కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా క్రియలు—ఘనమైనవి, ఆశ్చర్యమైనవి

యెహోవా క్రియలు—ఘనమైనవి, ఆశ్చర్యమైనవి

అధ్యాయం 31

యెహోవా క్రియలు—ఘనమైనవి, ఆశ్చర్యమైనవి

దర్శనము 10—ప్రకటన 15:1–16:21

అంశం: యెహోవా తన ఆలయంలో ఉంటాడు; ఆయన కోపముతోనిండిన ఏడు పాత్రలు భూమ్మీద కుమ్మరించబడతాయి

నెరవేర్పు కాలం: 1919 నుండి అర్మగిద్దోనువరకు

1, 2. (ఎ) యోహాను ఏ మూడవ సూచనను తెల్పుతున్నాడు? (బి) దేవదూతలు నిర్వహించే ఏ పాత్రనుగూర్చి యెహోవా సేవకులకు దీర్ఘకాలంగా తెలుసు?

ఓ స్త్రీ మగశిశువును ప్రసవించడం! ఓ ఘటసర్పం ఆ శిశువును మ్రింగాలని ప్రయత్నించడం! ప్రకటన 12వ అధ్యాయంలో ఎంతో వివరంగా వర్ణించబడిన ఆ రెండు పరలోక సూచనలు, దేవుని స్త్రీ సంతానమునకు సాతాను అతని దయ్యముల సంతానమునకు మధ్య దీర్ఘకాలంగావున్న వివాదాంశం అంతిమదశకు చేరుకుంటుందని మనకు తెల్పాయి. ఈ సూచనార్థకములను ఉన్నతపరుస్తూ, యోహాను యిలా అంటున్నాడు: “అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను . . . ఇంకొక సూచన కనబడెను.” (ప్రకటన 12:1, 3, 7-12) ఇప్పుడు యోహాను మూడవ సూచన గూర్చి తెల్పుతున్నాడు: “మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేతపట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.” (ప్రకటన 15:1) ఈ మూడవ సూచనకూడ యెహోవా సేవకులకు ప్రాముఖ్యమైన భావాన్ని కల్గివుంది.

2 దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మరల దూతలు నిర్వహించే ప్రాముఖ్యమైన పాత్రను గూర్చి గమనించండి. యెహోవా సేవకులకు దీర్ఘకాలం నుండే యీ సత్యం తెలుసు. ఇంతెందుకు, కీర్తనల రచయిత ప్రేరేపితుడై, అటువంటి దూతలతో మాట్లాడుతూ వారికిలా విన్నవించాడు: “యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.” (కీర్తన 103:20) ఇప్పుడు, యీ క్రొత్త దృశ్యంలో, దూతలు చివరి యేడు తెగుళ్లు కుమ్మరించడానికి నియమించబడ్డారు.

3. ఏడు తెగుళ్లు ఏమైయున్నవి, వాటిని కుమ్మరించడం దేన్ని సూచిస్తుంది?

3 ఈ తెగుళ్లు ఏమైవున్నాయి? ఏడు బూరల శబ్దాలవలెనే, అవి యీ లోకంయొక్క వివిధ విషయాలపై యెహోవా అభిప్రాయాన్ని ప్రచురము చేసే బాధాకరమైన తీర్పు ప్రకటనలు మరియు ఆయన న్యాయనిర్ణయాల తుదిఫలితం యొక్క హెచ్చరికయై యున్నది. (ప్రకటన 8:1–9:21) వాటిని కుమ్మరించడమనేది, యెహోవా కోపాగ్ని దినమున ఆయన ఉగ్రతకు గురైనవి నాశనమైనప్పుడు అమలుపర్చబడే ఆ తీర్పులను సూచిస్తుంది. (యెషయా 13:9-13; ప్రకటన 6:16, 17) అలా, వాటిమూలంగా “దేవుని కోపము సమాప్తమగును.” అయితే, ఆ తెగుళ్లు కుమ్మరించబడే విషయాన్ని వివరించక ముందు, వాటివలన ప్రతికూలతా ప్రభావాన్ని పొందకుండ వుండే కొందరిని గూర్చి యోహాను మనకు తెల్పుతున్నాడు. క్రూరమృగముయొక్క ముద్రను తిరస్కరించిన యీ యథార్థపరులు ఆయన ప్రతిదండనను గూర్చి ప్రకటిస్తూ యెహోవాకు స్తుతికీర్తనలు పాడుతారు.—ప్రకటన 13:15-17.

మోషే కీర్తన, గొఱ్ఱెపిల్ల కీర్తన

4. ఇప్పుడు యోహాను ఏమి చూస్తున్నాడు?

4 ఓ ప్రాముఖ్యమైన దృశ్యమిప్పుడు యోహానుకు కనబడుతోంది: “మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.”—ప్రకటన 15:2.

5. “అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము” దేన్ని సూచిస్తుంది?

5 ఆ “స్ఫటికపు సముద్రము” యోహాను అంతకుముందు దేవుని సింహాసనము యెదుట చూచినటువంటిదే. (ప్రకటన 4:6) అది సొలొమోను మందిరంలో యాజకులు తమనుతాము శుభ్రంగా కడుక్కోవడానికి అవసరమైన నీళ్లుండే “పోతపోసిన సముద్రము” (నీళ్లతొట్టి) వంటిది. (1 రాజులు 7:23) ఆ విధంగా అది యేసు అభిషక్త క్రైస్తవులైన యాజక సంఘాన్ని “ఉదకస్నానము” చేయించేందుకు అంటే దేవుని వాక్యంద్వారా పవిత్రపరచడానికి అది శ్రేష్ఠమైన సూచనయై యున్నది. (ఎఫెసీయులు 5:25, 26; హెబ్రీయులు 10:22) ఈ స్ఫటికపు సముద్రము అగ్నితో మిళితమైవుంటే, యీ అభిషక్తులు వారికొరకు ఏర్పాటుచేయబడిన ఉన్నత నియమానికి విధేయులౌతుండగా వారు పరీక్షింపబడి, అగ్నితోపుటము వేయబడతారని సూచిస్తుంది. అదియునుగాక, దేవుని వాక్యము ఆయన విరోధులనుగూర్చిన ప్రతికూలమగు తీక్షణమైన తీర్పులనుకూడ కల్గియున్నదని మనకు జ్ఞాపకం చేస్తుంది. (ద్వితీయోపదేశకాండము 9:3; జెఫన్యా 3:8) వీటిలో కొన్ని తీక్షణమైన తీర్పులు ఇక కుమ్మరింప బడనైయున్న చివరి ఏడు తెగుళ్లలో బయల్పర్చబడ్డాయి.

6. (ఎ) పరలోకపు స్ఫటికపు సముద్రము యెదుట నిల్చున్న గాయకులెవరు? (బి) ఏ విధంగా వారు “జయించినవారు”?

6 సొలొమోను మందిరములోని పోతపోసిన సముద్రము యాజకుల నిమిత్తమున్నదనే వాస్తవం, పరలోక స్ఫటికపు సముద్రము యెదుట నిల్చున్నవారు యాజకతరగతి వారని తెల్పుతుంది. వారు “దేవుని వీణెలు గలవారై” ఉన్నారు, అందుకే మనం వారిని 24 మంది పెద్దలతోను 1,44,000 మందితోను జతచేస్తున్నాము, ఎందుకంటే యీ గుంపులు కూడ వీణెలతో పాడుతున్నారు. (ప్రకటన 5:8; 14:2) యోహాను చూస్తున్న గాయకులు “ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు.” గనుక వారు అంత్యదినాల్లో భూమ్మీద జీవిస్తున్న 1,44,000 మందిలోని సభ్యులైవుంటారు. ఒక గుంపుగా వారు నిజంగానే జయించివుంటారు. వారు 1919నుండి, 70 సంవత్సరాలుగా, క్రూరమృగము ముద్రను తిరస్కరించారు, దాని ప్రతిమయే శాంతికొరకు మానవుని ఏకైక నిరీక్షణయంటూ దానివైపుచూడలేదు. వారిలో అనేకులు యిప్పటికే మరణంవరకు సహించారు, మరియు వీరు యిప్పుడు పరలోకమందుంటూ, యింకనూ భూమ్మీదనున్న వారి సహోదరుల పాటను నిశ్చయంగా ఆనందంతో అనుసరిస్తున్నారు.—ప్రకటన 14:11-13.

7. ప్రాచీన ఇశ్రాయేలీయులలో వీణె ఎలా ఉపయోగించబడింది, యోహాను దర్శనములోని దేవుని వీణెలు మనపై ఎటువంటి ప్రభావాన్ని కల్గివున్నాయి?

7 ఈ యథార్థపరులైన విజయులకు దేవుని వీణెలున్నాయి. ఈ విషయంలో వారు, దేవాలయంలో యెహోవాకు వీణెలతో కీర్తనలు పాడిన ప్రాచీన లేవీయులను పోలియున్నారు. (1 దినవృత్తాంతములు 15:16; 25:1-3) వీణె తీగల మధురస్వరం ఇశ్రాయేలీయుల ఆనందగానములకు యెహోవాకు చెల్లించే కృతజ్ఞతా స్తుతి ప్రార్థనలకు అందాన్ని చేకూర్చింది. (1 దినవృత్తాంతములు 13:8; కీర్తన 33:2; 43:4; 57:7, 8) విషాదసమయంలో లేక చెరగా కొనిపోబడినప్పుడు వీణస్వరం వినబడేదికాదు. (కీర్తన 137:2) ఈ దర్శనంలో వీణెలు కనబడడం, మన దేవునికి ఉత్సాహపు, విజయోత్సాహపు కృతజ్ఞతా స్తుతిగీతాన్ని పాడుతారనే మననిరీక్షణను బలపరచాలి. *

8. ఏ కీర్తన పాడుతున్నారు, అందలి మాటలు ఏమిటి?

8 యోహాను అదే విషయాన్ని తెల్పుతున్నాడు: “వారు—ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.”—ప్రకటన 15:3, 4.

9. అందులోని ఒక భాగం ఎందుకు “మోషే కీర్తన” అని పిలువబడింది?

9 ఈ విజయులు “మోషే కీర్తన” పాడుతున్నారు, అంటే అటువంటి పరిస్థితులలో మోషే పాడిన పాటవంటిదే పాడుతున్నారని అర్థం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో పదితెగుళ్లను, చూసిన తర్వాత ఎర్రసముద్రములో ఐగుప్తీయుల సైన్యము నాశనం కావడం చూసిన తర్వాత, యెహోవాకు విజయోత్సవంతో స్తుతి కీర్తన పాడుతూ మోషే వారిని నడిపించాడు, ఆయనిలా ప్రకటించాడు: “యెహోవా నిరంతరము ఏలువాడు.” (నిర్గమకాండము 15:1-19) యోహాను దర్శనములోని గాయకులు, క్రూరమృగమును జయించి, ఏడు ఆఖరి తెగుళ్లను ప్రకటించడంలో పాల్గొంటున్న వీరుకూడ “యుగములో రాజైయుండిన” వానికి కీర్తన పాడటం ఎంతయుక్తంగా ఉన్నదోగదా!—1 తిమోతి 1:17.

10. మోషే ఏ యితర కీర్తనను కూడ రచించాడు, అందులోని ఆఖరి చరణం ఎలా గొప్ప సమూహానికి సంబంధం కల్గివుంది?

10 కనానును గెలవడానికి సిద్ధపడుచుండగా రచించిన మరో కీర్తనలో, వృద్ధుడైన మోషే ఆ జనాంగంతో యిలా అన్నాడు: “నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.” ఈ కీర్తనయొక్క చివరి చరణం ఇశ్రాయేలీయులు కాని వారినికూడ ప్రోత్సహించింది, మరి మోషే ప్రేరేపిత మాటలు యినాటి గొప్పసమూహము యొక్క హృదయాలలోనికి చేరుతున్నాయి: “జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి.” మరైతే వారెందుకు ఆనందించాలి? ఎందుకంటే యెహోవా, “హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును. తన విరోధులకు ప్రతీకారము చేయును.” ఈ నీతితీర్పు జరిగించడంవల్ల యెహోవా యందు నిరీక్షించే వారందరు ఉల్లసిస్తారు.—ద్వితీయోపదేశకాండము 32:3, 43; రోమీయులు 15:10-13; ప్రకటన 7:9.

11. యోహాను వినిన కీర్తన ఎలా యింకనూ నెరవేర్పును కల్గివుంటూనేవుంది?

11 మోషే తానే యిప్పుడు ప్రభువు దినములో వుండి, పరలోక సైన్యంతో కలిసిపాడడానికి ఎంత ఆనందించి ఉండేవాడో: “జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు.” ఆ సర్వోత్కృష్టమైన కీర్తన, దర్శనరూపంలో కాకుండ, “జనముల”నుండి లక్షలాదిగా యెహోవా భూసంస్థలోనికి యిప్పుడు గుంపులుగా వస్తూవుండడం మనం వాస్తవంగానే చూస్తున్నట్లు, యీనాటివరకు అద్భుతమైన నెరవేర్పును కల్గివుంది.

12. జయించినవారి కీర్తన ఎందుకు “గొఱ్ఱెపిల్ల కీర్తన”యని కూడ పిలువబడింది?

12 అయిననూ, యిది మోషే కీర్తనయే కాకుండ “గొఱ్ఱెపిల్ల కీర్తన” కూడ. అదెలాగు? మోషే ఇశ్రాయేలీయులకు దేవుని ప్రవక్త, అయితే తనవంటి ఒక ప్రవక్తను యెహోవా పుట్టిస్తాడని మోషే స్వయంగా ప్రవచించాడు. ఈయనే గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు. మోషే “దేవుని దాసుడు” అయితే, యేసు దేవుని కుమారుడు, అంటే మోషేకంటె గొప్పవాడు. (ద్వితీయోపదేశకాండము 18:15-19; అపొస్తలుల కార్యములు 3:22, 23; హెబ్రీయులు 3:5, 6) కావున, గాయకులు “గొఱ్ఱెపిల్ల కీర్తనయు” పాడుచున్నారు.

13. (ఎ) యేసు, మోషేకంటె గొప్పవాడైనప్పటికీ, ఎందుకు ఆయనవంటి వాడయ్యాడు? (బి) మనమెలా గాయకులతో కలువవచ్చు?

13 మోషేవలెనే, యేసు దేవునికి బహిరంగంగా స్తుతులు చెల్లించి, శత్రువులపై ఆయన విజయాలను గూర్చి ప్రవచించాడు. (మత్తయి 24:21, 22; 26:30; లూకా 19:41-44) జనములు వచ్చి యెహోవాను స్తుతించే సమయం కొరకు యేసుకూడ ఎదురుచూశాడు, మరియు దీనిని సాధ్యపరచడానికి తాను స్వయంత్యాగియైన “గొఱ్ఱెపిల్ల”గా తన మానవప్రాణాన్ని అర్పించాడు. (యోహాను 1:29; ప్రకటన 7:9; మరియు యెషయా 2:2-4; జెకర్యా 8:23 పోల్చండి.) మోషే యెహోవా నామాన్ని అభినందించి, ఘనపర్చినట్లే, యేసు దేవుని నామాన్ని బయల్పర్చాడు. (నిర్గమకాండము 6:2, 3; కీర్తన 90:1, 17; యోహాను 17:6) యెహోవా యథార్థవంతుడు గనుక ఆయన మహిమగల వాగ్దానాలు నిశ్చయంగా నెరవేరుతాయి. గనుక, మనం మోషే, గొఱ్ఱెపిల్ల అనే యీ యథార్థ గాయకులతో కలిసి కీర్తనలో వంతపాడడానికి ఏకమౌదాము: “ప్రభువా, (యెహోవా NW) . . . నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు?”

పాత్రలతో దూతలు

14. ఆలయములోనుండి ఎవరు వెలుపలికి రావడం యోహాను చూస్తున్నాడు, వారికేమి ఇవ్వబడింది?

14 ఈ అభిషక్తులైన విజయుల కీర్తనను మనం వినడం యుక్తమే. ఎందుకు? ఎందుకంటే వారు దేవుని కోపముతో నిండిన పాత్రలలోని తీర్పులను భూమ్మీద ప్రచురించారు. అయితే యోహాను తెలియజేస్తున్న రీతిగా, యీ పాత్రలలోనుండి కుమ్మరించడంలో మానవమాత్రులేగాక యితరులుకూడ భాగం వహించారు: “అటుతరువాత నేను చూడగా, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఏడు తెగుళ్లు చేత పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు, నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని, రొమ్ములమీద బంగారు దట్టీలు కట్టుకొనినవారై ఆ ఆలయములోనుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను ఆ యేడుగురు దూతలకిచ్చెను.”—ప్రకటన 15:5-7.

15. ఆ ఏడుగురు దూతలు ఆలయంలోనుండి రావడం ఎందుకు ఆశ్చర్యంకాదు?

15 పరలోక వస్తువులను సూచించేవాటిని కల్గియున్న ఇశ్రాయేలీయుల దేవాలయం విషయంలోనైతే, ఇక్కడ “ఆలయము” అని పిలువబడిన అతిపరిశుద్ధ స్థలంలోనికి ప్రధానయాజకుడు మాత్రమే ప్రవేశించగలడు. (హెబ్రీయులు 9:3, 7) అది పరలోకమందలి యెహోవా ప్రత్యక్షతా స్థలాన్ని సూచిస్తుంది. అయిననూ, పరలోకమందు ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు మాత్రమేగాక దేవదూతలు కూడ యెహోవా సముఖమున ప్రవేశించే ఆధిక్యతను కల్గివున్నారు. (మత్తయి 18:10; హెబ్రీయులు 9:24-26) గనుక, ఏడుగురు దూతలు పరలోకమందలి ఆలయములోనుండి వస్తున్నట్లు చూడడంలో ఆశ్చర్యమేమీలేదు. యెహోవా దేవుడే వారికి ఓ పని అప్పగించాడు: దేవుని కోపముతో నిండిన పాత్రలను కుమ్మరించడము.—ప్రకటన 16:1.

16. (ఎ) దూతలు కూడ ఆ పనికి అర్హులని ఏది చూపిస్తుంది? (బి) సాదృశ్యమైన పాత్రలను కుమ్మరించే ఆ గొప్ప పనిలో ఇతరులును యిమిడివున్నారని ఏది తెల్పుతుంది?

16 ఈ దూతలు యీ పని చేయడానికి మంచి నిపుణులు. వారు నిర్మలమైన, తెల్లని నారబట్టలు ధరించుకున్నారంటే యెహోవా దృష్టిలో వారు ఆత్మీయంగా నిర్మలులును, పరిశుద్ధులును, నీతిమంతులునై యున్నారని చూపిస్తుంది. వారు బంగారు దట్టీలుకూడ కట్టుకున్నారు. ఒక పని చేయబోయే ముందు ఒక వ్యక్తి దట్టీకట్టుకుంటాడు గనుక అప్పుడే దట్టీలను సాధారణంగా ఉపయోగిస్తారు. (లేవీయకాండము 8:7, 13; 1 సమూయేలు 2:18; లూకా 12:37; యోహాను 13:4, 5) గనుక ఓ పనిని నెరవేర్చడానికి దూతలు దట్టీలు ధరించారు. అంతేగాక, వారి దట్టీలు బంగారువి. ప్రాచీనకాలంలో గుడారమందు దైవసంబంధమైన, పరలోకవస్తువులను సూచించడానికి బంగారం ఉపయోగించబడేది. (హెబ్రీయులు 9:4, 11, 12) అంటే యీ దూతలకు చేయడానికి వారికి ప్రశస్తమైన దైవసేవాజ్ఞ ఉన్నదని అర్థం. ఈ గొప్ప పనిలో యితరులు కూడ యిమిడివున్నారు. ఆ నాలుగు జీవులలో ఒకరు వారికి అసలు పాత్రలను అందిస్తున్నారు. నిశ్చయంగా, ఇది జీవులలో మొదటిది, సింహమును పోలినది, యెహోవా తీర్పులను ప్రకటించడానికి ధైర్యము, నిబ్బరము అవసరమని సూచిస్తుంది.—ప్రకటన 4:7.

యెహోవా తన ఆలయంలో ఉండుట

17. యోహాను ఆలయమును గూర్చి మనకేమి చెబుతున్నాడు, అదెలా మనకు ప్రాచీన ఇశ్రాయేలీయుల ఆలయాన్ని జ్ఞాపకం చేస్తుంది?

17 చివరగా, ఈ దర్శనాన్ని ముగిస్తూ యోహాను మనకిలా చెబుతున్నాడు: “అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.” (ప్రకటన 15:8) ఇశ్రాయేలీయుల చరిత్రలో నిజమైన ఆలయము మేఘముతో నింపబడిన సందర్భాలున్నాయి, యిలా యెహోవా మహిమ ప్రత్యక్షమైనందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. (1 రాజులు 8:10, 11; 2 దినవృత్తాంతములు 5:13, 14; మరియు యెషయా 6:4, 5 పోల్చండి.) ఇలాంటి సందర్భాలలోనే యెహోవా భూమ్మీద జరిగే సంఘటనలలో ఆసక్తితో పాల్గొన్నాడు.

18. దూతలు ఎప్పుడు తిరిగివెళ్లి యెహోవాకు తమ నివేదికను సమర్పిస్తారు?

18 ఇప్పుడు భూమ్మీద జరిగే సంఘటనలలో కూడ యెహోవా చాలా ఆసక్తి కల్గియున్నాడు. ఏడుగురు దూతలు వారికప్పగించబడిన పనిని సంపూర్తిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కీర్తన 11:4-6 నందు వర్ణించబడినట్లు, అది తీర్పుకు ముగింపు సమయం: “యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు. తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులును బలత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు, దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును. అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.” దుష్టులపై యీ యేడు తెగుళ్లు కుమ్మరించేంత వరకు, ఆ యేడుగురు దూతలు యెహోవా మహోన్నత సముఖానికి ప్రవేశించరు.

19. (ఎ) ఏ ఆజ్ఞ యివ్వబడింది, ఎవరిద్వారా? (బి) సాదృశ్యమైన పాత్రలలోనిది కుమ్మరించడం ఎప్పుడు ఆరంభమైంది?

19 ఆ గంభీరమైన ఆజ్ఞ బయలు వెళ్తోంది: “మరియు—మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.” (ప్రకటన 16:1) ఎవరీ ఆజ్ఞను జారీ చేస్తున్నది? స్వయంగా యెహోవాయే అయివుంటాడు, ఎందుకంటే, ఆయన మహిమ, శక్తికున్న ప్రభావము ఆలయములోనికి ఎవ్వరూ ప్రవేశింపకుండా అడ్డుకున్నది. యెహోవా తీర్పుకై తన ఆత్మీయ మందిరంలోనికి 1918 లో వచ్చాడు. (మలాకీ 3:1-5) గనుక, ఆ తర్వాతే ఆయన దేవుని కోపముతో నిండిన పాత్రలను కుమ్మరించుడని ఆజ్ఞాపించివుంటాడు. నిజానికి, 1922నుండి సాదృశ్యమైన పాత్రలలోని తీర్పులు తీవ్రతరంగా ప్రకటించ నారంభించబడ్డాయి. మరి వాటి ప్రచార హోరు యినాడు తారస్థాయికి చేరుతోంది.

పాత్రలు, బూరల శబ్దాలు

20. యెహోవా కోపముతోనిండిన పాత్రలు దేనిని బయల్పరుస్తున్నాయి, హెచ్చరిస్తున్నాయి, అవెలా కుమ్మరింపబడుతున్నాయి?

20 యెహోవా కోపముతోనిండిన పాత్రలు, యెహోవా లోకాన్ని దృష్టించే వివిధ విషయాలను తెల్పుతూ, యెహోవా తీర్చనైయున్న తీర్పులను గూర్చి హెచ్చరిస్తున్నాయి. దూతలు మోషే కీర్తనయు, గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుతూన్న భూమ్మీది అభిషక్త క్రైస్తవుల సంఘంద్వారా ఆ పాత్రలను కుమ్మరిస్తున్నారు. రాజ్యాన్ని సువార్తగా ప్రకటిస్తూ, యోహాను తరగతివారు యీ కోపముతోనిండిన పాత్రలలోని వర్తమానాలను ధైర్యంగా ప్రకటిస్తున్నారు. (మత్తయి 24:14; ప్రకటన 14:6, 7) ఆలాగున, వారి రెండు విధాలైన వర్తమానం మానవజాతికి విడుదలను ప్రకటించడంలో సమాధానకరంగా ఉంటుంది, గానీ “మన దేవుని ప్రతిదండన దినమును” గూర్చి హెచ్చరించడంలో యుద్ధభేరివలె ఉంటుంది.—యెషయా 61:1, 2.

21. దేవుని కోపముతోనిండిన మొదటి నాలుగు పాత్రలు ఎలా మొదటి నాలుగు బూరలతో సరిపడుతున్నాయి, ఎక్కడవి తేడాను కల్గివున్నాయి?

21 దేవుని కోపముతో నిండిన మొదటి నాలుగు పాత్రలను కుమ్మరించే స్థలం, ఆ మొదటి నాలుగు బూరలశబ్దాలు ఊదిన స్థలాలకు, అంటే సముద్రము, నదులు, జలధారలు, ఆకాశనక్షత్రాలకు సరిపోతున్నాయి. (ప్రకటన 8:1-12) అయితే బూరలు “మూడవభాగము”నకు తెగులు ప్రకటించెను గానీ దేవుని కోపముతో నిండిన పాత్రలు కుమ్మరించడం మొత్తమంతటికి వర్తిస్తుంది. అలా, “మూడవభాగ”మైన, క్రైస్తవమత సామ్రాజ్యం మీద, ప్రభువు దినములో ప్రథమ అవధానం నిల్పబడినప్పటికీ, యెహోవాయొక్క తీవ్రమైన తీర్పు వర్తమానములు వాటిమూలంగా కలిగే దుఃఖం ద్వారా తెగులు తగలకుండా సాతాను విధానంలో ఏ భాగం విడిచిపెట్టబడలేదు.

22. చివరి మూడు బూరల శబ్దాలు ఎలా వేరైవున్నాయి, అవెలా దేవుని కోపముతోనిండిన చివరి మూడు పాత్రలకు సంబంధం కల్గివున్నాయి?

22 చివరి బూరల శబ్దాలు వేరుగా ఉండెను, ఎందుకంటె అవి శ్రమలు అని పిలువబడ్డాయి. (ప్రకటన 8:13; 9:12) వీటిలో మొదటి రెండింటిలోను ముఖ్యంగా మిడతలు, గుఱ్ఱపు రౌతుల సైన్యాలు ఉంటే, మూడవది దేవుని రాజ్యాన్ని పరిచయం చేసింది. (ప్రకటన 9:1-21; 11:15-19) మనం గమనించబోతున్నట్లు, ఆయన కోపముతోనిండిన చివరి మూడుపాత్రలలో యివికూడ కొన్ని చేరివున్నాయి, గాని అవి ఆ మూడు శ్రమలకు కొంచెం వేరైవున్నాయి. గనుక ఇప్పుడు మనం యెహోవా కోపముతో నిండిన పాత్రలు కుమ్మరింపబడడంవల్ల బహిర్గతమయ్యే గంభీరమైన సంగతులపై మంచి అవధానాన్ని నిలుపుదాము.

[అధస్సూచీలు]

^ పేరా 7 ఆసక్తికరమైన విషయమేమంటే, 1921 లో యోహాను తరగతి ది హార్ప్‌ ఆఫ్‌ గాడ్‌ అనే బైబిలు పఠనపుస్తకాన్ని విడుదల చేసింది, అది 20 భాషల్లో, 50 లక్షలకంటె ఎక్కువకాపీలు అందించబడ్డాయి. అనేకమంది అభిషక్త గాయకులను సమకూర్చడానికి అది తోడ్పడింది.

[అధ్యయన ప్రశ్నలు]