కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని కోపము సమాప్తమాయెను

దేవుని కోపము సమాప్తమాయెను

అధ్యాయం 32

దేవుని కోపము సమాప్తమాయెను

1. ఏడు పాత్రలు సంపూర్తిగా కుమ్మరించ బడేటప్పటికి ఏమి జరిగివుంటుంది, ఆ పాత్రలనుగూర్చి యిప్పుడు ఏ ప్రశ్నలొస్తాయి?

యోహాను ఏడు తెగుళ్లను కుమ్మరించడానికి నియమించబడిన దూతలను యిప్పటికే పరిచయం చేశాడు. “ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను” అని ఆయన మనకు చెబుతున్నాడు. (ప్రకటన 15:1; 16:1) భూమిలోని దుష్టత్వాన్ని యెహోవా అనుమతించడానికిగల కారణాలను తెల్పే యీ తెగుళ్లు పూర్తిగా కుమ్మరింపబడాలి. అవి సంపూర్తియైనప్పుడు, దేవుని తీర్పులు జరిగిపోయినట్లే. సాతాను లోకం యిక ఉండదు. ఈ తెగుళ్లు మానవజాతికి, ప్రస్తుత దుష్టవిధాన పరిపాలకులకు ఏమి సూచిస్తున్నాయి? ఈ నాశనపాత్రమైన లోకంతోపాటు నాశనం కాకుండ క్రైస్తవులెలా తప్పించుకోగలరు? ఇవి ప్రాముఖ్యమైన ప్రశ్నలే, మరిప్పుడు వాటికి సమాధానం కావాలి. నీతియుక్తమైన విజయం సాధించాలని వాంఛించే వారంతా యోహాను తదుపరి చూడబోవు దానియెడల ఎంతో శ్రద్ధకల్గివుంటారు.

“భూమి”మీద యెహోవా కోపము

2. మొదటి దూత తన పాత్రను భూమ్మీద కుమ్మరించినప్పుడు ఏమి జరుగుతుంది, “భూమి” దేనిని సూచిస్తుంది?

2 మొదటి దూత తనపని ప్రారంభించాడు! “అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమిమీద కుమ్మరింపగా ఆ క్రూరమృగముయొక్క ముద్రగలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండుపుట్టెను.” (ప్రకటన 16:2) మొదటి బూర ఊదినప్పటివలెనే, యిక్కడ “భూమి” యనేది 4,000 సంవత్సరాల క్రితం నిమ్రోదు కాలంలో యీ భూమ్మీద సాతాను నిర్మించుట కారంభించి స్థిరంగా ఉన్నదన్నట్లు కనబడుతున్న రాజకీయ విధానాన్ని సూచిస్తుంది.—ప్రకటన 8:7.

3. (ఎ) అనేక ప్రభుత్వాలెలా తమ ప్రజలనుండి ఆరాధనతో సమానమైన దానిని అధికారపూర్వకంగా అడుగుతూ ఉన్నాయి? (బి) రాజ్యాలు దేవుని రాజ్యానికి ప్రత్యామ్నాయంగా దేనిని తయారుచేశాయి, దాన్ని ఆరాధించే వారిపై దాని ప్రభావమెలావుంది?

3 ఈ అంత్యదినాల్లో, అనేక ప్రభుత్వాలు వాటి పౌరులనుండి ఆరాధనకు సమానమైనదాన్ని అధికారపూర్వకంగా అడుగుతున్నాయి, దేశాన్ని దేవునికంటె, లేక మరిదేనికంటెకూడ ఉన్నతంగా ఎంచాలని బలవంతం చేస్తున్నాయి. (2 తిమోతి 3:1; అలాగే లూకా 20:25; యోహాను 19:15 పోల్చండి.) యువకులను యుద్ధానికి సిద్ధంచేయడంగాని యుద్ధంలో చేర్చుకోవడంగాని దేశాలకు 1914నుండి సర్వసాధారణమై పోయింది, యిలాంటి సర్వసన్నద్ధ యుద్ధం, ఆధునిక చరిత్రపుటలను రక్తపాతంతో నింపివేశాయి. ప్రభువు దినములో దేశాలు దేవుని రాజ్యానికి ప్రత్యామ్నాయంగా, క్రూరమృగము యొక్క ప్రతిమను—నానాజాతి సమితిని దాని తర్వాతి ఐక్యరాజ్య సమితిని తయారు చేసుకున్నాయి. ఇటీవల పోప్‌లు చేసినట్లే, యీ మానవనిర్మిత సంస్థను, ప్రపంచదేశాల శాంతికి ఏకైక నిరీక్షణయని చాటించడం ఎంతటి దూషణకరం! అది దేవునిరాజ్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుంది. మోషేకాలంలో యెహోవాను వ్యతిరేకించిన ఐగుప్తీయులు ఎలా అక్షరార్థంగా పొక్కులతో దద్దుర్లతో బాధించబడ్డారో అలాగే దాన్ని ఆరాధించేవారు, ఆత్మీయంగా అశుద్ధులౌతారు, దద్దుర్లతో బాధింపబడతారు.—నిర్గమకాండము 9:10, 11.

4. (ఎ) దేవుని కోపముతో నిండిన మొదటి పాత్రలోనిది దృఢంగా దేనిని నొక్కితెల్పుతున్నది? (బి) క్రూరమృగము యొక్క ముద్రను వేయించుకున్న వారిని యెహోవా ఎలా పరిగణిస్తాడు?

4 ఈ పాత్రలో ఉన్నటువంటిది మానవుల ఎదుటవున్న ఎంపికను దృఢంగా నొక్కితెల్పుతుంది. వారు లోకంయొక్క అసమ్మతిని గాని, యెహోవా మహోగ్రతను గాని అనుభవించాలి. “ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండునట్లు” చేసే ఉద్దేశముతో మానవజాతి ఆ మృగముయొక్క ముద్రను వేయించుకునేలా బలవంతం చేయబడుతున్నారు. (ప్రకటన 13:16, 17) అయితే దీనికి మూల్యం చెల్లించవలసి వుంటుంది! యెహోవా యీ ముద్రను వేయించుకున్న వారిని “బాధకరమైన చెడ్డపుండు” పుట్టినవారివలె లెక్కిస్తాడు. వారు జీవంగల దేవున్ని తృణీకరించారని 1922నుండి వారిని బహిరంగంగా గుర్తించారు. వారి రాజకీయ కుయుక్తులు విజయవంతం కావడంలేదు, వారు వేదననొందుతున్నారు. ఆత్మీయంగా వారు అపవిత్రులు. వారు పశ్చాత్తాపపడకపోతే, యీ “బాధకరమైన” రోగం తప్పదు, ఎందుకంటె యిప్పుడిది యెహోవా తీర్పుదినం. లోకవిధానంలో ఒక భాగంగా ఉండడానికి, క్రీస్తుపక్షాన యెహోవాను సేవించేందుకు ఒక తటస్థ విధానమంటూ ఏమీలేదు.—లూకా 11:23; అలాగే యాకోబు 4:4 పోల్చండి.

సముద్రం రక్తమగుట

5. (ఎ) రెండవ పాత్ర కుమ్మరింప బడినప్పుడు ఏమి జరుగుతుంది? (బి) సాదృశ్యమైన సముద్రమందున్న వారిని యెహోవా ఎలా పరిగణిస్తాడు?

5 దేవుని కోపముతోనిండిన రెండవ పాత్ర యిప్పుడు కుమ్మరించబడాలి. అది మానవులకు ఎటువంటి భావాన్ని కల్గివుంది? యోహాను మనకిలా చెబుతున్నాడు: “రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.” (ప్రకటన 16:3) రెండవ బూర ఊదినప్పటివలె యీ పాత్ర “సముద్రము” అనగా యెహోవానుండి వేరై అల్లరి, తిరుగుబాటుచేసే మానవసమాజం వైపు గురిపెట్టబడింది. (యెషయా 57:20, 21; ప్రకటన 8:8, 9) యెహోవా దృష్టిలో, యీ “సముద్రము” రక్తంవంటిది, ప్రాణులు జీవించడానికి అయోగ్యమైంది. అందుకే క్రైస్తవులు లోకసంబంధులై యుండకూడదు. (యోహాను 17:14) దేవుని కోపమను రెండవ పాత్రను కుమ్మరించడం, యీ సముద్రంలో జీవించే మానవులంతా యెహోవా దృష్టిలో మృతులేనని బయలుపరుస్తుంది. సమాజ బాధ్యత ఉన్నందున, మానవజాతి అమాయకుల రక్తాన్ని చిందించిన గొప్పనేరాన్ని ఒడిగట్టుకుంది. యెహోవా కోపాగ్నిదినం వచ్చినప్పుడు ఆయన సైన్యం చేతిలో నిజంగా చస్తారు.—ప్రకటన 19:17, 18; అలాగే ఎఫెసీయులు 2:1; కొలొస్సయులు 2:13 పోల్చండి.

త్రాగడానికి వారికి రక్తాన్నిచ్చుట

6, మూడవ పాత్ర కుమ్మరింప బడినప్పుడు ఏమి జరుగుతుంది, దేవదూతనుండి, బలిపీఠంనుండి ఏ మాటలు వినబడ్డాయి?

6 దేవుని కోపముతో నిండిన మూడవ పాత్ర, మూడవ బూర ఊదడంవలెనే, మంచినీటి ఊటలమీద ప్రభావం కల్గివుంది. “మూడవదూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి; దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు—అవును ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని.”—ప్రకటన 16:4-7.

7. “నదులు, జలధారలు” దేన్ని సూచిస్తున్నాయి?

7 ఈ ‘నదులును జలధారలును’ యీ లోకం అంగీకరించిన జ్ఞానము, మార్గదర్శకాల నవీన మూలములని పిలువబడేవాటిని అంటే మానవుని క్రియలను, తీర్మానములను నడిపించే రాజకీయ, ఆర్థిక, విజ్ఞాన, విద్య, సాంఘిక, మతపరమైన తత్వజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. జీవమిచ్చే సత్యంకొరకు జీవప్రదాతయైన యెహోవావైపు చూసేబదులు, మానవులు ‘తమకొరకు పగిలిపోయే తొట్లను తొలిపించుకొని’ అందులోనుండి ‘దేవుని దృష్టికి వెర్రితనముగానున్న లోకజ్ఞానమును’ బహుగా త్రాగుతున్నారు.—యిర్మీయా 2:13; 1 కొరింథీయులు 1:19; 2:6; 3:19; కీర్తన 36:9.

8. మానవజాతి ఎలా రక్తాపరాధియైనది?

8 అలా మలినమైన “జలములు” జనములు రక్తాపరాధులగునట్లు చేశాయి. ఉదాహరణకు, యిప్పుడు పదికోట్లకంటె ఎక్కువ ప్రాణాలను బలిగొన్న యీ శతాబ్దపు యుద్ధాల్లో ఎంతోరక్తాన్ని చిందించడానికి ప్రోత్సహించాయి. ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యంలో, రెండు ప్రపంచయుద్ధాలు జరిగిన చోట, మనుష్యులు ‘నిరపరాధులను చంపుటకు త్వరపడు’ చున్నారు, ఇందులో దేవుని సాక్షుల రక్తం కూడ ఉన్నది. (యెషయా 59:7; యిర్మీయా 2:34) యెహోవా నీతియుక్తమైన చట్టాలను ఉల్లంఘిస్తూ, ఎంతో రక్తాన్ని దుర్వినియోగం చేస్తూకూడ మానవజాతి రక్తాపరాధియైంది. (ఆదికాండము 9:3-5; లేవీయకాండము 17:14; అపొస్తలుల కార్యములు 15:28, 29) ఈ కారణంచేత, వారు రక్తమార్పిడి మూలంగా, ఎయిడ్స్‌, కాలేయవ్యాధి, మరితర రోగాలవలన యిప్పటికే విస్తారమైన దుఃఖాన్ని మూటకట్టుకున్నారు. “దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో” తొక్కబడినప్పుడు, అంటే త్వరలో అతిక్రమము చేసేవారికి పెద్ద ప్రాయశ్చిత్తం చెల్లించబడినప్పుడు రక్తాపరాధులందరికి తగిన శాస్తి జరుగుతుంది.—ప్రకటన 14:19, 20.

9. మూడవ పాత్రను కుమ్మరించడంలో ఏమి యిమిడివుంది?

9 మోషే కాలంలో, నైలునది రక్తంగా మారినప్పుడు, ఐగుప్తీయులు మరోచోట నీళ్లను త్రాగి బ్రతకగలిగారు. (నిర్గమకాండము 7:24) అయితే, నేడు ఆత్మీయ తెగులు కాలంలో, సాతాను లోకంలో ఎక్కడా ప్రజలు జీవమిచ్చే నీళ్లను కనుగొనలేరు. ఈ మూడవ పాత్రలోనిది కుమ్మరించడంలో ప్రపంచంలోని “నదులు జలధారలు” రక్తంవలె ఉన్నాయని, వాటిని త్రాగేవారందరికి అది ఆత్మీయ మరణాన్ని తెస్తుందని ప్రకటించడం యిమిడివుంది. ప్రజలు యెహోవావైపు తిరగకపోతే, వారాయన ప్రతికూల తీర్పును పొందుతారు.—యెహెజ్కేలు 33:11 పోల్చండి.

10. “జలముల దేవదూత” ఏమని చెప్పాడు, “బలిపీఠము” ఏ సాక్ష్యాన్ని యిస్తుంది?

10 “జలముల దేవదూత” అంటే, యీ పాత్రను నీళ్లమీదపోసే దూత, ఎవరి నీతి తీర్పులు సంపూర్ణములో ఆ యెహోవాను విశ్వన్యాయాధిపతిగా మహిమపరుస్తాడు. అందుకే, యీ తీర్పునుగూర్చి ఆయనిలా అంటున్నాడు: “దీనికి వారు పాత్రులే.” వేల సంవత్సరాలనుండి ఈ దుష్ట ప్రపంచంయొక్క అబద్ధ బోధలద్వారా, తత్వజ్ఞానంద్వారా చిందించిన ఎంతో రక్తపాతానికి, క్రూరత్వానికి దేవదూత ప్రత్యక్షసాక్షియే, సందేహంలేదు. అందుకే, ఆయనకు యెహోవా న్యాయతీర్పులు సరియైనవని తెలుసు. దేవుని “బలిపీఠం” సహితం మాట్లాడుతుంది. ప్రకటన 6:9, 10 లో హతసాక్షులైనవారి ఆత్మలు ఆ బలిపీఠం క్రిందనున్నట్లు చెప్పబడ్డాయి. గనుక “బలిపీఠం” కూడ యెహోవా నీతిన్యాయాలతోకూడిన నిర్ణయాల విషయంలో బలమైన సాక్ష్యమిస్తుంది. * నిశ్చయంగా, ఎంతోరక్తాన్ని చిందించి, దాన్ని దుర్వినియోగం చేసిన వారు యెహోవా వారిని మరణానికి అప్పగించేదానికి సూచనగా, రక్తాన్ని త్రాగేలా బలవంతం చేయబడడం యుక్తమే.

మనుష్యులను అగ్నితో కాల్చుట

11. దేవుని కోపముతో నిండిన నాలుగవ పాత్ర లక్ష్యమేమిటి, అది కుమ్మరింపబడినప్పుడు ఏమి జరుగుతుంది?

11 దేవుని కోపముతో నిండిన నాలుగవ పాత్ర సూర్యున్ని తన లక్ష్యంగా పెట్టుకుంది. యోహాను మనకిలా చెబుతున్నాడు: “నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.”ప్రకటన 16:,8, 9.

12. లోకానికి “సూర్యుడు” ఎవరు, ఈ సాదృశ్యమైన సూర్యునికి ఏ అధికార మియ్యబడింది?

12 ఈనాడు, యీ విధానాంతమున, యేసు ఆత్మీయ సహోదరులు “తమ తండ్రిరాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.” (మత్తయి 13:40, 43) యేసు తానే “నీతి సూర్యుడు” (మలాకీ 4:2) అయితే మానవజాతికి స్వంత “సూర్యుడు”న్నాడు, అంటే దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా వెలగడానికి ప్రయత్నించే దాని స్వంత పరిపాలకులున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యము యొక్క ‘సూర్యచంద్ర నక్షత్రాలు’ నిజంగా వెలుగుకాదు గాని అవి అంధకారానికి మూలమని నాలుగవ బూర శబ్దం ప్రకటించింది. (ప్రకటన 8:12) లోకం యొక్క “సూర్యుడు” భరించలేనంత వేడిమిగా ఉన్నాడని యిప్పుడు దేవుని కోపముతో నిండిన నాలుగవ పాత్ర చూపిస్తుంది. సూర్యుని వంటి నాయకులుగా పరిగణించబడిన వారు మానవులను “కాల్చు”తారు. సాదృశ్యమైన సూర్యుడు ఇలాచేయడానికి అనుమతించ బడతాడు. అంటే, యెహోవా మానవులపై తీర్చే తన తీక్షణమైన తీర్పులో ఒక భాగంగా దీన్ని అనుమతిస్తాడు. ఈ వేడిమితో కాల్చడమనేది ఏవిధంగా జరుగుతుంది?

13. సూర్యునివంటి యీలోక పరిపాలకులు మానవజాతిని ఏవిధంగా “కాల్చు” చున్నారు?

13 మొదటి ప్రపంచయుద్ధం తర్వాత యీ లోకపాలకులు ప్రపంచ భద్రతను కాపాడే దృష్టితో నానాజాతిసమితిని ఏర్పాటుచేశారు, గానీ అది విఫలమైంది. ఫాసిజం, నాజీయిజం వంటి మరోరకమైన పరిపాలనలను ప్రయత్నించి చూశారు. కమ్యూనిజం పెరుగుతూనే వస్తుంది. మానవుని పరిస్థితిని మెరుగుపర్చేబదులు, యీ విధానంలోని సూర్యునివంటి పాలకులు ‘మానవజాతిని తీక్షణమైన వేడిమితో కాల్చడానికి’ ప్రారంభించారు. స్పెయిన్‌, ఇతియోపియా, మంచూరియాలలో జరిగిన స్థానిక యుద్ధాలు రెండోప్రపంచ యుద్ధానికి నడిపించాయి. ముస్సోలిని, హిట్లర్‌, స్టాలిన్‌వంటి నియంతలు తమ దేశంలోని వేలాదిమందితోపాటు కోట్లాదిమంది మరణాలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను బాధ్యులని ఆధునిక చరిత్ర తెల్పుతుంది. ఇటీవలి కాలంలో, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలతోపాటు వియత్నాం, కంపూచియా, ఇరాన్‌, లెబానాన్‌, మరియు ఐర్లాండ్‌ దేశాల్లో అంతర్జాతీయ లేక స్థానిక యుద్ధాలు ప్రజలను కాల్చాయి. దీనికితోడు మొత్తం మానవాళినే బూడిద చేసే సామర్థ్యంగల భయంకరమైన అణ్వాయుధాలను కల్గివున్న అగ్రరాజ్యాలమధ్య జరిగే నిరంతర పోరాటమొకటి. ఈ అంత్యదినాల్లో, మానవజాతి దాని అవినీతిపరులైన పరిపాలకులనే తీక్షణమైన “సూర్యుని” వేడిమికి నిశ్చయంగా గురౌతుంది. దేవుని కోపముతోనిండిన నాలుగవ పాత్ర కుమ్మరించడమనేది యీ చారిత్రాత్మక వాస్తవాలను నొక్కితెల్పింది, మరి దేవుని ప్రజలు వాటిని భూదిగంతాల వరకు ప్రకటించారు.

14. మానవజాతి సమస్యలకున్న ఏకైక పరిష్కారాన్నిగూర్చి యెహోవాసాక్షులు స్థిరంగా ఏమి బోధిస్తూ వస్తున్నారు, మానవజాతి మొత్తంమీద ఎలా స్పందించింది?

14 యెహోవా తన నామమును పరిశుద్ధపరచు కోవడానికి సంకల్పిస్తున్న దేవుని రాజ్యమే కలతపరచే మానవజాతి సమస్యలకు ఏకైక పరిష్కార మార్గమని యెహోవాసాక్షులు స్థిరంగా ప్రకటిస్తున్నారు. (కీర్తన 83:4, 17, 18; మత్తయి 6:9, 10) అయితే మానవజాతి, మొత్తంగా, యీ పరిష్కారాన్ని పెడచెవిని పెట్టింది. రాజ్యాన్ని తిరస్కరించే అనేకులు, యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరించని ఫరోమాదిరే, దేవుని నామాన్ని దూషిస్తున్నారు. (నిర్గమకాండము 1:8-10; 5:2) మెస్సీయ రాజ్యంపై ఎటువంటి ఆసక్తిలేని యీ వ్యతిరేకులు వారి స్వంత మానవ క్రూరపాలనయనే తీక్షణమైన “సూర్యుని” వేడిమికి బాధపడాలనే ఎన్నుకుంటున్నారు.

క్రూరమృగము యొక్క సింహాసనము

15. (ఎ) అయిదవ పాత్ర దేనిమీద కుమ్మరించబడింది? (బి) “క్రూరమృగము యొక్క సింహాసనము” ఏది, దానిమీద పాత్రను కుమ్మరించడంలో ఏమి యిమిడివుంది?

15 తర్వాతి దూత దేనిమీద తన పాత్రను కుమ్మరిస్తున్నాడు? “అయిదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగముయొక్క సింహాసనముమీద కుమ్మరించెను.” (ప్రకటన 16:10ఎ) “క్రూరమృగము” అంటే సాతాను పరిపాలనా విధానమే. క్రూరమృగము అక్షరార్థమైనది కానట్లే, దానికి అక్షరార్థమైన సింహాసనం లేదు. అయిననూ, సింహాసనము అనేమాట ఆ క్రూరమృగము మానవజాతిపై రాజ్యాధికారం చెలాయించిందని చూపిస్తుంది; మృగము యొక్క ప్రతీ తలమీద ఒక కిరీటమున్నదనే విషయానికిది అనుగుణంగా వుంది. వాస్తవానికి, “క్రూరమృగము యొక్క సింహాసనము” అంటే అది దాని అధికార మూలం లేక పునాది. * “దానికి ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను” అని బైబిలు చెప్పినప్పుడు క్రూరమృగము యొక్క రాజ్యాధికారపు అసలు పరిస్థితినది బయలు పరుస్తుంది. (ప్రకటన 13:1, 2; 1 యెహాను 5:19) ఆలాగున, ఆ పాత్రను క్రూరమృగము యొక్క సింహాసనము మీద కుమ్మరించడంలో సాతాను క్రూరమృగానికి మద్దతునిచ్చి, యింకను యిస్తూ, దాన్ని బలపరచడంలో నిర్వహించే అసలైన స్థానాన్నిగూర్చి బయల్పర్చే ప్రకటన యిమిడివుంది.

16. (ఎ) రాజ్యాలకు తెలిసినా, తెలియక పోయినా అవి ఎవరిని ఆరాధిస్తున్నాయి? వివరించండి. (బి) లోకమెలా సాతాను లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది? (సి) క్రూరమృగము యొక్క సింహాసనము ఎప్పుడు పడగొట్టబడుతుంది?

16 సాతాను మరియు రాజ్యాలమధ్య యీ సంబంధమెలా కొనసాగుతోంది? సాతాను యేసును శోధించినప్పుడు, అతడాయనకు లోకరాజ్యాలన్నిటిని ఒక దృశ్యంగా చూపించి, ‘వాటి అధికారాన్నంతటిని వాటి మహిమను’ యివ్వజూపాడు. అయితే ఒక షరతేమంటే—మొదట యేసు సాతానును ఆరాధించాలి. (లూకా 4:5-7) లోకప్రభుత్వాలు తమ అధికారాన్ని తక్కువ విలువకే పొందారని మనమూహించగలమా? లేనేలేదు. బైబిలు ప్రకారం, సాతాను యీ విధానానికి దేవుడు గనుక, రాజ్యాలు యీ విషయాన్ని గుర్తించినా గుర్తించక పోయినా అవి అతన్నే సేవిస్తున్నాయి. (2 కొరింథీయులు 4:3, 4) * ఈ పరిస్థితి ప్రస్తుత ప్రపంచ విధాన నిర్మాణంలో, అంటే స్వయం-ఆసక్తి, ద్వేషము, సంకుచిత జాతీయతా దృక్పథంపై ఆధారపడిన విధానంలో బయల్పర్చబడ్డది. సాతాను కోరేవిధంగా—మానవజాతి తన అధీనంలో ఉండాలనే విధంగా అది సంస్థీకరించబడ్డది. ప్రభుత్వంలోని అవినీతి, అధికార వ్యామోహం, రాయబార మోసం, ఆయుధాల కొరకు పరుగు మొదలైనవన్నీ సాతాను దిగజారిన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. లోకం సాతాను అవినీతి పద్ధతుల్ని అంగీకరిస్తుంది, అలా అది అతన్ని దేవునిగా చేసుకుంది. మృగము నిర్మూలించబడినప్పుడు, దేవుని స్త్రీ సంతానము చివరకు సాతానునే అగాధంలో పడద్రోసినప్పుడు క్రూరమృగము యొక్క సింహాసనం పడగొట్టబడుతుంది.—ఆదికాండము 3:15; ప్రకటన 19:20, 21; 20:1-3.

అంధకారం మరియు విపరీతమైన వేదన

17. (ఎ) అయిదవ పాత్రలోనిది కుమ్మరించడం, క్రూరమృగము యొక్క రాజ్యమెల్లప్పుడూ ఆత్మీయాంధకారంలో ఉందని తెలియ జేయడానికి ఎలా సంబంధం కల్గివుంది? (బి) దేవుని కోపముతో నిండిన పాత్రలోనిది కుమ్మరించినప్పుడు ప్రజలెలా ప్రతిస్పందిస్తారు?

17 ఈ క్రూరమృగము యొక్క రాజ్యం దాని ప్రారంభంనుండి ఆత్మీయ అంధకారంలో ఉంది. (మత్తయి 8:12; ఎఫెసీయులు 6:11, 12 పోల్చండి.) అయిదవ పాత్ర యీ అంధకారాన్ని గూర్చి తీవ్రమైన బహిరంగ ప్రకటనను చేస్తుంది. అది దాన్ని నాటకరీతిగా కూడ చూపిస్తుంది, అంటే దేవుని కోపమనే యీ పాత్ర సాదృశ్యమైన క్రూరమృగము యొక్క సింహాసనము మీదనే కుమ్మరిస్తుంది. “దాని రాజ్యము చీకటి కమ్మెను; మనుష్యులు తమకు కలిగిన వేదననుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి; తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు.”—ప్రకటన 16:10బి, 11.

18. అయిదవ బూరకు దేవుని కోపముతో నిండిన అయిదవ పాత్రకు సంబంధమేమిటి?

18 అయిదవ బూరశబ్దం, దేవునికోపముతో నిండిన అయిదవ పాత్రలాంటిది కాదు, ఎందుకంటె బూరశబ్దం మిడతల తెగులును ప్రకటించింది. అయితే గమనించండి, మిడతల తెగులు విడువబడినప్పుడు సూర్యుడు వాయుమండలము చీకటిమయమయ్యాయి. (ప్రకటన 9:2-5) యెహోవా ఐగుప్తును మిడతల తెగులుతో బాధించిన సంగతి మనం నిర్గమకాండము 10:14, 15 లో చదువుతాము: “అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటికమ్మెను.” అవును, అంధకారమే! ఈనాడు, అయిదవ బూర ఊదడం వల్లను, దేవుని కోపముతోనిండిన అయిదవ పాత్రను కుమ్మరించడం వల్లను ప్రపంచ ఆత్మీయాంధకారం మరెక్కువగా కనబడుతోంది. “వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించే” దుష్టులకు ఆధునిక కాలపు మిడతల దండు ప్రకటించే బాధకరమైన సమాచారం వేదనను నొప్పిని పుట్టిస్తుంది.—యోహాను 3:19.

19. ప్రకటన 16:10, 11లకు అనుగుణ్యంగా, సాతానును యీ యుగసంబంధమైన దేవుడని బహిరంగంగా చాటడం ఏమి జరిగేలా చేస్తుంది?

19 లోకపాలకునిగా సాతాను ఎంతో అసంతోషాన్ని, బాధను తెచ్చాడు. కరవు. యుద్ధం, దౌర్జన్యం, నేరం, మత్తుపదార్థాల దుర్వినియోగం, అవినీతి, సుఖరోగాలు, మోసం, మతపరమైన వేషధారణ—ఇవి, యింకా అనేకములు సాతాను విధానం యొక్క విశేషలక్షణాలు. (గలతీయులు 5:19-21 పోల్చండి.) అంతేగాక, సాతానును యీ యుగసంబంధమైన దేవుడని బహిరంగంగా ప్రకటించడంకూడ, అతని నియమనిబంధనల ప్రకారం జీవించేవారికి బాధను కలవరాన్ని కల్గించింది. వారు “తమకు కలిగిన వేదనలనుబట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి.” ముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యంలోని వారలా చేశారు. సత్యము వారి జీవితసరళిని బహిర్గతం చేస్తుందనే సంగతిని అనేకులు సమ్మతించరు. కొందరు అది అపాయకరమైందని గమనించి దాన్ని ప్రకటించేవారిని హింసిస్తారు. వారు దేవుని రాజ్యాన్ని తిరస్కరించి, దేవుని పరిశుద్ధ నామాన్ని దూషిస్తారు. వారి మతపరమైన రోగం, పుండులాంటి పరిస్థితి బయల్పర్చబడింది, గనుక వారు పరలోకమందున్న దేవున్ని దూషిస్తున్నారు. వారు “తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు.” గనుక యీ విధానాంతానికి ముందు అనేకులు మారుతారని మనం నిరీక్షించలేము.—యెషయా 32:6.

యూఫ్రటీసు నది ఎండిపోయింది

20. ఆరవ బూర శబ్దం, ఆరవ పాత్ర కుమ్మరించబడడం, ఎలా యూఫ్రటీసుకు సంబంధం కల్గివున్నాయి?

20 ఆరవ బూర ఊది “యూఫ్రటీసు అను మహానదియొద్ద బందింపబడియున్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని” ప్రకటించెను. (ప్రకటన 9:14) చారిత్రాత్మకంగా, బబులోను యూఫ్రటీసు నది ఒడ్డునవున్న మహా పట్టణం. మరి 1919 లో సాదృశ్యమైన నలుగురు దూతల విడుదలతో మహాబబులోను గుర్తింపదగిన రీతిగా కూలిపోవడం సంభవించింది. (ప్రకటన 14:8) గనుక, గమనించదగిన విషయమేమంటే, దేవుని కోపముతోనిండిన ఆరవ పాత్రకూడ యూఫ్రటీసు నదిని యిముడ్చుచున్నది. “ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానదిమీద కుమ్మరింపగా తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడునట్లు దాని నీళ్లు యెండి పోయెను.” (ప్రకటన 16:12) ఇదికూడ మహాబబులోనుకు దుర్వార్తయే!

21, 22. (ఎ) రక్షణగానున్న యూఫ్రటీసునది నీళ్లు సా.శ.పూ 539 లో ఎలా బబులోను నిమిత్తం ఎండిపోయాయి? (బి) మహాబబులోను కూర్చొనియున్న “జలములు” ఏమిటి, సాదృశ్యమైన యీ జలములు యిప్పుడుకూడ ఎలా ఎండిపోతున్నాయి?

21 ప్రాచీన బబులోను ఔన్నత్యదశలో నున్నప్పుడు, యూఫ్రటీసు నదిలోని విస్తారజలాలు దాని రక్షణకు పెట్టనికోటగా ఉండేవి. సా.శ.పూ. 539 లో పారసీక రాజైన కోరేషు దాని నీళ్లను మరోదారికి మళ్లించినప్పుడు అది ఎండిపోయింది. అలా, “తూర్పునుండి వచ్చు రాజులు” అంటే పారసీక రాజైన కోరేషు, మాదీయుల రాజైన దర్యావేషు (అంటే, తూర్పునుండి) బబులోనులో ప్రవేశించి దాన్ని జయించడానికి మార్గమేర్పరచింది. క్లిష్టసమయంలో, యూఫ్రటీసు నది ఆ మహాపట్టణాన్ని రక్షించలేకపోయింది. (యెషయా 44:27–45:7; యిర్మీయా 51:36) ప్రపంచ అబద్ధమత విధానానికి, ఆధునిక బబులోనుకు అటువంటిదేదో సంభవించనైవుంది.

22 మహాబబులోను “విస్తార జలములమీద కూర్చు”న్నది. ప్రకటన 17:1, 15 ప్రకారం ఇవి “ప్రజలను జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడు వారిని” అనగా తన రక్షణగా భావించిన అనుచరుల సైన్యాలను సూచిస్తున్నాయి. అయితే “జలములు” ఎండిపోతున్నాయి! ఒకనాడు ఎంతో ప్రాబల్యం కల్గియున్న పశ్చిమ ఐరోపాలో, పదికోట్లమంది బహిరంగంగా మతాన్ని విస్మరించారు. ఇంకా కొన్ని దేశాల్లో, మతప్రభావాన్ని మంటగలపడానికి ప్రయత్నించేలా ప్రకటిత పద్ధతి అంటూ ఒకటుంది. ఆ దేశాలలో జనసమూహము దాని పక్షం వహించడంలేదు. అలాగే, మహాబబులోను నాశనమయ్యే సమయమొచ్చినప్పుడు, క్షీణిస్తున్న దాని సభ్యులు దాన్నేవిధంగాను రక్షించలేరు. (ప్రకటన 17:16) కొన్నివందల కోట్ల సభ్యులు దానికున్నట్లు అది చెప్పుకుంటున్నప్పటికీ, మహాబబులోను “తూర్పునుండి వచ్చురాజులను” ఎదుర్కొనుటలో నిస్సహాయురాలౌతుంది.

23. (ఎ) సా.శ.పూ. 539 లో “తూర్పునుండి వచ్చు రాజులు” ఎవరైయుండిరి? (బి) ప్రభువు దినములో “తూర్పునుండి వచ్చు రాజులు” ఎవరు, వారెలా మహాబబులోనును నాశనం చేస్తారు?

23 ఈ రాజులెవరు? సా.శ.పూ. 539 లో వారెవరంటే, ప్రాచీన బబులోను పట్టణాన్ని జయించడానికి యెహోవా ఉపయోగించుకున్న మాదీయుడైన దర్యావేషు, పారసీకరాజైన కోరేషు. ఈ ప్రభువు దినములో, మహాబబులోను అబద్ధమత విధానంకూడ మానవపాలకుల చేత నాశనం చేయబడుతుంది. అయితే, ఇది దైవతీర్పైవుంటుంది. “తూర్పునుండి వచ్చురాజులు” అంటే, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు మహాబబులోను పైబడి దాన్ని బొత్తిగా నాశనం చేయులాగున మానవ పరిపాలకుల హృదయాలలో “ఏకాభిప్రాయాన్ని” పెడతారు. (ప్రకటన 17:16, 17) ఆరవ పాత్ర కుమ్మరించబడడం, యీ తీర్పు త్వరలో జరగనైవుందని బహిరంగంగా ప్రకటిస్తుంది!

24. (ఎ) యెహోవాయొక్క కోపముతోనిండిన మొదటి ఆరుపాత్రలలోనివి ఎలా ప్రచారము చేయబడ్డాయి, ఫలితమేమి? (బి) దేవుని కోపముతోనిండిన మిగిలిన పాత్రలను గూర్చి మనకు చెప్పకముందు ప్రకటన ఏమి బయల్పరుస్తుంది?

24 దేవుని కోపముతో నిండిన యీ మొదటి ఆరు పాత్రలు ప్రశాంత వర్తమానమును అందిస్తున్నాయి. దేవదూతల మద్దతుతో భూలోకంలోని దేవుని సేవకులు, వాటిలోని వర్తమానాలను భూదిగంతాలవరకు ప్రకటించడంలో నిమగ్నులైయున్నారు. ఈ విధంగా, సాతాను లోకవిధానంలోని అన్ని భాగాలకు తగిన హెచ్చరిక ఇవ్వబడింది, నీతివైపుతిరిగి జీవించులాగున యెహోవా ప్రతివారికి అవకాశమిచ్చాడు. (యెహెజ్కేలు 33:14-16) ఇంకా దేవుని కోపముతో నిండిన పాత్రలలో ఒకటి మిగిలివుంది. అయితే దాన్నిగూర్చి మనకు తెలిపేముందు, యెహోవా తీర్పులను ప్రకటించే పనిని సాతాను అతని భూలోక ప్రతినిధులు ఎలా తిరగ్గొట్టడానికి ప్రయత్నిస్తారో ప్రకటన బయల్పరుస్తుంది.

అర్మగిద్దోనుకు ప్రోగుచేయబడుట

25. (ఎ) అశుద్ధమైన, కప్పలవంటి “అపవిత్రాత్మల” గురించి యోహాను ఏమి చెబుతున్నాడు? (బి) ప్రభువు దినములో స్పష్టంగా గుర్తించగల కప్పలవంటి “అపవిత్రాత్మల” దూషణ ఎలా వస్తుంది, తత్ఫలితమేమి?

25 యెహాను మనకిలా చెబుతున్నాడు: “మరియు ఆ ఘటసర్పము నోటనుండియు క్రూరమృగము నోటనుండియు అబద్ధప్రవక్త నోటనుండియు కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగుచేయవలెనని వారియొద్దకు బయలువెళ్లెను.” (ప్రకటన 16:13, 14) మోషే కాలంలో, ఫరోపాలించిన ఐగుప్తు మీదికి యెహోవా అసహ్యమైన కప్పలమూలంగా తెగులును పంపగా, ఆ “భూమి కంపుకొట్టెను.” (నిర్గమకాండము 8:5-15) ప్రభువు దినములోకూడ అసహ్యమైన కప్పలవంటివి దర్శనమిచ్చాయి, యివి మరో మూలంనుండి వచ్చాయనుకోండి. అందులో సాతాను యొక్క “అపవిత్రాత్మలు” ఉన్నాయి, అంటే మానవ పరిపాలకులందరిని, “రాజులను” యెహోవా దేవునికి వ్యతిరేకంగా త్రిప్పడానికి తయారుచేసిన ప్రచారాన్ని స్పష్టంగా అవి సూచిస్తున్నాయి. దేవుని కోపముతో నిండిన పాత్రలను కుమ్మరించినప్పుడు వారు కొట్టుకొని పోకుండా ఉండాలని, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగుయుద్ధము” వచ్చినప్పుడు వారు సాతాను పక్షాన్నే ఉండాలని సాతాను నిశ్చయంగా కృషిచేస్తాడు.

26. (ఎ) ఏ మూడు మూలములనుండి సాతాను ప్రచారం వస్తుంది? (బి) “అబద్ధప్రవక్త” ఎవరు, అది మనకెలా తెలుసు?

26 మనకు ముందే ప్రకటనలో పరిచయమైన జంతువులు, అంటే “ఘటసర్పము” (సాతాను), క్రూరమృగము (సాతాను భూలోక రాజకీయ విధానం) యీ ప్రచారం చేస్తున్నాయి. మరైతే, యీ “అబద్ధ ప్రవక్త” ఎవరు? పేరులోమాత్రమే యిది క్రొత్తగా కనబడుతుంది. ఇంతకుముందు మనం, ఏడుతలల క్రూరమృగము యెదుట గొప్పసూచక క్రియలను చేసిన గొఱ్ఱెవంటి రెండు కొమ్ములుగల మృగాన్ని చూశాము. ఈ మోసకరమైన జంతువు ఆ క్రూరమృగానికి ఒక ప్రవక్తలా పనిచేసింది. అది క్రూరమృగం యొక్క ఆరాధనను పురికొల్పింది, దానికొక ప్రతిమ సహితం ఏర్పడేలా చూసింది. (ప్రకటన 13:11-14) గొఱ్ఱెపిల్లవంటి రెండు కొమ్ములున్న యీ మృగము యిక్కడ తెలుపబడిన “అబద్ధ ప్రవక్త”వంటిదే. దీన్ని ధృవీకరిస్తూ, రెండు కొమ్ములుగల క్రూరమృగం వలెనే యీ అబద్ధ ప్రవక్త “దానియెదుట [ఏడుతలల క్రూరమృగము] సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచినద”ని మనం ఆ తర్వాత చదువుతాము.—ప్రకటన 19:20.

27. (ఎ) యేసుక్రీస్తు స్వయంగా సమయానుకూలమైన ఏ హెచ్చరిక చేస్తున్నాడు? (బి) యేసు భూమ్మీదనున్నప్పుడు ఏ హెచ్చరిక చేశాడు? (సి) యేసు చేసిన హెచ్చరికను అపొస్తలుడైన పౌలు ఎలా ప్రతిధ్వనింపజేశాడు?

27 చుట్టూ సాతాను ప్రచారపు జోరు సాగుతున్న యీ సందర్భంలో యోహాను తదుపరి వ్రాస్తున్న మాటలు సమయోచితములే: “ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.” (ప్రకటన 16:16) ఎవరు దొంగవలె వస్తున్నారు? యెహోవా దండనాధికారిగా, అప్రకటిత సమయంలో యేసే స్వయంగా వస్తున్నాడు. (ప్రకటన 3:3; 2 పేతురు 3:10) భూమ్మీద తానున్నప్పుడు యేసు తనరాకడను దొంగతో పోలుస్తూ, యిలా చెబుతున్నాడు: “కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.” (మత్తయి 24:42, 44; లూకా 12:37, 40) ఈ హెచ్చరికను ప్రతిధ్వనింపజేస్తూ అపొస్తలుడైన పౌలు యిలా అన్నాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలియును. లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా . . . వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.” సాతాను యిప్పుడుకూడ “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని” తప్పుడు ప్రచారం చేయడానికి రాజ్యాలను పురికొల్పుతున్నాడు.—1 థెస్సలొనీకయులు 5:2, 3.

28. (ఎ) లోకవత్తిళ్లను ఎదిరించే విషయాన్ని గూర్చి యేసు ఏ హెచ్చరిక చేశాడు, క్రైస్తవులు తమమీదికి “ఉరివచ్చినట్టు” రాకూడదని వారు కోరుకొనే ఆ “దినము” ఏమిటి?

28 ఇటువంటి ప్రచారంతో నిండిన యీ లోకం క్రైస్తవులపైకి తెచ్చే వత్తిళ్లనుగూర్చి కూడ యేసు హెచ్చరించాడు. ఆయనిలా అన్నాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. . . . కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.” (లూకా 21:34-36) “ఆ దినము” అనేది “సర్వాధికారియైన దేవుని మహాదినము.” (ప్రకటన 16:14) యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించే “ఆ దినము” సమీపించేకొలది, జీవితపు ఐహిక విచారములను ఎదుర్కోవడం చాలా కష్టమౌతుంది. క్రైస్తవులు ఆ దినము వచ్చేవరకు మెలకువగా, జాగ్రత్తగా ఉండవలసిన అవసరముంది.

29, 30. (ఎ) నిద్రిస్తున్నట్లు కనబడేవారి “పై వస్త్రములు” తొలగించ బడుననే హెచ్చరికలోని భావమేమైయున్నది? (బి) పైవస్త్రాలు వాటిని ధరించిన వారిని గూర్చి ఏమని తెల్పుతాయి? (సి) ఒకడు తన సాదృశ్యమైన వస్త్రాలను ఎలా పోగొట్టుకోగలడు, దాని ఫలితమేమిటి?

29 నిద్రపోతున్నట్లు కనబడేవారి “పైవస్త్రము” తొలగించబడి అవమానింప బడతారనే హెచ్చరికలో ఏ భావం యిమిడివుంది? ప్రాచీన ఇశ్రాయేలీయులలో దేవాలయంలో కాపలాకాసే పనిలోవున్న యాజకునికిగాని లేవీయునికిగాని పెద్ద బాధ్యత ఉండేది. అలాంటి విధినిర్వహణలోనున్న ఎవరైనా నిద్రపోతున్నట్లు పట్టుబడితే, అతని వస్త్రాలు తీసివేసి వాటిని కాల్చివేసేవారు, అలా అతనికి పదిమందిలో అవమానం కలిగేదని యూదా వ్యాఖ్యాతలు మనకు చెబుతున్నారు.

30 ఈనాడును అటువంటిదేదో జరుగవచ్చని యేసు యిక్కడ హెచ్చరిస్తున్నాడు. యాజకులు, లేవీయులు యేసు అభిషక్త సహోదరులను సూచిస్తున్నారు. (1 పేతురు 2:9) అయితే యేసు హెచ్చరిక విశాల భావంలో గొప్పసమూహానికి కూడ వర్తిస్తుంది. ఇక్కడ తెల్పబడిన పైవస్త్రము అనేది దాన్ని ధరించుకున్న వ్యక్తి క్రైస్తవ యెహోవాసాక్షియని గుర్తించడానికి సూచనయైవుంది. (ప్రకటన 3:18; 7:14 పోల్చండి.) ఎవరైనా నిద్రించేలా లేక నిష్క్రియలోనికి దిగజారడానికి సాతాను లోకపు వత్తిళ్లను అనుమతిస్తే, బహుశ వారు పైవస్త్రాలు పోగొట్టుకోవచ్చు—మరోమాటలో చెప్పాలంటే, క్రైస్తవులుగా వారి గుర్తింపును జారవిడుచుకోవచ్చును. అటువంటి పరిస్థితి చాలా సిగ్గుకరమైంది. అటువంటిది ఒకడు దాన్ని పూర్తిగా జారవిడుచుకునే అపాయంలోనికి తేవచ్చును.

31. (ఎ) ప్రకటన 16:16 ,క్రైస్తవులు మెలకువగా ఉండవలసిన అవసరతనుగూర్చి ఎలా నొక్కిచెబుతోంది? (బి) ఆర్మగిద్దోనును గూర్చి కొందరు మతనాయకులు ఏమని ఊహించారు?

31 ప్రకటనలోని ఆ తర్వాతి వచనం నెరవేర్పుకు సమీపిస్తుండగా, క్రైస్తవులు మెలకువగా ఉండాల్సిన అగత్యత మరెక్కువగా కనబడుతోంది: “అవి (దయ్యముల మాటలు). . . హెబ్రీభాషలో హార్‌మెగిద్దోనను చోటుకు వారిని (భూలోకరాజులను లేక పరిపాలకులను) పోగుచేసెను.” (ప్రకటన 16:15) అర్మగిద్దోనని సర్వసాధారణంగా అనువదించబడిన యీ పేరు బైబిలునందు ఒకేఒక్కసారి కనబడుతుంది. కానీ అది మానవజాతి ఊహను తలక్రిందులు చేసింది. ప్రపంచనాయకులు అణ్వాయుధ ఆర్మగిద్దోను వస్తుందేమోనని హెచ్చరించారు. బైబిలు కాలంలో అనేక తీర్మానపూర్వక యుద్ధాలకు స్థలమైన ప్రాచీన మెగిద్దో పట్టణంతో కూడ యీ ఆర్మగిద్దోను సంబంధం కల్గివుంది, అందుకే కొందరు మతనాయకులు ఆ కొద్దిపాటి స్థలంలోనే భూమ్మీద అంతిమ యుద్ధం జరుగుతుందని ఊహించారు. ఈ విషయంలో వారు సత్యానికెంతో దూరంగా వున్నారు.

32, 33. (ఎ) హార్‌మెగిద్దోను లేక అర్మగిద్దోను అనే పేరు అక్షరార్థమైన స్థలాన్నికాకుండ దేన్ని సూచిస్తుంది? (బి) బైబిలునందలి ఏ ఇతర పదాలు “ఆర్మగిద్దోను” మాదిరిగానే లేక తత్సంబంధించినవై ఉన్నాయి? (సి) దేవుని కోపముతో నిండిన చివరి ఏడవ పాత్రను కుమ్మరించే సమయమెప్పుడు వస్తుంది?

32 హార్‌-మెగిద్దోను అనే పేరుకు “మెగిద్దో పర్వతము” అని అర్థం. అయితే అది అక్షరార్థమైన స్థలంగా కాకుండ, యెహోవా దేవునికి వ్యతిరేకంగా సమస్త రాజ్యాలు సమకూడుకునే ప్రపంచ పరిస్థితిని సూచిస్తుంది, అక్కడే ఆయన వారిని చివరకు నాశనం చేస్తాడు. ఇది భూవ్యాప్తంగా జరుగుతుంది. (యిర్మీయా 25:31-33; దానియేలు 2:44) అది, యెహోవా చేత హతులగుటకు జనాంగములన్నీ సమకూర్చబడే “దేవుని కోపమను ద్రాక్షల పెద్దతొట్టి” మరియు “తీర్పుతీర్చులోయ” లేక “యెహోషాపాతు లోయ” వంటిది. (ప్రకటన 14:19; యోవేలు 3:12, 14) అది సాతాను సైన్యమగు గోగుమాగోగు నాశనం చేయబడే ‘ఇశ్రాయేలీయుల భూమికి,’ మరియు మహా అధిపతియగు మిఖాయేలు చేతిలో ఉత్తరదిక్కు రాజు ‘తన నాశనమునకు’వచ్చే చోటు, “సముద్రములకును పరిశుద్ధానందములుగల పర్వతమునకును మధ్య” ఉండే స్థలమునకు కూడ సంబంధించింది.—యెహెజ్కేలు 38:16-18, 22, 23; దానియేలు 11:45–12:1.

33 సాతాను అతని భూలోక ప్రతినిధులనుండి పుట్టిన బెకబెకమనే ప్రచారాన్నిబట్టి రాజ్యాలన్నీ యీ పరిస్థితిలోనికి పోగుచేయబడినప్పుడు, దేవుని కోపముతో నిండిన చివరి పాత్రను కుమ్మరించడానికి ఏడవ దూతకు అదే సమయము.

“సమాప్తమాయెను!”

34. ఏడవ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరిస్తుంది, “గర్భాలయములో ఉన్న సింహాసనమునుండి” ఏ ప్రకటన బయలు వెళ్తుంది?

34“ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా—సమాప్తమైనదని చెప్పుచున్న యొక గొప్పస్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను.”—ప్రకటన 16:17.

35. (ఎ) ప్రకటన 16:17 నందలి “వాయుమండలము” ఏమిటి? (బి) వాయుమండలంపై తన పాత్రను కుమ్మరించడంద్వారా ఏడవ దూత ఏమి తెల్పుతున్నాడు?

35 చివరిగా ప్రాణాన్నికాపాడే “వాయుమండలము” తెగులుకు గురౌతుంది. అయితే యిది అక్షరార్థమైన వాయువుకాదు. యెహోవా చేతిలో తీర్పుపొందడానికి అక్షరార్థమైన భూమి, సముద్రము, జలధారలు, లేక సూర్యుడు ఏవిధంగా అర్హులుకాదో అలాగే అక్షరార్థమైన వాయువుకూడ యెహోవా ప్రతికూల తీర్పు పొందవలసినదంటూ ఏమిలేదు. బదులుగా, పౌలు సాతానును “వాయుమండల సంబంధమైన అధిపతి” అని పిలిచినప్పుడు ఆయన చర్చించిన “వాయువు” ఇదే. (ఎఫెసీయులు 2:2) అది యీనాడు లోకం పీల్చే సాతాను సంబంధిత “వాయువు,” అతని దుష్టవిధానమంతటిని గుర్తించే ప్రాణవాయువు, లేక సాధారణ మానసిక తలంపు, యెహోవా సంస్థకు వెలుపలనున్న జీవితములోని ప్రతిభాగములోను వ్యాపించియున్న సాతాను తలంపు. గనుక తనపాత్రలోనిది కుమ్మరించడంలో ఏడవదూత సాతానుకు, అతని సంస్థకు, యెహోవా సర్వాధిపత్యాన్ని ధిక్కరించడంలో సాతానుకు మద్దతునిచ్చేందుకు మానవుల్ని పురికొల్పే ప్రతిదానికి వ్యతిరేకంగా దేవుని తీర్పును ప్రకటిస్తుంది.

36. (ఎ) ఏడు తెగుళ్ల సారాంశమేమిటి? (బి) “సమాప్తమాయెను” అని యెహోవా ప్రకటించడంలో ఏమి సూచించబడుతుంది?

36 ఇది, ముందున్న ఆరు తెగుళ్లు, సాతాను అతని విధానంపై యెహోవా తీర్పుల మొత్తాన్ని తెలియజేస్తున్నాయి. అవి సాతానుకు అతని సంతానానికి నాశనాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ చివరిపాత్ర కుమ్మరింపబడినప్పుడు, యెహోవా తానే యిలా అంటున్నాడు: “సమాప్తమైనది!” అంటే చెప్పడానికి ఇంకేమీలేదు. దేవుని కోపముతోనిండిన పాత్రలలోనిది యెహోవాకు తృప్తికరంగా కుమ్మరింపబడినప్పుడు, యీ వర్తమానములు ప్రకటించిన తీర్పులను అమలుపర్చడంలో యిక జాప్యముండదు.

37. దేవుని కోపముతో నిండిన ఏడవ పాత్రలోనిది కుమ్మరించబడిన తర్వాత జరిగే విషయాన్ని గూర్చి యోహాను ఎలా వర్ణిస్తున్నాడు?

37 యోహాను యింకా యిలా చెబుతున్నాడు: “అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహా పట్టణము మూడు భాగములాయెను, అన్యజనుల పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను. అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశమునుండి మనుష్యులమీద పడెను; ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.”—ప్రకటన 16:18-21.

38. (ఎ) “పెద్ద భూకంపము” (బి) “మహాపట్టణము,” అయిన మహాబబులోను “మూడు భాగములుగా” చీలిపోవడం (సి) ‘ప్రతి ద్వీపము, పర్వతములు పారిపోవడం’ (డి) “వడగండ్ల తెగులు” ఏమి సూచిస్తున్నాయి?

38 ఇంకొకసారి, యెహోవా మానవులయెడల పొరపాటులేకుండ క్రియజరిగిస్తాడు, దీన్ని “మెరుపులును ధ్వనులును ఉరుములును” కల్గించి తెల్పుతున్నాడు. (ప్రకటన 4:5; 8:5 పోల్చండి.) విధ్వంసపూరిత భూకంపంవచ్చు రీతిలో ఎన్నడులేనంతగా మానవజాతి కదలింపబడును. (యెషయా 13:13; యోవేలు 3:16 పోల్చండి.) ఈ పెద్ద ప్రేలుడులాంటి కంపనము ఆ “మహాపట్టణము”ను, అంటే మహాబబులోనును కుదిపేస్తుంది, గనుకనే అది ‘మూడు భాగములగును’ అని సాదృశ్యంగా చెప్పబడినట్లు కోలుకోలేనంతగా నాశనమౌతుంది. మరియు, “అన్యజనుల పట్టణములు కూలి” పోతాయి. “ప్రతిద్వీపము” మరియు “పర్వతములు” అనగా యీ విధానంలో శాశ్వతమని తలంచబడే సంస్థలు, సంస్థాపనములు అంతరిస్తాయి. ఐగుప్తును ఏడవతెగులు బాధించినప్పుడు వచ్చిన దానికన్న ఎంతో ఎక్కువైన “పెద్దవడగండ్లు,” ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువున్నది, మానవజాతిని విపరీతమైన దెబ్బతో నలగగొడతాయి. * (నిర్గమకాండము 9:22-26) ఘనీభవించిన నీళ్లను కురిపించి యిచ్చే శిక్ష బహుశ, యీ విధానాంతం చివరకు వచ్చిందనితెల్పే యెహోవా తీర్పులను గూర్చిన శక్తివంతమైన నోటిమాటలను సూచిస్తూండవచ్చును. యెహోవా నాశనంచేసే తన పనిలో అక్షరార్థమైన వడగండ్లను కూడ ఉపయోగించ గల్గును.—యోబు 38:22, 23.

39. ఏడు తెగుళ్లు కుమ్మరించ బడినప్పటికి మానవజాతిలో అనేకులు ఏ చర్యగైకొంటారు?

39 అలా, సాతాను లోకం యెహోవా న్యాయమైన తీర్పును ఎదుర్కొంటుంది. చివరకు మానవుల్లో అనేకులు దేవున్ని ధిక్కరిస్తూ, దూషిస్తూనేవుంటారు. ప్రాచీన కాలంలోని ఫరోమాదిరే, పలుమారులు కలిగే తెగులువల్లగానీ, లేక అంతిమ మరణకరమగు ఆ తెగుళ్ల ముగింపుతోగానీ వారి హృదయం మెత్తబడదు. (నిర్గమకాండము 11:9, 10) చివరిక్షణాన, పెద్ద సంఖ్యలో జరిగే హృదయమార్పుదల ఉండదు. “నేను యెహోవానై యున్నానని తెలిసి”కొందురని ప్రకటించిన దేవున్ని వారు తమ కొనఊపిరితో దూషిస్తారు. (యెహెజ్కేలు 38:23) అయిననూ, సర్వోన్నతుడైన యెహోవా దేవుని సర్వాధిపత్యం నిరూపించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 10 నిర్జీవవస్తువులు సాక్ష్యమివ్వడం లేక సాక్షులుగా ఉండడమనే దృష్టాంతాల కొరకు ఆదికాండము 4:10; 31:44-53; హెబ్రీయులు 12:24, పోల్చండి.

^ పేరా 15 యేసునుద్దేశించి చెప్పిన ప్రవచనార్థక మాటల్లో “సింహాసనము” అనే పదం వాడబడింది: ”దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును.” (కీర్తన 45:6) యేసు యొక్క రాజ్యాధికారానికి యెహోవాయే మూలం లేక పునాది.

^ పేరా 38 యోహాను గ్రీకు తలాంతును మనస్సునందుంచుకుంటే, వడగండ్లలో ప్రతి ఒక్కటి 20 కిలోల బరువు ఉంటుంది. అది వినాశకరమైన వడగండ్లవానే.

[అధ్యయన ప్రశ్నలు]

[221వ పేజీలోని బాక్సు]

“భూమిమీద”

యోహాను తరగతి “భూమికి” వ్యతిరేకంగా యీ క్రింద యివ్వబడిన వ్యాఖ్యానములద్వారా యెహోవా ఉగ్రతను ప్రచారం చేసింది:

“అనేకశతాబ్దాల ప్రయత్నం తర్వాత, రాజకీయ పార్టీలు ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొని కలతపరచే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం లేదని రుజువు చేసుకున్నాయి. ఆర్థిక, రాజకీయ పరిశీలకులు యీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట వారేమి చేయలేరని కనుగొన్నారు.”—మిలియన్స్‌ నౌ లివింగ్‌ విల్‌ నెవర్‌ డై, 1920, పేజి 61.

“భూమ్మీద ఎక్కడనూ లోకంలోని ఏ కొద్దిమందినైనా సంతృప్తిపరచే ప్రభుత్వమేదీ యిప్పుడు కనబడడంలేదు. అనేక దేశాలను నియంతలు పాలించారు. ప్రపంచంయావత్తు పూర్తిగా దివాళా తీసింది.”—ఎ డిజైరబుల్‌ గవర్నమెంట్‌, 1924, పేజి 5.

“ఈ విధానానికి అంతం తేవడమే . . . లోకంనుండి దుష్టత్వాన్ని తరిమేసి, శాంతిని నీతిని వర్ధిల్లచేయగల ఏకైక మార్గము.”ఈ రాజ్య సువార్త,” 1954, పేజి 25.

“ప్రస్తుత ప్రపంచవిధాన ఏర్పాటు పాపాన్ని, అవినీతిని, దేవునికి ఆ న చిత్తానికి తిరుగుబాటు చేయడాన్ని వృద్ధిచేస్తూ దానికదే ఓ ప్రత్యేకమైనదిగా కనబరచుకున్నది . . . అది బాగుచేయలేనిదైంది. అందుకే దాన్ని తీసివేయాలి.”—ది వాచ్‌టవర్‌, నవంబరు 15, 1981, పేజి 6.

[223వ పేజీలోని బాక్సు]

“సముద్రములో”

యోహాను తరగతి కొన్నేళ్లుగా యెహోవానుండి దూరమైన నిమ్మళింపజాలని, తిరుగుబాటు చేసే “సముద్రము” అనే భక్తిహీన మానవజాతికి విరుద్ధంగా దేవుని ఉగ్రతను ప్రకటించిన వాటిలో ప్రచురితమైనవి కొన్నిమాత్రమే యీ క్రింద ఉన్నాయి:

“ప్రతిదేశం యొక్క చరిత్ర చూపేదేమంటే, అందులో వర్గపోరాటం ఉంటూనే ఉంది. అధిక సంఖ్యగలవారిపై జరిగిన పోరాటాలు తక్కువే. . . . ఈ పోరాటాల మూలంగా విప్లవాలు, బాధలు, మరియు ఎంతో రక్తపాతము జరిగింది.”—గవర్నమెంట్‌, 1928, పేజి 244.

నూతన లోకంలో, నిమ్మళింపని, భక్తిహీన ప్రజలుగల సాదృశ్యమైన ‘సముద్రము’లోనుండి అపవాది ఉపయోగార్థం చాలాకాలం క్రితం పైకివచ్చిన సాదృశ్యమైన క్రూరమృగము గతించిపోతుంది.”—ది వాచ్‌టవర్‌, సెప్టెంబరు 15, 1967, పేజి 567.

“ప్రస్తుతమున్న మానవ సమాజం ఆత్మీయ రోగంతో, వ్యాధిగ్రస్థమైవుంది. మనలో ఏ ఒక్కరము దాన్ని రక్షించలేము, ఎందుకంటె దానిరోగం దాన్ని మరణానికి నడిపిస్తుంది.”—ట్రూపీస్‌ అండ్‌ సెక్యూరిటీ—ఫ్రం వాట్‌ సోర్స్‌?, 1973, పేజి 131.

[224వ పేజీలోని బాక్సు]

“నదులలోను జలధారలలోను”

మూడవ తెగులు ‘నదులను జలధారలను’ యీ క్రింద యివ్వబడిన వర్తమానములద్వారా బహిర్గతం చేసింది:

“మతగురువులు, [క్రీస్తు] సిద్ధాంతాలను బోధిస్తున్నామని చెప్పుకునే బోధకులు, యుద్ధాన్ని దీవించి, దాన్ని పరిశుద్ధమైనదానిగా చేశారు. వారు తమ చిత్రపటాలు, విగ్రహాలు ఆ యుద్ధవీరుల పటాల సరసన ఉండాలని ఉబలాటపడ్డారు.”—ది వాచ్‌టవర్‌, సెప్టెంబరు 15, 1924, పేజి 275.

“ఆత్మాచారము [అభిచారము] అనేది గొప్ప అసత్యంమీద, అంటే మరణాంతర జీవితం, మానవాత్మ అమర్త్యమైనదనే అబద్ధంపై ఆధారపడివుంది.”—వాట్‌ డు ది స్క్రిప్చర్స్‌ సే ఎబౌట్‌ “సర్వైవల్‌ ఆఫ్టర్‌ డెత్‌?,” 1955, పేజి 51.

“మానవ తత్వశాస్త్రాలు, రాజకీయ సైద్ధాంతికులు, సామాజిక నిర్మాణకులు ఆర్థిక సలహాదారులు మరియు మతసాంప్రదాయాలను ప్రచారంచేసేవారు ప్రాణాన్ని తెప్పరిల్లచేసేవారు కాలేకపోయారు . . . అటువంటి జలధారలు వాటిని త్రాగేవారి రక్తాన్నిగూర్చి సృష్టికర్త యిచ్చిన చట్టాన్ని ఉల్లంఘించేలాగునను, మతపరమైన హింసలకు పాల్పడులాగున కూడ నడిపించాయి.”—“ఎవర్లాస్టింగ్‌ గుడ్‌న్యూస్‌” అనే అంతర్జాతీయ సమావేశంలో చేసిన తీర్మానము, 1963.

“విజ్ఞానపరమైన రక్షణేమికాదు గానీ, మానవజాతి నాశనమే మానవునినుండి ఎదురుచూడవలసింది. . . . లోకంలోనున్న మనస్తత్వ శాస్త్రజ్ఞులు, మానసిక చికిత్సా నిపుణులందరి వైపు నిరీక్షించి చూడలేము . . . యీ భూమిని నివాసయోగ్యంగా చేయడానికి ఏదొక అంతర్జాతీయ పోలీసు దళంపై మనమాధారపడలేము.”—సేవింగ్‌ ది హ్యూమన్‌ రేస్‌—ఇన్‌ ది కింగ్‌డం వే, 1970, పేజి 5.

[225వ పేజీలోని బాక్సు]

“సూర్యునిమీద”

“సూర్యుని” వలె మానవపాలన ప్రభువు దినములో మానవులను “కాల్చుతూ”వుంటే, యోహాను తరగతి, యీ క్రింద యివ్వబడినటువంటి వర్తమానాలు జరుగుతున్న విషయంపైకి అవధానాన్ని మళ్లించాయి.

“ఈనాడు హిట్లర్‌ మరియు ముస్సోలిని, మొండి నియంతలుగా వుండి, యావత్‌ ప్రపంచ శాంతికి భంగం వాటిల్లచేస్తున్నారు, మరియు స్వాతంత్ర్యాన్ని సర్వనాశనం చేయడంలో వారికి రోమన్‌ కాథోలిక్‌ మతపీఠాధిపత్యం పూర్తి మద్దతునిస్తుంది.”—ఫాసిజమ్‌ ఆర్‌ ఫ్రీడం, 1939, పేజి 12.

“చరిత్రంతటిలోను మానవ నియంతలు అనుసరించిన పద్ధతేమంటే, పాలించు లేదా పాడుచెయ్‌! అయితే, భూలోకమంతటికి దేవుడు నియమించిన రాజైన, యేసుక్రీస్తు వర్తింపజేయవలసిన నియమమేమంటే, పరిపాలించబడండి లేదా నాశనముకండి.”—వెన్‌ ఆల్‌ నేషన్స్‌ యునైట్‌ అండర్‌ గాడ్స్‌ కింగ్‌డం, 1961, పేజి 23.

“లోకమంతటా 1945 నుండి జరిగిన సుమారు 150 యుద్ధాల్లో రెండున్నర కోట్లమంది చంపబడ్డారు.”—ది వాచ్‌టవర్‌, జనవరి 15, 1980, పేజి 6.

“లోకమంతటనున్న దేశాలు . . . అంతర్జాతీయ నియమాన్ని లేక ప్రవర్తనా నియమావళిని పాటించాలనే విషయాన్ని లక్ష్యపెట్టడం లేదు. వారి లక్ష్యసాధనకు, కొన్నిదేశాలు వారు అవసరమనుకున్న ఏ కార్యాన్నైనా—సామూహిక హత్యలు, గూఢాచార హత్యలు, విమానాలను దారిమళ్లించడం, బాంబులు వేయడం, యిలా అనేకం చేయడం పూర్తిగా న్యాయమేనని వారనుకుంటారు . . . అటువంటి బుద్ధిలేని, బాధ్యతారహితమైన ప్రవర్తనతో యీ దేశాలు ఒకదానితోనొకటి ఎంతకాలం సహించుకుంటూ ఉంటాయి?”—ది వాచ్‌టవర్‌, ఫిబ్రవరి 15, 1985, పేజి 4.

[227వ పేజీలోని బాక్సు]

“క్రూరమృగము యొక్క సింహాసనము మీద”

యెహోవాసాక్షులు క్రూరమృగము యొక్క సింహాసనమును బహిర్గతం చేశారు మరియు యిటువంటి వర్తమానాలతో యెహోవా శాపవచనాన్ని ప్రచారం చేశారు:

“దేశాల పరిపాలకులు రాజకీయ మార్గదర్శకులు దుష్ట మానవాతీత శక్తుల ప్రభావం క్రిందనున్నారు, యీ శక్తులు వారిని తీర్మానపూర్వకమగు ఆర్మగిద్దోనులో ఆత్మాహుతికి ఎదురులేని రీతిగా పరుగెత్తిస్తున్నాయి.”—ఆఫ్టర్‌ ఆర్మగిద్దోన్‌—గాడ్స్‌ న్యూ వర్‌ల్డ్‌, 1953, పేజి 8.

“ఆ ‘క్రూరమృగము’ భక్తిహీన మానవప్రభుత్వం నుండివచ్చిన యీమృగం, ఘటసర్పంనుండి బలమును అధికారమును సింహాసనమును పొందింది. గనుక అది ఆవైపుకు, ఘటసర్పంవైపుకు మొగ్గాలి.”—ఆఫ్టర్‌ ఆర్మగిద్దోన్‌—గాడ్స్‌ న్యూ వర్‌ల్డ్‌, 1953, పేజి 15.

“అన్యరాజులు తమ్మునుతాము . . . దేవుని ముఖ్య శత్రువైన, అపవాదియగు సాతానువైపే ఉంచుకున్నారు.”—“డివైన్‌ విక్టరీ” అనే అంతర్జాతీయ సమావేశంలో చేపట్టిన తీర్మానము, 1973.

[229వ పేజీలోని బాక్సు]

“దాని నీళ్లు యెండిపోయెను”

ఇప్పుడుకూడ, బబులోను మతానికి అనేకప్రాంతాల్లో మద్దతు తగ్గిపోతుంది, “తూర్పునుండి వచ్చు రాజులు” ముట్టడించినప్పుడు జరుగబోవు దానినది సూచిస్తుంది.

“దేశవ్యాప్తంగా జరిపిన సర్వే ప్రకారం [థాయ్‌లాండ్‌] మునిసిపల్‌ ప్రాంతాల్లో నివసించేవారిలో 75 శాతం మంది ప్రసంగాలు వినడానికి బౌద్ధమఠాలకు అసలే వెళ్లరని, పల్లెప్రాంతాల్లో ఉండే వారిలో దేవాలయాలను దర్శించేవారి సంఖ్య యాభైశాతానికి పడిపోయిందని తేలింది.”—బ్యాంకాక్‌ పోస్ట్‌, సెప్టెంబరు 7, 1987 పేజి 4.

“రెండు వేల సంవత్సరాలక్రితం [చైనా] దేశంలో కనిపెట్టబడిన టౌయిజంలోని మాంత్రికత్వం మాయమైంది . . . యాజకులు, తాము తమకు ముందున్నవారు చాలామంది అనుచర బృందాలను సమకూర్చగలగడానికి కారణమైన మాంత్రికవిద్యలు లేనందున తమకు వారసులు కరువయ్యారు, దేశములోని ప్రధాన భాగంలో సంస్థీకరించబడిన విశ్వాసముగా టౌయిజం పూర్తిగా తుడిచిపెట్టుకు పోనైయున్నది.”—ది అట్లాంటా జర్నల్‌ అండ్‌ కాన్‌స్టిట్యూషన్‌, సెప్టెంబరు 12, 1982, పేజి 36-ఎ.

“జపాన్‌లో . . . ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో, దాదాపు 5,200 మంది మిషనరీలున్నారు, అయిననూ . . . జనాబాలో క్రైస్తవుల సంఖ్య 1% కంటె తక్కువే. . . . ఇక్కడ 1950వ దశాబ్దంనుండి పనిచేస్తున్న ఒక ఫ్రాన్స్‌ మతగురువు . . . ‘జపాన్‌లో విదేశీ మిషనరీల కాలం అయిపోయిందని నమ్ముతున్నాడు.’”—ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌, జూలై 9, 1986, పేజి 1.

ఇంగ్లాండ్‌లో గత మూడు దశాబ్దాలనుండి చర్చీలు “ఉపయోగించ బడనందువల్ల 16,000 ఆంగ్లికన్‌ చర్చీలలో దాదాపు 2,000 దాకా మూసివేయబడ్డాయి. నిశ్చయంగా క్రైస్తవ దేశాల్లోనే ఒకటైన యీ దేశంలో అతితక్కువగా ప్రజలు హాజరౌతున్నారు. . . . ‘ఇప్పుడిక ఇంగ్లాండ్‌ క్రైస్తవదేశం కాదు,’ అని [డ్యూరామ్‌ బిషప్‌] అన్నారు.—ది న్యూయార్క్‌ టైమ్స్‌, మే 11, 1987, పేజి ఎ4.

“కొన్ని గంటల తీవ్రవాదోపవాదం తర్వాత, [గ్రీసు] పార్లమెంట్‌ యీ రోజు చట్టాన్ని ఆమోదించింది, గ్రీకు ఆర్థడాక్స్‌ చర్చికున్న పెద్దపెద్ద ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సోషలిస్ట్‌ పార్టీకి అధికారమిచ్చింది. . . . అంతేగాక, చర్చి వ్యయముతో నడిచే హూటళ్లు, పాలరాతిగనులు, ఆఫీసు భవనాల నిర్వాహణకు బాధ్యులైన కమిటీలను, చర్చి కౌన్సిళ్లను, మతగురువులు-కాని వారి అధీనమందున్న వాటిని స్వాధీనం చేసుకోవడానికి చట్టం వీలుకల్పించింది.”—ది న్యూయార్క్‌ టైమ్స్‌, ఏప్రిల్‌ 4, 1987, పేజి 3.

[222వ పేజీలోని చిత్రం]

దేవుని కోపముతో నిండిన మొదటి నాలుగు పాత్రలు, మొదటి నాలుగు బూరలు ఊదినప్పుడుకల్గే తెగుళ్ల లాంటివాటినే తెస్తాయి

[226వ పేజీలోని చిత్రం]

సాతానుయొక్క కలుషితమైన “వాయువు” వల్ల నడిపించబడేవారు యెహోవా న్యాయతీర్పులను అనుభవించవలసిందే

[231వ పేజీలోని చిత్రం]

దయ్యాల ప్రచారం, భూరాజులందర్ని యెహోవా తీర్పులను వారిపై కుమ్మరించే హార్‌మెగిద్దోననే కీలకమైన స్థితికి నడిపిస్తూంది

[233వ పేజీలోని చిత్రం]

సాతాను క్రూరమృగానికి తన అధికారాన్ని యిచ్చిందని క్రూరమృగము యొక్క సింహాసనాన్ని గూర్చి అయిదవ పాత్ర బయల్పరుస్తుంది