కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ఇశ్రాయేలును ముద్రించుట

దేవుని ఇశ్రాయేలును ముద్రించుట

అధ్యాయం 19

దేవుని ఇశ్రాయేలును ముద్రించుట

దర్శనము 4—ప్రకటన 7:1-17

అంశం: 1,44,000 మంది ముద్రింపబడ్డారు, ఒక గొప్ప సమూహం యెహోవా దేవునియెదుట, గొఱ్ఱెపిల్లయెదుట నిలువబడినట్లు వున్నారు

నెరవేర్పు కాలం: క్రీస్తుయేసు 1914 లో సింహాసనాసీనుడై నప్పటినుండి ఆయన వెయ్యేండ్ల పరిపాలనవరకు

1. దేవుని మహా ఉగ్రత దినమునకు “తాళజాలిన వాడెవడు”?

“దానికి తాళజాలిన వాడెవడు?” (ప్రకటన 6:17) అవును, నిజంగా ఎవరు తాళగలరు? దేవుని ఉగ్రతాదినము సాతాను విధానాన్ని నిర్మూలించినప్పుడు, పరిపాలకులు, ప్రపంచ ప్రజలు ఆ ప్రశ్న అడుగవచ్చు. వారిదృష్టికి రాబోవు ప్రళయం మానవజాతినే మట్టుపెడుతుందన్నట్లు కనబడుతోంది. అయితే అలా జరుగుతుందా? సంతోషమేమంటే, దేవుని ప్రవక్త యిలా అభయమిస్తున్నాడు: “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరును రక్షింపబడుదురు.” (యోవేలు 2:32) అపొస్తలులు, పేతురు పౌలు ఆ వాస్తవాన్ని స్థిరపరుస్తున్నారు. (అపొస్తలుల కార్యములు 2:19-21; రోమీయులు 10:13) అవును, యెహోవా నామమున ప్రార్థించే వారంతా తప్పించబడతారు. వీరెవరు? తర్వాతి దర్శనం విప్పబడినప్పుడు యీ విషయాన్ని గమనిస్తాము.

2. యెహోవా తీర్పుదినములో తప్పించుకునే వారుంటారంటే ఎందుకు ఆశ్చర్యకరంగా ఉంటుంది?

2 యెహోవా తీర్పుదినాన్ని తప్పించుకొని ప్రాణాలతో బయటపడడం నిజంగా ఆశ్చర్యకరమే, ఎందుకంటే, దేవుని మరో ప్రవక్త దాన్నిగూర్చి యీమాటల్లో వర్ణిస్తున్నాడు: “ఇదిగో, యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలు దేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టులమీద పెళ్లున దిగును. తన కార్యము ముగించు వరకు తన హృదయాలోచనలను నెరవేర్చువరకు యెహోవా కోపాగ్ని చల్లారదు.” (యిర్మీయా 30:23, 24) మనమా పెనుగాలికి తాళుకోవడం అత్యవసరం!—సామెతలు 2:22; యెషయా 55:6, 7; జెఫన్యా 2:2, 3.

నాలుగు వాయువులు

3. (ఎ) దూతలు చేసిన ఏ ప్రత్యేక సేవను యోహాను చూస్తున్నాడు? (బి) “నాలుగు దిక్కుల వాయువులు” దేన్ని సూచిస్తున్నాయి?

3 యెహోవా యీ కోపాగ్నిని కుమ్మరించక ముందే, పరలోక దూతలు ఓ ప్రత్యేక సేవచేస్తారు. యోహాను యిప్పుడు దీన్ని దర్శనంలో యిలా చూస్తున్నాడు: “అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచకుండునట్లు భూమియొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని యుండగా చూచితిని.” (ప్రకటన 7:1) ఈనాడు మనకు దానిభావమేమి? దుష్టమానవ సమాజం మీదికి, “సముద్రము” వలె చెలరేగుతున్న దుర్మార్గులైన మానవులమీదికి, భూలోక ప్రజలనుండి మద్దతును, మనుగడను పొందే మహావృక్షంలాంటి పరిపాలకుల మీదికి రాబోవు నాశనకరమైన తీర్పును స్పష్టంగా సూచించేవే యీ “నాలుగు దిక్కుల వాయువులు.”—యెషయా 57:20; కీర్తన 37:35, 36.

4. (ఎ) నలుగురు దూతలు దేన్ని సూచిస్తున్నారు? (బి) నలుదిశలనుండి వాయువులు విడుదల చేయబడినప్పుడు సాతాను భూలోకసంస్థపై ఎటువంటి ప్రభావ ముంటుంది?

4 నిశ్చయంగా, యీ నలుగురు దూతలు, నిర్ణయకాలం వరకు తీర్పు జరగకుండ నిలిపివేయడానికి యెహోవా ఉపయోగించుకునే నాలుగు దూతల గుంపులను సూచిస్తున్నారు. దూతలు దేవుని ఉగ్రతయను వాయువులను తూర్పుపడమర, ఉత్తరదక్షిణాల నుండి ఒక్కసారి విడుదలచేస్తే కలుగబోవు నాశనం ఘోరంగా ఉంటుంది. యెహోవా ప్రాచీన ఏలామును చెదరగొట్టడానికి నలుదిశలనుండి నాలుగు దిక్కుల వాయువులను ఉపయోగించిన దాన్నే యిది విస్తారమైన భావంలో సూచిస్తుంది. (యిర్మీయా 49:36-38) యెహోవా అమ్మోనీయులను నిర్మూలించడానికి ఉపయోగించిన “సుడిగాలి” కంటె వినాశకరమైన ప్రచండ తుపాను గాలిలా ఉంటుంది. (ఆమోసు 1:13-15) యెహోవా ఉగ్రత దినమున ఆయన తన సర్వాధిపత్యాన్ని శాశ్వతంగా నిరూపించుకున్నప్పుడు భూమ్మీద సాతాను సంస్థలో ఏదియు నిలువజాలదు.—కీర్తన 83:15, 18; యెషయా 29:5, 6.

5. దేవుని తీర్పులు భూమియంతటికి విస్తరిస్తాయని మనమర్థం చేసుకోవడానికి యిర్మీయా ప్రవచనమెలా సహాయ పడుతుంది?

5 దేవుని తీర్పులు భూమియంతట నాశనాన్ని తెస్తాయని మనం నిశ్చయంగల్గి ఉండగలమా? ఆయన ప్రవక్తయైన యిర్మీయా చెప్పిన దాన్ని వినండి: “జనమునుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళ్లుచున్నది. ఆ దినమున యెహోవాచేత హతులైనవారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు.” (యిర్మీయా 25:32, 33) ఈ భయంకరమైన తుపాను కాలంలోనే యీ లోకాన్ని అంధకారం అలుము కుంటుంది. దాని పరిపాలనా ప్రతినిధులంతా కనుమరుగౌతారు. (ప్రకటన 6:12-14) అయితే ప్రతివారికి భవిష్యత్తు అంధకారంగా ఉండదు. మరి ఎవరి నిమిత్తం ఆ నాలుగు వాయువులు పట్టుకొనబడ్డాయి?

దేవుని దాసులను ముద్రించుట

6. నాలుగు వాయువులను పట్టుకొమ్మని దూతలకు చెప్పేదెవరు, మరిది దేనికి సమయాన్నిస్తుంది?

6 కొందరు తప్పించు కోవడానికెలా ముద్రింపబడతారో యోహాను వర్ణిస్తూ యిలా చెబుతున్నాడు: “మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత—మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హానిచేయవద్దని బిగ్గరగా చెప్పెను.”—ప్రకటన 7:2, 3.

7. నిజానికి యీ ఐదవ దూత ఎవరు, ఆయననలా గుర్తించడానికి ఏ ఆధారం మనకు సహాయం చేస్తుంది?

7 ఈ ఐదవదూత పేరేమిటో తెలుపబడక పోయినను, ఆయన మహిమనొందిన ప్రభువైన యేసేనని నిదర్శనమంతా నిరూపిస్తుంది. యేసు ప్రధాన దూతయైనందున, ఆయనకు యితర దూతలమీద అధికారమున్నట్లు యిక్కడ చూపబడింది. (1 థెస్సలొనీకయులు 4:16; యూదా 9) ప్రాచీన బబులోను గర్వమణచడానికి దర్యావేషు, కోరెషు రాజులు ఎలా వచ్చారో, తీర్పు తీర్చడానికి “తూర్పునుండి వచ్చు రాజుల”వలె—అనగా యెహోవా ఆయన క్రీస్తు వలె—ఆయన తూర్పునుండి వస్తాడు. (ప్రకటన 16:12; యెషయా 45:1; యిర్మీయా 51:11; దానియేలు 5:31) అభిషక్త క్రైస్తవులకు ముద్ర వేయడానికి అధికారం పొందినందున యీ దూత యేసును పోలియున్నాడు. (ఎఫెసీయులు 1:13, 14) ఇంకనూ, వాయువులు విడిచిపెట్టబడినప్పుడు జనాంగములపై తీర్పు తీర్చడానికి పరలోకసైన్యాన్ని నడిపించేది యేసే. (ప్రకటన 19:11-16) గనుక న్యాయంగా, దేవుని దాసులు ముద్రించబడే వరకు సాతాను భూసంస్థను నాశనం చేయకుండా నిలిపివేయాలని ఆజ్ఞాపించేది యేసే.

8. ముద్రింపబడుట అంటే ఏమిటి, అదెప్పుడారంభమైంది?

8 ఏమిటీ ముద్ర, మరి ముద్రింపబడే యీ దేవుని సేవకులెవరు? యూదా క్రైస్తవులలో మొదటి వారిని పరిశుద్ధాత్మచేత అభిషేకించినప్పుడు సా.శ. 33 లో యీ ముద్రించడం ఆరంభమైంది. పిదప, దేవుడు “అన్యజనులను” పిలవడానికి, అభిషేకించడాని కారంభించాడు. (రోమీయులు 3:29; అపొస్తలుల కార్యములు 2:1-4, 14, 32, 33; 15:14) అభిషక్త క్రైస్తవులు తాము “క్రీస్తునందు” ఉన్నట్లు వారికి అభయం కలదని అపొస్తలుడైన పౌలు వారినిగూర్చి చెబుతూ, “ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు,” అని యింకను అంటున్నాడు. (2 కొరింథీయులు 1:21, 22; ప్రకటన 14:1ని పోల్చండి.) అలాగు, యీ దాసులు దేవుని కుమారులుగా దత్తత తీసుకోబడినప్పుడు, వారి పరలోక స్వాస్థ్యం నిమిత్తం—ఒకగుర్తింపు, అంటే ఒక ముద్రను లేక వాగ్దానాన్ని పొందుతారు. (2 కొరింథీయులు 5:1, 5; ఎఫెసీయులు 1:10, 11) అప్పుడు వారిలా అనగలరు: “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.”—రోమీయులు 8:15-17.

9. (ఎ) దేవుని ఆత్మాభిషక్త కుమారుల్లో శేషించినవారికి ఎటువంటి సహనం అవసరం? (బి) ఎంతవరకు అభిషక్తుల పరీక్ష కొనసాగుతుంది?

9 “ఆయనతో శ్రమపడినయెడల” అంటే దానర్థమేమిటి? జీవకిరీటాన్ని పొందాలంటె, అభిషక్త క్రైస్తవులు మరణం వరకు సహించాలి. (ప్రకటన 2:10) అంటే, ‘ఒకసారి రక్షింపబడితే యిక నిత్యం రక్షింపబడినట్టే” యని దానర్థంకాదు. (మత్తయి 10:22; లూకా 13:24) బదులుగా వారిలా హెచ్చరింపబడ్డారు: “మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుడి.” అపొస్తలుడైన పౌలువలె, వారు తుదకు తప్పక యిలా చెప్పగల్గాలి: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.” (2 పేతురు 1:10, 11; 2 తిమోతి 4:7, 8) గనుక, దేవుని ఆత్మాభిషేకం నొందిన కుమారులలో శేషించిన వారందరిని యీ భూమ్మీద పరీక్షించి, జల్లెడపట్టే పని, యేసు, తనతోపాటు వస్తున్న దూతలు వీరందరి ‘నొసళ్లయందు’ గట్టిగా ముద్రవేసి, పరీక్షింపబడిన నమ్మకమైన ‘మన దేవుని దాసులని వారిని తిరుగులేని’ రీతిగా, తీర్మానపూర్వకంగా గుర్తించేంత వరకు కొనసాగుతూనే ఉండాలి. అప్పుడా ముద్ర శాశ్వతగుర్తు అవుతుంది. నిజానికి, శ్రమల వాయువులు విడుదల చేయబడినప్పుడు, యీ భూమ్మీద కొద్దిమందింకనూ జీవిస్తున్నప్పటికీ, ఆత్మీయ ఇశ్రాయేలీయులంతా పూర్తిగా ముద్రవేయబడినట్లే. (మత్తయి 24:13; ప్రకటన 19:7) సభ్యత్వమంతా పూర్తవుతుంది!—రోమీయులు 11:25, 26.

ఎంతమంది ముద్రింపబడ్డారు?

10. (ఎ) ముద్రింపబడినవారు ఒక పరిమిత సంఖ్యేనని ఏ లేఖనాలు చూపిస్తున్నాయి? (బి) ముద్రింపబడినవారి సంఖ్య ఎంత, మరి ఎలా పేర్కొనబడ్డారు?

10 ఈ ముద్రకొరకు వరుసలోవున్న వారిని గూర్చి యేసు యిలా చెబుతున్నాడు: “చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీతండ్రికి ఇష్టమైయున్నది.” (లూకా 12:32) ఇతరలేఖనాలు, అంటే ప్రకటన 6:11 మరియు రోమీయులు 11:25, ఈ సంఖ్య ఓ చిన్నమందయని, నిజానికి ముందే నిర్ణయించబడిందని తెలియజేస్తున్నాయి. యోహాను తర్వాతి మాటలు దీన్ని స్థిరపరుస్తున్నాయి: “మరియు ముద్రింపబడిన వారిలెక్క చెప్పగావింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు పండ్రెండు వేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది, ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది, షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది, జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.”—ప్రకటన 7:4-8.

11. (ఎ) ఆ 12 గోత్రాల వరుసక్రమం సహజ యూదుల కెందుకు వర్తించదు? (బి) ప్రకటన ఎందుకు 12 గోత్రాల క్రమాన్ని చూపిస్తోంది? (సి) దేవుని ఇశ్రాయేలీయులలో రాజులు లేక యాజకులు అనే ఓ ప్రత్యేక గుంపెందుకు లేదు?

11 ఇది అసలు, సహజ ఇశ్రాయేలీయులను సూచించే లేఖనం కాదా? కాదు, ఎందుకంటే ప్రకటన 7:4-8, సాధారణ గోత్రాల వరుసకన్నా భిన్నంగా వుంది. (సంఖ్యాకాండము 1:17, 47) ఇశ్రాయేలీయులను వారి గోత్రాల ప్రకారం గుర్తించడానికి యిక్కడ యివ్వబడలేదు గానీ ఆత్మీయ ఇశ్రాయేలీయులకు అటువంటి సంస్థీకరణే వుంటుందని తెల్పడానికే యివ్వబడిందనుట స్పష్టం. ఇది సమతుల్యంగా ఉంది. ఈ నూతన జనాంగంలో కచ్చితంగా 1,44,000 మంది—12గోత్రాలనుండి 12,000 మంది ఉన్నారు. ఈ దేవుని ఇశ్రాయేలు అనబడేవారిలో ఏ గోత్రమూ ప్రత్యేకంగా రాజులుకారు, యాజకులుకారు. ఆ జనాంగమంతా రాజులుగా పరిపాలించాలి, యాజకులుగా సేవచేయాలి.—గలతీయులు 6:16; ప్రకటన 20:4, 6.

12. ఆ 24 పెద్దలు గొఱ్ఱెపిల్లయెదుట ప్రకటన 5:9, 10 నందున్న కీర్తన పాడడమెందుకు తగియున్నది?

12 సహజమైన యూదులు, యూదా మతప్రవిష్టులకు, ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా ఎన్నుకోబడే అవకాశం మొట్టమొదట యివ్వబడినప్పటికీ, ఆ జనాంగంలో స్వల్పసంఖ్య మాత్రమే స్పందించింది. అందుచేత యెహోవా అన్యులకు ఆహ్వానాన్ని విస్తరించాడు. (యోహాను 1:10-13; అపొస్తలుల కార్యములు 2:4, 7-11; రోమీయులు 11:7) “ఇశ్రాయేలీయులతో సహపౌరులుకాని” ఎఫెసీయుల వలెనే, యిప్పుడు యూదులుకానివారు దేవుని ఆత్మచేత ముద్రించబడి అభిషక్త క్రైస్తవ సంఘంలో భాగం కాగలరు. (ఎఫెసీయులు 2:11-13; 3:5, 6; అపొస్తలుల కార్యములు 15:14) గనుక ఆ 24 పెద్దలు గొఱ్ఱెపిల్లయెదుట యిలా కీర్తన పాడడం సమంజసమే: “నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురు.”—ప్రకటన 5:9, 10.

13. యేసు సహోదరుడైన యాకోబు తన పత్రిక నెందుకు “చెదిరియున్న పండ్రెండు గోత్రముల వారికి” అని యుక్తంగా సంబోధించాడు?

13 క్రైస్తవసంఘం “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై” యున్నారు. (1 పేతురు 2:9) దేవుని ప్రజలుగావున్న ఇశ్రాయేలీయుల స్థానం తీసుకుంటూ వీరు ఓ క్రొత్త ఇశ్రాయేలు, ‘నిజమైన ఇశ్రాయేలు’ అవుతున్నారు. (రోమీయులు 9:6-8; మత్తయి 21:43) * ఈ హేతువుచేతనే, యేసు సహోదరుడైన యాకోబు, కాపరిగా తన ఉపదేశ పత్రికను “చెదిరియున్న పండ్రెండు గోత్రముల వారికి,” అనగా సకాలంలో 1,44,000 మంది అయ్యే ప్రపంచ వ్యాప్తంగానున్న అభిషక్త క్రైస్తవ సంఘానికి అని సంబోధించడం చాలా సమంజసంగా ఉండెను.—యాకోబు 1:1.

ఈనాడు దేవుని ఇశ్రాయేలు

14. ఆత్మీయ ఇశ్రాయేలీయుల సంఖ్య అక్షరార్థంగా 1,44,000 అని యెహోవాసాక్షులు గట్టిగా నమ్ముతూనే ఉన్నట్లు ఏది చూపిస్తుంది?

14 ఆసక్తికరమైన విషయమేమంటే, వాచ్‌టవర్‌ సొసైటీ మొదటి అధ్యక్షుడు, చార్లస్‌ టి. రస్సల్‌, ఆత్మీయ ఇశ్రాయేలుగా తయారయ్యే యీ 1,44,000 మంది సంఖ్యను అక్షరార్థమైనదిగా గుర్తించాడు. తాను రచించగా 1904 లో ముద్రితమైన స్టడీస్‌ యిన్‌ ది స్క్రిప్చర్స్‌ లోని 6 సంపుటియైన న్యూ క్రియేషన్‌ లో, ఆయనిలా రాశాడు: “ప్రకటనలో (7:4; 14:1) అనేకసార్లు తెలుపబడ్డవారు, ‘మనుష్యులలోనుండి కొనబడినవారు’ [ఎన్నుకోబడిన అభిషక్తులు] 1,44,000 సంఖ్యేనని మనం రూఢిగా, కచ్చితంగా నమ్మడానికి మనకెన్నో రుజువులున్నాయి.” వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి రెండవ అధ్యక్షుడు, జె. యఫ్‌. రూథర్‌ఫర్డ్‌ వ్రాయగా, 1930 లో ప్రచురించబడిన లైట్‌ అనే పుస్తకంలో అదేమాదిరి తెలుపబడింది: “క్రీస్తు శరీరమైన 1,44,000 మంది సభ్యులు అలా ఎన్నుకోబడిన, అభిషక్తులైన లేక ముద్రింపబడిన సమూహంలో ఉన్నారు.” అక్షరార్థంగా 1,44,000 మంది యీ ఆత్మీయ ఇశ్రాయేలు అవుతున్నారని యెహోవాసాక్షులు కచ్చితమైన అభిప్రాయం కల్గివున్నారు.

15. ప్రభువు దినమునకు కొంచెం ముందు, యథార్థపరులైన బైబిలు విద్యార్థులు, అన్యరాజుల కాలములు గతించిన తర్వాత సహజ యూదులు దేన్ని అనుభవిస్తారని అనుకున్నారు?

15 అయినా, సహజ ఇశ్రాయేలీయులు యీనాడు కొంతైనా ప్రత్యేక అనుగ్రహానికి పాత్రులుకారా? ప్రభువు దినమునకు కొంచెంముందు కాలంలో యథార్థపరులైన బైబిలు విద్యార్థులు దేవుని వాక్యంలోని మూలసత్యాలను మరల పరిశోధించేటప్పుడు, అన్యరాజుల కాలాలు అంతమైనప్పుడు యూదులు మరల దేవుని యెదుట ఓ ఆధిక్యతా స్థానంలో ఉంటారని అనుకున్నారు. అందుకే, 1889 లో ప్రచురితమైన ది టైమీజ్‌ ఎట్‌ హ్యండ్‌ (స్టడీస్‌ ఇన్‌ ది స్క్రిప్చర్స్‌, వాల్యూమ్‌ II) అనే పుస్తకంలో, సి. టి. రస్సల్‌ యిర్మీయా 31:29-34లను సహజ యూదులకు వర్తింపజేస్తూ యిలా వ్యాఖ్యానించాడు: “ఇశ్రాయేలీయులు క్రీ. పూ. [607] నుండే అన్యరాజులచేత శిక్షింపబడుతూ యింకనూ శిక్షింపబడుతున్నారనే విషయానికి లోకమే సాక్ష్యం, మరి వారికియ్యబడిన ‘ఏడుకాలములు’—2,520 సంవత్సరాల హద్దు, అంటే వారొక జనాంగంగా తిరిగి సమకూర్చబడేది క్రీ. శ. 1914 కంటె ముందు జరుగుతుందనడానికి కారణమేమీలేదు.” యూదులు మరల ఒకే జనాంగంగా సమకూర్చ బడతారన్నట్లు కనబడింది, మరి 1917 లో పాలస్తీనాను యూదులకు స్వదేశంగా చేస్తామన్న బాల్‌ఫోర్‌ డిక్లరేషన్‌కు బ్రిటన్‌ మద్దతు తెల్పినప్పుడు, యీ ఆశ బహుగా చిగురించింది.

16. క్రైస్తవ సమాచారాన్ని సహజ యూదులకు అందించడానికి యెహోవాసాక్షులు ఎటువంటి ప్రయత్నాలు చేశారు, అందుమూలంగా లభించిన ఫలితమేమిటి?

16 మొదటి ప్రపంచ యుద్ధానంతరం పాలస్తీనా గ్రేట్‌ బ్రిటన్‌ ఆజ్ఞాపాలన క్రిందనున్న ప్రాంతమైంది, యిక అనేకమంది యూదులు ఆ దేశానికి తిరిగిచేరుకునే మార్గమేర్పడింది. మరి 1948 లో ఇశ్రాయేలు ఒక రాజ్యంగా ఏర్పడింది. మరి యూదులు దైవానుగ్రహం పొందేస్థానంలో ఉండిరని యిది చూపించడంలేదా? అనేక సంవత్సరాలు యెహోవాసాక్షులు అలాగే నమ్మారు. అందుకే 1925 లో వారు కంఫర్ట్‌ ఫర్‌ ది జ్యూస్‌ అనే 128 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు. యూదులను మరియు యోబు గ్రంథాన్ని కూడ వివరించే అందమైన 360 పేజీలుగల లైఫ్‌ అనే పుస్తకాన్ని వారు 1929 లో విడుదల చేశారు. న్యూయార్కు పట్టణంలో యూదులకు యీ మెస్సీయ వర్తమానాన్ని అందించడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి. దానికి కొందరు స్పందించారు సంతోషమే, గానీ మొదటి శతాబ్దంలోని వారి పితరులవలె, మొత్తంమీద అనేకమంది యూదులు మెస్సీయ ప్రత్యక్షతను తృణీకరించారు.

17, 18. క్రొత్తనిబంధన, మరియు పునరుద్ధరణను గూర్చిన ప్రవచనాలను భూమ్మీదనున్న దేవుని దాసులేమని గ్రహించగలిగారు?

17 యూదులు ఓ జనాంగంగాను, ఓ దేశంగాను ప్రకటన 7:4-8 లో వర్ణించబడిన ఇశ్రాయేలుకాదు, లేక ప్రభువు దినమునకు సంబంధించిన బైబిల్లోని యితర ప్రవచనాల ప్రకారం యూదులు కారు. పారంపర్యాచారాన్ని అనుసరిస్తూ, యూదులు దైవనామాన్ని తిరస్కరిస్తూనే ఉన్నారు. (మత్తయి 15:1-3; 7-9) యిర్మీయా 31:31-34 లోని వచనాలను గూర్చి చర్చిస్తూ, 1934 లో యెహోవాసాక్షులు ప్రచురించిన జెహోవా అనే పుస్తకం, స్థిరంగా యిలా తెల్పింది: “క్రొత్తనిబంధనకు శరీరసంబంధులైన యూదులతోను, సాధారణ మానవులతోను ఎటువంటి సంబంధంలేదు, గానీ . . . ఆత్మీయ ఇశ్రాయేలీయులతో సంబంధముంది.” బైబిల్లోని పునరుద్ధరణ ప్రవచనాలు, సహజ ఇశ్రాయేలును గూర్చిగాని, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వముకల్గి, యేసు యోహాను 14:19, 30 మరియు 18:36 లో తెల్పిన లోకంలో ఒకభాగమైన ఇశ్రాయేలు దేశాన్ని గూర్చిగాని తెల్పడంలేదు.

18 భూమ్మీద దేవుని సేవకులు 1931 లో యెహోవాసాక్షులనే పేరును ఎంతో ఆనందంగా స్వీకరించారు. వారు కీర్తన 97:11 నందలి మాటల్ని హృదయపూర్వకంగా అంగీకరించ గలిగారు: “నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయుల కొరకు ఆనందమును విత్తబడియున్నవి.” ఆత్మీయ ఇశ్రాయేలీయులు మాత్రమే క్రొత్తనిబంధనలోనికి తీసుకొనబడ్డారని వారు స్పష్టంగా గ్రహించగల్గారు. (హెబ్రీయులు 9:15; 12:22, 24) స్పందించని సహజ ఇశ్రాయేలుకు గానీ, సాధారణ మానవులకుగానీ అందులో ఎటువంటి భాగం లేకుండెను. ఈ గ్రహింపే, దైవవెలుగు తేజోవంతంగా ప్రకాశించడానికి, దైవిక చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా కనబడడానికి వీలు కల్గించింది. ఆయనను సమీపించే మానవులందరికి యెహోవా ఎలా తన కృపాసత్య కనికరములను మెండుగా అనుగ్రహిస్తాడో యిది బయలు పరుస్తుంది. (నిర్గమకాండము 34:6; యాకోబు 4:8) అవును, దూతలు నాశనం కల్గించే వాయువులను పట్టుకొనుటవల్ల ఇశ్రాయేలీయులే గాక యితరులుకూడ ప్రయోజనం పొందగలరు. వీరెవరై ఉంటారు? మీరును అందులో ఒకరై ఉండగలరా? మనమిప్పుడు గమనిద్దాము.

[అధస్సూచీలు]

^ పేరా 13 యుక్తంగా, ఇశ్రాయేలు అంటే “దేవుడు పోరాడును; దేవునితో (కలహించు) పోరాడువాడు” అని అర్థం.—ఆదికాండము 32:28, న్యూ వర్‌ల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి.

[అధ్యయన ప్రశ్నలు]

114వ పేజీలోని చిత్రం]

[116, 117వ పేజీలోని చిత్రం]

సాధారణ ఎంపిక అంటే దేవుని నిజమైన ఇశ్రాయేలును ఎన్నుకోవడమనేది సా. శ. 33 నుండి ప్రారంభమై 1935 వరకు, అనగా భూలోక నిరీక్షణగల ఒక గొప్ప సమూహం వైపు అధిక అవధానాన్ని నిల్పిన వాషింగ్టన్‌ డి.సి.లో జరిగిన యెహోవాసాక్షుల చారిత్రాత్మక సమావేశం వరకు అది కొనసాగింది (ప్రకటన 7:9)