కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు యొక్క గొప్ప మూలాంశము

బైబిలు యొక్క గొప్ప మూలాంశము

అధ్యాయం 2

బైబిలు యొక్క గొప్ప మూలాంశము

లేఖనాల భావం చెప్పడం ప్రకటన గ్రంథంలో మరుగుచేయబడిన మర్మాలు యథార్థపరులైన బైబిలు విద్యార్థులను దీర్ఘకాలంగా కలవర పరుస్తున్నవి. దేవుని యుక్తకాలంలో అవి విప్పబడవలసియుండెను, గాని ఎలా, ఎప్పుడు, ఎవరికి? నిర్ణయకాలం ఆసన్నమైనప్పుడు దేవుని పరిశుద్ధాత్మే వాటి భావాలను చెప్పగలదు. (ప్రకటన 1:3) ఆ పరిశుద్ధ మర్మాలు లోకమందున్న ఆసక్తిగల దేవుని సేవకులకు బయలుపరచ బడతాయి, గనుక వారు ఆయన తీర్పులను ప్రకటించడంలో బలం పొందుతారు. (మత్తయి 13:10, 11 పోల్చండి.) ఈ పుస్తకంలోని వివరణలు తప్పుల్లేనివని అనడంలేదు. పూర్వమున్న యోసేపువలె మేమును యిలా అంటున్నాం: “భావములు చెప్పుట దేవుని అధీనమేగదా?” (ఆదికాండము 40:8) అయిననూ, ఇందులో యివ్వబడిన వివరణలు బైబిలంతటితో అనుగుణ్యంగా ఉన్నాయని, మన వినాశనకర కాలంలో సంభవిస్తున్న సంఘటనలలో దేవుని ప్రవచనమెంత చక్కగా నెరవేరుతున్నదో తెల్పుతుందని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము.

1. యెహోవా మహిమాన్విత సంకల్పమేమిటి?

ఒక బైబిలు ప్రవచనమిలా చెబుతోంది: “కార్యారంభముకంటె కార్యాంతము మేలు.” (ప్రసంగి 7:8) ప్రకటనలోనే మనం యెహోవా తన నామాన్ని యావత్‌సృష్టి ఎదుట మహిమపరచుకొనే అంతిమక్రియను గూర్చి చదువుతాము. దేవుడు తొలిప్రవక్తలలో ఒకరి ద్వారా పలుమారులు యిలా తెలియజేశాడు: “నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.”—యెహెజ్కేలు 25:17; 38:23.

2. ప్రకటనతోపాటు, బైబిల్లోని యితర పుస్తకాలు ఎటువంటి సంతృప్తికరమైన జ్ఞానాన్ని పొందుటకు సహాయం చేస్తాయి?

2 ప్రకటన అన్నింటి విజయవంతమైన అంతాన్ని గూర్చి తెల్పినట్లే, వాటి ఆరంభాన్ని గూర్చి బైబిలు నందలి మొదటి పుస్తకాలు మనకు తెల్పుతున్నాయి. ఈ వృత్తాంతాన్ని పరిశీలించుట ద్వారా అందులో యిమిడియున్న అంశాలను అర్థంచేసికోగలం, దేవుని సంకల్పాలేమిటో ఒక అవగాహనకు రాగలం. ఇదెంత తృప్తికరమో గదా! అంతేకాదు మానవజాతి ఎదురు చూస్తున్న మహిమాన్విత భవిష్యత్‌లో మనం భాగం వహించేలా అది మనల్ని పురికొల్పాలి. (కీర్తన 145:16, 20) మానవజాతి యిప్పుడెదుర్కొనే ప్రాముఖ్యమైన సమస్యను, దాన్ని పరిష్కరించడానికి దేవుడు స్పష్టంగా తెలియజేసిన సంకల్పాన్ని గూర్చి మనం జ్ఞాపకముంచుకొనేలా, బైబిలు యొక్క మూలాంశాన్ని, వెనుకటి చరిత్రను గూర్చి చర్చించడం ఈ సందర్భంలో యుక్తమనిపిస్తుంది.

3. ఆదికాండములో, ప్రకటనతోసహా బైబిలంతటికి సంబంధించిన మూలాంశం ఏ ప్రవచనమందున్నది?

3 బైబిలు మొదటి పుస్తకమగు ఆదికాండము “ఆదియందు” అని చెబుతూ, తన భూలోక సృష్టికే కిరీటమైన మానవునితోసహా దేవుని సృష్టికార్యాలను గూర్చి వివరిస్తుంది. ఆదికాండము, 6,000 సంవత్సరాల క్రితం ఏదెను తోటలో దేవుడే స్వయంగా చెప్పిన ప్రవచనాన్ని కూడ తెలుపుతోంది. తొలి స్త్రీయైన హవ్వను మోసగించడానికి అప్పుడే ఒక సర్పం ఉపయోగించబడింది. పిదప ఆమె తనతోపాటు తన భర్త ఆదాము, “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను” తిని యెహోవా ఆజ్ఞ అతిక్రమించేలా ఆయన్ని నమ్మించింది. పాపులైన ఆ దంపతులకు తీర్పుతీర్చుతూ దేవుడు సర్పంతో యిలా అన్నాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” (ఆదికాండము 1:1; 2:17; 3:1-6, 14, 15) ఆ ప్రవచనం ప్రకటనతోపాటు బైబిలంతటికి మూలాంశాన్ని అందిస్తుంది.

4. (ఎ) దేవుడు మొదటి ప్రవచనాన్ని పలికిన తర్వాత, మన ఆది తల్లిదండ్రులకేమైంది? (బి) మొదటి ప్రవచనాన్ని గూర్చి ఏ ప్రశ్నలొస్తాయి, మరి మనమెందుకు సమాధానాలు తెలుసుకోవలసిన అవసరముంది?

4 ఆ ప్రవచనాన్ని పలికిన వెంటనే దేవుడు మన ఆది దంపతులను ఏదెను నుండి వెళ్లగొట్టాడు. వారిక పరదైసులో నిత్యజీవ నిరీక్షణను పొందలేకపోయారు; దానికి వెలుపల సిద్ధపరచని భూమిలో వారిక తమ జీవితాలను వెళ్లబుచ్చవలసి వచ్చింది. మరణదండన క్రింద వారు పాపభరిత సంతానాన్ని కనవలసి వచ్చింది. (ఆదికాండము 3:23-4:1; రోమీయులు 5:12) అయితే, ఏదెనులోని ప్రవచన భావమేమిటి? అందులో ఎవరెవరున్నారు? దానికి ప్రకటనకు సంబంధమేమిటి? ఈనాడు మనకది ఏ సమాచారాన్ని కల్గివుంది? యెహోవా ఆ ప్రవచనాన్ని పలుకుటకు నడిపిన దుఃఖకర సంఘటన నుండి వ్యక్తిగత ఉపశమనాన్ని పొందడానికి మనమీ ప్రశ్నలకు సమాధానాలను తెలిసికొనుట అగత్యము.

ఆ నాటకంలోని సూత్రధారులు

5. సర్పం హవ్వను మోసగించినప్పుడు, దేవుని సర్వాధిపత్యానికి, ఆయన నామానికి ఏమైంది, ఆ వివాదమెలా పరిష్కరింపబడనైవుంది?

5ఆదికాండము 3:15 నందలి ప్రవచనం, హవ్వ తన అవిధేయతనుబట్టి చావకుండ, ఒక దేవతవలె అవుతుందని ఆమెతో అబద్ధం చెప్పిన సర్పాన్నుద్దేశించి చెప్పబడింది. ఆ విధంగా సాతాను యెహోవా అబద్ధికుడనియు, ఆయన సర్వాధిపత్యాన్ని తిరస్కరించడంద్వారా మానవులు ఎంతో సాధించగలరని తప్పుడు అభిప్రాయాన్ని కల్గించాడు. (ఆదికాండము 3:1-5) యెహోవా సర్వాధిపత్యం సవాలు చేయబడి ఆయన నామం అపవిత్రం చేయబడింది. నీతిగల న్యాయాధిపతియగు యెహోవా తన కుమారుని రాజ్యపాలనను ఎలా ఉపయోగించుకుని తన సర్వాధిపత్యాన్ని రుజువుచేసుకుంటాడో, తన నామానికి కల్గిన సమస్త నిందను ఎలా తీసివేస్తాడో ప్రకటన గ్రంథం వివరిస్తుంది.—ప్రకటన 12:10; 14:7.

6. సర్పంద్వారా హవ్వతో మాట్లాడిన వ్యక్తినెలా ప్రకటన గుర్తిస్తుంది?

6 మరి “సర్పము” అనే ఆ పదం అక్షరార్థంగా సర్పానికే వర్తిస్తుందా? కానేకాదు! ఆ సర్పంద్వారా మాట్లాడిన దుష్ట ఆత్మీయప్రాణి ఎవరో మనం గుర్తించుటకు ప్రకటన సహాయం చేస్తుంది. “సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆ మహా ఘటసర్పము,” “తన కుయుక్తిచేత హవ్వను మోసపరచెను.”—ప్రకటన 12:9; 2 కొరింథీయులు 11:3.

7. ఆదికాండము 3:15 నందలి స్త్రీ ఆత్మీయలోకానికి సంబంధించిందని ఏది సూచిస్తుంది?

7ఆదికాండము 3:15 ఆ తర్వాత “స్త్రీని” గూర్చి మాట్లాడింది. అది హవ్వనా? ఆమె అలా అనుకొని యుండొచ్చు. (ఆదికాండము 4:1 పోల్చండి.) ఆమె 5,000 సంవత్సరాల క్రితం చనిపోయినప్పుడు హవ్వకు సాతానుకు మధ్యనున్న శాశ్వతకాల వైరం అసాధ్యమైంది. అంతేకాదు, యెహోవా సంబోధించిన సాతాను అదృశ్యప్రాణి గనుక, ఆ స్త్రీకూడ ఆత్మీయలోకానికి చెందినదేనని మనమనుకోవచ్చు. ఈ సాదృశ్యమైన స్త్రీ యెహోవా పరలోక ఆత్మీయప్రాణులకు సంబంధించినదని తెల్పుతూ, ప్రకటన 12:1, 2 యీ విషయాన్ని రూఢిచేస్తుంది.—యెషయా 54:1, 5, 13 కూడ చూడండి.

వైరమున్న రెండు సంతానములు

8. రెండు సంతానాలనుగూర్చి ఇప్పుడు చెప్పబడే విషయాన్నిగూర్చి తెలుసుకొనుటకు మనమెందుకు ఎక్కువ శ్రద్ధను కల్గివుండాలి?

8 తదుపరి ఆదికాండము 3:15 లో రెండు సంతానాలు కనబడతాయి. వీటియందు మనమెంతో శ్రద్ధను చూపాలి, ఎందుకంటే భూమిపై సర్వాధిపత్య మెవరిదనే గొప్ప వివాదాంశంతో అవి సంబంధాన్ని కల్గివున్నాయి. మనం పిన్నలమైనా, పెద్దలమైనా ఇందులో మనకు సంబంధముంది. ఈ సంతానములలో దేనిని మీరు ఇష్టపడతారు?

9. సర్పసంతానంలో నిశ్చయంగా ఏమి చేరివుంది?

9 మొదట, సర్పసంతానం లేదా పిల్లలున్నారు. వీరెవరు? వీరెవరంటే, సాతానుతోపాటు తిరుగుబాటుచేసి, చివరకు భూపరిధికి ‘అతనితో కూడ పడద్రోయబడిన’ ఇతర ఆత్మీయ ప్రాణులు నిశ్చయంగా వారిలో ఉన్నారు. (ప్రకటన 12:9) ఆ సాతాను లేక బయల్జెబూలు, “దయ్యముల అధిపతి” గనుక అందులో అతని అదృశ్య సంస్థ మిళితమై ఉందనుట స్పష్టమే.—మార్కు 3:22; ఎఫెసీయులు 6:12.

10. సాతాను యితర సంతానాన్ని బైబిలెలా గుర్తిస్తుంది?

10 ఇంకను, యేసు తన కాలంనాటి యూదా మతనాయకులతో ఇలా అన్నాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు.” (యోహాను 8:44) దేవుని కుమారుడైన యేసును వ్యతిరేకించుట ద్వారా ఆ మతనాయకులు తాము కూడ సాతాను సంతానమని రుజువు చేసుకున్నారు. వారు సాతాను సంతానమైయుండి అతన్ని తమ సాదృశ్యమైన తండ్రిగా సేవిస్తున్నారు. మానవ చరిత్రయంతటిలోను అనేకమంది మానవులు సాతాను చిత్తాన్ని చేయడంద్వారా, ముఖ్యంగా యేసు శిష్యులను హింసిస్తూ, వ్యతిరేకించడం ద్వారా తామును ఆ సంతానమేనని కనపర్చుకున్నారు. ఒక గుంపుగా, ఈ మానవులంతా కలిసి సాతాను భూసంస్థగా వర్ణించబడవచ్చును.—యోహాను 15:20; 16:33; 17:15 చూడండి.

స్త్రీ సంతానం గుర్తించబడింది

11. గడచిన శతాబ్దాల్లో, స్త్రీ సంతానాన్ని గూర్చి దేవుడేమి బయల్పరచాడు?

11ఆదికాండము 3:15 లోని ప్రవచనం చివరగా స్త్రీ సంతానాన్ని గూర్చి తెలుపుతుంది. సాతాను తన సంతానాన్ని తయారు చేసుకుంటూవుండగా, దేవుడు సంతానాన్ని తయారు చేయడానికి తన “స్త్రీ”ని లేక భార్యవంటి పరలోక సంస్థను సిద్ధం చేస్తూవుండెను. గత 4,000 సంవత్సరాలుగా యెహోవా, విధేయులైన దైవభయంగల మానవులకు రాబోవు సంతానాన్ని గూర్చి క్రమేపి బయలుపర్చుతూ వస్తున్నాడు. (యెషయా 46:9, 10) అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మరితరులు వాగ్దానం చేయబడిన సంతానం వారి వంశాల నుండి వస్తుందని విశ్వాసముంచ గలిగారు. (ఆదికాండము 22:15-18; 26:4; 28:14) సాతాను అతని అనుచరులు, అచంచల విశ్వాసంకల్గియున్న అటువంటి యెహోవా సేవకులను తరచూ హింసించారు.—హెబ్రీయులు 11:1, 2, 32-38.

12. (ఎ) స్త్రీ సంతానంలోని ప్రథముడు ఎలా, ఏ సంఘటనతో వచ్చాడు? (బి) యేసు దేనికొరకు అభిషేకించబడ్డాడు?

12 చివరకు, మన సామాన్య శకంలో 29వ సంవత్సరంలో పరిపూర్ణ మానవుడైన యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. యెహోవా అక్కడ యేసును పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపజేసి ఇలా అన్నాడు: “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను.” (మత్తయి 3:17) యేసు అక్కడ తాను పరలోకమందున్న ఆత్మీయ సంస్థనుండి పంపబడ్డాడని గుర్తింపబడ్డాడు. ఆయన యెహోవా నామమున భూమిమీద రాజ్యాన్ని పునరుద్ధరించే పరలోక రాజ్యానికి నియమిత రాజుగా కూడ అభిషేకించబడ్డాడు, అలా ప్రభుత్వం లేదా సర్వాధిపత్యం అనే వివాదాంశాన్ని శాశ్వతంగా ఆయన పరిష్కరించనై యుండెను. (ప్రకటన 11:15) యేసు, ఆ స్త్రీ సంతానంలో ప్రథముడు, ప్రవచించబడిన మెస్సీయ.—గలతీయులు 3: 16; దానియేలు 9:25 పోల్చండి.

13, 14. (ఎ) స్త్రీ సంతానమంటే ఒక ప్రముఖవ్యక్తే కాదని తెలిసికొనుటలో మనమెందు కాశ్చర్యపడకూడదు? (బి) సంతానంలో రెండవ భాగమయ్యేందుకు మానవులలోనుండి ఎంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు, వారెటువంటి సంస్థగా తయారౌతారు? (సి) ఆ సంతానంతో కలిసి ఐక్యంగా సేవ చేసేదెవరు?

13 మరి స్త్రీ సంతానమంటే ఒకే ప్రాముఖ్యమైన వ్యక్తియై ఉంటాడా? మరి సాతాను సంతానం విషయమేమిటి? సాతాను సంతానంలో దుష్టదూతల సమూహం, దేవుని ఘనపర్చని మానవులు చేరివుంటారని బైబిలు తెల్పుతుంది. అందుచేత, మెస్సీయ సంతానమైన యేసుక్రీస్తుతోపాటు పాలించే యాజకులైన సహ పరిపాలకులగుటకు యథార్థపరులైన 1,44,000 మందిని మానవజాతి నుండి ఎన్నుకొనుట దేవుని సంకల్పమని తెలుసుకొనుట మనల్ని ఆశ్చర్యపరచకూడదు. ప్రకటన వీరిని గూర్చి తెలుపుతూ, సాతాను, దేవుని స్త్రీవంటి సంస్థయెడల ద్వేషంతో, “ఆమె సంతానములో శేషించినవారితో యుద్ధము చేయుటకై బయలు వెడలెను” అని ప్రకటన చెబుతోంది.—ప్రకటన. 12: 17; 14:1-4.

14 బైబిల్లో, అభిషక్త క్రైస్తవులు యేసు సహోదరులని పిలువ బడుతున్నారు, మరి ఆయన సహోదరులుగా వారు ఒకే తండ్రిని తల్లిని కలిగివుంటారు. (హెబ్రీయులు 2:11) వారి తండ్రి యెహోవా దేవుడు. కాబట్టి, వారి తల్లి ఆ “స్త్రీ” అంటే దేవుని భార్యవంటి పరలోక సంస్థే. వారు ఆ సంతానంలో రెండవ భాగం, క్రీస్తు ప్రథమ భాగం. భూమ్మీదనున్న యీ ఆత్మాభిషక్తులైన క్రైస్తవసంఘం, పరలోకమందున్న స్త్రీవంటి సంస్థ క్రింద సేవచేసే దేవుని దృశ్యమైన సంస్థయై, వారు వారి పునరుత్థానమప్పుడు క్రీస్తుతో ఏకమౌతారు. (రోమీయులు 8:14-17; గలతీయులు 3:16, 29) ఆ సంతానంలో భాగం కాకపోయినా, భూమిమీద దేవుని సంస్థతోపాటు సేవచేయడానికి సమస్త జనాంగముల నుండి లక్షలాదిమంది ఏకమౌతున్నారు. మీరును యీ వేరేగొర్రెల్లో ఒకరైయున్నారా? అలాగైతే మీ సంతోషకరమైన నిరీక్షణ పరదైసు భూమిలో నిత్యజీవమే.—యోహాను 10:16; 17:1-3.

వైరమెలా పెరిగింది

15. (ఎ) సాతాను యొక్క మానవుల, దూతల సంతానాన్నిగూర్చి వివరించండి? (బి) నోవహు జలప్రళయంలో సాతాను సంతానానికేమైంది?

15 సాతాను యొక్క మానవసంతానం, మానవ చరిత్రారంభంలోనే కనబడడాని కారంభించింది. ఉదాహరణకు, కయీను అనే తొలి మానవ కుమారుడు, “దుష్టుని సంబంధియై తన సహోదరుని” అంటే హేబెలును చంపాడు. (1 యోహాను 3:12) తర్వాత హనోకు, యెహోవా “అందరికిని తీర్పుతీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు, వారిని ఒప్పించుటకును, ప్రభువు (యెహోవా, NW.) తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును,” అని చెప్పాడు. (యూదా 14, 15) అంతేగాక, తిరుగుబాటుచేసిన దేవదూతలు సాతానుతోచేరి అతని సంతానమయ్యారు. వారు శరీరానుసారులై, మనుష్య కుమార్తెలను వివాహమాడుటకై పరలోకమందున్న “తమ నివాసస్థలములను విడిచిరి.” వారు స్థూలకాయులైన మానవాతీత సంకరజాతి సంతానాన్ని తయారు చేశారు. ఆ నాటి లోకం దుష్టత్వంతోను దుర్మార్గంతోను నిండిపోయింది, గనుకనే దేవుడు దాన్ని జలప్రళయంలో నాశనంచేశాడు, ఒక్క నోవహు అతని కుటుంబం మాత్రమే తప్పించుకున్నారు. అవిధేయులైన దూతలు—ఇప్పుడు సాతాను అధీనమందున్న దయ్యాలు—నాశనం కానైయున్న మానవ భార్యలను, సంకరజాతి సంతానాన్ని విడిచిపెట్టి పోవలసివచ్చింది. వారు మరల ఆత్మీయ శరీరాలుదాల్చుకొని, ఆత్మీయ లోకానికెళ్లారు, అక్కడ వారు సాతానుకు అతని సంతానానికి త్వరలో జరుగనైయున్న దేవుని తీర్పుకొరకు వేచియున్నారు.—యూదా 6; ఆదికాండము 6:4-12; 7:21-23; 2 పేతురు 2:4, 5.

16. (ఎ) జలప్రళయానంతరం ఎటువంటి క్రూరుడు రంగప్రవేశం చేశాడు, తాను సాతాను సంతానంలో ఒక భాగమని ఎలా కనబరచుకున్నాడు? (బి) బబులోను గోపురాన్ని నిర్మించేవారినెలా దేవుడు భగ్నంచేశాడు?

16 ఆ మహాజలప్రళయం తర్వాత, క్రూరుడైన నిమ్రోదు లోకంలోకి వచ్చాడు. బైబిలు అతన్ని “పరాక్రమముగల వేటగాడు” అని వర్ణిస్తుంది—నిజంగా సాతాను సంతానంలో ఒక భాగమే. సాతాను మాదిరే అతడు తిరుగుబాటు స్వభావాన్నిచూపి, భూమియంతా మానవులతో నింపబడాలనే యెహోవా సంకల్పాన్ని ధిక్కరించి బబులోను లేక బాబెలు గోపురాన్ని కట్టాడు. “ఆకాశమునంటు శిఖరముగల” ఆ మహాగోపురం బబులోను తలమానికము కానైయుండెను. ఆ గోపురాన్ని నిర్మించే వారిని దేవుడు చెదరగొట్టాడు. ఆయన వారి భాషలను తారుమారుచేసి, “భూమియందంతట వారిని చెదరగొట్టెను,” గాని బాబెలును అలానే ఉండనిచ్చాడు.—ఆదికాండము 9:1; 10:8-12; 11:1-9.

రాజకీయ శక్తులు ఆవిర్భవించుట

17. మానవులు విస్తరించ నారంభించినప్పుడు మానవ సమాజంలో అవినీతికరమైనది ఏది బయలుదేరింది, తత్ఫలితంగా ఏ గొప్ప సామ్రాజ్యం ఆవిర్భవించింది?

17 బబులోనులో యెహోవా సర్వాధిపత్యానికి విరుద్ధంగా లేచిన మానవ సమాజపు లక్షణాలు కనబడ్డాయి. వీటిలో ఒకటి రాజకీయం. మానవజాతి విస్తరించేకొలది, దురాశపరులైన మానవులు అధికారాన్ని హస్తగతం చేసికొనుటలో నిమ్రోదు ననుసరించారు. నరుడు తనకు హానిచేసి కొనుటకే నరునిపై అధికారం చెలాయించ సాగాడు. (ప్రసంగి 8:9) ఉదాహరణకు, అబ్రాహాము కాలంలో సొదొమ, గొమొర్రా, వాటికి సమీపానగల పట్టణాలు షీనారు మరియు సుదూర దేశాల స్వాధీనంలోనికి వచ్చాయి. (ఆదికాండము 14:1-4) చివరికి, మిలటరీ, సంస్థాగత అధికారాలు తమ స్వంత ఐశ్వర్య ఆడంబరాలకు గొప్ప సామ్రాజ్యాలనే స్థాపించుకున్నాయి. ఐగుప్తు, అస్సీరియా, బబులోను, మాదీయులు-పారశీకులు, గ్రీసు మరియు రోము వంటి కొన్నింటిని బైబిలు పేర్కొంటుంది.

18. (ఎ) పరిపాలకుల ఎడల దేవుని ప్రజలెటువంటి దృక్పథం కల్గివుంటారు? (బి) పరిపాలనాధికారులు ఎలా కొన్నిసార్లు దేవుని పనులు చేశారు? (సి) అనేకమంది పాలకులెలా తాము సర్పసంతానంలో భాగమని తామే కనబరచుకున్నారు?

18 యెహోవా ఆ రాజకీయ శక్తులను ఉండేలా అనుమతించాడు, అటువంటి ప్రభుత్వాలు అధికారంలోనున్న దేశాల్లో జీవించే ఆయన ప్రజలు వాటికి మితంగానే విధేయత కనబరచారు. (రోమీయులు 13:1, 2) కొన్నిసార్లు, రాజకీయ అధికారులే దేవుని సంకల్పం వృద్ధిచెందేలాగున సహాయపడ్డారు, లేక ఆయన ప్రజలకు అండగా నిలిచారు. (ఎజ్రా 1:1-4; 7:12-26; అపొస్తలుల కార్యములు 25:11, 12; ప్రకటన 12:15, 16) అయిననూ, అనేక రాజకీయ పరిపాలకులు, సత్యారాధనను తీవ్రంగా వ్యతిరేకించారు, అలా తాము సాతాను సంతానంలో ఒక భాగమని స్వయంగా కనబరచుకున్నారు.—1 యోహాను 5:19.

19. ప్రపంచాధిపత్యాలు ప్రకటన గ్రంథంలో ఎలా వర్ణించబడ్డాయి?

19 మానవ పరిపాలన మానవ సమస్యలు తీర్చడంలో, లేదా సంతోషం తేవడంలో చాలావరకు విఫలమయ్యింది. ప్రతిపరిపాలనను ప్రయత్నించి చూచుకొనుటకు యెహోవా మానవులను అనుమతించాడు, అయితే ఆయన అవినీతినిగాని, ప్రభుత్వాలు ప్రజలను పాలించిన పద్ధతినిగాని సమ్మతించడు. (సామెతలు 22:22, 23) ఈ దుష్ట ప్రపంచాధిపత్యాలను అహంపూరిత, భయంకరమైన క్రూరమృగమని బైబిలు వర్ణిస్తుంది.—ప్రకటన 13:1, 2.

స్వార్థపూరిత వ్యాపారస్థులు

20, 21. సాతాను దుష్టసంతానానికి సంబంధించిన వారిగా “బలిష్ఠుల” “సహస్రాధిపతుల,” జాబితాలో ఏ రెండవ గుంపును చేర్చాలి, ఎందుకు?

20 రాజకీయ నాయకులకు దగ్గరి సంబంధమున్నవారిలో వాణిజ్యసరుకుల అక్రమ వ్యాపారస్థులున్నారు. పురాతన బబులోనులో త్రవ్విన శిథిలాల్లో లభించిన రికార్డులనుబట్టి చూస్తే, ఆనాడు తోటిమానవుని దురవస్థలను ఆసరాగా తీసుకొని మోసపూరిత వ్యాపారం జోరుగా సాగినట్లు వెల్లడౌతోంది. ప్రపంచంలోని వాణిజ్యవేత్తలు ఈనాటివరకు యింకా వారి స్వార్థంకొరకే పనిచేస్తున్నారు, అనేక దేశాల్లో కొద్దిమందే అధిక ధనసంపన్నులైతే, అత్యధికులు మాత్రం నిరుపేదలుగానే ఉన్నారు. ఈ ఇరవయ్యో శతాబ్దపు పారిశ్రామిక యుగంలో, యిప్పుడు మానవజాతినే సమూలంగా నాశనం చేయగల అణ్వస్త్రాలతోసహా, వినాశనకర యుద్ధోపకరణాలను రాజకీయశక్తులకు సరఫరా చేయడంద్వారా వాణిజ్యవేత్తలు, ఉత్పత్తిదారులు అపార లాభాలు గడిస్తున్నారు. అటువంటి దురాశపరులైన వాణిజ్యవేత్తలను, ఆ కోవకుచెందిన వారిని సాతాను దుష్టసంతానమైన “సహస్రాధిపతులు,” “బలిష్ఠులు” అనువారి లెక్కలోవేయాలి. వారంతా నాశనానికి అర్హులని దేవుడు, క్రీస్తు తీర్పుతీర్చబోయే భూసంస్థలోని భాగమే.—ప్రకటన 19:18.

21 అవినీతికరమైన రాజకీయాలకు, దురాశతోనిండిన వాణిజ్య విధానానికి తోడు దేవుని తీర్పుకు అర్హమైన మానవ సమాజంలోని మూడవదాన్ని చేర్చాలి. ఏమిటది? ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన దీన్నిగూర్చి ప్రకటన చెప్పేవిషయం విని మీరాశ్చర్యపోవచ్చును.

మహాబబులోను

22. ప్రాచీన బబులోనులో ఎటువంటి మతం వృద్ధిచెందింది?

22 ఆనాటి బబులోనును నిర్మించడంలో రాజకీయ దృక్పథంకన్నా వేరొకటి ఉండెను. ఆ నగరం యెహోవా సర్వాధిపత్యానికి విరుద్ధంగా నిర్మించబడినందున, అందులో మతం ఇమిడి ఉంది. నిజానికి, పురాతన బబులోను మతసంబంధమైన విగ్రహారాధనకు ఊటగా తయారయ్యింది. దాని గురువులు, మరణానంతరం మానవాత్మ జీవిస్తుందని, ఆ పిదప దయ్యాల ఆధ్వర్యంలో నిత్యమూ బాధ భయము ఉండే స్థలముంటుందని బోధించారు. వారు చరాచరజీవులను, దేవతలను, దేవుళ్లను పూజించాలన్నారు. వారు భూమి, అందులోని మానవుని పుట్టుపూర్వోత్తరాలను గూర్చి కట్టుకథలల్లారు, సంతానోత్పత్తి, ధాన్యోత్పత్తి, యుద్ధంలో విజయం సాధించడం కొరకన్నట్లు వారు హీనమైన ఆచారాలు చేసి, బలులర్పించారు.

23. (ఎ) బబులోనునుండి చెదరిపోతూ ప్రజలు వారివెంట దేనిని తీసుకెళ్లారు, దాని ఫలితమేమైంది? (బి) ప్రపంచవ్యాప్తంగానున్న అబద్ధమతాన్ని ప్రకటన ఏ పేరుతో పిలుస్తోంది? (సి) అబద్ధమతం ఎల్లప్పుడూ దేనితో పోరాడుతూ వచ్చింది?

23 బబులోనునుండి వివిధ భాషలవారు భూమియంతట చెదరిపోతూ, వారివెంట బబులోను మతాన్ని తీసుకెళ్లారు. అలా ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, తూర్పుదేశాల్లోను దక్షిణసముద్ర ప్రాంతాల్లోని తొలి నివాసులలోను పురాతన బబులోను నందున్నటువంటి ఆచారాలు, మతనమ్మకాలు బహుళ వ్యాప్తిచెందాయి, యీ నమ్మకాలలో కొన్ని యిప్పటికీ ఉన్నాయి. గనుక, ప్రకటన గ్రంథం ప్రపంచ వ్యాప్తంగానున్న అబద్ధమతాన్ని మహాబబులోను అనే పేరుగల పట్టణమని యుక్తంగానే పిలుస్తోంది. (ప్రకటన 17, 18 అధ్యాయాలు) అబద్ధమతం నాటబడిన ప్రతిచోట అది క్రూరమైన యాజక ధర్మాలను, మూఢనమ్మకాన్ని, బుద్ధిహీనతను, అవినీతిని మొలకెత్తించింది. అది సాతాను చేతిలో శక్తివంతమైన ఆయుధమైంది. మహాబబులోను ఎప్పుడూ సర్వోన్నతుడగు ప్రభువైన యెహోవా సత్యారాధనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతూనే వచ్చింది.

24. (ఎ) సాతాను ఎలా స్త్రీ సంతానం “మడిమెను” కాటువేయగల్గెను? (బి) స్త్రీ సంతానానికి తగిలినది మడిమెమీద గాయం మాత్రమేనని ఎందుకు చెప్పవచ్చు?

24 మొదటి శతాబ్దపు యూదామతంలోని శాస్త్రులు పరిసయ్యులు, సాతాను సంతానంలో అత్యధిక నిందిత భాగంగా ఆ స్త్రీ సంతానంలోని ప్రథమ ప్రతినిధిని హింసించి, చివరికి హత్యచేయడానికి నాయకత్వం వహించారు. అలా, సర్పం “అతని [“సంతానం”] మడిమెమీద కొట్ట” గల్గింది. (ఆదికాండము 3:15; యోహాను 8:39-44; అపొస్తలుల కార్యములు 3:12, 15) ఎందుకు అది మడిమెమీద వేయబడిన కాటు అని మాత్రమే వర్ణించబడింది? ఎందుకంటే, భూమ్మీద ఆయనకు వేయబడిన ఆ కాటు తాత్కాలికమైనదే. అది శాశ్వతంగాలేదు ఎందుకంటే యెహోవా యేసును మూడవ దినమున పునరుత్థానుని చేసి ఆయనను ఆత్మీయప్రాణిగా హెచ్చించాడు.—అపొస్తలుల కార్యములు 2:32, 33; 1 పేతురు 3:18.

25. (ఎ) మహిమనొందిన యేసు ఎలా సాతాను, అతని దూతలపై ఇప్పటికే చర్యగైకొన్నాడు? (బి) సాతాను భూలోకసంతానాన్ని ఎప్పుడు తీసివేయడం జరుగుతుంది? (సి) దేవుని స్త్రీ సంతానం, సర్పం అనగా సాతాను “తలను” చితకకొట్టడమంటే అర్థమేమిటి?

25 మహిమనొందిన యేసుక్రీస్తు, దేవుని కుడి పార్శ్వమున ఉంటూ యెహోవా శత్రువులకు తీర్పుతీర్చుచున్నాడు. ఆయన యిప్పటికే సాతాన్ని, అతని దూతలను క్రిందకు పడవేసి భూమికి పరిమితం చేస్తూ వారిపై చర్యగైకొన్నాడు—అందువల్లనే ఈ 20వ శతాబ్దంలో శ్రమలు అధికమౌతున్నాయి. (ప్రకటన 12:9, 12) అయితే దేవుడు మహాబబులోను మీదను భూమిమీదనున్న సాతానుకు సంబంధించిన యితర శాఖల మీదను తీర్పుతీర్చినప్పుడు, ప్రవచింపబడినట్లుగా సాతాను భూసంబంధిత సంతానం తీసివేయబడుతుంది. చివరకు, దేవుని స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు, ఆ జిత్తులమారి ముసలి సర్పమైన సాతాను “తలను” చితకగొడతాడు, అంటే యిక మానవ కార్యాలలో పూర్తిగా తలదూర్చడని, అతడు సమూలంగా నాశనమౌతాడని దాని అర్థము.—రోమీయులు 16:20.

26. ప్రకటన గ్రంథంలోని ప్రవచనాన్ని మనం పరిశీలించుట ఎందుకు అత్యంత ప్రాముఖ్యము?

26 ఇదంతా ఎలా జరుగుతుంది? అదే మనకు ప్రకటన గ్రంథంలో బయలు పరచబడింది. అవి మనకు సూచనలు, గుర్తులద్వారా ఉన్నతపరచబడి, దర్శనముల పరంపరలుగా బయలుపర్చబడ్డాయి. ఆశతో మనం ఈ శక్తివంతమైన ప్రవచనాన్ని పరిశీలిద్దాం. మనం ప్రకటనలోని మాటలను విని గైకొన్నట్లయితే మనం ధన్యులమే! అలాచేస్తూ, మనం సర్వాధిపతియు, ప్రభువునగు యెహోవా నామానికి మహిమను తెచ్చుటలో పాలుపంచుకొని, ఆయన నిత్యాశీర్వాదాలను అనుభవిస్తాము. దయచేసి మీరు చదవండి, నేర్చుకున్నవాటిని జ్ఞానయుక్తంగా పాటించండి. మానవ చరిత్రలోనే అంతిమదశకు చేరిన ఈ తరుణంలో అది మీ రక్షణకు దోహదపడగలదు.

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని బాక్సు/చిత్రం]

పురాతనకాల వ్యాపార లావాదేవీల శరాకారలిపి

ది బుక్‌ ఏన్షెంట్‌ నియర్‌ ఈస్ట్రన్‌ టెక్ట్స్‌, జేమ్స్‌ బి. ప్రిచర్డ్‌, సంపాదకీయం వ్రాసిన యీ పుస్తకంలో, బబులోను కాలంలో హమ్మురబి సంకలనం చేసిన దాదాపు 300 చట్టాలను పొందుపర్చాడు. ఇవి చూపేదేమంటే, ఆ కాలంలో వాణిజ్యరంగంలో విస్తరించిన అవినీతిని అరికట్టవలసిన అవసరమేర్పడింది. ఒక ఉదాహరణ తీసుకుంటే: “ఒక దొర ఏదైనా కొంటే లేక తన కుమారుడు లేదా దాసుని ద్వారా వెండినేగాని బంగారాన్నేగాని దాసుని లేక దాసురాలిని, ఎద్దును, గొర్రెను, గాడిదను, లేక అటువంటి దేనినైనా ఏ సాక్షులు లేకుండానే స్వీకరించి ఒప్పందం చేసుకుంటే, ఆ దొర దొంగ అవుతున్నందువల్ల అతనికి మరణశిక్ష విధించాలి.”