కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రెండు భయంకరమైన మృగాలతో పోరాడుట

రెండు భయంకరమైన మృగాలతో పోరాడుట

అధ్యాయం 28

రెండు భయంకరమైన మృగాలతో పోరాడుట

దర్శనము 8—ప్రకటన 13:1-18

అంశం: ఏడు తలలుగల క్రూరమృగము, రెండు కొమ్ములుగల క్రూరమృగము, మరియు ఆ క్రూరమృగముయొక్క ప్రతిమ

నెరవేర్పు కాలం: నిమ్రోదు కాలంనుండి మహాశ్రమలవరకు

1, 2. (ఎ) యోహాను ఘటసర్పాన్ని గూర్చి ఏమి చెబుతున్నాడు? (బి) యోహాను సాదృశ్యమైన భాషలో, ఘటసర్పము ఉపయోగించే దృశ్యసంస్థనుగూర్చి ఎలా వర్ణిస్తున్నాడు?

ఆ మహా ఘటసర్పం భూమ్మీదికి పడద్రోయబడింది! మన ప్రకటన గ్రంథ పఠనం స్పష్టంగా తెలిపేదేమంటే ఆదిసర్పంగాని, లేక అతని అనుచరులైన దయ్యాలుగాని యిక ఎన్నటికీ మరల పరలోకానికి అనుమతించబడరు. అయితే “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము” విషయం మనమింకా ముగించలేదు. ఆ తర్వాత, సాతాను ‘ఆ స్త్రీతో ఆమె సంతానముతో’ యుద్ధం చేయడాని కుపయోగించిన ఉపకరణాన్నిగూర్చి ఆ వృత్తాంతం వివరంగా తెల్పుతుంది. (ప్రకటన 12:9, 17) ఆ ఘటసర్పాన్ని గూర్చి యోహాను ఇలా చెబుతున్నాడు: “సముద్రతీరమున నిలిచెను,” (ప్రకటన 12:17బి) గనుక మనం ఘటసర్పం దేనితో యుద్ధం చేస్తాడో ఒక క్షణమాగి పరిశీలిద్దాము.

2 పరిశుద్ధ పరలోకం యిక ఎన్నటికి సాతాను అతని దయ్యాల ప్రత్యక్షత మూలంగా బాధించబడదు. ఆ దుష్టదయ్యాలు పరలోకమునుండి వెళ్లగొట్టబడి భూపరిధికి పరిమితం చేయబడ్డాయి. నిశ్చయంగా ఇందుకే, యీ 20వ శతాబ్దంలో దయ్యాలకు సంబంధించిన క్రియలు విస్తారంగా పెరిగిపోవడానికి కారణమైంది. ఆ యుక్తిగల సర్పం దుష్ట ఆత్మీయ సంస్థను యింకా నడిపిస్తునే ఉన్నాడు. అయితే అతడు మానవులను మోసగించడానికి ఒక దృశ్యమైన సంస్థను కూడ ఉపయోగిస్తున్నాడా? యోహాను మనకిలా తెల్పుతున్నాడు: “మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములోనుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలలమీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దానిపాదములు ఎలుగుబంటి పాదములవంటివి, దానినోరు సింహపునోరువంటిది, దానికి ఆ ఘటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను.”—ప్రకటన 13:1, 2.

3. (ఎ) ప్రవక్తయైన దానియేలు దర్శనంలో ఎటువంటి భయంకరమైన మృగాలను చూశాడు? (బి) దానియేలు 7వ అధ్యాయంలోని ఆ పెద్దమృగాలు దేన్ని సూచిస్తున్నాయి?

3 ఈ వింత మృగమేమిటి? బైబిలే దీనికి సమాధానమిస్తుంది. సా.శ.పూ 539 లో బబులోను కూలిపోకముందు యూదుల ప్రవక్తయైన దానియేలు క్రూరమృగములతో కూడిన దర్శనాలను చూశాడు. దానియేలు 7:2-8 వచనాల్లో ఆయన నాలుగు మృగాలు సముద్రమునుండి పైకివచ్చే విషయాన్ని యిలా వర్ణిస్తున్నాడు, మొదటిది సింహమును, రెండవది ఎలుగుబంటిని, మూడవది చిఱుతపులిని పోలివున్నాయి, మరియు “ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను . . . అది మహాబల మహాత్మ్యములు గలది; . . . దానికి పదికొమ్ములు నుండెను.” సుమారు సా.శ. 96 లో యోహాను చూసిన క్రూరమృగం మాదిరేవుంది. ఆ మృగానికికూడ సింహం, ఎలుగుబంటి, చిఱుతపులి పోలికలున్నాయి, పదికొమ్ములున్నాయి. దానియేలు చూచిన ఆ మహా జంతువులేమైయున్నవి? ఆయన మనకిలా తెల్పుతున్నాడు: “ఈ మహా జంతువులు . . . లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి.” (దానియేలు 7:17) అవును, ఆ మృగాలు “రాజులను,” లేక భూమ్మీదనున్న రాజకీయశక్తులను సూచిస్తున్నాయి.

4. (ఎ) దానియేలు 8వ అధ్యాయంలోని పొట్టేలు, మేకపోతు దేనిని సూచించాయి? (బి) మేకపోతు పెద్దకొమ్ము విరగడం, దానికి బదులు నాలుగు కొమ్ములు రావడం దేన్ని తెలియజేశాయి?

4 మరో దర్శనంలో, దానియేలు పెద్దకొమ్ముగల మేకపోతు రెండుకొమ్ములుగల పొట్టేలును పొడిచి నేలకూల్చడాన్ని చూస్తాడు. గబ్రియేలు దూత దాని భావమును యిలా వివరిస్తున్నాడు: “ఆ పొట్టేలు . . . మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల మేకపోతు గ్రేకుల రాజు.” గబ్రియేలు ఆ మేకపోతుకున్న ప్రసిద్ధమైన కొమ్ము విరుగగొట్ట బడుతుందని దానిస్థానంలో మరి నాలుగు కొమ్ములు వస్తాయని ప్రవచిస్తున్నాడు. ఇది 200 ఏండ్ల తర్వాత అంటే అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ చనిపోయి అతని రాజ్యము తన నలుగురు సైన్యాధిపతులు పాలించిన నాలుగు రాజ్యాలుగా విడిపోయినప్పుడు నిజంగా నెరవేరింది.—దానియేలు 8:3-8, 20-25. *

5. (ఎ) మృగము అనే పదానికి గ్రీకులో ఏమేమి అర్థాలున్నాయి? (బి) ప్రకటన 13:1, 2 లోని క్రూరమృగము, దాని ఏడు తలలు దేన్ని సూచిస్తున్నాయి?

5 గనుక, ప్రేరేపిత బైబిలు గ్రంథకర్త భూమ్మీద రాజకీయ శక్తులను మృగాలుగా పరిగణిస్తున్నాడనుట స్పష్టమే. ఎటువంటి మృగాలు? ప్రకటన 13:1, 2 నందలి క్రూరమృగాన్ని “మృగం” అని ఒక వ్యాఖ్యానకర్త పిలుస్తూ, యింకనూ యిలా అంటున్నాడు: “క్రూరమైన, నాశనకరమైన, భయంకరమైన, పీక్కుతినే లక్షణాలుగల రాక్షసి వంటి అర్థాలు కల్గియున్న θηρίον [థెరియోన్‌, “మృగం” అనేదానికి గ్రీకు పదం] అందించే భావాలన్నింటిని మేమంగీకరిస్తాం.” * మానవునిపై సాతాను చెలాయిస్తున్న రక్తసిక్త రాజకీయ విధానాన్ని అదెంత చక్కగా వర్ణిస్తుంది! ఈ క్రూరమృగము యొక్క ఏడు తలలు, యోహాను కాలంవరకు బైబిలు చరిత్రలో చూపబడిన ఆరు ప్రపంచ ఆధిపత్యాలను అంటే—ఐగుప్తు, అస్సీరియా, బబులోను, మాదీయులు-పారసీకులు, గ్రీకు, మరియు రోమా—అటుతర్వాత ప్రత్యక్షమౌతాయని ప్రవచింపబడిన ఏడవ ప్రపంచ ఆధిపత్యమును సూచిస్తున్నాయి.—ప్రకటన 17:9, 10 పోల్చండి.

6. (ఎ) క్రూరమృగము యొక్క ఏడు తలలు ఏ విషయంలో నాయకత్వం వహించాయి? (బి) యూదా విధానం మీదికి యెహోవా తీర్పును తీర్చడానికి ఆయన రోమా సామ్రాజ్యాన్నెలా ఉపయోగించుకున్నాడు, మరైతే యెరూషలేములోని క్రైస్తవులెలా తప్పించుకున్నారు?

6 నిజమే, యోహాను చూసిన క్రూరమృగానికి శరీరం అలాగే ఏడుతలలు పదికొమ్ములున్నట్లే—చరిత్రలో ఈ ఏడు ప్రపంచ ఆధిపత్యాలేగాక మరితరమైనవి కూడ ఉన్నాయి. అయితే ఈ ఏడుతలలు, దేవుని ప్రజలను బాధించడంలో వాటివాటివంతులు నిర్వహించిన ఏడు పెద్ద ఆధిపత్యాలను సూచిస్తున్నాయి. సా.శ. 33 లో రోమా సామ్రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు సాతాను దేవుని కుమారుని చంపడానికి క్రూరమృగము యొక్క ఆ తలను ఉపయోగించుకున్నాడు. ఆ సమయంలో, దేవుడు అవిశ్వాసంగల యూదా విధానాన్ని విసర్జించి, ఆ తర్వాత సా.శ. 70 లో ఆ జనాంగం మీదను తన తీర్పును అమలు చేయడానికి రోమా సామ్రాజ్యాన్ని అనుమతించాడు. సంతోషకరమైన విషయమేమంటే, అభిషక్త క్రైస్తవుల సంఘమైన దేవుని నిజమైన ఇశ్రాయేలు, ముందుగనే హెచ్చరింపబడింది. యెరూషలేము, యూదా ప్రాంతాలలోనున్న వారు యొర్దాను నది ఆవలివైపునున్న సురక్షిత ప్రాంతానికి పారిపోయారు.—మత్తయి 24:15, 16; గలతీయులు 6:16.

7. (ఎ) ఈ పరిపాలనా విధానం అంతానికి వచ్చినప్పుడు, ప్రభువు దినము ఆరంభమైనప్పుడు ఏమి సంభవించనై యుండెను? (బి) ప్రకటన 13:1, 2 లోని క్రూరమృగం యొక్క ఏడవ తల ఏదని రుజువైంది?

7 అయిననూ, సామాన్య శకం మొదటి శతాబ్దానికెల్లా, యీ తొలి క్రైస్తవ సంఘంలోని అనేకులు సత్యంలోనుండి పడిపోయారు, “రాజ్యసంబంధులు” అయిన నిజమైన క్రైస్తవులనే గోధుమలు, “దుష్టుని సంబంధులు,” అయిన గురుగులచేత ఎక్కువగా అణచివేయబడ్డారు. కాని ఆ విధానంయొక్క అంతం వచ్చినప్పుడు, అభిషక్త క్రైస్తవులు మరల ఒక సంస్థగా కనబడ్డారు. ప్రభువుదినములో, నీతిమంతులు “సూర్యునివలె తేజరిల్ల” వలసియున్నారు. కావున, క్రైస్తవ సంఘం సేవనిమిత్తం సంస్థీకరించబడింది. (మత్తయి 13:24-30, 36-43) అప్పటికి రోమాసామ్రాజ్యం యికలేదు. శక్తివంతమైన అమెరికా సంయుక్త రాష్ట్రాలతోపాటు, పెద్ద బ్రిటిష్‌ సామ్రాజ్యం, ప్రపంచ పరిపాలనా రంగంలో కేంద్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ ద్వంద్వ ప్రపంచాధిపత్యమే క్రూరమృగము యొక్క ఏడవ తలగా నిరూపించుకున్నది.

8. ఆంగ్లో-అమెరికా ద్వంద్వ ప్రపంచాధిపత్యాన్ని మృగమని పోల్చడంలో ఎందుకు ఆశ్చర్యపడకూడదు?

8 పాలించే రాజకీయ శక్తులను క్రూరమృగముతో జతచేయడం మిక్కిలి ఆశ్చర్యం కల్గించడం లేదా? అదే II వ ప్రపంచ యుద్ధకాలంలో యెహోవాసాక్షుల స్థానాన్నిగూర్చి ఒక సంస్థగాను, వ్యక్తిగతంగాను, లోకమంతటా న్యాయస్థానాలలో సవాలు చేయబడినప్పుడు కొందరు విరోధులు వారిని గూర్చి అలాగే ఆరోపించారు. కాని ఓ క్షణమాగి ఆలోచించండి! దేశాలే వాటి దేశానికి చిహ్నంగా మృగాలను లేక క్రూర జంతువులను వాడడంలేదా? ఉదాహరణకు, బ్రిటిష్‌ సింహాన్ని, అమెరికా పక్షిరాజును, చైనా ఘటసర్పాన్ని చిహ్నాలుగా ఉపయోగిస్తున్నాయి. గనుక, పరిశుద్ధ బైబిలు దైవిక గ్రంథకర్త ప్రపంచ ఆధిపత్యాలను సూచించడానికి మృగాలను వాడితే ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్పాలి?

9. (ఎ) సాతాను తన అధికారాన్ని క్రూరమృగమునకు ఇస్తాడని బైబిలు చెప్పేదానికి ఒకరెందుకు అభ్యంతరం చెప్పకూడదు? (బి) సాతాను బైబిలునందెలా వర్ణించబడ్దాడు, అతడు ప్రభుత్వాలపై ఎలా ప్రభావం కల్గివున్నాడు?

9 అంతేగాక, ఈ క్రూరమృగానికి తన గొప్ప అధికారాన్ని కట్టబెట్టేవాడు సాతానేనని బైబిలు చెప్పేమాటకుకూడ ఎవరైనా ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఆ వ్యాఖ్యానానికి మూలం దేవుడే, మరి ‘జనములు చేదనుండి జారు బిందువుల వంటివారు, ధూళివంటివారు.’ ఆ జనాంగములు తమనుగూర్చి ఆయన ప్రవచన వాక్యము వర్ణించే విషయాన్ని అవహేళనగా తీసుకోకుండా ఉంటేనే అవి దేవుని అనుగ్రహాన్ని పొందగలవు. (యెషయా 40:15, 17; కీర్తన 2:10-12) సాతాను, శరీరాన్ని విడిచివెళ్లిన ఆత్మలను నరకాగ్నిలో బాధించడానికి నియమించబడిన అభూత కల్పిత వ్యక్తికాదు. అటువంటి స్థలమే లేదు. బదులుగా, సాతాను ఒక “వెలుగు దూత” యని, అంటే సాధారణ రాజకీయ వ్యవహారాల్లో గట్టి ప్రభావాన్ని ప్రదర్శించే మహా మోసగాడని లేఖనాలలో వర్ణించబడ్డాడు.—2 కొరింథీయులు 11:3, 14, 15; ఎఫెసీయులు 6:11-18.

10. (ఎ) పదికొమ్ములలో ప్రతిదానికి కిరీటముందనే విషయం దేన్ని సూచిస్తుంది? (బి) పదికొమ్ములు, పదికిరీటాలు దేన్ని సూచిస్తున్నాయి?

10 ఆ క్రూరమృగానికి దాని ఏడు తలలమీద పది కొమ్ములున్నాయి. బహుశ నాలుగు తలలకు ప్రతి తలమీద ఒక్కొక్క కొమ్ముచొప్పున, మూడు తలలమీద ఒక్కొక్క దానిమీద రెండేసి కొమ్ముల చొప్పున ఉండివుండొచ్చు. అంతేకాదు అది దాని కొమ్ములమీద పది కిరీటాలను కల్గియున్నది. దానియేలు పుస్తకంలో భయంకరమైన మృగాలు వర్ణించబడ్డాయి, వాటి కొమ్ముల సంఖ్యను అక్షరార్థంగానే లెక్కించాలి. ఉదాహరణకు, పొట్టేలు మీదనున్న రెండు కొమ్ములు మాదీయులు పారసీకుల ద్వంద్వ ప్రపంచ అధిపత్యాన్ని సూచించాయి, మేకపోతుకున్న నాలుగు కొమ్ములు అలెగ్జాండర్‌ యొక్క గ్రీకు సామ్రాజ్యంనుండి వెడలి వచ్చిన నాలుగు సమకాలిక సామ్రాజ్యాలను సూచించాయి. (దానియేలు 8:3, 8, 20-22) అయితే యోహాను చూసిన మృగం మీదనున్న పదికొమ్ములు సాదృశ్యమైనవిగా కనబడుతున్నాయి. (దానియేలు 7:24; ప్రకటన 17:12 పోల్చండి.) అవి సాతాను సంపూర్ణ రాజకీయ సంస్థగా తయారైన అన్ని రాజ్యాల పరిపాలనా సంపూర్ణతను సూచిస్తాయి. ఈ కొమ్ములన్నీ క్రూరమైనవి, ఘాతుకమైనవి, గానీ ఏడుతలలు చూపిస్తున్నట్లుగా, ప్రతిసారి అధికారం ఒక ప్రపంచ ఆధిపత్యంలోనే ఉంటుంది. అదేమాదిరి, ఆధిపత్యాలన్నీ అప్పుడు అధికారం చెలాయిస్తున్న దేశం ప్రపంచాధిపత్యముతో కలిసి లేదా ఏకకాలంలో అధికారాన్ని చెలాయిస్తాయని ఆ పది కిరీటాలు సూచిస్తున్నాయి.

11. క్రూరమృగము “తలలమీద దేవదూషణకరమైన పేళ్లు” ఉండెననే వాస్తవం దేన్ని సూచిస్తుంది?

11 ఆ క్రూరమృగం “తలలమీద దేవదూషణకరమైన పేళ్లు”న్నాయి, అంటే యెహోవా దేవుడు, క్రీస్తుయేసు యెడల చాలా అమర్యాదకరంగా ప్రవర్తిస్తుందన్నట్లుగా అదే తెలియజేస్తుంది. అది తన రాజకీయ ప్రయోజనాలకొరకు దేవుని పేరును, క్రీస్తుపేరును కపటంగా ఉపయోగించు కున్నది; దాని రాజకీయ కార్యకలాపాలలో మతగురువులు పాల్గొనేలా కూడా అనుమతిస్తూ, అబద్ధమతంతో ఆట్లాడుకున్నది. ఉదాహరణకు, ఇంగ్లాండులోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ల్లో బిషప్పులు కూడ సభ్యులుగా ఉన్నారు. కెథోలిక్‌ కార్డినల్స్‌ ఫ్రాన్స్‌, ఇటలీ దేశాల్లో రాజకీయంగా కీలకస్థానాలను నిర్వహించారు, మరి యీమధ్యనే లాటిన్‌ అమెరికాలో మతగురువులు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రభుత్వాలు వాటి బ్యాంక్‌ నోట్లమీద “మేము దేవునియందు నమ్మకముంచుతున్నాం” అన్నటువంటి మతసంబంధమైన వాక్యాలు ముద్రిస్తున్నాయి, మరియు తమ పాలకులకు దైవానుగ్రహముందని వాటి నాణెములమీద వేసి తెల్పుతున్నాయి, ఉదాహరణకు, “దేవుని కృపవల్ల” వీరు నియమించబడ్డారని చెబుతున్నాయి. నిజానికి యిదంతా దేవదూషణే, ఎందుకంటే అది మలినమైన దేశరాజకీయ రంగంలో దేవున్ని చేర్చాలని ప్రయత్నిస్తుంది.

12. (ఎ) క్రూరమృగము “సముద్రములోనుండి పైకివచ్చుట” దేన్ని సూచిస్తుంది, మరి అదెప్పుడు అలా రావడానికి ఆరంభించింది? (బి) ఘటసర్పం దాని గొప్పఅధికారాన్ని ఆ సాదృశ్యమైన మృగానికివ్వడం దేన్ని సూచిస్తుంది?

12 ఆ క్రూరమృగము “సముద్రములోనుండి” పైకి వస్తుంది, యిది మానవప్రభుత్వం ఉద్భవిస్తున్న అల్లకల్లోలమగు జనములకు సరియైన సూచయైయున్నది. (యెషయా 17:12, 13) ఈ క్రూరమృగము, యెహోవాకు వ్యతిరేకంగా, జలప్రళయంకంటె ముందటికాలంలో దానికదే మొదటిసారిగా కనబర్చుకున్న కాలంలో అంటే (సుమారు సా.శ.పూ. 21వ శతాబ్దంలో) పూర్వం నిమ్రోదు కాలంలో అల్లకల్లోలమైన మానవులైన సముద్రంలోనుండి పైకిరావడానికి ఆరంభించింది. (ఆదికాండము 10:8-12; 11:1-9) అయితే, ప్రభువుదినములో మాత్రమే దాని ఏడు తలల్లో చివరిది దానంతటదే పూర్తిగా కనబరచుకున్నది. ఆ ఘటసర్పమే “క్రూరమృగమునకు తన బలమును సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను” అన్న విషయాన్ని గమనించండి. (లూకా 4:6 పోల్చండి.) మానవుల్లో సాతాను చేసిన రాజకీయసృష్టే ఆ క్రూరమృగము. సాతాను నిజంగా “ఈ లోకాధికారి.”—యోహాను 12:31.

చావుదెబ్బ

13. (ఎ) ప్రభువు దినారంభంలో ఆ క్రూరమృగానికి ఏ విపత్తు ముంచుకొస్తుంది? (బి) ఒక తల చావుదెబ్బతింటే మృగమంతా ఎలా బాధపడింది?

13 ప్రభువుదినపు తొలిభాగంలో ఆ క్రూరమృగానికి విపత్తు వాటిల్లుతుంది. యోహాను యిలా తెల్పుతున్నాడు: “దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగమువెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి.” (ప్రకటన 13:3) ఆ క్రూరమృగం యొక్క ఒక తలకు చావుదెబ్బ తగిలిందని ఈ వచనం చెబుతుంది, గానీ 12వ వచనం ఆ మృగానికే అటువంటి దెబ్బతాకినట్టు తెల్పుతుంది. ఎందుకలా? ఎందుకంటే మృగముయొక్క అన్ని తలలు ఒకేసారి అధికారానికి రాలేదు. ప్రతీదీ, దానిదాని కాలంలో మానవులపై, ముఖ్యంగా దేవుని ప్రజలపై అధికారం చెలాయించింది. (ప్రకటన 17:10) అలా, ప్రభువు దినము ఆరంభమయ్యే నాటికి ఒకే తల, ఏడవది, ప్రపంచ ఆధిపత్యముగా అధికారంలోవుంది. ఆ తలపై కొట్టబడిన చావుదెబ్బ మృగమంతటికి ఎంతో బాధను కల్గిస్తుంది.

14. చావుదెబ్బ ఎప్పుడు తగిలింది, సాతానుయొక్క క్రూరమృగంపై కల్గిన దాని ప్రభావాన్నిగూర్చి ఒక సైనిక అధికారి ఏమని వ్యాఖ్యానించాడు?

14 ఆ చావుదెబ్బ ఏమిటి? తర్వాత అది కత్తిదెబ్బ అని పిలువబడింది, కత్తి యుద్ధానికి సూచన. ఈ కత్తిదెబ్బ, ప్రభువు దినములోని తొలిభాగమందు తగిలే యీదెబ్బ, సాతాను యొక్క రాజకీయ క్రూరమృగమును నాశనముచేసి వడగట్టిన మొదటి ప్రపంచయుద్ధానికి తప్పక సంబంధం కల్గివుండాలి. (ప్రకటన 6:4, 8; 13:14) ఆ యుద్ధకాలంలో సైన్యాధికారిగా ఉన్నవ్యక్తి, రచయిత మౌరిస్‌ జెనివోక్స్‌ దాన్నిగూర్చి యిలా అన్నాడు: “మానవుని చరిత్రలో కొన్ని తేదీలకే ఆగష్టు 2, 1914నకు ఉన్న ప్రాముఖ్యత ఉంటుందని గుర్తించే విషయాన్ని ప్రతిఒక్కరూ అంగీకరిస్తారు. మొదట ఐరోపా, పిదప దాదాపు మానవులంతా మరణకరమైన సంఘటనలో పాల్గొన్నారు. సమావేశాలు, ఒప్పందాలు, నైతిక చట్టాలు, అన్నింటి పునాదులు కదిలాయి; ప్రతీరోజు భయాందోళనగా ఉండేది. ఆ సంఘటన సహజ విపత్సూచకములు, సహేతుకమైన ఊహలను రెండింటిని మించిపోనైయుండెను. భయంకరం, అల్లకల్లోలం, భీతిగొల్పేదై, అదింకా మనల్ని దాని కోరలక్రిందికి లాక్కుంటుంది.”—అకాడమీ ఫ్రాంకాయిస్‌ సభ్యుడైన, మౌరిస్‌ జెనివోక్స్‌, ప్రామిస్‌ ఆఫ్‌ గ్రేట్‌నెస్‌ (1968) అనే పుస్తకంలో పేర్కొన్నాడు.

15. క్రూరమృగంయొక్క ఏడవతల ఎలా చావుదెబ్బ తిన్నది?

15 క్రూరమృగముయొక్క ముఖ్యమైన ఏడవతలకు ఆ యుద్ధం గొప్ప వినాశకారియైంది. ఇతర ఐరోపా దేశాలతోపాటు బ్రిటన్‌ అనేకమంది యవ్వనులను కోల్పోయింది. ఒకే పోరాటంలో, అంటే 1916 లో జరిగిన రివర్‌ సోమీ పోరాటంలో 1,94,000 మంది ఫ్రెంచ్‌వారు, 4,40,000 మంది జర్మన్‌ వారితోపాటు, 4,20,000 మంది బ్రిటిష్‌ వారు చనిపోయారు, అంటే 10,00,000 కంటె ఎక్కువమందే చనిపోయారు! ఆర్థికంగాకూడ బ్రిటన్‌—ఇతర ఐరోపా దేశాలతోపాటు—విపరీతంగా దెబ్బతిన్నది. ఆ మహాగొప్ప బ్రిటిష్‌ సామ్రాజ్యం ఆ దెబ్బకు తల్లడిల్లి, యిక ఎన్నటికి పూర్తిగా కోలుకోలేక పోయింది. నిజంగా, 28 పెద్దదేశాలు పాల్గొన్న ఆ యుద్ధం, చావుదెబ్బ అన్నట్లు ప్రపంచాన్నంతటిని గిరగిర త్రిప్పింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన 65 సంవత్సరాలకు, ఆగష్టు 4, 1979న ఇంగ్లాండులోని, లండన్‌ పత్రిక ది ఎకానమిస్ట్‌ యిలా వ్యాఖ్యానించింది: “ప్రపంచం 1914 లో అప్పటినుండి మరల కోలుకోలేని రీతిలో పట్టుతప్పింది.”

16. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో, అమెరికా తాను ద్వంద్వ ప్రపంచాధిపత్యంలో ఓ భాగమని ఎలా కనబర్చింది?

16 అదే సమయంలో, ఆనాడు మహాయుద్ధమని పిలువడిన ఆ యుద్ధం ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యంలో అమెరికా ప్రత్యేకంగా ఒక భాగమయ్యేందుకు మార్గాన్ని సుగమం చేసింది. యుద్ధం జరుగుతున్న మొదటి సంవత్సరాలలో అమెరికా ఆ పోరాటంలో పాల్గొనేదిలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే చరిత్రకారుడైన ఎస్మీ వింగ్‌ఫీల్డ్‌-స్ట్రార్ట్‌ఫోర్డ్‌ వ్రాసినట్లు, “బ్రిటన్‌ మరియు అమెరికాలు తమతమ విభేదాలు విస్మరించి ఒకే తాటిక్రిందకు రావలెనా అన్నదే యీ క్లిష్ట ఘడియలో కలిగే సంశయం.” పరిస్థితులు మారుతున్నదృష్ట్యా వారలాగే చేశారు. మరి 1917 లో సంయుక్తదేశాల యుద్ధదాడిని ఎదుర్కోవడానికి అమెరికా దాని వనరులను, సైన్యాన్ని అందించింది. అలా బ్రిటన్‌ అమెరికాలు కలిసిన ఏడవతల, విజయఢంకా మ్రోగించింది.

17. యుద్ధం తర్వాత సాతాను భూలోక విధానానికి ఏమైంది?

17 యుద్ధం తర్వాత ప్రపంచం ఎంతో భిన్నంగావుంది. సాతాను భూలోక విధానం, చావుదెబ్బతిన్ననూ, పుంజుకొని మునుపటికంటె మరీబలంపొంది తన పునరారోగ్య స్థితినిబట్టి మానవుల మెప్పునుపొందింది.

18. భూజనులంతా “మృగము వెంటవెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి” అని ఎలా చెప్పవచ్చు?

18 చరిత్రకారుడైన చార్లెస్‌ యల్‌. మీ, జూనియర్‌., యిలా వ్రాస్తున్నాడు: “[మొదటి ప్రపంచయుద్ధం మూలంగా] పాతవిధానం కూలిపోవడంవల్ల, స్వయంపాలనకు, క్రొత్తరాజ్యాలు, తెగలు ఏర్పడడానికి, క్రొత్త స్వేచ్ఛాస్వతంత్ర వాయువులను పీల్చుకోవడానికి అవసరమైన మార్గమేర్పడింది.” ఈ యుద్ధానంతర తరంలో క్రూరమృగంయొక్క ఏడవ తల అభివృద్ధి పథంలోనున్నది. అదిప్పుడు స్వస్థతపొందినదై, అమెరికా సంయుక్త రాష్ట్రాలతోకలిసి తిరుగులేని శక్తిగా రూపొందుచున్నది. ఈ ద్వంద్వశక్తి నానాజాతిసమితిని, ఐక్యరాజ్యసమితిని రెండింటిని గూర్చి ప్రచారం చేయడంలో నాయకత్వం వహించింది. మరి 1980వ దశాబ్దం నాటికి అమెరికా రాజకీయశక్తి, ఆర్థికంగా మెరుగైన దేశాలు ఉన్నత జీవనప్రమాణాలతో జీవించడాన్ని సృష్టించుకోవడంలో, అంటే రోగాలను అరికట్టడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రచారంచేయడంలో ముందంజవేసేలా నడిపించింది. అది 12 మందిని చంద్రుని మీదికి పంపింది. గనుకనే, భూజనులందరూ “మృగమువెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి” అనుటలో ఆశ్చర్యమేమీలేదు.

19. (ఎ) భూజనులు ఎలా క్రూరమృగాన్ని చూచి ఆశ్చర్యపడడం కన్న ఎక్కువే చేశారు? (బి) నిర్వివాదంగా ఎవరికి భూలోకమంతటి మీద అధికారమున్నది, మరి అది మనకెలా తెలుసు? (సి) సాతాను క్రూరమృగానికి ఎలా అధికారాన్ని అప్పగిస్తాడు, మరి ఇది అనేకమంది ప్రజలపై ఎటువంటి ప్రభావం కల్గివుంటుంది?

19 యోహాను తర్వాత తెలియజేస్తున్న రీతిగా, మానవులు క్రూరమృగం విషయంలో ఆశ్చర్యపడడంకన్న ఎక్కువే చేస్తున్నారు: “ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారు—ఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగలవాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి.” (ప్రకటన 13:4) యేసు భూమ్మీద ఉన్నప్పుడు భూలోక రాజ్యాలన్నిటిమీద తనకు అధికారం ఉందని సాతాను అన్నాడు. యేసు యీ విషయాన్ని ఖండించలేదు; నిజానికి ఆయనే సాతానును యీ లోకాధికారి యంటూ, ఆ నాటి రాజకీయాల్లో పాల్గొనడానికి నిరాకరించాడు. యోహాను పిదప నిజక్రైస్తవులను గూర్చి వ్రాస్తూ యిలా అన్నాడు: “మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము.” (1 యోహాను 5:19; లూకా 4:5-8; యోహాను 6:15; 14:30) సాతాను మృగానికి అధికారాన్నిస్తాడు, దాన్నతడు జాతీయ తత్వముమీద ఆధారం చేసుకొని యిస్తాడు. అలా, దైవప్రేమలో ఐక్యమయ్యే బదులు మానవజాతియంతా తెగ, జాతి, దేశం అంటూ విభాగించబడి ఉంది. అందుకే మానవులలో అధికులు తాము నివసిస్తున్న ప్రాంతములో అధికారము కల్గియున్న క్రూరమృగాన్ని ఆరాధిస్తున్నారు. అలా ఆ మృగమంతా ఆశ్చర్యాన్ని ఆరాధనను అందుకుంటుంది.

20. (ఎ) ప్రజలు ఏ భావంలో క్రూరమృగాన్ని ఆరాధిస్తున్నారు? (బి) యెహోవా దేవున్ని ఆరాధించే క్రైస్తవులు ఎందుకు అటువంటి క్రూరమృగారాధనలో పాల్గొనరు, మరి వారెవరి మాదిరిని అనుసరిస్తారు?

20 ఆరాధనంటే ఎటువంటిది? అంటే దేవుని ప్రేమించడంకంటే దేశాన్ని ఎక్కువగా ప్రేమించడం. అనేకులు తమ స్వదేశాన్ని ప్రేమిస్తారు. సత్పౌరులుగా క్రైస్తవులుకూడ వారు నివసిస్తున్న దేశపాలకులను చిహ్నాలను గౌరవిస్తారు, చట్టాలకు లోబడతారు, వారి సమాజం, యిరుగుపొరుగువారి సంక్షేమంకొరకు తగినరీతిగా సహాయపడతారు. (రోమీయులు 13:1-7; 1 పేతురు 2:13-17) అయినా, వారు యితర దేశాలన్నింటికంటె ఒక దేశానికి గ్రుడ్డిగా భక్తిని చూపలేరు. “తప్పైనా, ఒప్పైనా యిది మా దేశం” అనేది క్రైస్తవుల బోధకాదు. కాబట్టి, యెహోవాను ఆరాధించే క్రైస్తవులు క్రూరమృగంయొక్క ఏభాగానికైనా దేశభక్తిగల ఆరాధనలో పాలుపంచుకొనలేరు, ఎందుకంటే, వారలాచేస్తే మృగముయొక్క అధికారానికి మూలమైన—ఘటసర్పాన్ని ఆరాధించినట్లవుతుంది. వారు ఆశ్చర్యంతో యిలా అడుగలేరు: “ఈ మృగముతో సాటియెవడు?” కానీ, వారు యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరిస్తూ మిఖాయేలు—అంటే “దేవుని వంటి వాడెవడు?” అని అర్థమిచ్చే పేరుగల వ్యక్తి—మాదిరిని అనుసరిస్తారు. దేవుని నిర్ణయకాలంలో, ఈ మిఖాయేలు అయిన క్రీస్తుయేసు, సాతానును పరలోకంనుండి వెళ్లగొట్టడంలో ఎలా విజయం సాధించాడో అలాగే క్రూరమృగంతో యుద్ధంచేసి గెలుస్తాడు.—ప్రకటన 12:7-9; 19:11, 19-21.

పరిశుద్ధులతో యుద్ధంచేయుట

21. సాతాను క్రూరమృగాన్ని ఉపయోగించుకునే విషయాన్ని యోహాను ఎలా వర్ణిస్తున్నాడు?

21 జిత్తులమారి సాతాను స్వప్రయోజనం కొరకు క్రూరమృగాన్ని ఉపయోగించుకునే పథకాలున్నాయి. యోహాను దీన్నిలా వివరిస్తున్నాడు: “డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి [ఏడుతలల మృగమునకు] ఇయ్యబడెను. మరియు నలువదిరెండు నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతివంశముమీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాటలాడు వారిమీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను. భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరిపేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు.—ప్రకటన 13:5-8.

22. (ఎ) ఆ 42 నెలలు ఏ కాలాన్ని సూచిస్తున్నాయి? (బి) ఆ 42 నెలలు అభిషక్త క్రైస్తవులు ఎలా ‘జయింపబడ్డారు’?

22 ఇక్కడ తెలుపబడిన 42 నెలలు, దానియేలు ప్రవచనములోని మృగములలో ఒకదాని తలనుండి పైకివచ్చిన కొమ్ము పరిశుద్ధులతో యుద్ధంచేసిన మూడున్నర కాలములంతే ఉన్నట్లు కనబడుతుంది. (దానియేలు 7:23-25; అలాగే ప్రకటన 11:1-4 కూడ చూడండి.) అలా, 1914 ఆఖరు భాగంనుండి 1918 వరకు, యుద్ధంచేస్తున్న రాజ్యాలు క్రూరమృగాలవలె ఒకరినొకరు పీక్కుతింటుండగా, ఆ దేశాల ప్రజలు క్రూరమృగాన్ని ఆరాధించాలని దేశభక్తిపరాయణులుగా ఉండాలని, దేశంకొరకు ప్రాణాలర్పించడానికైనా సిద్ధపడాలని బలవంత పెట్టబడ్డారు. అటువంటి వత్తిడి యెహోవా దేవునికి ఆయన కుమారుడైన క్రీస్తుయేసుకు అత్యున్నత విధేయత చెందాలని భావించే అభిషక్త క్రైస్తవులకు విపరీతమైన బాధకల్గించింది. (అపొస్తలుల కార్యములు 5:29) వారు ‘జయించ’ బడినప్పుడు 1918 మే నెలలో వారికి కల్గిన శ్రమలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అమెరికాలో, వాచ్‌టవర్‌ సొసైటిలోని ప్రముఖ అధికారులు మరితర ప్రతినిధులు తప్పుడు నేరాలు మోపబడి జైల్లో వేయబడ్డారు, వారి క్రైస్తవ సహోదరుల సంస్థీకరింపబడిన సువార్త ప్రచారము ఎంతో ఆటంకపర్చబడింది. “ప్రతివంశముమీదను ప్రతి ప్రజమీదను ఆయా భాషలు మాటలాడువారి మీదను ప్రతి జనముమీదను” అధికారమున్నందున ఆ క్రూరమృగము దేవుని సేవకు ప్రపంచవ్యాప్తంగా అడ్దుకట్ట వేసింది.

23. (ఎ) “గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథము” అంటే ఏమిటి, మరి 1918 నుండి ఏమి సంపూర్తి కావడానికి జరుగుతూ వస్తుంది? (బి) “పరిశుద్ధుల”పై సాతాను దృశ్యమైన సంస్థ సాధించిన స్పష్టమైన విజయ మెందుకు వట్టి వృధాయైంది?

23 ఇది సాతానుకు అతని సంస్థకు విజయంగా కనబడింది. అయితే, అదివారికి దీర్ఘకాల ప్రయోజనాలనేమీ తేలేదు, ఎందుకంటె, సాతాను దృశ్యసంస్థలోని ఎవరిపేరుకూడ “గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమందు” వ్రాయబడలేదు. అలంకార రూపంలో, ఈ గ్రంథమందు యేసుతోపాటు పరలోకములో పరిపాలించే వారి పేర్లుంటాయి. సా.శ. 33 లో మొదటి పేర్లు అందులో వ్రాయబడ్డాయి. అటుతర్వాతి సంవత్సరాలలో అనేకమంది పేర్లు చేర్చబడ్డాయి. రాజ్యవారసులైన 1,44,000 మందిలో శేషించినవారిని ముద్రించే పని 1918నుండి ముగింపుకొచ్చింది. త్వరలో, వారందరి పేర్లు గొఱ్ఱెపిల్ల జీవగ్రంథంలో తుడిచివేయ బడకుండేలా వ్రాయబడతాయి. క్రూరమృగమును ఆరాధించే శత్రువుల విషయమైతే, వారిలో ఏ ఒక్కరిపేరుకూడ ఆ గ్రంథంలో ఉండదు. గనుక “పరిశుద్ధుల” మీద వీరుపొందే ఎటువంటి విజయమైనా వ్యర్థమే, తాత్కాలికమే.

24. వివేకంగలవారు ఏమి వినాలని యోహాను పిలుస్తున్నాడు, మరి ఆ వినిన మాటలు దేవుని ప్రజలకు ఏ అర్థాన్నిస్తాయి?

24 యోహాను యిప్పుడు వివేకముగలవారు అతి జాగ్రత్తగా వినాలని అంటున్నాడు: “ఎవడైనను చెవిగలవాడైతే వినునుగాక.” తర్వాత ఆయనింకా యిలా చెబుతున్నాడు: “ఎవడైనను చెరపట్టవలెనని యున్నయెడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గముచేత చంపినయెడల వాడు ఖడ్గముచేత చంపబడవలెను; ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును.” (ప్రకటన 13:9, 10) యిర్మీయా దాదాపు యిటువంటి మాటలనే సా.శ.పూ 607కు ముందున్న సంవత్సరాలలో నమ్మకద్రోహియైన యెరూషలేము పట్టణమునకు యెహోవా తీర్పులు తీర్చడంలో వెనుకంజ వేసేదేమీ లేదని చూపడానికి వ్రాశాడు. (యిర్మీయా 15:2; అలాగే యిర్మీయా 43:11; జెకర్యా 11:9 కూడ చూడండి.) యేసు గొప్పశోధనకు గురైనప్పుడు, తన అనుచరులు రాజీపడకూడదంటూ, “కత్తిపట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు” అని అన్నాడు. (మత్తయి 26:52) అదేవిధంగా, యిప్పుడు ప్రభువు దినములో దేవుని ప్రజలు బైబిలు సూత్రాలకు హత్తుకొని ఉండాలి. క్రూరమృగాన్ని ఆరాధించే పశ్చాత్తాపములేని వారికి చివరిగా తప్పించు కునేదంటూ ఏమీ ఉండదు. మనఎదుటనున్న హింసలను, శ్రమలను తప్పించు కోవడానికి మనకు అచంచలమైన విశ్వాసంతోపాటు, సహనము కూడ అవసరం.—హెబ్రీయులు 10:36-39; 11:6.

రెండు కొమ్ములుగల క్రూరమృగము

25. (ఎ) ప్రపంచ రంగంమీదికి వస్తున్న మరో సాదృశ్యమైన క్రూరమృగాన్ని గూర్చి యోహాను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) ఈ క్రొత్త క్రూరమృగము యొక్క రెండు కొమ్ములు, అది భూమిలోనుండి పైకిరావడం దేన్ని సూచిస్తుంది?

25 అయితే యిప్పుడు మరో క్రూరమృగము ప్రపంచరంగంలో దిగుతుంది. యోహాను యిలా తెల్పుతున్నాడు: “మరియు భూమిలోనుండి మరియొక క్రూరమృగము పైకివచ్చుట చూచితిని. గొఱ్ఱెపిల్ల కొమ్మువంటి రెండుకొమ్ములు దానికుండెను; అది ఘటసర్పమువలె మాటలాడుచుండెను; అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారపు చేష్టలన్నియు దానియెదుట చేయుచున్నది; మరియు చావుదెబ్బతగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశమునుండి భూమికి మనుష్యులయెదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది.” (ప్రకటన 13:11-13) రెండు రాజకీయ శక్తుల కలయికను సూచించడానికే ఈ క్రూరమృగానికి రెండు కొమ్ములున్నాయి. మరియు అది సముద్రములోనుండి గాక భూమిలో నుండి వస్తున్నట్లు వర్ణించబడింది. అలా, అది సాతాను యిదివరకే స్థాపించిన పరిపాలనా విధానమునుండి వస్తుంది. అది అప్పటికేవుండి ప్రభువు దినములో ప్రముఖ స్థానం వహించే, ప్రపంచ ఆధిపత్యమై యుండాలి.

26. (ఎ) రెండుకొమ్ములుగల క్రూరమృగమేమిటి, అది అసలు క్రూరమృగానికి ఎలాంటి సంబంధాన్ని కల్గివుంది? (బి) రెండు కొమ్ములు గల క్రూరమృగము ఏ భావంలో గొఱ్ఱెపిల్లవంటి కొమ్ములు కల్గివుంది, మరి అది మాట్లాడుతున్నప్పుడు ఎలా “ఘటసర్పమువలె” ఉన్నది? (సి) జాతీయ భావంగల ప్రజలు నిజంగా దేన్ని ఆరాధిస్తున్నారు, మరి జాతీయత దేనికి పోల్చబడింది? (అథఃస్సూచి చూడండి.)

26 అదేమైయుండొచ్చు? అది ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం—మొదటి క్రూరమృగముయొక్క ఏడవతల వంటిదే గాని ఒక ప్రత్యేక పాత్రను నిర్వహిస్తుంది. దర్శనంలో ఒక ప్రత్యేకమైన మృగముగా వేరుచేయడంవల్ల అది ప్రపంచ రాజకీయ రంగంలో ఒంటరిగా ఎలా పనిచేస్తుందో యింకా స్పష్టంగా తెలుసు కోవడానికి సహాయంచేస్తుంది. ఈ సాదృశ్యమైన రెండు కొమ్ములుగల క్రూరమృగము రెండు సమకాలికమైన, ప్రత్యేకమైన, పరస్పరం సహకరించుకొనే రాజకీయ శక్తులతోకూడినది. “గొఱ్ఱెపిల్ల” కొమ్మువంటి దాని రెండు కొమ్ములు సూచించేదేమంటే అది తననుతాను మృదువైనదిగా, సాధువైనదిగా చేసుకొని, ప్రపంచమంతా దానివైపుచూడ గలిగేలా బాగామెరుగైన ప్రభుత్వంగా కనబర్చుకుంటోంది. అయితే దాని పరిపాలనను అంగీకరించనిచోట్ల, వత్తిడిని, బెదరింపులను, అవసరమైతే దౌర్జన్యాన్ని ఉపయోగించి “ఘటసర్పము వలె” మాటలాడుతుంది. దేవుని గొఱ్ఱెపిల్ల పరిపాలనక్రింది దేవుని రాజ్యమునకు లోబడియుండేలా ప్రోత్సహించే బదులు అది ఆ మహా ఘటసర్పమైన సాతాను, క్రియలను ప్రోత్సహిస్తుంది. అది జాతీయతా భావాన్ని, భేదాల్ని ప్రోత్సహిస్తూ మొదటి క్రూరమృగపు ఆరాధనకు వీటిని తోడుచేసింది. *

27. (ఎ) రెండు కొమ్ములుగల క్రూరమృగము ఆకాశమునుండి అగ్ని కురిపిస్తుందంటే, దాని ఏ స్వభావం బయల్పర్చబడుతుంది? (బి) రెండుకొమ్ములుగల క్రూరమృగము యొక్క ఆధునిక ప్రతిరూపాన్ని అనేకమంది ప్రజలు ఎలా దృష్టిస్తున్నారు?

27 ఈ రెండుకొమ్ములుగల క్రూరమృగము గొప్పసూచక క్రియలను చేస్తోంది, ఆకాశమునుండి అగ్ని దిగివచ్చేలాంటి వాటిని సహితం చేస్తుంది. (మత్తయి 7:21-23 పోల్చండి.) తర్వాత చెప్పబడిన సూచక క్రియ బయలు ప్రవక్తలతో పోటికి దిగినప్పుడు పూర్వకాలంలో దేవుని ప్రవక్తయగు ఏలియా చేసిన సూచనను జ్ఞాపకం చేస్తుంది. ఆయన యెహోవా నామమున ఆకాశమునుండి అగ్నిని కురిపించినప్పుడు, ఆయన నిజమైన ప్రవక్తయని, బయలు ప్రవక్తలు అబద్ధికులని నిస్సందేహంగా నిరూపించబడింది. (1 రాజులు 18:21-40) ఆ బయలు ప్రవక్తలవలె, రెండు కొమ్ములుగల క్రూరమృగం తనకు ఒక ప్రవక్తగా తగినన్ని అర్హతలున్నాయని అనుకుంటుంది. (ప్రకటన 13:14, 15; 19:20 పోల్చండి.) ఇంతెందుకు, రెండు ప్రపంచయుద్ధాల్లో దుష్టశక్తులను ఓడించి యిప్పుడిది దైవభక్తిలేనిదని పిలువబడే కమ్యూనిజానికి వ్యతిరేకియై స్థిరంగా నిలబడిందని చెప్పుకుంటోంది! నిజానికి, అనేకులు రెండుకొమ్ములుగల క్రూరమృగం యొక్క ఆధునిక ప్రతిరూపాన్ని స్వేచ్ఛను రక్షించేదని, వస్తురూపకమైన మంచివాటికి నెలవు అని అనుకుంటున్నారు.

క్రూరమృగము యొక్క ప్రతిమ

28. రెండు కొమ్ములుగల క్రూరమృగము దానికున్న గొఱ్ఱెలాంటి కొమ్ములు సూచిస్తున్నట్లుగా అమాయకంగా లేదని యోహాను ఎలా చూపిస్తున్నాడు?

28 ఈ రెండు కొమ్ములుగల క్రూరమృగము, దాని గొఱ్ఱెవంటి కొమ్ములు సూచిస్తున్నంత అమాయకంగా ఉన్నదా? యోహాను యిలా చెప్పుకుంటూ పోతున్నాడు: “కత్తిదెబ్బ తినియు బ్రతికిన యీ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు, ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలవలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు నమస్కారముచేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను.”—ప్రకటన 13:14, 15.

29. (ఎ) క్రూరమృగము యొక్క ప్రతిమ ఉద్దేశమేమిటి, యీ ప్రతిమ ఎప్పుడు నిర్మించబడింది? (బి) క్రూరమృగము యొక్క ప్రతిమ ఎందుకు నిర్జీవమైన ప్రతిమ కాదు?

29 “ఆ మృగముయొక్క ప్రతిమ” ఏమిటి, దాని ఉద్దేశమేమిటి? దాని ఉద్దేశమేమిటంటే, తాను ప్రతిమగానున్న ఏడుతలల క్రూరమృగం యొక్క ఆరాధనను పెంచి, ఆ విధంగా, క్రూరమృగపు ఉనికిని స్థిరపరచడానికే. ఈ ప్రతిమ, ఏడుతలలుగల క్రూరమృగము తనకు తగిలిన చావుదెబ్బనుండి బ్రతికిన తర్వాతనే అంటే, మొదటి ప్రపంచయుద్ధం అయిపోయిన తర్వాతనే కట్టబడింది. అది నెబుకద్నెజరు దూరాయను మైదానములో నిలువబెట్టించిన ప్రాణములేని ప్రతిమవంటిది కాదు. (దానియేలు 3:1) ఈ ప్రతిమ బ్రతికి ప్రపంచ చరిత్రలో భాగం వహించగలిగేలా, రెండు కొమ్ములుగల మృగము యీ ప్రతిమకు ప్రాణం పోస్తుంది.

30, 31. (ఎ) చరిత్ర వాస్తవాలు యీ ప్రతిమ ఏమైయున్నదని గుర్తించాయి? (బి) ఈ ప్రతిమను ఆరాధించడానికి నిరాకరించిన వారెవరైనా చంపబడ్డారా? వివరించండి.

30 చరిత్రను పరిశీలిస్తే, యీ ప్రతిమ బ్రిటన్‌, అమెరికా దేశాలు ప్రతిపాదించి, పెంచి పోషించిన సంస్థయని గుర్తిస్తుంది. మొదట అది నానాజాతి సమితియని పిలువబడింది. ఆ పిదప, ప్రకటన 17వ అధ్యాయంలో అది మరో గుర్తుతో కనబడుతుంది, అంటే అదొక ప్రత్యేక ఉనికిని కలిగి, జీవించియున్న, ప్రాణంగల ఎఱ్ఱని మృగమైయున్నది. ఈ అంతర్జాతీయ సంస్థ ‘మాటలాడుతుంది,’ అంటే మానవజాతికి శాంతిభద్రతలను తానే తేగలదని ప్రగల్భాలు పలుకుతుందన్నమాట. అయితే నిజానికది సభ్యదేశాలు పరస్పరం దూషించు కోవడానికి, అవమానపరచు కోవడానికి నిలయమైంది. దాని అధికారానికి లోబడని ప్రజలనుగాని దేశాన్నిగాని బహిష్కరిస్తానని లేక సజీవమరణానికి గురిచేస్తానని బెదిరించింది. దాని ఉద్దేశాలను వ్యతిరేకించే దేశాలను బహిష్కరిస్తానని యింకా బెదిరిస్తూనేవుంది. మహాశ్రమలు ప్రారంభమైనప్పుడు క్రూరమృగంయొక్క యీ ప్రతిమకున్న సైన్యాలనే “కొమ్ములు” వినాశకర పాత్రను నిర్వహిస్తాయి.—ప్రకటన 7:14; 17:8, 16.

31 ఇప్పుడు ఐక్యరాజ్యసమితి అనే సంస్థ రూపంలో కనబడుతున్న క్రూరమృగంయొక్క ప్రతిమ, IIవ ప్రపంచ యుద్ధంద్వారా యిప్పటికే అక్షరార్థంగానే చంపింది. ఉదాహరణకు, ఐక్యరాజ్యసమితి సైన్యాలు ఉత్తరదక్షిణ కొరియాలమధ్య 1950 లో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాయి. ఐక్యరాజ్యసమితి సేనలు, దక్షిణకొరియా సైన్యంతోకలిసి సుమారు 14,20,000 మంది ఉత్తరకొరియా, చైనావారిని చంపాయి. అదేమాదిరి, 1960 నుండి 1964 వరకు ఐక్యరాజ్యసమితి సైన్యాలు కాంగోలో (ఇప్పుడు జైరీ) చురుకుగా పని చేశాయి. అంతేగాక, పాల్‌ VI జాన్‌పాల్‌ II వంటి పోప్‌లతోపాటు ప్రపంచ నాయకులు యీ ప్రతిమ శాంతికొరకు మానవునికున్న చివరి, ఏకైక నిరీక్షణయని గట్టిగా చెబుతూనే వున్నారు. వారనేదేమంటే, మానవసమాజం దాన్ని సేవించకపోతే మానవజాతి సర్వనాశనమౌతుంది. అలావారు ఆ మృగమును వెంబడించక, దాన్ని ఆరాధించక తిరస్కరించే మానవులంతా సాదృశ్యంగా చంపబడేలా చేస్తున్నారు.—ద్వితీయోపదేశకాండము 5:8, 9 పోల్చండి.

మృగముయొక్క ముద్ర

32. దేవుని స్త్రీసంతానంలో శేషించినవారిని బాధించడానికి సాతాను తన దృశ్యమైన సంస్థను ఉపయోగించుకునే విషయాన్ని యోహాను ఎలా వర్ణిస్తున్నాడు?

32 సాతానిప్పుడు, దేవుని స్త్రీసంతానంలో శేషించినవారిని వీలున్నంత ఎక్కువగా బాధించాలని తన దృశ్యమైన సంస్థలోని రాజకీయ విభాగాల నుపయోగించడానికి ప్రయత్నిస్తున్నాడని యోహానిప్పుడు గమనిస్తున్నాడు. (ఆదికాండము 3:15) ఆయన ఆ “క్రూర మృగము”ను గూర్చి మరల వర్ణిస్తున్నాడు: “కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులు గాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతి మీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడుతప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారము లేకుండు నట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అదియొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు; ఇందులో జ్ఞానముకలదు.”—ప్రకటన 13:16-18.

33. (ఎ) క్రూరమృగము యొక్క పేరేమిటి? (బి) ఆరు అనే సంఖ్య దేనితో సంబంధం కల్గివుంది? వివరించండి.

33 ఆ క్రూరమృగానికి ఒక పేరున్నది, యీ పేరు ఒక సంఖ్య: 666. ఆరు అనేది ఒక సంఖ్యగా, యెహోవా శత్రువులకు సంబంధం కల్గివుంది. రెఫాయీయుల సంతతివాడైన ఒక ఫిలిష్తీయుడు “మంచి యెత్తరి,” వానికి “చేతిచేతికి, కాలికాలికి ఆరేసి చొప్పున” వ్రేళ్లుండేవి. (1 దినవృత్తాంతములు 20:6) రాజైన నెబుకద్నెజరు తన రాజకీయ అధికారులందరిని ఒకే ఆరాధన క్రిందికి తెచ్చే సంకల్పంతో ఆరు ఘనపుటడుగుల వెడల్పు, 60 ఘనపుటడుగుల ఎత్తున్న ఒక బంగారు ప్రతిమను చేయించాడు. ఆ బంగారు ప్రతిమను దేవుని సేవకులు ఆరాధించడానికి తిరస్కరించినందుకు రాజు వారిని మండే గుండంలో త్రోయించాడు. (దానియేలు 3:1-23) దేవుని దృష్టిలో సంపూర్ణ సంఖ్యగా పరిగణింపబడుతున్న ఏడుకు ఆరు అనే సంఖ్య తక్కువగా ఉన్నది. అందుచేత మూడుసార్లున్న ఆరు, పూర్తి అసంపూర్ణతను సూచిస్తుంది.

34. (ఎ) ఆ క్రూరమృగముయొక్క సంఖ్య మానవ సంఖ్య అంటే అది దేన్ని సూచిస్తుంది? (బి) సాతాను ప్రపంచ రాజకీయ విధానానికి 666 అనే పేరు ఎందుకు తగియున్నది?

34 పేరు ఒకవ్యక్తిని గుర్తిస్తుంది. మరి యీసంఖ్య మృగాన్నెలా గుర్తిస్తుంది? అది “మనుష్యుని సంఖ్యయే” అని, ఆత్మీయవ్యక్తిది కాదని యోహాను చెబుతున్నాడు, గనుక ఆ పేరు, క్రూరమృగం భూసంబంధమైందని, మానవ ప్రభుత్వాన్ని సూచించేదని రూఢీ చేసుకోవడానికి సహాయ పడుతుంది. ఆరు అనేది ఏడుకంటె తక్కువైనట్లే, 666 అనే సంఖ్య—ఆరును మూడుపర్యాయాలు వేస్తే వచ్చేది—దేవుని పరిపూర్ణ స్థాయికి ఏమాత్రం సరిపోని ప్రపంచ మహాగొప్ప రాజకీయ విధానానికి తగినపేరే. ఆ మృగాన్ని పెద్దపెద్ద రాజకీయాలు, గొప్పమతాలు, గొప్ప వాణిజ్యం, మానవజాతిని అణచి వేసేదిగా, దేవుని ప్రజలను హింసించేదిగా ఉండునట్లు చేస్తుంటే, ప్రపంచ రాజకీయ క్రూరమృగం 666 అనే పేరు-సంఖ్య క్రింద ఆధిపత్యం వహిస్తుంది.

35. క్రూరమృగముయొక్క పేరును నొసళ్లమీద లేక కుడిచేతిమీద ముద్రవేసుకోవడమంటే అర్థమేమిటి?

35 క్రూరమృగం యొక్క నామాన్ని నొసళ్లమీదగాని, చేతుల మీదగాని ముద్ర వేయించు కోవడమంటే అర్థమేమిటి? యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్నిచ్చినప్పుడు ఆయన వారితో యిలా అన్నాడు: “కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.” (ద్వితీయోపదేశకాండము 11:18) దీనర్థం, ఇశ్రాయేలీయులు వారి తలంపులు క్రియలపై ప్రభావం చూపేలాగున వారు ఆ ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడు పాటిస్తుండాలి. అభిషక్తులైన 1,44,000 మంది నొసళ్లపై తండ్రినామము యేసునామము లిఖించబడినట్లు తెల్పబడింది. ఇది వారిని యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు చెందినవారని గుర్తిస్తుంది. (ప్రకటన 14:1) దీన్ని అనుకరిస్తూ, సాతాను క్రూరమృగం యొక్క దయ్యాల గుర్తును ఉపయోగిస్తున్నాడు. ఎవరైనా కొనడం, అమ్మడంవంటి దైనందిన క్రియలు చేస్తే, క్రూరమృగం పద్ధతిలోనే చేయడానికి, ఉదాహరణకు పండుగ దినాలను ఆచరించే విషయంలో, బలవంత పెట్టబడుతున్నారు. వారు క్రూరమృగాన్ని ఆరాధించాలి, వారు దాని ముద్రను పొందేలాగున అది తమ జీవితాలను ఏలేందుకు అనుమతిస్తున్నారు.

36. క్రూరమృగముయొక్క ముద్రను వేయించుకోకుండా తిరస్కరించే వారు ఎటువంటి సమస్యలెదుర్కొన్నారు?

36 క్రూరమృగము యొక్క ముద్రను వేయించుకోని వారికి నిత్యం సమస్యలుంటూనే ఉన్నాయి. ఉదాహరణకు 1930వ దశాబ్దం మొదలుకొని, వారు ఎన్నో కోర్టువ్యవహారాల్లో పోరాడవలసి వచ్చింది, అల్లరిమూకల దాడులను ఇతర హింసలను సహించవలసి వచ్చింది. నియంతలు పాలించిన దేశాల్లోవారు కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో వేయబడ్డారు, అక్కడనేకులు చనిపోయారు. రెండో ప్రపంచయుద్ధం జరిగిన నాటినుండి, లెక్కలేనంతమంది యువకులు దీర్ఘకాలం జైలుపాలయ్యారు, కొందరు వారి క్రైస్తవ తటస్థతనుబట్టి రాజీపడడానికి తిరస్కరించినందుకు చిత్రహింసలకు కూడ గురయ్యారు, చంపబడ్డారు. ఇతర దేశాల్లో క్రైస్తవులు అక్షరార్థంగా ఏమియూ కొనలేక లేదా అమ్మలేక పోయారు; కొందరు ఆస్తిపాస్తులను సమకూర్చుకోలేక పోయారు; మరితరులైతే, మానభంగానికి, హత్యకు గురయ్యారు, లేదా వారి స్వదేశమునుండి తరిమివేయబడ్డారు. ఎందుకు? ఎందుకంటే, మంచి మనస్సాక్షితోనే వారు రాజకీయ గుర్తింపుకార్డులను కొనడానికి తిరస్కరించారు. *యోహాను 17:16.

37, 38. (ఎ) క్రూరమృగముయొక్క ముద్రను వేయించుకొనక తిరస్కరించే వారికి ఈలోకంలో జీవించడానికి ఎందుకు కష్టతరంగా ఉంటుంది? (బి) ఎవరు యథార్థతను కల్గియున్నారు, వారేమి చేయడానికి నిశ్చయించుకున్నారు?

37 లోకంలోని కొన్నిభాగాల్లోని సామాజిక జీవితంలో మతమెంతగా పాతుకు పోయిందంటే, ఎవరైనా బైబిలు సత్యాన్ని చేపడితే, కుటుంబసభ్యులు పాతస్నేహితులు అలాంటివారిని బహిష్కరిస్తారు. సహించాలంటే దృఢమైన విశ్వాసం కావాలి. (మత్తయి 10:36-38; 17:22) అనేకులు ధనాన్ని ఆరాధిస్తున్న, అవినీతి తాండవిస్తున్న యీలోకంలో, నిజక్రైస్తవుడు తరచూ తాను సన్మార్గాన్ని వెంబడించేలాగున చేయడానికి అతడు యెహోవా యందు దృఢమైన నమ్మకాన్ని కనబర్చవలసి వుంటుంది. (కీర్తన 11:7; హెబ్రీయులు 13:18) అవినీతితో కూరుకుపోయిన యీ లోకంలో, పవిత్రంగా నిర్మలంగా ఉండాలంటే గొప్ప దీక్షకావాలి. రోగగ్రస్థులైన క్రైస్తవులను వైద్యులు, నర్సులు తరచూ రక్తంయొక్క పవిత్రత విషయంలో దేవుని చట్టం ఉల్లంఘించేలా వత్తిడిచేస్తున్నారు; వారి విశ్వాసానికి విరుద్ధంగానున్న కోర్టు ఆజ్ఞలను సహితం వారు ధిక్కరించవలసి వస్తుంది. (అపొస్తలుల కార్యములు 15:28, 29; 1 పేతురు 4:3, 4) నిరుద్యోగ సమస్య నింగినంటుతున్న యీ కాలంలో, నిజక్రైస్తవుడు దేవుని యెదుట తనకున్న యథార్థత విషయంలో రాజీపడకుండా పనిచేయడానికి ఎంతో కష్టమౌతుంది.—మీకా 4:3, 5.

38 అవును, క్రూరమృగము యొక్క ముద్రలేని వారు నివసించడానికి యీ లోకమెంతో కష్టతరమైన స్థలంగావుంది. ఆ స్త్రీ సంతానంలో శేషించబడిన వారును, వారితోపాటు 40 లక్షలకంటె ఎక్కువమందివున్న గొప్ప సమూహపువారు, దేవుని చట్టాలను ఉల్లంఘించడానికి వచ్చే వత్తిళ్లన్నింటిలోను తమ యథార్థతను కాపాడు కొంటున్నారంటే అది నిజంగా యెహోవా శక్తికి దీవెనకు ప్రత్యక్షసాక్ష్యమే. (ప్రకటన 7:9) భూమియందంతటను, మనందరం ఐక్యంగా, క్రూరమృగము యొక్క ముద్రను వేయించుకోవడానికి తిరస్కరిస్తూ, యెహోవాను ఆయన నీతిమార్గాలను కొనియాడుటలో కొనసాగుదాము.—కీర్తన 34:1-3.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఇంకా వివరాలకొరకు దయచేసి వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి, న్యూయార్క్‌ ఇన్‌కార్పొరేషన్‌ వారు ప్రచురించిన “యువర్‌ విల్‌ బి డన్‌ ఆన్‌ ఎర్త్‌,” అనే పుస్తకంలోని 166-201 పేజీలను చూడండి.

^ పేరా 5 ఆర్‌. సి. హెచ్‌. లెన్‌స్కి, వ్రాసిన ది ఇంటర్‌ప్రెటేషన్‌ ఆఫ్‌ సెంట్‌. జాన్స్‌ రెవలేషన్‌, 390-1 పుటలు.

^ పేరా 26 వ్యాఖ్యాతలు జాతీయతను ఒక మతమని గుర్తించారు. కాబట్టి జాతీయతా దృక్పథంగలవారు తాము నివసిస్తున్న దేశము సూచించే క్రూరమృగపు ఆ భాగాన్ని నిజంగా ఆరాధిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రముల జాతీయతనుగూర్చి మనమిలా చదివెదము: “ఒకమతంగా దృష్టించబడే, జాతీయతాభావం, గతంలోని గొప్పమతపద్ధతుల మాదిరే ఉంది . . . ఆధునిక మతస్థుడైన జాతీయతావాది తనస్వంత దేశపు దేవుని మీదనే ఆధారపడి యుండడంలో జాగ్రత్త కల్గివున్నాడు. శక్తివంతమైన సహాయమవసరమని తాననుకుంటాడు. అతనిలోనే తన స్వంత పరిపూర్ణత, సంతోషముందని గుర్తిస్తాడు. కచ్చితంగా మతపరమైన భావంలో అతడు తనకుతానే లోబడియున్నాడు . . . దేశం శాశ్వతమని, దాని మృతతుల్యంకాని కీర్తిప్రతిష్టలు దాని నమ్మకమయిన కుమారుల మరణం మూలంగా వృద్ధిచెందునని పరిగణించబడుతుంది.”—కారల్టన్‌ జె. యఫ్‌. హేయిస్‌ చెప్పినట్లు, వాట్‌ అమెరికన్స్‌ బిలీవ్‌ అండ్‌ హౌ దే వర్షిప్‌, అనే పుస్తకంలోని 359 పేజిలో జె. పాల్‌ విలియమ్స్‌ పేర్కొన్నాడు.

^ పేరా 36 ఉదాహరణకు, వాచ్‌టవర్‌ సెప్టెంబరు 1, 1971, పేజీ 520; జూన్‌ 15, 1974, పేజీ 373; జూన్‌ 1, 1975, పేజీ 341; ఫిబ్రవరి 1, 1979, పేజీ 23; జూన్‌ 1, 1979, పేజీ 20; మే 15, 1980, పేజీ 10 చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[195వ పేజీలోని చిత్రం]

ఆ క్రూరమృగముయొక్క ప్రతిమకు ప్రాణము పోయడానికి అధికారమియ్య బడింది