యత కల్గివుండిరి? (బి) అతిపరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ముందు ప్రధాన యాజకుడు ధూపం వేయడమెలా జీవన్మరణములతో కూడినదై యుండెను?

15 పూర్వం ఇశ్రాయేలీయులలో, యెహోవా సాదృశ్యమైన ప్రత్యక్షత నిలిచియున్న అతిపరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకులకు మాత్రమే ప్రవేశముండేది. ప్రధాన యాజకుడు ధూపద్రవ్యాన్ని తీసుకెళ్లడమంటే జీవన్మరణంతో కూడినదై వుండేది. యెహోవా ధర్మశాస్త్రమిలా చెబుతోంది: “యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, [అహరోను] తన పిడికెళ్లతో పరిమళ ధూపచూర్ణమును తీసికొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘమువలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను.” (లేవీయకాండము 16:12, 13) ప్రధానయాజకుడు ఆ ధూపం వేయకపోతే ఆయన అతిపరిశుద్ధ స్థలంలో విజయవంతంగా ప్రవేశించడం సాధ్యంకాదు.

16. (ఎ) క్రైస్తవ ఏర్పాటులో, ఎవరు నిజమైన అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు? (బి) అభిషక్త క్రైస్తవులెందుకు ‘ధూపము వేయాలి’

16 క్రైస్తవ ఏర్పాటులో, అసలు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తే కాకుండ, ఉపయాజకులైన 1,44,000 మందిలోని ప్రతి ఒక్కరు చివరకు నిజమైన పరిశుద్ధ స్థలంలో, పరలోకమందు యెహోవా సన్నిధిలోనే ప్రవేశిస్తారు. (హెబ్రీయులు 10:19-23) ఇక్కడ 24 పెద్దల విషయంలో చూపించబడినట్లు, యీ యాజకులు ‘ధూపం’ వేస్తేతప్ప, అంటే యెహోవాకు నిత్యప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తేనే తప్ప అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించుట దుర్లభము.—హెబ్రీయులు 5:7; యూదా 20, 21; కీర్తన 141:2 పోల్చండి.

ఓ క్రొత్త పాట

17. (ఎ) ఆ 24 పెద్దలు ఏ క్రొత్తపాట పాడుతారు? (బి) ‘క్రొత్తపాట’ అనేమాట సాధారణంగా బైబిల్లో ఎలా ఉపయోగించబడింది?

17 ఇప్పుడొక మృదుమధుర గానం వినబడుతోంది. దాన్ని ఆ 24 పెద్దలు, ఆయన సహయాజకులు గొఱ్ఱెపిల్లను గూర్చి పాడుతున్నారు: “నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవునికొరకు మనుష్యులనుకొని యున్నావని . . . క్రొత్తపాట పాడుదురు.” (ప్రకటన 5:9) క్రొత్తపాట అనేమాట బైబిల్లో అనేకమార్లు కనబడుతోంది, అది సాధారణంగా గొప్ప విడుదల సందర్భంగా యెహోవాను స్తుతించడానికి పాడే కీర్తనను సూచిస్తుంది. (కీర్తన 96:1; 98:1; 144:9) అలా అది క్రొత్తపాట అనబడుతుంది ఎందుకంటె, పాడే వ్యక్తి యిప్పుడు యెహోవా అదనంగా చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి ప్రకటించగలడు, ఆయన మహిమగల నామానికి పునరుత్తేజంతో కూడిన అభినందన తెలుపగలడు.

18. ఆ 24 పెద్దలు దేనికొరకు యేసును క్రొత్తపాటతో స్తుతిస్తారు?

18 అయితే యిక్కడ ఆ 24 పెద్దలు క్రొత్తపాటను యెహోవా యెదుట కాకుండా యేసు యెదుట పాడుతున్నారు. గాని సూత్రమొక్కటే. దేవుని కుమారునిగా, ఆయన వారి నిమిత్తం చేసిన వాటన్నింటికి కృతజ్ఞతగా వారు యేసును స్తుతిస్తున్నారు. తన మరణంద్వారా ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై, యెహోవాకు వారిని ఒక ప్రత్యేక స్వాస్థ్యంగా తేవడానికి ఆయనకు వీలైంది. (రోమీయులు 2:28, 29; 1 కొరింథీయులు 11:25; హెబ్రీయులు 7:18-25) ఈ నూతన ఆత్మీయ జనాంగపు సభ్యులు అనేక జనములనుండి వచ్చినవారే, గానీ యేసు వారిని ఒకే జనాంగముగా, ఒకే సంఘం క్రిందికి తెచ్చాడు.— యెషయా 26:2; 1 పేతురు 2:9, 10.

19. (ఎ) ఇశ్రాయేలీయులు వారి అపనమ్మకత్వాన్నిబట్టి ఏ దీవెన పొందలేక పోయారు? (బి) యెహోవా నూతన జనాంగం ఏ దీవెన ననుభవిస్తున్నారు?

19 మోషే కాలంలో యెహోవా ఇశ్రాయేలీయులను ఒక జనాంగముగా ఏర్పరచినప్పుడు, ఆయన వారితో ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధనకు నమ్మకంగా ఉంటే వారాయనకు రాజులైన యాజక సమూహమౌతారని వాగ్దానం చేశాడు. (నిర్గమకాండము 19:5, 6) ఇశ్రాయేలీయులు నమ్మకంగా వుండనూలేదు, ఆ వాగ్దానాన్ని ఎన్నడూ అనుభవించనూలేదు. అయితే, యేసు మధ్యవర్తిగా క్రొత్తనిబంధన ద్వారా ఏర్పడిన క్రొత్తజనాంగం, నమ్మకంగావుంది. దాని సభ్యులు రాజులుగా భూమిని పాలిస్తారు, యాజకులుగా సేవచేస్తారు, మానవుల్లో యథార్థ హృదయులు యెహోవాతో సమాధానపడేలా సహాయపడతారు. (కొలొస్సయులు 1:20) ఇది ఆ క్రొత్తపాటలో ఉన్నలాగే వుంది: “మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురు.” (ప్రకటన 5:10) మహిమగల యేసునుగూర్చి యీ క్రొత్తపాట పాడడంలో ఆ 24 పెద్దలెంత ఆనందిస్తారో గదా!

పరలోక బృందగానం

20. గొఱ్ఱెపిల్లను గూర్చిన ఏ స్తుతిగీతమిప్పుడు వినిపిస్తోంది?

20 ఈ క్రొత్తపాటకు యెహోవా సంస్థలోని పరలోక గొప్ప సైన్యసమూహంలోని యితరులు ఎలా స్పందించారు? యోహాను వారి హృదయ పూర్వక స్పందనను చూడ్డానికి ఉప్పొంగి పోయాడు: “మరియు నేనుచూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారిలెక్క కోట్లకొలదిగా ఉండెను. వారు—వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.” (ప్రకటన 5:11, 12) ఎంతటి కమనీయ స్తుతిగీతం!

21. గొఱ్ఱెపిల్లను స్తుతించడం యెహోవా సర్వాధిపత్యానికి గాని స్థానానికిగాని ఆటంక మేర్పడుతుందా? వివరించండి.

21 అంటే యిక యెహోవాకు బదులు యేసు వచ్చాడని, సమస్త సృష్టి యిక తనతండ్రికి బదులు ఆయన్నే స్తుతిస్తారని దానర్థమా? అదెన్నటికీ కాదు! ఇది అపొస్తలుడైన పౌలు వ్రాసిన దానికి అనుగుణంగా వుంది: “పరలోకమందున్న వారిలోగాని, భూమిమీద ఉన్నవారిలోగాని, భూమిక్రింద ఉన్నవారిలోగాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను [యేసును] అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీయులు 2:9-11) సమస్త సృష్టియెదుట ఉన్న వివాదాంశాన్ని పరిష్కరించడంలో—యెహోవా సర్వాధిపత్యపు హక్కును రుజువు చేయడంలో ఆయన నిర్వహించిన పాత్రకు యేసును యిక్కడ స్తుతిస్తున్నారు. నిశ్చయంగా, ఇది ఆయన తండ్రికెంతటి మహిమను తెచ్చిందోగదా!

ముక్తకంఠముతో పాడినగీతం

22. భూలోకంనుండి వచ్చే స్వరాలు ఏ గీతంతో కలిశాయి?

22 యోహాను వర్ణించిన దృశ్యంలో, పరలోక సైన్యం యేసు నమ్మకత్వాన్ని, ఆయన పరలోక అధికారాన్ని, అంగీకరిస్తూ సుమధుర జయధ్వని చేస్తున్నారు. ఇందులో వారితోపాటు భూజనుల స్వరాలు కలిశాయి, ఎందుకంటె వీరుకూడ తండ్రిని కుమారుని స్తుతించడంలో పాల్గొంటున్నారు. మానవ కుమారుని కార్యసాధనలు తన తలిదండ్రులకు ఘనతను తేగల్గినట్లే, సృష్టియంతటిలోనూ యేసు యథార్థ ప్రవర్తన “తనతండ్రియైన దేవుని మహిమార్థమై” ప్రతిధ్వనిస్తోంది. అందుకే యోహాను యింకా యిలా తెల్పుతున్నాడు: “అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును—సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.”—ప్రకటన 5:13.

23, 24. (ఎ) పరలోకంలోను భూమ్మీదను ఎప్పుడు యీ గీతం ఆరంభమౌతుందన్న విషయాన్ని ఏది చూపిస్తుంది? (బి) సంవత్సరాలు గడిచేకొలది యీ గీతం ఎలా మరీ బిగ్గరగా పాడబడుతుంది?

23 ఈ ఘనమైన గీతమెప్పుడు ఆలపించుట కారంభమైంది? అది ప్రభువు దినము తొలిభాగంలో ఆరంభమైంది. సాతాను అతని దూతలు పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత “పరలోకమందు ఉన్న ప్రతి సృష్టము” యీ స్తుతిగీతాలాపనలో స్వరం కలుపగలదు. మరియు నివేదికలు చూపిస్తున్నట్లు, 1919 నుండి భూమ్మీద వృద్ధిచెందుతున్న సమూహము, అంటే కొన్నివేలనుండి 1990 దశాబ్దపు తొలిభాగానికే నలభై లక్షలకంటె ఎక్కువ సంఖ్యగా పెరిగి, వారుకూడ యెహోవాను స్తుతించడంలో తమ స్వరాలను కలుపుతున్నారు. * సాతాను భూలోకవిధానం నాశనమైన తర్వాత ‘భూమిమీదనున్న వారిలోను’ యెహోవాను గూర్చి, ఆయన కుమారుని గూర్చి స్తుతిగీతాలు పాడుతారు. యెహోవా నియమితకాలంలో, మరణించిన అసంఖ్యాకులు పునరుత్థానులౌతారు, అప్పుడు ‘భూమిక్రిందనున్న వారిలోను’ అంటే దేవుని జ్ఞాపకంలోనున్న వారు ఆ గీతాలాపన చేయడానికి వారి స్వరాలను కలిపే అవకాశం పొందుతారు.

24 ఇప్పటికే, “భూదిగంతములనుండి . . . సముద్రము . . . ద్వీపముల” నుండి లక్షలాదిమంది, యెహోవా భూసంస్థతో కలిసి క్రొత్తపాట పాడుతున్నారు. (యెషయా 42:10; కీర్తన 150:1-6) మానవజాతి పరిపూర్ణస్థితికి చేరినప్పుడు అంటే వెయ్యేండ్ల అంతాన యీ ఆనంద స్తుతిగీతాలు వాటి తారాస్థాయికి చేరుకుంటాయి. ఆదికాండము 3:15 పూర్ణనెరవేర్పు ప్రకారం, ఆ పాత సర్పం, ప్రధానమోసగాడైన, సాతాను ఆ తర్వాత నాశనం చేయబడతాడు, మరి విజయోత్సవ ముగింపుగా, ఆత్మీయ, మానవ ప్రాణుల్లోని సమస్తసృష్టి ఏకమై యిలా పాడుతారు: “సింహాసనాసీనుడైయున్న వానికిని, గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక.” విశ్వమంతటిలో ఎక్కడా అసమ్మతి స్వరం వినబడదు.

25. (ఎ) యోహాను తెల్పే యీ విశ్వవ్యాప్త గీతాన్నిగూర్చిన వృత్తాంతాన్ని చదవడం మనమేమి చేయడానికి మనల్ని నడిపిస్తుంది? (బి) దర్శనం ముగింపుకొస్తుండగా, ఆ నాలుగుజీవులు, 24 మంది పెద్దలు మనకెటువంటి శ్రేష్ఠమైన మాదిరి చూపిస్తున్నారు?

25 అదెంతటి ఆనందకర సమయమో! నిశ్చయంగా, యోహాను యిక్కడ వివరించింది మన హృదయాలను ఉప్పొంగ జేస్తుంది, యెహోవా దేవునికి యేసుక్రీస్తుకు హృదయపూర్వక స్తుతులు చెల్లించడంలో మనం పరలోక సైన్యంతో కలవడానికి పురికొల్పుతుంది. సత్‌క్రియలలో సహనంగల్గి ఉండడానికి మునుపటికంటె మరెక్కువ మెలకువగా ఉండడానికి నిశ్చయించుకోవద్దా? మనమలాగు చేస్తే, యెహోవా సహాయంవల్ల, సంతోషకరమైన ముగింపు సమయంలో వ్యక్తిగతంగా మనమక్కడ ఉంటామని నిరీక్షించవచ్చు, ఆ విశ్వాంతరాళాల్లోని యుగళ స్తుతిగీతాలాపనలో మనగొంతును కలుపుతాము, నిశ్చయంగా, కెరూబులనే నాలుగు జీవులు, పునరుత్థానులైన అభిషక్త క్రైస్తవులు పూర్ణాంగీకారంతో ఉన్నారు, ఎందుకంటె, ఆ దర్శనం యీ మాటలతో ముగుస్తుంది: “ఆ నాలుగు జీవులు—ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.”—ప్రకటన 5:14.

26. మనం దేనియందు విశ్వాసముంచాలి, గొఱ్ఱెపిల్ల ఏం చేయడానికి సిద్ధపడుతోంది?

26 ప్రియ పాఠకులారా, ‘యోగ్యుడైన’—గొఱ్ఱెపిల్ల బలివిలువయందు విశ్వాసముంచి, “సింహాసనాసీనుడైయున్న” యెహోవాను సేవించి ఆరాధించే వినమ్రతగల మీ ప్రయత్నాల్లో దీవించ బడుదురుగాక. “తగిన కాలమున [ఆత్మీయ] ఆహారమును” తగినరీతిన అందిస్తుండగా యోహాను తరగతి మీ కీనాడు సహాయం చేయనివ్వండి. (లూకా 12:42) అయితే చూడండి! గొఱ్ఱెపిల్ల ఆ ఏడు ముద్రలను విప్పడానికి సిద్ధంగా వుంది. ఆనందోత్సాహాన్ని కల్గించే విధంగా వెల్లడికానైయున్న ఏ విషయాలు యిప్పుడు మనకొరకు దాచబడి ఉన్నాయి?

[అధస్సూచీలు]

^ పేరా 14 వ్యాకరణరీత్యా, “వీణెలును, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును పట్టుకొని యున్నవారు” అనేమాట పెద్దలకును, నాలుగు జీవులకును వర్తించగలదు. అయితే అక్కడి సందర్భం మాత్రం అది 24 మంది పెద్దలకు మాత్రమే అన్నట్లు స్పష్టీకరిస్తుంది.

^ పేరా 23 పేజి 64 లోని గణాంకపట్టికను చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

86వ పేజీలోని చిత్రం]