కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రభువు దినములో భూకంపములు

ప్రభువు దినములో భూకంపములు

అధ్యాయం 18

ప్రభువు దినములో భూకంపములు

1, 2. (ఎ) తీవ్రమైన భూకంపంనుండి బ్రతికిబయట పడడమెలా ఉంటుంది? (బి) ఆరవ ముద్ర విప్పబడినప్పుడు యోహాను ఏమి వర్ణిస్తున్నాడు?

నీవెప్పుడైనా తీవ్రమైన భూకంపంనుండి బ్రతికి బయటపడ్డావా? అదంత ఆనందమైన అనుభవం కాదు. ఓ పెద్ద భూకంపం భయంకరమైన ఉరుము శబ్దంతో ఫెళఫెళమని ప్రారంభం కావచ్చును. దాని తాకిడిని తప్పించు కోవడానికి నీవు—బహుశ బెంచీ క్రిందికి వడిగా లంఘించవచ్చు. లేదా అది ఇంటి వంట సామాగ్రిని, మరి భవనాలను సహితం కూల్చి, చెల్లాచెదురు చేస్తూ అకస్మాత్తుగా ఒక్క ఊపుతో విరుచుకుపడొచ్చు. అపార నష్టం వాటిల్లవచ్చు, తర్వాత మరలా కొన్ని ప్రకంపనాలు రావచ్చు, రోదనను రెట్టింపుచేస్తూ యింకా నష్టాన్ని కల్గించవచ్చు.

2 దీన్ని మనస్సు నందుంచుకొని ఆరవ ముద్ర విప్పబడినప్పుడు యోహాను వివరించే విషయాలను పరిశీలించండి: “ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్దభూకంపము కలిగెను.” (ప్రకటన 6:12ఎ) ఇతర ముద్రలు విప్పబడినప్పటి కాలంలోనే యిది జరిగివుండాలి ప్రభువు దినములో ఎప్పుడు యీ భూకంపం జరిగింది, అదెటువంటి భూకంపము?—ప్రకటన 1:10.

3. (ఎ) యేసు తన ప్రత్యక్షతను గూర్చిన ప్రవచనంలో ఏయే సంఘటనలను గూర్చి ప్రవచిస్తున్నాడు? (బి) అక్షరార్థ భూకంపాలు, ప్రకటన 6:12 లోని అలంకారిక భూకంపాలకు ఎలా సంబంధం కల్గివున్నాయి?

3 అక్షరార్థమైన, అలంకారికమైన భూకంపాలను గూర్చి బైబిల్లో అనేకమారులు తెలుపబడింది. రాజ్యాధికారంలో తాను ప్రత్యక్షం కాబోయే దానికి సూచనగా తెల్పిన గొప్ప ప్రవచనంలో, యేసు “అక్కడక్కడ . . . భూకంపములును కలుగును” అని ముందే తెల్పాడు. “వేదనలకు ప్రారంభము” అనే వాటిలో ఇవి భాగమై ఉంటాయి. జనాబా లక్షలాదిగా పెరుగుతూ, 1914 నుండి, యీ సహజ ప్రకంపనాలు మనకాలంలో వేదనలకు చాలావరకు దోహదపడు తున్నాయి. (మత్తయి 24:3, 7, 8) అయిననూ, అవి ప్రవచనాన్ని నెరవేర్చినప్పటికినీ, ఆ భూకంపాలు సహజమైనవి, భౌతిక సంబంధమైనవే. అవి ప్రకటన 6:12 నందలి అలంకారికమైన గొప్ప భూకంపానికి ముంగుర్తె ఉన్నాయి. ఇది నిజానికి, సాతాను యొక్క మానవభూసంబంధ విధానాన్ని పునాదులవరకు పెకలించి వేయడానికి వరుసగా వచ్చే ప్రకంపనాలకు అంతిమ వినాశకారిగా వస్తుంది. *

మానవ సమాజంలో భూకంపములు

4. (ఎ) విపత్కర పరిస్థితులు 1914 లో ప్రారంభమౌతాయని యెహోవా ప్రజలు ఎప్పటినుండి ఎదురుచూస్తున్నారు? (బి) ఏ కాలానికి 1914 ఒక అంతమై యుండెను?

4 ఆ విపత్కర సంఘటనలు 1914 లో ఆరంభమౌతాయని, అది అన్యరాజుల కాలములు అంతం కావడానికి గుర్తు అని యెహోవా ప్రజలు 1870 దశాబ్దపు మధ్యభాగం నుండే ఎదురుచూస్తూ వచ్చారు. ఈ కాలమే సా.శ.పూ. 607 లో యెరూషలేములోని దావీదు రాజ్యం పడద్రోయబడినప్పటి నుండి యేసు సా.శ. 1914 లో పరలోకమందు రాజైనంత వరకు కొనసాగే “ఏడు కాలములు” (2,520 సంవత్సరాలు).—దానియేలు 4:24, 25; లూకా 21:24, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌. *

5. (ఎ) సొసైటీ మొదటి అధ్యక్షుడు, 1914 అక్టోబరు 2వ తేదీన, ఏ ప్రకటన చేశాడు? (బి) రాజకీయంగా 1914 నుండి ఎటువంటి గందరగోళాలు జరిగినవి?

5 ఆవిధంగా, వాచ్‌టవర్‌ సొసైటీ మొదటి అధ్యక్షుడు, సి. టి. రస్సల్‌ అక్టోబర్‌ 2, 1914 ఉదయం న్యూయార్క్‌లోని బేతేలు గృహంలో ప్రాతఃకాల ఆరాధనకు వచ్చినప్పుడు ఆయన యీ ఆశ్చర్యకరమైన ప్రకటనచేశాడు: “అన్యరాజుల కాలములు అంతమయ్యాయి. ఆ రాజుల దినములు గతించిపోయాయి.” అవును, 1914 లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన గొప్పమార్పు ఎంతవరకు ఎగసిందంటే, దీర్ఘకాలంగా ఏలుతున్న అనేక రాజ్యాలు నామరూపాలు లేకుండా పోయాయి. బోల్షివిక్‌ విప్లవం మూలంగా 1917 లో కూలద్రోయబడిన జార్‌ ప్రభుత్వ పతనమప్పుడు మార్క్‌సిస్టులకు పెట్టుబడిదారి విధానానికి మధ్యజరిగే పోరాటానికి దారితీసింది. లోకమంతా రాజకీయ భూకంపాలు మానవసమాజాన్ని కలతపరుస్తూనే ఉన్నాయి. ఈనాడు అనేక ప్రభుత్వాలు ఒకటి రెండేండ్లు తిరక్కుండానే కూలిపోతున్నాయి. ఇటలీలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 42 సంవత్సరాల్లోనే 47 క్రొత్త ప్రభుత్వాలు మారిన వైనమే యీనాటి రాజకీయ రంగంలోని అస్థిరతకు అద్దం పడుతోంది. అయితే ముందుగా వచ్చే అటువంటి భూకంపాలు, చివరిగా వచ్చే ప్రభుత్వ పెనుమార్పుకు స్వల్పమైన ముంగుర్తు మాత్రమే. తత్ఫలితం? దేవుని రాజ్యం భూలోక పరిపాలనను హస్తగతం చేసుకుంటుంది.—యెషయా 9:6, 7.

6. (ఎ) హెచ్‌. జి. వెల్స్‌ ముఖ్యమైన, కొత్త యుగాన్నిగూర్చి ఎలా వర్ణించాడు? (బి) ఒక తత్వవేత్త, రాజకీయ నాయకుడు 1914 నుండి ఉన్న తరాన్ని గూర్చి ఏమని వ్రాశాడు?

6 చరిత్రకారులు, తత్వశాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు 1914 ఒక క్రొత్త, అతిముఖ్యమైన యుగమని సూచించారు. ఆ యుగంలోని పదిహేడు సంవత్సరాలను గూర్చి చరిత్రకారుడైన హెచ్‌. జి. వెల్స్‌ యిలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ప్రవక్త పసందైన వాటిని ప్రవచిస్తాడు. అయితే తాను చూచిన దానిని తెలియజేయడమే అతని విధి. లోకమింకా సైనికులు, దేశభక్తి పరాయణులు, వడ్డీవ్యాపారస్థులు, దుర్లాభాపేక్షపరుల చేతుల్లో స్థిరంగా నడుస్తున్నట్లు, అనుమాన ద్వేషాలతో నిండుకొని, వ్యక్తిగత స్వాతంత్ర్యాలను త్వరితగతిని పోగొట్టుకుంటూ, తీవ్రమైన వర్గపోరాటానికి కాలుదువ్వుతూ, క్రొత్తయుద్ధాలకు సిద్ధపడుతున్నట్లు అతడు గమనిస్తాడు.” తత్వవేత్త బెర్నాడ్‌ రస్సల్‌ 1953 లో యిలా రాశాడు: “ప్రపంచంలో 1914 నుండి జరిగే మార్పులను గమనించే ప్రతివ్యక్తీ యీ లోకం గొప్ప నాశనానికే నిర్ణయించబడిందా, అదృష్టం యింతేనా అన్నట్లు ఎంతో కలతచెందాడు. . . . గ్రీకు విషాదగాథలోని హీరో వలెనే, మానవజాతి అదృష్టంవల్లగాక, ఉగ్రులైన దేవుళ్లవలన నలగగొట్ట బడుతున్నట్లు భావిస్తున్నారు.” రాజనీతిజ్ఞుడు హెరాల్డ్‌ మ్యాక్‌మిలన్‌ 1980 లో మన 20వ శతాబ్దం ప్రశాంతంగా ప్రారంభమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ యిలా అన్నాడు: “ప్రతిదీ యింకా మెరుగౌతూనే వుంది. ఇటువంటి లోకములోనే నేను పుట్టాను . . . . అయితే అకస్మాత్తుగా, అనుకోని విధంగా, 1914 లో ఒకరోజు ఉదయం అదంతా మటుమాయమైంది.”

7-9. (ఎ) ఎటువంటి గందరగోళాలు 1914 నుండి మానవ సమాజాన్ని కుదిపేశాయి? (బి) యేసు లూకా 21 అధ్యాయంలో తెల్పిన ప్రవచనం ఎలా మానవ సమాజంలోని గందరగోళ పరిస్థితులు వాటి ప్రభావాన్ని గూర్చి తెల్పుతుంది?

7 రెండో ప్రపంచ యుద్ధం మరో గందరగోళాన్ని తెచ్చింది. మనమీ శతాబ్దాంతానికి సమీపిస్తుండగా అలాంటి చిన్నచిన్న యుద్ధాలు లోకాన్ని కుదిపేస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత విధానం అంతవరకు నిలుస్తుందా? భయంకరమైన అణ్వాయుధ నాశనభయం అనేకులకు యీ విధానం నిలుస్తుందా అనే అనుమానాన్ని కల్గిస్తుంది. సంతోషకరమైన విషయమేమంటే, దీనికి సమాధానం మానవునిపై గాక సృష్టికర్తపైనే ఆధారపడి ఉంది.—యిర్మీయా 17:5.

8 అయినా, యుద్ధాలే గాక ఇతర విషయాలు కూడ 1914 నుండి మానవ సమాజం యొక్క పునాదులను కుదిపేస్తున్నాయి. అక్టోబర్‌ 29, 1929న అమెరికాలో చెలరేగిన స్టాక్‌-మార్కెట్‌ గందరగోళం చాలా దెబ్బతీసిన యిటువంటి వాటిల్లో ఒకటి. ఇది పెట్టుబడిదారీ దేశాలన్ని దెబ్బతిన్నటువంటి ఆనాటి గొప్పఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఆ సంక్షోభం 1932-34 మధ్యలో సమసిపోయిననూ, యింకా మనం దాని ప్రభావానికి గురౌతున్నాం. మరి 1929 నుండి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక పథకాలతో కట్టుకడుతున్నారు. ప్రభుత్వాలు లోటు బడ్జెటుతోనే కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను, 1973 లో చమురు సంక్షోభం, 1987 లో స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలిన దురవస్థ, మరింతగా దెబ్బతీశాయి. ఇంతలో లక్షలాదిమంది అరువుపెట్టి కొనడానికి ఆరంభించారు. ఆర్థికపరమైన కిటుకులు, స్కీములు, లాటరీలు, మరితర ప్రలోభాల మూలంగా, అసంఖ్యాకులు మోసానికి బలైపోతున్నారు, మరి ప్రజలను పరిరక్షించవలసిన ప్రభుత్వాలే వారినలా ప్రలోభపెడుతున్నాయి. క్రైస్తవమత సామ్రాజ్యంలోని దూరదర్శినిలో సువార్త బోధించేవారు కోటానుకోట్ల రాబడిలో వారివంతుకొరకు వారుచేతులు చాపుతున్నారు.—యిర్మీయా 5:26-31 పోల్చండి.

9 అంతకుముందు, ఆర్థిక సంబంధమైన సమస్య వల్లనే హిట్లరు ముస్సోలిని అధికారానికి వచ్చారు. మహాబబులోను వారి యిష్టాలను చూరగొనడంలో క్షణమాగలేదు, మరి 1929 లో ఇటలీతోను 1933 లో జర్మనీతోను వాటికన్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. (ప్రకటన 17:5) ఆ పిదప వచ్చిన మధ్యయుగాల్లో జరిగినవికూడ, యేసు తన ప్రత్యక్షతను గూర్చిచెప్పిన సూచనలో భాగమైన “కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. . . . లోకముమీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడి కూలుదురు,” అన్న ప్రవచనంలో నిశ్చయంగా ఒక నెరవేర్పు భాగమే. (లూకా 21:7-9, 25-31) * అవును, 1914 లో మానవ సమాజాన్ని కుదిపివేయడాని కారంభించిన భూకంపాలు, ఆ వెంటవెంటనే వచ్చే శక్తివంతమైన ప్రకంపనాలతో యింకా కొనసాగుతునే ఉన్నాయి.

యెహోవా కొంత కంపింప జేస్తున్నాడు

10. (ఎ) మానవ కార్యాలలో ఎందుకు అనేక కంపములు కలుగుతున్నాయి? (బి) యెహోవా ఏం చేస్తున్నాడు, దేనిని సిద్ధపర్చడానికి?

10 మానవకార్యాలలో జరిగే అటువంటి ప్రకంపనాలు మానవుడు తన మార్గాన్ని తిన్నగా నడిపించుకోలేని అసమర్థతవల్ల వచ్చేఫలితమే. (యిర్మీయా 10:23) అంతేగాక, “సర్వలోకమును మోసపుచ్చుచున్న” ఆది సర్పమగు సాతాను, మానవజాతిని యెహోవా ఆరాధననుండి మరల్చే చివరి ప్రయత్నంగా వారికి వేదనలను కల్గిస్తున్నాడు. ఆధునిక సాంకేతికశాస్త్రం యావత్‌ ప్రజలను ఒకే ఇరుగుపొరుగుగా చేసింది, అక్కడే జాతి, వర్ణ విద్వేషాలు మానవ సమాజాన్ని పునాదులతో సహా కుదిపేస్తున్నాయి, మరి నామమాత్రపు ఐక్యరాజ్యసమితి వీటివిషయమై ఎలాంటి గుణవంతమైన స్వస్థతను కనుగొనలేక పోతుంది. ముందెన్నడు లేనంతరీతిగా, మానవుడు హానికొరకే మానవునిపై అధికారం చెలాయిస్తున్నాడు. (ప్రకటన 12:9, 12; ప్రసంగి 8:9) అయిననూ, భూమ్యాకాశాలను సృజించిన, సర్వాధికారియగు ప్రభువగు యెహోవా, లోక సమస్యలన్నింటిని పరిష్కరించే దృష్టితో, గత 70 ఏళ్లుగా తన స్వంత మార్గంలో భూమిని కంపింపజేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు?

11. (ఎ) హగ్గయి 2:6, 7 నందు ఏ కంపనము గూర్చి వివరించబడింది? (బి) హగ్గయి ప్రవచనమెలా నెరవేరుట కారంభమైంది?

11హగ్గయి 2:6, 7 నందు మనమిలా చదువుతాం: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరిని కదలింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” ముఖ్యంగా 1919 నుండి, యెహోవా తన సాక్షులు, భూమ్మీదనున్న మానవ సమాజంలోని సమస్త జాతులకు తన తీర్పులు ప్రకటించేలా చేస్తున్నాడు. ఈ భూవ్యాప్త ప్రకటన సాతాను లోకవిధానాన్ని ఒక ఊపు ఊపేస్తుంది. * హెచ్చరిక తీవ్రమయ్యే కొలది, దైవభయంగల మనుష్యులు అనగా “యిష్టవస్తువులు,” తాము జనములనుండి వేరైయుండడానికి ప్రోత్సహింపబడ్డారు. సాతాను సంస్థలో ప్రకంపనాలు కల్గించడం ద్వారా వారు కదలింపబడతారని కాదు. గానీ వారు పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు, మహిమతో యెహోవాను ఆరాధించడంలో శేషించిన యోహాను తరగతితో కలవడానికి వారు స్వయంగా తీర్మానించు కుంటారు. మరి ఇదెలా నెరవేర్చబడుతుంది? స్థాపించబడిన దేవుని రాజ్యసువార్తను ఆసక్తితో ప్రకటించుటద్వారానే. (మత్తయి 24:14) యేసు ఆయన అభిషక్త అనుచరులతో కూడిన యీ రాజ్యం “నిశ్చలమైన రాజ్యము”గా యెహోవా మహిమార్థమై నిత్యం నిలుస్తుంది.—హెబ్రీయులు 12:26-29.

12. మత్తయి 24:14 లో ప్రవచింపబడిన సువార్తకు మీరూ చెవియొగ్గినట్లయితే, ప్రకటన 6:12 లోని మహా భూకంపం రాకముందు మీరేమి చేయాలి?

12 అటువంటి ప్రకటనకు స్పందించిన వారిలో మీరూ ఒకరా? ఇటీవలి సంవత్సరాలలో యేసు మరణజ్ఞాపకార్థ కూటానికి హాజరైన ఎనభై లక్షలమందిలో బహుశ మీరూ ఒకరా? అలాగైతే, బైబిలు సత్యాన్ని పఠించడంలో మీ అభివృద్ధిని కొనసాగించండి. (2 తిమోతి 2:15; 3:16, 17) నాశనం కానైయున్న సాతాను భూసమాజపు నీతిమాలిన జీవిత విధానాన్ని పూర్తిగా విసర్జించండి! ఆ చివరి వినాశకర “భూకంపము” సాతాను లోకాన్ని ముక్కలు చేయకముందే నూతనలోక క్రైస్తవ సమాజంలోకి విచ్చేసి, దాని పరిచర్యలో పూర్ణంగా పాల్గొనండి. అయితే ఆ గొప్ప భూకంపం ఏమిటి? మనమిప్పుడు గమనిద్దాము.

గొప్ప భూకంపం

13. ఆ మహా భూకంపం మానవునికి ఎలా పూర్తి క్రొత్తగా ఉంటుంది?

13 అవును, క్లిష్టమైన యీ అంత్యదినాలు అటు అక్షరార్థమైన యిటు అలంకారికమైన భూకంపములు సంభవించే కాలమే. (2 తిమోతి 3:1) అయితే యీ కంపాలలో ఏదియూ, ఆరవ ముద్ర విప్పబడినప్పుడు యోహాను చూచిన చివరి గొప్ప భూకంపం కాదు. ముందుగా జరుగవలసిన ప్రకంపనాల సమయం అయిపోయింది. మానవులు కనీవినీ ఎరుగని పూర్తిగా ఓ క్రొత్త గొప్ప భూకంపం ఇక రానైయుంది. అదెంత పెద్ద భూకంపమంటే అది కల్గించే అపార నష్టాన్ని, ప్రకంపనాలను రిక్టర్‌ స్కేలుపైగాని మానవుని ఏ కొలమానంతో గాని కొలవలేం. ఇది స్థానికంగా వచ్చే కంపనం కాదు, గానీ “భూమి” నంతటిని, అంటే దిగజారిన మానవ సమాజాన్ని నేలమట్టం చేసేంత వినాశకరంగా ఉంటుంది ఆ భూకంపము.

14. (ఎ) ఒక మహా భూకంపం దాని ఫలితాలను గూర్చి ఏ ప్రవచనం తెల్పుతుంది? (బి) యోవేలు ప్రవచనం, ప్రకటన 6:12, 13 దేనిని సూచిస్తున్నాయి?

14 యెహోవా యితర ప్రవక్తలు కూడా అటువంటి భూకంపాలు వాటి వినాశకర ఫలితాలనుగూర్చి ప్రవచించారు. ఉదాహరణకు, సా.శ.పూ 820 లో యోవేలు “యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము”ను గూర్చి చెబుతూ, అప్పుడు “సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును” అని తెల్పాడు. తదుపరి ఆయన యీ మాటలను చేర్చాడు: “తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్రములు కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులోనుండి గర్జించుచున్నాడు; యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా నుండును.” (యోవేలు 2:31; 3:14-16) ఈ వణకుట అనేది మహాశ్రమల కాలంలో యెహోవా చేయబోవు తీర్పుకు మాత్రమే వర్తిస్తుంది. (మత్తయి 24:21) గనుక ప్రకటన 6:12, 13 లోని అటువంటి సమాచారం కూడ న్యాయంగా అదే అన్వర్తింపును కల్గివుంది.—యిర్మీయా 10:10; జెఫన్యా 1:14, 15 కూడ చూడండి.

15. హబక్కూకు ప్రవక్త ఎటువంటి గొప్ప కంపమునుగూర్చి తెల్పాడు?

15 యోవేలు తర్వాత సుమారు 200 సంవత్సరాలకు హబక్కూకు ప్రవక్త తన దేవునికి ప్రార్థిస్తూ యిలా అన్నాడు: “యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చికొనుము.” ఆ “కోపము” ఏమైయుండొచ్చు? హబక్కూకు మహా శ్రమలను గూర్చి స్పష్టంగా వర్ణిస్తూ, యెహోవా విషయం యిలా చెబుతున్నాడు: “ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరు యిటు అటు తొలుగుదురు. . . . బహు రౌద్రము కలిగి నీవు భూమిమీద సంచరించు చున్నావు. మహోగ్రుడవై జనములను అణగద్రొక్కు చున్నావు. నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.” (హబక్కూకు 3:1, 2, 6, 12, 18) యెహోవా జనములను త్రొక్కునప్పుడు భూమియంతట ఆయన ఎంతటి మహాకంపనం కల్గిస్తాడో గదా!

16. (ఎ) సాతాను దేవుని ప్రజలపై తుది ముట్టడివేసినప్పుడు ఏం జరుగుతుందని యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడు? (బి) ప్రకటన 6:12 నందలి మహా భూకంపం వల్ల ఏమౌతుంది?

16 మాగోగు దేశపువాడగు గోగు (పడద్రోయబడిన సాతాను) దేవుని ప్రజలమీద అంతిమ దాడిచేసినప్పుడు యెహోవా “ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టించును” అని యెహెజ్కేలు కూడ ప్రవచించాడు. (యెహెజ్కేలు 38:18, 19) అప్పుడు అసలైన భూకంపాలు కలుగవచ్చునేమో గాని ప్రకటన సూచనల రూపంలో యివ్వబడిందని మనం జ్ఞాపకముంచుకోవాలి. ఎత్తివ్రాయబడిన యీ ప్రవచనం మరితర ప్రవచనాలు చాలావరకు సాదృశ్యమైనవే. కావున, ఆరవ ముద్రను విప్పినప్పుడు యీ భూలోక విధానం యొక్క ప్రకంపనాలన్నింటి అంతాన్ని, అంటే యెహోవా దేవుని సర్వాధిపత్యానికి వ్యతిరేకులైన వారందర్ని నాశనంచేసే మహాభూకంపాన్ని గూర్చి బయలు పరుస్తున్నట్లుంది.

అంధకార సమయం

17. మహా భూకంపం సూర్యచంద్రనక్షత్రాదులపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?

17 యెహాను తెల్పుతునేవున్నట్లు, ఆ మహా భూకంపంతోపాటు ఆకాశములు కూడ యిమిడియుండే భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆయనిలా అంటున్నాడు: “సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను, పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.” (ప్రకటన 6:12బి, 13) ఎంత అద్భుత దృశ్యం! అది అంతకుముందు యేసు మత్తయి 24:29 లో ప్రవచించిన విపత్కర పరిస్థితి అంతాన్ని సూచిస్తుంది. మరి ఆ ప్రవచనం అక్షరార్థంగా నెరవేరితే జరుగబోయే భయంకర అంధకారాన్ని మీరూహించగలరా? పగటివేళ యిక వెచ్చని, ఆహ్లాదకరమైన సూర్యుని వెలుగుండదు! రాత్రివేళ సొగసైన తళతళలాడే వెన్నెల యిక ఉండదు! మరి కోటానుకోటి నక్షత్రాలు మృదువైన నీలాకాశపు నిశీదవీధిలో మిణుకుమిణుకుమని యిక మెరిసేదిలేదు. బదులుగా, శాశ్వతంగా శీతాకాలంలా వుండే గాఢాంధకారమే.

18. సా.శ.పూ. 607 లో యెరూషలేముకు ఎలా ‘ఆకాశములు చీకటికమ్మెను’?

18 ఆత్మీయభావంలో, అటువంటి అంధకారం ప్రాచీన ఇశ్రాయేలుకు కల్గుతుందని ప్రవచింప బడింది. యిర్మీయా యిలా హెచ్చరించాడు: “ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారుకమ్మియున్నది.” (యిర్మీయా 4:27, 28) సా.శ.పూ. 607 లో ఆ ప్రవచనం నెరవేరినప్పుడు, యెహోవా ప్రజలకు నిజానికి అన్నీ చీకటిమయమయ్యాయి. వారి ముఖ్యపట్టణం, యెరూషలేము బబులోనీయుల వశమైంది. వారి దేవాలయం నాశనమైంది, వారిదేశం విడువబడింది. వారికి ఆకాశంనుండి ఓదార్పుకరమైన వెలుగేమీ లేకుండెను. బదులుగా, వారి పరిస్థితి యిర్మీయా యిలా యెహోవాకు విలపించి చెప్పినట్లే ఉన్నది: “దయ తలచక మమ్మును చంపుచున్నావు. మాప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.” (విలాపవాక్యములు 3:43, 44) యెరూషలేముకు ఆనాటి ఆకాశమందలి అంధకారమంటే మరణం, నాశనమే.

19. (ఎ) ప్రాచీన బబులోనుమీద ఆకాశం చీకటి కమ్ముతుందనే విషయాన్ని గూర్చి దేవుని ప్రవక్తయైన యెషయా ఎలా వివరిస్తున్నాడు? (బి) యెషయా ప్రవచనం ఎప్పుడు ఎలా నెరవేరింది?

19 తదుపరి, ఆకాశమందలి అటువంటి అంధకారం ప్రాచీన బబులోనుకు నాశనాన్ని సూచించింది. దీన్నిగూర్చి దేవుని ప్రవక్త యిలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడుచేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండ నశింప జేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములును నక్షత్రరాసులును తమ వెలుగు ప్రకాశింపనియ్యవు. ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును. చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమునుబట్టియు దుష్టుల దోషమునుబట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను. బలాత్కారుల గర్వమును అణచివేసెదను.” (యెషయా 13:9-11) బబులోను మాదీయుల పారసీకుల హస్తగతమైనప్పుడు సా.శ.పూ. 539 లో యీ ప్రవచనం నెరవేరింది. బబులోను ముందున్న ప్రపంచ ఆధిపత్యంగా తన స్థానంనుండి కూలిపోయినప్పుడు దానికి ఎటువంటి ఓదార్పుకరమైన వెలుగులేదని, దాని అంధకారము నిరాశాస్థితిని గూర్చి చక్కగా వర్ణిస్తూంది.

20. మహా భూకంపం వచ్చినప్పుడు యీ లోకవిధాన మంతటికి ఏ భయంకరమైన పర్యవసానం కలుగబోతుంది?

20 అదేమాదిరి, మహా భూకంపం వచ్చినప్పుడు యీ లోకవిధానమంతా పూర్తి అంధకారమనే నిరాశలో మునిగిపోతుంది. సాతాను భూలోక విధానం యొక్క ప్రకాశవంతమైన జ్యోతులు ఏ నిరీక్షణనివ్వవు. ఇప్పటికే, లోక రాజకీయ నాయకులు, ముఖ్యంగా క్రైస్తవమతంలోని నాయకులు యీనాడు లంచగొండితనం, అబద్ధం, అవినీతితోకూడిన జీవిత విధానానికి పేరుగాంచారు. (యెషయా 28:14-19) వారింకే మాత్రం నమ్మదగినవారు కారు. యెహోవా తీర్పు తీర్చినపుడు, మిణుకుమిణుకుమనే వారి వెలుగు పూర్తిగా ఆరిపోతుంది. లోక విషయాలపై ఉండే చంద్రబింబంవంటి వారిప్రభావం రక్తసిక్తమని, మరణకరమని బహిర్గతమౌతుంది. ఈ పుడమి మహాతారలంతా ఉల్కలవలె రాలి ఆరిపోతారు, ప్రచండమైన సుడిగాలికి అంజూరపు చెట్టు అకాలపు కాయలు రాలిపోవునట్లు వారు చెదరిపోతారు. “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టిశ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు,” అనే మహాశ్రమలో మన భూగోళమంతా కంపించిపోతుంది. (మత్తయి 24:21) ఎంతటి భయంకరమైన భవిష్యత్తోగదా!

“ఆకాశమండలము” తొలగిపోవుట

21. ఆ దర్శనంలో ‘ఆకాశము, ప్రతి పర్వతము, ప్రతికొండను ప్రతి ద్వీపమును’ గూర్చి యోహాను ఏం చూశాడు?

21 యోహాను దర్శనమింకా యిలా కొనసాగుతుంది: “మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథమువలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతి ద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.” (ప్రకటన 6:14) నిజానికివి అసలైన ఆకాశాలు, పర్వతాలు, ద్వీపాలుకావు. మరి అవి వేటిని సూచిస్తున్నాయి?

22. ఎదోములో ఎటువంటి ‘ఆకాశములు కాగితపు చుట్టవలె చుట్టబడినవి’?

22 “ఆకాశమండలము” అంటే ఏమిటో, మనం సమస్తజనులపై యెహోవా కోపాగ్ని రగులుకుంటుందని చెప్పబడిన అదేమాదిరి ప్రవచనాన్నిబట్టి అర్థం చేసికొనుటకది మనకు సహాయ పడుతుంది. “ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్టవలె ఆకాశ వైశాల్యములు చుట్టబడును.” (యెషయా 34:4) ముఖ్యంగా ఎదోము తప్పక బాధనొందవలసి యుండెను. ఎలా? సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం తర్వాత అది బబులోనీయుల చేత తొక్కబడింది. ఆకాలంలో, అక్షరార్థమైన ఆకాశంలో ప్రత్యేక సంఘటనలు జరిగిన దాఖలాలేమీ లేవు. అయితే ఎదోము “ఆకాశములో” విపత్కర సంఘటనలు జరిగాయి. * దాని మానవ ప్రభుత్వాధికారాలు వాటి ఆకాశపుటెత్తునుండి నేలమట్టమయ్యాయి. (యెషయా 34:5) ఎవరికీ ఏ విధంగానూ ఉపయోగపడని పాత గ్రంథపుచుట్ట చుట్టబడిన మాదిరి అవి ‘చుట్టవలె చుట్టబడి’ ప్రక్కన పెట్టబడ్డాయి.

23. ‘కాగితపు చుట్టవలె చుట్టబడవలసిన’ “ఆకాశము” ఏమిటి, మరి పేతురు మాటలు యీ భావాన్నెలా స్థిరపరుస్తున్నాయి?

23 అలా, ‘కాగితపు చుట్టవలె చుట్టబడవలసిన’ “ఆకాశము,” యీ భూమినిపాలించే దేవుని శత్రువులైన ప్రభుత్వాలను సూచిస్తుంది. విజయుడగు తెల్లని గుఱ్ఱంపైనున్న రౌతు వీటిని పూర్తిగా తీసివేస్తాడు. (ప్రకటన 19:11-16, 19-21) ఆరవ ముద్ర విప్పినప్పుడు బయల్పడే విషయాలకొరకు నిరీక్షించిన అపొస్తలుడైన పేతురు చెప్పినదాన్నిబట్టి యిది నిరూపించ బడుతుంది: “ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువ చేయబడినవి.” (2 పేతురు 3:7) ‘ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను’ అన్నమాట భావమేమిటి?

24. (ఎ) బైబిలు ప్రవచనంలో, ఎప్పుడు పర్వతాలు ద్వీపాలు బ్రద్దలౌతాయని లేక కంపింప జేయబడతాయని చెప్పబడింది? (బి) నీనెవె నాశనమైనప్పుడు ఎలా ‘పర్వతాలు’ బ్రద్దలయ్యాయి?

24 బైబిలు ప్రవచనంలో, పర్వతాలు ద్వీపాలు బద్దలౌతాయని లేక గొప్ప రాజకీయ గందరగోళ సమయాల్లో ఆ పరిస్థితిని సూచించేందుకు అవొక సూచనార్థకంగా తెలుపబడ్డాయి. ఉదాహరణకు, నీనెవెకు జరిగే యెహోవా తీర్పును గూర్చి ప్రవచిస్తూ, నహూము ప్రవక్త యిలా అన్నాడు: “ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును.” (నహూము 1:5) నిజానికి సా.శ.పూ. 632 లో నీనెవె నాశనమైనపుడు అక్షరార్థమైన పర్వతాలు బ్రద్దలైన దాఖలాలేమీ లేవు. అయితే అంతకుముందు దానిశక్తిలో పర్వతంవలె కనబడిన ప్రపంచ ఆధిపత్యం అకస్మాత్తుగా కూలిపోయింది.—యిర్మీయా 4:24 పోల్చండి.

25. ఈ విధానాంతంలో, ‘ప్రతి పర్వతమును, ప్రతి ద్వీపమును’ ఎలా వాటివాటి స్థానాలనుండి తొలగించబడతాయి?

25 గనుక, ఆరవ ముద్ర విప్పబడినప్పుడు “ప్రతి పర్వతము, ప్రతి ద్వీపమును” అని తెలుపబడిన మాట న్యాయంగా, అనేకమంది మానవులకు స్థిరమైనవిగా కనబడే యీలోక ప్రభుత్వాలు, వాటి ఆధారిత సంస్థలను సూచిస్తాయి. వాటిని ముందు నమ్మినవారు భీతిల్లి తల్లడిల్లునట్లు అవి వాటి స్థానాలలో లేకుండ బ్రద్దలు చేయబడతాయి. ప్రవచనం యింకను తెలియజేసే రీతిగా, యెహోవా ఆయన కుమారుని ఉగ్రత మహాదినము—సాతాను సంస్థనంతటిని తీసివేసే చివరి కంపం—ప్రతీకారంతో వస్తుందనడంలో సందేహంలేదు!

‘మామీద పడి మమ్మును మరుగు చేయండి’

26. దేవుని సర్వాధిపత్యానికి శత్రువులైన మానవులు ఎలా భీతినొందుతారు, మరి వారెటువంటి భయాందోళనను వ్యక్తపరుస్తారు?

26 యోహాను మాటలిలా కొనసాగుతున్నాయి: “భూరాజులును, ఘనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతిదాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని—సింహాసనాసీనుడైయున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.”—ప్రకటన 6:15-17.

27. షోమ్రోనులోని నమ్మకద్రోహులైన ఇశ్రాయేలీయులు ఎలా విలపించారు, మరి ఆ మాటలెలా నెరవేరాయి?

27 హూషేయ ఇశ్రాయేలీయుల ఉత్తర సామ్రాజ్యమైన షోమ్రోను మీద యెహోవా తీర్పులనుగూర్చి ప్రకటించేటప్పుడు ఆయనిలా అన్నాడు: “ఇశ్రాయేలువారి పాపస్వరూపమైన ఆవెనులోని ఉన్నతస్థలములు లయమగును, ముండ్లచెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును, పర్వతములను చూచి—మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి—మామీద పడుడనియు వారు చెప్పుదురు.” (హూషేయ 10:8) ఈ మాటలెలా నెరవేరాయి? షోమ్రోనును సా.శ.పూ. 740 లో క్రూరులైన అష్షూరీయులు నాశనం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు తలదాచుకోవడానికి తావేలేకపోయింది. ఓడిపోయిన జనాంగం యొక్క మానసిక భీతి, నిరాశ, నిరాశ్రయతా భావాలు హూషేయ మాటల్లో వ్యక్తమౌతున్నాయి. గతంలో శాశ్వతంగా ఉన్నాయనుకున్న అసలైన కొండలుగాని పర్వతాలవంటి సంస్థలుగాని వారిని రక్షించలేకపోయాయి.

28. (ఎ) యెరూషలేములోని స్త్రీలకు యేసు ఏ హెచ్చరిక చేశాడు? (బి) యేసు హెచ్చరిక ఎలా నెరవేరింది

28 అలాగే రోమా సైనికులు యేసును మరణానికి తీసుకొని వెళ్లేటప్పుడు, ఆయన యెరూషలేము స్త్రీలనుద్దేశించి యిలా అన్నాడు: “ఇదిగో—గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి. అప్పుడు—మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.” (లూకా 23:29, 30) రోమీయులు సా.శ. 70 లో యెరూషలేమును నాశనము చేసిన విషయం చక్కగా లిఖితమైవుంది. యేసు మాటలుకూడ హోషేయా పల్కిన మాటలవంటి ప్రాముఖ్యతను కల్గివున్నాయనుట స్పష్టం. యూదయలోనున్న యూదులకు దాగుకొనే స్థలమే లేకుండెను. యెరూషలేములో దాక్కోవడానికి వారెక్కడ ప్రయత్నించినను లేక మాసాదా అనే పర్వత శిఖరంపైనున్న కోటలో తలదాచు కోవాలనుకున్ననూ వారు యెహోవా కఠినమైన తీర్పును తప్పించుకోలేకపోయారు.

29. (ఎ) యెహోవా ఉగ్రతదినము వచ్చినప్పుడు యీ లోకవిధానానికి మద్దతు నిచ్చిన వారందరి గతి ఏమౌతుంది? (బి) యెహోవా తన ఉగ్రతను కుమ్మరించినప్పుడు, యేసు చెప్పిన ఏ ప్రవచనం నెరవేరుతుంది?

29 ఇప్పుడు, ఆరవముద్రను విప్పినప్పుడు రాబోవు యెహోవా ఉగ్రత దినములో అటువంటి సంఘటనలే సంభవిస్తాయని అది చూపిస్తుంది. ఈ లోకవిధానాన్ని చివరిసారిగా కదలించినప్పుడు, దానికి మద్దతునిస్తున్నవారు దాక్కోవడానికి వృధాగా ప్రయాసపడతారుగాని వారికలాంటిదేమీ లభించదు. అబద్ధమతం, మహాబబులోను వారిని యిప్పటికే ఘోరంగా నిష్ఫలులను చేసింది. నిజమైన పర్వతాలలోని గుహలు గాని, అలంకారార్థమైన పర్వతాలవంటి రాజకీయ, వ్యాపార సంస్థలుగాని వారికి ఆర్థిక భద్రతనివ్వలేవు లేక యితరత్రా ఏ సహాయం చేయలేవు. యెహోవా ఉగ్రతనుండి వారినేదియు రక్షించలేదు. వారి భయాందోళనను గూర్చి యేసు చక్కగా యీ మాటల్లో వర్ణించాడు: “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.”—మత్తయి 24:30.

30. (ఎ) “దానికి తాళజాలినవాడెవడు” అనే ప్రశ్న భావమేమిటి? (బి) యెహోవా తీర్పు సమయమందు ఎవరైనా నిలువగలరా?

30 అవును, విజయుడగు తెల్లని గుఱ్ఱపురౌతు అధికారాన్ని అంగీకరించడానికి తిరస్కరించిన వారు తమ తప్పు తెలుసుకొనేలా చేయబడతారు. సాతాను సంతానంలో భాగమై యుండడాని కిష్టపడిన మానవులంతా, సాతాను లోకం గతంచి పోయినప్పుడు, నాశనమౌతారు. (ఆదికాండము 3:15; 1 యోహాను 2:17) అప్పుడు లోకపరిస్థితి ఎలా ఉంటుందంటే అనేకులు యిలా అడుగుతారు: “దానికి తాళజాలిన వాడెవడు?” యెహోవా తీర్పుదినాన ఆయన యెదుట నిలువగల్గిన వాడెవడూ ఉండడని నిజంగా అనుకుంటారు. అయితే, ప్రకటన తెల్పుతున్న రీతిగా వారి అభిప్రాయం తప్పవుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 3 అధిక వివరణకొరకు 22, 24 పేజీలను చూడండి.

^ పేరా 4 లూకా 21:25, 28, 31 లోని వచనాలు 1896 నుండి 1931 వరకు అంటే 35 సంవత్సరాల కంటె ఎక్కువకాలం వాచ్‌టవర్‌ అట్టమీద చూపబడ్డాయి, వాటివెనుక పొంగుచున్న సముద్రంపై కారు మేఘాలు, ఓడరేవున వెలుగుతున్న దీపస్థంభపు చిత్రం ఉండేది.

^ పేరా 9 ఉదాహరణకు, 1931 లో ఒక ప్రత్యేక ప్రచార దండయాత్రలో, యెహోవాసాక్షులు స్వయంగా ది కింగ్‌డం, ది హోప్‌ ఆఫ్‌ ది వల్డ్‌ అనే చిన్నపుస్తకాన్ని, లోకమంతటా మతగురువులకు, రాజకీయ నాయకులకు, మరి వ్యాపారస్థులకు పంచిపెట్టారు.

^ పేరా 11 “ఆకాశములు” అనే పదం అటువంటి భావంలోనే, యెషయా 65:17, 18 లోని ప్రవచన నెరవేర్పు యూదులు బబులోను చెరనుండి వాగ్దాన దేశానికి తిరిగి వచ్చి గవర్నరు జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యేషూవలతో స్థాపించబడిన క్రొత్త ప్రభుత్వ విధానం విషయంలో అది మొదటి నెరవేర్పును కల్గియున్నది.—2 దినవృత్తాంతములు 36:23: ఎజ్రా 5:1, 2; యెషయా 44:28.

^ పేరా 22 అసలు భూకంపాలు, తరచుగా స్వల్ప ప్రకంపనాల తర్వాత వస్తుంటాయి, వీటిని మానవులు అసలు భూకంపం వచ్చేవరకు పసిగట్టలేక పోయిననూ, కుక్కలు మొరగడానికి, వెర్రిగా ప్రవర్తించడానికి, యితర జంతువులు, చేపలు చెలరేగడానికి దోహదం చేస్తాయి.—అవేక్‌!, జూలై 8, 1982, పేజి 14చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[105వ పేజీలోని బాక్సు]

1914 గూర్చి ముందుగనే తెలుసుకొనుట

“క్రీ.పూ. 606 లో దేవునిరాజ్యం అంతమైంది, కిరీటం తీసివేయబడింది, భూమియంతా అన్యులకియ్యబడింది. క్రీ..పూ. 606 నుండి ప్రారంభమైన 2520 సంవత్సరాలు క్రీ.శ. 1914 లో అంతమవుతాయి.” *—1877 లో ప్రచురింపబడిన ది త్రీ వర్‌ల్డ్స్‌, 83వ పేజి.

“బైబిలు సాక్ష్యం స్పష్టంగాను బలంగాను ఉన్నది, అదేమంటే ‘అన్యరాజుల కాలములు’ అంటే క్రీ.పూ. 606 నుండి, క్రీ.శ. 1914వ సంవత్సరంతో సహా అంతవరకు యీ మధ్యలోని కాలమేనని చూపిస్తుంది.”—సి. టి. రస్సల్‌ చే వ్రాయబడి 1889 లో ప్రచురితమైన—స్టడీస్‌ యిన్‌ ద స్క్రిప్చర్స్‌, సంపుటి, 2, 79వ పేజి.

చార్లస్‌ టేజ్‌ రస్సల్‌ ఆయన సహ బైబిలు విద్యార్థులు, అన్యరాజుల కాలములు, లేక జనముల నియమిత కాలములు 1914 లోనే అంతమౌతాయని దశాబ్దాల క్రితమే గ్రహించారు. (లూకా 21:24) ఆ తొలికాలంలో వారు దీని అర్థాన్ని పూర్తిగా గ్రహించలేక పోయినను, 1914వ సంవత్సరం మాత్రం మానవచరిత్రలోనే ప్రాముఖ్యమైన సంవత్సరమని వారు నిశ్చయంగా నమ్మారు, వారు నమ్మింది నిజమే. ఈ క్రింది వార్తాపత్రిక ఎత్తివ్రాసిన విషయాన్ని గమనించండి:

“ఐరోపాలో చెలరేగిన భయంకర యుద్ధం ఒక విశేషమైన ప్రవచనాన్ని నెరవేర్చింది. గత ఇరవై అయిదేండ్లలో, సువార్తికులద్వారా, వార్తాపత్రికలద్వారా యీ ‘అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు,’ అంటే ‘మిలేనియల్‌ డానర్స్‌’ అని అందరికి తెలిసినవారు, బైబిలునందు ప్రవచింపబడిన ఉగ్రతా దినము 1914 లో వస్తుందని లోకానికి ప్రకటిస్తూనే ఉన్నారు. ‘1914 కొరకు నిరీక్షించండి’ అనేదే వేలాదిమంది ప్రయాణ సువార్తికుల ఘోషణ.”— ది వర్‌ల్డ్‌, న్యూయార్క్‌ దినపత్రిక, ఆగష్టు 30, 1914.

[అధస్సూచీలు]

^ పేరా 75 దైవానుగ్రహంవల్ల, బైబిలు విద్యార్థులు “క్రీ.పూ.” నకు “క్రీ.శ.” నకు మధ్య సున్న అనే సంవత్సరం లేదనే విషయాన్ని గుర్తించలేదు. ఆ పిదప, పరిశోధన మూలంగా, క్రీ.పూ. 606ను క్రీ.శ. 607 కు మార్చవలసి వచ్చినప్పుడు సున్న అనే సంవత్సరం కూడ తొలగించబడింది, అలాగున క్రీ.శ. 1914 అని ప్రవచింపబడటం సరిగ్గా సరిపోయింది.”—వాచ్‌టవర్‌ సొసైటి 1943 లో ప్రచురించిన “ద ట్రూత్‌ షల్‌ మేక్‌ యు ఫ్రీ,” అనే పుస్తకంలో 239వ పేజీ చూడండి.

[106వ పేజీలోని బాక్సు]

1914—ఓ మలుపురాయి

కోపెన్‌ హాగన్‌లో 1987 లో ప్రచురించబడిన, పొలిటికెన్స్‌ వెర్డెన్‌షిస్‌స్టోరీహిస్టారిన్స్‌ మాగ్ట్‌ ఓగ్‌ మెనింగ్‌ (పొలిటికన్స్‌ వరల్డ్‌ హిస్టరీది పవర్‌ అండ్‌ మీనింగ్‌ ఆఫ్‌ హిస్టరీ), అనే పుస్తకంలోని 40పేజీలో యిలా వ్రాయబడింది:

“ఈ 19వ శతాబ్దపు నమ్మకం అంటే అభివృద్ధిని గూర్చిన నమ్మకం 1914 లో పూర్తిగా వమ్ము అయింది. యుద్ధానికి ముందు సంవత్సరంలో డానిష్‌ చరిత్రకారుడు, రాజకీయవేత్త పీటర్‌ మంక్‌ ఆశావాదంతోనే యిలా వ్రాశాడు: ‘ఐరోపాలోని పెద్ద దేశాలమధ్య యుద్ధం జరుగుతుందనే ఆధారమేమీ కనిపించడం లేదు. మరి 1871 నుండి అనేకసార్లు జరిగినట్లు, భవిష్యత్‌లో “యుద్ధభయం” అదృశ్యమౌతుంది.’

“దీనికి విరుద్ధంగా, తాను తర్వాత రాసిన వాటిలో ఆయనిలా అంటున్నాడు: ‘1914 లో జరిగిన యుద్ధం మానవ చరిత్రలోనే ఓ గొప్ప మలుపు. సురక్షితంగా పనులు కొనసాగించగలిగే మంచి పురోభివృద్ధి చెందే యుగంనుండి అభద్రతతో కూడిన ద్వేషం, భీతి, విపత్తులతో నిండిన యుగంలో ప్రవేశించాం. మానవుడు యుగయుగాలనుండి నిరీక్షిస్తూ వస్తున్న సామాజిక వ్యవస్థ సమూలంగా సర్వనాశన మౌతుందో లేదో ఆనాడు సంభవించిన దాన్నిబట్టి అప్పుడు చెప్పలేక పోయారు, మరిప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు.’”

[110వ పేజీలోని చిత్రం]

‘ప్రతి పర్వతం దాని స్థానంనుండి తొలగించబడింది’

[111వ పేజీలోని చిత్రం]

వారు గుహలలో దాక్కున్నారు