కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిశుద్ధ మర్మమును బయలుపరచుట

పరిశుద్ధ మర్మమును బయలుపరచుట

అధ్యాయం 6

పరిశుద్ధ మర్మమును బయలుపరచుట

1. ప్రకటన 1:10-17 లో వ్రాయబడిన దేదీప్యమానమైన దృశ్యానికి మనమెలా స్పందించాలి?

మహిమ నొందిన యేసును గూర్చిన దర్శనం నిజంగా భయంకల్గించేదే! యోహానుతోపాటు మనం కూడ అక్కడుండి తిలకిస్తూ వున్నట్లయితే, ఆ దేదీప్యమానమైన మహిమను చూచి, నిశ్చయంగా ఉబ్బితబ్బిబై, ఆయనవలె మనం సాష్టాంగపడియుండేవారం. (ప్రకటన 1:10-17) ఈ సర్వోత్కృష్టమైన ప్రేరేపిత దర్శనం, యీనాడు మనల్ని కార్యోన్ముఖులను చేయుటకే మన కొరకు భద్రపరచబడింది. యోహానువలె మనం ఆ దర్శన భావమంతటికి వినయంతో కూడిన అభినందన చూపాలి. రాజుగా, ప్రధాన యాజకునిగా, న్యాయాధిపతిగా యేసుకున్న స్థానంయెడల మనమెల్లప్పుడు భక్తిపూర్వక గౌరవం కల్గివుందాము.—ఫిలిప్పీయులు 2:5-11.

“మొదటివాడు కడపటివాడు”

2. (ఎ) యేసు ఏ బిరుదుతో తన్నుతాను పరిచయం చేసుకుంటున్నాడు? (బి) “నేను మొదటివాడను కడపటివాడను” అని యెహోవా అనడంలో అర్థమేమిటి? (సి) “మొదటివాడను కడపటివాడను” అన్న యేసు బిరుదు దేనిని జ్ఞాపకం చేస్తుంది?

2 అయిననూ మన భయం విపరీతమైన భయానికి దారితీయకూడదు. అపొస్తలుడైన యోహాను తర్వాత యిలా తెల్పుతున్నట్లు యేసు ఆయనకిలా అభయమిస్తున్నాడు: “ఆయన తన కుడిచేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను—భయపడకుము; నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను.” (ప్రకటన 1:17బి, 18ఎ) యెషయా 44:6 లో, యెహోవా ఏకైక సర్వోన్నత దేవుడని తన స్థానాన్ని గూర్చి తానే యుక్తంగా వర్ణిస్తూ యిలా అంటున్నాడు: “నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు.” * యేసు “నేను మొదటివాడను కడపటివాడను“ అనే బిరుదుతో తననుతాను పరిచయం చేసుకుంటున్నప్పుడు, తాను మహోన్నత సృష్టికర్తయైన యెహోవాతో సమానునిగా చేసుకోవడంలేదు. దేవుడు తనకు యుక్తంగా యిచ్చిన బిరుదును ఆయన ఉపయోగించుకుంటున్నాడు. యెషయాలో యెహోవా సత్యదేవునిగా తనకున్న విశేష స్థానాన్ని గూర్చి తెల్పుతున్నాడు. ఆయన నిత్యదేవుడు, నిజంగా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. (1 తిమోతి 1:17) ప్రకటనలో, యేసు తన విశేష పునరుత్థానాన్ని గూర్చి జ్ఞాపకంచేస్తూ, తన కనుగ్రహించబడిన బిరుదును గూర్చి మాట్లాడు తున్నాడు.

3. (ఎ) యేసు ఏవిధంగా “మొదటివాడును కడపటివాడును” అయ్యాడు? (బి) “మరణము యొక్కయు పాతాళము [హేడీస్‌] యొక్కయు తాళపుచెవులు” యేసు స్వాధీనంలో ఉన్నాయంటే భావమేమిటి?

3 యేసు అమర్త్యమైన ఆత్మీయజీవానికి పునరుత్థానం చేయబడిన వారిలో నిజంగా “మొదటివాడు.” (కొలొస్సయులు 1:18) అంతేగాక, యెహోవా స్వయంగా పునరుత్థానం చేసినవారిలో ఆయన “కడపటివాడు” అలా ఆయన “జీవించువాడు . . . యుగయుగములు సజీవుడు.” ఆయన అమర్త్యుడు. ఈ విషయంలో, ఆయన “సజీవుడగు దేవుడు” అని పిలువబడుతున్న అమర్త్యంగల తన తండ్రిని పోలియున్నాడు. (ప్రకటన 7:2; కీర్తన 42:2) ఇతర మానవజాతియంతటికి యేసు తానే “పునరుత్థానమును జీవమునై” యున్నాడు. (యోహాను 11:25) దీనికి అనుగుణంగా ఆయన యోహానుతో యిలా అంటున్నాడు: “మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము (హేడీస్‌, NW.) యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.” (ప్రకటన 1:18బి) యెహోవా ఆయనకు మృతులను పునరుత్థానం చేసే అధికార మిచ్చాడు. అందుకే మరణం, హేడీస్‌ [మృతుల లోకపు] ద్వారాలు తెరిచే తాళపు చెవులు తనయొద్ద ఉన్నాయని యేసు చెప్పగలుగుతున్నాడు.—మత్తయి 16:18తో పోల్చండి.

4. యేసు ఏ ఆజ్ఞను, ఎవరి ప్రయోజనం కొరకు పునరుద్ఘాటిస్తాడు?

4 యేసు యిక్కడ ఆ దర్శనాన్ని వ్రాయమని మరల చెబుతూ యోహానుతో యిలా అంటున్నాడు: “కాగా నీవు చూచిన వాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని . . . వ్రాయుము.” (ప్రకటన 1:19) మన ఉపదేశార్థమై యోహాను యింకా ఏయే ఉత్తేజకరమైన సంగతులు తెలియజేస్తాడు?

నక్షత్రాలు, దీపస్తంభాలు

5. యేసు “ఏడు నక్షత్రాలను,” “ఏడు దీపస్తంభాలను” ఎలా వర్ణిస్తాడు?

5 ఏడు సువర్ణ దీపస్తంభాలమధ్య తన కుడిచేత యేడు నక్షత్రాలను పట్టుకొనియున్న యేసును యోహాను చూశాడు. (ప్రకటన 1:12, 13, 16) ఇప్పుడు యేసు యిలా వివరిస్తున్నాడు: “నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీప స్తంభముల సంగతియు . . . ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.”—ప్రకటన 1:20.

6. ఏడు నక్షత్రాలు దేన్ని సూచిస్తున్నాయి, ఆ వర్తమానాలు ఎందుకు ప్రత్యేకంగా వీటినుద్దేశించి చెప్పబడ్డాయి?

6 ఆ “నక్షత్రములు, ఏడు సంఘములకు దూతలు.” ప్రకటనలో, నక్షత్రాలు కొన్నిసార్లు నిజమైన దూతలను సూచిస్తాయి, గాని అదృశ్యమైన ఆత్మీయ ప్రాణులను గూర్చి వ్రాయడానికి మానవులను యేసు ఉపయోగించుకోడు. గనుక నక్షత్రాలు అంటే యేసు వార్తాహరులుగా కచ్చితంగా సంఘంలోనున్న పెద్దలు లేక మానవ కాపరులై యుండాలి. * ఆ వర్తమానములు యీ నక్షత్రాల నుద్దేశించి చెప్పబడ్డాయి, ఎందుకంటే, వీరు యెహోవా మందను కాసే బాధ్యతను కలిగివున్నారు.—అపొస్తలుల కార్యములు 20:28.

7. (ఎ) యేసు ప్రతిసంఘంలోనున్న ఒకే దూతతో మాట్లాడుతున్నాడంటే, ప్రతిసంఘంలో ఒకే పెద్ద ఉన్నాడని దాని అర్థంకాదని ఏది చూపుతుంది? (బి) యేసు కుడిచేతిలోనున్న ఏడు నక్షత్రాలు మరి ఎవరిని సూచిస్తున్నాయి?

7 యేసు సంఘంలోని ఒక “దూత”తోనే మాట్లాతున్నందున, ప్రతీ సంఘంలో ఒకే పెద్ద ఉన్నాడని దీనర్థమా? కాదు. పౌలు కాలంనాటికే, ఎఫెసు సంఘంలో, ఒక్కరుకాదు, అనేకమంది పెద్దలున్నారు. (ప్రకటన 2:1; అపొస్తలుల కార్యములు 20:17) గనుక యోహాను కాలంలో, సంఘాల్లో చదవడానికై (ఎఫెసుతో సహా) యీ ఏడు నక్షత్రాలకు వర్తమానములు పంపినప్పుడు, యీ నక్షత్రాలు యెహోవా అభిషక్త సంఘంలో పెద్దలకూటమి నంతటిని తప్పక సూచించి యుండవచ్చును. అలాగే, పెద్దలీనాడు యేసు యాజమాన్యం క్రింద సేవచేసే అభిషక్త పెద్దలతోకూడిన పరిపాలక సభ నుండివచ్చే ఉత్తరాలను సంఘాలకు చదువుతారు. స్థానిక పెద్దలకూటమి తమ సంఘస్థులు యేసు సలహాను పాటించేలా చూడాలి. నిజమే, ఆ సలహా పెద్దలకు మాత్రమేకాదు, సంఘంలోనున్న వారందరి ప్రయోజనార్థనమై ఉంటుంది.—ప్రకటన 2:11ఎ చూడండి.

8. పెద్దలు యేసు కుడిచేతిలో ఉన్నారనేది ఏం తెల్పుతుంది?

8 యేసు సంఘానికి శిరస్సయి వున్నందున, పెద్దలు ఆయన కుడిచేతిలో అంటే ఆయన నడిపింపు, నాయకత్వం క్రింద ఉన్నారని అర్థం. (కొలొస్సయులు 1:18) ఆయన ముఖ్యకాపరి, వారైతే ఉపకాపరులు.—1 పేతురు 5:2-4.

9. (ఎ) ఏడు దీపస్తంభాలు దేనికి సూచన, మరి వీరికి దీపస్తంభాలెందుకు సరియైన సూచనయై ఉన్నవి? (బి) ఆ దర్శనం యోహానుకు బహుశ దేన్ని జ్ఞాపకంచేసి యుండవచ్చు?

9 యోహాను ప్రకటన గ్రంథాన్ని ఎవరికి రాస్తున్నాడో ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు: ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, మరియు లవొదికయ. మరి సంఘాలెందుకు దీపస్తంభాలకు పోల్చబడ్డాయి? ఎందుకంటే, క్రైస్తవులు వ్యక్తిగతంగాకాని, సంఘం మొత్తంగాకాని, అంధకార లోకంలో వున్న ‘మనుష్యులకు వారి వెలుగును ప్రకాశింపజేయాలి.’ (మత్తయి 5:14-16) అంతేగాక, సొలొమోను దేవాలయంలో యీ దీపస్తంభాలు అలంకరణోపకరణాలై వుండేవి. సంఘాలను దీపస్తంభాలని పిలుచుటలో బహుశ దృష్టాంత భావంలో అభిషక్తులతో కూడిన ప్రతి స్థానిక సంఘం దేవుని ఆత్మ నివసించే, “దేవుని ఆలయమై” వున్నదని యోహానునకు జ్ఞాపకం చేస్తుంది. (1 కొరింథీయులు 3:16) అంతేగాక, యూదుల దేవాలయ ఏర్పాటును పోలినదానిలో, అనగా యేసుక్రీస్తు ప్రధానయాజకునిగాను, యెహోవా స్వయంగా నివసిస్తున్న పరలోకంలోని అతిపరిశుద్ధ స్థలమైన యెహోవా గొప్ప ఆత్మీయ మందిర ఏర్పాటులో, ఈ అభిషక్త సంఘంలోని సభ్యులు “రాజులైన యాజకసమూహముగాను” సేవచేస్తున్నారు.—1 పేతురు 2:4, 5, 9; హెబ్రీయులు 3:1; 6:20; 9:9-14, 24.

గొప్ప మతభ్రష్టత

10. యూదా మతవిధానానికి, పశ్చాత్తాపపడని మద్దతుదారులకు సా.శ. 70 లో ఏమి సంభవించింది?

10 యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాసేనాటికి క్రైస్తవ సంఘానికి 60 ఏళ్లయింది. ప్రారంభంలో అది 40 సంవత్సరాలు యెడతెగక యూదా మతము నుండి వ్యతిరేకత నెదుర్కొని తప్పించుకుంది. ఆ తర్వాత యూదా మతవిధానం సా.శ. 70వ సంవత్సరంలో పశ్చాత్తాపం నొందని యూదులు వారి జాతి గుర్తింపును పోగొట్టుకున్నప్పుడు అది పెద్ద దెబ్బతిన్నది. మరి వారికి నిజంగా మిగిలిందేమంటే ఓ విగ్రహమే, అదే యెరూషలేము దేవాలయము.

11. ప్రధానకాపరి వృద్ధిచెందుతున్న పరిస్థితులనుగూర్చి హెచ్చరించుటకు ఎందు కది ఎంతో యుక్తసమయమై యుండెను?

11 అయినను, అభిషక్త క్రైస్తవులలో మతభ్రష్టత కల్గుతుందని అపొస్తలుడైన పౌలు ప్రవచించాడు, మరి యోహాను వృద్ధాప్యంలో వుండగా యీ మతభ్రష్టత అప్పటికే వృద్ధిచెందడం ఆరంభించిందని యేసు వర్తమానాలు చూపిస్తున్నాయి. స్త్రీ సంతానాన్ని తుదముట్టించడానికి సాతాను చేసిన యీ గట్టి ప్రయత్నాన్ని అడ్డుకున్నవారిలో యోహాను ఆఖరివాడు. (2 థెస్సలొనీకయులు 2:3-12; 2 పేతురు 2:1-3; 2 యోహాను 7-11) గనుక యెహోవా యొక్క ప్రధానకాపరి సంఘపెద్దలకు వ్రాసి, పెరిగే పరిస్థితులను గూర్చి హెచ్చరిస్తూ నీతికొరకు స్థిరంగా నిలబడాలని సహృదయులను ప్రోత్సాహించుట కది యుక్తసమయమే.

12. (ఎ) యోహాను కాలం తర్వాతి శతాబ్దాల్లో ఎలా మతభ్రష్టత్వం వృద్ధియైంది? (బి) క్రైస్తవమతసామ్రాజ్యం ఎలా వచ్చింది?

12 సా.శ. 96 లో ఆ సంఘాలెలా యేసు హెచ్చరికల్ని స్వీకరించాయో మనకు తెలియదు. గాని యోహాను మరణానంతరం మతభ్రష్టత వేగంగా వృద్ధియైనదన్నది మనకు కచ్చితంగా తెలుసు. “క్రైస్తవులు” యెహోవా నామాన్ని ఉపయోగించడం మానివేసి, దానికి బదులుగా బైబిలు చేతివ్రాత ప్రతుల్లో “ప్రభువు” లేక “దేవుడు” అని మార్చుకున్నారు. నాల్గవ శతాబ్దానికల్లా తప్పుడు త్రిత్వసిద్ధాంతం సంఘాలను మలినపర్చింది. ఇదేకాలంలో, అమర్త్యమైన ఆత్మనుగూర్చిన అభిప్రాయం అలవర్చు కొనుటకారంభమైంది. చివరికి రోమాసామ్రాజ్య చక్రవర్తి కాన్‌స్టాంటైన్‌ “క్రైస్తవత్వాన్ని” జాతీయమతంగా చేశాడు, ఇది క్రైస్తవమతసామ్రాజ్యానికి నాందిపల్కి, మతం రాజకీయాలు కలిసి వెయ్యేండ్లు పరిపాలించడానికి దోహదపడింది. ఓ క్రొత్త తరహా “క్రైస్తవుడు” కావడానికి అది సులభమైంది. సకల గోత్రాలవారు తమకు ముందున్న అన్యవిశ్వాసాలను యీ మతానికి తగినట్లు మలచుకున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యపు నాయకులు, కత్తిచేత బెదిరించి వారి మతభ్రష్టమైన విశ్వాసాలను అమలుచేస్తూ క్రూరులైన దుష్ట రాజకీయ పాలకులయ్యారు.

13. విమతాల్నిగూర్చి యేసు హెచ్చరించిననూ, మతభ్రష్టత్వం కల్గించే క్రైస్తవులు ఎలా ప్రవర్తించారు?

13 యేసు ఏడు సంఘాలతో చెప్పినమాటల్ని మతభ్రష్టత్వాన్ని కలుగజేస్తున్న క్రైస్తవులు పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. యేసు ఎఫెసు సంఘాన్ని మొదట వారికున్న ప్రేమను మరల కల్గివుండాలని హెచ్చరించాడు. (ప్రకటన 2:4) అయిననూ, క్రైస్తవమతసామ్రాజ్య సభ్యులు, యెహోవా ప్రేమలో యికయేమాత్రం ఐక్యతలేక, భయంకరమైన యుద్ధాలు చేసి పరస్పరం క్రూరంగా హింసించుకున్నారు. (1 యోహాను 4:20) యేసు పెర్గము సంఘస్థులను వర్గపోరాటాన్ని గూర్చి హెచ్చరించాడు. అయిననూ, రెండవ శతాబ్దంలో సహితం శాఖలు కన్పించాయి, మరీనాడు క్రైస్తవమత సామ్రాజ్యంలో జగడమాడుకునే వేలాది గుంపులు, మతశాఖలు ఉన్నాయి.—ప్రకటన 2:15.

14. (ఎ) ఆత్మీయంగా మరణించే విషయాన్నిగూర్చి యేసు హెచ్చరించిననూ, నామకార్థ క్రైస్తవులెలా ప్రవర్తించారు? (బి) విగ్రహారాధన అవినీతిని గూర్చి యేసు యిచ్చిన హెచ్చరికను లక్ష్యపెట్టడంలో నామకార్థ క్రైస్తవులు ఏయే రీతులుగా విఫలులయ్యారు?

14 యేసు సార్దీస్‌ సంఘంతో ఆత్మీయంగా మృతమయ్యే విషయాన్ని గూర్చి హెచ్చరించాడు. (ప్రకటన 3.1) సార్దీస్‌ సంఘంవలెనే, నామకార్థ క్రైస్తవులు క్రైస్తవ క్రియలను త్వరగా మర్చిపోయి ఎంతో ప్రాముఖ్యమైన సువార్త పనిని, డబ్బుకు పనిచేసే ఓ చిన్న, గురువుల తరగతికి అప్పగించారు. యేసు తుయతైర సంఘాన్ని విగ్రహారాధన, వ్యభిచారాన్ని గూర్చి హెచ్చరించాడు. (ప్రకటన 2:20) అయినా, ,క్రైస్తవమత సామ్రాజ్యం విగ్రహాలను, అలాగే జాతీయత, ధనాపేక్ష అనే మరింత మోసపూరిత విగ్రహారాధనను బహిరంగంగా అనుమతించింది. మరి అవినీతికి వ్యతిరేకంగా అడపాదడప ప్రకటించినప్పటికీ దాన్ని ఎల్లప్పుడూ అనుమతిస్తూనే వచ్చింది.

15. ఏడు సంఘాలకు యేసు చెప్పిన మాటలు క్రైస్తవమత సామ్రాజ్యపు మతశాఖలనుగూర్చి దేన్ని బయలుపరుస్తున్నాయి, మరి క్రైస్తవమత సామ్రాజ్య గురువులు ఏమైయున్నారని రుజువు చేసుకున్నారు?

15 కావున, యేసు ఏడు సంఘాలతో చెప్పిన మాటలు, క్రైస్తవమత శాఖలన్నీ, యెహోవాకు ప్రత్యేక ప్రజలుగా ఉండటంలో పూర్తిగా విఫలమయ్యాయని బహిర్గతం చేస్తున్నాయి. నిజానికి, క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు సాతాను సంతానంలో ప్రముఖులు. వీరు ‘ధర్మవిరోధులని’ చెబుతూ, అపొస్తలుడైన పౌలు వారి “రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్తమోసముతోను, . . . సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును,” అని ప్రవచించాడు.—2 థెస్సలొనీకయులు 2:9, 10.

16. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు ప్రత్యేకంగా ఎవరిమీద ద్వేషాన్ని కనబరుస్తున్నారు? (బి) మధ్యయుగంలో క్రైస్తవమత సామ్రాజ్యమందేమి సంభవించింది? (సి) ప్రొటెస్టెంట్‌ తిరుగుబాటు లేక సంస్కరణ క్రైస్తవమత సామ్రాజ్యపు పద్ధతుల నేమైనా మార్చిందా?

16 తాము దేవుని మందకాపరులమని చెప్పుకుంటూనే, క్రైస్తవమత సామ్రాజ్య మత రాజకీయ నాయకులు బైబిలును చదవాలని ప్రోత్సహించేవారియెడల, లేదా లేఖన విరుద్ధమైన వారి ఆచారాలను బహిర్గతం చేసేవారియెడల ఓ ప్రత్యేక ద్వేషాన్ని కనబర్చారు. జాన్‌హస్‌ను అలాగే బైబిల్‌ అనువాదకుడైన విలియం టిండేల్‌ను హింసించి చంపారు. అంధకారం అలుముకున్న మధ్యయుగాలలో, మతభ్రష్టుల పాలన, కాథోలిక్కులు నిర్వహించిన పాపిష్టి విచారణా నిర్వాహకంతో శిఖరాగ్రం చేరింది. చర్చి అధికారాన్ని లేక బోధలను వ్యతిరేకించిన వారు నిర్థాక్షిణ్యంగా అణచివేయబడ్డారు, యింకా భిన్నమత అవలంబీకులని పిలువబడిన అసంఖ్యాకులను హతమార్చారు లేక వ్రేలాడదీసి కాల్చివేశారు. ఆ విధంగా, దేవుని స్త్రీనిపోలిన సంస్థయొక్క నిజమైన సంతానాన్ని వెంటనే తుదముట్టించాలని సాతాను విశ్వప్రయత్నం చేశాడు. ప్రొటెస్టెంట్‌ తిరుగుబాటు లేక సంస్కరణ జరిగినప్పుడు (1517 మొదలుకొని) పలు ప్రొటెస్టెంట్‌ చర్చీలు అలాంటి అసహన స్వభావాన్నే కనబరచాయి. వారు కూడ దేవునికి క్రీస్తుకు యథార్థత చూపిన వారిని హతమార్చుటద్వారా రక్తాపరాధులయ్యారు. నిజంగా, “పరిశుద్ధుల రక్తమును” యథేఛ్ఛగా చిందించారు!—ప్రకటన 16:6; మత్తయి 23:33-36ను పోల్చండి.

సంతానం సహిస్తుంది

17. (ఎ) యేసు యిచ్చిన గోధుమలు గురుగుల ఉపమానం దేన్ని ముందుగానే తెల్పింది? (బి) ఈ 1918 లో ఏం జరిగింది, తత్ఫలితంగా దేని తిరస్కారం దేని నియామకం జరిగింది?

17 యేసు గోధుమలు గురుగులను గూర్చి యిచ్చిన ఉపమానంలో, క్రైస్తవ మతసామ్రాజ్యం తిరుగులేని ఆధిపత్యాన్ని కల్గియున్న కాలంలో అంధకారం ఉంటుందని ప్రవచించాడు. అయిననూ, మతభ్రష్టత ఉన్న శతాబ్దాలన్నిటిలోనూ గోధుమలను పోలిన క్రైస్తవులు, అసలైన అభిషక్తులు ఉంటూనే వచ్చారు. (మత్తయి 13:24-29, 36-43) అలా, 1914 లో ప్రభువు దినము ప్రారంభమైనపుడు, భూమ్మీద యింకా నిజమైన క్రైస్తవులుండిరి. (ప్రకటన 1:10) మూడున్నర సంవత్సరాల తర్వాత, 1918 లో, యెహోవా తన “నిబంధన దూత”యైన యేసుతోపాటు తీర్పుతీర్చడానికి తన ఆత్మీయ మందిరాన్ని దర్శించాడు. (మలాకీ 3:1; మత్తయి 13:47-50) యజమానుడు చివరికి అబద్ధ క్రైస్తవులను తిరస్కరించి, ‘నమ్మకమును బుద్ధిమంతుడైన దాసున్ని తన యావదాస్తి మీద’ నియమించడానికి సమయమొచ్చింది.—మత్తయి 7:22, 23; 24:45-47.

18. ఏ “కాలము” 1914 లో వచ్చింది, దాసుడేమి చేయడానికది సమయమై యుండెను?

18 అక్కడ పేర్కొన్న దాన్ని మనం గమనిస్తే, ఏడు సంఘాలకు యేసు యిచ్చిన వర్తమానములలో వ్రాయబడిన వాటికి యీ దాసుడు ప్రత్యేక శ్రద్ధనివ్వాల్సిన సమయంకూడ అదేనని అర్థమౌతుంది. ఉదాహరణకు, యేసు తాను సంఘాలకు తీర్పు తీర్చడానికి వస్తానని చెప్తాడు, ఆ తీర్పు 1918 లో ఆరంభమైంది. (ప్రకటన 2:5, 16, 22, 23; 3:3) “లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో” ఫిలదెల్ఫియ సంఘాన్ని కాపాడుతానని ఆయన చెబుతున్నాడు. (ప్రకటన 3:10, 11) ఈ “శోధన కాలము” 1914 లో ప్రభువు దినమారంభమైనప్పటి నుండి మాత్రమే వస్తుంది, మరి స్థాపించబడిన దేవుని రాజ్యం యెడల వారికున్న యథార్థత అప్పుడు పరీక్షింపబడుతుంది.—మత్తయి 24:3, 9-13 పోల్చండి.

19. (ఎ) ఆ ఏడు సంఘాలు దేనిని సూచిస్తున్నాయి? (బి) అభిషక్త క్రైస్తవులతో ఎవరు పెద్ద సంఖ్యలో సహవసిస్తున్నారు, యేసు యిచ్చిన సలహా, ఆ పరిస్థితులు వారికి కూడ ఎందుకు వర్తిస్తాయి? (సి) మొదటి శతాబ్దంలోని ఏడు సంఘాలకిచ్చిన యేసు వర్తమానాలను మనమెలా దృష్టించాలి?

19 ఈ కారణంచేతనే, యేసు సంఘాలకు చెప్పిన మాటలు 1914 నుండి అధిక వర్తింపు కల్గివున్నాయి. ఈ సందర్భంలో, ఆ ఏడు సంఘాలు, ప్రభువు దినములోనున్న అభిషక్త క్రైస్తవుల సంఘాలన్నింటిని సూచిస్తాయి. అంతేగాక, గత 50 సంవత్సరాల కంటె ఎక్కువ కాలంనుండి, యోహానును సూచించే అభిషక్త క్రైస్తవులకు, భూమ్మీద పరదైసులో నిరంతరం జీవించే నిరీక్షణగల అనేకమంది విశ్వాసులు తోడయ్యారు. మహిమనొందిన యేసుక్రీస్తు సలహా, తాను సందర్శించినపుడు ఏడు సంఘాల్లో ఆయన గమనించిన పరిస్థితులు, అంతే ప్రభావంతో వీరికిని వర్తిస్తాయి, ఎందుకంటే, యెహోవా సేవకులందరికి నీతికి, నమ్మకత్వానికి ఒకే నియమముంది. (నిర్గమకాండము 12:49; కొలొస్సయులు 3:11) అలా, ఆసియా మైనరులోని మొదటి శతాబ్దపు సంఘాలకు యేసు యిచ్చిన వర్తమానాలు చారిత్రాత్మక ఆసక్తిని మాత్రమే కల్గిలేవు. మనలో ప్రతిఒక్కరికి అవి జీవన్మరణ అర్థాన్ని కల్గివున్నాయి. గనుక, మనమిప్పుడు యేసు మాటల్ని శ్రద్ధగా విందాము.

[అధస్సూచీలు]

^ పేరా 2 యెషయా 44:6నందు తొలి హెబ్రీభాషలో “మొదటి,” “కడపటి” అనే పదాలతో ఓ నిశ్చయమైన వ్యాకరణ భాషాపదంలేదు, గాని ప్రకటన 1:17 లో, తొలి గ్రీకుభాషలో యేసును గూర్చిన వర్ణనలో నిశ్చయమైన వ్యాకరణ భాషా పదముంది. కావున, వ్యాకరణం ప్రకారం, ప్రకటన 1:17 ఓ బిరుదును సూచిస్తుంది, అయితే యెషయా 44:6 యెహోవా దైవత్వాన్ని వర్ణిస్తుంది.

^ పేరా 6 గ్రీకు పదం ఏజ్జి-లోస్‌ (“ఏంజి-లోస్‌” అని పలుకుతారు) అంటే “వార్తాహరుడు” మరియు “దూత” అని అర్థం. మలాకీ 2:7 లో, ఒక లేవీ యాజకుడు “దూత”, [వార్తాహరుడు] (హెబ్రీభాషలో మాల్‌ ఆఖ్‌) అని పిలువబడ్డాడు.—న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[-32వ పేజీలోని బాక్సు]

శోధన మరియు తీర్పు కాలము

యేసు సా.శ. 29 అక్టోబరులో యొర్దాను నదిలో బాప్తిస్మంపొంది, నియమిత రాజుగా అభిషేకించబడ్డాడు. మూడున్నర సంవత్సరాల తర్వాత, సా.శ. 33 లో ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చి దాన్ని దొంగల గుహగా మార్చేవారిని తరిమివేశాడు. యేసు 1914 అక్టోబరులో పరలోకమందు ‘తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై’నప్పటి నుండి, దేవుని యింటివారికి తీర్పు ప్రారంభమైనందున నామకార్థ క్రైస్తవులను తనిఖీచేయడానికి వచ్చేంతవరకు అంటే మూడున్నర సంవత్సరాల కాలం వరకు దీనికి సారూప్యమున్నట్లు కనబడుతోంది. (మత్తయి 21:12, 13; 25:31-33; 1 పేతురు 4:17) యెహోవా ప్రజల రాజ్యపరిచర్య 1918 తొలిభాగంలో గొప్ప వ్యతిరేకత నెదుర్కొన్నది. అది భూమియంతట ఒక శోధనా సమయంగా ఉండెను, పిరికివారిని ఏరిపారవేశారు. క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు 1918 మే నెలలో వాచ్‌టవర్‌ సొసైటి అధికారులను బందించాలని ఉసిగొల్పారు, గాని తొమ్మిది నెలల తర్వాత వారు విడుదల చేయబడ్డారు. ఆ పిదప వారిమీద మోపబడిన తప్పుడు నేరాలన్నిటిని పూర్తిగా కొట్టివేశారు. దేవుని ప్రజల సంస్థ పరీక్షించబడి, పుటంవేయబడినదై 1919 నుండి మానవజాతి నిరీక్షణ క్రీస్తుపాలించే దేవుని రాజ్యమేనని ఆసక్తితో ప్రకటించడంలో ముందుకు సాగుతుంది.—మలాకీ 3:1-3.

యేసు తన తనిఖీని 1918 లో ప్రారంభించినప్పుడు, క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు నిశ్చయంగా వారికి విరుద్ధమైన తీర్పునే పొందారు. వారు దేవుని ప్రజలమీద హింసను పురికొల్పడమే కాకుండ, మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొనే రాజ్యాలతో చేతులు కలపడం మూలంగా కూడా వారు గొప్ప రక్తాపరాధులయ్యారు. (ప్రకటన 18:21, 24) ఆ మతగురువులు అప్పుడు మానవుడేర్పర్చుకున్న నానాజాతి సమితి యందు నమ్మకముంచారు. ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంతో పాటు క్రైస్తవమత సామ్రాజ్యం 1919 నాటికి దేవుని కృపను పూర్తిగా పోగొట్టుకుంది.

[28, 29వ పేజీలోని చిత్రం]

(For fully formatted text, see publication)

పెర్గము

స్ముర్న

తుయతైర

ఫిలదెల్ఫియ

సార్దీస్‌

ఎఫెసు

లవొదికయ

[31వ పేజీలోని చిత్రం]

బైబిలును అనువదించినవారిని, చదివినవారిని, లేక కలిగివున్నవారిని సహితం హింసించి, చంపడం మూలంగా, క్రైస్తవమత సామ్రాజ్యం మహా రక్తాపరాధియైంది