కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని పరిశుద్ధ మర్మము—దాని మహిమగల ముగింపు!

దేవుని పరిశుద్ధ మర్మము—దాని మహిమగల ముగింపు!

అధ్యాయం 26

దేవుని పరిశుద్ధ మర్మము—దాని మహిమగల ముగింపు!

1. (ఎ) పరిశుద్ధ మర్మం సమాప్తమౌతుందని యోహాను మనకెలా తెలియజేస్తున్నాడు? (బి) దూతల సైన్యాలెందుకు బిగ్గరగా మాట్లాడు తున్నాయి?

ప్రకటన 10:1, 6, 7 నందు బలిష్ఠుడైన దూత చేసిన ప్రకటనను నీవు జ్ఞాపకము చేసికోగలవా? ఆయనిలా అన్నాడు: “ఇక ఆలస్యముండదు గాని యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడు తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును.” ఆ చివరి బూర ఊదడానికి యెహోవా నిర్ణయకాలం ఆసన్నమైంది! మరైతే పరిశుద్ధ మర్మము ఎలా సమాప్తమౌతుంది? ఈ విషయాన్ని మనకు తెల్పడానికి యోహాను ఎంతో ఆనందిస్తున్నాడు! ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు—ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తురాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.” (ప్రకటన 11:15) ఆ పరలోకసైన్యాలు ఉరుములవంటి స్వరములతో బిగ్గరగా మాట్లాడేందుకు హేతువున్నది! ఎందుకంటే యీ చారిత్రాత్మక ప్రకటనకు విశ్వవ్యాప్త ప్రాముఖ్యతవుంది. అది సజీవ సృష్టియంతటికి ఎంతో ప్రాముఖ్యత కల్గివుంది.

2. ఎప్పుడు, ఏ సంఘటనతో పరిశుద్ధమర్మం విజయవంతమైన ముగింపుకు తేబడింది?

2 ఆ పరిశుద్ధమర్మము దాని సంతోషకరమైన ముగింపుకు వస్తుంది! ప్రభువైన యెహోవా తన క్రీస్తును రాజుగా చేసినప్పుడు 1914 లో అది మహత్తరమైన, మహనీయమైన, విజయవంతమగు ముగింపుకొచ్చింది. తన తండ్రి తరపున పాలిస్తున్న యేసుక్రీస్తు తన విరోధులైన మానవులమధ్య చురుకైన పాలకునిగా అధికారం స్వీకరిస్తున్నాడు. వాగ్దానం చేయబడిన సంతానముగా, సర్పాన్ని అతని సంతానాన్ని నిర్మూలించడానికిని, యీభూమికి పరదైసు శాంతిని తేవడానికి ఆయన రాజ్యాధికారాన్ని పొందుతున్నాడు. (ఆదికాండము 3:15; కీర్తన 72:1, 7) మెస్సీయ రాజుగా, యేసు ఆ విధంగా యెహోవా వాక్యాన్ని నెరవేర్చుతాడు, మరియు “యుగయుగములు” సర్వాధిపతి యైన ప్రభువుగా పాలించనైయున్న “యుగములకు రాజైన” తన తండ్రి హక్కును నిరూపిస్తాడు.—1 తిమోతి 1:17.

3. యెహోవా దేవుడు, తానెల్లప్పుడూ రాజైయున్ననూ, భూమ్మీద యితర రాజ్యాలనెందుకు ఉండడానికి అనుమతించాడు?

3 అయితే “ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యము,” అంటే యెహోవాది ఎలా అవుతుంది? యెహోవా దేవుడు నిరంతరం రాజైయుండ లేదా? అది నిజమే, ఎందుకంటే లేవీయుడైన ఆసాపు యిలా పాడాడు: “పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజైయున్నాడు.” కీర్తనల మరో రచయిత యిలా చాటాడు: “యెహోవా రాజ్యము చేయుచున్నాడు . . . పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడవు నీవే.” (కీర్తన 74:12; 93:1, 2) అయిననూ, యెహోవా తన జ్ఞానంచొప్పున ఇతర రాజ్యాలను భూమిపై ఉండనిచ్చాడు. అలా దేవుడులేకుండా మానవుడు తననుతాను పరిపాలించుకొనగలడా అని ఏదెనులో తలెత్తిన వివాదాంశము పూర్తిగా పరీక్షింపబడింది. మానవపాలన సంపూర్తిగా విఫలమైంది. నిజానికి, దేవుని ప్రవక్త మాటలు వాస్తవాలే: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారివశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) మన మొదటి తలిదండ్రులు తిరుగుబాటు చేసినప్పటినుండి కూడ భూమియావత్తు “ఆది సర్పము,” అయిన సాతాను పాలనక్రిందనే ఉన్నది. (ప్రకటన 12:9; లూకా 4:6) ఇదే గొప్పమార్పుకు సమయం! యెహోవా హక్కుతోకూడిన తన స్థానాన్ని నిరూపించుకోవడానికి ఆయన తన నియమిత మెస్సీయ రాజ్యముద్వారా ఒక నూతన పద్ధతిలో యీ భూమ్మీద తన సర్వాధిపత్యాన్ని చూపడానికి ఆరంభిస్తున్నాడు.

4. బూరల శబ్దాలు 1922 లో వినబడడానికి ఆరంభించినప్పుడు ఏది ప్రథమ స్థానానికి తేబడింది? వివరించండి.

4 ఆ ఏడు బూరలు 1922 లో ఊదుట కారంభమైనప్పుడు, “పరలోకరాజ్యము సమీపించియున్నది” (మత్తయి 4:17) అనే అంశంమీద ఓహాయోనందలి సీడార్‌పాయింట్‌లో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశములో వాచ్‌టవర్‌ సొసైటి అధ్యక్షుడు, జె.యఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఓ ప్రసంగమిచ్చాడు. ఆయన ప్రసంగాన్ని యీమాటలతో ముగించాడు: “సర్వోన్నతుడైన దేవుని పిల్లలారా, మరల సేవకు బయలు దేరండి! మీ కవచాన్ని ధరించండి! స్థిరబుద్ధితో, మెలకువగా, చురుకుగా, ధైర్యంగా ఉండండి. ప్రభువుకు నమ్మకమైన, నిజమైన సాక్షులుగా ఉండండి. బబులోను జాడకూడ లేకుండా పోయేంతవరకు పోరాడడంలో ముందుకుసాగండి. సువార్తను సుదూర ప్రాంతాలకు ప్రకటించండి. యెహోవాయే దేవుడనియు యేసుక్రీస్తు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడని లోకం నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ రోజు అన్నింటికన్నా ప్రాముఖ్యమైన రోజు. ఇదిగో! రాజు పరిపాలిస్తున్నాడు! మీరాయన ప్రచార ప్రతినిధులు. గనుక రాజును ఆయన రాజ్యాన్ని ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.” క్రీస్తు పాలించే దేవునిరాజ్యము ముందుకు తీసుకురాబడింది, దానిమూలంగానే, దూతల మొత్తం ఏడు బూరలు ఊదేటటువంటి తీర్పులు చేరియున్న రాజ్యప్రచారం మహా ఉధృతంగా సాగింది.

5, మరి 1928 లో ఏడవ బూర ఊదే విషయాన్నిగూర్చి ఉన్నతపరచిన బైబిలు విద్యార్థుల సమావేశములో ఏమి జరిగింది?

5 ఏడవదూత బూర, 1928 జూలై 30-ఆగష్టు 6, వరకు మిచిగన్‌లోని డెట్రాయిట్‌నందు జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశ ఉన్నతాంశాలలో ప్రతిబింబించింది. ఆ కాలంలో 107 రేడియో ప్రచార స్టేషన్లను ఒకదానితో మరొకటి కలుపబడ్డాయి, దీన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ ‘చరిత్రలోనే పేరుకెక్కిన అత్యంత ఖరీదైన విస్తారమైన రేడియో ప్రసారము’ అని అభివర్ణించింది. ఆ సమావేశములో “యెహోవాకు అనుకూలంగా, సాతానుకు వ్యతిరేకంగా” ఉత్సాహంతో ఒక శక్తివంతమైన తీర్మానం చేయబడింది. ఇది ఆర్మగిద్దోనులో సాతానును అతని దుష్ట సంస్థను పడద్రోసే విషయాన్ని, నీతిని ప్రేమించే వారందరికి విడుదలను సూచించింది. దేవుని నమ్మకమైన ప్రజలు గవర్నమెంట్‌ అనే 368-పుటల పుస్తకాన్ని ఆ సమావేశంలో అందుకోవడంలో ఆనందించారు. ఇది “దేవుడు తన అభిషక్తుని 1914 లో రాజుగా నియమించాడని” అతిస్పష్టమైన రుజువులనిచ్చింది.

యెహోవా అధికారాన్ని తీసుకుంటున్నాడు

6. క్రీస్తు దేవుని రాజ్యానికి రాజయ్యాడనే ప్రకటనను యోహాను ఎలా తెల్పుతున్నాడు?

6 క్రీస్తు దేవుని రాజ్యానికి రాజయ్యాడు—ఈ ప్రకటన ఎంతటి ఆనందాన్నిస్తుందో! యోహానిలా నివేదిస్తున్నాడు: “అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారముచేసి—వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, (యెహోవా, NW.) సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.ప్రకటన 11:16, 17.

7. యెహోవా దేవునికి (ఎ) భూమ్మీదనున్న సాదృశ్యమైన 24 మంది పెద్దలలో శేషించినవారు, (బి) పునరుత్థానులై పరలోకంలోవారి స్థానాలను ఆక్రమించుకున్న సాదృశ్యమైన ఆ 24 మంది పెద్దలు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు?

7 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వీరు పరలోక స్థానమందున్న క్రీస్తు అభిషక్త సహోదరులను సూచిస్తున్న 24 మంది పెద్దలే. ఈ 1,44,000 మంది అభిషక్తులలో భూమ్మీదనున్న శేషము 1922 నుండి బూరలు ఊదడంతో ఆరంభమైన పనిలో నిమగ్నమైయున్నారు. వారు మత్తయి 24:3–25:46 వరకు యివ్వబడిన సూచన పూర్తి ప్రాముఖ్యతను గుర్తెరిగారు. అయినను, ప్రభువుదినము ప్రారంభంలోకూడ యిప్పటికే ‘మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లు రుజువు చేసుకున్న’ వారి తోటిసాక్షులు వారి పరలోక స్థానాలకొరకు పునరుత్థానులయ్యారు, అలా వారిప్పుడు యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించే 1,44,000 గుంపును సూచించగలరు. (ప్రకటన 1:10; 2:10) సర్వాధికారియైన ప్రభువు తన పరిశుద్ధ మర్మమును మహోన్నత ముగింపుకు తేవడంలో ఆలస్యం చేయలేదని వారెంత కృతజ్ఞులై యున్నారోగదా!

8. (ఎ) జనములమీద ఏడవదూత బూర ప్రభావం ఎలావుంది? (బి) జనములు ఎవరిపై తమ కోపాన్ని వెళ్లగ్రక్కాయి?

8 మరోవైపుచూస్తే, ఏడవబూర ఊదడం జనులకు ఏ సంతోషం కల్గించడంలేదు. యెహోవా కోపాగ్నికి వారు గురికావలసిన సమయమొచ్చింది. యోహానిలా తెలియజేస్తున్నాడు: “జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పుపొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలము నిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.” (ప్రకటన 11:18) జనములు 1914 నుండి ఒకరిపై ఒకరు, దేవుని రాజ్యంపైన, ముఖ్యంగా యెహోవా యిద్దరు సాక్షులమీద మహాకోపం కనపరస్తున్నారు.—ప్రకటన 11:3.

9. జనములు భూమినెలా నాశనం చేస్తున్నాయి, మరి దాన్నిగూర్చి దేవుడేమి చేయాలని నిర్ణయించుకున్నాడు?

9 చరిత్రయంతటిలోను జనములు వారి నిరంతర యుద్ధాలమూలంగాను, తప్పుడు నిర్వహణవల్లను భూమిని నాశనం చేస్తున్నారు. అయినా, 1914 నుండి యీ నాశనం మరీ విపరీతంగా జరుగుతుంది. పేరాశ, లంచగొండితనంవల్ల ఎడారులు పెరిగి, సారవంతమైన భూమి సర్వనాశనమైపోయింది. ఆమ్లవర్షం, రేడియోధార్మిక మేఘాలు చాలాప్రాంతాలను పాడుచేశాయి. ఆహారవనరులు కలుషితమయ్యాయి. మనం పీల్చేగాలి, మనం త్రాగేనీళ్లు కలుషితమయ్యాయి. పారిశ్రామిక వ్యర్థపదార్థాలు భూమి, సముద్రంలోని ప్రాణులకు ప్రాణాపాయమును తెస్తున్నాయి. అగ్రరాజ్యాలు తమ అణుసంహారకాలచేత మానవాళిని సమూలనాశనం చేస్తామన్నట్లు బెదిరిస్తున్నాయి. సంతోషమేమంటే, యెహోవా “భూమిని నశింపజేయువారిని నశింపజేయును.” ఆయన యీ భూమిలోనున్న దుస్థితికి కారకులైన గర్విష్ఠులైన భక్తిహీన మానవులకు తీర్పుతీరుస్తాడు. (ద్వితీయోపదేశకాండము 32:5, 6; కీర్తన 14:1-3) అందుకే, యెహోవా యీ తప్పిదస్థులను జవాబుదారులుగా చేయడానికి మూడవ శ్రమను ఏర్పాటుచేస్తున్నాడు.—ప్రకటన 11:14.

నాశనకారులకు శ్రమ!

10. (ఎ) మూడో తెగులేమిటి? (బి) మూడో తెగులు ఏ విధంగా బాధకంటే యింకెక్కువే తెస్తుంది?

10 అయితే, యిదిగో మూడవ శ్రమ. అది త్వరగా వస్తుంది! యెహోవా తన “పాదపీఠమును,” మనం నివసిస్తున్న యీ అందమైన భూమిని, అపవిత్రపరచే వారిని నాశనంచేసే ఉపకరణమే అది. (యెషయా 66:1) అది దేవుని పరిశుద్ధ మర్మమైన మెస్సీయరాజ్యం ద్వారా కలుగుతుంది. దేవుని శత్రువులు, విశేషంగా క్రైస్తవమత సామ్రాజ్యపు నాయకులు మొదటి రెండు తెగుళ్లవలన—ముఖ్యంగా మిడతల తెగులు మరియు గుఱ్ఱపురౌతుల సైన్యంవల్ల కలిగే తెగులు మూలంగా బాధించ బడుతున్నారు; గానీ స్వయంగా యెహోవా రాజ్యమే నిర్వహించే యీ మూడవ తెగులు బాధకన్నా ఎక్కువే తెస్తుంది. (ప్రకటన 9:3-19) అది మానవసమాజాన్ని, దానిపాలకులను తుడిచివేసే చావుదెబ్బ కొడుతుంది. ఇది ఆర్మగిద్దోనులో యెహోవా తీర్పుకు ముగింపు రూపంలో వస్తుంది. ఇది దానియేలు ప్రవచించినలాగే ఉన్నది: “ఆ రాజుల [భూమిని నాశనం చేస్తున్న పాలకుల] కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిపొందిన వారికిగాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగములవరకు నిలుచును.” ఒక పెద్ద మేరు పర్వతంలాగే, దేవుని రాజ్యం మహిమనొందిన భూమిని పరిపాలిస్తుంది, యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపిస్తూ, మానవజాతికి నిత్యాశీర్వాదాలను తెస్తుంది.—దానియేలు 2:35, 44; యెషయా 11:9; 60:13.

11. (ఎ) ఏ సంతోషకరమైన సంఘటనా పరంపరలను ప్రవచనం వర్ణిస్తుంది? (బి) ఏ కృప అనుగ్రహించబడింది, ఎలా, ఎవరివలన?

11 మూడో శ్రమవెంట ప్రభువు దినములో క్రమేపి జరిగే సంతోషకరమైన సంఘటనల పరంపరలు సంభవిస్తూవుంటాయి. ‘మృతులు తీర్పుపొందుటకును, దేవునికి భయపడువారికిని, తన ప్రవక్తలకును, పరిశుద్ధులకును తగిన ప్రతిఫలమిచ్చుటకును’ అది సమయమైయున్నది. అంటే అది మృతుల పునరుత్థానమని అర్థం! అప్పటికే మరణించియున్న అభిషక్తులైన పరిశుద్ధులకు యీ పునరుత్థానం ప్రభువుదినపు ప్రారంభంలో జరుగుతుంది. (1 థెస్సలొనీకయులు 4:15-17) సకాలంలో పరిశుద్ధులలో మిగిలినవారు తక్షణ పునరుత్థానం ద్వారా వీరిని కలుసుకుంటారు. ఇతరులుకూడ బహుమానం పొందవలసి యున్నారు, వీరిలో మహాశ్రమలనుండి తప్పించుకొను గొప్పసమూహం వారేగాని, లేక క్రీస్తు వెయ్యేండ్లపరిపాలన కాలంలో “గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన” వారిలో జీవానికి లేపబడినవారేగాని, ఎవరైనా మానవజాతిలో దేవునికి భయపడు వారును, ప్రాచీనకాలంలోని ప్రవక్తలగు తన దాసులును అందులో చేరివుంటారు. దేవుని మెస్సీయ రాజుదగ్గర మరణము మృతులలోకము యొక్క తాళపు చెవులు ఉన్నందువలన ఆయన పరిపాలన నిత్యజీవానికి అర్హులైనవారందరికి దానిననుగ్రహించే మార్గాన్ని సుగమం చేస్తుంది. (ప్రకటన 1:18; 7:9, 14; 20:12, 13; రోమీయులు 6:22; యోహాను 5:28, 29) అది పరలోకంలో అమర్త్యతే గానీ, భూమ్మీద నిత్యజీవమే గానీ, యీ జీవవరం యెహోవా కృపవల్ల కలిగేదే, అందుకు దాన్నిపొందేవారు నిరంతరం కృతజ్ఞులైయుండవచ్చును!—హెబ్రీయులు 2:9.

ఆయన నిబంధన మందసమును చూడండి!

12. (ఎ) ప్రకటన 11:19 ప్రకారం, యోహాను పరలోకంలో ఏం చూశాడు? (బి) నిబంధనా మందసము దేనికి సూచన, మరి ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా కొనిపోబడినపుడు దానికేమైంది?

12 యెహోవా రాజ్యం చేస్తున్నాడు! ఆయన తన మెస్సీయ రాజ్యంద్వారా, మానవజాతిపై ఒక అద్భుతమైన రీతిలో సర్వాధిపత్యం వహిస్తున్నాడు. ఇది యోహాను తదుపరి చూసేదాన్నిబట్టి స్థిరపర్చబడుతుంది: “మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను.” (ప్రకటన 11:19) ప్రకటనలో యిక్కడ మాత్రమే దేవుని మందసమును గూర్చి చెప్పబడింది. ఆ మందసమే తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా ప్రత్యక్షతను సూచించేదైయుండెను. దాన్ని గుడారంలోను, తర్వాత సొలొమోను కట్టించిన దేవాలయములోని అతిపరిశుద్ధ స్థలంలోనే ఉంచారు. అయితే ఇశ్రాయేలీయులు సా.శ.పూ. 607 లో బబులోనుకు చెరగా తీసుకుపోబడినపుడు, యెరూషలేము నిర్మానుష్యమైంది, ఆ నిబంధన మందసము అదృశ్యమైంది. అప్పుడే దావీదు వంశస్థుల ప్రతినిధులు “యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండుట” ఆగిపోయింది.—1 దినవృత్తాంతములు 29:23. *

13. దేవుని నిబంధనా మందసము పరలోక దేవాలయములో కనబడిందనే వాస్తవం దేనిని సూచిస్తుంది?

13 ఇప్పుడు, 2,500 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత, ఆ మందసం మరోసారి కనిపించింది. అయితే యోహాను దర్శనంలో యీ మందసం భూసంబంధమైన ఆలయంలో లేదు. అది దేవుని పరలోకమందిరంలో ఉంది. మరోసారి, యెహోవా దావీదు గోత్రములోనుండి వచ్చిన ఒకరాజు ద్వారా పాలిస్తున్నాడు. అయితే, ఈసారి రాజైన క్రీస్తుయేసు, పరలోక యెరూషలేములో సింహాసనాసీనుడయ్యాడు—ఆయన యెహోవా తీర్పులను తీర్చడానికది ఉన్నతస్థలమై యున్నది. (హెబ్రీయులు 12:22) ప్రకటనలోని దీని తర్వాతి అధ్యాయాలు మనకీ విషయాలను బయల్పరుస్తాయి.

14, 15. (ఎ) ప్రాచీన యెరూషలేములో ఎవరు మాత్రమే నిబంధనా మందసమును చూడగలిగారు, ఎందుకు? (బి) దేవుని పరలోక దేవాలయములో తన నిబంధనా మందసమును ఎవరు చూడగలరు?

14 ప్రాచీన భూలోక యెరూషలేములో, అటు ఇశ్రాయేలీయులేగాని, యిటు దేవాలయంలో సేవచేసే యాజకులేగాని ఆ మందసమును చూడలేదు, ఎందుకంటే అది పరిశుద్ధస్థలం తెరవెనుకనున్న అతిపరిశుద్ధస్థలంలో ఉండేది. (సంఖ్యాకాండము 4:20; హెబ్రీయులు 9:2, 3) ప్రధానయాజకుడు మాత్రమే తాను సంవత్సరానికొకసారి బలియర్పణ దినమున అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు దాన్ని చూసేవాడు. అయిననూ, పరలోకంలోని దేవాలయపు మందసము తెరువబడినప్పుడు, ఆ సాదృశ్యమైన మందసము యెహోవా యొక్క ప్రధానయాజకుడైన యేసుక్రీస్తుకేగాక, యోహానుతోసహా ఆయన ఉపయాజకులైన 1,44,000 మందికి కూడ కనబడుతుంది.

15 పరలోకానికి మొదట పునరుత్థానులైనవారు యీ సాదృశ్యమైన మందసమును దగ్గరిగా చూస్తారు, ఎందుకంటే, వారు యెహోవా సింహాసనం చుట్టూవున్న 24 మంది పెద్దలలో ఒకరిగా తమస్థానాలను ఆక్రమించియున్నారు. మరి భూమ్మీదనున్న యోహాను తరగతి యెహోవా ఆత్మవలన ఆయన ఆత్మీయాలయంలో ఆయన ప్రత్యక్షతను గ్రహించడానికి వెలిగింపబడుచున్నారు. ఈ అద్భుతమైన విషయాన్నిగూర్చి సాధారణ మానవులను మేల్కొల్పడానికి సూచనలుకూడ ఉన్నాయి. యోహానుకు కల్గిన దర్శనం మెరుపులు, శబ్దములు, ఉరుములు, భూకంపము, వడగండ్లను గూర్చి తెల్పుతుంది. (ప్రకటన 8:5 పోల్చండి.) ఇవి దేన్ని సూచిస్తున్నాయి?

16. మెరుపులు, శబ్దములు, ఉరుములు, భూకంపము, మరియు గొప్ప వడగండ్లు ఎలా వచ్చాయి?

16 మత సామ్రాజ్యంలో 1914నుండి మహాగందరగోళం జరుగుతూంది. అయినా, యీ “భూకంపము” వెంట దేవుని రాజ్యాన్ని గూర్చి సమర్పిత శబ్దాలు స్పష్టమైన సమాచారాన్ని వినిపిస్తున్నాయనుట సంతోషమే. బైబిలునుండి ఉరుమువంటి ‘తుపాను హెచ్చరికలు’ చేయబడ్డాయి. మెరుపువలె, దేవుని ప్రవచనార్థక వాక్యమును గూర్చిన వెలుగు కిరణాలు కనబడ్డాయి, ప్రచురించబడ్డాయి. క్రైస్తవమత సామ్రాజ్యం మీదను, సాధారణ అబద్ధమతం మీదను దేవుని తీర్పులనే బలమైన “వడగండ్లు” కురిశాయి. ఇదంతా ప్రజలదృష్టికి వచ్చి ఉండాలి. గానీ అనేకులు—యేసు కాలంలోని ప్రజలమాదిరే—ప్రకటనలోని యీ సూచనల నెరవేర్పును గ్రహించలేకపోతున్నారనుట శోచనీయము.—లూకా 19:41-44.

17, 18. (ఎ) ఏడుగురు దూతల బూరల స్వరములు సమర్పిత క్రైస్తవులపై ఎటువంటి బాధ్యతను తెచ్చాయి? (బి) క్రైస్తవులెలా వారి పనిని నెరవేరుస్తున్నారు?

17 ఆ యేడుదూతలు తమ బూరలు ఊదుతూ, యీ భూమ్మీద జరిగే చారిత్రాత్మక సంఘటనలను గూర్చి హెచ్చరిస్తున్నారు. సమర్పిత క్రైస్తవులు యీ ప్రకటనలనుగూర్చి ప్రపంచానికి ప్రకటిస్తూండే పెద్దబరువైన బాధ్యతను కలిగివున్నారు. వారెంత ఆనందంగా ఆ బాధ్యతను నెరవేరుస్తున్నారో గదా! ఇది గత పదేళ్లలోనే, 1984నుండి 1993 వరకు, వారి పరిచర్యలో సాలీన రెండింతల సమయాన్ని, అంటే 50,55,88,037 గంటల నుండి 105,73,41,972 గంటల వరకు—109 శాతం వెచ్చించారు. నిజంగా, “సువార్త ప్రకారము దేవుని మర్మము” “భూదిగంతములవరకు” ప్రకటింపబడుతోంది.—ప్రకటన 10:7; రోమీయులు 10:18.

18 దేవునిరాజ్య సంకల్పాలు బయల్పరచ బడుచుండగా యితర దర్శనాలిప్పుడు మనకొరకు వేచివున్నాయి.

[అధస్సూచీలు]

^ పేరా 12 రోమా చరిత్రకారుడు, టాసిటస్‌ తెల్పేదేమంటే, సా.శ.పూ 63 లో యెరూషలేము ముట్టడించబడినపుడు, నియస్‌ పొంపియస్‌ ఆలయ మందసంలో ప్రవేశించగా అది నిర్మానుష్యంగా ఉన్నట్లు చూశాడు. అందులో నిబంధన మందసంలేదు.—టాసిటస్‌ హిస్టరీ, 5.9.

[అధ్యయన ప్రశ్నలు]

[173వ పేజీలోని బాక్సు]

యెహోవా యొక్క బూరవంటి తీర్పు ప్రకటనల ఉన్నతాంశాలు

1. 1922 సీడార్‌ పాయింట్‌, ఓహాయో: క్రైస్తవమత సామ్రాజ్యంలోని మత, రాజకీయ, పెద్ద వ్యాపారాలకు చెందిన నాయకులకు తాము శాంతి, సంతోష సౌభాగ్యాలను తేవడంలో విఫలమైన విషయాన్ని ఒప్పుకోవాలని ఒక సవాలు విసరడం. మెస్సీయ రాజ్యమే దివ్య ఔషధము.

2. 1923 లాస్‌ ఏంజిల్స్‌, కాలిఫోర్నియా: “ఆల్‌ నేషన్స్‌ నౌ మార్చింగ్‌ టు ఆర్మగెడన్‌, బట్‌ మిలియన్స్‌ నౌ లివింగ్‌ విల్‌ నెవర్‌ డై,” అనే బహిరంగ ప్రసంగం, సమాధానాన్ని ప్రేమించే “గొఱ్ఱెలు” మరణకరమగు సముద్రమనే మానవజాతిని విడిచిరమ్మని పిలుపునిచ్చింది.

3. 1924 కొలంబస్‌, ఓహాయో: మతబోధకులు తమ్మునుతాము ఉన్నతపరచుకున్నందుకు, మెస్సీయ రాజ్యాన్ని ప్రకటించడానికి తిరస్కరించినందుకు నేరం మోపబడ్డారు. నిజమైన క్రైస్తవులు దేవుని ప్రతిదండనను గూర్చి తప్పక ప్రకటించాలి, దుఃఖించే మానవజాతిని ఓదార్చాలి.

4. 1925 ఇండియానోపొలిస్‌, ఇండియానా: క్రైస్తవమత సామ్రాజ్యంలోని అంధకారంతో పోలిస్తే శాంతి సౌభాగ్యం, ఆరోగ్యం, జీవం, స్వేచ్ఛ, మరియు నిత్యానందములతో పాటు మంచి నిరీక్షణా సందేశము.

5. 1926 లండన్‌, ఇంగ్లాండ్‌: క్రైస్తవమత సామ్రాజ్యమును దాని గురువులను మిడతలవంటి తెగులుతో బాధించడం, దేవుని రాజ్యాన్ని వారు తిరస్కరించడాన్ని గూర్చి బయటపెట్టడం, మరియు ఆ పరలోక ప్రభుత్వ స్థాపనను ప్రస్తుతించడము.

6. 1927 టోరంటొ, కెనడా: గుఱ్ఱపురౌతుల సైన్యము తీసుకుని వెళ్లినట్లే, ఒక ఆహ్వానాన్ని అందిస్తూ, ప్రజలు ‘సాంప్రదాయ క్రైస్తవత్వాన్ని’ వదలిపెట్టి, యెహోవా దేవునికి, ఆయన రాజుకు, రాజ్యానికి హృదయపూర్వక భక్తిశ్రద్ధలనివ్వాలనే ఆహ్వానము.

7. 1928 డెట్రాయిట్‌, మిచిగన్‌: సాతానుకు వ్యతిరేకంగా, యెహోవాకు అనుకూలంగా ఒక తీర్మానం, 1914 లో సింహాసనాసీనుడైన దేవుని అభిషక్త రాజు సాతాను దుష్టసంస్థను నాశనంచేసి, మానవజాతిని విముక్తిచేస్తాడని స్పష్టంగా చెప్పడము.

[175వ పేజీలోని బాక్సు]

భూమిని నాశనము చేయుట

“ప్రతి మూడు సెకండ్లకు ఫుట్‌బాల్‌ ఆటస్థలమంత భూమి వర్షాపాత అరణ్యంలో అదృశ్యమౌతుంది . . . ఈ ప్రాముఖ్యమైన అరణ్యాలకు నష్టం వాటిల్లడంవల్ల, వేలాది మొక్కలు, జంతుజాలాలు నాశనమై పోతున్నాయి.”ఇలస్ట్రేటెడ్‌ అట్లాస్‌ ఆఫ్‌ ద వర్‌ల్డ్‌ (రాండ్‌ మెక్‌నాలీ).

“వివాదం తీరిన రెండేండ్లలోనే, [పెద్ద సరస్సులు] ప్రపంచంలో అత్యంత పెద్దమురికి గుంటలయ్యాయి.”—ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ (కెనడా).

ఏప్రిల్‌, 1986న యు.యస్‌.యస్‌.ఆర్‌ లోని చెర్నోబిల్‌ నందలి అణుశక్తి స్థావరంలో సంభవించిన ప్రేలుడు, చెలరేగిన అగ్ని, “హిరోషిమా నాగసాకి లపై వేసిన బాంబులకన్న . . . అత్యంత ప్రాముఖ్యమైన ప్రేలుడు సంఘటనగా,” అది ప్రపంచంలోని గాలి, నేల, నీళ్లలోనికి ముందెన్నడు బాంబులుగాని, అణుపరీక్షలుగాని విడువనంత దీర్ఘకాల ధార్మికశక్తిని విడుదల చేసింది.”—జామా ది న్యూయార్క్‌ టైమ్స్‌.

మినామాట, జపాన్‌లో ఒక రసాయన కంపెనీ సముద్రంలోనికి మెథిల్‌మెర్క్యూరిని వదిలింది. దానిమూలంగా చెడిపోయిన చేపలను, గుల్లచేపలను తినడంవల్ల మినామాట రోగం (ఎమ్‌డి) “దీర్ఘకాల నరాల వ్యాధి వచ్చింది . . . ఇప్పటికీ (1985) జపాన్‌ అంతటా 2,578 మంది ప్రజలు ఆ యమ్‌డి అనే వ్యాధిని కలిగివున్నట్లు అధికారుల లెక్కలు తెల్పుతున్నాయి.”—ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎపిడిమియోలజీ.

[176వ పేజీలోని బాక్సు]

గంభీరమైన ప్రకటనలు అంటే ప్రకటన 11:15-19 నందున్నవి రాబోవు దర్శనాలకు ముంగుర్తులు. ప్రకటన 12వ అధ్యాయం, ప్రకటన 11:15, 17 లోని గొప్ప ప్రకటనలను సవివరంగా చాటించే పూర్వరంగమే. భూమికి నాశనాన్ని తెచ్చిన సాతాను యొక్క రాజకీయ సంస్థ ఆరంభాన్ని అభివృద్ధిని వర్ణిస్తుంది గనుక ప్రకటన 13 అధ్యాయం, 11:18 నకు వెనుకటి చరిత్రను తెల్పుతుంది. మరి 14, 15 అధ్యాయాలు, ఏడవ బూర శబ్దానికి, మూడోశ్రమకు ముడిపెడుతూ రాజ్యసంబంధమైన తీర్పులనుగూర్చి యింకా వివరాలిస్తున్నాయి.

[174వ పేజీలోని చిత్రం]

యెహోవా “భూమిని నశింపజేయువారిని నశింపజేయును”