కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా పరలోక సింహాసనపు మహిమా ప్రభావము

యెహోవా పరలోక సింహాసనపు మహిమా ప్రభావము

అధ్యాయం 14

యెహోవా పరలోక సింహాసనపు మహిమా ప్రభావము

దర్శనము 2—ప్రకటన 4:1–5:14

అంశం: దేవుని తీర్పుతీర్చు సింహాసనము యెదుట ఆశ్చర్యకార్యాలు సంభవించడం

నెరవేర్పు కాలం: ఈ దర్శనం 1914 నుండి వెయ్యేండ్ల పరిపాలనాంతం వరకు, పరలోకమందును, భూమ్మీదను ఉన్న ప్రతిజీవి యెహోవాను స్తుతించు కాలంలో అటుతర్వాత జరిగే సంఘటనలను వివరిస్తుంది.—ప్రకటన 5:13

1. యోహాను మనకు చెప్పే దర్శనాలలో మనమెందుకంత శ్రద్ధ చూపాలి?

యోహాను ఉత్తేజపూరిత దర్శనాలను మనతోకూడ చూడడాని కారంభిస్తున్నాడు. ఆత్మావశుడై ఆయనింకా ప్రభువు దినమందున్నాడు. గనుక నిజంగా ఆ దినంలో జీవిస్తున్న మనకు ఆయన వర్ణించేదెంతో లోతైన భావాన్ని కల్గివుంది. ఈ దర్శనాలద్వారా, యెహోవా పరలోక వాస్తవాలను గూర్చిన అదృశ్యతెరను తీసివేస్తున్నాడు, భూమికి చేయనైయున్న తీర్పుల విషయంలో ఆయన అభిప్రాయాన్ని వెల్లడిచేస్తున్నాడు. అంతేగాక, మనకు పరలోక నిరీక్షణవున్నా లేక భూలోక నిరీక్షణవున్నా, యీ దర్శనాలు యెహోవా సంకల్పంలో మనస్థాన మేమిటో తెలిసికోవడానికి సహాయం చేస్తాయి. గనుక మనందరం, యోహాను చెప్పే దానియందు మంచి ఆసక్తిని చూపుతునే వుండాలి: “ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.”—ప్రకటన 1:3.

2. యోహానుకు ఇప్పుడే అనుభవం కలుగుతుంది?

2 యోహాను యిక తర్వాత చూచేది 20వ శతాబ్దంలోని మానవునికి వీడియో అందించేదానికన్నా మిన్నయైందే. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు—ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను.” (ప్రకటన 4:1) యోహాను దర్శనంలో, యెహోవా ప్రత్యక్షతగల అదృశ్య పరలోకంలో ఆయన ప్రవేశిస్తాడు, మానవ అంతరిక్ష యాత్రికులు కనుగొన్న దృశ్యమైన అంతరిక్షం కంటెను, యీ విశ్వాంతరాళాల్లోకంటే ఎంతో పైగానున్న ప్రాంతానికి ఎత్తబడ్డాడు. తెరువబడిన ఓ ద్వారంగుండా ప్రవేశించిన రీతిగానే, యెహోవా స్వయంగా సింహాసనాసీనుడైయున్న ఆ చివరి విస్మయంగొల్పే ఆత్మీయ పరలోకపు సర్వదిగ్దర్శక చిత్రాన్ని తిలకించి కనువిందు చేసుకోమని యోహాను ఆహ్వానింపబడ్డాడు. (కీర్తన 11:4; యెషయా 66:1) ఎంతటి ఆధిక్యత!

3. “బూరవంటి” ధ్వని మనకు దేనిని జ్ఞాపకం చేస్తుంది, మరి నిస్సందేహంగా దాని మూలమెవరు?

3 ఈ ‘మొదటి స్వరము’ ఏమిటో బైబిలు తెల్పడంలేదు. అంతకుముందు విన్న యేసుయొక్క గొప్పస్వరం మాదిరే, దానికి బూరవంటి అధికారపూర్వక స్వరముంది. (ప్రకటన 1:10, 11) అది సీనాయి పర్వతం దగ్గర యెహోవా ప్రత్యక్షతను తెల్పిన గొప్ప బూర ధ్వనిని జ్ఞాపకం చేస్తుంది. (నిర్గమకాండము 19:18-20) నిశ్చయంగా, యెహోవాయే ఆజ్ఞలకు గొప్పమూలం. (ప్రకటన 1:1) యెహోవా సర్వాధిపత్యపు సామ్రాజ్యమంతటిలోనున్న అతిపరిశుద్ధ స్థలంలో యోహాను యీ దర్శనంద్వారా ప్రవేశించేలా ఆయన ద్వారం తెరిచాడు.

యెహోవా ప్రకాశమానమైన ప్రత్యక్షత

4. (ఎ) యోహాను దర్శనం అభిషక్త క్రైస్తవులకు ఏ భావాన్ని కల్గివుంది? (బి) భూమ్మీద జీవించే నిరీక్షణగలవారికి ఆ దర్శనం ఏ భావం కల్గివుంది?

4 యోహాను ఏం చూస్తున్నాడు? ఆయన తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు, వినండి: “వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరకలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడైయుండెను.” (ప్రకటన 4:2) తక్షణమే యోహాను ఆత్మీయంగా దేవుని చురుకైనశక్తిద్వారా యెహోవా సింహాసనం యొద్దకే తీసుకుపోబడ్డాడు. యోహానుకెంత గగుర్పాటుకల్గిందో! ఆయనకు, యితర అభిషక్త క్రైస్తవులకు సిద్ధపరచబడిన “అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము” ఉన్న ఆ నిజమైన పరలోకము యొక్క మిరుమిట్లుగొలిపే సుందర భావాచిత్రం యిక్కడాయనకు చూపబడింది. (1 పేతురు 1:3-5; ఫిలిపీ యులు 3:20) భూమ్మీద జీవించే నిరీక్షణగల వారికికూడ యోహాను దర్శనంలో గొప్పభావముంది. యెహోవా ప్రత్యక్షతా మహిమను, రాజ్యాలకు తీర్పుతీర్చుటకు తదుపరి భూమ్మీద మానవులను పరిపాలించుటకు యెహోవా ఉపయోగించుకొనే పరలోక పరిపాలనా పద్ధతిని అర్థం చేసుకోవడానికి వారికది సహాయం చేస్తుంది. యెహోవా నిజంగా మహోన్నత సంస్థకు దేవుడు!

5. కరుణాపీఠం సూచించే దానినుండి యోహాను ఏ వాస్తవాన్ని గ్రహిస్తున్నాడు?

5 యోహాను ఆ పరలోకంలో గమనించేదంతా అరణ్యంలోని గుడారాన్ని పోలివుంది. ఇది 1,600 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల నిమిత్తం సత్యారాధనకు ఒక పవిత్ర స్థలంగా నిర్మించబడింది. ఆ గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టె ఉంది, దానిపైగల మేలిమి బంగారు కరుణాపీఠం మీదనుండి యెహోవా స్వయంగా మాట్లాడాడు. (నిర్గమకాండము 25:17-22; హెబ్రీయులు 9:5) కావున ఆ కరుణాపీఠం యెహోవా సింహాసనానికి సూచనగా ఉండేది. యోహాను యిప్పుడు ఆ సాదృశ్యమైనదాని నిజరూపాన్ని, సర్వాధిపతియైన ప్రభువగు యెహోవా తన మహోన్నత పరలోక సింహాసనం మీద తేజోమయునిగా ఆసీనుడై యుండుటను చూస్తున్నాడు!

6. యోహాను, యెహోవాను గూర్చి ఎటువంటి అభిప్రాయాన్ని మనకు కల్గిస్తున్నాడు, మరి ఇదెందుకు తగియున్నది?

6 యెహోవా సింహాసన దర్శనాన్ని పొందిన మునుపటి ప్రవక్తలవలె గాక, దానిమీద ఆసీనుడైయున్న పరిశుద్ధుని యోహాను సవివరంగా వర్ణించడంలేదు. (యెహెజ్కేలు 1:26, 27; దానియేలు 7:9, 10) అయితే యోహాను సింహాసనాసీనుడైన వానినిగూర్చి తన అభిప్రాయాన్ని యీమాటల్లో వ్యక్తపరుస్తున్నాడు: “ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.” (ప్రకటన 4:3) ఎంతటి సాటిలేని మహిమ! తళుక్కున మెరిసే రత్నాలను పోలి ప్రశాంత కాంతులను విరజిమ్మే అందం యోహానుకు దృగ్గోచరమౌతుంది. “జ్యోతిర్మయుడగు తండ్రి” యని యెహోవానుగూర్చి శిష్యుడైన యాకోబు చేసిన వర్ణన దీనికెంత చక్కగా సరిపోతుంది! (యాకోబు 1:17) ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన తర్వాత యోహాను స్వయంగా యిలా అన్నాడు: “దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు.” (1 యోహాను 1:5) యెహోవా నిజానికి ఎంతటి మహనీయుడు!

7. యెహోవా సింహాసనంచుట్టు ధనుస్సు ఉందనుటనుండి మనమేమి నేర్చుకోగలము?

7 ఆ సింహాసనం చుట్టూ మరకతపు వర్ణంలో ఒక ఇంద్రధనుస్సును యోహాను చూశాడన్న విషయాన్ని గమనించండి. ఇంద్రధనుస్సు (ఐరిస్‌) అని యిక్కడ అనువదించబడిన గ్రీకుపదం పూర్తివృత్తాకారం అనే భావాన్నిస్తుంది. బైబిల్లో ఇంద్రధనుస్సును గూర్చి మొట్టమొదటసారి తెలుపబడింది నోవహు కాలంలోనే. ఆ జలప్రళయపు జలం తగ్గిన తర్వాతనే యెహోవా మేఘంలో ధనుస్సు కనబడేలాచేసి, దాని భావమేమిటో యిలా తెల్పాడు: “మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లురావు.” (ఆదికాండము 9:13, 15) మరైతే, పరలోక దర్శనం యోహానుకు దేనిని జ్ఞాపకం చేసింది? ఆయన చూచిన ధనుస్సు, యోహాను తరగతి యీనాడు అనుభవిస్తున్నట్టి మంచి సంబంధాన్ని యెహోవాతో కల్గివుండాలని యోహానుకు జ్ఞాపకంచేసి వుంటుంది. అది యెహోవా ప్రత్యక్షత మూలంగా కలుగు శాంతి ప్రశాంతతలతో ఆయనను ముగ్ధున్ని చేసివుంటుంది, ఆ ప్రశాంతతను, యెహోవా నూతన భూసమాజం మీద తన గుడారాన్ని కప్పినప్పుడు విధేయులైన మానవులందరికి అనుగ్రహిస్తాడు.—కీర్తన 119:165; ఫిలిప్పీయులు 4:7; ప్రకటన 21:1-4.

ఆ 24 మంది పెద్దలను గుర్తించుట

8. సింహాసనంచుట్టూ యోహాను ఎవరిని చూశాడు, వారెవరిని సూచిస్తున్నారు?

8 పూర్వం గుడారంలో సేవ చేయడానికి యాజకులు నియమించబడ్డారని యోహానుకు తెలుసు. ఆ తదుపరి తాను వర్ణించే విషయాన్ని చూసి తానే ఆశ్చర్యపడి యుండవచ్చును: “సింహాసనముచుట్టు ఇరువదినాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.” (ప్రకటన 4:4) అవును, యాజకులకు బదులు 24 పెద్దలు రాజులవలే కిరీటాలు ధరించుకొని సింహాసనాసీనులై వున్నారు. ఈ పెద్దలెవరు? వారు క్రైస్తవ సంఘంలోని అభిషక్తులే, వారు పునరుత్థానులై యెహోవా వారికి వాగ్దానం చేసిన పరలోక స్థానాలను ఆక్రమించుకున్నారు. అది మనకెలా తెలుసు?

9, 10. మరి 24 మంది పెద్దలు మహిమగల పరలోక స్థానమందున్న అభిషక్త క్రైస్తవ సంఘాన్ని సూచిస్తున్నారని మనకెలా తెలుసు?

9 ప్రథమంగా, వారు కిరీటాలను ధరించుకున్నారు. అభిషక్త క్రైస్తవులు ‘అక్షయమైన కిరీటాన్ని’ ధరించుకుంటారని, నిరంతర జీవాన్ని అనగా అమర్త్యతను పొందుతారని బైబిలు అంటోంది. (1 కొరింథీయులు 9:25; 15:53, 54) అయితే ఈ 24 మంది పెద్దలు సింహాసనాలమీద కూర్చున్నారు గనుక, యీ సందర్భంలో సువర్ణ కిరీటాలు రాజ్యాధికారాన్ని సూచిస్తున్నాయి. (ప్రకటన 6:2; 14:14 పోల్చండి.) ఈ 24 పెద్దలు, తమ పరలోక స్థానంలోనున్న యేసు అభిషక్త అనుచరులకు సూచనయనే దాన్ని యిది బలపరుస్తుంది, ఎందుకంటే, యేసు తన రాజ్యంలో సింహాసనాల మీద కూర్చుంటారని వారితో నిబంధన చేశాడు. (లూకా 22:28-30) యేసు, యీ 24 పెద్దలుమాత్రమే—దేవదూతలు కూడకాదు—యెహోవా సముఖంలో పరలోకమందు పరిపాలన చేస్తున్నట్లు వర్ణించబడ్డారు.

10 ఇది యేసు లవొదికయ సంఘంతో చేసిన వాగ్దానానికి అనుగుణంగావుంది: “జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.” (ప్రకటన 3:21) అయితే యీ 24 పెద్దలకివ్వబడిన పరలోక నియామకము పరిపాలనకు మాత్రమే పరిమితంకాదు. ప్రకటనయొక్క పరిచయ మాటల్లోనే యోహాను, యేసునుగూర్చి యిలా అన్నాడు: “ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.” (ప్రకటన 1:5, 6) వీరు రాజులును యాజకులునై యున్నారు. “వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.”—ప్రకటన 20:6.

11. మరి 24 మంది పెద్దలు అనే సంఖ్య ఎందుకు తగియున్నది, ఆ సంఖ్య దేన్ని సూచిస్తుంది?

11 యోహాను సింహాసనం చుట్టూ కూర్చున్న 24 మంది పెద్దలు అని చెప్పిన ఆ 24 అనే సంఖ్య ప్రాముఖ్యతేమిటి? వీరు అనేక విషయాల్లో పురాతన ఇశ్రాయేలీయులలోని నమ్మకమైన యాజకులను పోలివున్నారు. అపొస్తలుడైన పేతురు అభిషక్త క్రైస్తవులను గూర్చి వ్రాస్తూ యిలా అన్నాడు: ‘మీరు . . . ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.’ (1 పేతురు 2:9) ఆసక్తికరమైన విషయమేమంటే, ఆ ప్రాచీన యూదా యాజకత్వం 24 భాగాలుగా విభాగించబడింది. పరిశుద్ధ సేవ నిరాటంకంగా కొనసాగేలా యెహోవా సేవకొరకు సంవత్సరం పొడవునా ఒక్కొక్క వారం ఒకొక్కభాగం దానివంతు సేవ చేయడానికి నియమించబడేది. (1 దినవృత్తాంతములు 24:5-19) గనుక యోహాను చూచిన పరలోక యాజకత్వపు దర్శనంలో 24 మంది పెద్దలున్నట్లు చిత్రీకరించబడుట యుక్తమే, ఎందుకంటే యీ యాజకత్వం నిరంతరం, ఎల్లప్పుడు యెహోవాకు సేవచేస్తుంది. అది పూర్తయిన తర్వాత అందులో 24 భాగాలుంటాయి, ప్రతిదానిలోను 6,000 మంది జయించిన వారుంటారు. ఎందుకంటే, గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తుతోపాటు పరలోక సీయోనుమీద నిలబడడానికి 1,44,000 (24 × 6,000) మంది “మనుష్యులలోనుండి కొనబడినవారు” అని ప్రకటన 14:1-4 మనకు తెల్పుతుంది. మరి 12 అనే సంఖ్య దైవిక సంబంధ సమతుల్య సంస్థకు సూచన గనుక, అటువంటి ఏర్పాటును 24 అనేసంఖ్య రెండింతలుగా యింకా బలపరుస్తుంది.

మెరుపులు, ధ్వనులు, ఉరుములు

12. యోహాను ఆ తర్వాత ఏం చూస్తాడు ఏం వింటాడు, మరి “మెరుపులు, ధ్వనులు, ఉరుములు” దేనిని జ్ఞాపకం చేస్తున్నాయి?

12 తర్వాత యోహాను ఏం చూస్తున్నాడు ఏం వింటున్నాడు? “ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి.” (ప్రకటన 4:5ఎ) యెహోవాయొక్క పరలోక శక్తినిగూర్చిన యితర ఆశ్చర్యంగొల్పే దర్శనాలెంత చక్కగా ఉన్నాయో! ఉదాహరణకు, యెహోవా సీనాయి పర్వతం మీదికి ‘దిగి వచ్చినప్పుడు’ జరిగినదాన్ని మోషే యిలా చెబుతున్నాడు: “మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహాధ్వనియు కలుగగా, . . . ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.”—నిర్గమకాండము 19:16-19.

13. యెహోవా సింహాసనంనుండి వెలువడే మెరుపులు దేనిని సూచించాయి?

13 ప్రభువు దినములో యెహోవా తన శక్తిని ప్రత్యక్షతను ఎంతో మహనీయంగా చూపిస్తాడు. అయితే వాటిని అక్షరార్థమైన మెరుపులతో చూపడు, ఎందుకంటే యోహాను దర్శనం చూస్తున్నాడు. మరైతే యీ మెరుపులు దేన్ని సూచిస్తున్నాయి? మెరుపులు ప్రకాశాన్ని ప్రసాదించగలవు. అయితే అవి ఒకన్ని చంపగలవు కూడ. గనుక, యెహోవా సింహాసనమునుండి వెలువడే యీ మెరుపులు నిశ్చయంగా తన ప్రజలకు ఎడతెగక అనుగ్రహిస్తున్న జ్ఞానవికాస కాంతులను, యింకా ప్రాముఖ్యంగా, ఆయన తీక్షణమైన తీర్పు వర్తమానాలను సూచిస్తున్నాయి.—కీర్తన 18:14; 144:5, 6; మత్తయి 4:14-17; 24:27 పోల్చండి.

14. ఈనాడు ధ్వనులెలా వినిపించబడుతున్నాయి?

14 ధ్వనుల విషయమేమిటి? యెహోవా సీనాయి పర్వతంమీదికి దిగినప్పుడు ఒక స్వరం మోషేతో మాట్లాడెను. (నిర్గమకాండము 19:19) ప్రకటన గ్రంథంలో పరలోకం నుండి వచ్చిన ధ్వనులు అనేక ఆజ్ఞలను ప్రకటనలను అందించాయి. (ప్రకటన 4:1; 10:4, 8; 11:12; 12:10; 14:13; 16:1, 17; 18:4; 19:5; 21:3) ఈనాడు, యెహోవా కూడ బైబిలు ప్రవచనాలు, సూత్రాల విషయంలో తన ప్రజల గ్రహణ శక్తినింకా వెలిగిస్తూ ఆజ్ఞలను ప్రకటనలను యిచ్చాడు. అంతర్జాతీయ సమావేశాలలో తరచూ మరింత జ్ఞానాభివృద్ధి కల్గించే సమాచారం బయల్పరచబడింది, ఆ బైబిలు సత్యాలు మరల లోకమంతట ప్రకటింపబడ్డాయి. అపొస్తలుడైన పౌలు నమ్మకస్థులైన సువార్త సేవకులనుగూర్చి యిలా అన్నాడు: “వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతముల వరకును బయలువెళ్లెను.”—రోమీయులు 10:18.

15. ప్రభువు దినములోని యీ కాలంలో సింహాసనంనుండి ఏ ఉరుములు బయలువెళ్లాయి?

15 సాధారణంగా మెరుపుల తర్వాతే ఉరుములొస్తాయి. దావీదు నిజమైన ఉరుమును “యెహోవా స్వరము”తో పోల్చాడు. (కీర్తన 29:3, 4) యెహోవా దావీదు పక్షాన అతని శత్రువులతో యుద్ధంచేసినప్పుడు ఉరుము ఆయన నుండి వచ్చిందని చెప్పబడింది. (2 సమూయేలు 22:14; కీర్తన 18:13) “మనము గ్రహింపలేని గొప్పకార్యములను” ఆయన చేసేటప్పుడు యెహోవా స్వరం ఉరుమువలె వుంటుందని ఎలీహు యోబుతో అన్నాడు. (యోబు 37:4, 5) ప్రభువు దినములోని యీ కాలంలో తన శత్రువులపై తాను చేయనైయున్న గొప్పకార్యాలను గూర్చి హెచ్చరిక చేస్తూ, యెహోవా ‘ఉరిమాడు.’ ఈ అలంకార రూపమైన ఉరుముల ఫెళఫెళధ్వనులు భూదిగంతాలవరకు మ్రోగుతున్నాయి, మారుమ్రోగుతున్నాయి. ఈ ఉరుములవంటి ప్రకటనలకు నీవు చెవియొగ్గి, వారి స్వరంతో నీ స్వరం కలిపితే నీవు ధన్యుడవే!—యెషయా 50:4, 5; 61:1, 2.

ప్రజ్వరిల్లు దీపములు, గాజువంటి సముద్రము

16. ‘ప్రజ్వలిస్తున్న ఏడు దీపములు’ దేన్ని సూచిస్తున్నాయి?

16 యోహాను యింకా ఏం చూస్తున్నాడు? ఇది: “మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను.” (ప్రకటన 4:5బి, 6ఎ) యోహాను తానే యీ ఏడు దీపముల ప్రాముఖ్యతను మనకు చెబుతున్నాడు: “అవి దేవుని ఏడు ఆత్మలు.” ఏడు అనే సంఖ్య దైవిక సంపూర్ణతకు సూచన; గనుక ఏడు దీపములు వెలిగింపజేసే పరిశుద్ధాత్మశక్తి యొక్క సంపూర్ణతను అది తప్పక సూచిస్తుంది. మరి ఈ వెలిగించేపనిని వారికి అప్పగించబడటం, దానితోపాటు లోకంలో ఆత్మీయంగా ఆకలిగొన్న ప్రజలకు వారు దాన్ని అందించే బాధ్యతను చేపట్టడంలో యోహాను తరగతి ఎంత కృతజ్ఞత కల్గివున్నదోగదా! ప్రతీ సంవత్సరం వందకంటె ఎక్కువ భాషల్లో 38 కోట్లకంటె అధికంగా పంచి పెట్టబడుతున్న కావలికోట పత్రిక యీ వెలుగును ప్రకాశింపజేస్తున్నందుకు మనమెంత ఆనందభరితులమో!—కీర్తన 43:3.

17. “స్పటికమును పోలిన గాజువంటి సముద్రము” దేన్ని సూచిస్తుంది?

17 యోహాను “స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమును” కూడ చూస్తున్నాడు. మరి యెహోవా పరలోక రాజసభలోనికి ఆహ్వానించబడినవారి విషయంలో యిది దేనిని సూచిస్తుంది? యేసు సంఘాన్ని పరిశుద్ధపరచిన పద్ధతినిగూర్చి పౌలు చెప్తూ “వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచెను” అని అన్నాడు. (ఎఫెసీయులు 5:26) యేసు తన మరణానికి ముందు తన శిష్యులతో యిలా చెప్పాడు: “నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులైయున్నారు.” (యోహాను 15:3) గనుక, స్ఫటికమును పోలిన గాజువంటి యీ సముద్రము పవిత్రపరచే, వ్రాయబడిన దేవుని వాక్యాన్ని తప్పక సూచిస్తుంది. యెహోవా సముఖమునకు వచ్చే రాజులైన యాజక సమూహము తప్పక దేవుని వాక్యంచేత పూర్తిగా పవిత్రపర్చబడాలి.

“నాలుగు జీవుల”ను చూడండి!

18. సింహాసనం మధ్యలోను చుట్టూను యోహాను ఏం చూశాడు?

18 యోహాను ఇప్పుడు మరొకటి చూస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను.”—ప్రకటన 4:6బి.

19. నాలుగు జీవులు దేన్ని సూచిస్తున్నాయి, ఇది మనకెలా తెలుసు?

19 ఈ జీవులు దేనిని సూచిస్తున్నాయి? మరో ప్రవక్తయైన యెహెజ్కేలు నివేదించిన దర్శనం దీనికి సమాధానం తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. ఒక దివ్య రథంపై యెహోవా ఆసీనుడైనట్లు యెహెజ్కేలు చూశాడు, దాన్ని యోహాను వర్ణించిన పోలికలుగల జీవులవంటివి వెంబడిస్తూ ఉండెను. (యెహెజ్కేలు 1:5-11, 22-28) తర్వాత, యెహెజ్కేలు మరలా జీవులతోపాటు రథచక్రాలుగల ఆ సింహాసనాన్ని చూశాడు. అయితే యిప్పుడాయన ఆ జీవులను కెరూబులని చెబుతున్నాడు. (యెహెజ్కేలు 10:9-15) యోహాను చూచే ఆ నాలుగు జీవులు తప్పక దేవుని కెరూబులను—ఆయన ఆత్మీయ సంస్థలో ఉన్నత స్థానంలోనున్న జీవులను సూచిస్తాయి. పూర్వమున్న గుడారంలోని ఏర్పాటు ప్రకారం యెహోవా సింహాసనాన్ని సూచించిన నిబంధన మందసం మీద రెండు బంగారు కెరూబులు ఉన్నందువల్ల, యెహోవాకు అతిసమీపంలో కెరూబులుండడం చూచి యోహాను ఆశ్చర్యపడియుండడు. ఈ కెరూబుల మధ్యనుండియే యెహోవా స్వరం ఆ జనాంగానికి ఆజ్ఞలు జారీచేసింది.—నిర్గమకాండము 25:22; కీర్తన 80:1.

20. నాలుగు జీవులు “సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును” ఉన్నాయని ఎలా చెప్పవచ్చును?

20 ఈ నాలుగు జీవులు “సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును” ఉన్నాయి. ఇది కచ్చితంగా దేనిని సూచిస్తుంది? అంటే అవి సింహాసనం చుట్టూ ప్రతివైపున మధ్యలో నిల్చున్నాయనే భావంలో చెప్పవచ్చు. అందుకే, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌ అనువాదకులు గ్రీకు మూలవాక్యానికి యిలా అర్థం చెప్పారు: “సింహాసనానికి అన్నివైపులా, చుట్టూ.” మరో విధంగాచూస్తే, ఆ నాలుగు జీవులు సింహాసనమున్న పరలోకంలో కేంద్రస్థాన మందున్నవని అర్థమివ్వొచ్చు. బహుశ అందుకే, ది జెరూసలేం బైబిల్‌ ఆ వాక్యాన్ని “సింహాసనం చుట్టూకూడి, మధ్యలో” అని అనువదిస్తుంది. ప్రాముఖ్యమైన విషయమేమంటే, యెహోవా సంస్థయనే రథానికి అన్నివైపుల యెహెజ్కేలు చూచిన కెరూబులవలె, యీ జీవులు యెహోవా సింహాసనానికి అతిచేరువలో ఉండడమే. (యెహెజ్కేలు 1:15-22) ఇదంతా కీర్తన 99:1 లోని మాటలకు అనుగుణంగా వుంది: “యెహోవా రాజ్యము చేయుచున్నాడు . . . ఆయన కెరూబుల మీద ఆసీనుడైయున్నాడు.”

21, 22. (ఎ) యోహాను నాలుగు జీవులను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) నాలుగు జీవుల్లో ప్రతి ఆకారం దేనిని సూచిస్తుంది?

21 యోహాను యింకా యిలా కొనసాగిస్తున్నాడు: “మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజు వంటిది.” (ప్రకటన 4:7) ఎందుకీ నాలుగు జీవులు ఒకదానికొకటి ఎంతో వ్యత్యాసంగా ఉన్నాయి? ప్రత్యేకంగా కనబడే యీ జీవులు నిజంగా దేవుని ప్రత్యేక లక్షణాలను సూచిస్తున్నాయి. మొదటిది సింహం. బైబిల్లో సింహం ధైర్యానికి, ముఖ్యంగా నీతిన్యాయాలను వెంబడించే విషయంలో చూపే ధైర్యానికి సూచనగా వాడబడింది. (2 సమూయేలు 17:10; సామెతలు 28:1) అలా, సింహం ధైర్యంగల న్యాయం అనే దైవలక్షణాన్ని సరిగ్గా సూచిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 89:14) రెండవజీవి కోడెదూడను పోలివుంది. ఈ కోడెదూడ ఏ లక్షణాన్ని నీకు జ్ఞాపకానికి తెస్తుంది? కోడెదూడ దానికున్న శక్తినిబట్టి ఇశ్రాయేలీయుల కెంతో విలువైన సొత్తు. (సామెతలు 14:4; అలాగే యోబు 39:9-11 కూడ చూడండి.) గనుక కోడెదూడ శక్తిని, యెహోవా యిచ్చే బలాతిశయాన్ని సూచిస్తుంది.—కీర్తన 62:11; యెషయా 40:26.

22 మూడవజీవి మానవ ముఖంవంటి ముఖంగలది. ఇది దేవునికున్నటువంటి ప్రేమనే తప్పక సూచిస్తుంది, ఎందుకంటే, భూమ్మీద మానవుడు మాత్రమే ప్రేమయనే శ్రేష్ఠమైన దేవుని పోలిక చొప్పున సృజింపబడ్డాడు. (ఆదికాండము 1:26-28; మత్తయి 22:36-40; 1 యోహాను 4:8, 16) నిశ్చయంగా, యెహోవా సింహాసనం చుట్టూ సేవచేస్తున్న కెరూబులు యీ లక్షణాన్ని కనబరుస్తున్నారు. మరి నాలుగవ జీవి సంగతేమిటి? ఇది చూడ్డానికి ఎగిరే పక్షిరాజువలె వుంది. పక్షిరాజు సూక్ష్మదృష్టిని గూర్చి యెహోవా తానే యిలా చెబుతున్నాడు: “దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.” (యోబు 39:29) గనుక, పక్షిరాజు కచ్చితంగా దూరదృష్టిగల జ్ఞానాన్ని సూచిస్తుంది. యెహోవాయే జ్ఞానానికి మూలం. కెరూబులు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దైవజ్ఞానాన్ని చూపిస్తున్నాయి.—సామెతలు 2:6; యాకోబు 3:17.

యెహోవా స్తుతులు మారుమ్రోగుట

23. నాలుగు జీవులకు “చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియుండుట” దేనిని సూచిస్తుంది, వాటికున్న మూడుజతల రెక్కలు దేనిని నొక్కితెల్పుతున్నాయి?

23 యోహాను తన వర్ణనను యిలా కొనసాగిస్తున్నాడు: “ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి—భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు (యెహోవా NW)ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.” (ప్రకటన 4:8) నిండా కన్నులుండడమంటే అది సంపూర్ణమైన, సూక్ష్మదృష్టిని సూచిస్తుంది. ఆ నాలుగు జీవులకు నిద్ర అవసరంలేదు గనుక వారు నిరంతరం సూక్ష్మదృష్టిని కనబరుస్తున్నారు. వారిక్కడ యిలా వ్రాయబడిన వానిని అనుకరిస్తున్నారు: “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:9) కెరూబులకెన్నో కన్నులున్నందువల్ల వారు ప్రతిచోట చూడగలరు. వారిదృష్టినుండి ఏదియు తప్పించుకోలేదు. అలా వారు దేవుడు చేసే తీర్పు పనిలో ఆయనకు సేవచేయడానికి సంసిద్ధులైవున్నారు. ఆయనను గూర్చి యిలా తెలుపబడింది: “యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.” (సామెతలు 15:3) మరి మూడు జతల రెక్కలతో—మూడు అనే సంఖ్య బైబిల్లో నొక్కి తెల్పడానికుపయోగించబడింది—యీ కెరూబులు మెరుపువేగంతో యెహోవా తీర్పులను ప్రకటించి వాటిని అమలు చేస్తారు.

24. కెరూబులెలా యెహోవాను స్తుతిస్తున్నారు, ఏ అంతర్భావంతో?

24 వినండి! కెరూబులు యెహోవాను గూర్చి మధురమైన, ఆహ్లాదకరమైన స్తుతిగీతాన్ని పాడుతున్నారు: “భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు ప్రభువునగు (యెహోవా NW) దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.” మరల, మూడు అనేది తీవ్రతను తెల్పుతుంది. కెరూబులు యెహోవా దేవుని పరిశుద్ధతను పటిష్ఠంగా బలపరుస్తున్నారు. ఆయన “సకల యుగములలో రాజు,” ఆలాగే నిరంతరం ‘అల్ఫాయు ఓమెగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై యున్నాడు.’ (1 తిమోతి 1:17; ప్రకటన 22:13) యెహోవా సాటిలేని లక్షణాలనుగూర్చి ప్రకటించేటప్పుడు కెరూబులు అసలు విశ్రాంతి తీసుకోరు.

25. యెహోవాను స్తుతించడంలో ఆ నాలుగు జీవులు, 24 మంది పెద్దలు ఎలా ఏకమైయున్నారు?

25 ఆకాశమహాకాశములు యెహోవా స్తుతులతో హోరెత్తి పోతున్నాయి! యోహాను వర్ణన యింకా యిలా కొనసాగుతోంది: “ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండు వానియెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు—ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవియుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.” (ప్రకటన 4:9-11) లేఖనాలన్నింటిలో, మనదేవుడును, సర్వాధికారియగు ప్రభువైన యెహోవాకు చెల్లించిన మహాగొప్ప స్తుతులలో యిదొకటి!

26. ఎందుకు 24 పెద్దలు వారి కిరీటాలను యెహోవా యెదుట పడవేస్తారు?

26 యెహోవా ఎదుట తమ కిరీటాలను సహితం పడవేస్తూ ఆ 24 మంది పెద్దలు, యేసు కనబరచిన మానసిక స్వభావాన్నే కనబరుస్తున్నారు. దేవుని ఎదుట తమ్మునుతాము పొగడుకొనుట వారి ఆలోచనలోనే లేదు. యేసు ఎల్లప్పుడు చేసిన విధంగానే, తమకున్న రాజరికపు ఏకైక సంకల్పం దేవునికి మహిమాఘనతలు తేవడమేనని వారు వినమ్రతగా గుర్తిస్తున్నారు. (ఫిలిప్పీయులు 2:5, 6, 9-11) విధేయతతో, వారు తమకున్న అల్పస్థాయిని గుర్తెరుగుతున్నారు మరియు వారి పరిపాలన యెహోవా మీదనే ఆధారపడిందని ఒప్పుకుంటారు. అలా, వారు సమస్త సృష్టిని చేసిన దేవునికి ఘనతామహిమలు చెల్లించడంలో కెరూబులతోను, నమ్మకమైన యితర సృష్టితోను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నారు.—కీర్తన 150:1-6.

27, 28. (ఎ) యోహాను యిచ్చిన యీ దర్శనపు వర్ణన మనపై ఎటువంటి ప్రభావంకల్గి వుండాలి? (బి) యోహాను తదుపరి వినేదానిని, చూసేదానిని గూర్చి ఏ ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి?

27 యోహాను వ్రాసిన యీ దర్శనాన్ని చదివి చలనంలేకుండా ఎవరైనా ఉండగలరా? ఇది దివ్యమైంది, మహనీయమైంది! గానీ వాస్తవమేమైవుంటుంది? యెహోవా మహత్వమే ఎవరినైనా అభినందనా హృదయంతో పురికొల్పి, ప్రార్థనలోనూ ఆయన నామాన్ని బహిరంగంగా ప్రకటించుటలోను ఆ నాలుగు జీవులతో, 24 మంది పెద్దలతో కలిసేలా చేయాలి. ఈనాడు యీ దేవున్నిగూర్చే క్రైస్తవులు సాక్ష్యమిచ్చే ఆధిక్యతను పొందారు. (యెషయా 43:10) జ్ఞాపకముంచుకోండి, యోహాను దర్శనం ప్రభువు దినమునకే, యిప్పుడు మనం జీవిస్తున్న కాలానికే, వర్తిస్తుంది. “ఏడు ఆత్మలు” మనల్ని నడిపించి, బలపరచడానికే నిత్యం సిద్ధంగా ఉన్నాయి. (గలతీయులు 5:16-18) మనం పరిశుద్ధ దేవున్ని సేవించడంలో పరిశుద్ధంగా ఉండడాన్కి మనకు సహాయం చేసేందుకే యీనాడు దేవుని వాక్యం అందుబాటులోవుంది. (1 పేతురు 1:14-16) నిశ్చయంగా, యీ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదవడానికి మనమానందిస్తాం. (ప్రకటన 1:3) యెహోవాకు విశ్వాస పాత్రులముగా ఉండడానికి, ఆయనకు చురుకుగా స్తుతులు పాడకుండా లోకం మనల్ని ప్రక్కకు మళ్లించ నీయకుండా ఉండడానికి ఇవెంత పురికొల్పునిస్తాయోగదా!—1 యోహాను 2:15-17.

28 ఇంతవరకు యోహాను, పరలోకమందు ఆ తెరువబడిన ద్వారంగుండా ఆహ్వానించబడినప్పుడు తాను చూచినదాన్నే వర్ణిస్తున్నాడు, అందులో యెహోవా తన మహిమాన్విత, మహాదివ్యమైన పరలోక సింహాసనంపై ఆసీనుడైయున్నట్లు ఆయన మనకు తెల్పుతున్నాడు. యథార్థతలోను తేజస్సులోను దేదీప్యమానంగా వెలుగుతున్న—అంటే సంస్థలన్నింటిలోనూ అత్యంత మహాగొప్పదైన—దానిమధ్యలో ఆయన ఉన్నాడు. దేవుని న్యాయస్థానం దాని కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. (దానియేలు 7:9, 10, 18) విశేష సంఘటనేదో జరగడానికి రంగం సిద్ధంగా వుంది. అదేమిటి, ఈనాడు మనపై అదెలా ప్రభావం కల్గివుంటుంది? తెరతీయబడగా ఇక ఆ దృశ్యాన్ని మనం చూద్దాము!

[అధ్యయన ప్రశ్నలు]

75వ పేజీలోని చిత్రం]

78వ పేజీలోని చిత్రం]