కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మహాబబులోనును నాశనము చేయుట

మహాబబులోనును నాశనము చేయుట

అధ్యాయం 35

మహాబబులోనును నాశనము చేయుట

1. దూత ఎఱ్ఱని క్రూరమృగాన్నిగూర్చి ఏమని చెప్పాడు, ప్రకటనలోని సూచనార్థక భావాలను గ్రహించడానికి ఏ జ్ఞానం కావాలి?

ప్రకటన 17:3 లోని ఎఱ్ఱని క్రూరమృగాన్ని గూర్చి యింకనూ వర్ణిస్తూ దూత యోహానుకు యిలా చెబుతున్నాడు: “ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ యేడు తలలు ఆ స్త్రీ కూర్చున్న యేడుకొండలు; మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను.” (ప్రకటన 17:9, 10) దూత యిక్కడ ప్రకటనలోని సూచనలను గ్రహించగలిగే ఏకైక జ్ఞానము అంటే పరలోక జ్ఞానాన్నిగూర్చి తెల్పుతున్నాడు. (యాకోబు 3:17) యోహాను తరగతి దాని సహచరులు మనం జీవించే కాలంయొక్క ప్రాముఖ్యతను గుర్తెరగడానికి ఈ జ్ఞానం సహాయం చేస్తుంది. ఇప్పుడు జరగనైయున్న యెహోవా తీర్పుల విషయంలో భక్తిగల హృదయాల్లో అభినందనను వృద్ధిచేస్తుంది, యెహోవా యెడల సరైన భయాన్ని నాటుతుంది. సామెతలు 9:10 యిలా చెబుతోంది: “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.” దేవుని జ్ఞానం క్రూరమృగాన్ని గూర్చి మనకే విషయాన్ని బయల్పరుస్తుంది?

2. ఎఱ్ఱని క్రూరమృగపు ఏడుతలల భావమేమి, మరియు ఎలా “అయిదుగురు కూలిపోయిరి ఒకడున్నాడు”?

2 ఆ భయంకరమైన క్రూరమృగమునకున్న ఏడు తలలు ఏడు “కొండలను” లేక ఏడుగురు “రాజులను” సూచిస్తున్నాయి. ఈ రెండు పదాలు లేఖనానుసారంగా ప్రభుత్వాధికారాలను సూచించడానికి ఉపయోగించ బడ్డాయి. (యిర్మీయా 51:24, 25; దానియేలు 2:34, 35, 44, 45) బైబిల్లో, ఆరు ప్రభుత్వాలు దేవునిప్రజల కార్యకలాపాలపై ప్రభావం కల్గియున్నట్లు చెప్పబడింది: అవేవనగా, ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదీయ- పారసీక, గ్రీసు, మరియు రోము. యోహాను ఆ దర్శనాన్ని పొందే సమయానికి వీటిలో ఐదు గతించిపోయాయి, అప్పటికి రోమాసామ్రాజ్యం ప్రపంచ ఆధిపత్యంగా చెలామణి అవుతూనేవుంది. “అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు” అనే మాట యిక్కడ సరిగ్గా సరిపోతుంది. ఇంకనూ రానైయున్న “కడమవాని” విషయమేమిటి?

3. (ఎ) రోమాసామ్రాజ్యమెలా విభాగించబడింది? (బి) పాశ్చాత్య దేశాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి? (సి) పరిశుద్ధ రోమాసామ్రాజ్యాన్ని ఎలా దృష్టించాలి?

3 రోమాసామ్రాజ్యం యోహాను కాలం తర్వాత అనేకవందల సంవత్సరాలవరకు పాలించి, విస్తరించిందికూడ. సా.శ. 330 లో చక్రవర్తి కాన్‌స్టన్‌టైన్‌ తన రాజధానిని రోమునుండి తాను కాన్‌స్టన్‌టినోపుల్‌ అని పేరుమార్చిన బైజాన్‌టియమ్‌కు మార్చాడు. సా.శ. 395 లో రోమా సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా చీలిపోయింది. సా.శ. 410 లో రోమా సామ్రాజ్యం విసిగోత్స్‌ రాజైన అలారిక్‌ వశమైంది (అతడు ఆర్యన్‌ రకపు “క్రైస్తవత్వానికి” మారిన జర్మన్‌ తెగకు సంబంధించినవాడు). జర్మన్‌ తెగలు (“క్రైస్తవులు” కూడ) స్పెయిన్‌ను, ఉత్తరాఫ్రికాలోని రోమాసామ్రాజ్యపు భూబాగాన్ని చాలావరకు జయించారు. ఐరోపాలో శతాబ్దాల తరబడి ఒడుదుడుకులు, గందరగోళం, మరల సర్దుబాట్లు జరిగాయి. పోప్‌ లియో III తో 9వ శతాబ్దంలో మైత్రి నేర్పరచుకున్న షార్లిమాగ్నే, మరియు 13వ శతాబ్దంలో రాజీనామా చేసిన ఫ్రెడ్‌రిక్‌ II వంటి ప్రముఖ చక్రవర్తులు పశ్చిమదేశాల్లో అధికారంలోకి వచ్చారు. అయితే వారి పాలన, పరిశుద్ధ రోమాపాలనయని పిలువబడినప్పటికీ, అది ఒకనాడు ఉచ్ఛస్థితిలో పాలించిన రోమాసామ్రాజ్యంకన్నా ఎంతో చిన్నది. అదొక నూతన సామ్రాజ్యమని పిలువబడే దానికన్నా, అదొక ప్రాచీనపాలన లేక పునరుద్ధరణ పొడిగింపేనని చెప్పవచ్చును.

4. తూర్పుసామ్రాజ్యం ఏమేమి విజయాలను సాధించింది, అయితే ఉత్తరాఫ్రికా, స్పెయిన్‌, మరియు సిరియాలలోనున్న ప్రాచీనరోముకు సంబంధించిన అనేక ప్రాంతాలకు ఏమైంది?

4 కాన్‌స్టన్‌టినోపుల్‌ కేంద్రంగానున్న రోమాపాలనయొక్క తూర్పు సామ్రాజ్యం పశ్చిమ సామ్రాజ్యంతో కొంతవరకు సులభతరమైన సంబంధాన్నే కల్గివుండేది. ఆరవ శతాబ్దంలో, తూర్పు సామ్రాజ్యపు చక్రవర్తి జస్టీనియన్‌ I పశ్చిమాఫ్రికాలో చాలా భాగాన్ని గెల్చుకోగలిగాడు, మరియు అతడు స్పెయిన్‌, ఇటలీల లోనికికూడ చొచ్చుకుపోయాడు. ఏడవ శతాబ్దంలో, జస్టీనియన్‌ II స్లేవిక్‌ తెగవారు గెలుచుకున్న మాసిదోనియా ప్రాంతాన్ని మరల ఆ సామ్రాజ్యానికి సంపాదించిపెట్టాడు. అయిననూ, ఎనిమిదవ శతాబ్దానికల్లా ఉత్తరాఫ్రికా, స్పెయిన్‌ మరియు సిరియాలలోని ప్రాచీన రోమా యొక్క మునుపటి ప్రాంతమంతా ఇస్లాం అనే నూతన సామ్రాజ్యం క్రిందకు వచ్చింది, ఆ విధంగా అది కాన్‌స్టన్‌టినోపుల్‌ మరియు రోమ్‌ అధీనంనుండి తొలగిపోయింది.

5. సా.శ. 410 లో రోమా ప్రభుత్వం కూలిపోయినప్పటికీ, ప్రపంచ రంగంనుండి రోమాసామ్రాజ్యపు రాజకీయ జాడలేవీ లేకుండా పోవడానికి ఎలా యింకా అనేక శతాబ్దాలు పట్టింది?

5 కాన్‌స్టన్‌టినోపుల్‌ పట్టణం కొంతకాలం నిలువగల్గింది. అది చివరకు 1203 లో—ముస్లింలకు కాకుండ పశ్చిమదేశాలనుండి వచ్చిన మతయోధులకు లొంగిపోయేంతవరకు తరచూ పర్షియన్లు, అరబ్బులు, బల్గారులు, మరియు రష్యన్లు చేసిన దాడులకు తట్టుకోగల్గింది. అయిననూ, అది 1453 లో మహమ్మద్‌ II అనే ముస్లిం ఓట్టమాన్‌ అధికారం క్రిందకువచ్చి, వెంటనే ఓట్టమాన్‌ లేక టర్కిష్‌ సామ్రాజ్యానికి ముఖ్యపట్టణమైంది. అలా రోమాపట్టణం సా.శ. 410 లో పడిపోయిననూ, రాజకీయ సంబంధమైన రోమా సామ్రాజ్యం ప్రపంచ రంగంనుండి పూర్తిగా తెరమరుగవడానికి అనేక శతాబ్దాలుపట్టింది. అయిననూ, రోమ్‌లోని పోపులు మరియు ఈస్ట్రన్‌ ఆర్థోడాక్స్‌ చర్చీలమీద ఆధారపడియున్న మతసామ్రాజ్యంలో దాని ప్రభావమింకనూ కనబడేది.

6. ఏ సరిక్రొత్త సామ్రాజ్యాలు వెలిశాయి, ఏది అత్యంత విజయం సాధించింది?

6 అయిననూ, 15వ శతాబ్దానికల్లా, కొన్నిదేశాలు పూర్తిగా నూతన సామ్రాజ్యాలను ఏర్పరచుకున్నాయి. ఈ నూతన సామ్రాజ్యాలలో కొన్ని మునుపటి రోమా ప్రాంతాలలోనే ఏర్పడిననూ, వాటి సామ్రాజ్యాలు రోమాసామ్రాజ్యపు భాగంగా కొనసాగలేదు. పోర్చుగల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, మరియు హాలెండ్‌ మొదలైనవన్నీ ప్రత్యేక రాజ్యాలయ్యాయి. గానీ బ్రిటన్‌ అత్యంత విజయవంతమైనదై ‘రవి అస్తమించని సామ్రాజ్యంగా’ అనేక ప్రాంతంలో విలసిల్లింది. ఈ సామ్రాజ్యం వివిధకాలాలలో ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఇండియా, మరియు ఆగ్నేసియా, మరియు దక్షిణ పసిఫిక్‌ ప్రాంతాలకు వ్యాపించింది.

7. ఎలా ఒక విధమైన ద్వంద్వ ప్రపంచాధిపత్యం ఉనికిలోనికి వచ్చింది, ఆ ఏడవ ‘తల’ లేక ప్రపంచాధిపత్యం ఎంతకాలం నిలుస్తుందని యోహాను చెప్పాడు?

7 పందొమ్మిదో శతాబ్దానికల్లా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు అమెరికా సంయుక్తరాష్ట్రాలుగా ఏర్పడేందుకై బ్రిటన్‌నుండి విడిపోయాయి. రాజకీయపరంగా, క్రొత్త దేశానికి, మునుపటి మాతృదేశానికి మధ్య కొంత విభేదం కొనసాగింది. అయిననూ, రెండవ ప్రపంచయుద్ధం రెండు దేశాలకున్న ఏక సంకల్పాన్ని గుర్తెరిగేలా చేసి, ఆ రెండింటిమధ్య ఓ ప్రత్యేక సయోధ్యను కుదిర్చింది. ఆవిధంగా, ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనసంపన్న రాజ్యమైన అమెరికా సంయుక్తరాష్ట్రాలు, ప్రపంచంలోకెల్లా అత్యంతపెద్ద సామ్రాజ్యానికి స్థానమైన బ్రిటన్‌ కలిసి ఒక ద్వంద్వ ప్రపంచాధిపత్యంగా ఉనికిలోనికి వచ్చాయి. గనుక, ఇదిగో ఏడవ ‘తల,’ లేక ప్రపంచాధిపత్యం యిది అంత్యకాలం వరకు మరియు ఆధునిక యెహోవాసాక్షులు మొదట స్థాపించబడిన ప్రాంతాల్లో అధికారం కొనసాగిస్తుంది. ఆరవ తలతో పోలిస్తే, యీ ఏడవ ఆధిపత్యం దేవునిరాజ్యం అన్ని రాజ్యాలను నాశనం చేసేవరకు, “కొంచెము కాలము” మాత్రమే ఉంటుంది.

ఎనిమిదవ రాజని ఎందుకు పిలువబడింది?

8, 9. దూత ఆ సాదృశ్యమైన ఎఱ్ఱని క్రూరమృగాన్ని ఏమని పిలుస్తున్నాడు, ఎలా అది ఏడవదానిలోనుండి వస్తుంది?

8 దూత యోహానుకు యింకను యిలా వివరిస్తున్నాడు: “ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన యీ క్రూరమృగము ఆ యేడుగురితోపాటు ఒకడునైయుండి, తానే యెనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును.” (ప్రకటన 17:11) ఈ సాదృశ్యమైన ఎఱ్ఱని క్రూరమృగము ఏడుతలలనుండి “వస్తుంది,” అంటే, ఎఱ్ఱని క్రూరమృగమనే ప్రతిమ దేనినుండి వచ్చిందో ఆ అసలైన “సముద్రములోనుండి పైకివచ్చిన . . . క్రూరమృగము” తలలోనుండి పుట్టింది లేక తన ఉనికి నిమిత్తం దానికి రుణపడివుంది. ఎలాగు? ఎలాగంటే, 1919 లో ఆంగ్లో-అమెరికన్‌ ఆధిపత్యం పెరుగుతున్న తల. దానికి ముందున్న ఆరు తలలు కూలిపోయాయి, మరి ప్రపంచాధిపత్యపు స్థానం యీ ద్వంద్వ శిరస్సుకీయబడింది, యిప్పుడు దానిమీదే కేంద్రీకృతమైంది. ప్రపంచాధిపత్యాల పరంపరకు ప్రతినిధిగా యీ ఏడవ తల, నానాజాతి సమితిని స్థాపించడంలో బలమైన శక్తియైంది, మరియు యిప్పటికి అది ఐక్యరాజ్యసమితి ఆర్థికసహాయానికి అభివృద్ధికి ముఖ్యదోహదకారిగా వున్నది. ఆ విధంగా, సాదృశ్యమైన రీతిలో యీ ఎఱ్ఱనిక్రూరమృగము—ఎనిమిదవ రాజు—అసలు ఏడుతలల “నుండి వచ్చింది”. ఈ దృష్టితోచూస్తే, ఇది ఏడవతలలోనుండి వచ్చిందనే విషయానికి, గొఱ్ఱెపిల్లవంటి (ఆ అసలు క్రూరమృగముయొక్క ఏడవ తల, ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం) రెండుకొమ్ములుగల క్రూరమృగము ఒక ప్రతిమను చేసి దానికి ప్రాణం పోయాలని బలవంతం చేసిందని అంతకుముందివ్వబడిన దర్శనంలో చెప్పబడిన విషయానికి సరిగ్గా సరిపోతుంది.—ప్రకటన 13:1, 11, 14, 15.

9 అంతేగాక, నానాజాతి సమితిలోని మొదటి సభ్యత్వంగల వాటిలో గ్రేట్‌ బ్రిటన్‌తోసహా, ముందున్న తలలోని ప్రభుత్వాలుగా అధికారంలో ఉన్న కొన్ని రాజ్యాలు అంటే గ్రీసు, ఇరాన్‌ (పర్షియా), మరియు ఇటలీ (రోము) చేరియుండెను. చివరకు, గతించిన ఆరు ప్రపంచాధిపత్యాల ఆధిపత్యం క్రిందనున్న ప్రాంతాలను పాలిస్తున్న ప్రభుత్వాలు ఆ క్రూరమృగపు ప్రతిమకు మద్దతునిచ్చే సభ్యులయ్యాయి. ఈ భావంలోకూడ, యీ ఎఱ్ఱని క్రూరమృగము ఏడు ప్రపంచాధిపత్యాలనుండి వచ్చిందని చెప్పవచ్చును.

10. (ఎ) ఎఱ్ఱని క్రూరమృగం “తానే ఎనిమిదవ రాజగును” అని ఎలా చెప్పవచ్చును? (బి) సోవియట్‌ నాయకుడు ఎలా ఐక్యరాజ్య సమితికి మద్దతు తెలిపాడు?

10 గమనించండి, యీ ఎఱ్ఱని క్రూరమృగము “తానే యెనిమిదవ రాజు.” ఆవిధంగా, ఐక్యరాజ్యసమితి ఒక ప్రపంచ ప్రభుత్వంగా కనబడేలా నిర్మించ బడింది. అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే నిమిత్తం కొరియా, సీనాయి ద్వీపకల్పం, కొన్ని ఆఫ్రికా దేశాలు, మరియు లెబానోను వంటి దేశాల్లోనికి సైన్యాలను పంపి కొన్నిసార్లు ఆ విధంగా నటించింది. అయితే అది రాజుయొక్క ప్రతిమ మాత్రమే. మతసంబంధమైన ప్రతిమలాగానే, అది దాన్ని ఉనికిలోనికి తెచ్చి, పూజించే వారిచ్చిందే తప్ప దానికంటూ అసలైన శక్తి లేదా ప్రభావం ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో యీ సాదృశ్యమైన మృగం బలహీనంగా కనబడుతుంది; అయితే, నానాజాతిసమితిని అగాధంలోనికి పంపిన నియంతృత్వ మనస్తత్వంగల సభ్యులు పూర్తిగా పరిత్యజించిన అనుభవాన్ని అదెన్నడూ పొందలేదు. (ప్రకటన 17:8) ఇతర విషయాల్లో తీవ్ర భేదాభిప్రాయం కల్గియున్నప్పటికీ, 1987 లో ప్రముఖ రష్యా నాయకుడొకరు ఐక్యరాజ్యసమితికి మద్దతును తెల్పడంలో రోమునందలి పోపులతో ఏకీభవించాడు. ఐక్యరాజ్యసమితిపై ఆధారపడిన “ఒక పటిష్టమైన అంతర్జాతీయ భద్రతా విధానమంటూ ఉండాలని” కూడ ఆయన పిలుపునిచ్చాడు. యోహాను త్వరలో తెలుసుకొనబోతున్నట్లు, ఐక్యరాజ్యసమితి గొప్ప అధికారం చెలాయించే సమయం రాబోతోంది. అప్పుడు, అదే తుదకు “నాశనమునకు పోవును.”

ఒక గడియ కొరకు పదిమంది రాజులు

11. సాదృశ్యమైన ఎఱ్ఱని క్రూరమృగం యొక్క ఏడు తలలనుగూర్చి యెహోవా దూత ఏమని చెబుతున్నాడు?

11 ప్రకటనలోని ముందటి అధ్యాయాల్లో ఆరవదూత, ఏడవదూత దేవుని కోపమును కుమ్మరించారు. ఆవిధంగా, దేవుని యుద్ధమైన ఆర్మగిద్దోనుకు భూరాజులు సమకూర్చబడుతున్నారని, ‘మహాబబులోనును దేవుడు జ్ఞాపకం చేసుకోవలసివుందని’ మనం తెలుసుకున్నాము. (ప్రకటన 16:1, 14, 19) ఇప్పుడు మనం యీ రెండింటిమీద దేవుని తీర్పులెలా జరుగుతాయో వివరంగా తెలుసుకుంటాం. యెహోవా దూత యోహానుకు చెప్పే విషయాన్ని వినండి: “నీవు చూచిన ఆ పదికొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతోకూడ రాజులవలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.”—ప్రకటన 17:12-14.

12. (ఎ) పదికొమ్ములు దేన్ని వివరిస్తున్నాయి? (బి) సాదృశ్యమైన పదికొమ్ములు ఎలా ‘ఇంకనూ రాజ్యాన్ని పొందలేదు’? (సి) సాదృశ్యమైన పదికొమ్ములు ఇప్పుడెలా “కొంతకాలము” రాజ్యమేలుతాయి, ఎంతకాలం ఏలుతాయి?

12 ఆ పదికొమ్ములు ప్రస్తుతం ప్రపంచ రాజకీయరంగంలో వెలుగుతూ, క్రూరమృగానికి మద్దతునిచ్చే రాజకీయ శక్తులన్నింటిని సూచిస్తున్నాయి. ప్రస్తుతమున్న దేశాల్లో కొన్నిమాత్రమే యోహాను కాలంలో ఉన్నాయి. అప్పుడున్న ఐగుప్తు, పర్షియా (ఇరాన్‌), యీనాడు పూర్తిగా భిన్నమైన రాజకీయవిధానాన్ని కల్గివున్నాయి. గనుక, మొదటి శతాబ్దంలో, ఆ ‘పదికొమ్ములు అధికారమును పొందలేదు.’ అయితే, ఇప్పుడు ప్రభువు దినములో వారికి “ఒక రాజ్యము” లేక అధికారమున్నది. గొప్పవలస రాజ్యాలన్నీ కూలిపోయిన నేపథ్యంలో, ముఖ్యంగా రెండోప్రపంచ యుద్ధంనుండి, అనేక క్రొత్తరాజ్యాలు వెలిశాయి. ఇవి, దీర్ఘకాలంగావున్న రాజ్యాలు, క్రూరమృగంతోపాటు కొద్దికాలం—“ఒకగడియ”—అంటే యెహోవా ఆర్మగిద్దోనులో ప్రపంచరాజకీయ అధికారాలన్నింటికి అంతం తెచ్చేవరకు పాలించాలి.

13. పదికొమ్ములు ఏవిధంగా “ఏకాభిప్రాయము” కల్గివుంటాయి, గొఱ్ఱెపిల్లయెడల ఎటువంటి స్వభావం కల్గివున్నట్లు యిది రూఢిచేస్తుంది?

13 ఈనాడు, యీ పదికొమ్ములను నడిపించే బలమైన శక్తులలో ఒకటి జాతీయతావాదం. అవి “ఏకాభిప్రాయము” కల్గివున్నాయని, అంటే అవి దేవుని రాజ్యాన్ని అంగీకరించే బదులు వాటి జాతీయాధికారాలను కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి. అవి నానాజాతిసమితిని, ఐక్యరాజ్యసమితిని ఆమోదించడంలో ఉన్న అసలుద్దేశమదే—ప్రపంచశాంతిని కాపాడి, ఆవిధంగా తమ ఉనికిని కాపాడుకోవడమే. అటువంటి అభిప్రాయం రూఢిపర్చేదేమంటే అవి గొఱ్ఱెపిల్లను, అంటే “ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును” ఎదిరిస్తాయి, ఎందుకంటే యేసుక్రీస్తు పాలించే యెహోవా రాజ్యం త్వరలో యీ రాజ్యాలన్నిటిని తొలగించునట్లు ఆయన సంకల్పించాడు.—దానియేలు 7:13, 14; మత్తయి 24:30; 25:31-33, 46.

14. లోకరాజులు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేయడానికెలా సాధ్యపడుతుంది, దాని ప్రతిఫలమేమిటి?

14 నిజమే, ఈ లోకపాలకులు యేసుకు విరుద్ధంగా ఏమీ చేయలేరు. ఆయన వారందుకోలేనంత దూరంలో, పరలోకమందున్నాడు. అయితే, స్త్రీ సంతానములో శేషించబడిన యేసు సహోదరులు యింకనూ భూమ్మీదనే ఉన్నారు, వారు అందుబాటులో ఉన్నారు. (ప్రకటన 12:17) ఆ కొమ్ములలో అనేకము యిప్పటికే వారియెడల శత్రుబావాన్ని కనబరుస్తున్నాయి, యీవిధంగా వారు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేస్తున్నారు. (మత్తయి 25:40, 45) అయినా, త్వరలోనే దేవునిరాజ్యం ‘ఈ లోకరాజ్యాలన్నిటిని పగులగొట్టి నిర్మూలం చేసే’ సమయమొస్తుంది. (దానియేలు 2:44) మనమిప్పుడు గమనించబోతున్నట్లు, అప్పుడు యీ భూరాజులు గొఱ్ఱెపిల్లతో అంతంవరకు యుద్ధం చేస్తారు. (ప్రకటన 19:11-21) అయితే, రాజ్యాలు విజయమొందవని మనమిక్కడ నేర్చుకుంటాం. వాటికి, ఐక్యరాజ్య సమితియనే ఎఱ్ఱని క్రూరమృగానికి “ఏకాభిప్రాయము” కల్గివున్ననూ అవి “ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును” ఓడించలేవు, లేక ఇంకనూ భూమ్మీదనున్న ఆయన అభిషక్త అనుచరులు చేరివున్నవారిని అనగా, “తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైన”వారిని అవి ఓడించలేవు. వీరుకూడ సాతాను నీలాపనిందలకు ప్రత్యుత్తరంగా తమ యథార్థతను కాపాడుకొనడం మూలంగా జయించగలరు.—రోమీయులు 8:37-39; ప్రకటన 12:10. 11.

వేశ్యను దిక్కులేనిదానిగా చేయడం

15. వేశ్యనుగూర్చి, దానియెడల పదికొమ్ములు, క్రూరమృగము కనబరచే అభిప్రాయం, అవి చేసే క్రియలనుగూర్చి దూత ఏమని చెబుతున్నాడు?

15 దేవుని ప్రజలు మాత్రమే ఆ పది కొమ్ములకు శత్రువులుకారు. దూత యిప్పుడు యోహాను అవధానాన్ని మరలా ఆ వేశ్యవైపు మళ్లిస్తున్నాడు: “మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను—ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును. నీవు ఆ పదికొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.”—ప్రకటన 17:15, 16.

16. రాజకీయ ప్రభుత్వాలు మహాబబులోనుపై తిరుగబడినప్పుడు రక్షణకరమైన మద్దతు కొరకు అదెందుకు దానికున్న జలములపై ఆధారపడజాలదు?

16 ప్రాచీన బబులోను రక్షణకై దాని నీటి ప్రవాహంపై ఆధారపడినట్లే, మహాబబులోను యీనాడు “ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడువారు” అయినటువంటి గొప్ప సభ్యత్వంపై ఆధారపడివుంది. ఆశ్చర్యంకల్గించే విషయాన్ని చెప్పకముందు ఆ దూత యీ విషయంపైకి మన అవధానాన్ని మళ్లిస్తున్నాడు: ఈ లోకప్రభుత్వాలు మహాబబులోను మీద విరుచుకు పడతాయి. మరి ఆ “ప్రజలును, జనసమూహములును, జనములును, ఆయా భాషలు మాటలాడువారును” అప్పుడేం చేస్తారు? యూఫ్రటీసు నదిలోని నీళ్లు ఎండిపోతాయని దేవుని ప్రజలు యిప్పటికే మహాబబులోనును హెచ్చరిస్తూనే ఉన్నారు. (ప్రకటన 16:12) ఆ నీళ్లు చివరకు పూర్తిగా ఎండిపోతాయి. ఏహ్యమైన ఆ వేశ్య ప్రాణాపాయంలో నున్నప్పుడు ఆ నీళ్లు ఎటువంటి ప్రయోజనకరమైన మద్దతునివ్వలేవు.—యెషయా 44:27; యిర్మీయా 50:38; 51:36, 37.

17. (ఎ) మహాబబులోనుకున్న ఐశ్వర్యమెందుకు దాన్ని కాపాడలేదు? (బి) మహాబబులోను అంతమెందుకు అవమానకరంగా ఉంటుంది? (సి) మహాబబులోనును ధ్వంసం చేయడంలో పదికొమ్ములకు లేక రాజ్యాలకు యింకేవికూడ తోడౌతాయి?

17 నిజంగా, బబులోనుకున్న అపారమైన ఆస్తి దాన్ని రక్షించలేదు. అది దాన్ని నాశనమే చేయవచ్చు, ఎందుకంటే క్రూరమృగము మరియు పదికొమ్ములు దాన్ని ద్వేషించినప్పుడు వారు దాని రాజవస్త్రాలను, నగలను తీసివేస్తారు. వారు దాని ఐశ్వర్యాన్ని దోచుకుంటారు. వారు “దాన్ని . . . దిగంబరిగాచేసి,” అవమానకరంగా దాని నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తారు. ఎంతటి వినాశనమోగదా! దాని అంతం కూడ అవమానకరంగానే ఉంటుంది. వారు దాన్ని నాశనం చేస్తారు, “దాని మాంసం భక్షించి,” దాన్ని నిర్జీవమైన అస్థిపంజరంగా చేస్తారు. చివరకు, వారు “అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” ఘనమైన సమాధికి నోచుకోకుండా, తెగులు సోకింది కాల్చివేయబడునట్టే అది కాల్చివేయబడుతుంది! పదికొమ్ములు సూచించే ప్రభుత్వాలేగాక, “ఆ క్రూరమృగము” అంటే ఐక్యరాజ్యసమితికూడ దాన్ని నాశనం చేయడంలో చేతులు కలుపుతుంది. అబద్ధమతాన్ని నాశనం చేయడానికి అది తన ఆమోదాన్ని తెల్పుతుంది. ఐక్యరాజ్య సమితిలోని 150 కంటె ఎక్కువ సభ్యులలోని అధికదేశాలు వాటి ఓటింగ్‌ పద్ధతిద్వారా యిప్పటికే మతంయెడల, ముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యం యెడల, అటువంటి వ్యతిరేక స్వభావాన్ని వ్యక్తపర్చాయి.

18. (ఎ) బబులోను సంబంధమైన మతంపై తిరుగుబాటు ధోరణి చూపే అవకాశమింకావుందని యిప్పటికే ఎలా కనబడింది? (బి) మహావేశ్యపై పూర్తిగా తిరుగబడేందుకు ముఖ్యకారణమేమై వుంటుంది?

18 ఒకనాటి తమ ప్రియురాలిని ప్రభుత్వాలెందుకు అంతగా ద్వేషిస్తున్నాయి? బబులోను సంబంధమైన మతానికి వ్యతిరేకంగా తిరిగిన అటువంటి అవకాశాన్ని మనం ఇటీవలి చరిత్రలో చూశాం. మునుపటి రష్యా, చైనాలాంటి దేశాల్లో ప్రభుత్వాధికారంలోని వ్యతిరేకత మతప్రభావాన్ని ఎంతగానో తగ్గించింది. ఐరోపాలోని ప్రొటెస్టెంట్‌ విభాగాల్లో నెలకొన్న నిర్లిప్తతా సంశయాలు చర్చీలను నిర్మానుష్యం చేశాయి, గనుకనే మతం దాదాపు మరుగైంది. కాథోలిక్‌ మహాసామ్రాజ్యం తిరుగుబాటు, అసమ్మతి మూలంగా చీలిపోయింది, దేశదేశాలు దర్శించే పోప్‌ దాన్ని అతికించలేక పోయాడు. అయిననూ, మహాబబులోనుమీదికి వచ్చే యీ అంతిమ గట్టి ముట్టడి, దేవుడు ఆ మహావేశ్యకు చేసే మార్పులేని తీర్పుకు తార్కాణమనే సత్యాన్ని మనం విస్మరించ కూడదు.

దేవుని సంకల్పాన్ని నెరవేర్చుట

19. (ఎ) సా.శ.పూ. 607 లో భ్రష్ట యెరూషలేముకు జరిగిన తీర్పు, యీ మహావేశ్యకు యెహోవా చేయబోవు తీర్పునెలా ఉదహరించింది? (బి) సా.శ.పూ. 607 లో నిర్జనమైన నిర్మానుష్యమైన యెరూషలేము పరిస్థితి మనకాలం కొరకు దేన్ని సూచిస్తుంది?

19 యెహోవా ఎలా యీ తీర్పుతీరుస్తాడు? ప్రాచీనకాలంలో యెహోవా మతభ్రష్టులైన తన ప్రజలపై తీసుకున్న చర్యను బట్టి దీన్ని వివరించవచ్చు, వారిని గూర్చి ఆయనిలా అన్నాడు: “యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నాదృష్టికి సొదొమవలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.” (యిర్మీయా 23:14) సా.శ.పూ. 607 లో ఆ ఆత్మీయ వ్యభిచార పట్టణాన్ని ‘దిగంబరిగా చేసి, అందమైన నగలను తీసివేసి దాన్ని దిక్కులేని దానిగాను నగ్నంగాను చేయడానికి’ యెహోవా నెబుకద్నెజరు నుపయోగించుకున్నాడు. (యెహెజ్కేలు 23:4, 26, 29) ఆనాటి యెరూషలేము ఈనాటి క్రైస్తవమత సామ్రాజ్యానికి మాదిరియై యున్నది, మరి అంతకు ముందుకల్గిన దర్శనాలలో యోహాను చూచినట్లు, యెహోవా క్రైస్తవమత సామ్రాజ్యానికి మిగతా అబద్ధమతానికి అటువంటి శిక్షనే వేస్తాడు. సా.శ.పూ. 607 లో యెరూషలేము ఎలా నిర్మానుష్యమైన, నిర్జనమైన ప్రాంతంగా మిగిలిపోయిందో అది, మతసంబంధమైన క్రైస్తవమత సామ్రాజ్యం దానికున్న భోగభాగ్యాలను తీసివేసిన తర్వాత ఎలా కనబడుతుందో దాన్ని చూపిస్తుంది. మహాబబులోనులో మిగతా భాగానికి కలిగే గతి అంతకంటె ఏమీ తీసిపోదు.

20. (ఎ) తీర్పు తీర్చడానికి యెహోవా మరలా మానవ పాలకులను ఉపయోగించుకుంటాడని యోహాను ఎలా చూపిస్తున్నాడు? (బి) దేవుని “సంకల్పము” ఏమిటి? (సి) రాజ్యములు ఏ విధంగా వారి “ఏకాభిప్రాయమును” నెరవేర్చుతాయి, అయితే నిజంగా ఎవరి సంకల్పం నెరవేరుతుంది?

20 తీర్పుతీర్చడానికి యెహోవా మరలా మానవ పాలకులనే ఉపయోగిస్తాడు. “దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయముగలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధిపుట్టించెను.” (ప్రకటన 17:17) దేవుని “సంకల్పము” ఏమిటి? మహాబబులోనును పూర్తిగా నాశనం చేయడానికి దాన్ని నాశనంచేసే వారందర్నీ ఏకం చేయడమే ఆ సంకల్పం. పాలకులు దాన్ని ముట్టడించడంలోని ఉద్దేశం వారి “ఏకాభిప్రాయము”ను నెరవేర్చుకోవడానికే. ఆ విధంగా వారు మహావేశ్యమీద తిరుగుబాటు చేయడమనేది దేశక్షేమం దృష్ట్యా మంచిదని వారు భావిస్తారు. వారి హద్దుల్లోనున్న సంస్థీకరించబడిన మతం కొనసాగడమనేది వారి పాలనకే ముప్పుగా పరిణమిస్తుందని వారనుకోవచ్చు. అయితే, యెహోవాయే నిజానికి అలా జరిగేలా చేస్తాడు; అనాదిగా ఉన్న యీ జారిణియగు తన శత్రువు నాశనమయ్యేలా యెహోవా వారిని నడిపినందున వారు ఆయన సంకల్పమును నెరవేర్చుతారు!—యిర్మీయా 7:8-11, 34 పోల్చండి.

21. మహాబబులోనును నాశనం చేయడానికి ఎఱ్ఱని క్రూరమృగము ఉపయోగించ బడుతున్నందున రాజ్యాలు ఐక్యరాజ్యసమితి విషయంలో నిజంగా ఏమి చేస్తాయి?

21 అవును, మహాబబులోనును నాశనం చేయడానికి రాజ్యాలు ఎఱ్ఱని క్రూరమృగమైన ఐక్యరాజ్యసమితిని ఉపయోగించుకుంటాయి. అవి వాటి యిష్టంచొప్పున చేయవు, ఎందుకంటె “వారు ఏకాభిప్రాయముగలవారై, తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించు”నట్లు యెహోవా వారికి బుద్ధిపుట్టించెను. సమయం వచ్చినప్పుడు రాజ్యాలు ఐక్యరాజ్యసమితిని బలపరచే అవసరాన్ని తప్పక గుర్తిస్తాయి. అవి దానికి కోరలనిస్తాయి, అంటే “దేవుని సంకల్పం కొనసాగించువరకు” అది అబద్ధమతంపై తిరగబడి, దాన్ని జయించులాగున వాటికున్న అధికారాన్ని శక్తిని వీలైనంతవరకు దానికందిస్తాయి. అలా ప్రాచీన వేశ్య సంపూర్తిగా అంతమౌతుంది. అదెంత పూర్తిగా తుడిచివేయ బడుతుందోగదా!

22. (ఎ) ప్రకటన 17:18 లో దూత తన సాక్ష్యాన్ని ముగించే పద్ధతి దేన్ని సూచిస్తుంది? (బి) మర్మం బయల్పర్చబడే విషయానికి యెహోవాసాక్షులెలా స్పందిస్తారు?

22 ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యంపై యెహోవా తీర్పు తప్పనిసరిగా జరుగుతుందని నొక్కి చెబుతున్నట్లు, దూత తన సాక్ష్యాన్ని యీ మాటలద్వారా ముగిస్తున్నాడు: “మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే.” (ప్రకటన 17:18) బెల్షస్సరు కాలంలోని బబులోనువలె, మహాబబులోను “త్రాసులోవేసి తూయగా తక్కువగా ఉన్నట్లు కనబడింది.” (దానియేలు 5:27, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) దానికి జరిగేతీర్పు శరవేగంతో జరుగుతుంది, అది అంతిమ తీర్పై ఉంటుంది. మరి యెహోవాసాక్షులు మహావేశ్యను గూర్చి, ఎఱ్ఱని క్రూరమృగమును గూర్చిన మర్మాన్ని బయల్పరచడం విషయంలో ఎలా స్పందిస్తారు? సత్యాన్ని వెదకేవారికి “సాత్వికముతో” సమాధానమిస్తూ, వారు యెహోవా తీర్పుదినమును గూర్చి ప్రకటించడంలో ఆసక్తి చూపుతారు. (కొలొస్సయులు 4:5, 6; ప్రకటన 17:3, 7) మన తర్వాతి అధ్యాయం చూపబోతున్నట్లు, మహావేశ్యకు తీర్పు జరిగినప్పుడు తప్పించుకోవాలని కోరుకునే వారంతా తక్షణచర్య తప్పక గైకొనాలి!

[అధ్యయన ప్రశ్నలు]

[252వ పేజీలోని చిత్రం]

వరుసగా వచ్చిన ఏడు ప్రపంచాధిపత్యాలు

ఐగుప్తు

అష్షూరు

బబులోను

మాదీయ-పారసీకులు

గ్రీసు

రోము

ఆంగ్లో-అమెరికా

[254వ పేజీలోని చిత్రం]

“తానే ఎనిమిదవరాజు”

[255వ పేజీలోని చిత్రం]

వారు గొఱ్ఱెపిల్లను తిరస్కరించి, “తమ అధికారమును బలమును ఆ మృగమునకు యిత్తురు.”

[257వ పేజీలోని చిత్రం]

క్రైస్తవమత సామ్రాజ్యం మహాబబులోనులో ముఖ్యభాగంగా, సర్వనాశనమయ్యే విషయంలో ప్రాచీన బబులోనును పోలివున్నది.