కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు ప్రోత్సాహకరమగు రీతిగా వచ్చుట

యేసు ప్రోత్సాహకరమగు రీతిగా వచ్చుట

అధ్యాయం 4

యేసు ప్రోత్సాహకరమగు రీతిగా వచ్చుట

1. ఇప్పుడు యోహాను ఎవరికి వ్రాస్తున్నాడు, మరి యీనాడెవరికి ఆయనిచ్చిన వర్తమానం ఎంతో ఆసక్తికరంగా ఉన్నది?

ఈనాడు దేవుని ప్రజల సంఘాలతో సహవసించే ప్రతివ్యక్తికి ఎంతో ఆసక్తి కల్గించేదే ఇక రాబోవు వర్తమానం. ఇదిగో ఆ వర్తమాన పరంపరలు యిక్కడున్నాయి. “సమయము సమీపించు“ కొలది వాటికో విశేష వర్తింపున్నది. (ప్రకటన 1:3) మన నిత్యప్రయోజనం నిమిత్తం వాటిని మనము లక్ష్యపెట్టాలి. ఆ వర్తమానం యిలా చదువబడుతోంది: “యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు, . . . యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.”—ప్రకటన 1:4, 5బి.

2. (ఎ) “యేడు” అనే సంఖ్య దేనిని సూచిస్తుంది? (బి) ప్రభువు రాకడ కాలంలో “యేడు సంఘాల” కిచ్చిన వర్తమానం ఎవరికి వర్తిస్తుంది?

2 యోహాను యిక్కడ “యేడు సంఘములు” అని పిలుస్తున్నాడు, మరి వీటిని గూర్చి ప్రవచనంలో తర్వాత తెల్పుతున్నాడు. ఆ “యేడు” అనే సంఖ్య ప్రకటనలో తరచూ వస్తూంది. అది సంపూర్ణతకు సూచన, ముఖ్యంగా దేవుడు ఆయన సంఘానికి సంబంధించిన విషయాల్లో అది సంపూర్ణమైయుంది. ప్రభువు దినములో ప్రపంచమంతా దేవుని ప్రజల సంఘాలు వేలకువేలు విస్తరిస్తున్నందున ప్రథమంగా అభిషక్తులైన “యేడు సంఘాలకు” చెప్పబడింది. అది యీనాటి దేవుని ప్రజలందరికి కూడ వర్తిస్తుందని మనం నిశ్చయం కల్గివుండగలం. (ప్రకటన 1:10) అవును, యీలోకంలో ప్రతిచోటనున్న యెహోవాసాక్షుల సంఘాలన్నింటికి, వారితో సహవాసంచేసే వారందరికి యోహానువద్ద సమాచారముంది.

3. (ఎ) యోహాను శుభవచనంలోని “కృపాసమాధానములు” ఎక్కడనుండి వస్తాయి? (బి) అపొస్తలుడైన పౌలు తెల్పిన ఏమాటలు యోహాను పల్కిన శుభవచనంవలె ఉన్నాయి?

3 “కృపాసమాధానములు”—విశేషంగా వాటి మూలమేమిటో మనం గుణగ్రహించినప్పుడు అవెంత కోరదగినవోగదా! “ఆయన” అంటే “యుగయుగములు” జీవిస్తున్న, “యుగములలో రాజైన,” సర్వోన్నత ప్రభువగు యెహోవానుండే అవి వస్తున్నాయి. (1 తిమోతి 1:17; కీర్తన 90:2) ఇక్కడ “యేడు ఆత్మలు” కూడ ఉన్నాయి, అంటే ప్రవచనానికి అవధాన మిచ్చేవారికి జ్ఞానాన్ని, దీవెనల నిస్తున్నందున అవి దేవుని చురుకైన శక్తి, లేక పరిశుద్ధాత్మ చేసే సంపూర్ణ క్రియను సూచిస్తున్నాయి. మరియు “కృపాసత్య సంపూర్ణుడు” అని ఆ తర్వాత యోహాను తెల్పిన “యేసుక్రీస్తు” ప్రముఖ స్థానం వహిస్తున్నాడు. (యోహాను 1:14) ఆవిధంగా, యోహాను శుభవచనం, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక ముగింపులో తెల్పిన భావాలనే కల్గివుంది: “ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండునుగాక.” (2 కొరింథీయులు 13:14) ఆ మాటలు ఈనాడు సత్యాన్ని ప్రేమించే మనందరికి వర్తించును గాక!—కీర్తన 119:97.

“నమ్మకమైన సాక్షి”

4. యోహాను యేసుక్రీస్తు నెలా వర్ణిస్తున్నాడు, ఈ వర్ణనా పదాలెందుకంత యుక్తమైయున్నవి?

4 యోహాను గుర్తించి వర్ణించినట్లు, విశ్వంలో యెహోవా తర్వాత యేసే అత్యంత మహిమగల వ్యక్తైయున్నాడు, ఆయన నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైనవాడు.” (ప్రకటన 1:5ఎ) ఆకాశమందున్న చంద్రునివలె, యెహోవా సర్వాధిపత్యానికి సాక్షిగా ఆయన నిశ్చలంగా స్థిరపరచబడ్డాడు. (కీర్తన 89:37) త్యాగపూరిత మరణంవరకు ఆయన యథార్థతను కాపాడుకున్న తర్వాత మానవులలోనుండి ఆయనే ప్రథముడుగా అమర్త్యమైన ఆత్మీయ జీవానికి లేపబడ్డాడు. (కొలస్సయులకు 1:18) ఇప్పుడు యెహోవా సముఖాన, ఆయన భూరాజులందరి కంటె అత్యున్నతుడుగా హెచ్చింపబడి, “పరలోకమందును భూమిమీదను . . . సర్వాధికారము” పొందియున్నాడు. (మత్తయి 28:18; కీర్తన 89:27; 1 తిమోతి 6:15) భూలోక రాజ్యాలమధ్య పాలించునట్లు ఆయన 1914 లో రాజుగా నియమించబడ్డాడు.—కీర్తన 2:6-9; మత్తయి 25:31-33.

5. (ఎ) యోహాను యేసుక్రీస్తుయెడల అభినందన ఎలా వ్యక్తపరస్తూనే వున్నాడు? (బి) యేసు అర్పించిన తన మానవ పరిపూర్ణప్రాణం ఎడల ఎవరు ప్రయోజనం పొందుతారు, మరి అభిషక్త క్రైస్తవులెలా విశేషాశీర్వాదాలలో భాగం వహించారు?

5 యోహాను యిటువంటి ఉత్తేజకరమైన మాటల్లో ప్రభువైన యేసుక్రీస్తుకు అభినందన తెల్పుతునే వున్నాడు: “మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తనతండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను. (ప్రకటన 1:6) మానవుల్లో ఆయనయందు విశ్వాసముంచువారు పరిపూర్ణ జీవితానికి పునరుద్ధరింపబడేలా యేసు తన పరిపూర్ణ మానవప్రాణాన్ని ధారపోశాడు. ప్రియపాఠకుడా, నీవునూ యిందులో ఒకడవై యుండగలవు! (యోహాను 3:16) అయితే, యేసు త్యాగపూరిత మరణం, యోహాను వలె అభిషేకంనొందిన క్రైస్తవులకు విశేషాశీర్వాదాలకు మార్గమేర్పరచింది. యేసువలె లోకాశలన్నింటిని త్యజించిన, చిన్నమందకు చెందినవారు యేసుక్రీస్తుతోపాటు ఆయన రాజ్యంలో రాజులుగాను యాజకులుగాను సేవచేసే నిరీక్షణతో, దేవుని ఆత్మవలన అభిషేకించబడ్డారు. (లూకా 12:32; రోమీయులు 8:18; 1 పేతురు 2:5; ప్రకటన 20:6) ఎంతటి మహాధిక్యతో! మరి యేసుకు మహిమా ఘనతలు చెందుతాయని అంత రూఢిగా బిగ్గరగా చెప్పుటలో ఆశ్చర్యంలేదు!

“మేఘారూఢుడై వచ్చుచున్నాడు”

6. (ఎ) యేసు “మేఘారూఢుడై వచ్చుననే” విషయాన్ని యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు, యేసు చెప్పిన ఏ ప్రవచనం యోహానుకు జ్ఞాపకం చేయబడి యుండవచ్చు? (బి) యేసు ఎలా ‘వస్తాడు,’ లోకంలో బహుదుఃఖాన్ని అనుభవించేదెవరు?

6 తదుపరి యోహాను ఆనందోత్సాహంతో యిలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.” (ప్రటన 1:7) ఈ విధానాంతాన్నిగూర్చి యేసు అంతకుమునుపు యిచ్చిన ప్రవచనాన్ని గూర్చి యోహానుకిక్కడ నిశ్చయంగా జ్ఞాపకము చేయబడింది. యేసు అక్కడ ఇలా చెప్పాడు: “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.” (మత్తయి 24:3, 30) ఆవిధంగా యేసు, జనాంగములపై యెహోవా తీర్పులను విధించడానికి తన అవధానాన్ని మళ్లించి ‘వస్తాడు.’ ఇందువల్ల లోకంలో ముఖ్యమైన మార్పులొస్తాయి, మరియు “సకలగోత్రములవారు” యేసు రాజ్యాధిపత్యపు వాస్తవాన్ని లక్ష్యపెట్టనందున వారు నిజంగా “సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను” అనుభవిస్తారు.—ప్రకటన 19:11-21; కీర్తన 2:2, 3, 8, 9.

7. అవిధేయులతోసహా, “ప్రతి నేత్రము” యేసునెలా “చూచును”?

7 యేసు తన శిష్యులతో గడిపిన చివరి సాయంకాలం వారితో యిలా అన్నాడు: “కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు.” (యోహాను 14:18) మరైతే, ఎలా “ప్రతినేత్రము ఆయనను చూచును”? యేసు శత్రువులు ఆయనను తమ భౌతిక నేత్రాలతో చూస్తారనుకోకూడదు, ఎందుకంటే, యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత యేసు యిప్పుడు “సమీపింపరాని తేజస్సులో” ఉన్నాడు, “మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు; ఎవడును చూడనేరడు,” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (1 తిమోతి 6:16) స్పష్టంగా, యోహాను భావంలో “చూచుట” అంటే, దేవున్ని ఆయన సృష్టినిబట్టి ఆయన అదృశ్యలక్షణాలను మనం చూడగల్గినట్లే లేక వివేచించగల్గినట్లే ‘వివేచించుట’ అని అర్థం. (రోమీయులు 1:20) యేసు “మేఘారూఢుడై వచ్చును” అంటే, మేఘం వెనుకనున్న సూర్యుడు మన కంటికెలా కనబడడో ఆయన అలాగే అదృశ్యుడై వస్తాడని అర్థం. పగటిపూట మేఘావృతమైన సూర్యుడు కనబడనప్పటికి అది ఉందని మనకు తెలుసు, ఎందుకంటే దానివెలుగు మనచుట్టూ ఆవరించివుంది. అలాగే, ప్రభువైన యేసుక్రీస్తు అదృశ్యుడైనప్పటికి, ‘తన సువార్తకు లోబడనివారికి ప్రతిదండన చేయునప్పుడు ఆయన అగ్నిజ్వాలలో’ ప్రత్యక్షపరచబడును. వీరుకూడ బలవంతంగా “ఆయనను చూచెదరు.”—2 థెస్సలొనీకయులు 1:6-8; 2:8.

8. (ఎ) సా.శ. 33 లో ఆయనను “పొడిచిన” వారెవరు మరి ఈనాడు అట్టివారెవరు? (బి) యేసు యిప్పుడు లోకంలో లేడు గనుక మరి ప్రజలు ఆయన్నెలా ‘పొడవ’ గలరు?

8 “ఆయనను పొడిచినవారును” యేసును ‘చూచెదరు.’ వీరెవరై ఉండవచ్చు? సా.శ. 33వ సంవత్సరంలో యేసును చంపినప్పుడు రోమా సైనికులు నిజంగా ఆయన్ని పొడిచారు. ఆ హత్యలో యూదులకు భాగమున్నది, ఎందుకంటే, పెంతెకొస్తునాడు పేతురు వీరిలో కొందరితో యిలా అన్నాడు: “మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.” (అపొస్తలుల కార్యములు 2:5-11, 36; జెకర్యా 12:10; యోహాను 19:37 పోల్చండి.) ఆ రోమీయులు, యూదులు చనిపోయి యిప్పటికి దాదాపు 2,000 సంవత్సరాలైపోయింది. గనుక యీనాడు ‘ఆయనను పొడిచే’ వారు, యేసును వ్రేలాడదీసినప్పుడు వారు కనబరచిన స్వభావాన్నే కనబరచే ప్రజలను దేశాలను సూచిస్తున్నారు. యేసు యిప్పుడు యీలోకంలో లేడు. అయితే వ్యతిరేకులు యేసునుగూర్చి సాక్ష్యమిస్తున్న యెహోవాసాక్షులను హింసిస్తుంటే లేక దానికి సమ్మతిస్తూవుంటే, అలాంటి వ్యతిరేకులు యేసును ‘పొడుస్తున్న’ దానితో అది సమానము.—మత్తయి 25:33, 41-46.

“అల్ఫాయు ఓమెగయు”

9. (ఎ) ఇప్పుడెవరు మాట్లాడుతున్నారు, ప్రకటనలో ఎన్నిసార్లు ఆయనలా మాట్లాడారు? (బి) యెహోవా తననుతాను “అల్ఫాయు ఓమెగయు,” “సర్వాధికారి” యని సంబోధించుకొనుటలో దాని భావమేమి?

9 ఇప్పుడు, మహాశ్చర్యం! సర్వాధిపతియు ప్రభువునగు యెహోవా స్వయంగా మాట్లాడుతున్నాడు. బయల్పరచబడనైయున్న దర్శనాలకు యిది తొలిపలుకుగా ఉండడమెంత యుక్తం, ఎందుకంటే ఆయనే మన మహోపదేశకుడు, ప్రకటనకు అసలు మూలకారకుడు. (యెషయా 30:20) మన దేవుడు యిలా అంటున్నాడు: “అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే, సర్వాధికారిని.” (ప్రకటన 1:8) ప్రకటన గ్రంథంలో, యెహోవా స్వయంగా పరలోకం నుండి మాట్లాడిన మూడు సందర్భాల్లో యిది మొదటిది. (ప్రకటన 21:5-8; 22:12-15 కూడా చూడండి.) మొదటి శతాబ్దపు క్రైస్తవులు అల్ఫా, ఓమెగ అంటే గ్రీకు అక్షరమాలలో మొదటిది ఆఖరుదని వెంటనే గుర్తించివుంటారు. యెహోవా తాను ఆ రెండు అక్షరాలతో పిలుచుకొనుట, ఆయనకు ముందు సర్వోన్నత దేవుడెవరూ లేరు, ఆ తర్వాతను ఉండరని నొక్కి తెల్పుతుంది. దేవత్వాన్ని గూర్చిన వివాదాంశాన్ని ఆయన విజయవంతంగా, శాశ్వతంగా పరిష్కరిస్తాడు. ఆయనే ఏకైక సర్వశక్తిగల దేవుడని తన సృష్టంతటిలో మహోన్నత పాలకుడని శాశ్వతంగా నిరూపించుకుంటాడు.—యెషయా 46:10; 55:10, 11 పోల్చండి.

10. (ఎ) యోహాను తదుపరి తననుగూర్చి ఏమని వివరించుకుంటున్నాడు, ఆయన దేనియందు దృఢనమ్మకము కల్గియుండెను? (బి) యోహాను వ్రాసిన గ్రంథాన్ని సంఘాలకు ఎవరి సహకారముతో అందించి యుండవచ్చును? (సి) ఈనాడు ఆత్మీయాహారమెలా ఏర్పాటు చేయబడుతుంది?

10 యెహోవా తుదివరకు నడిపిస్తాడనే దృఢనమ్మకంతో, యోహాను తన తోటిదాసులకిలా చెబుతున్నాడు: “మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.” (ప్రకటన 1:9) సువార్త నిమిత్తం పత్మాసులో పరవాసియై, తన సహోదరులతో శ్రమలు సహిస్తూ, రాబోవు రాజ్యంలో పాలిభాగంకై పట్టుదలతో ఎదురుచూస్తూ, వృద్ధుడగు యోహాను యిప్పుడు ప్రకటనలోని దర్శనాల్లో మొదటిదాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనాల నెరవేర్పును చూచి యోహాను తరగతి యీనాడు ఉత్తేజం పొందుతున్నట్లే, ఆయన నిశ్చయంగా ఎంతో ప్రోత్సాహం పొంది ఉంటాడు. యోహాను అప్పుడు బంధీగా వున్నందువల్ల ఆయన ప్రకటన గ్రంథాన్నెలా సంఘాలకందించాడో మనకు తెలియదు. (ప్రకటన 1:11; 22:18, 19) యెహోవా దూతలు ఈనాడు, సత్యంకొరకు ఆకలిగొనిన తమ సహోదరులకు తగిన వేళలో ఆత్మీయాహారాన్ని అందించుటకు వీలగునట్లు యిప్పుడు నిషేధాజ్ఞలక్రిందను, ఆంక్షల్లోను సేవచేస్తున్న నమ్మకమైన యెహోవాసాక్షులను తరచూ దూతలు సంరక్షించినట్లే, ఆనాడు ఆ పనికి వారు సహకరించి ఉండవచ్చును.—కీర్తన 34:6, 7.

11. యోహాను అభినందించిన ఏ ఆధిక్యతను యోహాను తరగతి యీనాడు ఉన్నతంగా కాపాడుకుంటున్నారు?

11 యెహోవా తనను సంఘాలకు వర్తమానమందించే మధ్యవర్తిగా ఉపయోగించుకొంటున్న ఆధిక్యతను కల్గియున్నందుకు యోహాను ఎంతగా అభినందనను వ్యక్తపరచాడో! అలాగే, యోహాను తరగతి యీనాడు దేవుని యింటివారికి ఆత్మీయ ‘ఆహారాన్ని తగినవేళ’ అందించే ఆధిక్యతను ఎంతో గౌరవిస్తారు. (మత్తయి 24:45) నిత్యజీవంయొక్క దివ్యమైన నిరీక్షణను సంపాదించుకొనులాగున యీ ఆత్మీయ ఏర్పాటువల్ల బలంపొందేవారిలో నీవునూ ఒకడవైయుందువేమో!—సామెతలు 3:13-18; యోహాను 17:3.

[అధ్యయన ప్రశ్నలు]

[-21వ పేజీలోని బాక్సు]

క్లిష్టకాలంలో ఆత్మీయాహారం పొందుట

ఈ అంత్యదినాల్లో, యెహోవాసాక్షులు ఎంతో హింసను, కష్టాన్ని అనుభవిస్తుండగా, విశ్వాసంలో స్థిరులైవుండటానికి వారు ఆత్మీయాహారాన్ని పొందడం ప్రాముఖ్యమే. అనేక సందర్భాల్లో తగినంత ఆహారం అందించబడింది, మరి యెహోవా శక్తి అద్భుతరీతిలో చేసిన సహాయానికి ఎన్నో కృతజ్ఞతలు.

ఉదాహరణకు, హిట్లర్‌ పాలన క్రిందనున్న జర్మనీలో, క్రూరులైన నాజీ అధికారులు అధికారికంగా నిషేధించిన ది వాచ్‌టవర్‌ ప్రతులను సాక్షులు పలు కాపీలు తీసి పంచారు. అలా కాపీలు తయారుచేస్తున్న యింటిమీద పోలీసులు దాడిచేశారు. ఇల్లు చాలా చిన్నదైనందున ఏదైనా రహస్యంగా దాచుటకు వీల్లేకపోయింది. టైప్‌రైటర్‌ను బీరువాలోను, కాపీలుచేసే పెద్ద యంత్రసామగ్రిని యింటి క్రిందిబాగంలోని బంగాళదుంపల పెద్దబుట్టలోను దాచారు.అంతేగాక ఆ బుట్టవెనకాల పత్రికలున్న సూట్‌కేస్‌ వుంది. గాలింపు తప్పదేమోననిపించింది. కాని ఏమైంది? ఆ అధికారి దాన్నెలా తెరిచాడంటే, అందులోని టైప్‌రైటర్‌ను అతడు చూడలేదు. ఇంటి అడుగుభాగాన్నిగూర్చి యింటి యజమాని చెప్పేదేమంటే: “ముగ్గురు అధికారులు గది మధ్యలోనే నిల్చున్నారు, చూడండి, అక్కడే ఆ బుట్టవెనుక వాచ్‌టవర్‌ పత్రికలతో నిండివున్న సూట్‌కేస్‌ ఉన్నది. కాని ఎవ్వరూ దాన్ని చూచినట్లు కనబడలేదు; వారు గ్రుడ్డివారయ్యారా అనిపించింది.” చెప్పుకోదగిన ఈ ఏర్పాటుకై కృతజ్ఞతలు, ఆ యింటివారు అపాయకరమైన క్లిష్టకాలంలో ఆత్మీయాహారాన్ని అందజేయగల్గారు.

ఈ 1960వ దశాబ్దంలో, నైజీరియా, విడిపోయిన బయప్రాన్‌ల మధ్య ప్రజాపోరాటం జరిగింది. బయప్రాన్‌ ప్రాంతం చుట్టూ నైజీరియా ఉన్నందువల్ల, దానికున్న ఏకైక విమానమార్గం ద్వారానే అది బయటి ప్రపంచంతో సంబంధం కల్గివుండేది. అంటే, బయప్రాన్‌ ప్రాంతంలోవున్న సాక్షులకు ఆత్మీయాహారం అందని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు, 1968 లో, బయప్రాన్‌ అధికారులు వారి ప్రభుత్వోద్యోగులలో ఒకరిని ఐరోపాలోను, మరొకరిని బయప్రాన్‌ విమానయానంలో నియమించారు. ఈ యిద్దరు యెహోవాసాక్షులైనందువల్ల, వీరిరువురు బయప్రాన్‌కున్న ఆ ఏకైక మార్గానికిరువైపుల ఉన్నారు. ఈ ఏర్పాటు నిశ్చయంగా యెహోవా వల్లనే జరిగిందనుకున్నారు. కాబట్టి, వారు బయప్రాన్‌కు ఆత్మీయాహారాన్ని చేరవేయడానికి సున్నితమైన, క్లిష్టమైన యీ పనిని స్వచ్ఛందంగా చేపట్టారు. మరి వారీపనిని యుద్ధకాలమంతా చేశారు. వారిలో ఒకరిలా అన్నారు: “ఇది మానవ మేధస్సుకు మించిన ఏర్పాటే.”

[19వ పేజీలోని చిత్రం]

ప్రకటనలోని సూచనార్థకమైన సంఖ్యలు

సంఖ్య సూచనార్థక భావం

2 ఓ విషయాన్ని ఖచ్చితంగా స్థిరపరచడానికి సూచన. (ప్రకటన 11:3, 4;

ద్వితీయోపదేశకాండము 17:6ను పోల్చండి.)

3 నొక్కితెల్పుటకు సూచన. మరియు తీవ్రతకు సూచన.

(ప్రకటన 4:8; 8:13; 16:13, 19)

4 విశ్వమంతాయని లేక అవయవానురూపంలో నలుదిశలకు సూచన.

(ప్రకటన 4:6; 7:1, 2; 9:14; 20:8; 21:16)

6 అసంపూర్ణతకు, ఏదో అసాధారణమైన, భయంకరమైనదానికి సూచన.

(ప్రకటన 13:18; 2 సమూయేలు 21:20 పోల్చండి.)

7 యెహోవా లేదా సాతాను సంకల్పాల విషయంలో దైవనిర్ణయ

సంపూర్ణతకు సూచన. (ప్రకటన 1:4, 12, 16; 4:5; 5:1, 6;

10:3, 4; 12:3)

10 భూలోకానికి సంబంధించిన విషయాల్లో, భౌతికదృష్టిలో సంపూర్ణతకు

లేక అంతా అనుటకు సూచన. (ప్రకటన 2:10; 12:3;

13:1; 17:3, 12, 16)

12 పరలోకంలోగాని భూలోకంలోగాని దైవనియమిత సంస్థకు సూచన.

(ప్రకటన 7:5-8; 12:1; 21:12, 16; 22:2)

24 యెహోవా విస్తారమైన (రెండింతల) సంస్థాపర ఏర్పాటుకు సూచన.

(ప్రకటన 4:4)

ప్రకటనలో తెలుపబడిన కొన్ని సంఖ్యలు అక్షరార్థమైనవని గ్రహించాలి. అందుకు తరచూ ఆ సందర్భమే సహాయపడుతుంది. (ప్రకటన 7:4, 9; 11:2, 3; 12:6, 14; 17:3, 9-11; 20:3-5లను చూడండి.)