కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము”

“నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము”

అధ్యాయం 12

“నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము”

ఫిలదెల్ఫియ

1. యేసు ఆరవ వర్తమానం ఏ పట్టణంలోని సంఘాన్ని ఉద్దేశించి యివ్వబడింది, ఆ పట్టణం పేరుకున్న అర్థమేమిటి?

సహోదర అనురాగం—ఎంత కోరదగిన లక్షణం! యేసు తన ఆరవ వర్తమానాన్ని ఫిలదెల్ఫియలోని సంఘాన్ని ఉద్దేశించి యిచ్చినప్పుడు నిశ్చయంగా యీ లక్షణం ఆయన మనస్సులో ఉంది, ఎందుకంటే, ఫిలదెల్ఫియ అంటే “సహోదర అనురాగము” అని అర్థం. వృద్ధుడైన యోహాను, 60 ఏండ్ల క్రితం పేతురు యేసుతో, ఆయనంటే తనకు ఎంతో ప్రేమవుందని ముమ్మారు చెప్పిన సందర్భాన్ని యింకా జ్ఞాపకం పెట్టుకున్నాడు. (యోహాను 21:15-17) ఫిలదెల్ఫియలోని క్రైస్తవులు తామును సహోదర ప్రేమను కనబరస్తున్నారా? నిజంగా కనబరుస్తున్నారు!

2. ఫిలదెల్ఫియ ఎటువంటి పట్టణం, అక్కడ ఎటువంటి సంఘం వుండేది, యీ సంఘపు దూతకు యేసు ఏం చెబుతున్నాడు?

2 సార్దీస్‌కు ఆగ్నేయదిశగా 30 మైళ్లదూరంలో (ఆధునిక టర్కీ పట్టణమైన ఆలాసేహిర్‌ వున్న ప్రాంతం) ఉన్న యోహాను కాలంనాటి ఫిలదెల్ఫియ బాగా అభివృద్ధిచెందుతున్న పట్టణమే. అంతకంటె ముఖ్యంగా, అక్కడున్న క్రైస్తవసంఘం అభివృద్ధి గమనించదగినది. బహుశ సార్దీస్‌మీదుగా ప్రయాణించివచ్చిన సువార్తికుని వారెంత ఆనందంతో ఆహ్వానించారోగదా! ఆయన తెస్తున్న వర్తమానం వారికి పురికొల్పు సలహా కలిగివుంది. అయితే మొదట అది దాన్ని పంపిన గొప్ప వ్యక్తిని గూర్చి తెల్పుతుంది. ఆయనిలా చెబుతున్నాడు. “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము—దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు.”—ప్రకటన 3:7.

3. యేసు “పరిశుద్ధుడు,” అని పిలువబడుట ఎందుకు యుక్తము, ఆయన “సత్యవంతుడు” అని ఎలా చెప్పగలం?

3 మానవుడైన యేసుక్రీస్తుతో పేతురు యిలా చెప్పినవిషయం యోహాను విన్నాడు: “నీవే నిత్యజీవపు మాటలుగలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము.” (యోహాను 6:68, 69) యెహోవా దేవుడే పరిశుద్ధతకు అసలు మూలం గనుక, తన అద్వితీయ కుమారుడు కూడ తప్పక “పరిశుద్ధుడై” ఉండాలి. (ప్రకటన 4:8) యేసు “సత్యవంతుడు” కూడ. ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం (ఆలితినోస్‌) సత్యసంధత అనే అర్థమిస్తుంది. ఈ భావంలోనే యేసు పరలోకంనుండి దిగివచ్చిన నిజమైన వెలుగు, ఆహారమైయున్నాడు. (యోహాను 1:9; 6:32) ఆయన నిజమైన ద్రాక్షావల్లి. (యోహాను 15:1) యేసు సత్యవంతుడంటే ఆయన నమ్మదగినవాడని కూడ అర్థం. ఆయనెల్లప్పుడు సత్యమే మాట్లాడతాడు. (యోహాను 8:14, 17, 26 చూడండి.) ఈ దేవుని కుమారుడు రాజుగాను యాజకునిగాను ఉండడానికి నిజంగా అర్హుడే.—ప్రకటన 19:11, 16.

“దావీదు తాళపుచెవి”

4, 5. “దావీదు తాళపు చెవి” ఏ నిబంధనతో సంబంధం కల్గివుంది?

4 యేసు “దావీదు తాళపుచెవి” కలిగి వున్నాడు. దాన్ని ఉపయోగించే ఆయన ‘యెవడును వేయలేకుండ తీయువాడు ఎవడును తీయలేకుండ వేయువాడు.’ మరి యీ “దావీదు తాళపుచెవి” ఏమిటి?

5 యెహోవా ఇశ్రాయేలీయుల రాజైన దావీదుతో నిత్యరాజ్య నిబంధన చేశాడు. (కీర్తన 89:1-4, 34-37) దావీదువంశం, యెహోవా సింహాసనము నుండి సా.శ.పూ. 1070నుండి 607వరకు యెరూషలేమును పాలించింది, గాని ఆ రాజ్యం దుష్టత్వంవైపు తిరిగినందుకు దేవుడు దానికి తీర్పుతీర్చాడు. అలాగున యెహోవా యెహెజ్కేలు 21:27 నందలి తన ప్రవచనాన్ని నెరవేర్చడాని కారంభించాడు: “నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయుదును [భూలోక యెరూషలేమును]; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు [దావీదువంశపు రాజరికము] నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.”

6, 7. “స్వాస్థ్యకర్త” ఎప్పుడు, ఎక్కడ ప్రత్యక్షం కావలసియుండెను?

6 ఈ “స్వాస్థ్యకర్త” ఎప్పుడు ఎలా ప్రత్యక్షం కావలసియుండెను? దావీదు రాజదండం ఎలా అతనికివ్వ బడుతుంది?

7 సుమారు 600 సంవత్సరాల తర్వాత దావీదు రాజు వంశస్థురాలైన యూదా కన్యయైన మరియ, పరిశుద్ధాత్మవలన గర్భవతియైంది. దేవుడు గబ్రియేలు దూతను మరియ దగ్గరికి పంపి ఆమెకొక కుమారుడు కలుగబోతాడని, అతనికి యేసు అని పేరుపెట్టాలని చెబుతాడు. గబ్రియేలు యింకా యిలా అన్నాడు: “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు (యెహోవా NW) ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును.”—లూకా 1:31-33.

8. యేసు దావీదురాజ్య వారసత్వాన్ని పొందే అర్హుడని ఎలా నిరూపించుకున్నాడు?

8 సా.శ. 29 లో యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మచే అభిషేకించబడినప్పుడు ఆయన దావీదు వంశానుక్రమంలో రాజ్యాభిషేకం పొందాడు. ఆయన రాజ్యసువార్త ప్రకటించడంలో మంచి మాదిరి చూపాడు, తన శిష్యులు అలాగే చేయాలని వారికి ఆజ్ఞాపించాడు. (మత్తయి 4:23; 10:7, 11) యేసు మ్రానుమీద మరణమగునంతగా తననుతాను తగ్గించుకున్నాడు, అలా దావీదు రాజ్యాన్ని స్వతంత్రించుకునే పూర్ణార్హుడని స్వయంగా రుజువు చేసుకున్నాడు. యెహోవా యేసును అమర్త్యప్రాణిగా పునరుత్థానుని చేశాడు, పరలోకమందు తన కుడిపార్శ్వమునకు హెచ్చించాడు. ఆయనక్కడ దావీదు రాజ్యవారసత్వపు హక్కులన్నీ పొందాడు. సకాలంలో యేసు “తన శత్రువులమధ్యను పరిపాలన” చేసే తన హక్కుతో ఏలుతాడు.—కీర్తన 110:1, 2; ఫిలిప్పీయులు 2:8, 9; హెబ్రీయులు 10:13, 14.

9. యేసు, దావీదు తాళపు చెవిని, తీయడానికి వేయడానికి ఎలా ఉపయోగిస్తాడు?

9 ఈ మధ్యలో, యేసు దావీదు తాళపుచెవుల నుపయోగించి దేవుని రాజ్యానికి సంబంధించిన అవకాశాలు, ఆధిక్యతలు తెరుస్తాడు. యేసుద్వారా యెహోవా యిప్పుడు భూమ్మీదనున్న అభిషక్త క్రైస్తవులను “అంధకార సంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి,” వారిని “తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులుగా” చేస్తాడు. (కొలొస్సయులు 1:13, 14) అపనమ్మకస్థులెవ్వరూ ప్రవేశించకుండ కూడ ఆ తాళపు చెవులు వుపయోగించ బడతాయి. (2 తిమోతి 2:12, 13) దావీదు రాజ్యపు యీ శాశ్వత వారసునికి యెహోవా మద్దతున్నందువల్ల అటువంటి విధులాయన నిర్వహించకుండా ఏ ప్రాణియు ఆపలేదు.—మత్తయి 28:18-20 పోల్చండి.

10. ఫిలదెల్ఫియ సంఘానికి యేసు ఎలాంటి ప్రోత్సాహమిస్తున్నాడు?

10 అటువంటి అధికారపూర్వక మూలంనుండి వస్తున్నందున, ఫిలదెల్ఫియలోని క్రైస్తవులకు యేసు పలికిన మాటలు విశేషంగా ఓదార్పు కరంగా వుంటాయి. ఆయనవారిని అభినందిస్తూ యిలా అంటున్నాడు: “నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ యెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు.” (ప్రకటన 3:8) సంఘం చురుగ్గానేవుంది, మరి దానియెదుట ఒక ద్వారం తెరువబడివుంది—అది నిశ్చయంగా సేవావకాశమే. (1 కొరింథీయులు 16:9; 2 కొరింథీయులు 2:12 పోల్చండి.) గనుకనే, యేసు ఆ సంఘాన్ని, సువార్త ప్రకటించే అవకాశాన్ని సంపూర్తిగా వినియోగించు కోవాలని ప్రోత్సహిస్తున్నాడు. వారు సహించారు, మరియు దేవుని శక్తి సహాయంతో యెహోవా సేవలో యింకా ‘పనులు’ చేసేందుకు తగినశక్తి వారికుందని చూపించారు. (2 కొరింథీయులు 12:10; జెకర్యా 4:6) వారు యేసు ఆజ్ఞలకు విధేయులయ్యారు, మరి క్రీస్తును మాటద్వారా గాని క్రియద్వారాగాని తృణీకరించలేదు.

“వారు నీకు నమస్కారము చేసెదరు”

11. యేసు క్రైస్తవులకు ఏ దీవెనను వాగ్దానం చేస్తున్నాడు, మరిదెలా నెరవేరింది?

11 అందుచేత యేసువారికి ఫలితాన్ననుగ్రహిస్తున్నాడు: “యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారువచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారము చేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనునట్లు చేసెదను.” (ప్రకటన 3:9) బహుశ స్ముర్నలో వున్నట్లే యీ సంఘంలోకూడ స్థానిక యూదుల బెడద ఉండియుండవచ్చు. యేసు వీరిని “సాతాను సమాజపు వారని” పిలుస్తున్నాడు. అయినప్పటికి, యేసును గూర్చి క్రైస్తవులు ప్రకటించేది సత్యమేనని ఆ యూదులలో కొందరు గ్రహించనై యుండిరి. వారి ‘నమస్కారమనేది’ బహుశ, పౌలు 1 కొరింథీయులు 14:24, 25 లో, వర్ణించిన మాదిరిగా వుండవచ్చు, అలా వారు నిజంగా పశ్చాత్తాపపడి, క్రైస్తవులౌతారు, తన శిష్యుల కొరకు తన ప్రాణాన్ని అర్పించడంలో యేసు చూపిన గొప్పప్రేమను పూర్తిగా అభినందిస్తారు.—యోహాను 15:12, 13.

12. ఫిలదెల్ఫియలోని యూదుల సమాజపు సభ్యులు, తమలో కొందరు స్థానిక క్రైస్తవసమాజానికి “నమస్కరించ” వలసి వుంటుందని తెలిసికొనుటకు బహుశ ఎందుకు విస్మయమొంది వుంటారు?

12 ఫిలదెల్ఫియలోని యూదా సమాజపు సభ్యులు, వారిలో కొందరు స్థానిక క్రైస్తవ సమాజానికి వంగి నమస్కరించ వలసివుందని తెలుసుకోవడానికి బహుశ చాలా విస్మయమొందే వుంటారు. ఆ సంఘంలో యూదులు కానివారే అధికంగా వున్న వాస్తవాన్నిబట్టి మరోవిధంగా జరగాలని వారెదురు చూస్తారు. ఎందుకు? ఎందుకంటే యెషయా యిలా ప్రవచించాడు: “[యూదులు కానివారు] రాజులు నిన్ను [ఇశ్రాయేలీయులను] పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు.” (యెషయా 49:23; 45:14; 60:14) అలాగే వ్రాయడానికి జెకర్యా ప్రేరేపించబడ్డాడు: “ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది [యూదులు కానివారు] యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (జెకర్యా 8:23) అవును, యూదులు కానివారు యూదులకు వంగి నమస్కరించాలే గానీ మరోమార్గంలేదు!

13. ప్రాచీన ఇశ్రాయేలీయుల నుద్దేశించిన ప్రవచనాల నెరవేర్పును అనుభవించే యూదులెవరై యుండిరి?

13 ఆ ప్రవచనాలు దేవుడెన్నుకున్న జనాంగము నుద్దేశించి చెప్పబడ్డాయి. అవి ప్రచింపబడినప్పుడు, శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు ఆ గౌరవనీయ స్థానంలోవున్నారు. అయితే యూదా జనాంగం మెస్సీయను తిరస్కరించినప్పుడు యెహోవా వారిని త్రోసిపుచ్చాడు. (మత్తయి 15:3-9; 21:42, 43; లూకా 12:32; యోహాను 1:10, 11) సా.శ. 33 పెంతెకొస్తునాడు, ఆయన వారికి బదులు దేవుని నిజమైన ఇశ్రాయేలును అనగా క్రైస్తవ సంఘాన్ని ఎన్నుకున్నాడు. దాని సభ్యులు నిజమైన హృదయ సున్నతి కల్గిన ఆత్మీయ యూదులు. (అపొస్తలుల కార్యములు 2:1-4, 41, 42; రోమీయులు 2:28, 29; గలతీయులు 6:16) అటుతర్వాత శరీరసంబంధులైన యూదులు యెహోవాతో అనుగ్రహం పొందిన స్థానంలోనికి రావాలంటే ఒకేఒక మార్గమేమంటే, వారు యేసును మెస్సీయయని ఆయనయందు విశ్వాసముంచుటే. (మత్తయి 23:37-39) ఫిలదెల్ఫియలోని కొందరి విషయంలో నిశ్చయంగా యిది జరగనైయుండెను *

14. యెషయా 49:23 మరియు జెకర్యా 8:23 యీ ఆధునిక కాలంలో ఎలా ప్రాముఖ్యమైన నెరవేర్పును కల్గివున్నాయి?

14 ఈ ఆధునిక కాలంలో యెషయా 49:23 మరియు జెకర్యా 8:23 వంటి ప్రవచనాలు చాలా ప్రాముఖ్యమైన నెరవేర్పును కల్గివున్నాయి. యోహాను తరగతి చేస్తున్న సువార్త ప్రకటన మూలంగా ప్రజలు పెద్దసంఖ్యలో తెరువబడిన ద్వారంగుండా రాజ్యసేవలోనికి ప్రవేశించారు. * వారిలో అనేకులు, తాము ఆత్మీయ ఇశ్రాయేలు అని తప్పుగా చెప్పకుంటున్న క్రైస్తవమత సామ్రాజ్యంలోనుండి వచ్చియున్నారు. (రోమీయులు 9:6 పోల్చండి.) వీరు ఒక గొప్ప సమూహంగా యేసు బలిరక్తంనందు విశ్వాసముంచుట ద్వారా తమ వస్త్రములను ఉదుకుకొని తెల్లవిగా చేసికొన్నారు. (ప్రకటన 7:9, 10, 14) క్రీస్తు రాజ్యపాలనకు లోబడుతూ వారు భూమిమీద దాని దీవెనలు పొందాలని నిరీక్షిస్తున్నారు. ఆత్మీయ దృష్టితో మాట్లాడితే, వారు యేసు అభిషక్త సహోదరుల యొద్దకు వచ్చివారికి “నమస్కారము” చేస్తున్నారు, ఎందుకంటే, దేవుడు వారికి తోడైవున్నాడని వీరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా సహోదరత్వంలో వీరును యేకమౌతూ, యీ అభిషక్తులకు పరిచర్యచేస్తున్నారు.—మత్తయి 25:34-40; 1 పేతురు 5:9.

“శోధన కాలం”

15. (ఎ) యేసు ఫిలదెల్ఫియలోని క్రైస్తవులకు ఏమి వాగ్దానం చేస్తున్నాడు, మరి వారేం చేయడానికి పురికొల్పబడ్డారు? (బి) క్రైస్తవులు ఏ “కిరీటం” పొందాలని ఎదురు చూస్తుండిరి?

15 యేసు యింకా యిలా చెబుతున్నాడు: “నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమందంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింప కుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము.” (ప్రకటన 3:10, 11) యోహాను తరగతివారు ప్రభువు దినమువరకు (1914 లో ఆరంభమైంది) జీవించియుండలేరు గనుక యేసు రానైయున్నాడనే వారి దృఢనమ్మకమే వారికి ప్రకటించే పనిలో శక్తినిస్తుంది. (ప్రకటన 1:10; 2 తిమోతి 4:2) పరలోకంలో వారికొరకు “కిరీటం,” లేదా నిత్యజీవమనే బహుమానం వేచివుంది. (యాకోబు 1:12; ప్రకటన 11:18) వారు మరణం వరకు నమ్మకంగావుంటే, వారా బహుమానం పొందకుండ వారిని ఎవరూ ఆపలేరు.—ప్రకటన 2:10.

16, 17. (ఎ) “లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలము” ఏమిటి? (బి) “శోధన కాలము’ ఆరంభంలో అభిషక్తుల పరిస్థితెలా వుంది?

16 మరైతే, “శోధనకాలము” ఏమిటి? నిశ్చయంగా, ఆసియాలోనున్న ఆ క్రైస్తవులు రోమా ప్రభుత్వం నుండి గొప్పహింస నెదుర్కోవలసి వచ్చింది. * అయిననూ, దానిలోని అధిక భాగపు నెరవేర్పు ఏమంటే, చివరకు ప్రభువు దినములో వచ్చిన అంటే 1918 లో ఉచ్ఛస్థాయికి చేరిన గాలింపు, తీర్పు కాలమే. ఆ శోధన ఒకడు స్థాపించబడిన దేవుని రాజ్యంకొరకా, లేక సాతాను కొరకాయని నిర్ణయించడానికే. అది కొద్దికాలంకొరకే, ఒక ‘గడియ,’ గాని అదింకా అయిపోలేదు. అది ముగిసేవరకు, మనమా “శోధనకాలము”లో వున్నామని నిశ్చయంగా మర్చిపోకూడదు.—లూకా 21:34-36.

17 ఫిలదెల్ఫియలోని పట్టుదలగల ఆ సంఘంవలె—1918 లో యోహాను తరగతి అభిషక్త క్రైస్తవులు, ఆధునిక కాలపు ‘సాతాను సమాజము’ నుండి హింస నెదుర్కోవలసి వచ్చింది. ఆత్మీయ యూదులమని చెప్పుకుంటున్న క్రైస్తవ మతసామ్రాజ్య మతనాయకులు, కుయుక్తితో నిజమైన క్రైస్తవులను అణచాలని పరిపాలకులను పురికొల్పారు. అయిననూ, వీరు ‘సహనాన్ని గూర్చిన యేసు మాటను అనుసరించ’డానికి ఎంతో కష్టపడ్డారు; కావున, ముఖ్యమైన “చిన్నశక్తి,” ఆత్మీయ సహాయంతో వారు దాన్ని తప్పించుకొని, వారియెదుట యిప్పుడు తెరువబడిన ద్వారంలో ప్రవేశించడానికి ఉద్యుక్తులయ్యారు. ఏ విధంగా?

“తెరువబడిన ద్వారము”

18. యేసు 1919 లో ఎవరిని నియమించాడు, మరి నియమితు డెలా హిజ్కియా నమ్మకమైన గృహనిర్వాహకునివలె అయ్యాడు?

18 యేసు తన వాగ్దానాన్ని నెరవేర్చి 1919 లో నిజమైన అభిషక్త క్రైస్తవులను తన ‘నమ్మకమును బుద్ధిమంతుడైన దాసునిగా’ గుర్తించాడు. (మత్తయి 24:45-47) వీరు హిజ్కియా రాజుకాలంలో నమ్మకస్థుడైన గృహనిర్వాహకుడగు ఎల్యాకీమువంటి ఆధిక్యతనే అనుభవించారు. * యెహోవా ఎల్యాకీముతో యిలా అన్నాడు: “నేను దావీదు ఇంటితాళపు అధికార భారమును అతని భుజముమీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు.” ఎల్యాకీము, దావీదువంశపు రాకుమారుడైన హిజ్కియాయొక్క గొప్ప బాధ్యతలను చేపట్టాడు. అలాగే యీనాడు, అభిషక్తులైన యోహాను తరగతికి “దావీదు తాళపుచెవి” భారం యివ్వబడింది, అంటే మెస్సీయ రాజ్యానికి సంబంధించిన భూలోక పనుల భారం వీరికివ్వబడిందని అర్థం. యెహోవా తన సేవకులను యీ ఆధిక్యతకొరకు బలపరచి, వారికున్న కొద్దిపాటిశక్తిని లోకవ్యాప్తంగా గొప్పసాక్ష్యమిచ్చే పనినిమిత్తం అవసరమయ్యేంత అద్భుతమైన శక్తిగా తయారుచేశాడు.—యెషయా 22:20, 22; 40:29.

19. యేసు 1919 లో యోహాను తరగతికిచ్చిన బాధ్యతల్ని ఎలా నిర్వర్తించారు, తత్ఫలితమేమి?

19 యేసుమాదిరి ననుసరిస్తూ, అభిషక్తశేషం 1919 నుండి చాలా చురుకుగా రాజ్యసువార్త ప్రచార దండయాత్రను ప్రారంభించారు. (మత్తయి 4:17; రోమీయులు 10:18) తత్ఫలితంగా, సాతాను ఆధునిక సమాజమైన క్రైస్తవమత సామ్రాజ్యంనుండి కొందరు పశ్చాత్తాపపడి, ‘వంగి నమస్కరించి’ దాసుని అధికారాన్ని అంగీకరించి, యీ అభిషక్తశేషం యొద్దకొచ్చారు. వారుకూడ యోహాను తరగతి పెద్దలతో కలిసి యెహోవాను సేవించడానికి వచ్చారు. యేసు అభిషక్త సహోదరుల సంఖ్యమొత్తం పూర్తయ్యేవరకు యిది కొనసాగింది. దీని తర్వాత, “ప్రతిజనములోనుండి . . . ఒక గొప్ప సమూహము,” అభిషక్త దాసుని “యెదుట పడి నమస్కారము చేయుటకు” వచ్చింది. (ప్రకటన 7:3, 4, 9) ఈ దాసుడు, గొప్పసమూహం యిరువురు కలిసి యెహోవా సాక్షులనే ఒకే మందగా సేవచేస్తున్నారు.

20. యెహోవాసాక్షులెందుకు విశేషంగా యీనాడు విశ్వాసంలో బలంగా వుండాలి, దేవుని సేవలో చురుకుగా ఉండాలి?

20 ఫిలదెల్ఫియలోని క్రైస్తవులు నిజమైన సహోదర అనురాగంలో ఏకమైనట్లే, యెహోవాసాక్షులీనాడు వారుచేసే ప్రకటనాపని అవశ్యంగా జరగాలని కోరుకుంటున్నారు. త్వరలో, మహాశ్రమలు సాతాను దుష్టలోకం మీదికి విరుచుకుపడతాయి. ఆ సమయంలో మనం విశ్వాసంలో బలంగాను, దేవుని సేవలో చురుగ్గావుంటే, అప్పుడు మన పేర్లు యెహోవా జీవగ్రంథం నుండి తీసివేయబడవు. (ప్రకటన 7:14) ఫిలదెల్ఫియ సంఘానికి యేసు యిచ్చిన సలహాను మనం అతి తీవ్రంగా పరిగణించి, మన సేవాధిక్యతలను గట్టిగా చేపట్టుదాము, నిత్యజీవ నిరీక్షణ పొందుదాము.

జయించువారి దీవెనలు

21. అభిషక్త క్రైస్తవులీనాడెలా ‘యేసు సహనమును గూర్చి యిచ్చిన మాటను పాటించారు,’ వారికే నిరీక్షణ వుంది?

21 యోహాను తరగతి యీనాడు, ‘యేసు సహనపు మాటను పాటించారు,’ అంటే, వారాయన మాదిరి ననుసరించారు, సహించారు. (హెబ్రీయులు 12:2, 3; 1 పేతురు 2:21) అలావారు, ఫిలదెల్ఫియ సంఘానికి యేసు యింకను చెప్పిన యీ మాటలవల్ల ఎంతో ప్రోత్సహించ బడ్డారు: “జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు.”—ప్రకటన 3:12ఎ.

22. (ఎ) యేసుయొక్క దేవుని దేవాలయం ఏమిటి? (బి) జయించే యీ అభిషక్త క్రైస్తవులెలా యీ దేవాలయపు స్తంభాలౌతారు?

22 యెహోవా ఆలయంలో ఒక స్తంభంగా ఉండటం ఎంతటి ఆధిక్యతో! పురాతన యెరూషలేములో, (అక్షరార్థమైన) దేవాలయం యెహోవా ఆరాధనకు కేంద్రం. ప్రధానయాజకుడు సంవత్సరానికి ఒక్కరోజు, అద్భుతమైన వెలుగు ప్రకాశించి యెహోవా ప్రత్యక్షతను సూచించిన ఆ దేవాలయంలోని “అతిపరిశుద్ధ స్థలములో” జంతువుల రక్తాన్ని ప్రోక్షించేవాడు. (హెబ్రీయులు 9:1-7) యేసు బాప్తిస్మం పొందిన సమయంలో, మరోగొప్ప ఆత్మీయ మందిరం, అంటే యెహోవాను ఆరాధించడానికి దేవాలయాన్ని పోలిన ఏర్పాటు ఉనికిలోనికి వచ్చింది. ఈ దేవాలయపు అతిపరిశుద్ధ స్థలం పరలోకంలోనే, యేసు ప్రవేశించిన “దేవుని సముఖమందు”న్నది. (హెబ్రీయులు 9:24) యేసే ప్రధాన యాజకుడు, మరి పాపముల పూర్ణపరిహారం నిమిత్తం ఒక్క బలిమాత్రమే అర్పంచబడింది: అదే పరిపూర్ణ మానవుడైన యేసు చిందించిన రక్తం. (హెబ్రీయులు 7:26, 27; 9:25-28; 10:1-5, 12-14) అభిషక్త క్రైస్తవులు తాము నమ్మకంగా వున్నంతకాలం యీ దేవాలయపు భూఆవరణలో సేవచేస్తుంటారు. (1 పేతురు 2:9) అయితే, వారొకసారి జయించిన తర్వాత వారుకూడ ఆ పరలోక అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించి, దేవాలయపు ఆరాధనా ఏర్పాటుకు స్తంభాలవలె నిశ్చల మద్దతునిస్తారు. (హెబ్రీయులు 10:19: ప్రకటన 20:6) వారు “ఇకమీదట ఎన్నటికిని వెలుపలికి” పోతారనే భయముండదు.

23. (ఎ) జయించు అభిషక్త క్రైస్తవులకు యేసు తదుపరి ఏమి వాగ్దానం చేస్తున్నాడు? (బి) జయించు క్రైస్తవులమీద యెహోవా నామమును, నూతన యెరూషలేము నామమును వ్రాయడంలో వచ్చే ఫలితమేమిటి?

23 యేసు యింకా యిలా చెబుతున్నాడు: “నాదేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవునిపట్టణపు పేరును, నాక్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.” (ప్రకటన 3:12బి) అవును, ఈ విజయులు వారికిని యేసుకును దేవుడైనవాని పేరు వారిమీద వ్రాసుకున్నారు. ఇది స్పష్టంగా తెల్పేదేమంటే, యెహోవా మరియు యేసు యిద్దరూ వేరైవున్నారు, ముగ్గురు దేవుళ్లలో లేక త్రిత్వంలో ఒకరుకాదు. (యోహాను 14:28; 20:17) ఈ అభిషక్తులు యెహోవా సంబంధులని సృష్టియావత్తు నిశ్చయంగా గ్రహించాలి. వారు నూతన యెరూషలేము పేరునుకూడ తమమీద వ్రాసుకున్నారు. వారు ఆయన సాక్షులై యున్నారు. ఈ పరలోక పట్టణం పరలోకం నుండి దిగివస్తుందంటే అది విధేయులైన మానవులందరిపై కరుణామయ పరిపాలనను విస్తరింపజేస్తుందని అర్థం. (ప్రకటన 21:9-14) భూలోక క్రైస్తవ గొర్రెలు కూడ యీ అభిషక్త విజయులు పరలోక యెరూషలేమనే రాజ్యానికి చెందిన పౌరులని తెలుసుకుంటారు.—కీర్తన 87:5, 6; మత్తయి 25:33, 34; ఫిలిప్పీయులు 3:20; హెబ్రీయులు 12:22.

24. యేసు క్రొత్తపేరు దేనిని సూచిస్తుంది, మరి అదెలా నమ్మకమైన అభిషక్త క్రైస్తవులమీద వ్రాయబడుతుంది?

24 చివరిగా, అభిషక్త విజయులు యేసు క్రొత్తపేరును వారిమీద వ్రాసుకున్నారు. ఈ క్రొత్తపేరు, యేసుకు యెహోవా అనుగ్రహించిన క్రొత్త స్థానాన్ని, విశేషమైన ఆధిక్యతలను సూచిస్తుంది. (ఫిలిప్పీయులు 2:9-11; ప్రకటన 19:12) ఆ పేరు మరెవరికి తెలియదు, అంటే వేరెవ్వరికి ఆ అనుభవాలు లేవని, లేక అలాంటి ఆధిక్యత లివ్వబడలేదని దానిభావం. అయిననూ, యేసు తన నమ్మకమైన సహోదరులమీద తన పేరును వ్రాసినప్పుడు, ఆ పరలోక సామ్రాజ్యంలో వారాయనతో సన్నిహిత సంబంధంలోనికి వస్తారు, ఆయన ఆధిక్యతలలో భాగం వహిస్తారు. (లూకా 22:29, 30) యేసు అటువంటి అభిషక్తులకు తన ఉపదేశాన్ని మరల చెబుతూ తనవర్తమానాన్ని ముగించడంలో ఆశ్చర్యంలేదు: “సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక.”—ప్రకటన 3:13.

25. యేసు ఫిలదెల్ఫియలోని సంఘానికిచ్చిన సలహాలోని సూత్రాన్ని ప్రతీ క్రైస్తవుడీనాడు ఎలా వర్తింపచేసుకోగలడు?

25 ఆ వర్తమానం నిశ్చయంగా ఫిలదెల్ఫియాలోని క్రైస్తవులకెంత గొప్ప ప్రోత్సాహకరమై యున్నదోగదా! ప్రభువు దినము అను యీ కాలంలో యోహాను తరగతివారికది నిశ్చయంగా ఓ బలమైన గుణపాఠాన్ని కల్గివుంది. అయితే అందులోని సూత్రాలు అభిషక్తులైనా వేరేగొర్రెలైనా, ప్రతిఒక్కరికి ప్రాముఖ్యమే. (యోహాను 10:16) ఆ ఫిలదెల్ఫియలోని క్రైస్తవులవలె, మనలో ప్రతి ఒక్కరం తప్పక రాజ్యఫలాలను ఫలిస్తూనే వుండాలి. మనందరికి కొద్దిపాటి శక్తియైనావుంది. మనందరం యెహోవా సేవలో కొంతైనా చేయగలం. మనమీ శక్తినుపయోగిద్దాం. విస్తరించిన రాజ్యాధిక్యతల విషయంలోనైతే, మనకొరకు తెరువబడిన ఏ ద్వారంలోనైనా ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉందాం. అటువంటి ద్వారాన్ని తెరువమని మనం యెహోవాకు ప్రార్థించవచ్చు కూడ. (కొలొస్సయులు 4:2, 3) మనం యేసు సహనము యొక్క మాదిరిననుసరిస్తూ, ఆయన పేరుకు తగినట్లు ప్రవర్తిస్తుంటే, సంఘాలకు పరిశుద్ధాత్మ చెబుతున్న మాటకు మనం కూడా చెవియొగ్గి వింటున్నామని చూపిస్తాము.

[అధస్సూచీలు]

^ పేరా 13 పౌలు కాలంలో, కొరింథులోని యూదుల సమాజమందిర ప్రధానాధికారియైన సొస్తెనేసు క్రైస్తవ సహోదరుడయ్యాడు.—అపొస్తలుల కార్యములు 18:17; 1 కొరింథీయులు 1:1.

^ పేరా 14 యోహాను తరగతి ప్రచురిస్తున్న వాచ్‌టవర్‌ పత్రిక యీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వీలైనంత ఎక్కువగా ప్రకటించే పనిలో భాగం వహించే అత్యవసరతను పునరుద్ఘాటిస్తూనే వస్తుంది; ఉదాహరణకు, డిశంబరు 15, 1985, సంచికలోని “డిక్లేర్‌ అబ్రాడ్‌ ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌,” మరియు “అర్జంట్లీ నీడెడ్‌—మోర్‌ వర్కర్స్‌,” అనే శీర్షికలను చూడండి. ఫిబ్రవరి 1, 1987, సంచికలోని “డూయింగ్‌ అవర్‌ అట్‌మోస్ట్‌ టు డిక్లేర్‌ ది గుడ్‌ న్యూస్‌,”అనే శీర్షికలో సంపూర్ణ సేవలో ప్రవేశించే “ద్వారము తెరువబడి” వుందని నొక్కితెల్పబడింది. అటువంటి సేవలో 1993 లో ఒక్క నెలలో 8,90,231 మంది పయినీర్లు రిపోర్టుచేశారు.

^ పేరా 16 మెక్లిన్‌టాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లొపీడియా (సంపుటి 10, పేజి 519) యిలా నివేదిస్తుంది: “క్రైస్తవత్వము ఎంతో గమనించదగినంత అభివృద్ధి సాధించుటను జాగ్రత్తగా గమనిస్తున్న అన్యమతగురువులు అల్లరిమూకలను రెచ్చగొట్టడంతో యీవిషయం చక్రవర్తుల దృష్టికి వెళ్లింది, మరియు ట్రాజన్‌, (సా. శ. 98-117) అందుకే, యితర దేవతలను అసహ్యించుకునేలా మనుష్యులను మార్చుతున్న యీ కొత్త మతాన్ని క్రమేణ అణగదొక్కే తాకీదులను జారీచేయడానికి నడిపింది. బితినియా (ఆసియాలో రోమా సామ్రాజ్య భూభాగాంతాన ఉత్తరాన ఉన్నది) గవర్నరుగా, చిన్నవాడైన ప్లినీ పాలనలో, క్రైస్తవత్వం అతివేగంగా వ్యాపించడం, తత్ఫలితంగా తనరాజ్యంలో అన్యమతస్థులు ఆగ్రహించడంతో పరిస్థితి విషమించింది.”

^ పేరా 18 హిజ్కియా అనే పేరుకు “యెహోవా బలపరచును” అని అర్థం. 2 రాజులు 16:20, న్యూవర్‌ల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌ నందు అథఃస్సూచి చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[-63వ పేజీలోని బాక్సు]

వంగి నమస్కరించడానికి అనేకులకు సహాయపడుట

ఈ 1,44,000 మంది పరలోకరాజ్యాన్ని స్వతంత్రించుకోనైయున్న అభిషక్తులలో, అంటే యోహాను తరగతిలో 9,000 కంటే తక్కువమంది యింకా భూలోకజీవితాన్ని చాలించవలసివున్నారు. మరోవైపు, గొప్పసమూహం 40,00,000 కంటే ఎక్కువ మందియై విస్తరిస్తోంది. (ప్రకటన 7:4, 9) ఇంత గొప్ప అభివృద్ధికేది దోహదపడింది? యెహోవాసాక్షులు నిర్వహించే వివిధ పాఠశాలలు యిందుకు ఎంతో దోహదపడ్డాయి. లోకతత్వజ్ఞానాన్ని బోధిస్తూ, బైబిలును కించపరచే క్రైస్తవమత సామ్రాజ్యపు వేదాంత పాఠశాలల్లో బోధించేదానికి భిన్నంగా, యీ యెహోవాసాక్షుల పాఠశాలలు, దేవుని వాక్యమందు ప్రగాఢవిశ్వాసాన్ని అభ్యసింపజేస్తాయి. అవి దేవునివాక్యంనుండి పరిశుభ్రమైన, నీతిగల జీవితానికి, దేవుని సమర్పిత సేవకు అవసరమైన విలువను చూపిస్తాయి. ప్రపంచమంతట 1943 నుండి, యెహోవాసాక్షుల ప్రతీ సంఘంలోని రాజ్యమందిరంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను నడిపిస్తారు. బైబిలు విద్యకు సంబంధించిన ఒకే కార్యక్రమాన్ని అనుసరిస్తూ, ప్రతీవారం యీ పాఠశాలకు లక్షలాదిమంది హాజరౌతున్నారు.

యెహోవాసాక్షులు 1959 నుండి సంఘపెద్దల, పరిచారకుల శిక్షణార్థం రాజ్య పరిచర్య పాఠశాలలు అనేవాటిని కూడ నిర్వహిస్తున్నారు. మరి 1977వ సంవత్సరం నుండి పయినీర్‌ సేవా పాఠశాలలు, 2,00,000 మంది సహోదర సహోదరీలకు శిక్షణనిచ్చాయి. వీరైతే ఫిలదెల్ఫియా వారికున్న నిజమైన ఉత్తేజంతో సువార్తపనిలో యెహోవాకు పూర్తికాల సేవచేస్తున్నారు. ప్రపంచమంతట విశేషసేవా నియామకముల నిమిత్తం సాక్షులలోని పురుషులకొరకు 1987 లో పరిచారకుల శిక్షణా పాఠశాల ప్రారంభమైంది.

ఓ ప్రత్యేకత సంతరించుకున్న పాఠశాలల్లో ఒకటేమంటే, యెహోవాసాక్షులు నడిపించే వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌. న్యూయార్క్‌ రాష్ట్రంలో స్థాపించబడిన యీ మిషనరీ పాఠశాల 1943 నుండి దాదాపు ప్రతిసంవత్సరం రెండు గుంపుల విద్యార్థులను పట్టభద్రులను చేస్తుంది. విదేశీ మిషనరీ సేవ నిమిత్తం మొత్తం 6,000 మంది యెహోవా సేవకులకు శిక్షణనిచ్చింది. ఈ పాఠశాలలో పట్టభద్రులైన వారు వందకంటె ఎక్కువదేశాల్లో సేవచేసి, అనేకదేశాల్లో రాజ్యసేవ ఆరంభం కావడానికి ఉపకరణాలయ్యారు. సుమారు 40 సంవత్సరాల తర్వాతకూడ తొలి మిషనరీలలో చాలామంది యింకా సేవలోనేవున్నారు, యెహోవా సంస్థను ప్రపంచమంతట వ్యాపింపజేసే పనిలో కొత్తవారితో భాగం వహిస్తున్నారు. ఇదెంత అద్భుతమైన విస్తరణయై యున్నదో గదా!

[64వ పేజీలోని చిత్రం]

మరి 1919 లో పరిపాలిస్తున్న రాజైన యేసు క్రైస్తవ సేవ నిమిత్తం ఓ అవకాశద్వారాన్ని తెరిచాడు. భక్తిగల క్రైస్తవులనేకులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

సంవత్సరం ప్రచారం సువార్తలో పాల్గొన్న పూర్తికాల

చేయబడిన క్రైస్తవులు *

దేశాలు ప్రచారకులు *

1918 14 3,868 591

1928 32 23,988 1,883

1938 52 47,143 4,112

1948 96 2,30,532 8,994

1958 175 7,17,088 23,772

1968 200 11,55,826 63,871

1978 205 20,86,698 1,15,389

1993 231 44,83,900 62,3006

[అధస్సూచీలు]

^ పేరా 70 పైసంఖ్యలు నెలసరి సగటును చూపిస్తున్నాయి.

^ పేరా 71 పైసంఖ్యలు నెలసరి సగటును చూపిస్తున్నాయి.

[65వ పేజీలోని చిత్రం]

యెహోవాసాక్షుల పరిచర్య హృదయ పూర్వకమైంది. ఉదాహరణకు, ప్రకటించుటలోను బోధించుటలోను వారు వ్యయపరచిన గంటలను మరియు ప్రజల యిండ్లలో వారు నిర్వహించిన గృహబైబిలు పఠనాలను గమనించండి.

సంవత్సరం ప్రచారంలో గడిపిన నిర్వహించిన

గంటలు బైబిలు పఠనాలు

(వార్షిక మొత్తం) (నెలసరి సగటు)

1918 19,116 రికార్డు చేయబడలేదు

1928 28,66,164 రికార్డు చేయబడలేదు

1938 1,05,72,086 రికార్డు చేయబడలేదు

1948 4,98,32,205 1,30,281

1958 11,03,90,944 5,08,320

1968 20,86,66,762 9,77,503

1978 30,72,72,262 12,57,084

1993 1,05,73,41,972 45,15,587

[59వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్దపు రోమీయుల తాళంచెవి