కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేదీప్యమానమైన పట్టణము

దేదీప్యమానమైన పట్టణము

అధ్యాయం 43

దేదీప్యమానమైన పట్టణము

దర్శనము 16—ప్రకటన 21:9–22:5

అంశం: నూతన యెరూషలేమునుగూర్చిన వర్ణన

నెరవేర్పుకాలం: మహాశ్రమలు ముగిసి, సాతాను అగాధంలో పడవేయబడిన తర్వాత

1, 2. (ఎ) నూతన యెరూషలేమును చూపించడానికి దూత యోహానును ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఇక్కడ మనమే తేడాను చూస్తున్నాము? (బి) ఇదెందుకు ప్రకటన యొక్క మహత్తర ముగింపైవుంది?

ఒక దూత మహాబబులోనును చూపించడానికి యోహానును అరణ్యానికి కొనిపోతాడు. ఇప్పుడు ఆ దూతల సమూహములోని ఒకరు యోహానును ఎత్తైన కొండమీదికి తీసుకెళ్తాడు. ఆయన ఎంతటి భేదాన్ని చూస్తున్నాడు! బబులోను వేశ్యవంటి అపవిత్రమైన అవినీతికరమైన పట్టణం అక్కడలేదు, గానీ నూతన యెరూషలేము—నిర్మలంగా, ఆత్మీయంగా, పరిశుద్ధంగా—పరలోకంనుండి దిగి వస్తుంది.—ప్రకటన 17:1, 5.

2 భూలోక యెరూషలేమునకు కూడ ఎన్నడూ యిటువంటి మహిమలేదు. యోహాను మనకిలా చెబుతున్నాడు: “అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి—ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.” (ప్రకటన 21:9-11ఎ) ఆ ఎత్తయిన పర్వతశిఖరం నుండి యోహాను దాని అందాలన్నింటిని పరికించి సుందరమైన ఆ పట్టణాన్ని చూస్తాడు. మానవుడు పాపమరణంలో పడిపోయినప్పటినుండి విశ్వాసులు దాని రాకడకొరకు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదిగో చివరకు రానేవచ్చింది! (రోమీయులు 8:19; 1 కొరింథీయులు 15:22, 23; హెబ్రీయులు 11:39, 40) అది 1,44,000 మంది యథార్థత, నమ్మకత్వం గలవారితో కట్టబడిన మహిమాన్విత ఆత్మీయపట్టణం, పరిశుద్ధతలో దేదీప్యమానమై యెహోవా మహిమను ప్రతిబింబిస్తుంది. ప్రకటనకు యిదే దివ్యమైన ముగింపు!

3. నూతన యెరూషలేము అందాన్ని యోహాను ఎలా వర్ణిస్తున్నాడు?

3 నూతన యెరూషలేము దాని అందంలో ఆశ్చర్యం గొల్పుతోంది: “దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మములమీద వ్రాయబడియున్నవి. తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణపు వైపున మూడు గుమ్మములు, పశ్చిమపువైపున మూడు గుమ్మము లున్నవి. ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైన గొఱ్ఱెపిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేళ్లు కనబడుచున్నవి.” (ప్రకటన 21:11బి-14) యోహాను ప్రప్రథమంగానే దేదీప్యమానమైన వెలుగును గూర్చి వ్రాయడమెంత యుక్తమోగదా! ధగధగమెరిసే క్రొత్త పెండ్లికూతురువలె, నూతన యెరూషలేము క్రీస్తుకొరకు చక్కని జతయౌతుంది. “జ్యోతిర్మయుడగు తండ్రి” సృష్టికి తగినట్టు అది ధగధగమెరుస్తుంది.—యాకోబు 1:17.

4. నూతన యెరూషలేము శరీరసంబంధమైన ఇశ్రాయేలు జనాంగం కాదని ఏది సూచిస్తుంది?

4దాని 12 గుమ్మములమీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాలవారి పేర్లు వ్రాయబడివున్నాయి. గనుక, యీ సాదృశ్యమైన పట్టణం “ఇశ్రాయేలు గోత్రములన్నింటినుండి” ముద్రింపబడిన 1,44,000 మందితో కూడినది. (ప్రకటన 7:4-8) దీనికనుగుణంగా, ఆ పునాదులమీద గొఱ్ఱెపిల్లయొక్క 12మంది అపొస్తలుల పేర్లు వ్రాయబడివున్నాయి. అవును, నూతన యెరూషలేము, యాకోబు 12 మంది కుమారులతో తయారైన శరీరసంబంధమైన ఇశ్రాయేలు జనాంగం కాదు. అది “అపొస్తలులు ప్రవక్తల”పై నిర్మించబడిన ఆత్మీయ ఇశ్రాయేలైయున్నది.—ఎఫెసీయులు 2:20.

5. నూతన యెరూషలేము “ఎత్తయిన గొప్ప ప్రాకారము,” మరియు ప్రతిగుమ్మము దగ్గర దేవదూతలు ఉండడం దేన్ని సూచిస్తున్నాయి?

5 ఆ సాదృశ్యమైన పట్టణానికి గొప్ప ప్రాకారమున్నది. ప్రాచీన కాలంలో, శత్రువులను రానివ్వకుండ భద్రతకొరకు పట్టణానికి ప్రాకారాలు కట్టేవారు. నూతన యెరూషలేముకు “ఎత్తయిన గొప్ప ప్రాకారము”న్నదంటే అది ఆత్మీయంగా భద్రంగా ఉందని అర్థం. నీతి విరోధిగాని, అపవిత్రుడు లేక అవినీతిపరుడుగాని, ఎన్నడూ అందులో ప్రవేశింపలేడు. (ప్రకటన 21:27) అయితే ప్రవేశం పొందినవారికి మాత్రం యీ అందమైన పట్టణములో ప్రవేశమొక పరదైసులోకి ప్రవేశించినట్లే ఉంటుంది. (ప్రకటన 2:7) ఆదామును వెళ్లగొట్టిన తర్వాత అసలు పరదైసులో ఆ తొలి అపవిత్రులు ప్రవేశించకుండ దానికి కెరూబులు కావలిగా ఉంచబడ్డారు. (ఆదికాండము 3:24) అలాగే, పట్టణపు ఆత్మీయభద్రత నిమిత్తం, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము ప్రవేశగుమ్మం దగ్గర దూతలను కావలివుంచారు. వాస్తవంగా, అంత్యకాలమంతా, నూతన యెరూషలేముగా తయారయ్యే అభిషక్త క్రైస్తవసంఘాన్ని బబులోను మాలిన్యంనుండి కాపాడడానికి దూతలను కావలియుంచారు.—మత్తయి 13:41.

పట్టణాన్ని కొలుచుట

6. యోహాను ఆ పట్టణపు కొలతను ఎలా వివరిస్తున్నాడు, మరి యీ కొలత దేన్ని సూచిస్తుంది? (బి) ‘అది మనుష్యుని కొలత, మరియు దూతకొలత’ అంటే ఆ కొలత దేన్ని సూచించవచ్చు? (అథఃస్సూచి చూడండి.)

6 యోహాను తన వృత్తాంతాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు: “ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వానియొద్ద బంగారు కొలకఱ్ఱ యుండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది; దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూటనలుబదినాలుగు మూరలైనది; ఆ కొలత దూతకొలతయే.” (ప్రకటన 21:15-17) ఆలయప్రాంగణం కొలవబడినప్పుడు, దాని విషయంలో యెహోవా సంకల్పాల నెరవేర్పును అది నిశ్చయపర్చేది. (ప్రకటన 11:1) ఇప్పుడు, దూత నూతన యెరూషలేమును కొలవడమనేది యీ మహిమగల పట్టణం విషయంలో యెహోవాయొక్క సంకల్పాలెలా మార్పులేనివో చూపిస్తుంది. *

7. ఆ పట్టణపు కొలతల ప్రత్యేకతేమిటి?

7 ఇదెంతటి చక్కని పట్టణం! అది 144 ఘనపుటడుగుల, లేక 210 అడుగుల ఎత్తయిన గోడతో చుట్టబడి, 12,000 ఫర్లాంగుల (1,380 మైళ్లు) వ్యాసంతోనున్న పరిపూర్ణ ఘనచదరము. నిజమైన ఏ పట్టణం అటువంటి కొలతలు కల్గివుండదు. అది ఆధునిక ఇశ్రాయేలు దేశంకంటె 14 రెట్లు పెద్దగా విస్తరించి వుంటుంది, మరియు సుమారు 350 మైళ్ల ఎత్తులో ఆకాశాన్నంటుతుంది. ప్రకటన సూచనలరూపంలో యివ్వబడింది. గనుక, ఈ కొలతలు నూతన యెరూషలేమునుగూర్చి మనకేమని చెబుతున్నాయి?

8. (ఎ) ఆ పట్టణపు ప్రాకారములు 144 ఘనపుటడుగుల ఎత్తు, (బి) పట్టణపు పొడవు 12,000 ఫర్లాంగులు, (సి) పట్టణాకారం చచ్చౌకంగా ఉండడం దేన్ని సూచిస్తుంది?

8 ఆ పట్టణం 1,44,000 మంది దేవుని ఆత్మీయ దత్తపుత్రులతో కట్టబడిందని ఆ 144 ఘనపుటడుగుల ఎత్తయిన గోడలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దాని పొడవు, వెడల్పు, ఎత్తు అన్నింటిలోనూ సమానంగా 12,000 ఫర్లాంగులున్న ఆ పట్టణంయొక్క కొలతలోని 12 అనే సంఖ్య, బైబిలు ప్రవచనంలోని సంస్థీకరణా ఏర్పాటునందు సాదృశ్యంగా ఉపయోగించబడింది. కావున, నూతన యెరూషలేము దేవుని నిత్యసంకల్పాన్ని నెరవేర్చడానికి అత్యద్భుతంగా తయారుచేయబడిన సంస్థాగత ఏర్పాటైవుంది. నూతన యెరూషలేము, రాజైన యేసుక్రీస్తుతోపాటు, యెహోవా యొక్క రాజ్యసంబంధమైన సంస్థయైయున్నది. ఇకపోతే పట్టణపు ఆకారమొకటుంది: అదొక చచ్చౌకము. సొలొమోను దేవాలయంలో, యెహోవా ప్రత్యక్షతను సాదృశ్యంగా సూచించే అతిపరిశుద్ధ స్థలం పరిపూర్ణ చతురస్ర ఆకారంలో ఉండేది. (1 రాజులు 6:19, 20) గనుక, యెహోవా మహిమతో మెరయుచున్న నూతన యెరూషలేము పరిపూర్ణమైన పెద్ద చతురస్ర ఆకారంలో ఉండడం ఎంత యుక్తం! దాని కొలతలన్నీ సమానంగా ఉన్నాయి. అది వంకరటింకరలులేని లేక అడ్డదిడ్డాలులేని పట్టణం.—ప్రకటన 21:22.

ప్రశస్తమైన నిర్మాణవస్తువులు

9. ఆ పట్టణపు నిర్మాణవస్తువుల్ని యోహాను ఎలా వర్ణిస్తున్నాడు?

9 యోహాను తన వర్ణనను యిలా కొనసాగిస్తున్నాడు: “ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదియవది సువర్ణల శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము. దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు, ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధసువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.”—ప్రకటన 21:18-21.

10. ఆ పట్టణం సూర్యకాంతం, సువర్ణం, మరియు “అమూల్యమైన నానావిధ రత్నములతో” కట్టబడినదనే వాస్తవం దేన్ని తెల్పుతుంది?

10 ఆ పట్టణ నిర్మాణం నిజంగా మనోహరం. భూసంబంధమైన, మట్టి లేక రాయివంటి వస్తువులకు బదులు మనం సూర్యకాంతం, శుద్ధసువర్ణం, మరియు “అమూల్యమైన నానావిధ రత్నములతో” అని చదువుతాము. ఇవి పరలోక సంబంధమైన నిర్మాణ వస్తువులను ఎంతచక్కగా వర్ణిస్తున్నాయి! అంతకంటె ఘనమైనదేమీ ఉండదు. పూర్వం నిబంధనా మందసం శుద్ధమైన సువర్ణంతో పొదగబడియుండేది, మరి బైబిల్లో యిది శ్రేష్టమైన, విలువైనవాటిని సూచించడానికి ఉపయోగించబడింది. (నిర్గమకాండము 25:11; సామెతలు 25:11; యెషయా 60:6, 17) అయితే నూతన యెరూషలేమంతా, దాని రాజవీధికూడ, ఊహకందని విస్మయంగొల్పే విలువను అందాన్ని సూచించే, “శుద్ధసువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికము”తో కట్టబడింది.

11. నూతన యెరూషలేము సభ్యులు అత్యుత్తమ ఆత్మీయ పవిత్రతతో వెలిగిపోతారని ఏది నిశ్చయపరుస్తుంది?

11 ఏ మానవ స్వర్ణకారుడు కూడ అటువంటి స్వచ్ఛమైన సువర్ణమును తయారుచేయలేడు. అయితే యెహోవా మహాగొప్ప స్వర్ణకారుడు. ఆయన “వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు” కూర్చునియుండును, ఆయన ఆత్మీయ ఇశ్రాయేలీయులలో నమ్మకమైన వారిని “వెండిబంగారములను” నిర్మలము చేయురీతిగా ప్రతివ్యక్తిని శుద్ధీకరించి, వారిలోనుండి సమస్త కల్మషమును తీసివేస్తాడు. శుభ్రపరచబడి, శుద్ధీకరించబడిన వారు మాత్రమే చివరకు నూతన యెరూషలేముగా తయారౌతారు, మరి యీ విధంగా యెహోవా ఆత్మీయ పరిశుద్ధతతో అత్యంత శ్రేష్టంగా మెరిసే సజీవమైన నిర్మాణ వస్తువులతో ఆ పట్టణాన్ని కడుతున్నాడు.—మలాకీ 3:3, 4.

12. (ఎ) ఆ పట్టణపు పునాదులు 12 ప్రశస్తమైన రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి, (బి) ఆ పట్టణానికి ముత్యాల గుమ్మములు ఉన్నాయనే వాస్తవం దేన్ని సూచిస్తుంది?

12 పట్టణపు పునాదులుకూడ 12 ప్రశస్తమైన రత్నాలతో అలంకరింపబడి అందంగా ఉన్నాయి. ఇచ్చట వర్ణించబడిన వాటివలెనున్న 12 ప్రశస్తమైన వివిధ రాళ్లతో పొదిగిన ఏఫోదును పండుగ సమయాలలో ధరించిన పురాతనకాల యూదా ప్రధాన యాజకుని యిది జ్ఞాపకం చేస్తుంది. (నిర్గమకాండము 28:15-21) ఇది నిశ్చయంగా అనుకోని సంఘటనేమీకాదు. కానీ, అది నూతన యెరూషలేము యొక్క యాజకధర్మాన్ని నొక్కితెల్పుతుంది, దానికి గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు “దీపము.” (ప్రకటన 20:6; 21:23; హెబ్రీయులు 8:1) మరియు, నూతన యెరూషలేము ద్వారానే మానవులకు యేసు ప్రధాన యాజక ధర్మపు ప్రయోజనాలు అనుగ్రహించబడతాయి. (ప్రకటన 22:1, 2) ఆ పట్టణపు 12 గుమ్మములు ప్రతిదీ ఒక ముత్యముతో అలంకరించబడెననే విషయం, యేసు రాజ్యమును విలువైన ముత్యముతో పోల్చిన ఉపమానమును జ్ఞాపకానికి తెస్తుంది. ఆ గుమ్మములద్వారా ప్రవేశించే వారంతా ఆత్మీయ విలువలను అభినందిస్తున్నారని చూపిస్తున్నారు.—మత్తయి 13:45, 46; యోబు 28:12, 17, 18 పోల్చండి.

ప్రకాశించే పట్టణము

13. నూతన యెరూషలేమును గూర్చి యోహాను తర్వాత ఏమని చెబుతున్నాడు, మరి ఆ పట్టణానికి అక్షరార్థమైన దేవాలయమెందుకు అవసరం లేదు?

13 సొలొమోను కాలంలో, పట్టణానికి అత్యంత ఎత్తుగా మొరియా పర్వతంపై ఉత్తరాన నిర్మించబడిన దేవాలయం మూలంగానే యెరూషలేముకు ప్రాధాన్యతవచ్చింది. అయితే నూతన యెరూషలేము విషయమేమిటి? యోహాను యిలా చెబుతున్నాడు: “దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును (యెహోవా NW) గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది; గొఱ్ఱెపిల్లయే దానికి దీపము.” (ప్రకటన 21:22, 23) నిజానికి, ఇక్కడ అక్షరార్థమైన దేవాలయము నిర్మించవలసిన అవసరంలేదు. పురాతన యూదుల దేవాలయం ఒక సాదృశ్యంగా మాత్రమే ఉండేది, దాని నిజస్వరూపం అంటే గొప్ప ఆత్మీయ దేవాలయం సా.శ. 29 లో యెహోవా యేసును ప్రధాన యాజకునిగా అభిషేకించినప్పటినుండి ఆరంభమైంది. (మత్తయి 3:16, 17; హెబ్రీయులు 9:11, 12, 23, 24) ఒక దేవాలయం ప్రజల తరపున యెహోవాకు బలులర్పించే ఒక యాజక తరగతిని కూడ తాత్కాలికంగా కల్గివుంటుంది. అయితే నూతన యెరూషలేము సభ్యులంతా యాజకులే. (ప్రకటన 20:6) మరియు గొప్ప బలియాగము, యేసు పరిపూర్ణ మానవ జీవితము, ఒక్కసారే అర్పించబడింది. (హెబ్రీయులు 9:27, 28) అంతేగాక, ఆ పట్టణంలో నివసించే ప్రతివ్యక్తికి యెహోవా స్వయంగా అందుబాటులో ఉంటాడు.

14. (ఎ) నూతన యెరూషలేమునకు వెలుగివ్వడానికి సూర్యచంద్రులెందుకు అక్కర్లేదు? (బి) యెహోవా సార్వత్రిక సంస్థను గూర్చి యెషయా ప్రవచనం ఏమని ప్రవచించింది, మరి నూతన యెరూషలేము ఎలా యిందులో యిమిడివుంది?

14 సీనాయి పర్వతంమీద యెహోవా మహిమ మోషేను దాటిపోయినప్పుడు, మోషే ముఖం ఎంతగా ప్రకాశించిందంటే ఆయన తోటి ఇశ్రాయేలీయులనుండి తన ముఖాన్ని కప్పుకోవలసివచ్చింది. (నిర్గమకాండము 34:4-7, 29, 30, 33) మరైతే, యెహోవా మహిమతోనే శాశ్వతంగా ప్రకాశించే పట్టణపు వెలుగునుగూర్చి మీరూహించగలరా? అటువంటి పట్టణానికి రాత్రియనేదే ఉండదు. దానికి నిజమైన సూర్యచంద్రుల అవసరత ఉండదు. అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే వుంటుంది. (1 తిమోతి 6:16 పోల్చండి.) నూతన యెరూషలేము అటువంటి దేదీప్యమానమైన వెలుగుతో నిండివున్నది. వాస్తవంగా, యీ పెండ్లికుమార్తె, మరియు ఆమె భర్తయైన రాజు, యెహోవాయొక్క సార్వత్రిక సంస్థకు, అంటే ఆయన “స్త్రీ”కి, “పైనున్న యెరూషలేము”కు, ముఖ్యపట్టణమై ఉంటారు. దాన్నిగూర్చి యెషయా యిలా ప్రవచించాడు: “ఇకమీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు. నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖదినములు సమాప్తములగును.”—యెషయా 60:1, 19, 20; గలతీయులు 4:26.

జనములకు వెలుగు

15. నూతన యెరూషలేమును గూర్చి ప్రకటనలోని ఏ మాటలు యెషయా ప్రవచనంలాగా ఉన్నాయి?

15 ఇదే ప్రవచనము యిలా కూడ ప్రవచించింది: “జనములు నీ వెలుగునకు వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.” (యెషయా 60:3) ఈ మాటలలో నూతన యెరూషలేము చేరియున్నదని ప్రకటన తెల్పుతుంది. “జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొనివచ్చెదరు.”—ప్రకటన 21:24-26.

16. నూతన యెరూషలేము వెలుగులో నడుచుకొనే “జనములు” ఎవరు?

16 నూతన యెరూషలేము వెలుగులో నడుచుకొనే యీ జనములెవరు? వీరు ఒకనాడు యీ దుష్టప్రపంచంలోని ప్రజలలో భాగస్థులై, ఆ పరలోక పట్టణం ప్రసరింపజేసిన ప్రకాశమునకు ప్రతిస్పందించిన ప్రజలైయున్నారు. వారిలో ప్రముఖులెవరంటే, “ప్రతిజనములోనుండియు, ప్రతివంశములోనుండియు, ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలోనుండియు” యిప్పటికే బయటికివచ్చి, యోహాను తరగతితో కలిసి రాత్రింబగళ్లు దేవున్ని ఆరాధించేవారు. (ప్రకటన 7:9, 15) నూతన యెరూషలేము పరలోకంనుండి దిగివచ్చిన తర్వాత, మరియు యేసు మృతులను పునరుత్థానం చేయడానికి మరణం, మృతులలోకం (హేడీస్‌) తాళపుచెవులను ఉపయోగించిన పిదప, తొలుత “జనముల”నుండి వచ్చి యెహోవాను, నూతన యెరూషలేము యొక్క గొఱ్ఱెవంటి భర్తయైన ఆయన కుమారుని ప్రేమించే లక్షలాదిమంది వారికి తోడౌతారు.—ప్రకటన 1:18.

17. నూతన యెరూషలేములోనికి “తమ మహిమను తెచ్చు” “భూరాజులు” ఎవరు?

17 మరి “తమ మహిమను దానిలోనికి తీసికొని” వచ్చే “భూరాజులు” ఎవరు? వారు ఒక గుంపుగానున్న భూరాజులుకారు, ఎందుకంటె, వారు అర్మగిద్దోనులో దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి నాశనమౌతారు. (ప్రకటన 16:14, 16; 19:17, 18) జనములలో ఉన్నతపదవుల నలంకరించి గొప్పసమూహంలో భాగమైన వారా యీ రాజులు, లేక నూతన లోకంలో దేవుని రాజ్యానికి విధేయులయ్యే పునరుత్థానం పొందే రాజులా? (మత్తయి 12:42) కానేకాదు, ఎందుకంటే ఎక్కువభాగం, అటువంటి రాజుల మహిమ లౌకికమయినది, అదెప్పుడో కనుమరుగైంది. గనుక, నూతన యెరూషలేములోనికి తమ మహిమను తెచ్చే “భూరాజులు” తప్పక 1,44,000 మందియై ఉంటారు, వీరు గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తుతోపాటు రాజులుగా పరిపాలించడానికి ‘ప్రతి వంశం, ఆయా భాషలు మాటలాడు వారు, ప్రతిప్రజ, ప్రతి జనములోనుండి కొనబడినవారు.’ (ప్రకటన 5:9, 10; 22:5) ఆ పట్టణపు వెలుగు మరింత ప్రకాశించడానికి తమకు దేవుడనుగ్రహించిన మహిమను వారందులోనికి తెస్తారు.

18. (ఎ) నూతన యెరూషలేములోనికి ప్రవేశమెవరికుండదు? (బి) ఆ పట్టణంలోనికి ఎవరు మాత్రమే ప్రవేశం పొందుతారు?

18 యోహాను యింకా చెబుతున్నాడు: “గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైన దానిని అబద్ధమైనదానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.” (ప్రకటన 21:27) సాతాను విధానంవల్ల మలినమైన దేదియు నూతన యెరూషలేములో భాగమై యుండనేరదు. దాని ద్వారములు శాశ్వతంగా తెరువబడియున్ననూ, “అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడునూ” ప్రవేశించడానికి అనుమతించబడడు. ఆ పట్టణంలో మతభ్రష్టులుగాని, మహాబబులోను సభ్యులు గాని ఉండరు. భూమ్మీద యింకనూ మిగిలియున్న దాని బావి సభ్యులను పాడుచేయడంద్వారా దాన్ని అపవిత్రపర్చాలని ఎవరైనా ప్రయత్నిస్తే, వారి ప్రయత్నాలు ఫలించవు. (మత్తయి 13:41-43) చివరకు “గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన” 1,44,000 మంది మాత్రమే నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు. *ప్రకటన 13:8; దానియేలు 12:3.

జీవజలముల నది

19. (ఎ) నూతన యెరూషలేము మానవజాతికి దీవెనల ననుగ్రహించే మార్గమని యోహాను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) “జీవజలముల నది” ఎప్పుడు ప్రవహించడాని కారంభిస్తుంది, అది మనకెలా తెలుసు?

19 దేదీప్యమానమైన నూతన యెరూషలేము భూమ్మీదనున్న మానవజాతికి గొప్ప ఆశీర్వాదాల నందిస్తుంది. ఇదే యోహాను తదుపరి తెలుసుకుంటున్నాడు: “మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను.” (ప్రకటన 22:1, 2ఎ) ఈ “నది” ఎప్పటినుండి ప్రవహిస్తుంది? అది “దేవుని యొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునుండి” వస్తున్నందున, అది 1914 లో ప్రభువు దినము ప్రారంభమైన తర్వాతనుండి మాత్రమే ప్రవహిస్తుంది. ఏడవ దూత బూర ఊది గొప్ప శబ్దంతో యిలా ప్రకటించడానికి సమయమదే “ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.” (ప్రకటన 11:15; 12:10) ఆ తేదీకిముందు “గొఱ్ఱెపిల్ల” మెస్సీయ రాజుగా చేయబడలేదు. అంతేగాక, ఆ నది నూతన యెరూషలేము యొక్క రాజవీధిమధ్యనుండి ప్రవహిస్తున్నందున, నూతన యెరూషలేము ‘దేవునియొద్దనుండి దిగివచ్చి’నప్పుడు, సాతాను లోకం నాశనమైన తర్వాతనే ఆ దర్శనపు నెరవేర్పు జరుగుతుంది.—ప్రకటన 21:2.

20. కొంత జీవజలం యిప్పటికే అందుబాటులో ఉందని ఏది సూచిస్తుంది?

20 మానవజాతికి జీవజలములనిచ్చేది యిది మొదటిసారేమీ కాదు. యేసు భూమ్మీదనున్నప్పుడు, ఆయన నిత్యజీవాన్నిచ్చే నీళ్లనుగూర్చి మాట్లాడాడు. (యోహాను 4:10-14; 7:37, 38) ఇంకా యోహాను ప్రేమపూర్వక ఆహ్వానాన్ని విననైయున్నాడు: “ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:17) ఇప్పటికే జీవజలము కొంతవరకు లభ్యమౌతున్నాయని సూచించే ఆహ్వానం యిప్పుడుకూడ ప్రకటింప బడుతోంది. అయితే నూతనలోకంలో, నిజమైన నదివలె ఆ జలములు దేవుని సింహాసనమునుండి నూతన యెరూషలేము ద్వారా ప్రవహిస్తాయి.

21. “జీవజలముల నది” దేన్ని సూచిస్తుంది, మరి యెహెజ్కేలు దర్శనంలోని యీ నది దీన్ని అర్థం చేసుకోవడానికెలా మనకు సహాయపడుతుంది?

21 ఈ “జీవజలముల నది” ఏమిటి? నిజమైన నీళ్లు జీవానికాధారం. ఆహారం లేకుండా ఒకడు వారాలతరబడి బ్రతకవచ్చు, గాని నీళ్లులేకుంటే సుమారు ఓ వారంలోనే చనిపోతాడు. నీళ్లు శుద్ధీకరణ ఉపకరణంగా పనిచేస్తాయి, మరి ఆరోగ్యానికి అవసరమైనవే. అలాగున, జీవజలాలు మానవజాతి జీవనారోగ్యాలకు అగత్యమని సూచిస్తున్నాయి. ప్రవక్తయైన యెహెజ్కేలుకు యీ జీవజలముల నది”ని గూర్చిన దర్శనమనుగ్రహించ బడింది, ఆయన చూసిన దర్శనంలో ఆ నది యెరూషలేములోని దేవాలయమునుండి మృతసముద్రము లోనికి ప్రవహించింది. అప్పుడు అత్యద్భుతం జరిగింది! ఆ నిర్జీవమైన, రసాయనాలతో కలుషితమైన జలాలు విస్తారమైన చేపలతో నిండిన స్వచ్ఛమైన నీళ్లుగా మారిపోయాయి! (యెహెజ్కేలు 47:1-12) అవును, దర్శనరూపకమైన నది గతంలో మృతమైన దాన్ని మరల బ్రతికిస్తుంది, అంటే జీవజలముల నది “మృత”మైన మానవజాతికి పరిపూర్ణ మానవజీవితాన్ని పునరుద్ధరించడానికి యేసుక్రీస్తుద్వారా చేయబడే దేవుని ఏర్పాటును సూచిస్తుందనే విషయాన్ని రూఢిచేస్తుంది. ఈ నది “స్ఫటికమువలె స్వచ్ఛముగా” ఉన్నది, దేవుని దీవెనలయొక్క పరిశుద్ధతను పవిత్రతను సూచిస్తుంది. అది రక్తంతో మరకలైన, మరణకరమగు క్రైస్తవ సామ్రాజ్యపు “జలముల”వలె లేదు.—ప్రకటన 8:10, 11.

22. (ఎ) ఆ నది ఎక్కడ ప్రారంభమౌతుంది, అదెందుకు యుక్తము? (బి) జీవజలములో ఏమి యిమిడివుంది, ఈ సాదృశ్యమైన నదిలో ఏమికూడ చేరివుంది?

22 ఆ నది “దేవుని యొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునుండి” బయలుదేరుతుంది. ఇది యుక్తమే, ఎందుకంటె జీవాన్నిచ్చే యెహోవా ఏర్పాట్లకు విమోచనా క్రయధనమే ఆధారం. ఎందుచేతనంటే, యెహోవా “లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) జీవజలములో దేవునివాక్యంకూడ యిమిడివుంది, బైబిల్లో ఆ వాక్యం జలమని పిలువబడింది. (ఎఫెసీయులు 5:26) అయిననూ, జీవజలముల నదిలో సత్యం మాత్రమేగాక, యేసు బలి ఆధారంగా మానవులను పాపమరణాలనుండి విడిపించి, నిత్యజీవాన్ని అనుగ్రహించడానికి యెహోవాచేసే యితర ఏర్పాట్లన్నీ చేరివున్నాయి.—యోహాను 1:29; 1 యోహాను 2:1, 2.

23. (ఎ) ఆ జీవజలముల నది నూతన యెరూషలేము యొక్క రాజవీధిగుండా ప్రవహించడమెందుకు సరియైయున్నది? (బి) జీవజలం విస్తారంగా ప్రవహించినప్పుడు దేవుడు అబ్రాహాముకు చేసిన ఏ వాగ్దానం నెరవేరుతుంది?

23 వెయ్యేండ్లకాలంలో, యేసు మరియు ఆయన 1,44,000 మంది ఉపయాజకుల యాజకధర్మం ద్వారా ఆ బలివిలువ సంపూర్ణంగా వర్తింపజేయబడుతుంది. అందుకనే, జీవజలముల నది నూతన యెరూషలేము యొక్క రాజవీధిగుండా ప్రవహిస్తోంది. యేసు, ఆత్మీయ ఇశ్రాయేలు కలిసి అబ్రాహాము సంతానమౌతున్నారు. (గలతీయులు 3:16, 29) అందుచేత, జీవజలములు సాదృశ్యమైన పట్టణపు రాజవీధిగుండా విస్తారంగా ప్రవహించినప్పుడు, అబ్రాహాము సంతానముద్వారా “భూలోకములోని జనములన్నియు” తమనుతాము ఆశీర్వదించుకునే సంపూర్ణావకాశాన్ని పొందుతాయి.—ఆదికాండము 22:17, 18.

జీవవృక్షములు

24. యోహానిప్పుడు జీవజలాల నదికిరువైపులా ఏం చూస్తున్నాడు, అవి దేన్ని సూచిస్తున్నాయి?

24 యెహెజ్కేలు దర్శనంలో, నది ఫలభరితమాయెను, దానికిరువైపుల సకలజాతి వృక్షాలు పెరుగుచున్నట్లు ఆ ప్రవక్త చూశాడు. (యెహెజ్కేలు 47:12) అయితే యోహాను ఏమి చూస్తున్నాడు? ఇది: “ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షములుండెను; అవి నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షములయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును.” (ప్రకటన 22:2బి NW) ఈ ‘జీవవృక్షములు’ కూడ విధేయులైన మానవజాతికి నిత్యజీవమివ్వడానికి చేసే యెహోవా ఏర్పాట్లలో కొంతభాగాన్ని సూచిస్తాయి.

25. భూమియంతటనున్న పరదైసులో స్పందించే మానవజాతికి యెహోవా ఎటువంటి సమృద్ధిగల ఏర్పాటు చేస్తాడు?

25 స్పందించే మానవులకు యెహోవా ఎంత సమృద్ధిగల ఏర్పాటు చేస్తున్నాడు! వారా సేదదీర్చే నీళ్లను సేవించడమే గాకుండా, ఆహారం నిమిత్తం ఆ వృక్షాలనుండి ఫలాలనుకూడ కోసుకుంటారు. ఆహా, మన ఆది తలిదండ్రులు ఏదెనులోని పరదైసునందు అటువంటి “రమ్యమైన” ఏర్పాటుతో సంతృప్తిపడివుంటే ఎంత బాగుండేదో! (ఆదికాండము 2:9) అయితే యిప్పుడు భూదిగంతాలవరకు యిక్కడ పరదైసు ఉంది, మరియు ఆ సాదృశ్యమైన వృక్షాల ఆకులనుండి “జనములను స్వస్థపరచు” * ఏర్పాట్లుకూడ యెహోవా చేస్తున్నాడు. ఈనాడు యివ్వబడుతున్న మూలికలు లేక యితర మందుకంటెను ఎంతో ఉన్నతమైన యీ సాదృశ్యమగు ఆకుల సున్నితమైన వైద్యం విశ్వాసులైన మానవజాతిని ఆత్మీయంగాను శారీరకంగాను పరిపూర్ణులను చేస్తుంది.

26. జీవవృక్షాలు దేనిని కూడ సూచిస్తాయి, ఎందుకు?

26 నదిలోని నీళ్లను పీల్చుకున్న ఆ వృక్షాలు గొఱ్ఱెపిల్ల భార్యకు సంబంధించిన 1,44,000 మంది సభ్యులను సూచించవచ్చును. భూమ్మీదనున్నప్పుడు వీరుకూడ యేసుక్రీస్తుద్వారా దేవుడనుగ్రహించే జీవజలాన్ని సేవిస్తారు, మరియు “నీతి అను మస్తకి వృక్షములు” అని పిలువబడతారు. (యెషయా 61:1-3; ప్రకటన 21:6) వారిప్పటికే యెహోవా మహిమార్థమై ఎంతో ఆత్మీయ ఫలాన్ని ఫలించారు. (మత్తయి 21:43) మరి వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, పాపమరణాలనుండి “జనములను స్వస్థపరచుటకై” ఉపయోగపడు విమోచనా ఏర్పాట్లను అందించడంలో భాగం వహిస్తారు.—1 యోహాను 1:7 పోల్చండి.

రాత్రి యిక ఉండదు

27. నూతన యెరూషలేములోనికి ప్రవేశాధిక్యతగల వారికి యింకే దీవెనలుంటాయని యోహాను తెల్పుతున్నాడు, మరి “శాపగ్రస్తమైన దేదియు అందులో ఉండదు” అని ఎందుకు చెప్పబడింది?

27 నూతన యెరూషలేములోనికి ప్రవేశం వాస్తవమే. అంతకన్నా ఆశ్చర్యకరమగు ఆధిక్యత వేరొకటి ఉండజాలదు! ఒకప్పుడు దీనులై, అసంపూర్ణతగల మానవులు అటువంటి మహిమగల ఏర్పాటునందు భాగంవహించడానికి యేసుతోపాటు పరలోకానికి వెళ్లడాన్ని గూర్చి కొంచెం ఆలోచించండి! (యోహాను 14:2) వీరు అనుభవించబోయే ఆశీర్వాదాలను గూర్చి యోహాను స్వల్పంగా యిలా చెబుతున్నాడు: “ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.” (ప్రకటన 22:3, 4) ఇశ్రాయేలీయుల యాజకధర్మము చెడిపోయినప్పుడు అది యెహోవాచేత శపించబడింది. (మలాకీ 2:2) ద్రోహియైన యెరూషలేము యొక్క “ఇల్లు” విడువబడిందని యేసు ప్రకటించాడు. (మత్తయి 23:37-39) అయితే నూతన యెరూషలేములో “శాపగ్రస్తమైన దేదియు ఉండదు.” (జెకర్యా 14:11 పోల్చండి.) దాని నివాసులంతా యీ భూమ్మీద శ్రమలనే అగ్నిలో పరీక్షింపబడ్డారు, విజయులైనందున వారు ‘వాడబారని అమర్త్యాన్ని ధరించు’ కొనియుంటారు. యెహోవా యేసును ఎరిగియున్నట్లే, వారు ఎన్నటికి పడిపోరని ఆయనకు తెలుసు. (1 కొరింథీయులు 15:53, 57) అంతేకాక, ఆ పట్టణపు స్థానం నిత్యం భద్రంగా ఉండులాగున అక్కడ “దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము”లు ఉంటాయి.

28. నూతన యెరూషలేము సభ్యుల నొసళ్లమీద దేవుని పేరెందుకు వ్రాయబడివుంటుంది, వారికే మహోజ్వల భవిష్యత్తున్నది?

28 యోహానువలె, ఆ పరలోక పట్టణపు సభ్యులంతా దేవుని “దాసులు.” ఆ కారణంచేత, ఆయన వారి యజమానుడని గుర్తించేలాగున దేవుని నామము వారినొసళ్లపై స్పష్టంగా వ్రాయబడివుంది. (ప్రకటన 1:1; 3:12) నూతన యెరూషలేము సభ్యులుగా వారాయనకు పవిత్రసేవ చేయడం ఓ అమూల్యమైన ఆధిక్యతగా పరిగణిస్తారు. యేసు భూమ్మీదనున్నప్పుడు ఆ బావి పరిపాలకులకు ఆశ్చర్యకరమగు వాగ్దానం చేస్తూ యిలా చెప్పాడు: “హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.” (మత్తయి 5:8) ఈ దాసులు యెహోవాను ప్రత్యక్షంగా చూస్తూ ఆరాధించడానికి ఎంతానందిస్తారో!

29. పరలోక యెరూషలేమునకు “రాత్రి యిక నెన్నడు ఉండదు” అని యోహాను ఎందుకు చెబుతున్నాడు?

29 యోహాను యింకా చెబుతున్నాడు: “రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్యకాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే (యెహోవా NW) వారిమీద ప్రకాశించును.” (ప్రకటన 22:5ఎ) భూమ్మీదనున్న ఏ యితర పట్టణం మాదిరే, ప్రాచీన యెరూషలేము వెలుగుకొరకు పగటివేళ సూర్యునిపైన, రాత్రివేళ చంద్రునిపైన, మరియు కృత్రిమ వెలుగుపైన ఆధారపడింది. అయితే పరలోక యెరూషలేమునకు అటువంటి వెలుగు అక్కర్లేదు. ఆ పట్టణం యెహోవాతోనే వెలుగుమయమౌతుంది. “రాత్రి” అనే మాట అలంకార రూపంలోకూడ అంటే వ్యతిరేకతను లేక యెహోవానుండి వేరగుటను సూచించడానికి ఉపయోగించవచ్చు. (మీకా 3:6; యోహాను 9:4; రోమీయులు 13:11, 12) మహిమాన్వితుడు, దేదీప్యమాన్యుడగు సర్వోన్నత దేవుని యెదుట అటువంటి రాత్రియంటూ ఎన్నడూ ఉండదు.

30. యోహాను ఆ మహిమాన్విత దర్శనాన్నెలా ముగిస్తున్నాడు, ప్రకటన మనకు దేన్నిగూర్చి నిశ్చయపరుస్తుంది?

30 యోహాను, దేవుని యీ సేవకులనుగూర్చి యిలా చెబుతూ యీ మహిమాన్విత దర్శనాన్ని ముగిస్తున్నాడు: “వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.” (ప్రకటన 22:5బి) నిజమే, వెయ్యేండ్ల అనంతరం విమోచనా విలువలు సంపూర్ణంగా వర్తింపజేయ బడతాయి, మరి యేసు పరిపూర్ణులుగా చేయబడిన మానవజాతిని తన తండ్రికి అప్పగిస్తాడు. (1 కొరింథీయులు 15:25-28) ఆ తర్వాత యేసు మరియు 1,44,000 మంది కొరకు యెహోవా మనస్సులో ఏముందో మనకు తెలియదు. అయితే ప్రకటన యిచ్చే అభయమేమంటే, యెహోవాకు వారు చేసే ఆధిక్యతతోకూడిన వారి పవిత్రమైన సేవ యుగయుగాలు కొనసాగుతుంది.

ప్రకటన యొక్క సంతోషకరమైన ముగింపు

31. (ఎ) నూతన యెరూషలేము దర్శనంతో ఏది ముగుస్తుంది? (బి) నమ్మకమైన యితర మానవజాతికొరకు నూతన యెరూషలేము దేనిని నెరవేర్చింది?

31 గొఱ్ఱెపిల్ల భార్యయైన నూతన యెరూషలేముకు సంబంధించిన యీ దర్శనాన్ని గుర్తించడం ప్రకటన సూచించే సంతోషకరమగు ముగింపు, అది సమంజసమే. ఆ గ్రంథము తొలుత ఉద్దేశించి వ్రాయబడిన యోహాను మొదటి శతాబ్దపు తోటి క్రైస్తవులందరూ యేసుక్రీస్తుతోపాటు అమర్త్యులైన ఆత్మీయ సహపాలకులుగా ఆ పట్టణంలో ప్రవేశించాలని నిరీక్షించారు. ఇప్పటికీ భూమ్మీద జీవిస్తున్న అభిషక్త క్రైస్తవులలో శేషమునకు అదే నిరీక్షణవుంది. సంపూర్తి చేయబడిన పెండ్లికుమార్తె గొఱ్ఱెపిల్లతో చేరిపోగా, ప్రకటన ఆ విధంగా దాని మహత్తర ముగింపుకొస్తుంది. తదుపరి, నమ్మకమైన మానవులంతా తుదకు నిత్యజీవం పొందులాగున నూతన యెరూషలేము ద్వారా మానవజాతికి యేసు విమోచనాబలి విలువలు వర్తింపజేయబడతాయి. ఈ విధంగా పెండ్లికుమార్తెయగు నూతన యెరూషలేము, తన పెండ్లికుమారుడైన రాజుకు రాజసహకారిణిగా, మన సర్వాధిపతియగు ప్రభువైన యెహోవా మహిమార్థమై, నిత్యముండు నీతియుక్తమైన నూతన భూమిని నిర్మించడంలో తోడ్పడుతుంది.—మత్తయి 20:28; యోహాను 10:10, 16; రోమీయులు 16:27.

32, 33. ప్రకటననుండి మనమేమి నేర్చుకున్నాం, మన హృదయపూర్వక ప్రతిస్పందన ఏమైయుండాలి?

32 గనుక, మనం ప్రకటన గ్రంథ పరిశీలనా ముగింపుకు వస్తుండగా మనకెంత ఆనందంగా ఉంటుందో! సాతాను అతని సంతానపు చివరి ప్రయత్నాలు పూర్తిగా భంగం కావడం, యెహోవా న్యాయతీర్పులు పూర్తిగా అమలు జరగడం మనం చూశాము. మహాబబులోను, దాని తర్వాత సాతాను లోకంలోని నిష్ప్రయోజనకరమైన దుష్టశక్తులన్నీ నిరంతరం లేకుండా తుడిచి వేయబడాలి. సాతాను అతని దయ్యాలు అగాధంలో వేయబడి ఆ తర్వాత నాశనం చేయబడతారు. నూతన యెరూషలేము క్రీస్తుతోపాటు పరలోకంనుండి పరిపాలిస్తుంది, పునరుత్థానం, తీర్పు జరుగుతూ ఉంటుంది, పరిపూర్ణులుగా చేయబడిన మానవజాతి చివరకు పరదైసు భూమిలో నిత్యజీవం పొందుతుంది. ప్రకటన యీ విషయాలను ఎంత చక్కగా వివరిస్తుంది! ఈనాడు భూమ్మీద ‘ప్రతిజనానికి, వంశానికి, ఆయా భాషలు మాట్లాడేవారికి, ప్రజలకు నిత్యసువార్తను ప్రకటించడానికి’ అది మనలనెలా ప్రోత్సహిస్తుందో! (ప్రకటన 14:6, 7) ఈ గొప్పపనిలో పూర్ణంగా భాగం వహించడానికి మిమ్మును మీరు వినియోగించు కుంటున్నారా?

33 ఎంతో కృతజ్ఞతతో నిండిన మన హృదయాలతో, ప్రకటన ముగింపు మాటలకు మనం అవధానమిద్దాము.

[అధస్సూచీలు]

^ పేరా 6 ఆ కొలత “మనుష్యుని కొలత . . . దూత కొలత” అంటే బహుశ ఆ పట్టణంయొక్క 1,44,000 మంది సభ్యులు మొదట మానవులైయుండి, తర్వాత దూతలవంటి ఆత్మీయ ప్రాణులయ్యారనే వాస్తవాన్ని సూచిస్తుంది.

^ పేరా 18 గమనించండి, “గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథములో” 1,44,000 మంది ఆత్మీయ ఇశ్రాయేలీయుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ విధంగా అది భూమ్మీద జీవాన్ని పొందే వారిపేర్లున్న “జీవగ్రంథము”నకు వేరైయున్నది.—ప్రకటన 20:12.

^ పేరా 25 “జనములు” అనే మాట తరచూ ఆత్మీయ ఇశ్రాయేలీయులు కాని వారిని సూచిస్తుందని గమనించండి. (ప్రకటన 7:9; 15:4; 20:3; 21:24, 26) ఇక్కడుపయోగించబడే యీ మాట, వెయ్యేండ్లకాలంలో మానవజాతి ప్రత్యేకమైన జాతులుగా విభాగించబడుతూనే ఉంటారనే భావాన్ని స్ఫురింపజేయడంలేదు.

[అధ్యయన ప్రశ్నలు]