కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు నామమును హత్తుకొని ఉండుట

యేసు నామమును హత్తుకొని ఉండుట

అధ్యాయం 9

యేసు నామమును హత్తుకొని ఉండుట

పెర్గము

1. ఏ సంఘానికి యేసు తదుపరి వర్తమానం యివ్వబడింది, ఎటువంటి పట్టణంలో ఆ క్రైస్తవులు నివసిస్తూ ఉండిరి?

స్ముర్ననుండి 50 మైళ్లు తీరప్రాంతంలోని రోడ్డుగుండా ఉత్తరానికి ప్రయాణించి, కయకస్‌ నది లోయగుండా లోపలికి 15 మైళ్లు వెళ్తే మనకు యిప్పుడు బెర్గామా అని పిలువబడే పెర్గము వస్తుంది. ఆ పట్టణం జీయస్‌ లేక జూపిటర్‌ దేవాలయానికి ప్రసిద్ధి. భూగర్భశాస్త్రజ్ఞులు 1800లలో ఆ దేవాలయపు బలిపీఠాన్ని జర్మనీకి మార్చారు, అచ్చట బెర్లిన్‌లోని పెర్గమాన్‌ మ్యూజియంలో అన్యదేవతల విగ్రహాలు, చెక్కడపు చిత్రకళలతో పాటు దీన్నికూడ తిలకించవచ్చు. అంత విగ్రహారాధన మధ్యలోనున్న ఆ సంఘానికి ప్రభువైన యేసు ఏ వర్తమానం పంపి వుంటాడు?

2. యేసు తన గుర్తింపునెలా స్థిరపరస్తున్నాడు, మరి తాను ‘వాడియైన రెండంచులుగల ఖడ్గము’ ధరించుకొని ఉండుటలోగల ప్రాముఖ్యతేమి?

2 మొదట, యేసు తన గుర్తింపును స్థిరపరుస్తూ యిలా చెబుతున్నాడు: “పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము—వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులు.” (ప్రకటన 2:12) యేసు ప్రకటన 1:16 లో తననుగూర్చిన వర్ణనను యిక్కడ మరల చెబుతున్నాడు. న్యాయాధిపతిగాను, దండనాధికారిగాను ఆయన, తన శిష్యులను హింసించేవారిని నాశనంచేస్తాడు. ఆ అభయమెంతటి ఓదార్పుకరమైందోగదా! అయినా, తీర్పువిషయంలో తన “నిబంధన దూత”యగు యేసుక్రీస్తు ద్వారా వ్యవహరిస్తున్న యెహోవా, అవసరంలో ఉన్నవారికి సహాయపడనివారిని, విగ్రహారాధన, అవినీతి, అప్రమాణం, అన్యాయం మొదలైన వాటిని జరిగించే వారిమీద “దృఢముగా సాక్ష్యము” పలుకును. సంఘం లోపల ఉన్న వారికిని యిది హెచ్చరికే. (మలాకీ 3:1, 5; హెబ్రీయులు 13:1-3) దేవుడు యేసు ద్వారా యిచ్చే సలహాను గద్దింపును లక్ష్యపెట్టాలి!

3. పెర్గములో ఏ అబద్ధారాధన జరిగేది, మరి “సాతాను సింహాసనము” అక్కడ ఉన్నదని ఎందుకు చెప్పవచ్చు?

3 యేసు యిప్పుడు ఆ సంఘానికిలా చెబుతున్నాడు: “సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును.” (ప్రకటన 2:13ఎ) నిజంగా, ఆ క్రైస్తవులు సాతాను ఆరాధనతో చుట్టుముట్టబడి ఉండిరి. జీయస్‌ ఆలయంతోపాటు, స్వస్థతా దేవత ఆస్‌క్యులాపియస్‌కు సంబంధించిన బలిపీఠంకూడ వుంది. పెర్గము, చక్రవర్తి ఆరాధనా మతశాఖకు కేంద్రంగా కూడ ప్రసిద్ధిచెందిందే. “సాతాను” అని తర్జుమా చేయబడిన హెబ్రీ పదానికి “అపవాది,” అని అర్థం, మరి అతని “సింహాసనము” అంటే దేవుని అనుమతి వలన కొద్దికాలంపాటు ప్రపంచాన్ని పాలిస్తాడని అర్థం. (యోబు 1:6 న్యూ వర్‌ల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిలు, అథఃస్సూచి) పెర్గములో విస్తారంగావున్న విగ్రహారాధన చూపించేదేమంటే, ఆ పట్టణంలో సాతాను “సింహాసనము” స్థిరంగా స్థాపించబడింది. క్రైస్తవులు జాతీయతారాధన చేయనందుకు సాతాను కెంత కోపమొచ్చి ఉండొచ్చో!

4. (ఎ) పెర్గము క్రైస్తవులను యేసు ఎలా అభినందిస్తున్నాడు? (బి) రోమా రాయబారి ప్లినీ ట్రాజన్‌ చక్రవర్తికి క్రైస్తవులను గూర్చి ఏమని రాశాడు? (సి) అపాయం పొంచివున్ననూ, పెర్గములోని క్రైస్తవులెలాంటి చర్యగైకొన్నారు?

4 అవును, “సాతాను సింహాసనము,” పెర్గములోనే ఉంది. యేసు యింకా యిలా అంటున్నాడు: “సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియై యుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.” (ప్రకటన 2:13బి) ఎంతటి ఆత్మపురికొల్పు అభినందనో! అతడు దయ్యాలారాధనా జోలికి పోకుండ, చక్రవర్తి ఆరాధనను తిరస్కరించి నందుకే అంతిపయ హత్యచేయబడ్దాడు. యోహాను యీ ప్రవచనాన్ని అందుకున్న కొద్దికాలానికే, రోమా చక్రవర్తి ట్రాజన్‌ వ్యక్తిగత న్యాయ సలహాదారుడైన ప్లినీ ది యంగర్‌, ట్రాజన్‌కు వ్రాస్తూ, క్రైస్తవులనబడిన నేరస్థులను విచారించడానికి—చక్రవర్తి సమ్మతించిన పద్ధతినే, వివరించాడు. ప్లినీ చెబుతున్నట్లు, “వారు నా ఎదుట దేవతల పేరున ఓ ధ్యానశ్లోకాన్ని వల్లించి, ధూపంవేసి, మీ ట్రాజన్‌ విగ్రహానికి ద్రాక్షారసాన్నందించి, . . . అంతకంటె మిన్నగా, క్రీస్తును శపించి,” క్రైస్తవులం కామనిచెప్పిన వారిని విడుదల చేశారు. క్రైస్తవులన్నవారిని హతమార్చారు. అటువంటి అపాయాన్నెదుర్కొన్ననూ, పెర్గములోని క్రైస్తవులు తమ విశ్వాసాన్ని విడువలేదు. వారు ‘యేసు నామానికి హత్తుకొని’ వున్నారంటే వారాయనను, యెహోవా నియమిత న్యాయాధిపతిగా, నిర్ణేతగా, ఆయనకున్న గొప్ప స్థానాన్ని గౌరవిస్తూనే వచ్చారు. రాజ్యప్రచారకులుగా, వారు యేసు అడుగుజాడల్ని యథార్థంగా అనుసరించారు.

5. (ఎ) చక్రవర్తి ఆరాధనను పోలినదేది యీ 20వ శతాబ్దంలో క్రైస్తవుల తీవ్రమైన పరీక్షలకు కారణమైంది? (బి) క్రైస్తవులకు ది వాచ్‌టవర్‌ ఏ సహాయం చేసింది?

5 అనేక సందర్భాల్లో, యేసు యీ ప్రస్తుత దుష్టలోకాన్ని సాతాను పాలిస్తున్నాడని తెలిపాడు, అయితే యేసు యథార్థతనుబట్టి సాతానుకు ఆయనపై అధికారం లేదు. (మత్తయి 4:8-11; యోహాను 14:30) ఈ 20వ శతాబ్దంలో, శక్తివంతమైన దేశాలు, ముఖ్యంగా “ఉత్తరదేశపురాజు,” “దక్షిణదేశపురాజు” ప్రపంచాధిపత్యం కొరకు పోరాడుతున్నారు. (దానియేలు 11:40) దేశభక్తి తన పంజా విప్పింది, మరి ఆనాటి చక్రవర్తి ఆరాధనకు దీటుగా యీనాడు జాతీయత భూమిని కుదిపేస్తోంది. ది వాచ్‌టవర్‌ నవంబరు 1, 1939, యింకా నవంబరు 1, 1979, మరియు సెప్టెంబరు 1, 1986లలో తటస్థ స్థానాన్ని గూర్చిన శీర్షికలు యీ విషయంలో బైబిలు ఉపదేశాన్ని స్పష్ట పరచాయి, ఆవిధంగా యేసు ధైర్యంగా చేసినట్లే, యెహోవా నామంలో నడుచుకోవడానికి, లోకాన్ని జయించడానికి ఆశించే క్రైస్తవులకు మార్గదర్శక సూత్రాలు అందించబడ్డాయి.—మీకా 4:1, 3, 5; యోహాను 16:33; 17:4, 6, 26; 18:36, 37; అపొస్తలుల కార్యములు 5:29.

6. అంతిపయవలె, యెహోవాసాక్షులు యీ ఆధునిక కాలంలో ఎలా స్థిరమైన స్థానాన్ని తీసుకున్నారు?

6 అటువంటి సలహా అగత్యమయింది. అనుచిత దేశభక్తి తీవ్రతనుబట్టి, యెహోవాసాక్షులు, తోటి సహవాసులు విశ్వాసం విషయంలో స్థిరంగా ఉండాల్సివస్తోంది. అమెరికాలో అనేకమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు జెండా వందనం చేయని కారణంగా స్కూళ్లలోనుండి వెళ్లగొట్టబడ్డారు, మరి ముందే గమనించినరీతిగా జర్మనీలో, సాక్షులు స్వస్తిక్‌ గుర్తుకు నమస్కరించ నందుకు క్రూరంగా హింసించబడ్డారు. అటువంటి జాతీయతా విగ్రహారాధన చేయనందుకు యెహోవా నమ్మకమైన సేవకులగు వేలాదిమందిని నాజీ హిట్లర్‌ హతమార్చాడు. జపాన్‌లో చక్రవర్తి ఆరాధన ముమ్మరంగా జరిగేకాలంలో, 1930 దశాబ్దంలో, ఇద్దరు పయినీర్‌ సేవకులు జపాను ఆక్రమిత ప్రాంతమైన తైవాన్‌లో రాజ్య విత్తనాలను విస్తారంగా విత్తారు. మిలటరీ పాలకులు వారిని జైల్లోవేశారు, అక్కడ కఠిన శిక్షమూలంగా అందులో ఒకరు చనిపోయారు. తర్వాత మిగిలిన వ్యక్తిని విడుదల చేశారు గాని వెంటనే వెనుకనుండి కాల్చిచంపారు—ఆధునిక అంతిపయ అంతమయ్యాడు. ఈనాటికి, జాతీయ చిహ్నాలను ఆరాధించాలని, దేశానికి విశేషభక్తిని చూపాలని అధికార పూర్వకంగా అడిగే దేశాలున్నాయి. యౌవనస్థులనేకులు జైలుపాలయ్యారు, తమ క్రైస్తవ తటస్థ వైఖరిని ధైర్యంగా చూపినందుకు పలువురు హతులయ్యారు. నీవును యౌవనస్థుడవై అటువంటి వివాదాంశాల నెదుర్కొంటూ ఉన్నట్లయితే నిత్యజీవ నిరీక్షణగల్గి, “ఆత్మను రక్షించు కొనుటకు విశ్వాసము కలిగి”యుండడానికి దేవుని వాక్యాన్ని పఠించుము.—హెబ్రీయులు 10:39–11:1; మత్తయి 10:28-31.

7. ఇండియాలో పిల్లలు జాతీయతారాధన వివాదాన్ని ఎలా ఎదుర్కొన్నారు, తత్ఫలితమేమిటి?

7 చిన్న పిల్లలు కూడ అటువంటి వివాదాలలో చిక్కుకున్నారు. ఇండియాలోని కేరళ రాష్ట్రంలో, 1985 లో యెహోవా సాక్షుల పిల్లలిద్దరు వారి బైబిల్‌ విశ్వాసాన్ని త్యాగం చేయడానికి తిరస్కరించారు, జాతీయగీతాన్ని ఆలపించడానికి అంగీకరించలేదు. ఇతరులు పాడుతూంటే వారు గౌరవపూర్వకంగా నిల్చున్నారు, అయినా వారు బడినుండి బహిష్కరించబడ్డారు. వాళ్ల నాన్నగారు, ఇండియాలోని సుప్రీంకోర్టులో దాన్ని అప్పీలు చేశారు, అక్కడ యిద్దరు జడ్జీలు పిల్లలకు అనుకూలంగా తీర్పుచెప్పి, ధైర్యంగా యిలా అన్నారు: “మన సాంప్రదాయం సహనాన్ని బోధిస్తుంది; మన తత్వశాస్త్రం సహనాన్ని బోధిస్తుంది; మన రాజ్యాంగ చట్టం సహనాన్ని అభ్యసిస్తోంది; దాన్ని మనం చులకన చేయకుండా ఉందాము.” ఈ కేసునుగూర్చిన వార్తాపత్రికల ప్రచారం, అనుకూలమైన సంపాదకీయాలు, ప్రపంచ జనాబాలో దాదాపు ఐదవవంతున్న దేశమంతటికి, సత్యదేవుడైన యెహోవాను ఆరాధించే క్రైస్తవులు ఆ దేశంలో ఉన్నారని, వీరు బైబిలు సూత్రాలకు కట్టుబడి వుంటారని చాటిచెప్పాయి.

పాడుచేసే ప్రభావాలు

8. పెర్గములోని క్రైస్తవులపై యేసు ఎటువంటి నిందవేయాల్సిన అవసరం ఉందనుకున్నాడు?

8 అవును, పెర్గములోని క్రైస్తవులు యథార్థపరులే. మరి యేసు యిలా అంటున్నాడు: “అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది.” వారు నిందార్హమైన పనులేమి చేశారు? యేసు మనకిలా చెబుతున్నాడు: “విగ్రహములకు బలియిచ్చినవాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు.”—ప్రకటన 2:14.

9. బిలాము ఎవరు, అతని సలహా ఎలా “ఇశ్రాయేలీయులకు అడ్డుబండ” అయ్యింది?

9 మోషే కాలంలో, మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలీయులను శపించడానికి, యెహోవా మార్గాలు కొంతవరకు తెలిసిన ఓ ఇశ్రాయేలీయుడు కాని ప్రవక్తను కూలికి తెచ్చుకున్నాడు. యెహోవా బిలామును అడ్డగించి, ఇశ్రాయేలీయులను దీవించి శత్రువులను శపించేలా చేశాడు. తత్ఫలితంగా కలిగిన బాలాకు ఆగ్రహాన్ని అణచడానికి బిలాము అంతకంటె మోసపూరిత దాడినిగూర్చి సలహాయిచ్చాడు: అదేమంటే, ఇశ్రాయేలీయుల పురుషులు లైంగిక అవినీతికి పాల్పడేలాగున, పయోరులోని బయలుదేవతా విగ్రహారాధనలో పడునట్లు మోయాబు స్త్రీలు వారిని మోసగించుటే. యెహోవా నీతిగల కోపం రగులుకొనగా, వ్యభిచరించిన 24,000 మంది ఇశ్రాయేలీయులు తెగులువలన చనిపోయారు—ఇశ్రాయేలీయులలోనుండి ఆ చెడును తీసివేయడానికి యాజకుడైన ఫీనెహాసు చర్యగైకొన్నప్పుడే ఆ తెగులు ఆగిపోయింది.—సంఖ్యాకాండము 24:10, 11; 25:1-3, 6-9; 31:16.

10. పెర్గములోని సంఘాన్ని ఏ ఆటంకాలు మలినం చేశాయి, తమ అపరాధాలను దేవుడు పట్టించుకోడని ఆ క్రైస్తవులెందుకు భావించారు?

10 మరిప్పుడు, యోహాను కాలంలో పెర్గమునందు అలాంటి ఆటంకాలేవైనా ఉన్నాయా? ఉన్నాయి. లైంగిక అవినీతి, విగ్రహారాధన సంఘాన్ని మలినం చేశాయి. ఆ క్రైస్తవులు అపొస్తులుడైన పౌలు యిచ్చిన హెచ్చరికల్ని లెక్క చేయలేదు. (1 కొరింథీయులు 10:6-11) వారు హింసను సహించారు గనుక తమ లైంగిక అపరాధములను యెహోవా పట్టించుకోడేమో ననుకున్నారు. అందుకే యేసు అలాంటి దుష్టత్వాన్ని మానుకోవాలని స్పష్టం చేస్తున్నాడు.

11. (ఎ) క్రైస్తవులు దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి తలపును వారు విసర్జించాలి? (బి) కొన్ని సంవత్సరాలుగా, క్రైస్తవ సంఘంనుండి ఎంతమంది బహిష్కరించ బడ్డారు, ముఖ్యంగా ఏ కారణంచేత?

11 అలాగే యీనాడు, క్రైస్తవులు “దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ” పరచకుండ జాగ్రత్త పడాలి. (యూదా 4) క్రైస్తవ పవిత్రతా నడవడి ననుసరించడానికి మనం ‘మన శరీరాలను నలగగొట్టుకొంటూ,’ చెడునసహ్యించుకునే బాధ్యత కల్గివున్నాం. (1 కొరింథీయులు 9:27; కీర్తన 97:10; రోమీయులు 8:6) యెహోవా సేవలో ఆసక్తి, హింసల్లో యథార్థత చూపితే లైంగిక దుష్ప్రవర్తనకు అనుమతి దొరుకుతుందని మనమనుకోకూడదు. గడిచిన సంవత్సరాల్లో, ముఖ్యంగా లైంగిక అవినీతిని బట్టి క్రైస్తవ సంఘంనుండి బహిష్కరింపబడిన నేరస్థులు వేలకువేలున్నారు. కొన్ని సంవత్సరాల్లోనైతే, పయోరులోని బయలు దేవతను బట్టి ప్రాచీన ఇశ్రాయేలీయులలో హతులైన సంఖ్యకంటే ఎక్కువే ఉన్నారు. మనమెన్నటికి ఆ గుంపులో పడకుండ జాగ్రత్తగా ఉందుముగాక!—రోమీయులు 11:20; 1 కొరింథీయులు 10:12.

12. గతకాలంలోని దేవుని సేవకులవలె, యీనాటి క్రైస్తవులకు ఏ సూత్రాలు వర్తిస్తాయి?

12 ‘విగ్రహములకు అర్పించినవాటిని తిన్నందుకు’ కూడా పెర్గములోని క్రైస్తవులను యేసు గద్దిస్తున్నాడు. ఇందులో ఏముంది? పౌలు కొరింథీయులకు వ్రాసిన మాటలనుబట్టి, కొందరు వారికున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ యితరుల మనస్సాక్షిని బుద్ధిపూర్వకంగా అభ్యంతరపరచి యుండవచ్చు. బహుశ వారు విగ్రహారాధనలో ఏదోరకంగా పాల్గొంటూండ వచ్చు. (1 కొరింథీయులు 8:4-13; 10:25-30) ఈనాడు నమ్మకమైన క్రైస్తవులు ఇతరులను అభ్యంతర పర్చకుండా జాగ్రత్తపడుతూ, వారి క్రైస్తవ స్వేచ్ఛను ఉపయోగించుటలో నిస్వార్థమైన ప్రేమను కనబరచాలి. నిశ్చయంగా వారు యీనాడు ఆధునిక విగ్రహారాధనను అంటే దూరదర్శిని, సినిమా, క్రీడా తారలను ఆరాధించడం మరియు ధనం ద్వారా లేదా తమ కడుపు కొరకు దేవుని తయారు చేసికొనడంలాంటి ఆరాధనను విసర్జించాలి.—మత్తయి 6:24; ఫిలిప్పీయులు 1:9, 10; 3:17-19.

మతాంతర్భేదాలను విసర్జించండి

13. పెర్గములోని క్రైస్తవులను యేసు ఆ తర్వాత ఏమాటలతో గద్దిస్తున్నాడు, ఆ సంఘానికి అవి ఎందుకు అవసరం?

13 యేసు పెర్గములోని క్రైస్తవులను యింకా గద్దిస్తూ యిలా చెబుతున్నాడు: “అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు.” (ప్రకటన 2:15) అంతకుమునుపు యేసు యీ కోవకు చెందినవారి క్రియలను ద్వేషించిన ఎఫెసీయులను మెచ్చుకున్నాడు. అయితే మతాంతర్భేదాలనుండి సంఘాన్ని దూరంగా ఉంచాల్సిన అవసరతను గూర్చిన సలహా పెర్గమునకు అవసరమే. యోహాను 17:20-23 నందు యేసు చేసిన ప్రార్థనలోని ఐక్యతను కాపాడటానికి క్రైస్తవ నియమాలను అమలుపరచే విషయంలో స్థిరత్వమవసరమై ఉంది. “హితబోధ విషయమై . . . హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును,” అది అవసరమైయున్నది.—తీతు 1:9.

14. (ఎ) ముందునుండి, క్రైస్తవ సంఘం ఎవరితో పోరాడవలసి వచ్చింది, మరి అపొస్తలుడైన పౌలు వారినెలా వర్ణించాడు? (బి) విడిపోయిన గుంపుతో వెళ్లాలనుకునే వారెవరైనాసరే యేసు చెప్పిన ఏ మాటల్ని లక్ష్యపెట్టాలి?

14 ముందునుండి కూడా, క్రైస్తవసంఘం వారి మృదువైన, మోసపూరిత మాటలతో యెహోవా మార్గం ద్వారావచ్చే “బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువారి,”తో అనగా అహంకార మతభ్రష్టులతో పోరాడవలసి వచ్చింది. (రోమీయులు 16:17, 18) అపొస్తలుడైన పౌలు తాను పంపిన అన్ని పత్రికలలో యీ అపాయాన్నిగూర్చి హెచ్చరిస్తూనే వచ్చాడు. * ఆధునిక కాలంలో, యేసు నిజమైన క్రైస్తవసంఘాన్ని దాని పరిపూర్ణతకు, ఐక్యతకు పునరుద్ధరించినప్పుడు, భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున, విడిపోయిన గుంపు ననుసరించాలని తలంచే ఏ వ్యక్తియైనా, తదుపరి యేసు చెప్పినమాటలను లక్ష్యపెట్టాలి. “కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండివచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధము చేసెదను.”—ప్రకటన 2:16.

15. మతాంతర్భేదాలెలా ప్రారంభమౌతాయి?

15 మతభేదమెలా ప్రారంభమౌతుంది? బహుశ తాను బోధకుడని చెప్పుకునేవాడు అనుమానపు విత్తనాలను నాటుతూ, కొన్ని బైబిలు సత్యాలను గూర్చి (మనం అంత్యదినాల్లో ఉన్నామనే అంశాలవంటివి) వివాదం రేపడంతో, అలా ఓ చిన్నగుంపు వేరైపోయి అతన్ని వెంబడిస్తుంది. (2 తిమోతి 3:1; 2 పేతురు 3:3, 4) లేదా యెహోవా తన సేవను నెరవేర్చే పద్ధతినే ఎవరో ఒకరు విమర్శిస్తూ, రాజ్యసువార్తను యింటింటికెళ్లి ప్రకటించాల్సిన అవసరమేమిలేదని, లేఖనానుసారమైంది కాదని అంటూ, స్వాతంత్ర్య స్వభావాన్ని కనబరచవచ్చు. యేసు తన అపొస్తలులవలె, అట్టి సేవలో పాల్గొనడంద్వారా వారినది వినయస్థులుగా చేస్తుంది, గానీ వారు వేరవ్వడానికే మొగ్గుచూపి దాన్ని చులకన చేస్తారు, బహుశ ఓ ప్రత్యేక గుంపులా అప్పుడప్పుడు మాత్రమే బైబిలును చదువుతారు. (మత్తయి 10:7, 11-13; అపొస్తలుల కార్యములు 5:42; 20:20, 21) అట్టివారు, యేసు జ్ఞాపకార్థ దినాన్ని గూర్చి, రక్తమును విసర్జించుట లేఖనానుసారమైంది కాదని, పర్వదినాలను ఆచరించడం, మరియు పొగాకు వాడుకనుగూర్చి వారి స్వంత అభిప్రాయాన్ని కట్టుకథలుగా అల్లుకుంటారు. అంతేగాక, వారు యెహోవా నామాన్ని ఎంతో కించపరుస్తారు, త్వరలోనే, వారు మహాబబులోను విచ్చలవిడి మార్గాల్లో పడిపోతారు. కొందరైతే, ఒకనాటి తమ సహోదరులమీద తిరుగబడి ‘కొట్టడానికి’ సాతానుచేత పురికొల్పబడ్డారు.—మత్తయి 24:49; అపొస్తలుల కార్యములు 15:29: ప్రకటన 17:5.

16. (ఎ) మతభ్రష్టుల ప్రభావం మూలంగా అస్థిరులైన వారెందుకు వెంటనే పశ్చాత్తాపపడాలి? (బి) పశ్చాత్తాప పడడానికి తిరస్కరించే వారికేమౌతుంది?

16 మతభ్రష్టుల ప్రభావంవల్ల ఊగిసలాడే వారెవరైన పశ్చాత్తాప పడాలని యేసు యిచ్చిన సలహాను పాటించడానికి వేగిరపడాలి. మతభ్రష్టుల ప్రచారాన్ని విషమేనని త్రోసివేయాలి. యేసు తన సంఘాన్ని పోషించే నీతి, పవిత్రత, ప్రేమగల సత్యాలకు భిన్నంగా అది ఈర్ష్యాద్వేషాలమీద ఆధారపడింది. (లూకా 12:42; ఫిలిప్పీయులు 1:15, 16; 4:8, 9) పశ్చాత్తాపపడని వారితో ప్రభువైన యేసు నిశ్చయంగా “[తన] నోటనుండి వచ్చు ఖడ్గముచేత . . . యుద్ధము చేయును.” ఆయన భూమ్మీద తానున్న చివరిరాత్రి తన శిష్యులతో గడిపినప్పుడు ప్రార్థించిన ఐక్యతను కాపాడడానికి ఆయన తనశిష్యులను గాలిస్తున్నాడు. (యోహాను 17:20-23, 26) తన చేతిలోని నక్షత్రాలు యిచ్చే ప్రేమాపూర్వక సహాయ సలహాలను మతభ్రష్టులు తిరిస్కరిస్తున్నారు గనుకనే యేసు వారిని ‘తీవ్రమైన’ తీర్పుతో శిక్షిస్తాడు, “వెలుపల అంధకారము” లోనికి త్రోసివేస్తాడు. వారు బహిష్కరింప బడినవారు, దేవుని ప్రజల్లో యిక పులిసిన పిండిగా వుండరు.—మత్తయి 24:48-51; 25:30; 1 కొరింథీయులు 5:6, 9, 13; ప్రకటన 1:16.

‘మరుగైయున్న మన్నా మరియు తెల్లనిరాయి’

17. ‘గెలిచే’ అభిషక్త క్రైస్తవులకొరకేమి వేచివున్నది, పెర్గములోని క్రైస్తవులు దేనిని అధిగమించ వలసిన అవసరముండెను?

17 యెహోవాయొక్క పరిశుద్ధాత్మ నడిపింపుద్వారా, యేసు యిచ్చే సలహాను లక్ష్యపెట్టేవారికొరకు ఓ బహుమానం వేచివుంది. వినండి! “సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును; పొందిన వానికేగాని అది మరి యెవనికిని తెలియదు.” (ప్రకటన 2:17) అలా, స్ముర్నలోని క్రైస్తవులవలె, పెర్గములోని క్రైస్తవులు ‘జయించు’టకు ప్రోత్సహింప బడుతున్నారు. సాతాను సింహాసనమున్న పెర్గములోనివారు జయించాలంటే వారు విగ్రహారాధనను విసర్జించాలి. వారు బాలాకు, బిలాము, నీకొలాయితు గుంపుకుచెందిన అవినీతిని, మతాంతర్భేదాలను, మతభ్రష్టత్వాన్ని జయించాలి. అలాచేయడానికి, అభిషక్త క్రైస్తవులు “మరుగైయున్న మన్నాను,” భుజించడానికి ఆహ్వానింపబడతారు. దానర్థమేమిటి?

18, 19. (ఎ) యెహోవా ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన మన్నా ఏమిటి? (బి) ఏ మన్నా మరుగు చేయబడింది? (సి) మరుగైన మన్నాను భుజించుట దేనికి సూచన?

18 మోషే కాలంలో యెహోవా ఇశ్రాయేలీయులను అరణ్యంలో పోషించడానికి మన్నాను అనుగ్రహించాడు. ఆ మన్నా దాగియుండలేదు—ఎందుకంటే, సబ్బాతు రోజున తప్ప—అది ప్రతి ఉదయాన, భూమిని కప్పే మంచువలె అద్భుత రీతిలో కనబడేది. ఇశ్రాయేలీయులు జీవించడానికి అదొక దైవ ఏర్పాటై వుండెను. “[ఇశ్రాయేలీయుల] తరములన్నింటిలోను” నిబంధన మందసము లోపల గల ఒక బంగారు పాత్ర నందు యీ “మన్నా”లో కొంత జ్ఞాపకార్థముగా భద్రపరచాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు.—నిర్గమకాండము 16:14, 15, 23, 26, 33; హెబ్రీయులు 9:3, 4.

19 ఎంత యుక్తమైన సూచనో! ఈ మన్నా, యెహోవా ప్రత్యక్షతను సూచించే మందసముమీద పడే అద్భుతమైన వెలుగు నిలిచేచోటున, గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో దాచబడింది. (నిర్గమకాండము 26:34) ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి, ఆ దాచబడిన మన్నాను తినడానికి, ఎవ్వరికి అనుమతిలేదు. అయినా, జయించిన తన అభిషక్త అనుచరులు ఆ “మరుగుచేయబడిన మన్నాను” భుజిస్తారని యేసు అన్నాడు. తమకంటే ముందు క్రీస్తు ప్రవేశించినట్లే వీరు “నిజమైన పరిశుద్ధ స్థలమునుపోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో . . . ప్రవేశింపలేదు గాని, . . . పరలోకమందే,” ప్రవేశించవలసి యున్నారు. (హెబ్రీయులు 9:12, 24) వారి పునరుత్థాన సమయంలో వారు వాడబారని అమర్త్యమును ధరించుకుంటారు—యిది నిత్యముండే “మరుగైన మన్నా”ను వారికిచ్చినట్లుగానే సూచించబడిన యెహోవా అనుగ్రహించే ఓ అద్భుతమైన ఏర్పాటు. జయించిన ఆ చిన్న గుంపెంత ఆధిక్యతగలవారో కదా!—1 కొరింథీయులు 15:53-57.

20, 21. (ఎ) అభిషక్త క్రైస్తవులకు తెల్లనిరాతి నివ్వడం దేనిని సూచిస్తుంది? (బి) మరి 1,44,000 తెల్లనిరాళ్లు మాత్రమే ఉన్నందున, గొప్పసమూహానికి ఏ నిరీక్షణ వుంది?

20 వీరు “తెల్లనిరాతిని” కూడ పొందుతారు. రోమా కోర్టుల్లో తీర్పుచెప్పేటప్పుడు తెల్లరాళ్ల నుపయోగించేవారు. * తెల్లరాయి క్షమాభిక్షకు నల్లరాయి శిక్షకు, తరచూ మరణశిక్షకే సూచన. యేసు పెర్గములోని క్రైస్తవులకు “తెల్లరాతిని” యిస్తున్నాడంటే ఆయన వారిని నిర్దోషులని పరిశుద్ధులని, పవిత్రులని తీర్పు తీరుస్తున్నాడని అర్థం. అయితే యేసు మాటలకు మరోభావముండొచ్చు. రోమీయుల కాలంలో ప్రముఖ సంఘటనల సమయంలో ప్రవేశానుమతికొరకు కూడ తెల్లరాళ్ల నుపయోగించేవారు. గనుక జయించే అభిషక్త క్రైస్తవునికి యీ తెల్లనిరాళ్లంటే విశేష ప్రత్యేకతను—గొఱ్ఱెపిల్ల వివాహానికి పరలోకమందు ఓ గౌరవనీయస్థానం పొందడానికి ఆహ్వానింపబడుటను సూచిస్తోంది. అటువంటి తెల్లనిరాళ్లు 1,44,000 మందికి మాత్రమే యివ్వబడ్డాయి.—ప్రకటన 14:1; 19:7-9.

21 మరి మీరు సహారాధికులైన గొప్పసమూహంలో ఒకరైతే యిక మిమ్మల్ని లెక్కించకుండ విడిచిపెట్టినట్లేనా? కానేకాదు! పరలోకములో ప్రవేశం అనే తెల్లనిరాయి నీకు లభించకపోయినా, నీవు సహిస్తే, మహాశ్రమలను తప్పించుకొని భూమిని పరదైసుగా మార్చే అద్భుతమైన ఆనందకరమగు పనిలోభాగం వహించేలా నీవాహ్వానించబడవచ్చు. మీతోపాటు ఆ పనిలో భాగంవహించే వారిలో తొలిక్రైస్తవుల కాలానికి ముందున్నవారిలో పునరుత్థానులయ్యే నమ్మకస్థులు, ఇటీవలికాలంలో మరణించిన వేరేగొర్రెలకు సంబంధించిన వారును ఉంటారు. చివరకు, విమోచింపబడిన మృతులంతా భూపరదైసులో జీవించడానికి పునరుత్థాన అనుగ్రహం పొందుతారు.—కీర్తన 45:16. యోహాను 10:16; ప్రకటన 7:9, 14.

22, 23. అభిషక్త క్రైస్తవులకిచ్చిన తెల్లనిరాయిపై వ్రాయబడిన పేరుకుగల ప్రాముఖ్యత ఏమిటి, ఇది ఏ ప్రోత్సాహాన్నిస్తుంది?

22 ఆ తెల్లరాతిమీద వ్రాయబడిన కొత్త పేరేమిటి? పేరనేది ఓ వ్యక్తిని గుర్తించడానికి, ఆ వ్యక్తిని యితరులలోనుండి ప్రత్యేకంగా చూపించడానికి ఉండేదే. ఈ అభిషక్త క్రైస్తవులు జయించు వారిగా తమ భూలోక జీవితాన్ని చాలించిన తర్వాత ఆ తెల్లరాతిని పొందుతారు. గనుక, తెల్లరాతిమీద వ్రాయబడిన పేరుకు యేసుతో పరలోకమందు ఏకమయ్యే వారి ఆధిక్యతకు సంబంధం ఉంది—పరలోకరాజ్యాన్ని స్వతంత్రించుకొనువారు మాత్రమే మనస్ఫూర్తిగా అభినందించి, అనుభవించే రాజసేవతో కూడిన అత్యంత సన్నిహిత స్థానం. కాబట్టి, “దాన్ని పొందిన వానికే తప్ప మరెవ్వరికిని తెలియని,” ఒక పేరు లేక ఒక హోదాయైయుంది.—ప్రకటన 3:12 పోల్చండి.

23 యోహాను తరగతి “సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటను” వినడానికి దాన్ని వర్తింప జేసుకోవడానికి ఎంతటి పురికొల్పు కల్గించే విషయం! ఇది వారి సహచరులైన గొప్పసమూహాన్ని ఎంతగా ప్రోత్సహిస్తుందో, ఈ భూమ్మీద సహనాన్ని కల్గియున్నంత కాలం కలిసి నమ్మకంగా సేవచేయడానికి, యెహోవా రాజ్యాన్ని ప్రకటించడంలో పాల్గొనడానికి వారినెంతగా పురికొల్పుతుందో!

[అధస్సూచీలు]

^ పేరా 20 అపొస్తలుల కార్యములు 26:10 మరియు న్యూవర్‌ల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌ అథఃస్సూచి చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[43వ పేజీలోని చిత్రం]

విస్తారమైన అన్యారాధనకు సజీవసాక్ష్యాలుగా యివి బెర్లిన్‌లోని పెర్గమాన్‌ మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి

[45వ పేజీలోని చిత్రం]

మన్నాలో కొంతభాగం నిబంధన మందసములో దాచబడింది. మరుగైన మన్నా యివ్వబడిందంటే, జయించే అభిషక్తులకు అమర్త్యమును ప్రసాదించడమే

తెల్లనిరాయి గొఱ్ఱెపిల్ల వివాహానికి అనుమతించబడినవారికే