కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మహాబబులోను కూలిపోయెను!”

“మహాబబులోను కూలిపోయెను!”

అధ్యాయం 30

“మహాబబులోను కూలిపోయెను!”

1. రెండవదూత ఏమని ప్రకటించింది, మహాబబులోను ఏమైయున్నది?

అది దేవుని తీర్పుగడియ! మరైతే దైవవర్తమానాన్ని వినండి: “వేరొక దూత, అనగా రెండవ దూత అతని వెంబడివచ్చి—మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను.” (ప్రకటన 14:8) మొదటిసారిగా, అయితే చివరిసారి కాదనుకోండి, ప్రకటన మహాబబులోను మీద అవధానాన్ని నిలుపుతోంది. తర్వాత 17వ అధ్యాయం దాన్ని కామోద్రేకంగల వేశ్యయని వర్ణిస్తుంది. ఎవరామె? మనం గమనించబోతున్నట్లు, ఆమె ప్రపంచవ్యాప్తంగానున్నది, మతసంబంధమైనది, అది దేవుని స్త్రీ సంతానానికి వ్యతిరేకంగా పోరాడడానికి సాతాను ఉపయోగించే ప్రత్యర్థి విధానమైయున్నది. (ప్రకటన 12:17) మహాబబులోను ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యము. ప్రాచీన బబులోను బోధలను ఆచారాలను కల్గివుంటూ, దాని స్వభావాన్ని కనబరచే మతాలన్నీ దానిలో ఉన్నాయి.

2. (ఎ) బబులోను మతం ఏవిధంగా భూమియంతటా వ్యాపించింది? (బి) మహాబబులోనులోని అతిప్రాముఖ్యమైన భాగమేమిటి, మరి అదెప్పుడు ఒక శక్తివంతమైన సంస్థగా రూపొందింది?

2 ఆ బబులోనుదగ్గరే, 4,000 సంవత్సరాల క్రితం యెహోవా బాబెలు గోపురాన్ని కట్టతలపెట్టినవారి భాషల్ని తారుమారు చేశాడు. ఆయా భాషల గుంపులు భూమియందంతటా చెదరి, యీనాటివరకు అనేకమతాలకు ఆధారమైన మతభ్రష్ట విశ్వాసాలను, ఆచారాలను వారివెంట తీసుకువెళ్లారు. (ఆదికాండము 11:1-9) మహాబబులోను సాతాను సంస్థలో మతసంబంధమైన భాగము. (యోహాను 8:43-47 పోల్చండి.) ఈనాడు దాని అతిప్రాముఖ్యమైన భాగమేమంటే భ్రష్టమైన క్రైస్తవమత సామ్రాజ్యమే, అది క్రీస్తు జీవించిన తర్వాత నాల్గవ శతాబ్దంలో ఒక బలమైన, ధర్మవిరుద్ధమైన సంస్థగా బయలుదేరింది, బైబిలునుండిగాక, ముఖ్యంగా బబులోను మతంనుండి శాఖలను ఆచారాలను అలవర్చుకుంది.—2 థెస్సలొనీకయులు 2:3-12.

3. మహాబబులోను కూలిపోయిందని ఎలా చెప్పవచ్చును?

3 మీరిలా అడుగవచ్చు, ‘లోకంలో మతమెంతో ప్రభావం కల్గియున్నందున, మహాబబులోను కూలిపోయిందని ఎందుకు దూత ప్రకటిస్తున్నాడు?’ సరే, సా.శ.పూ. 539 లో ప్రాచీన బబులోను కూలిపోయినప్పుడేమి జరిగింది? ఇశ్రాయేలీయులు తమ స్వదేశం వెళ్లి అక్కడ మరల సత్యారాధనను నెలకొల్పడానికి విడుదల చేయబడ్డారుగదా! గనుక, 1919 లో ఆత్మీయ ఇశ్రాయేలీయులు తేజోవంతమైన ఆత్మీయాభ్యుదయానికి తేబడి యీనాటివరకు కొనసాగుటయే మహాబబులోను ఆ సంవత్సరంలో కూలిపోయిందనడానికి నిదర్శనం. దేవుని ప్రజలపై దానికిక ఏమాత్రం పట్టులేదు. అంతేగాక, అంతర్గత కుమ్ములాటలనుబట్టి అది పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. దాని దుష్టత్వం, లంచగొండితనం, అవినీతి 1919నుండి సర్వత్రా బయల్పర్చ బడ్డాయి. ఐరోపాలోని చాలాప్రాంతాల్లో బహుతక్కువమంది చర్చీకివెళ్తున్నారు, కొన్ని సామ్యవాద దేశాల్లో, మతం ఒక “నల్లమందు”గా పరిగణింప బడుతోంది. మహాబబులోను యిప్పుడు దేవుని సత్యవాక్యమును ప్రేమించువారి దృష్టిలో అవమానంపాలై, మరణశయ్యపై ఉన్నదా అన్నట్లు, యెహోవా తనపై చేయబోవు నీతియుక్తమైన తీర్పుకొరకు వేచివుంది.

బబులోను అవమానకరంగా కూలిపోవుట

4-6. ఏ విధంగా ‘మహాబబులోను . . . జనములన్నిటికి తన వ్యభిచార మద్యమును త్రాగించింది’?

4 మహాబబులోను అవమానకరంగా కూలిపోయేందుకు దోహదపడే పరిస్థితులను గూర్చి మనం సవివరంగా పరిశీలిద్దాం. ‘మహాబబులోను . . . జనములన్నిటికి తన వ్యభిచార మద్యమును త్రాగించింది’ అని దూత మనకు తెల్పుతున్నాడు. దీనర్థమేమిటి? అది విజయానికి సంబంధించింది. ఉదాహరణకు యెహోవా యిర్మీయాకు యిలా చెప్పాడు: “నీవు యీ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము. వారు దాని త్రాగి సొక్కిసోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.” (యిర్మీయా 25:15, 16) సా.శ.పూ. ఆరు, ఏడు శతాబ్దాలలో, యెహోవా యూదాతోసహా అనేక జనములు శ్రమలనే సాదృశ్యమైన పాత్రలోనిది త్రాగేలా చేయడానికి ప్రాచీన బబులోనును ఉపయోగించుకొన్నాడు, అలా తనస్వంత ప్రజలు చెరలోనికి తీసుకొని పోబడేలా చేశాడు. తర్వాత, తనవంతు వచ్చినప్పుడు బబులోను కూలిపోయింది, ఎందుకంటే, దాని రాజు “పరలోకమందున్న ప్రభువుమీద” అంటే యెహోవా కంటె ఉన్నతునిగా హెచ్చించుకున్నాడు.—దానియేలు 5:23.

5 మహాబబులోను కూడ విజయాలు సాధించింది గానీ, వీటిలో చాలావరకు మోసపూరితమైనవే. అది జారిణి చేష్టలుచేస్తూ, వారితో మతసంబంధమైన వ్యభిచారం చేయడంద్వారా “జనములన్నిటికి” త్రాగించింది. తనతో సంబంధ బాంధవ్యాల నేర్పరచుకొని, స్నేహితులనుగా చేసుకొనేలాగున అది రాజకీయ పాలకులను మభ్యపెట్టింది. మతపరమైన ఆకర్షణల మూలంగా అది రాజకీయ, వాణిజ్య, ఆర్థిక వత్తిడిని తెచ్చింది. కేవలం రాజకీయ, వాణిజ్య కారణాల నిమిత్తమే అది మతపరమైన హింసను మరియు మతపరమైన యుద్ధాలను, మతపోరాటాలను, దేశాలమధ్య యుద్ధాలను పురికొల్పింది. మరియు అది యీ యుద్ధాలు జరగడం దేవుని చిత్తమేనంటూ వాటిని పరిశుద్ధపరచింది.

6 ఈ 20వ శతాబ్దంలో మతం, యుద్ధాల్లోను రాజకీయాల్లోను జోక్యం చేసుకోవడం పరిపాటియైంది—జపాన్‌లో షింటో, ఇండియాలో హిందూ, వియత్నాంలో బౌద్ధమతస్థుడు, ఉత్తర ఐర్లాండు, లాటిన్‌ అమెరికా, మరితర దేశాల్లోని “క్రైస్తవుడు”—రెండు ప్రపంచయుద్ధాల్లో యువకులు ఒకరినొకరు చంపుకొనేలా ఉసిగొల్పడానికి మతగురువులు నిర్వహించిన పాత్రను విస్మరించకూడదు. మహాబబులోను ప్రదర్శించిన వలపుకు నిదర్శనమేమంటే, 1936-39 సంవత్సరాలమధ్య కనీసం 6,00,000 మంది హతులైన స్పానిస్‌ పౌరపోరాటంలో దానికున్న భాగమే. కాథోలిక్‌ మతగురువులు, వారి సహచరులు యీ రక్తపాతాన్ని పురికొల్పారు. ఇందుకుగల కారణాలలో ఒకటి, స్పెయిన్‌ ప్రభుత్వము చర్చీ అధికారాన్ని, ఆస్తిపాస్తులను హస్తగతం చేసుకుంటామని బెదరించడమే.

7. మహాబబులోను ముఖ్యగురి ఎవరు, వీరిమీద ఆమె ఎటువంటి పద్ధతులను ప్రయోగించింది?

7 మహాబబులోను సాతాను సంతానంలో మతసంబంధమైన భాగం గనుక, అదెల్లప్పుడు యెహోవా “స్త్రీ”ని, “పైనున్న యెరూషలేము”ను, తన ముఖ్యగురిగా పెట్టుకుంది. మొదటి శతాబ్దంలో, అభిషక్త క్రైస్తవుల సంఘం స్త్రీ సంతానమని స్పష్టంగా గుర్తించబడింది. (ఆదికాండము 3:15; గలతీయులు 3:29; 4:26) మహాబబులోను, ఆ పవిత్రమైన సంఘం మతసంబంధమైన వ్యభిచారం చేసేలాగున మోసపుచ్చి దాన్ని జయించాలని చాలా కష్టపడింది. అపొస్తలుడైన పౌలు, పేతురు, అనేకులు దానివల్ల మోసపోతారని గొప్ప మతభ్రష్టత సంభవిస్తుందని హెచ్చరించారు. (అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 పేతురు 2:1-3) యోహాను జీవితాంతాన మహాబబులోను పాడుచేసే తన ప్రయత్నాలలో కొంత అభివృద్ధి సాధిస్తుందని, యేసు యేడు సంఘాలకిచ్చిన వర్తమానాలు సూచిస్తున్నాయి. (ప్రకటన 2:6, 14, 15, 20-23) అయితే అదెంతవరకు అలా చేయడానికి అనుమతించ బడుతుందో కూడ యేసు ముందే తెలిపాడు.

గోధుమలు గురుగులు

8, 9. (ఎ) యేసు యిచ్చిన గోధుమలు గురుగుల ఉపమానం ఏమి తెల్పుతుంది? (బి) “మనుష్యులు నిద్రించుచుండగా” ఏమి సంభవించింది?

8 గోధుమలు గురుగులను గూర్చిన తన ఉపమానంలో, యేసు పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని గూర్చి చెప్పాడు, అయితే “మనుష్యులు నిద్రించుచుండగా,” శత్రువువచ్చి గురుగులను విత్తెను. అందుచేత గోధుమలు గురుగుల మూలంగా మరుగయ్యాయి. యేసు తన ఉపమానమును యిలా వివరించాడు: “మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు; పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు; వాటిని విత్తిన శత్రువు అపవాది.” ఆ తర్వాత ఆయన గోధుమలు గురుగులు “యుగ సమాప్తి” వరకు కలిసి పెరిగేలా అనుమతించ బడ్డాయని, అప్పుడు దూతలు సాదృశ్యమైన గురుగులను సమకూరుస్తారని తెల్పాడు.—మత్తయి 13:24-30, 36-43.

9 యేసు, అపొస్తలులైన పౌలు, పేతురు హెచ్చరించినట్లే జరిగింది. “మనుష్యులు నిద్రించుచుండగా,” అంటే అపొస్తలులు మరణించిన తర్వాత లేక దేవుని మందను కాయడంలో క్రైస్తవ కాపరులు నిద్రమత్తులై వున్నప్పుడు, బబులోను భ్రష్టత్వం సంఘం మధ్యలోనే పుట్టివుంటుంది. (అపొస్తలుల కార్యములు 20:31) వెంటనే గురుగులు గోధుమలకంటె ఎంతో ఎక్కువ సంఖ్యలో పెరిగి వాటిని కనబడకుండా చేశాయి. కొన్ని శతాబ్దాలవరకు స్త్రీసంతానం, మహాబబులోను కామోద్రేకపు విస్తారమైన చెంగులతో పూర్తిగా కప్పబడిందేమో అన్నట్లు కనబడింది.

10. మరి 1870వ దశాబ్దంలో ఏమి జరిగింది, మహాబబులోను దీనికి ఎలా స్పందించింది?

10 అభిషక్త క్రైస్తవులు 1870దశాబ్దంలో మహాబబులోను వ్యభిచార మార్గాలనుండి తమకుతాము తెగతెంపులు చేసుకోవాలని కచ్చితమైన ప్రయత్నాలు చేయనారంభించారు. క్రైస్తవమత సామ్రాజ్యం బబులోను మతంనుండి తెచ్చిన తప్పుడు సిద్ధాంతాలను విడనాడారు, అన్యరాజుల కాలములు 1914 లో అంతమౌతాయని ప్రకటించడానికి బైబిలును ధైర్యంగా ఉపయోగించారు. మహాబబులోను ముఖ్య ఉపకరణమైన క్రైస్తవమత సామ్రాజ్యపు మతగురువులు యీ సత్యారాధనా పునరుద్ధరణ ఉత్సాహాలన్నింటిని వ్యతిరేకించారు. మొదటిప్రపంచ యుద్ధకాలంలో నమ్మకమైన ఆ చిన్న క్రైస్తవగుంపును అణచివేయడానికి యుద్ధోన్మాదాన్ని అవకాశంగా తీసుకున్నారు. వారి కార్యక్రమాలన్నీ 1918 లో దాదాపు పూర్తిగా స్తంభించిపోయినప్పుడు, మహాబబులోను గెలిచినట్లే కన్పడింది. అది వారిపై విజయం సాధించినట్లనిపించింది.

11. ప్రాచీన బబులోను కూలిపోవడంతో ఏం జరిగింది?

11 మనం ముందే గమనించినరీతిగా, గర్విష్టురాలైన బబులోను పట్టణం సా.శ.పూ. 539 లో అధికారం కోల్పోయి విపత్కర పతనాన్ని అనుభవించింది. అప్పుడు యిలా కేకలు వినబడ్డాయి: “బబులోను కూలిపోయెను కూలిపోయెను.” ప్రపంచాధిపత్యపు సింహాసనము మహా కోరెషు సారధ్యంలోని మాదీయులు పారసీకుల సైన్యం చేతిలో కూలిపోయింది. ఆ పట్టణం ముట్టడినుండి తప్పించు కున్నప్పటికీ, అది అధికారం కోల్పోవడం మాత్రం వాస్తవమే, అందుమూలంగా బందీలుగానున్న యూదులకు విడుదలకల్గింది. పవిత్రారాధనను పునఃస్థాపించడానికి వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు.—యెషయా 21:9; 2 దినవృత్తాంతములు 36:22, 23; యిర్మీయా 51:7, 8.

12. (ఎ) మన శతాబ్దంలో, మహాబబులోను కూలిపోయిందని ఎలా చెప్పగలం? (బి) క్రైస్తవమత సామ్రాజ్యాన్ని యెహోవా బొత్తిగా విసర్జించాడని ఏది రుజువు చేస్తుంది?

12 మన శతాబ్దంలో మహాబబులోను కూలిపోయిందన్న కేక కూడ వినబడుతోంది! బబులోనుకు సంబంధించిన క్రైస్తవమత సామ్రాజ్యం 1918 లో పొందిన తాత్కాలిక విజయం యోహాను తరగతి, అంటే అభిషక్తుల శేషం, 1919 లో ఆత్మీయ పునరుత్థానం ద్వారా పునరుద్ధరించ బడినప్పుడు వేగంగా తిరగగొట్టబడింది. దేవుని ప్రజలపై ఎటువంటి పట్టులేనిరీతిగా వారి విషయంలో మహాబబులోను కూలిపోయింది. మిడతలవలె, క్రీస్తు అభిషక్త సహోదరుల దండు అగాధంనుండి బయటకివచ్చి కార్యానికి సిద్ధంగా ఉన్నారు. (ప్రకటన 9:1-3; 11:11, 12) వారే ఆధునిక “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు,” యజమానుడు వారిని భూమ్మీద తన యావదాస్తిపై నియమించాడు. (మత్తయి 24:45-47) యెహోవా వారినిలా ఉపయోగించుకోవడం, క్రైస్తవమత సామ్రాజ్యం తాను భూమ్మీద ఆయనకు ప్రతినిధియని చెప్పుకుంటున్ననూ ఆయన దాన్ని పూర్తిగా తిరస్కరించాడని నిరూపిస్తున్నది. పవిత్రారాధన పునరుద్ధరించబడింది, మహాబబులోను దీర్ఘకాల శత్రువైన స్త్రీ సంతానంలో శేషించబడిన వారిని అనగా 1,44,000 మందిలో శేషమును ముద్రించే కార్యక్రమము పూర్తిచేయడానికి మార్గమేర్పర్చబడింది. ఇదంతా సాతాను యొక్క ఆ మతసంస్థకు ఓ గొప్ప ఓటమిని సూచిస్తుంది.

పరిశుద్ధుల ఓర్పు

13. (ఎ) మూడవదూత ఏమని ప్రకటిస్తున్నాడు? (బి) క్రూరమృగము యొక్క ముద్రను కల్గియున్నవారికి యెహోవా ఎటువంటి తీర్పుతీరుస్తాడు?

13 ఇప్పుడు మూడవదూత మాట్లాడుతున్నాడు వినండి!: “మరియు వేరొక దూత, అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను—ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారము చేసి, తన నొసటియందేమి చేతిమీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల ఏమియు కలపబడకుండ దేవుని ఉగ్రతపాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును.” (ప్రకటన 14:9, 10ఎ) ప్రభువుదినములో క్రూరమృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయనివారు బాధింపబడతారని—చివరకు చంపబడతారని ప్రకటన 13:16, 17 నందు బయల్పర్చబడింది. ఇప్పుడు మనం నేర్చుకునేదేమంటే, యెహోవా ‘దాని ముద్రను, అనగా క్రూరమృగము పేరైనను దాని సంఖ్యయైననుగల’ వారికి తీర్పుతీర్చుటకు నిశ్చయించుకున్నాడు. వారికి యెహోవా కోపమనే చేదైన “ఉగ్రత పాత్రను” బలవంతంగా త్రాగిస్తాడు. వారికి దీని భావమేమిటి? సా.శ.పూ. 607 లో యెహోవా యెరూషలేముకు తన క్రోధపాత్రను త్రాగనిచ్చినప్పుడు, ఆ పట్టణానికి బబులోనీయుల చేతిలోనుండి “పాడు నాశనము కరవు ఖడ్గము . . ప్రాప్తించెను.” (యెషయా 51:17, 19) అదేమాదిరి, భూలోకపు రాజకీయ శక్తులను, వాటి ప్రతిమయగు ఐక్యరాజ్య సమితిని ఆరాధించేవారు యెహోవా ఉగ్రతాపాత్రను త్రాగనిచ్చినప్పుడు వారికికల్గే ఫలితం వినాశనమే. (యిర్మీయా 25:17, 32, 33) వారు పూర్తిగా నాశనం చేయబడతారు.

14. క్రూరమృగము, దాని ప్రతిమను ఆరాధించేవారు నాశనం కాకముందుకూడ వారేమి అనుభవించాలి, మరి యోహాను దీన్ని ఎలా వర్ణిస్తున్నాడు?

14 అది సంభవించకముందు కూడ, మృగముయొక్క ముద్రగలవారు యెహోవా అసమ్మతి వల్లకల్గే బాధా ఫలితాలను అనుభవించాలి. క్రూరమృగము దాని ప్రతిమను ఆరాధించే విషయాన్ని గూర్చి చెబుతూ దూత యోహానుతో యిలా చెబుతున్నాడు: “పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱెపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును. వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకుగాని నమస్కారము చేయువారును, దాని పేరుగలముద్ర ఎవడైనను వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.”—ప్రకటన 14:10బి, 11.

15, 16. ప్రకటన 14:10 లోని “అగ్నిగంధకముల” ప్రాముఖ్యతేమిటి?

15 కొందరు ఇక్కడ చెప్పబడిన అగ్నిగంధకాలు (“అగ్ని, గంధకపు కడ్డీ,” కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) నరకాగ్ని ఉన్నదనడానికి రుజువుగా తీసుకుంటారు. అయితే అటువంటి ప్రవచనాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే, యీ సందర్భంలో యీ మాటల నిజమైన ప్రాముఖ్యత తెలుస్తుంది. యెషయా కాలంలో ఎదోము జనాంగం ఇశ్రాయేలీయులకు శత్రువైనందున యెహోవా వారిని శిక్షిస్తానని హెచ్చరించాడు. ఆయనిలా అన్నాడు: “ఎదోము కాలువలు కీలగును. దాని మన్ను గంధకముగా మార్చబడును. దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్లు ఆరక యుండును. దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా నుండును. ఎన్నడును ఎవడును దానిలోబడి దాటడు.”—యెషయా 34:9, 10.

16 ఎదోము నిత్యం కాలడానికి ఏదోక కల్పిత నరకాగ్నిలో వేయబడిందా? కాదనుకోండి. అయితే, అగ్నిగంధకాలతో పూర్తిగా కాల్చి వేయబడ్డట్లే, ఆ జనాంగమంతా లోకంలో లేకుండా పూర్తిగా అదృశ్యమయ్యారు. శిక్ష చివరి ఫలితంగా వారు నిత్యం బాధించబడలేదు గానీ ‘తారుమారై . . . శూన్యమై . . . లేకుండాపోయారు.’ (యెషయా 34:11, 12) ‘నిత్యమూ లేచే పొగ’ దీన్ని స్పష్టంగా స్థిరపరుస్తుంది. ఓ యిల్లు కాలిపోయినప్పుడు మంటలారిపోయిన తర్వాతకూడ కొంతసేపు పొగవస్తూనే ఉంటుంది, అలా అది చూసేవారికి గొప్ప అగ్నిసంభవించిందని తెలుసుకోవడానికి సాక్ష్యమిస్తుంది. ఈనాడు కూడ దేవుని ప్రజలు ఎదోము నాశనంనుండి గుణపాఠం నేర్చుకోవాలని జ్ఞాపకముంచుకుంటారు. ఈ మాదిరి, సాదృశ్యమైన రీతిలో ‘కాలిన దాని పొగ’ యింకా లేస్తూనేవుంది.

17, 18. (ఎ) క్రూరమృగం యొక్క ముద్రను కల్గియున్న వారికి వచ్చేఫలితమేమిటి? (బి) క్రూరమృగమును ఆరాధించేవారు ఏ విధంగా బాధించబడతారు? (సి) ఎలా “వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును”?

17 క్రూరమృగము ముద్రను కల్గియున్నవారును అలాగే అగ్నితోనాశనము చేయబడునట్లు పూర్తిగా నాశనం చేయబడతారు. ప్రవచనం తర్వాత బయల్పరచు రీతిగా వారి శవములు పాతిపెట్టబడకుండ జంతువులు పక్షులు తినడానికై విడువబడతాయి. (ప్రకటన 19:17, 18) గనుక, వారు అక్షరార్థంగా నిరంతరం బాధించబడరనేది స్పష్టం! మరి వారెలా “అగ్నిగంధకములతో బాధింపబడుదురు”? అంటే సత్యము ప్రకటించబడడం వలన వారి రంగు బయటపడి, రాబోవు దేవుని ఉగ్రతను గూర్చి వారు హెచ్చరింప బడుతున్నారు. అందుచేత వారు దేవుని ప్రజలను అపహసిస్తూ, వీలైనంతవరకు, యెహోవాసాక్షులను హింసించడానికి, చంపడానికి సహితం, రాజకీయ క్రూరమృగాన్ని కుయుక్తిగా సమ్మతింపజేస్తున్నారు. చివరకు యీ విరోధులు అగ్నిగంధకములతో అన్నట్లు నాశనం చేయబడతారు. అప్పుడు “వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును” అంటే మరలా ఎప్పుడైనా యెహోవా సర్వాధిపత్యం సవాలు చేయబడితే అప్పుడు దేవుని తీర్పు వారికి కొలమానంగా పనిచేస్తుంది. ఆ వివాదాంశం నిరంతరం లేకుండా తీర్మానించబడియుండేది.

18 ఈనాడు బాధాసమాచారాన్ని అందించేదెవరు? జ్ఞాపకముంచుకొనండి, తమనొసళ్లమీద దేవుని ముద్రలేని మనుష్యులను బాధించే అధికారం సాదృశ్యమైన మిడతలకుంది. (ప్రకటన 9:5) స్పష్టంగా, దూతల నడిపింపు క్రిందనున్న బాధించేవారు వీరే. ఈ సాదృశ్యమైన మిడతలు ఎంతగా బాధిస్తాయంటే “ఆ క్రూరమృగమునకుగాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును, దాని పేరుగల ముద్ర ఎవడైననూ వేయించుకొనినయెడల వాడును రాత్రింబగళ్లు నెమ్మదిలేనివారై యుందురు.” చివరకు, వారి నాశనం తర్వాత “వారి బాధసంబంధమైన పొగ యుగయుగములు లేచును,” అంటే యెహోవా సర్వాధిపత్యపు హక్కు మరెప్పుడైన సవాలుచేయబడితే అదొక చెరగని సాక్ష్యంగా నిలిచిపోతుంది. ఆ నిరూపణ పూర్తయ్యేంతవరకు యోహాను తరగతి సహించునుగాక! ఆ దూత యిలా ముగిస్తున్నాడు: “దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.”—ప్రకటన 14:12.

19. పరిశుద్ధులకు ఎందుకు ఓర్పు అవసరము, వారిని బలపర్చేదాన్ని గూర్చి యోహాను ఏమని తెల్పుతున్నాడు?

19 అవును, “పరిశుద్ధుల ఓర్పు” అంటే వారు యెహోవాను యేసుక్రీస్తుద్వారా మాత్రమే ఆరాధించడమని అర్థం. వారి సమాచారం ప్రసిద్ధిచెందినది కాదు, అది వ్యతిరేకతకు, హింసకు, చివరకు హతసాక్షులు కావడానికి సహితం నడుపుతుంది. అయితే, యోహాను తదుపరి తెల్పే దాన్నిబట్టి వారు బలపర్చబడుతున్నారు: “అంతట—ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు.”—ప్రకటన 14:13.

20. (ఎ) యోహాను తెల్పిన వాగ్దానం, పౌలు యేసు ప్రత్యక్షతను గూర్చి యిచ్చిన ప్రవచనముతో ఎలా ఏకీభవిస్తుంది? (బి) సాతాను పరలోకంనుండి పడద్రోయబడిన తర్వాత చనిపోయే అభిషక్తులు ఏ విశేషాధిక్యత పొందుతారు?

20 ఈ వాగ్దానం యేసు ప్రత్యక్షతను గూర్చి పౌలు యిచ్చిన ప్రవచనానికి అనుగుణంగా వుంది: “క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము [ప్రభువు దినము వరకు బ్రతికియుండు అభిషక్తులు] వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము.” (1 థెస్సలొనీకయులు 4:15-17) సాతాను పరలోకమునుండి వెళ్లగొట్టబడిన తర్వాత క్రీస్తునందు మృతులైయుండిన వారు మొదట లేపబడ్డారు. (ప్రకటన 6:9-11 పోల్చండి.) ఆ పిదప, ప్రభువు దినములో మరణించే అభిషక్తులకు ఓ విశేషాధిక్యత వాగ్దానం చేయబడింది. పరలోకంలో ఆత్మీయ జీవంకొరకు తాముపొందే పునరుత్థానం అదేక్షణంలో, “రెప్పపాటున” జరుగుతుంది. (1 కొరింథీయులు 15:52) ఇదెంత అద్భుతమోగదా! వారి నీతిక్రియలు పరలోకంవరకు వెళ్తాయి.

భూమ్మీద పంట

21. యోహాను “భూమి పైరు”నుగూర్చి ఏమని చెబుతున్నాడు?

21 యోహాను మనకు తెల్పుతున్న రీతిగా, ఈ తీర్పు కాలంలో ఇతరులు కూడ ప్రయోజనం పొందుతారు: “మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్యకుమారుని పోలిన యొకడు ఆ మేఘముమీద ఆసీనుడైయుండెను. ఆయన శిరస్సుమీద సువర్ణకిరీటమును, చేతిలో వాడిగలకొడవలియు ఉండెను. అప్పుడు మరియొక [నాల్గవ] దూత దేవాలయములోనుండి వెడలివచ్చి—భూమి పైరుపండి యున్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలిపెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘముమీద ఆసీనుడైయున్నవానితో చెప్పెను. మేఘముమీద ఆసీనుడై యున్నవాడు తన కొడవలి భూమిమీద వేయగా భూమి పైరు కోయబడెను.—ప్రకటన 14:14-16.

22. (ఎ) సువర్ణ కిరీటం ధరించుకొని తెల్లని మేఘంమీద ఆసీనుడైయున్న వ్యక్తి ఎవరు? (బి) పంటకోత ఎప్పుడు ముగింపుకొస్తుంది, ఎలావస్తుంది?

22 తెల్లని మేఘంమీద కూర్చున్న వ్యక్తిని గుర్తించడం కష్టమేమీకాదు. తెల్లని మేఘంమీద కూర్చోవడం, మనుష్యకుమారుని పోలివుండడం, సువర్ణకిరీటం ధరించడం యివన్నీ ఆయన తప్పక యేసే అనియు, దానియేలు కూడ తన దర్శనంలో చూచిన మెస్సీయ రాజు ఈయనే యనియు నిరూపిస్తున్నాయి. (దానియేలు 7:13, 14; మార్కు 14:61, 62) అయితే, యిక్కడ ప్రవచింపబడిన పంట ఏమిటి? యేసు భూమ్మీద ఉన్నపుడు శిష్యులను చేసేపని మానవులనే పొలములో పంటను కోయడంతో పోల్చాడు. (మత్తయి 9:37, 38; యోహాను 4:35, 36) యేసు రాజుగా నియమించబడి, తన తండ్రి తరపున తీర్పుతీర్చడానికి వచ్చినప్పుడు యీ పంటకోత ముగుస్తుంది. అలా, 1914నుండి ఆయన పరిపాలన కూడ పంటను సమకూర్చే సంతోషభరిత కాలమే అవుతుంది.—ద్వితీయోపదేశకాండము 16:13-15 పోల్చండి.

23. (ఎ) కోయడం ప్రారంభించమనే మాట ఎవరినుండి వస్తుంది? (బి) ఏ సమకూర్పు పని 1919నుండి యీనాటి వరకు కొనసాగుతుంది?

23 యేసు, రాజు న్యాయాధిపతి అయినప్పటికిని, కోయడం ప్రారంభించే ముందు ఆయన తన తండ్రియైన యెహోవా మాటకొరకు వేచివుంటాడు. ఆ మాట దూతద్వారా “దేవాలయములోనుండి” వస్తుంది. వెంటనే యేసు విధేయుడౌతాడు. మొదట, 1919నుండి తనదూతలు 1,44,000 మందిని సమకూర్చే పనిని పూర్తిచేయనిస్తాడు. (మత్తయి 13:39, 43; యోహాను 15:1, 5, 16) తర్వాత, వేరేగొఱ్ఱెలకు సంబంధించిన గొప్పసమూహపు సమకూర్పుపని జరుగుతుంది. (మత్తయి 25:31-33; యోహాను 10:16; ప్రకటన 7:9) చరిత్ర చూపించేదేమంటే 1931 నుండి 1935 మధ్యలో యీ వేరేగొఱ్ఱెలకు సంబంధించిన వారనేకులు కన్పించడం ప్రారంభించారు. యెహోవా 1935 లో ప్రకటన 7:9-17 లోని గొప్పసమూహము యొక్క నిజమైన గుర్తింపును యోహాను తరగతికి బయల్పరచాడు. అప్పటినుండి, యీ సమూహాన్ని సమకూర్చే పనికి అధికప్రాముఖ్యత యివ్వబడింది. మరి 1993 సంవత్సరానికి దాని సంఖ్య 40 లక్షలు దాటిపోయింది, యింకా పెరుగుతూనేవుంది. నిశ్చయంగా, మనుష్యకుమారుని పోలినవాడు యీ అంత్యకాలంలో సమృద్ధిగాను, సంతోషభరితంగాను పంటనుకోస్తున్నాడు.—నిర్గమకాండము 23:16; 34:22 పోల్చండి.

భూమిలోని ద్రాక్షలను త్రొక్కుట

24. ఐదవదూత చేతిలో ఏమున్నది, ఆరవదూత ఏమని చెబుతున్నాడు?

24 రక్షణయనే పంటను కోయడం ముగించిన తర్వాత, మరో పంటనుకోసే కాలం వచ్చింది. యోహాను యిలా నివేదిస్తున్నాడు: “ఇంకొక [ఆరవ] దూత పరలోకమునందున్న ఆలయములోనుండి వెడలివచ్చెను; ఇతనియొద్దను వాడిగల కొడవలియుండెను. మరియొక [ఐదవ] దూత బలిపీఠమునుండి వెడలివచ్చెను; ఇతడు అగ్నిమీద అధికారము నొందినవాడు; ఇతడు వాడియైన కొడవలిగలవానిని గొప్ప స్వరముతో పిలిచి—భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు పరిపక్వమైనవి; వాడియైన నీ కొడవలిపెట్టి దాని గెలలు కోయుమని చెప్పెను.” (ప్రకటన 14:17, 18) దూతల సమూహానికి, ప్రభువుదినములో, చెడువాటినుండి మంచివాటిని వేరుచేసే గొప్పసమకూర్పు పని అప్పగింపబడింది!

25. (ఎ) ఐదవదూత దేవాలయపు ఆవరణమునుండి వస్తున్నాడనేది దేన్ని సూచిస్తుంది? (బి) కోయుము అనే మాట “బలిపీఠమునుండి” వస్తుందనుట ఎందుకు తగియున్నది?

25 ఐదవదూత యెహోవా సముఖమునుండి దేవాలయపు ఆవరణములోనుండి వస్తున్నాడు గనుక, చివరి కోతకూడ యెహోవా చిత్త ప్రకారమే జరుగుతుంది. “బలిపీఠమునుండి” వచ్చిన మరోదూత అందించిన వర్తమానాన్ని అందుకుని యీ దూత తన పనిని ప్రారంభించాలని ఆజ్ఞాపించబడ్డాడు. ఈ సత్యం అతి ప్రాముఖ్యం, ఎందుకంటే బలిపీఠం క్రిందనున్న ఆత్మలు యిలా అడిగారు: “నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు?” (ప్రకటన 6:9, 10) భూమిలోని ద్రాక్షపంట కోతతో, ప్రతీకారంకొరకు చేస్తున్న యీ విన్నపం తృప్తిపరచబడును.

26. “భూమిమీద ఉన్న ద్రాక్షాపండ్లు” ఏమిటి?

26 అయితే “భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు” ఏమిటి? హెబ్రీ లేఖనాలలో, యూదా జనాంగం యెహోవా యొక్క ద్రాక్షాతోటయని పిలువబడింది. (యెషయా 5:7; యిర్మీయా 2:21) అలాగే, యేసుక్రీస్తు, ఆయనతోపాటు దేవుని రాజ్యములో పాలించేవారు ద్రాక్షవల్లిగా పిలువబడ్డారు. (యోహాను 15:1-8) ఈ సందర్భంలో, ద్రాక్షవల్లి యొక్క ప్రాముఖ్యమైన లక్షణమేమంటే అది ఫలాలను ఫలిస్తుంది, మరి నిజమైన క్రైస్తవ ద్రాక్షావల్లి యెహోవా మహిమార్థమై సమృద్ధిగా ఫలాలను ఫలించింది. (మత్తయి 21:43) గనుక, “భూమిమీద ఉన్న ద్రాక్షపండ్లు” అంటే యీ నిజమైన ద్రాక్షపండ్లు కాదుగాని, వాటిని పోలిన సాతాను ఫలములు, అనగా శతాబ్దాలనుండి దయ్యాల ఫలితాలతో కూడిన వివిధ “గెలల”తో నిండిన, మానవజాతిని పాలించే అతని దృశ్యమైన దుష్ట ప్రభుత్వవిధానమే. భ్రష్టమైన క్త్రెస్తవత్వం ప్రసిద్ధభాగంగానున్న మహాబబులోను యీ విషపూరిత ద్రాక్షమీద గొప్పప్రభావాన్ని కల్గియుండెను.—ద్వితీయోపదేశకాండము 32:32-35 పోల్చండి.

27. (ఎ) దూత తన కొడవలితో భూమిమీద ఉన్న ద్రాక్షను కోసినప్పుడు ఏమి జరుగుతుంది? (బి) హెబ్రీలేఖనాలలోని ఏ ప్రవచనాలు కోత విస్తారతను గూర్చి తెల్పుతున్నాయి?

27 తీర్పుజరిగి తీరాల్సిందే! “కాగా ఆ దూత తన కొడవలి భూమిమీద వేసి భూమిమీదనున్న ద్రాక్షపండ్లను కోసి, దేవునికోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను ఆ ద్రాక్షలతొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను; నూరు కోసుల దూరము గుఱ్ఱముల కళ్లెముమట్టుకు ద్రాక్షల తొట్టిలోనుండి రక్తము ప్రవహించెను.” (ప్రకటన 14:19, 20) ఈ ద్రాక్షలమీద యెహోవా తన కోపాన్ని అనాదినుండే ప్రకటిస్తూ వచ్చాడు. (జెఫన్యా 3:8) ద్రాక్షలతొట్టి త్రొక్కబడినప్పుడు జనాంగాలన్నీ నాశనమౌతాయనడానికి సందేహమేమీ లేదని యెషయా గ్రంథంలోని ప్రవచనం తెల్పుతుంది. (యెషయా 63:3-6) యోవేలు కూడ జనులందరు పెద్ద “గుంపులుగా” “తీర్పుతీర్చు లోయలో” సమకూడగా ద్రాక్షతొట్టిలో వేసి త్రొక్కబడతారని ప్రవచించాడు. (యోవేలు 3:12-14) నిజంగా, మరల ఎన్నడును జరుగని పెద్దకోత కోయబడుతుంది! యోహాను దర్శనం ప్రకారం, ద్రాక్షపండ్లను సమకూర్చడమే గాకుండ, సాదృశ్యమైన ద్రాక్షాలన్నీ కోయబడి త్రొక్కడానికి తొట్టిలో వేయబడతాయి. గనుక భూమిమీదనున్న ద్రాక్షలు మరల ఎన్నడూ పెరగకుండ త్రొక్కబడుతాయి.

28. భూమిమీద ఉన్న ద్రాక్షను త్రొక్కే దెవరు, ద్రాక్షతొట్టి “పట్టణము వెలుపట త్రొక్కబడెను” అంటే అర్థమేమిటి?

28 దర్శనంలో దాన్ని గుఱ్ఱాలు త్రొక్కుతున్నట్లుంది ఎందుకంటె ద్రాక్షలను త్రొక్కినప్పుడు వచ్చిన రక్తం “గుఱ్ఱముల కళ్లెము మట్టుకు” ప్రవహించెను. “గుఱ్ఱములు” అనే పదం సాధారణంగా యుద్ధానికి సంబంధించి వాడబడుతున్నందున ఇది యుద్ధసమయమే అయివుండొచ్చు. సాతాను విధానానికి వ్యతిరేకంగా అంతిమ యుద్ధానికి యేసు వెంట బయలుదేరే పరలోక సైన్యాలు “సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును” అని చెప్పబడింది. (ప్రకటన 19:11-16) స్పష్టంగా యివే భూమిమీద ద్రాక్షలను త్రొక్కుతాయి. ద్రాక్షతొట్టి “పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను” అంటే పరలోక యెరూషలేము వెలుపల అని అర్థం. నిజానికి యిది యుక్తమే, భూమ్మీద ద్రాక్షలు భూమ్మీదే త్రొక్కబడాలి. అయితే అది “పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను” అంటే భూమ్మీద పరలోక యెరూషలేముకు ప్రతినిధులైన ఆ స్త్రీ సంతానములో శేషించినవారికి ఏ హాని కలుగదన్నమాట. గొప్పసమూహముతోపాటు వీరు యెహోవా యొక్క భూసంబంధమైన సంస్థాపరమైన ఏర్పాటుమూలంగా భద్రంగా దాచబడతారు.—యెషయా 26:20, 21.

29. ద్రాక్షతొట్టినుండి వచ్చే రక్తం ఎంతలోతుగా ఉంటుంది, అదెంతదూరం ప్రవహిస్తుంది, ఇదంతా దేన్ని సూచిస్తుంది?

29 భూమ్మీదనున్న రాజ్యాలను నలుగగొట్టడంలో ఈ స్పష్టమైన దర్శనానికి, దానియేలు 2:34, 44 లో వర్ణించబడిన రాజ్యసంబంధమైన రాయికి సమాంతరమున్నది. అక్కడ సమూల నాశనమే జరుగుతుంది. ద్రాక్షతొట్టిలోని రక్తపుటేరు చాలా లోతైంది, అది గుఱ్ఱాల కళ్లెము వరకున్నది, మరియు అది 1,600 ఫర్లాంగుల దూరం పారుతోంది. * ఈ పెద్ద సంఖ్య, నాలుగును నాలుగుతో గుణించి, వచ్చినదాన్ని పదితో రెండుసార్లు గుణిస్తేవచ్చే సంఖ్య, (4 x 4 x 10 x 10) నాశనం భూదిగంతాలవరకు ఉంటుందనే విషయాన్ని నొక్కిచెబుతోంది. (యెషయా 66:15, 16) ఆ నాశనం సంపూర్తిగా, తిరుగులేనిదిగా ఉంటుంది. ఇక ఎన్నటెన్నటికీ సాతాను యొక్క భూసంబంధమైన ద్రాక్ష మొలకెత్తదు!—కీర్తన 83:17, 18.

30. సాతానుకు సంబంధించిన ద్రాక్షాపండ్లు ఏవి, మన దృఢనిశ్చయ మేమైవుండాలి?

30 ఈ అంత్యకాలపు చివరిబాగంలో జీవిస్తున్న మనకు యీ రెండు కోతలను గూర్చిన దర్శనం ఎంతో ప్రాముఖ్యం. సాతానుకు సంబంధించిన ద్రాక్షాపండ్లు మనచుట్టూ వున్నదేమో మనం చూసుకోవాలి. గర్భస్రావములు, ఇతరరకాల హత్యలు; సలింగ సంయోగం, జారత్వం, మరియు ఇతర రకాల అవినీతి; మోసం, సహజ అనురాగం కొరవడటం మొదలైనవన్నీ, యీలోకాన్ని యెహోవా దృష్టికి చెడుగా చేస్తున్నాయి. సాతాను యొక్క ద్రాక్ష ‘విషపూరితమైన మొక్కను, మాచిపత్రిని’ ఫలిస్తుంది. అది నాశనకరమైన, విగ్రహారాధనకు సంబంధించినదై మానవజాతి మహాసృష్టికర్తను కించపరచే క్రియయైయున్నది. (ద్వితీయోపదేశకాండము 29:18; 32:5; యెషయా 42:5, 8) యెహోవా ఘనతనిమిత్తం యేసు కోసితెచ్చే మంచిపంటలో యోహాను తరగతితోపాటు చురుకుగా సహవసించడం ఎంతటి ఆధిక్యతోగదా! (లూకా 10:2) మనమెప్పుడూ యీలోక ద్రాక్షలవలన ఎన్నటికీ మలినం కాకుండా వుండడానికి నిశ్చయించుకుందాం, మరియు యెహోవా ప్రతికూల తీర్పుజరిగినప్పుడు భూమ్మీది ద్రాక్షతోపాటు త్రొక్కబడకుండ తప్పించుకుందాము.

[అధస్సూచీలు]

^ పేరా 29 1,600 ఫర్లాంగులంటే సుమారు 300 కిలోమీటర్లు, లేక ఇంగ్లీష్‌ లెక్కలో 180 మైళ్లు.—ప్రకటన 14:20, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి.

[అధ్యయన ప్రశ్నలు]

[208వ పేజీలోని బాక్సు]

దాని వ్యభిచార మద్యం’

మహాబబులోను యొక్క ఒక ప్రాముఖ్యమైన భాగం రోమన్‌ కాథోలిక్‌ చర్చి. ఆ చర్చిని రోములోనున్న పోపు నడిపిస్తూవుంటాడు, ఆయన అపొస్తలుడైన పేతురు వారసుడని అంటారు. ఈ వారసులని పిలువబడే వారిని గూర్చి ప్రచురితమైన వాస్తవాలు కొన్ని యీ క్రింద ఉన్నాయి:

ఫోర్‌మోసస్‌ (891-96): “ఫోర్‌మోసస్‌ మరణించిన తొమ్మిది నెలల తర్వాత పోపుల రహస్య స్థలంలో పాతిపెట్టిన శవాన్ని త్రవ్వి వెలికితీసి, ‘శవపంచనామా’ సభ ఎదుట నేరస్థాపనా తీర్పుకు తెచ్చిపెట్టారు, దానికి స్టీఫెన్‌ [నూతన పోప్‌] అధ్యక్షత వహించాడు. చనిపోయిన పోపు, అక్రమంగా పోపుస్థానాన్ని సంపాదించాలనే పేరాశ కల్గియున్నాడని నేరంమోపి, ఆయన చేసిన పనులన్నీ చెల్లవని ప్రకటించారు . . . శవానికున్న పోపుఅధికారిక వస్త్రాలన్నింటిని తొలగించారు; కుడిచేయి వ్రేళ్లను నరికివేశారు.”—న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లొపీడియా.

స్టీఫెన్‌ VI (896-97): “[ఫోర్‌మోసస్‌ శవపంచనామా జరిగిన] కొన్ని నెలల్లోనే దౌర్జన్యపూరిత ప్రతిఘటన మూలంగా పోపు స్టీఫెన్‌ స్థానం పోయింది; ఆయనకున్న బిరుదులను తీసివేసి జైల్లోవేశారు, పీకనులిమి చంపారు.”—న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లొపీడియా.

సెర్గియస్‌ III (904-11): “తనకుముందున్న యిద్దరూ . . . జైల్లోనే పీకనులిమి చంపబడ్డారు . . . రోములో ఆయనకు థియోఫిలాక్టస్‌ కుటుంబం మద్దతునిచ్చింది, వారి కుమార్తెల్లో ఒకరైన మారోజియాద్వారా ఆయన ఒక కుమారుని కన్నాడు. (ఆ కుమారుడే పోప్‌ జాన్‌ XI అయ్యాడు).”—న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లొపీడియా.

స్టీఫెన్‌ VII (928-31) “పోప్‌ జాన్‌ X పోపుగానున్న తన చివరి సంవత్సరాలలో . . . రోము యొక్క ది డోన్నా సెనాట్రిక్స్‌, అయిన మారోజియా ఆగ్రహానికి గురై, జైల్లోవేయబడి హత్యచేయబడ్డాడు. తర్వాత మారోజియా పోపు అధికారపీఠాన్ని పోప్‌ లియో VI, కు అంటగట్టింది, ఆయన 6 1⁄2 నెలలు అధికారములోవుండి చనిపోయాడు. ఆయన స్థానంలో స్టీఫెన్‌ VII వచ్చాడు, బహుశ మారోజియా ప్రాబల్యంవల్లనే వచ్చివుంటాడు, . . . తాను పోపుగా ఉన్న 2 సంవత్సరాలలో, మారోజియా పైచేయి మూలంగా అతడు అధికారహీనునిగానే ఉన్నాడు.”—న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లొపీడియా.

జాన్‌ XI (931-35): “స్టీఫెన్‌ VII మరణానంతరం . . . మారోజియా, అంటే థియోఫిలాక్టస్‌ కుటుంబీకురాలు, అప్పుడే 20 ఏండ్లుదాటిన తన కుమారుడు జాన్‌కు పోపు అధికారాన్ని సంపాదించింది . . . జాన్‌ పోపుగా ఉన్నప్పుడు తల్లిదే పైచేయిగా ఉండేది.”—న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లొపీడియా.

జాన్‌ XII (955-64): “అతనికి 18 ఏండ్లుకూడ సరిగ్గారాలేదు, ఆత్మీయ విషయాల్లో ఆసక్తిలేనట్లు సమకాలిక నివేదికలు తెల్పుతున్నాయి, మొరటు సరసాలకు బానిసై, అదుపులేని దుర్‌వ్యసనాలతోకూడిన జీవితానికి అలవాటుపడ్డాడు.”—ది ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఆఫ్‌ ది పోప్స్‌.

బెనడిక్టి IX (1032-44; 1045; 1047-48): “తన జ్ఞానపితకు పోపు స్థానాన్ని అమ్మిన ప్రభుద్ధుడు, అలా తర్వాత ఆ స్థానాన్ని రెండుసార్లు తిరిగి పొందుతాడు.”—ది న్యూ ఎన్‌సైక్లొపీడియా బ్రిటానికా.

ఆ విధంగా, నమ్మకమైన పేతురు ననుసరించేబదులు, వీరు యింకా యితర పోపులు చెడు ప్రభావం చూపారు. వారు తాము పరిపాలించిన చర్చీని పాడుచేయడానికి రక్తాపరాధాన్ని, ఆత్మీయ, భౌతిక వ్యభిచారాన్ని మరియు యెజెబెలు ప్రభావాన్ని అనుమతించారు. (యాకోబు 4:4) వీటిలో అనేక వాస్తవాలు 1917 లో వాచ్‌టవర్‌ సొసైటీ ప్రచురించిన ది ఫినిష్డ్‌ మిస్ట్రీ అనే పుస్తకంలో క్షుణ్ణంగా వివరించబడ్డాయి. ఆ దినాలలో బైబిలు విద్యార్థులు ‘భూమిని నానావిధములైన తెగుళ్లతో బాధించిన’ విధానాలలో యిదొకటి.—ప్రకటన 11:6; 14:8; 17:1, 2, 5.

[206వ పేజీలోని చిత్రం]

సింహాసనాసీనుడైన క్రీస్తు దూతల మద్దతుతో తీర్పుతీరుస్తాడు

[207వ పేజీలోని చిత్రం]

బబులోను సా.శ.పూ 539 లో కూలిపోయిన తర్వాత అందులోని బందీలు విడుదల పొందారు