కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బబులోను అంతాన్నిగూర్చి ప్రలాపించుట, ఆనందించుట

బబులోను అంతాన్నిగూర్చి ప్రలాపించుట, ఆనందించుట

అధ్యాయం 37

బబులోను అంతాన్నిగూర్చి ప్రలాపించుట, ఆనందించుట

1. “భూరాజులు” మహాబబులోను ఆకస్మిక నాశనాన్ని చూసి ఎలా స్పందిస్తారు?

బబులోను అంతం యెహోవా ప్రజలకు సువార్తే, గానీ జనములెలా దాన్ని దృష్టిస్తున్నాయి? యోహాను మనకిలా తెల్పుతున్నాడు: “దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధచూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు—అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.”—ప్రకటన 18:9, 10.

2. (ఎ) ఎఱ్ఱని క్రూరమృగం యొక్క సాదృశ్యమైన పదికొమ్ములు మహాబబులోనును నాశనం చేస్తే, దాని నాశనం విషయంలో మరి “భూరాజులు” ఎందుకు ప్రలాపించాలి? (బి) దుఃఖాక్రాంతులైన రాజులెందుకు నాశనమయ్యే పట్టణానికి దూరంగా నిల్చుంటారు?

2 బబులోను ఎఱ్ఱని క్రూరమృగము యొక్క సాదృశ్యమైన పదికొమ్ములచేత నాశనం చేయబడుతున్న దృష్ట్యా, జనముల ప్రతిస్పందన ఆశ్చర్యమనిపించవచ్చు. (ప్రకటన 17:16) అయితే బబులోను అంతమైన తర్వాత “భూరాజులు” అది ప్రజలను తొత్తులుగా చేసికొని తన అధీనంక్రింద ఉంచుకోవడం వారికెంత ప్రయోజనకరమో గ్రహిస్తారు. మతగురువులు యుద్ధాలను పవిత్రమైనవని ప్రకటించారు, నియామకపు ప్రతినిధులుగా పనిచేశారు, యౌవనస్థులు యుద్ధపంక్తులు తీరాలని ప్రచారం చేశారు. మతం పవిత్రతయనే ముసుగు వేసినందున దానివెనుక దుష్టపాలకులు సామాన్య మానవుని బాధిస్తున్నారు. (యిర్మీయా 5:30, 31; మత్తయి 23:27, 28 పోల్చండి.) అయిననూ, దుఃఖాక్రాంతులైన యీ రాజులు యిప్పుడు నాశనమైన ఆ పట్టణానికి దూరాన నిల్చున్నారని గమనించండి. వారు దానికి సహాయం చేయడానికై దాని దరిదాపులకు కూడ రావడంలేదు. అది నాశనం కావడం చూసి దుఃఖిస్తున్నారే గానీ దాని నిమిత్తం ఎటువంటి శ్రమ తీసుకోవడంలేదు.

వర్తకులు దుఃఖిస్తూ ప్రలాపిస్తారు

3. మహాబబులోను అంతాన్నిగూర్చి ఇంకెవరుకూడ విలపిస్తారు, దీనికి కారణాలేవని యోహాను తెల్పుతున్నాడు?

3 మహాబబులోను అంతాన్ని చూసి విలపించేది భూరాజులు మాత్రమే కాదు. “లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదారంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను, ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతివిధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను, దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోధుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగువాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు; నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించిపోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.”—ప్రకటన 18:11-14.

4. మహాబబులోను అంతాన్ని గూర్చి “వర్తకులు” ఎందుకు దుఃఖించి, ప్రలాపిస్తారు?

4 అవును, మహాబబులోను ధనవంతులైన వర్తకులకు సన్నిహిత స్నేహితురాలు, మంచి వినిమయదారురాలై యుండెను. ఉదాహరణకు, క్రైస్తవమత సామ్రాజ్యంలో ఉంటున్న ఆశ్రమాలు, సన్యాసినుల మఠాలు, మరియు చర్చీలు శతాబ్దాలనుండి బంగారు, వెండి, వెలగల రాళ్లు, విలువైన కఱ్ఱలు, మరితర సంపత్తిని పెద్దమొత్తంలో సంపాదించాయి. ఇంకనూ, క్రీస్తును అగౌరవపరచే క్రిస్మస్‌ మరియు పరిశుద్ధపండుగలని పిలువబడే వాటిని ఆచరించడానికి చేసే అట్టహాసం, దుర్వ్యయం మీద మతసంబంధమైన ఆశీర్వాదమిస్తూనేవుంది. క్రైస్తవమత సామ్రాజ్యపు మిషనరీలు సుదూర దేశాలకు వెళ్లి యీ లోక “వర్తకుల” నిమిత్తం క్రొత్త వ్యాపార మార్గాలను తెరిచారు. జపాన్‌లో 17వ శతాబ్దంలో, వ్యాపారస్థులతో సంబంధాలేర్పర్చుకున్న కాథోలిక్‌ మతం, జమీందారీ యుద్ధంలో సహితం పాల్గొన్నది. ఒసాకా భవంతినుండి జరిపిన తీర్మాన పూర్వక యుద్ధాన్నిగూర్చి నివేదిస్తూ, ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా యిలా చెబుతుంది: “టోకుగావ సైన్యాలు సిలువగుర్తు, రక్షకుని విగ్రహాలు, స్పెయిన్‌ సంరక్షక పరిశుద్ధుడైన జేమ్స్‌ ప్రతిమలతో అలంకరించిన జెండాలుగల శత్రువులతో యుద్ధం చేశారు.” విజయం సాధించిన గుంపు ఆ దేశములో కాథోలిక్‌లను హింసించి పూర్తిగా లేకుండా చేసింది. అలాగే చర్చి, నేడు లోకసంబంధమైన వాటిలో జోక్యం చేసుకోవడంవల్ల దానికేమీ ఆశీర్వాదాలను తీసుకొనిరాదు.

5. (ఎ) “వర్తకులు” ప్రలాపించే విషయాన్ని పరలోకంనుండి వచ్చే స్వరం ఎలా వర్ణిస్తుంది? (బి) వర్తకులుకూడ ఎందుకు “దూరముగా నిలుచుందురు”?

5 పరలోకంనుండి వచ్చే స్వరం యింకనూ యిలా చెబుతోంది: “ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు—అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము ఒక్కగడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు, దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు.” (ప్రకటన 18:15, 16) మహాబబులోను నాశనంతో, “వర్తకులు” తమ వ్యాపార భాగస్వామిని పోగొట్టుకున్నందుకు ప్రలాపిస్తారు. నిజానికి, వారికది ‘ఎంతో విచారకరం’ అయినా, వారి దుఃఖం పూర్తిగా స్వార్థకారణాలను బట్టియేనని గమనించండి, వారు రాజులవలెనే “దూరముగా నిలుచుందురు.” వారు మహాబబులోనుకు సహాయం చేసేందుకు సమీపానికి రారు.

6. ఓడ నాయకుడు, నావికులు ప్రలాపించే విషయాన్ని పరలోకంనుండి వచ్చే స్వరం ఎలా వర్ణిస్తుంది, వారెందుకు దుఃఖిస్తారు?

6 ఆ వృత్తాంతమింకను యిలా తెల్పుతుంది: “ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనము చేయువారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి—ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి తమ తలలమీద దుమ్ముపోసికొని యేడ్చుచు దుఃఖించుచు—అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.” (ప్రకటన 18:17-19) ప్రాచీన బబులోను వ్యాపార పట్టణం, దానికెన్నో ఓడలుండేవి. అదేమాదిరి, మహాబబులోను దాని ప్రజలనే “జలముల”తో ఎంతో వ్యాపారం చేస్తుంది. దీనివల్ల దానికున్న మతసంబంధమైన అనేకమంది సభ్యులకు ఉద్యోగం లభిస్తుంది. మహాబబులోను నాశనంవల్ల వీరికెంత దెబ్బతగులుతుందో గదా! దానివంటి జీవనోపాధి మరొకటి మరెక్కడా లభించదు.

దాని సమూలనాశనం విషయంలో ఆనందించుట

7, 8. మహాబబులోనును గూర్చి పరలోకంనుండి వచ్చే స్వరం ఎలా తన సమాచారాన్ని ముగిస్తుంది, ఆ మాటలకు ఎవరు స్పందిస్తారు?

7 ప్రాచీన బబులోను సామ్రాజ్యాన్ని మాదీయులు పారసీకులు పడద్రోసినప్పుడు యిర్మీయా ప్రవచనార్థకంగా యిలా అన్నాడు: “ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతినిగూర్చి సంతోషించును.” (యిర్మీయా 51:48) మహాబబులోను నాశనం చేయబడునప్పుడు, పరలోకమునుండి వచ్చు స్వరం మహాబబులోనును గూర్చి యిలా చెబుతూ ముగిస్తుంది: “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనందించుడి; ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.” (ప్రకటన 18:20) ఇప్పటికి పునరుత్థానులై పరలోకంలో 24మంది పెద్దల స్థానమందున్న అపొస్తలులు, తొలిక్రైస్తవ ప్రవక్తలు ఆనందించినట్లే యెహోవా మరియు దూతలు దేవుని ప్రాచీన శత్రువు నాశనమగుట చూసి ఆనందిస్తారు.—కీర్తన 97:8-12 పోల్చండి.

8 నిజానికి, పరలోకమునకు పునరుత్థానం కానివ్వండి లేక యింకనూ భూమ్మీద ఉండనివ్వండి, వేరేగొఱ్ఱెలకు చెందిన తోటి గొప్పసమూహము వలెనే “పరిశుద్ధులు” అందరూ ఉల్లసిస్తారు. సకాలంలో, నమ్మకస్థులైన పూర్వీకులంతా నూతనలోకంలో పునరుత్థానులౌతారు, వారుకూడ యీ ఆనందంలో పాలుపంచుకుంటారు. దేవుని ప్రజలు అబద్ధమత హింసకులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించ లేదు. వారు యెహోవా మాటలను జ్ఞాపకం పెట్టుకున్నారు: “పగతీర్చుట నాపని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు.” (రోమీయులు 12:19; ద్వితీయోపదేశకాండము 32:35, 41-43) అవును, యెహోవా యిప్పుడు ప్రతీకారము చేశాడు. మహాబబులోను చిందించిన రక్తమంతటికీ ప్రతీకారం జరిగింది.

గొప్ప తిరుగలిరాయిని పడవేయుట

9, 10. (ఎ) బలిష్టుడైన దూత యిప్పుడేమి చేస్తున్నాడు, ఏమి చెబుతున్నాడు? (బి) ప్రకటన 18:21 లో బలిష్టుడైన దూత చేసినటువంటిదే ఏ క్రియ యిర్మీయా కాలంలో జరిగింది, అది దేనికి అభయమిస్తుంది? (సి) యోహాను చూసిన బలిష్టుడైన దూత చేసిన క్రియ దేనికి అభయమిస్తుంది?

9 యోహాను తదుపరి చూసేది మహాబబులోనుపై యెహోవా తీర్పు అంతిమ తీర్పని స్థిరపరస్తుంది: “తరువాత బలిష్టుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి—ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.” (ప్రకటన 18:21) యిర్మీయా కాలంలో, శక్తివంతమైన ప్రవచనార్థక భావంతో అటువంటి క్రియే జరిగింది. యిర్మీయా “బబులోనుమీదికి వచ్చు అపాయములన్నిటిని” ఒక గ్రంథములో వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు. ఆయన ఆ గ్రంథాన్ని శెరాయాకిచ్చి బబులోనుకు వెళ్లమని చెప్పాడు. అక్కడ యిర్మీయా సూచనల ప్రకారం, శెరాయా ఆ పట్టణాన్నిగూర్చి ఒక ప్రకటన చదివాడు: “యెహోవా, మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదురనియు, అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి.” శెరాయా తర్వాత ఆ గ్రంథానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నదిలోవేసి యిలా అన్నాడు: “నేను దానిమీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును.”—యిర్మీయా 51:59-64.

10 ఆ గ్రంథానికి రాయికట్టి నదిలో పడవేయడమంటే బబులోను యిక ఎన్నటికి కనబడకుండా తెరమరుగై పోతుందని రూఢియైంది. అపొస్తలుడైన యోహాను బలిష్టుడైన దూత అటువంటి క్రియనే చేస్తుండగా చూడడమనేది బబులోను విషయంలోనూ యెహోవా సంకల్పం అలాగే నెరవేరుతుందనే బలమైన అభయాన్నిస్తుంది. ప్రాచీన బబులోను పూర్తిగా నాశనం కావడమనేది, సమీప భవిష్యత్తులో అబద్ధమతానికేమి సంభవింపనైయున్నదో దానికీనాడు బలమైన రుజువునిస్తుంది.

11, 12. (ఎ) బలిష్టుడైన దూత మహాబబులోనును గూర్చి ఏమని చెబుతున్నాడు? (బి) భ్రష్ట యెరూషలేమునుగూర్చి యిర్మీయా ఎలా ప్రవచించాడు, అది మన కాలానికి దేన్ని సూచించింది?

11 ఆ బలిష్టుడైన దూత యిప్పుడు బబులోనునుద్దేశించి యిలా చెబుతున్నాడు: “నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి. కావున వైణికులయొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు, మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు, దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు.”—ప్రకటన 18:22, 23.

12 భ్రష్ట యెరూషలేమును గూర్చి యిర్మీయా అలాంటి మాటలనే ప్రవచించాడు: “సంతోషనాదమును ఉల్లాసశబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును.” (యిర్మీయా 25:10, 11) సా.శ.పూ. 607 లో యెరూషలేము పాడైన స్థితిని గూర్చి వివరంగా వర్ణించబడినట్లే, మహాబబులోను ముఖ్యభాగమైన క్రైస్తవమత సామ్రాజ్యం పాడుదిబ్బగా అవుతుంది. ఒకనాడు ఎంతో ఉల్లసించి, ప్రతిరోజు ధ్వనితో మారుమ్రోగిన క్రైస్తవమత సామ్రాజ్యం ఓడించబడి, విడువబడుతుంది.

13. ఏ ఆకస్మిక మార్పు మహాబబులోనుకు సంభవిస్తుంది, ఇది దాని “వర్తకుల”పై ఎటువంటి ప్రభావం చూపుతుంది?

13 నిజంగా, యోహానుకు దూత యిక్కడ తెల్పుతున్నట్లు, మహాబబులోను మొత్తం, శక్తివంతమైన, అంతర్జాతీయ సామ్రాజ్యపు స్థితినుండి దిగజారి ఎడారివలె నిర్జనప్రాంతంగా మారిపోతుంది. ఉన్నతస్థాయిలోనున్న మిషనరీలతోసహా, దాని “వర్తకులు,” తమ స్వప్రయోజనాల కొరకే లేక కప్పిపుచ్చుకోవడానికే మతాన్ని ఉపయోగించుకున్నారు, మరియు మతగురువులు వారితో పేరుప్రఖ్యాతులు పొందడమే ప్రయోజనకరమనుకున్నారు. అయితే ఆ వర్తకులకు యిక మహాబబులోను తోడులేదు. ఇక జనములను తన మతసంబంధమైన మాయామంత్రములచేత మోసం చేయలేదు.

భయంకరమైన రక్తాపరాధము

14. యెహోవా యిచ్చే కఠిన తీర్పుకుగల కారణమేమని బలిష్టుడైన దూత చెబుతున్నాడు, యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన అలాగే ఏమని తెల్పాడు?

14 ముగింపుగా ఆ బలిష్టుడైన దూత, మహాబబులోనుకు యెహోవా ఎందుకంత కఠినంగా తీర్పుతీరుస్తున్నాడో చెబుతున్నాడు: ఆ దూత యిలా చెబుతున్నాడు, “మరియు ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను.” (ప్రకటన 18:24) యేసు భూమ్మీద ఉన్నప్పుడు యెరూషలేములోని పెద్దలతో వారు “నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని . . . భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తము” విషయంలో అపరాధులని చెప్పాడు. ఆ ప్రకారమే, ఆ వక్రజనం సా.శ. 70 లో నాశనమైంది. (మత్తయి 23:35-38) ఈనాడు, మరో మతపరమైన తరము దేవుని సేవకులను హింసిస్తున్నందుకు రక్తాపరాధియౌతుంది.

15. నాజీ జర్మనీలోని కాథోలిక్‌ చర్చి రెండు కారణాలనుబట్టి ఎలా రక్తాపరాధియైంది?

15ది కాథోలిక్‌ చర్చి అండ్‌ నాజీ జర్మనీ, అనే తన పుస్తకంలో గెంటర్‌ లూయి యిలా రాస్తున్నాడు: “యెహోవాసాక్షులు [1933] ఏప్రిల్‌ 13న బెవేరియాలో అణచివేయబడినప్పుడు, నిషేధింపబడిన మతాన్ని యింకా అనుసరించే సభ్యులెవరైనా ఉన్నారేమో రిపోర్టు చేయవలసిందని మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిలిజియన్‌ అను శాఖ యిచ్చిన పనిని సహితం చర్చి స్వీకరించింది.” అలా కాథోలిక్‌ చర్చి, వేలాదిమంది సాక్షులు కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపులకు పంపబడినదానిలో భాగం కల్గివుంది; చంపబడిన వందలాదిమంది సాక్షుల రక్తంతో దాని చేతులు మలినమైయున్నవి. వెల్‌హెల్మ్‌ కుసెరో వంటి యౌవనస్థులు కాల్చి చంపే స్క్వాడ్‌ చేతిలో వారు ధైర్యంగా చనిపోగలరని నిరూపించినప్పుడు, యిలా మనస్సాక్షినిబట్టి ఎదిరించే వారికి కాల్చిచంపే స్క్వాడ్‌ ఎంతో మంచిదని హిట్లర్‌ తీర్మానించాడు; అందుకే వెల్‌హెల్మ్‌ సోదరుడు వోల్ఫ్‌గాంగ్‌ తన 20వ ఏట శిరచ్ఛేదనం గావించబడ్డాడు. అదే సమయంలో, కాథోలిక్‌ చర్చి జర్మన్‌ కాథోలిక్‌ యౌవనస్థులు స్వదేశంకొరకు సైన్యంలో చనిపోవాలని వారిని ప్రోత్సహిస్తున్నారు. చర్చి రక్తాపరాధం స్పష్టంగా కనబడుతోంది!

16, 17. (ఎ) మహాబబులోనుపై ఏ రక్తాపరాధం మోపాలి, నాజీ మారణహోమంలో చనిపోయిన యూదుల విషయంలో వాటికన్‌ ఎలా రక్తాపరాధియైంది? (బి) ఈ శతాబ్దంలోనే వందలాది యుద్ధాల్లో లక్షలాదిగా హతులైనవారి విషయంలో అబద్ధమతం నిందింపబడే ఒక విధానమేది?

16 అయిననూ, “భూమిమీద వధింపబడిన వారందరి రక్తము”నకు మహాబబులోనును బాధ్యురాలిగా చేయాలని ప్రవచనం తెల్పుతుంది. ఈ ఆధునిక కాలంలో అది నిశ్చయంగా వాస్తవమే. ఉదాహరణకు, జర్మనీలో హిట్లర్‌ అధికారం చేపట్టడానికి కాథోలిక్కులు పన్నిన పన్నాగం సహాయపడినప్పుడు, నాజీ ప్రభుత్వం అరవైలక్షల యూదులను అమానుషంగా ఊచకోత కోసినప్పటి భయంకర రక్తాపరాధంలో వాటికన్‌ పాలుపంచుకుంది. ఇంకనూ, యీ 20వ శతాబ్దంలోనే వందలాది యుద్ధాల్లో, పదికోట్లకంటె ఎక్కువమందే చంపబడ్డారు. అబద్ధమతం యీ విషయంలో నిందింప తగిందేనా? అవును, రెండు విధాలుగా నిందింపదగిందే.

17 ఒక కారణమేమంటే, అనేకయుద్ధాలు మత విభేదాలకు సంబంధించినవే. ఉదాహరణకు, ఇండియాలో 1946-48 సంవత్సరాల్లో హిందూ-ముస్లింలమధ్య చెలరేగిన కలహం మతసంబంధమైనదే. అప్పుడు లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌ ఇరాక్‌ మధ్య 1980వ దశాబ్దంలో జరిగిన పోరాటం మతకక్షలకు సంబంధించిందే, అందులో వేలాదిమంది హతులయ్యారు. ఉత్తర ఐర్లాండులో కాథోలిక్కులు ప్రొటెస్టెంట్ల మధ్య ప్రజ్వరిల్లిన హింస వేలాదిమందిని బలిగొన్నది. లెబానోనులో కొనసాగే దౌర్జన్యకాండ మతంపై ఆధారపడిందే. ఈ విషయంపై సర్వేచేస్తూ, రచయిత సి. యల్‌. సుల్జ్‌బెర్గర్‌ 1976 లో యిలా అన్నాడు: “ప్రపంచవ్యాప్తంగా యిప్పుడు జరుగుతున్న యుద్ధాలలో సగం లేక అంతకంటె ఎక్కువవాటిల్లో మతమే స్వయంగా జోక్యం చేసుకొని ఉండొచ్చు లేక మతకలహాలవల్ల జరుగుతుండ వచ్చుననేది తిరుగులేని వాస్తవం.” నిజానికి, మహాబబులోనుయొక్క భయంకర చరిత్రంతటిలోనూ యిదే జరుగుతూవస్తుంది.

18. ప్రపంచ మతాలు రక్తాపరాధులయ్యే రెండో విధానమేది?

18 మరి రెండో కారణమేమిటి? యెహోవా దృష్టిలో, ప్రపంచమతాలు రక్తాపరాధులే, ఎందుకంటే యెహోవా సేవకులకు ఆయనిచ్చే నియమాలను వారు తమ అనుచరులకు కచ్చితంగా బోధించలేదు. దేవుని సత్యారాధికులు యేసుక్రీస్తును అనుకరించాలని, ఏ జాతివారినైనా ఇతరులను ప్రేమించాలని వారికి కచ్చితంగా బోధించలేదు. (మీకా 4:3, 5; యోహాను 13:34, 35; అపొస్తలుల కార్యములు 10:34, 35; 1 యోహాను 3:10-12) మహాబబులోనుగా తయారైన మతాలు యీ విషయాలను ప్రజలకు ఉపదేశించనందున వాటి అనుచరులు అంతర్జాతీయ యుద్ధాల సుడిగుండం వైపు ఈడ్వబడుతున్నారు. ఈ శతాబ్దపు తొలిభాగంలో జరిగిన రెండు ప్రపంచయుద్ధాల్లో యిదెంత స్పష్టంగా కన్పడింది! ఆ రెండూ క్రైస్తవమత సామ్రాజ్యంలోనే ప్రారంభమయ్యాయి, మరి తోటిమతస్థులు ఒకరినొకరు చంపుకున్నారు. క్రైస్తవులని చెప్పుకున్న వారంతా బైబిలు సూత్రాలను పాటిస్తే, అసలా యుద్ధాలే జరిగుండేవికావు.

19. మహాబబులోను ఏ భయంకరమైన రక్తాపరాధాన్ని మోస్తుంది?

19 యెహోవా యీ రక్తాపరాధాన్నంతటిని మహాబబులోను మీద వేస్తున్నాడు. మతనాయకులు, ముఖ్యంగా క్రైస్తవమతసామ్రాజ్యం, వారి ప్రజలకు బైబిలు సత్యాలను బోధించివుంటే, అంత రక్తం చిందివుండేది కాదు. గనుక, మహావేశ్యయగు అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను, తాను హింసించి చంపిన “ప్రవక్తలయొక్కయు పరిశుద్ధులయొక్కయు రక్తము” విషయంలోనేగాక, “భూమిమీద వధింపబడిన వారందరి” విషయంలోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో యెహోవాకు నిజంగా జవాబుదారియై వుంది. మహాబబులోను భయంకరమైన రక్తాపరాధియైంది. దాని అంతిమ నాశనం వచ్చినప్పుడు అదెంత మంచి నివారణోగదా!

[అధ్యయన ప్రశ్నలు]

[270వ పేజీలోని బాక్సు]

రాజీవల్ల కలిగే ఫలితం

గెంటర్‌ లూయి ది కాథోలిక్‌ చర్చి అండ్‌ నాజీ జర్మనీ అనే తన పుస్తకంలో యిలా రాస్తున్నాడు: “జర్మన్‌ కాథోలిసిసమ్‌ మొదటినుండే నాజీపాలనను వ్యతిరేకించే నియమాన్ని పాటిస్తే, ప్రపంచ చరిత్రే మరో పంథాలో ఉండేది. ఈ పోరాటం చివరకు హిట్లర్‌ను ఓడించడంలోను, అతని అనేక దురాగతాలకు కళ్లెం వేయడంలో విఫలమైననూ, చర్చికున్న నైతిక గౌరవం ఎంతో ఉన్నతస్థాయికి పెరిగుండేది. అలా ఎదిరించే మానవ త్యాగనిరతి తిరుగులేనిరీతిగా మహాగొప్పదై యుండేది, అయితే యీ త్యాగాలన్నీ అన్నింటికన్న అత్యంత గొప్పకారణం నిమిత్తం చేయబడియుండేవి. స్వంతవారు నమ్మకస్థులు కానందువల్ల హిట్లర్‌ యుద్ధంలో దిగడానికి ధైర్యం చేసివుండేవాడు కాదు, మరి అక్షరార్థంగా లక్షలాది ప్రజల ప్రాణాలు రక్షింపబడియుండేవి. . . . హిట్లర్‌యొక్క కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో జర్మన్‌ నాజీపాలనను వ్యతిరేకించిన వేలాదిమంది చిత్రహింసకు గురై హతులైనప్పుడు, పోలిష్‌ మేధావివర్గాన్ని హతమార్చినప్పుడు, వేలాదిమంది రష్యన్‌లు బానిసలుగా [అథోస్థాయి మానవులుగా] పరిగణింపబడి చంపబడినప్పుడు, మరియు ‘ఆర్యులు కాదని’ 60,00,000 మందిని ఊచకోతకోసినప్పుడు, జర్మనీలోని కాథోలిక్‌ చర్చి అధికారులు జర్మనీలో యీ నేరాలన్నీ చేస్తూనే తమ మద్దతును విస్తరింపజేసుకుంది. రోమన్‌ కాథోలిక్‌ చర్చి సర్వోన్నత నీతి ఉపదేశకుడును ఆత్మీయ శిరస్సయిన, రోమ్‌లోని పోప్‌ మౌనముద్ర వహించాడు.”—320, 341 పుటలు.

[268వ పేజీలోని చిత్రం]

“అయ్యో, అయ్యో,” అని రాజులు అంటున్నారు

“అయ్యో, అయ్యో,” అని వర్తకులు అంటున్నారు