కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రొత్త ఆకాశము క్రొత్త భూమి

క్రొత్త ఆకాశము క్రొత్త భూమి

అధ్యాయం 42

క్రొత్త ఆకాశము క్రొత్త భూమి

1. దూత యోహానును వెయ్యేండ్ల పరిపాలనారంభానికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఏమి వివరిస్తున్నాడు?

దేవ దూత యోహానును వెయ్యేండ్ల పాలనారంభానికి తీసుకెళ్తుండగా మహిమకరమైన దర్శనం క్రమంగా బయల్పరచ బడుతూనేవుంది. ఆయన ఏమి వర్ణిస్తున్నాడు? “అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు.” (ప్రకటన 21:1) కనులవిందైన దృశ్యం కానవస్తుంది!

2. (ఎ) క్రొత్తఆకాశము క్రొత్తభూమినిగూర్చి యెషయా చెప్పిన ప్రవచనం సా.శ.పూ. 537 లో పునరుద్ధరించబడిన యూదులపై ఎలా నెరవేరింది? (బి) యెషయా ప్రవచనానికి యింకా నెరవేర్పుందని మనకెలా తెలుసు, యీ వాగ్దానమెలా నెరవేరింది?

2 యోహాను కాలానికి వందల సంవత్సరాలముందే, యెహోవా యెషయాకు యిలా చెప్పాడు: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు.” (యెషయా 65:17; 66:22) ఈ ప్రవచనం తొలుత నమ్మకమైన యూదులు సా.శ.పూ. 537 లో 70సంవత్సరాల బబులోను చెరతర్వాత వారు విడిపించబడి యెరూషలేముకు తిరిగివచ్చినప్పుడు నెరవేరింది. ఆ పునరుద్ధరణలో, వారొక శుభ్రపర్చబడిన సమాజంగా, “క్రొత్త ఆకాశము” అను క్రొత్త ప్రభుత్వపాలన క్రింద “క్రొత్త భూమి”గా ఏర్పడ్డారు. అయిననూ, అపొస్తలుడైన పేతురు ఆ ప్రవచన బావి నెరవేర్పునుగూర్చి సూచిస్తూ యిలా చెబుతున్నాడు: “అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతినివసించును.” (2 పేతురు 3:13) యోహాను యీ వాగ్దానం ప్రభువు దినములో నెరవేరిందని యిప్పుడు చూపిస్తున్నాడు. “మొదటి ఆకాశమును మొదటి భూమియు” అంటే సాతాను అతని దయ్యాల ప్రభావంతో నడిచే ప్రభుత్వ నిర్మాణంతోపాటు సాతాను సంస్థీకరించబడిన విధానం గతించిపోతుంది. తిరుగుబాటుదారులైన, నిమ్మళింపనేరని దుష్ట మానవజాతియనే “సముద్రము” యిక ఉండదు. దాని స్థానంలో “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు” అంటే దేవుని రాజ్యము అనే ఒక నూతన ప్రభుత్వం క్రింద ఓ భూలోక సమాజముంటుంది.—ప్రకటన 20:11 పోల్చండి.

3. (ఎ) యోహాను ఏమి వర్ణిస్తున్నాడు, నూతన యెరూషలేము అంటే ఏమిటి? (బి) నూతన యెరూషలేము ఎలా ‘పరలోకము నుండి దిగి వస్తుంది’?

3 యోహాను యింకా యిలా చెబుతున్నాడు: “మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.” (ప్రకటన 21:2) నూతన యెరూషలేము అనేది క్రీస్తుయొక్క భార్య, అంటే అది మరణంవరకు నమ్మకంగా ఉండి, మహిమనొందిన యేసుతోపాటు రాజులుగా, యాజకులుగా ఉండడానికి లేపబడే అభిషక్త క్రైస్తవులతో కూడినది. (ప్రకటన 3:12; 20:6) భూలోక యెరూషలేము ప్రాచీన ఇశ్రాయేలునందు ప్రభుత్వపరిపాలనకు కేంద్రమైనట్లే, మహిమగల నూతన యెరూషలేము దాని పెండ్లికుమారుడు కలిసి నూతన విధానానికి ప్రభుత్వంగా తయారౌతారు. ఇదే నూతన యెరూషలేము. అక్షరార్థంగా ‘పెండ్లికుమార్తె పరలోకమునుండి దిగిరాదు’ గానీ, భూమిపై తన అవధానాన్ని మళ్లించడంద్వారా దిగివస్తుంది. గొఱ్ఱెపిల్ల భార్య, మానవజాతియంతటిపై ఒక నీతియుక్తమైన ప్రభుత్వాన్ని నిర్వహించడంలో ఆయనకు నమ్మకంగా సహాయం చేసేదైవుంటుంది. నూతన భూమికి నిజంగా దీవెనకరమే!

4. క్రొత్తగా ఏర్పడిన ఇశ్రాయేలు జనాంగంతో చేసినటువంటి ఏ వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు?

4 యోహాను మనకింకా తెల్పుతున్నాడు: “అప్పుడు—ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.” (ప్రకటన 21:3) యెహోవా అప్పటి నూతన ఇశ్రాయేలు జనాంగంతో ధర్మశాస్త్ర నిబంధన చేసినప్పుడు, ఆయన యిలా వాగ్దానం చేశాడు; “నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.” (లేవీయకాండము 26:11, 12) ఇప్పుడు యెహోవా నమ్మకమైన మానవులతో అటువంటి వాగ్దానాన్నే చేస్తున్నాడు. వెయ్యేండ్ల తీర్పుకాలంలో, వారాయనకు చాలా ప్రత్యేకమైన ప్రజలౌతారు.

5. (ఎ) వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో దేవుడెలా మానవులతో నివసిస్తాడు? (బి) వెయ్యేండ్ల పరిపాలనానంతరం దేవుడెలా మానవులతో నివసిస్తాడు?

5 వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, తన రాకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా యెహోవా ప్రాతినిధ్యం వహించి ఒక తాత్కాలిక ఏర్పాటునందు మానవులతో ఆయన “కాపురముండును.” అయిననూ, వెయ్యేండ్ల పరిపాలనాంతాన, యేసు తన తండ్రికి రాజ్యాన్ని అప్పగించినప్పుడు రాజప్రతినిధి లేక మధ్యవర్తి అవసరముండదు. యెహోవా ఆత్మీయంగా “ఆయన ప్రజలతో” శాశ్వతంగాను నేరుగాను కాపురముంటాడు. (యోహాను 4:23, 24 పోల్చండి.) పునరుద్ధరించబడిన మానవులకు ఎంతటి మహాధిక్యత!

6, 7. (ఎ) ఎటువంటి దివ్యమైన వాగ్దానాలను యోహాను బయల్పరుస్తున్నాడు, మరి ఆ దీవెనల నందుకునేదెవరు? (బి) యెషయా ఎలా భౌతిక, ఆత్మీయసంబంధమైన పరదైసును గూర్చి వర్ణిస్తున్నాడు?

6 యోహాను యింకా అంటున్నాడు: “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించి పోయెను.” (ప్రకటన 21:4) మరోసారి, మనకు ముందటి ప్రేరేపిత వాగ్దానాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. యెషయా కూడ మరణం, వేదన యిక లేనటువంటి సమయం, దుఃఖానికి బదులు ఉల్లాసం ఉండే కాలంకొరకే ఎదురు చూశాడు. (యెషయా 25:8; 35:10; 51:11; 65:19) ఈ వాగ్దానాలు వెయ్యేండ్ల తీర్పుకాలంలో అద్భుతమైన నెరవేర్పును కల్గివుంటాయని యోహాను యిప్పుడు స్థిరపరుస్తున్నాడు. మొదట గొప్ప సమూహము ఆ దీవెనలు పొందుతారు. “సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల” వారికి కాపరియై, “జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” (ప్రకటన 7:9, 17) అయితే ఆఖరుకు పునరుత్థానులై యెహోవా ఏర్పాట్లయందు విశ్వాసముంచే వారందరూ వారితోపాటు అక్కడుంటారు, శారీరక ఆత్మీయ సంబంధమైన పరదైసును అనుభవిస్తుంటారు.

7 యెషయా చెప్పేదేమంటే అప్పుడు “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును. చెవిటివారి చెవులు విప్పబడును.” అవును, “కుంటివాడు దుప్పివలె గంతులువేయును. మూగవాని నాలుక పాడును.” (యెషయా 35:5, 6) ఇంకనూ ఆ కాలంలో “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.” (యెషయా 65:21, 22) గనుక వారు భూమ్మీదనుండి పెరికివేయబడరు.

8. ఈ దివ్యమైన వాగ్దానాల నిశ్చయతనుగూర్చి యెహోవాయే ఏమని చెబుతున్నాడు?

8 మనమీ వాగ్దానాలను ధ్యానిస్తుండగా మన మనస్సులెంత మనోహరమైన ఊహాచిత్రాలతో నిండిపోతాయి! ప్రేమపూర్వకమైన పరలోక ప్రభుత్వం క్రింద నమ్మకమైన మానవజాతికి అద్భుతమైన దీవెనలు వేచివున్నాయి. అటువంటి వాగ్దానాలు నమ్మశక్యం కావా? అవి పత్మాసు ద్వీపంలో పరవాసియైన ఒక వృద్ధుని వృధా స్వప్నాలేనా? యెహోవాయే వీటికి సమాధానమిస్తున్నాడు: “అప్పుడు సింహాసనాసీనుడై యున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను—సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను.”—ప్రకటన 21:5, 6ఎ.

9. ఈ బావి దీవెనలు తప్పక వస్తాయని ఎందుకు ఎదురు చూడగలము?

9 ఈ బావి దీవెనలనుగూర్చి యెహోవా తానే నమ్మకమైన మానవజాతి కొరకు అభయమిస్తున్నట్లు లేక అధికారపత్రంపై సంతకం చేస్తున్నట్లున్నది. అటువంటి అభయహస్తాన్ని ప్రశ్నించే ధైర్యమెవరికున్నది? యెహోవా చేసిన యీ వాగ్దానాలెంత నిశ్చయత కల్గివున్నాయంటే అవి అప్పుడే నెరవేరినవన్నంతగా ఆయన మాట్లాడుతున్నాడు: “సమాప్తమైనవి!” మరి యెహోవా “అల్ఫాయు ఓమెగయు . . . భూత భవిష్యత్కాలములలో ఉండువాడు . . . సర్వాధికారియు” కాడా? (ప్రకటన 1:8) ఆయన నిశ్చయంగా అలాంటివాడే! ఆయనే యిలా చెబుతున్నాడు: “నేను మొదటి వాడను కడపటివాడను. నేను తప్ప ఏ దేవుడును లేడు.” (యెషయా 44:6) అందుచేత ఆయన ప్రవచనాలను ప్రేరేపించి వాటిని క్షుణ్ణంగా నెరవేర్చగలడు. ఇదెంతచక్కగా విశ్వాసాన్ని బలపరుస్తుందో! గనుకనే ఆయన యిలా వాగ్దానం చేస్తున్నాడు: “ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను.” ఈ అద్భుతాలు నిజంగా నెరవేరుతాయా లేదాయని ప్రశ్నించేబదులు మనమిలా నిశ్చయంగా అడుగుకోవాలి: “అటువంటి ఆశీర్వాదాలను పొందడానికి స్వయంగా నేనేమి చేయవలసి ఉంటుంది?”

దప్పిగొన్న వారికి “జలము”

10. యెహోవా ఏ “జలము” యిస్తానంటున్నాడు, అది దేనికి సూచన?

10 యెహోవా తానే యిలా చెబుతున్నాడు: “దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.” (ప్రకటన 21:6బి) ఆ దప్పిక తీరాలంటే, ఒక వ్యక్తి తన ఆత్మీయావసరత విషయంలో మెలకువ గల్గివుంటూ, యెహోవా అనుగ్రహించే “జలమును” అందుకోవడానికి యిష్టపడాలి. (యెషయా 55:1; మత్తయి 5:3) ఎటువంటి “జలము”? సమరయలో ఓ బావిదగ్గర ఒక స్త్రీతో మాట్లాడుతూ యేసే దీనికి సమాధానం చెబుతున్నాడు: “నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును.” ఆ “జీవజలముల బుగ్గలోని జలము” మానవజాతిని పరిపూర్ణతకు పునరుద్ధరించడానికి దేవునినుండి యేసుక్రీస్తుద్వారా ప్రవహిస్తుంది. ఆ సమరయ స్త్రీవలె మనం ఆ ఊటనుండి త్రాగడానికి ఎంతో ఆతురత కల్గివుండాలి! మరియు ఆ స్త్రీవలెనే ఇతరులకు సువార్త ప్రకటించడానికి భౌతికాశలు విడనాడుటకై ఎంతగా సిద్ధపడాలి!—యోహాను 4:14, 15, 28, 29.

జయించువారు

11. యెహోవా ఏ వాగ్దానం చేశాడు, ఆ మాటలు మొదట ఎవరికి వర్తిస్తాయి?

11 యెహోవా తెలియ జేస్తున్నట్లు, సేదదీర్చే ఆ “జలములను” త్రాగేవారు జయించ వలసియున్నారు కూడ: “జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడైయుండును.” (ప్రకటన 21:7) ఈ వాగ్దానం, ఏడు సంఘాలకు యిచ్చిన వర్తమానాల్లోని వాగ్దానాల్లానే ఉంది; గనుక యీ మాటలు మొదట ఆత్మీయ శిష్యులకే వర్తించవలెను. ( పకటన 2:7, 11, 17, 26-28; 3:5, 12, 21) క్రీస్తు ఆత్మీయ సహోదరులు నూతన యెరూషలేములో భాగంగా తయారయ్యే ఆధిక్యతకొరకు సంవత్సరాల తరబడి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. యేసు జయించినట్లు వారు జయిస్తే, వారి ఆశలు నిజమౌతాయి.—యోహాను 16:33.

12. ప్రకటన 21:7 నందలి యెహోవా వాగ్దానం గొప్పసమూహము యెడల ఎలా నెరవేరుతుంది?

12 సమస్త జనములలోనుండి వచ్చిన గొప్పసమూహం కూడా యీ వాగ్దానం కొరకు ఎదురుచూస్తుంది. వారు కూడ జయించాలి, వారు మహాశ్రమలను తప్పించుకునేంత వరకు దేవున్ని నమ్మకంగా యథార్థతతో సేవిస్తుండాలి. అప్పుడు వారు వారి భూలోక స్వాస్థ్యాన్ని అంటే ‘లోకము పుట్టినది మొదలుకొని వారికొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని’ స్వతంత్రించు కుంటారు. (మత్తయి 25:34) వీరు, వెయ్యేండ్లాంతాన జరిగే పరీక్షలో నెగ్గిన ప్రభువుయొక్క భూసంబంధమైన గొఱ్ఱెలు “పరిశుద్ధులు” అని పిలువబడతారు. (ప్రకటన 20:9) వారాయన సార్వత్రిక సంస్థ సభ్యులుగా వారి సృష్టికర్తయగు యెహోవాతో పరిశుద్ధమైన, స్నేహబంధాన్ని అనుభవిస్తారు.—యెషయా 66:22; యోహాను 20:31; రోమీయులు 8:21.

13, 14. దేవుని దివ్యమైన వాగ్దానాలను స్వతంత్రించు కోవడానికి మనమే అభ్యాసాలను కచ్చితంగా విడనాడాలి, ఎందుకు?

13 ఈ గొప్ప నిరీక్షణను దృష్టియందుంచుకొని, యెహోవాసాక్షులు యిప్పుడు సాతాను లోకమందలి అపవిత్రమైన వాటికిదూరమై పవిత్రంగా ఉండడమెంత ప్రాముఖ్యతోగదా! యెహోవాయే యిక్కడ వివరిస్తున్న గుంపులోనికి అపవాది మనల్ని యీడ్వనివ్వకుండ మనం బలంగా, తీర్మానపూర్వకంగా, దృఢచిత్తంతో ఉండాలి: “పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.” (ప్రకటన 21:8) అవును, స్వతంత్రించుకొనబోయే వ్యక్తి యీ పాతవిధానాన్ని పాడుచేసిన అలవాట్లను విడనాడాలి. సమస్త వత్తిళ్లు, శోధనలలోను నమ్మకంగా ఉంటూ అతడు జయించాలి.—రోమీయులు 8:35-39.

14 క్రైస్తవమత సామ్రాజ్యం, తాను క్రీస్తు భార్యనని చెప్పుకుంటున్ననూ, అది యోహాను యిక్కడ వర్ణిస్తున్న అసహ్యమైన అభ్యాసాలతో గుర్తించబడుతోంది. అందుకే అది బబులోనులోని మిగతా భాగంతోపాటు నిత్యనాశనానికి పోతుంది. (ప్రకటన 18:8, 21) అలాగే, గొప్పసమూహానికి చెందినవారైనా, లేక అభిషక్తులైనా అటువంటి దురభ్యాసాల ననుసరించినా లేక ప్రోత్సహించినా నిత్యనాశనాన్ని అనుభవిస్తారు. వారీ అభ్యాసాలలో కొనసాగుతూవుంటే, వారు వాగ్దానాలను స్వతంత్రించుకోరు. మరి క్రొత్తభూమిలో, అటువంటి అభ్యాసాలను అలవాటుచేయడానికి ప్రయత్నించేవారు తక్షణమే నాశనం చేయబడతారు, పునరుత్థాన నిరీక్షణలేని రెండో మరణమనుభవిస్తారు.—యెషయా 65:20.

15. జయించేవారిలో ప్రముఖులెవరు, ప్రకటన ఏ దర్శనంతో ముచ్చటైన ముగింపుకు తీసుకురాబడింది?

15 జయించేవారిలో ప్రముఖులు గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు, ఆయన భార్యయగు 1,44,000 మంది, అనగా నూతన యెరూషలేము. గనుక, నూతన యెరూషలేము యొక్క అంతిమ, అమోఘమైన దృశ్యాన్ని చూపిస్తూ, ప్రకటన గ్రంథాన్ని ముచ్చటైన ముగింపుకు తేవడం ఎంత యుక్తం! యోహాను యిప్పుడు చివరి దర్శనాన్ని వర్ణిస్తున్నాడు.

[అధ్యయన ప్రశ్నలు]

[302వ పేజీలోని చిత్రం]

భూమిలోని క్రొత్తసమాజంలో, అందరికి సంతోషభరితమైన పని, సహవాసముంటుంది