కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇద్దరు సాక్షులను బ్రతికించుట

ఇద్దరు సాక్షులను బ్రతికించుట

అధ్యాయం 25

ఇద్దరు సాక్షులను బ్రతికించుట

1. బలిష్ఠుడైన దూత యోహానును ఏమి చేయమంటున్నాడు?

రెండో శ్రమ సమాప్తమైన తర్వాత, బలిష్ఠుడైన దూత యోహానును పిలిచి, దేవాలయానికి సంబంధించిన మరో ప్రవచనార్థక ప్రకటనా పనిని చేపట్టాలని చెబుతాడు. (ప్రకటన 9:12; 10:1) ఇదిగో యోహానిలా తెల్పుతున్నాడు: “మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి—నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్క పెట్టుము.”—ప్రకటన 11:1.

దేవాలయము

2. (ఎ) ఏ దేవాలయం మాత్రమే మనకాలంవరకు నిలువగలదు? (బి) ఆ దేవాలయపు ప్రధాన యాజకుడెవరు, దాని అతిపరిశుద్ధ స్థలమేమిటి?

2 ఇక్కడ చెప్పబడిన దేవాలయం యెరూషలేములోని అక్షరార్థమైన దేవాలయం కానేరదు ఎందుకంటే, అందులోని చివరి దేవాలయం సా.శ. 70 లో రోమీయులచేత నాశనమైంది. అయినా, అపొస్తలుడైన పౌలు ఆ నాశనానికంటె ముందుకూడ మన కాలంవరకు నిలువగల మరో దేవాలయాన్ని గూర్చి తెల్పాడు. ఇది గుడారములు, ఆ పిదప యెరూషలేములో నిర్మించబడిన దేవాలయముల ప్రవచనార్థక మాదిరిని నెరవేర్చిన గొప్ప ఆత్మీయ దేవాలయం. అది “మనుష్యుడుగాక ప్రభువే (యెహోవా, NW.) స్థాపించిన నిజమైనగుడారము,” మరియు యిప్పటికే “పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెనని” పౌలు వివరిస్తున్న యేసే దానికి ప్రధానయాజకుడు. దాని అతి పరిశుద్ధస్థలం పరలోకమందు యెహోవా సముఖమే.—హెబ్రీయులు 8:1, 2; 9:11, 24.

3. గుడారములోవున్న (ఎ) అతిపరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలమునుండి వేరుచేసే తెర, (బి) జంతుబలులు, (సి) బలిపీఠము దేన్ని సూచించాయి?

3 గుడారములో అతిపరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలంనుండి వేరుచేసే తెర యేసు శరీరాన్ని సూచిస్తుందని అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. యేసు తన జీవితాన్ని బలిగా అర్పించినప్పుడు, యీ తెర రెండుగా చీలింది, అంటే పరలోకములో యెహోవా సముఖమునకు ప్రవేశించడానికి యేసు శరీరం యిక అడ్డంకాదని చూపిస్తూ, యేసు బలియర్పణాధారంగా, నమ్మకంగా ఉంటూ చనిపోయిన అభిషక్త ఉపయాజకులు కూడ తగిన కాలంలో పరలోకమందు ప్రవేశిస్తారు. (మత్తయి 27:50, 51; హెబ్రీయులు 9:3 10:19, 20) గుడారంలో ఎడతెగక అర్పించే జంతుబలులు యేసు అర్పించిన తన పరిపూర్ణ మానవజీవితాన్ని సూచించిందని పౌలు తెల్పుతున్నాడు. దేవాలయ ఆవరణలోనున్న బలిపీఠం యెహోవా ఏర్పాటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది, అది అభిషక్తులలో—“అనేకులు” ఆ తర్వాత ‘తమ రక్షణార్థమై’ ఎదురుచూస్తున్న గొప్పసమూహము నిమిత్తము, ఆయన చిత్తప్రకారము యేసు బలియర్పణను అంగీకరించిన వారి కొరకున్న ఏర్పాటే.—హెబ్రీయులు 9:28; 10:9, 10; యోహాను 10:16.

4. (ఎ) పరిశుద్ధ స్థలం (బి) లోపలి ఆవరణము దేన్ని సూచించాయి?

4 ఈ దైవప్రేరేపిత సమాచారంనుండి, మనం ఆ గుడారంలో ఉండిన అతిపరిశుద్ధ స్థలమంటే, మొదట క్రీస్తు, ఆ పిదప “తెరను”దాటకముందు యింకా భూమ్మీదనున్న 1,44,000 మంది రాజులైన యాజక సమూహపు అభిషక్త సభ్యులు అనుభవించే ఒక పరిశుద్ధ పరిస్థితిని సూచిస్తుందని చెప్పవచ్చును. (హెబ్రీయులు 6:19, 20; 1 పేతురు 2:9) సా.శ. 29 లో యేసు బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు యేసును తన కుమారునిగా అంగీకరించినట్లే, వారిని దేవుని ఆత్మీయకుమారులుగా స్వీకరించాడని అది చక్కగా సూచిస్తుంది. (లూకా 3:22; రోమీయులు 8:15) మరైతే, ఆ గుడారంలో యాజకులుకాని ఇశ్రాయేలీయులకు మాత్రమే కనబడేది, బలులు అర్పించే లోపలి ఆవరణ సంగతేమిటి? ఇది మానవజాతికొరకు తనజీవితాన్ని అర్పించడానికి అర్హతనిచ్చిన మానవుడైన యేసు పరిపూర్ణ స్థానాన్ని సూచిస్తుంది. మరియు యేసు బలివలన తన అభిషక్త అనుచరులు భూమ్మీదనున్నప్పుడు పరిశుద్ధులుగా అనుభవించే వారి నీతియుక్తమైన స్థానాన్నికూడ అది సూచిస్తుంది. *రోమీయులు 1:7; 5:1.

దేవాలయాన్ని కొలుచుట

5. హెబ్రీ లేఖన ప్రవచనాలలో, (ఎ) యెరూషలేమును కొలుచుటలో, (బి) యెహెజ్కేలు దర్శనరూపక దేవాలయాన్ని కొలుచుటలోగల భావమేమిటి?

5 “దేవుని ఆలయమును బలిపీఠమును కొలచి, ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము” అని యోహానుకు చెప్పబడింది. దీని భావమేమిటి? హెబ్రీలేఖన ప్రవచనాలలో, అలా కొలవడమనేది యెహోవా పరిపూర్ణ నియమాలపై ఆధారంచేసికొని, కరుణతోకూడిన న్యాయం చేయబడుననే అభయాన్నిచ్చింది. దుష్టుడైన మనష్షే రాజు కాలంలో, యెరూషలేమును ప్రవచనార్థకంగా కొలవడమనేది, ఆ పట్టణం తిరుగులేని నాశనతీర్పును పొందెనని రుజువుచేసింది. (2 రాజులు 21:13; విలాపవాక్యములు 2:8) అయితే, ఆ తర్వాత యెరూషలేము కొలవబడడం యిర్మీయా చూచినప్పుడు అది మరల కట్టబడుతుందని నిశ్చయపర్చింది. (యిర్మీయా 31:39; జెకర్యా 2:2-8 కూడ చూడండి.) అలాగే, యెహెజ్కేలు దర్శనంలో దేవాలయాన్ని సవివరంగా లెక్కలువేసి కొలవడాన్ని చూడడమంటే, బబులోను చెరలోనున్న యూదులకు వారి స్వదేశంలో సత్యారాధన పునరుద్ధరించ బడుతుందనే అభయాన్నిచ్చింది. వారి దోషాలనుబట్టి, యిప్పటినుండి ఇశ్రాయేలువారు దేవుని పరిశుద్ధ నియమాలకు సరిపడేలా ఉండాలనికూడ అది జ్ఞాపకంచేసింది.—యెహెజ్కేలు 40:3, 4; 43:10.

6. యోహానుకు దేవాలయాన్ని అందులో ఆరాధించే యాజకులను కొలువమని చెప్పడం దేనికి సూచన? వివరించండి.

6 గనుక, దేవాలయమును అందులో పూజించు యాజకులను కొలువవలెనని యోహాను ఆజ్ఞాపించ బడ్డాడంటే, ఆ దేవాలయము, దానికి సంబంధించిన వారివిషయంలో యెహోవా సంకల్పాల నెరవేర్పునేదియు ఆపజాలదని, మరి ఆ సంకల్పాలు వాటి ముగింపు కొచ్చాయనే దానికది సూచనయై యున్నది. ఇప్పుడు సమస్తం యెహోవా యొక్క బలిష్ఠుడైన దూత పాదములక్రింద ఉంచబడింది గనుక, “యెహోవా మందిర పర్వతము,” “కొండలకంటె ఎత్తుగాఎత్తబడు” సమయమిదే. (యెషయా 2:2-4) అనేక శతాబ్దాల క్రైస్తవమత సామ్రాజ్యపు భ్రష్టత్వము తర్వాత, యెహోవా పవిత్రారాధన నిశ్చయంగా పైకెత్తబడాలి. మృతులైన యేసు నమ్మకమైన సహోదరులు పునరుత్థానులై “అతి పరిశుద్ధ స్థలములో” ప్రవేశించే సమయముకూడ అదే. (దానియేలు 9:24; 1 థెస్సలొనీకయులు 4:14-16; ప్రకటన 6:11; 14:4) “మన దేవుని దాసులలో” భూమ్మీద ముద్రింపబడిన చివరివ్యక్తులు, దేవుని ఆత్మీయ కుమారులుగా దేవాలయంలో వారి శాశ్వతస్థానం కొరకు అర్హతపొందుటకై దైవనియమాలకు వారు సరితూగాలి. యోహాను తరగతి యీనాడు ఆ పరిశుద్ధ నియమాలను క్షుణ్ణంగా ఎరిగియుంది, మరి వాటికి సరితూగాలని నిశ్చయించుకుంది.—ప్రకటన 7:1-3; మత్తయి 13:41, 42; ఎఫెసీయులు 1:13, 14; రోమీయులు 11:20 పోల్చండి.

ఆవరణను త్రొక్కుట

7. (ఎ) యోహానుకు ఆవరణను కొలువవద్దని ఎందుకు చెప్పబడింది? (బి) ఎప్పుడు పరిశుద్ధ పట్టణం 42 నెలలు కాలిక్రింద త్రొక్కబడింది? (సి) క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు 42 నెలలు ఎలా యెహోవా నీతికట్టడలకు హత్తుకొని ఉండలేకపోయారు?

7 యోహాను ఆవరణను కొలువకుండ ఎందుకు ఆపివేయబడ్డాడు? ఆయన మనకీమాటల్లో చెబుతున్నాడు: “ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువదిరెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.” (ప్రకటన 11:2) లోపలి ఆవరణము అంటే భూమ్మీద ఆత్మీయ క్రైస్తవులకున్న నీతియుక్తమైన స్థానాన్ని సూచిస్తుందని మనం నేర్చుకున్నాము. మనం గమనించబోవు రీతిగా, యిక్కడ చెప్పబడినవి 1914 అక్టోబరు నుండి 1918 వరకు క్త్రెస్తవులమని చెప్పుకొంటున్న వారందరికి కఠినపరీక్ష పెట్టబడిన ఆ 42 నిజమైన నెలలే. ఆ యుద్ధసంవత్సరాల్లో వారు యెహోవా నీతినియమాలకు హత్తుకొని యుండగలిగారా? అనేకులు ఉండలేదు. మొత్తానికే క్రైస్తవమత సామ్రాజ్యం దైవచట్టానికి చూపే విధేయతకన్నా జాతీయతనే ప్రథమస్ధానంలో పెట్టింది. అధికంగా క్రైస్తవమత సామ్రాజ్యంలోనే జరిగిన యుద్ధంలో యిరువైపులా మతగురువులు, యువకులు యుద్ధంలో చేరాలని ప్రచారం చేశారు. లక్షలాదిమంది హతులయ్యారు. దేవుని యింటివద్దే 1918 లో తీర్పు ప్రారంభమైనప్పుడు, అమెరికా సంయుక్త రాష్ట్రములు అప్పటికే ఆ రక్తపాతంలో ప్రవేశించాయి, మరి దేవుని ప్రతీకారంకొరకు యిప్పటికీ రోధిస్తున్న ఆ రక్తాపరాధంలో క్రైస్తవమత సామ్రాజ్యమంతటిలోని మతగురువులంతా అపరాధులయ్యారు. (1 పేతురు 4:17) వారు బహిష్కరింప బడటమనేది శాశ్వతమైంది, తిరుగులేనిది.—యెషయా 59:1-3, 7, 8; యిర్మీయా 19:3, 4.

8. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో అనేకమంది బైబిలు విద్యార్థులు దేనిని గ్రహించారు, అయితే దేనిని వారు పూర్తిగా గుణగ్రహించ లేకపోయారు?

8 మరి బైబిలు విద్యార్థుల చిన్నగుంపు సంగతేమిటి? వారు దైవ నియమాలకు హత్తుకొనియుండే దానినిబట్టి 1914 లో వెంటనే వారు కొలువబడ్డారా? లేదు. క్రైస్తవులమని చెప్పుకున్న క్రైస్తవమత సామ్రాజ్యంలోని వారివలెనే వీరును పరీక్షింపబడాలి. వారు కఠినంగా హింసింపబడి శ్రమపెట్టబడడానికి ‘బయటికి గెంటివేయబడి, అన్యులకియ్యబడ్డారు.’ తాము బయటికి వెళ్లి తమ సోదరులను చంపకూడదని వారిలో అనేకులు గ్రహించారు, గానీ క్రైస్తవ తటస్థ వైఖరిని పూర్తిగా గుణగ్రహించ లేకపోయారు. (మీకా 4:3; యోహాను 17:14, 16; 1 యోహాను 3:15) ప్రభుత్వాల వత్తిడికి లొంగి కొందరు రాజీపడ్డారు.

9. ఏ పరిశుద్ధ పట్టణం అన్యులచే త్రొక్కబడింది, మరి భూమ్మీద యీ పట్టణం దేన్ని సూచిస్తుంది?

9 మరైతే, ఆ పరిశుద్ధ పట్టణమెలా ఆ అన్యులచేత త్రొక్కబడింది? నిశ్చయంగా యిది, ప్రకటన వ్రాయబడడానికి 25 సంవత్సరాలకంటె యింకాముందే నాశనమైన యెరూషలేమునుగూర్చి చెప్పడంలేదు. అయితే, ఆ పరిశుద్ధ పట్టణం అంటే ప్రకటనలో అటుతర్వాత వివరించబడిన నూతన యెరూషలేము, అదిప్పుడు దేవాలయం లోపలి ఆవరణలో భూమ్మీద మిగిలియున్న అభిషక్త క్రైస్తవులచేత సూచించబడుతుంది. సకాలంలో వీరుకూడ పరిశుద్ధ పట్టణంలో భాగమౌతారు. వారిని త్రొక్కడమంటే, ఆ పట్టణాన్ని త్రొక్కడంతో సమానం.—ప్రకటన 21:2, 9-21.

ఇద్దరు సాక్షులు

10. యెహోవా నమ్మకమైన సాక్షులు త్రొక్కబడేటప్పుడేమి చేయాలి?

10 త్రొక్కబడినప్పటికిని, యీ యథార్థపరులు యెహోవాకు నమ్మకమైన సాక్షులుగా ఉండడం మానుకోలేదు. కావున ప్రవచనమిలా కొనసాగుతుంది: “నేను నా యిద్దరు సాక్షులకు అధికారముచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవచెట్లును దీపస్తంభములునై యున్నారు.”—ప్రకటన 11:3, 4.

11. “గోనెపట్ట ధరించుకొని” ప్రవచించడమంటే నమ్మకమైన అభిషక్త క్రైస్తవులకు దానిఅర్థమేమై యుండెను?

11 ఈ నమ్మకమైన అభిషక్త క్రైస్తవులకు సహనమనే లక్షణం అవసరమైంది, ఎందుకంటే వారు “గోనెపట్ట ధరించుకొని” ప్రకటించవలసియుండిరి. దీని అర్థమేమిటి? బైబిలు కాలాల్లో గోనెపట్ట దుఃఖాన్ని సూచించింది. దాన్ని ధరించుకోవడమంటే అతడు విచారంతో లేక బాధతో ఖిన్నుడై ఉన్నాడని అర్థం. (ఆదికాండము 37:34; యోబు 16:15, 16; యెహెజ్కేలు 27:31) గోనెపట్టయనేది, దేవుని ప్రవక్తలు ప్రకటించే నాశనసంబంధమైన లేక విచారకరమగు లేక విలపించదగు వర్తమానాలకు సంబంధం కల్గివుంది. (యెషయా 3:8, 24-26; యిర్మీయా 48:37; 49:3) గోనెపట్ట ధరించు కోవడమంటే, దైవహెచ్చరిక దృష్ట్యా అది పశ్చాత్తాపమును లేక వినయమును సూచిస్తుంది. (యోనా 3:5) ఆ ఇద్దరుసాక్షులు ధరించుకున్న గోనెపట్ట, యెహోవా తీర్పులను ప్రకటించడంలో వారి సహనంతో కూడిన వినయమును సూచిస్తున్నట్లు కనబడుతోంది. వారు జనములకు కూడ దుఃఖం కల్గించే ప్రతీకార దినాన్ని ప్రకటించే సాక్షులైయుండిరి.—ద్వితీయోపదేశకాండము 32:41-43.

12. పరిశుద్ధ పట్టణం కాలిక్రింద త్రొక్కబడిన కాలం ఎందుకు అక్షరార్థమైందిగా కనబడుతుంది?

12 యోహాను తరగతి యీ సమాచారాన్ని నిర్దిష్టంగా తెల్పబడిన సమయంలోనే ప్రకటించాలి: అదే 1,260 దినములు, లేక 42 నెలలు, అంటే కచ్చితంగా పరిశుద్ధ పట్టణం కాలితో త్రొక్కబడేంత సమయమే. ఈ సమయం అక్షరార్థమైన సమయంగా కనబడుతుంది, ఎందుకంటే అది రెండు విధాలుగా తెలుపబడింది, మొదటిదేమో నెలలు, రెండవదేమో దినములు. అంతేగాక, ప్రభువుదినము ప్రారంభంలో, దేవుని ప్రజలనుభవించిన అష్టకష్టాలకు—1914 ద్వితీయార్థంలో మొదలైన మొదటి ప్రపంచయుద్ధం నుండి 1918 ప్రథమార్థంవరకు కొనసాగిన కాలం—యిక్కడ ప్రవచింపబడిన సంఘటనలకు సరిగ్గా మూడున్నర సంవత్సరాలు సరిపోయాయి. (ప్రకటన 1:10) వారు క్రైస్తవమత సామ్రాజ్యానికి, లోకానికి యెహోవా తీర్పును గురించిన “గోనెపట్ట”వంటి సమాచారాన్ని ప్రకటించారు.

13. (ఎ) ఆ ఇద్దరుసాక్షులు అభిషక్త క్రైస్తవులను సూచించారనే వాస్తవం దేన్ని తెల్పుతుంది? (బి) యోహాను ఆ యిద్దరు సాక్షులను “రెండు ఒలీవచెట్లు, రెండు దీపస్తంభములు” అని పిలవడంద్వారా జెకర్యాలోని ఏ ప్రవచనం జ్ఞాపకానికి వస్తుంది?

13 వారు ఇరువురు సాక్షులుగా చూపించ బడ్డారంటే, వారి సమాచారం కచ్చితమైందని, నిశ్చలమైందని మనకు స్థిరపరస్తుంది. (ద్వితీయోపదేశకాండము 17:6; యోహాను 8:17, 18 పోల్చండి.) యోహాను వారిని ‘రెండు ఒలీవచెట్లని, రెండు దీపస్తంభములని’ పిలుస్తూ, వారు “భూలోకమునకు ప్రభువైన వానియెదుట నిలుచుచున్నారని” అంటున్నాడు. ఇది జెకర్యా ప్రవచనానికి ప్రత్యక్షనిదర్శనం, ఆయన ఏడు గొట్టములున్న దీపస్తంభమును, రెండు ఒలీవచెట్లను చూశాడు. ఆ రెండు ఒలీవచెట్లు ‘ఇద్దరు అభిషక్తులను’ అంటే, “సర్వలోకనాధుడగు యెహోవా యెదుట నిలుచున్న” గవర్నరు జెరుబ్బాబెలును, ప్రధానయాజకుడైన యెహోషువను సూచించాయని చెప్పబడింది.—జెకర్యా 4:1-3, 14.

14. (ఎ) జెకర్యాకు కలిగిన ఒలీవచెట్లు, దీపస్తంభములను గూర్చిన దర్శనంద్వారా ఏమి సూచించబడింది? (బి) అభిషక్త క్రైస్తవులు మొదటి ప్రపంచయుద్ధ కాలంలో ఏమనుభవిస్తారు?

14 జెకర్యా పునర్నిర్మాణ సమయంలో జీవించాడు, మరి అతడు చూసిన రెండు ఒలీవచెట్ల దర్శనం, ప్రజలు ఆ కార్యమును చేయడానికి వారిని బలపరచుటకై జెరుబ్బాబెలుకు, యెహోషువకు యెహోవా ఆత్మ అనుగ్రహం ఉంటుందని అర్థం. దీపస్తంభముల దర్శనము జెకర్యాకు జ్ఞాపకంచేసేదేమంటే, ‘అల్పకార్యములను తృణీకరించ’ కూడదని, ఎందుకంటే వాటితో యెహోవా సంకల్పాలు నెరవేరుతాయి—“శక్తిచేతనైనను, బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చెను.” (జెకర్యా 4:6, 10; 8:9) మొదటి ప్రపంచయుద్ధకాలంలో సత్యంయొక్క వెలుగును మానవజాతికి పట్టుదలతో ప్రకటించిన ఓ చిన్న క్రైస్తవగుంపు కూడ అలాగే పునర్నిర్మాణ పనికొరకు ఉపయోగించబడ్డారు. వారును ప్రోత్సాహానికి ఆధారంగా ఉన్నారు, కొద్దిమందైననూ, వారు యెహోవా శక్తిపై ఆధారపడ్డారు, అల్పకార్యములను తృణీకరించలేదు.

15. (ఎ) అభిషక్త క్రైస్తవులు ఇద్దరుసాక్షులుగా వర్ణించబడ్డారనే వాస్తవం దేనిని కూడ మనకు జ్ఞాపకం చేస్తుంది? వివరించండి. (బి) ఆ ఇద్దరుసాక్షులు ఎటువంటి సూచకక్రియలు చేయడానికి అధికారం పొందారు?

15 వారు ఇద్దరుసాక్షులుగా వర్ణించబడ్డారనే వాస్తవం మనకు రూపాంతరాన్ని కూడ జ్ఞాపకం చేస్తుంది. ఆ దర్శనంలో యేసు ముగ్గురు అపొస్తలులు మోషే, ఏలీయాలతోపాటు ఆయనను రాజ్యమహిమలో చూశారు. ఇది, ఆ యిద్దరు ప్రవక్తలద్వారా సూచించబడిన పనిని నెరవేర్చడానికి 1914 లో తన మహిమగల సింహాసనంమీద యేసు ఆసీనుడైయుండడాన్ని ముందుగానే సూచించింది. (మత్తయి 17:1-3; 25:31) యుక్తంగానే, ఆ యిద్దరుసాక్షులు మోషే, ఏలీయాలు చేసిన సూచకక్రియలనే చేస్తున్నట్లు కనబడుతున్నారు: “ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్నిబయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు.”—ప్రకటన 11:5, 6ఎ.

16. (ఎ) అగ్నినిగూర్చిన దర్శనం, ఇశ్రాయేలీయులలో మోషే అధికారాన్ని సవాలుచేసిన సమయాన్నెలా మనకు జ్ఞాపకం చేస్తుంది? (బి) క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఎలా బైబిలు విద్యార్థులను తిరస్కరించి, వేధించారు, మరి వీరెలా ఎదురుపోరాడారు?

16 ఇది ఇశ్రాయేలీయులలో మోషే అధికారాన్ని సవాలుచేసిన సమయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రవక్త తీక్షణమైన తీర్పుమాటలు పలికాడు, మరి యెహోవా తిరుగుబాటు చేసిన వారిని నాశనం చేశాడు, వారిలో 250 మందిని ఆకాశమునుండి అక్షరార్థంగా అగ్నికురిపించి ఆహుతిచేశాడు. (సంఖ్యాకాండము 16:1-7, 28-35) అలాగే, క్రైస్తవమత సామ్రాజ్యపు నాయకులు బైబిలు విద్యార్థులను వారెన్నడూ వేదాంత పాఠశాలలో పట్టాపుచ్చుకో లేదంటూ వారిని తిరస్కరించారు. అయితే దేవుని సాక్షులకు పరిచారకులుగా అంతకంటే అధికమైన అర్హతలున్నాయి: ఆ దీనులు వారికివ్వబడిన లేఖనానుసారమైన వర్తమానాన్ని లక్ష్యపెట్టారు. (2 కొరింథీయులు 3:2, 3) బైబిలు విద్యార్థులు 1917 లో ప్రకటన మరియు యెహెజ్కేలు పుస్తకాలమీద శక్తివంతమైన వ్యాఖ్యానము చేసిన ది ఫినిష్డ్‌ మిస్టరీ అనే పుస్తకాన్ని ప్రచురించారు. దీనితర్వాత, “ది ఫాల్‌ ఆఫ్‌ బాబిలోన్‌—వై క్రిసన్‌డమ్‌ మస్ట్‌ నౌ సఫర్‌—ది ఫైనల్‌ ఔట్‌కమ్‌” అనే ముఖ్యాంశంగా ఒక నాలుగు పేజీలున్న కరపత్రాన్ని అంటే ది బైబిల్‌ స్టూడెంట్స్‌ మన్‌త్లీ 1,00,00,000 కాపీలను పంచిపెట్టారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మతగురువులు ఆ పుస్తకాన్ని నిషేధించడానికి యుద్ధోన్మాదాన్ని ఒక సాకుగా ఉపయోగించారు. ఇతర దేశాల్లో ఆ పుస్తకం సెన్సారుకు గురైంది. అయిననూ, దేవుని సేవకులు కింగ్‌డం న్యూస్‌ అనే నాలుగుపేజీల కరపత్రంయొక్క బలమైన సంచికలద్వారా తిరిగి పోరాడుతునే ఉండిరి. ప్రభువు దినము గడిచేకొలది యితర ప్రచురణలు క్రైస్తవమత సామ్రాజ్యపు కుళ్లిన ఆత్మీయస్థితిని బట్టబయలుచేశాయి.—యిర్మీయా 5:14 పోల్చండి.

17. (ఎ) ఏలీయా కాలంలో ఏ సంఘటనలలో కరవు, అగ్ని యిమిడివున్నాయి? (బి) ఆ ఇద్దరుసాక్షుల నోటనుండి అగ్ని ఎలా బయలు వెడలింది, మరి ఎటువంటి కరవు యిమిడివుంది?

17 ఏలీయా సంగతేమిటి? ఇశ్రాయేలీయుల రాజుల కాలంలో యీ ప్రవక్త బయలును ఆరాధించే ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపాగ్నిని తెలిపే క్షామమునుగూర్చి ప్రకటించాడు. అలా అది మూడున్నర సంవత్సరాలు ప్రకటించబడింది. (1 రాజులు 17:1; 18:41-45; లూకా 4:25; యాకోబు 5:17) తర్వాత, భ్రష్టుడైన రాజగు అహజ్యా ఏలీయాను బలవంతంగా తన యెదుటికి రప్పించు కోవడానికి సైనికులను పంపినప్పుడు ప్రవక్త సైనికులను దహించి వేయడానికి ఆకాశమునుండి అగ్నిని కురిపించాడు. ఒక సైనికాధికారి ప్రవక్తగా ఆయనకు తగినగౌరవం చూపినప్పుడు మాత్రమే ఏలీయా రాజుదగ్గరికి వస్తానని ఒప్పుకున్నాడు. (2 రాజులు 1:5-16) అలాగే, 1914 నుండి 1918 వరకు అభిషక్త శేషము క్రైస్తవమత సామ్రాజ్యంలోవున్న ఆత్మీయ క్షామమునుగూర్చి ధైర్యంగా బయల్పరచారు, మరియు “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినమున” జరుగు తీక్షణమైన తీర్పును గూర్చి హెచ్చరించారు.—మలాకీ 4:1, 5; ఆమోసు 8:11.

18. (ఎ) ఆ ఇద్దరుసాక్షులకు ఏ అధికారం యివ్వబడింది, ఇదెలా మోషేకు యివ్వబడినటు వంటిదిగా వుంది? (బి) ఆ ఇద్దరుసాక్షులు ఎలా క్రైస్తవమత సామ్రాజ్యాన్ని బట్టబయలు చేశారు?

18 యోహాను ఆ యిద్దరు సాక్షులనుగూర్చి యింకా యిలా చెబుతున్నాడు: “మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.” (ప్రకటన 11:6బి) ఇశ్రాయేలీయులను పంపించునట్లు ఫరోను ఒప్పించడానికి నీళ్లను రక్తంగా మార్చుటతోపాటు, క్రూరమైన ఐగుప్తును తెగుళ్లతో బాధించడానికి యెహోవా మోషేను ఉపయోగించుకున్నాడు. కొన్నిశతాబ్దాల తర్వాత, ఇశ్రాయేలీయుల శత్రువులైన పాలస్తీనీయులు యెహోవా ఐగుప్తుకు చేసినకార్యములను జ్ఞాపకం చేసికొని యిలా ప్రలాపించారు: “అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేక తెగుళ్లచేత ఐగుప్తీయులను హతముచేసిన దేవుడు ఈయనే గదా!” (1 సమూయేలు 4:8; కీర్తన 105:29) తన కాలంలోని మతనాయకులపై దేవుని తీర్పును ప్రకటించడానికి అధికారము కల్గియున్న యేసునకు మోషే ముంగుర్తైవున్నాడు. (మత్తయి 23:13; 28:18; అపొస్తలుల కార్యములు 3:22) మరి మొదటి ప్రపంచ యుద్ధకాలంలో క్రీస్తు సహోదరులు, అనగా యీ ఇద్దరుసాక్షులు, క్రైస్తవమత సామ్రాజ్యం తన మందకు యిచ్చే “నీళ్ల”లోని మరణకరమగు లక్షణాన్నిగూర్చి బహిర్గతంచేశారు.

ఆ ఇద్దరుసాక్షులు చంపబడ్డారు

19. ప్రకటన ప్రకారం ఆ ఇద్దరుసాక్షులు తమ సాక్ష్యాన్ని ముగించిన తర్వాత ఏమి సంభవిస్తుంది?

19 క్రైస్తవమత సామ్రాజ్యంమీద యీ తెగులెంత తీవ్రంగా ఉండెనంటే, ఆ ఇద్దరుసాక్షులు 42 నెలలు గోనెపట్ట ధరించి ప్రకటించిన తర్వాత క్రైస్తవమత సామ్రాజ్యం వీరిని ‘చంపాలని’ ప్రాపంచిక ప్రాబల్యాన్ని ఉపయోగించింది. యోహానిలా వ్రాస్తున్నాడు: “వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను. మరియు ప్రజలకును, వంశములకును, ఆయా భాషలు మాటలాడువారికిని, జనములకును సంబంధించినవారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఈ యిద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, ఉత్సహించుచు, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు.”—ప్రకటన 11:7-10.

20. “అగాధములోనుండి వచ్చు క్రూరమృగము” ఏమిటి?

20 క్రూరమృగాన్ని గూర్చి ప్రకటనలో చెప్పబడిన 37 సార్లలో యిది మొదటిది. తర్వాత, సకాలంలో మనం దీన్నిగూర్చి యితర క్రూరమృగాలను గూర్చి పరిశీలిద్దాం. “అగాధములోనుండి వచ్చు క్రూరమృగము” సాతాను పన్నాగమేనని, అప్పటికే ఉనికిలోనున్న రాజకీయ విధానమేనని చెప్పడం యిప్పటికి చాలు. *ప్రకటన 13:1; దానియేలు 7:2, 3, 17 పోల్చండి.

21. (ఎ) ఆ ఇద్దరుసాక్షుల మతవిరోధులు యుద్ధపరిస్థితినెలా ఒక అవకాశంగా తీసుకున్నారు? (బి) ఆ ఇద్దరుసాక్షుల శవాలు పాతిపెట్టబడకుండ వదిలివేయబడ్డాయన్న విషయం దేన్ని సూచించింది? (సి) మూడు దినములన్నరను ఎలా దృష్టించాలి? (అథఃస్సూచి చూడండి.)

21 జనములు 1914 నుండి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధంలో మునిగి ఉన్నాయి. జాతీయతా భావాలు ఉవ్వెత్తున లేచాయి, మరి 1918 లో యీ యిద్దరుసాక్షుల శత్రువులు యీ పరిస్థితిని ఒక అవకాశంగా తీసుకున్నారు. వారు న్యాయస్థానాన్ని మభ్యపెట్టి వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటిలోని బాధ్యతగల పరిచారకులపై దేశద్రోహులనే తప్పడునేరాలు మోపి వారిని జైలుకు పంపించారు. నమ్మకమైన జతపనివారు నిశ్చేష్టులయ్యారు. రాజ్యసేవ దాదాపు స్తంభించిపోయింది. ప్రచారమే ఆగిపోయిందా అన్నట్లుంది. బైబిలు కాలంలో, సమాధిలో పాతిపెట్టబడకుండ ఉండడం ఎంతో అవమానకరంగా పరిగణించబడేది. (కీర్తన 79:1-3; 1 రాజులు 13:21, 22) గనుక, ఆ యిద్దరు సాక్షులను పాతిపెట్టకుండ ఉండడం మహా అపనిందతో సమానం. పాలస్తీనాలోని వేడి వాతావరణాన్నిబట్టి, వీధిలోపడియున్న శవాలు అక్షరార్థమైన మూడున్నర దినముల తర్వాత నిజంగానే కుళ్లువాసన కొడతాయి. * (యోహాను 11:39 పోల్చండి.) ప్రవచనంలోని యీ వివరణ, ఆ యిద్దరుసాక్షులు సహించవలసిన అవమానాన్ని సూచిస్తుంది. జైల్లో పెట్టబడినట్లు చెప్పబడినవారి కేసులు అప్పీల్లో ఉండగా వారికి జామీను యివ్వడానికి కూడ అనుమతించ బడలేదు. “మహాపట్టణపు” నివాసులకు వారు ఎగతాళిగా మారునంతగా వారు బహిరంగంగా ఉంచబడ్డారు. అయితే ఈ “మహాపట్టణ” మేమిటి?

22. (ఎ) ఆ మహాపట్టణమేమిటి? (బి) ఆ ఇద్దరుసాక్షుల నోరు మూయించడంలోగల ఆనందంలో మతగురువులతో వార్తాపత్రికలెలా చేతులు కలిపాయి? (బాక్స్‌ చూడండి.)

22 యోహాను మనకు కొన్ని కిటుకులిస్తున్నాడు. యేసు అక్కడ వ్రేలాడదీయబడ్డాడని ఆయన చెబుతున్నాడు. గనుక మనం వెంటనే యెరూషలేమును గూర్చి ఆలోచిస్తాం. అయితే ఆ మహాపట్టణం సొదొమ, ఐగుప్తు అని పిలువబడుతుందని కూడ ఆయనంటున్నాడు. నిజమే, అసలైన యెరూషలేముకూడ దాని అపవిత్రమైన క్రియలనుబట్టి ఒకసారి సొదొమ అని పిలువబడింది. (యెషయా 1:8-10; యెహెజ్కేలు 16:49, 53-58 పోల్చండి.) మరి మొదటి ప్రపంచ ఆధిపత్యమైన ఐగుప్తు, కొన్నిసార్లు యీలోకవిధానాన్ని సూచిస్తున్నట్లు కనబడుతోంది. (యెషయా 19:1, 19; యోవేలు 3:19) గనుక, ఈ మహాపట్టణం దేవున్ని సేవిస్తున్నాని చెప్పుకుంటున్న మలినమైన “యెరూషలేము”ను సూచిస్తుంది గానీ, అది సొదొమవలె అపవిత్రమై, పాపిష్టిదాయెను, యింకనూ ఐగుప్తువలె, సాతానుయొక్క యీలోక విధానములో భాగమైంది. అది భ్రష్టమైన యెరూషలేముతో ఆధునిక సమాంతరంగానున్న క్రైస్తవమత సామ్రాజ్యాన్ని సూచిస్తుంది, యీ సంస్థసభ్యులే ఆ యిద్దరుసాక్షుల అభ్యంతరకరమైన ప్రచారాన్ని వారు ఆపివేసినప్పుడు ఎంతో ఆనందించారు.

తిరిగి లేచారు!

23. (ఎ) మూడు దినములన్నర తర్వాత ఆ ఇద్దరుసాక్షులకు ఏమౌతుంది, వారి విరోధులపై అదెటువంటి ప్రభావం చూపింది? (బి) ప్రకటన 11:11, 12 మరియు ఎండిన ఎముకల లోయపై యెహోవా ఊపిరిని ఊదినట్లున్న యెహెజ్కేలు ప్రవచనమెప్పుడు ఆధునిక కాల నెరవేర్పును కల్గియున్నది?

23 దేవుని ప్రజలను నిందించడంలో వార్తాపత్రికలు కూడ మతగురువులతో చేతులుకలిపాయి, ఒక పత్రిక యిలా అంటుంది: ది ఫినిష్డ్‌ మిస్టరీకి ముగింపు యివ్వబడింది.” ఇంతకు మించిన సత్యమే లేదు! ఆ ఇద్దరు సాక్షులు అలాగే మృతులై యుండలేదు. మనమిలా చదువుతాము: “అయితే ఆ మూడు దినములన్నరయైన పిమ్మట దేవునియొద్దనుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి; వారిని చూచినవారికి మిగుల భయము కలిగెను. అప్పుడు—ఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్పస్వరము తమతోచెప్పుట వారువిని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి.” (ప్రకటన 11:11, 12) అలా, వారు యెహెజ్కేలు తన దర్శనమందు లోయలో చూచిన ఎముకలకు కల్గిన అనుభవాన్ని కల్గియుండిరి. యెహోవా ఆ ఎముకలకు జీవాత్మనివ్వగా అవి బ్రతికాయి, అలా ఇశ్రాయేలు జనాంగం బబులోనులో 70 సంవత్సరాల చెరననుభవించిన అనంతరం పునర్జీవిస్తుందని అది సూచించింది. (యెహెజ్కేలు 37:1-14) ప్రకటన, యెహెజ్కేలునందలి ఈ రెండు ప్రవచనాలు, యెహోవా తన “చనిపోయిన” సాక్షులకు ప్రాణంపోసినప్పుడు అంటే 1919 లో గొప్ప ఆధునిక నెరవేర్పును కల్గియుండెను.

24. ఆ ఇద్దరుసాక్షులు తిరిగి లేచినపుడు వారిని హింసించిన మతస్థులపై దాని ప్రభావమెలా ఉండెను?

24 ఆ హింసకులకెంత విస్మయం కల్గించిందో! ఆ ఇద్దరుసాక్షుల శవాలు ఆకస్మికంగా లేచి మరల ఉజ్జీవంపొందాయి. ఆ మతగురువులకు అది మింగుడుపడని మాత్ర అయ్యింది, ముఖ్యంగా తాము కుట్రపన్ని చెరలోవేయించిన క్రైస్తవ పరిచారకులు పిదప పూర్తిగా నిర్దోషులని నిరూపించబడి విడుదల చేయబడ్డారు. సెప్టెంబరు, 1919 లో బైబిలు విద్యార్థులు అమెరికాలోని ఓహయోనందలి సీడార్‌ పాయింట్‌లో సమావేశము జరిపినప్పుడు యీ విస్మయం మరెక్కువై వుంటుంది. ఇక్కడ అప్పుడే విడుదలైన వాచ్‌టవర్‌ సొసైటి అధ్యక్షుడు, జె.యఫ్‌. రూథర్‌ఫర్డ్‌, ప్రకటన 15:2 మరింకా యెషయా 52:7 మీద ఆధారపడి “అనౌన్సింగ్‌ ది కింగ్‌డం” అనే అంశంపై తానిచ్చిన ప్రసంగంతో ప్రేక్షకులను అలరించాడు. యోహాను తరగతి వారు మరొకసారి “ప్రవచించుటకు” లేక బహిరంగంగా ప్రకటించటానికి ఆరంభించారు. వారు క్రైస్తవమత సామ్రాజ్య వేషధారణను నిర్భయంగా బయటపెట్టడంలో మరీమరీ బలం పుంజుకున్నారు.

25. (ఎ) “ఇక్కడికి ఎక్కిరండని” ఆ ఇద్దరు సాక్షులకు ఎప్పుడు చెప్పబడింది, మరి అదెలా జరిగింది? (బి) ఆ ఇద్దరుసాక్షుల పునరుజ్జీవనం ఆ మహాపట్టణంపై ఎటువంటి గట్టిప్రభావం కలిగివుండెను?

25 క్రైస్తవమత సామ్రాజ్యం 1918 లో పొందిన విజయాన్నే తిరిగి పొందాలని విశ్వప్రయత్నం చేసింది. అది అల్లరిమూకలను, చట్టపరంగాను, జైల్లో వేయించడం ద్వారాను, చివరకు ఉరికంబం ఎక్కించేవరకు ప్రయత్నించి చూసింది—కాని యివన్నీ వృధా అయ్యాయి! మరి 1919 తర్వాత యీ యిద్దరు సాక్షుల ఆత్మీయస్థితి దానికందలేదు. ఆ సంవత్సరంలో యెహోవా వారితో యిలా అన్నాడు: “ఇక్కడికి ఎక్కిరండి.” దీన్ని వారి శత్రువులు చూడగలిగారే గాని వారిని తాకలేనంత ఆత్మీయ ఎత్తుకు వారెదిగారు. వారి పునరావాసం ఆ మహా పట్టణంమీద కల్గించిన గట్టిప్రభావాన్ని గూర్చి యోహానిలా వర్ణిస్తున్నాడు: “ఆ గడియలోనే గొప్పభూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడు వేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.” (ప్రకటన 11:13) మత సామ్రాజ్యంలో నిజంగా చాలా ఒడుదుడుకులు ఏర్పడ్డాయి. ఈ పునరుద్ధరించబడిన క్రైస్తవులు తమ పనిని మరల ఆరంభించినప్పుడు, నాయకుల క్రింద స్థిరపడిన చర్చీల పునాది కదలడాని కారంభించినట్లు కనబడుతోంది. ఆ పట్టణపు పదోభాగం, అలంకారిక 7,000 మందికి ఎంతగట్టిగా దెబ్బతగిలిందంటే వారు చనిపోయారు అన్నట్లు చెప్పబడ్డారు.

26. ప్రకటన 11:13 నందలి “ఆ పట్టణములోని పదియవ భాగము,” “ఏడువేలమంది” ఎవరిని సూచిస్తున్నారు? వివరించండి.

26 “పట్టణములో పదియవ భాగము” అన్న మాట ప్రాచీన యెరూషలేము పరిశుద్ధ సంతానంగా, దానిలోని పదియవ భాగం ఆ పట్టణపు నాశనాన్ని తప్పించుకుంటుందని యెషయా ప్రవచించిన సంగతిని జ్ఞాపకంచేస్తుంది. (యెషయా 6:13) అదేమాదిరి, 7,000 అనే సంఖ్య, ఇశ్రాయేలీయులలో తానొక్కడే నమ్మకంగా మిగిలియున్నాడని ఏలీయా అనుకున్నప్పుడు, యెహోవా ఆయనతో బయలు దేవతకు మోకాళ్లూనని 7000 మంది నమ్మకమైన వారింకనూ ఉన్నారని చెప్పిన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. (1 రాజులు 19:14, 18) ఈ 7,000 మంది మొదటి శతాబ్దంలో క్రీస్తును గూర్చిన సువార్తను వినిన యూదులలోని శేషమును సూచించారని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (రోమీయులు 11:1-5) ప్రకటన 11:13 నందలి ఆ “ఏడు వేలు” మరియు “పట్టణములో పదియవ భాగము” అంటే పునరుద్ధరించబడిన ఆ యిద్దరుసాక్షుల మాటవిని ఆ పాపభూయిష్టమైన పట్టణాన్ని విడిచేవారేనని అర్థంచేసుకోవడానికి యీ లేఖనాలు మనకు సహాయం చేస్తాయి. వారు క్రైస్తవమత సామ్రాజ్యం విషయంలో మృతులే. వారిపేర్లు దాని సభ్యత్వంనుండి తొలగించ బడ్డాయి. దానికి సంబంధించినంత వరకు వారిక ఉనికిలోలేరు. *

27, 28. (ఎ) ఎలా ‘మిగిలిన వారు పరలోకపు దేవుని మహిమపరచారు?’ (బి) క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు దేనిని తప్పక ఒప్పుకున్నారు?

27 అయితే క్రైస్తవమత సామ్రాజ్యంలో, ‘మిగిలిన వారు పరలోకపు దేవుని ఎలా మహిమపరచారు?’ నిశ్చయంగా, వారుతమ భ్రష్టమైన మతాన్ని విడనాడి దేవుని సేవకులగుటవల్ల మాత్రంకాదు. అయితే, విన్సెంట్‌యొక్క వర్డ్‌ స్టడీస్‌ ఇన్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌, అనే పుస్తకంలో “పరలోకపు దేవుని మహిమపరచిరి” అనే మాటను చర్చిస్తున్నప్పుడు చెప్పినలాగానేవుంది. అక్కడ యిలా చెప్పబడింది: “ఆ వాక్యం మార్పు, పశ్చాత్తాపం, మారుమనస్సు, కృతజ్ఞతలను సూచించడం లేదు, గానీ గుర్తింపును సూచిస్తుంది, ఇక లేఖనాల్లో అలాంటిభావం స్ఫురించడం సర్వసాధారణమే. యెహో. vii. 19 (సెప్టా.). యోహా. ix. 24; అపొ.కా. xii. 23; రోమా. iv. 20 పోల్చండి.” అవమానముతో క్రైస్తవమత సామ్రాజ్యము బైబిలు విద్యార్థుల దేవుడు వారిని క్రైస్తవసేవ నిమిత్తం పునరుజ్జీవింప చేయడంలో ఆయన గొప్ప అద్భుతమే చేశాడని ఒప్పకోవలసివచ్చింది.

28 మతగురువులు కేవలం మానసికంగా లేక తమకు తామే యిలా ఒప్పుకొని వుండవచ్చు. నిశ్చయంగా, వారిలో ఏ ఒక్కరూ ఆ యిద్దరుసాక్షుల దేవున్ని బహిరంగంగా ఒప్పుకున్న దాఖలాలేదు. అయితే వారిహృదయంలో దాగివున్నదాన్ని, 1919 లో వారనుభవించిన అవమానాన్ని గుర్తించడానికి యోహాను ద్వారా యెహోవా యిచ్చిన ప్రవచనం మనకు సహాయం చేస్తుంది. ఆ సంవత్సరంనుండి, క్రైస్తవమత సామ్రాజ్యం తన గొఱ్ఱెలను నిలబెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించి నప్పటికిని ఆ “ఏడువేలమంది,” దాన్ని వదలిపెట్టినప్పుడు, మతగురువులు తమ దేవునికన్నా యోహాను తరగతి దేవుడే గొప్పవాడని తప్పనిసరిగా గుర్తెరగవలసి వచ్చింది. తర్వాతి సంవత్సరాలలో, తమ మందలోని అనేకులు దానినుండి బయటికి వస్తూండగా, ఏలీయా కర్మెలు పర్వతంమీద బయలు దేవతారాధికులపై విజయభేరి మ్రోగించినపుడు ప్రజలు “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని మారు మ్రోగించినట్లే వీరును దీనిని మరింత స్పష్టంగా గ్రహిస్తారు.—1 రాజులు 18:39.

29. త్వరలో ఏమి సంభవించనై యున్నదని యోహాను చెబుతున్నాడు, క్రైస్తవమత సామ్రాజ్యమునకు యింకా ఎటువంటి కదలిక సంభవింపనైవున్నది?

29 అయితే వినండి! యోహాను మనకిలా చెబుతున్నాడు: “రెండవ శ్రమ గతించెను; ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది.” (ప్రకటన 11:14) ఇప్పటివరకు జరిగిన దాన్నిబట్టి క్రైస్తవమత సామ్రాజ్య పునాదులు కదలితే, మరి మూడవ శ్రమ ప్రకటింపబడినప్పుడు, ఏడవదూత తన బూర ఊదినప్పుడు, దేవుని పరిశుద్ధ మర్మము చివరకు సమాప్తమైనప్పుడు, అదేం చేస్తుంది?—ప్రకటన 10:7.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఈ గొప్ప ఆత్మీయ దేవాలయాన్నిగూర్చిన పూర్తివివరణ కొరకు డిశంబరు 1, 1972, ది వాచ్‌టవర్‌ లోని “ది వన్‌ ట్రూ టెంపుల్‌ ఎట్‌ విచ్‌ టు వర్షిప్‌,” అనే శీర్షికను చూడండి.

^ పేరా 20 “అగాధము” (గ్రీకు, అబిసోస్‌; హెబ్రీ, టెహొమ్‌) అనేది అలంకారికముగా నిష్క్రియను సూచిస్తుంది. (ప్రకటన 9:2 చూడండి.) అయినా, అక్షరార్థమైన భావంలోనైతే, అది మహాసముద్రాన్ని కూడ సూచిస్తుంది. హెబ్రీపదం తరచూ “అగాధజలములు” అని తర్జుమాచేయ బడుతుంది. (కీర్తన 71:20; 106:9; యోనా 2:5) అలా, “అగాధములోనుండి వచ్చు క్రూరమృగము” నకు “సముద్రములోనుండి వచ్చు క్రూరమృగము”తో సంబంధముందని చెప్పవచ్చును.—ప్రకటన 11:7; 13:1.

^ పేరా 21 ఈ కాలంలోనున్న దేవుని ప్రజల అనుభవాలను పరిశీలిస్తే, 42 నెలలంటే అక్షరార్థంగా మూడున్నర సంవత్సరాలను సూచిస్తాయిగానీ, మూడున్నర దినములు అక్షరార్థంగా 84 గంటలను సూచించడంలేదు. బహుశ, (9, 11 వచనాల్లో) రెండుసార్లు తెలుపబడిన మూడున్నర దినములు అనే ప్రత్యేక కాలం, దానికిముందు తెల్పబడిన మూడున్నర సంవత్సరాల పనితో పోలిస్తే యిది తక్కువ సమయమని నొక్కిచెప్పడానికే అయ్యిండొచ్చు.

^ పేరా 26 రోమీయులు 6:2, 10, 11; 7:4, 6, 9; గలతీయులు 2:19; కొలొస్సయులు 2:20; 3:3 వంటి లేఖనములలోని “చనిపోయిన,” “మృతులైన,” మరియు “జీవిస్తున్న” అనే పదాల ప్రయోగమును పోల్చి చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[168వ పేజీలోని బాక్సు]

ప్రకటన 11:10 లోని ఉత్సాహము

ప్రీచర్స్‌ ప్రజెంట్‌ ఆర్మ్‌స్‌, అని 1933 లో ప్రచురితమైన తన పుస్తకంలో రే హెచ్‌. అబ్రామ్స్‌, మతగురువులు ది ఫినిష్డ్‌ మిస్టరీ అనే వాచ్‌టవర్‌ సొసైటి పుస్తకాన్ని ఎలా తీవ్రంగా వ్యతిరేకించారో తెల్పుతున్నాడు. మతగురువులు బైబిలు విద్యార్థుల బెడదను, వారి “తెగులుతోకూడిన బోధను” వదిలించుకోవాలని చేసిన ప్రయత్నాలను ఆయన పునర్విమర్శిస్తున్నాడు. ఇందుమూలంగా, కోర్టులో కేసు నడిచి, జె.యఫ్‌.రూథర్‌ఫర్డ్‌ మరి ఏడుగురు సహవాసులకు అనేక సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. డాక్టర్‌ అబ్రామ్స్‌ యింకా యిలా అంటున్నాడు: “కేసు మొత్తాన్ని పరిశీలిస్తే రస్సలైట్స్‌ను తుడిచిపెట్టాలనే ఉద్యమము వెనుక ముఖ్యంగా చర్చీలు, మతగురువులే ఉన్నారని స్పష్టమౌతుంది. కెనడాలో 1918 ఫిబ్రవరిలో మతగురువులు వారికి వారి ప్రచురణలకు, ముఖ్యంగా ది ఫినిష్డ్‌ మిస్టరీ పుస్తకానికి వ్యతిరేకంగా ఒక పద్ధతిప్రకారం ప్రచారం చేశారు. విన్నిపెగ్‌ ట్రిబ్యూన్‌ ప్రకారం, . . . వారి పుస్తకం అణచివేయ బడడానికిగల కారణం అసలు ‘మతగురువుల వత్తిళ్లే’ నని నమ్ముతున్నారు.”

డాక్టర్‌ అబ్రామ్స్‌ యింకా యిలా చెబుతున్నాడు: “ఇరవైయేండ్ల శిక్షనుగూర్చిన వార్తలు మతపత్రికల ఎడిటర్లకు అందినపుడు, యీ పత్రికలకు సంబంధించిన దాదాపు ప్రతిఒక్కరు, పెద్ద, చిన్న అందరూ, ఆ విషయాన్నిగూర్చి ఆనందించారు. ఆ సాంప్రదాయక మతపత్రికల్లోని ఒక్కదాంట్లోకూడ సానుభూతి మాటను నేను చూడలేకపోయాను. ‘“సాంప్రదాయ” మతగుంపుల చలువ మూలంగానే కొంతవరకు . . . హింస వచ్చిందనుటలో సందేహంలేదు’ అని అప్టాన్‌ సింక్లేయర్‌ అన్నాడు. చర్చీలు కలిసి చేయలేని పనిని ప్రభుత్వమే వాటికొరకు చేయడంలో యిప్పుడు సఫలమైనట్లు కనబడుతోంది.” అనేక మతపత్రికల గౌరవహీనమైన వ్యాఖ్యానములను పేర్కొన్న తదనంతరం, రచయిత అప్పీలు కోర్టులో మార్చబడిన తీర్పును తెల్పుతూ యిలా వ్యాఖ్యానించాడు: “ఈ తీర్పును చర్చీలు మౌనంగా స్వీకరించాయి.”

[163వ పేజీలోని చిత్రం]

యోహాను ఆత్మీయ ఆలయాన్ని కొలుస్తున్నాడు—అభిషక్త యాజకులు ఆ నియమాలకు సరితూగాలి

[165వ పేజీలోని చిత్రం]

జెరుబ్బాబెలు మరియు యెహోషువ చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమము, ప్రభువు దినములో యెహోవాసాక్షులు చిన్నగుంపుగా ప్రారంభమై పిదప గొప్పగా అభివృద్ధి చెందుతారని సూచిస్తుంది. పైన చూపించబడిన న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌నందలి ముద్రణా ఏర్పాట్లను, వారి అవసరాలను తీర్చడానికి ఎంతగానో విస్తరింప జేయవలసి వచ్చింది

[166వ పేజీలోని చిత్రం]

మోషే, ఏలీయా చేసిన ప్రవచనార్థక పనులు, ఆ యిద్దరు సాక్షులు ప్రకటించిన తీక్షణమైన తీర్పు వర్తమానములను సూచించాయి

[169వ పేజీలోని చిత్రం]

యెహెజ్కేలు 37వ అధ్యాయంలోని ఎండిన ఎముకలవలె, యీ యిద్దరుసాక్షులు ఆధునిక కాల సేవనిమిత్తము పునరుజ్జీవింపజేయబడ్డారు