కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విజయోత్సాహపు క్రొత్త కీర్తన పాడుట

విజయోత్సాహపు క్రొత్త కీర్తన పాడుట

అధ్యాయం 29

విజయోత్సాహపు క్రొత్త కీర్తన పాడుట

దర్శనము 9—ప్రకటన 14:1-20

అంశం: ఈ 1,44,000 మంది గొఱ్ఱెపిల్లతోపాటు సీయోను పర్వతంమీద ఉన్నారు; భూలోకమంతటా దూతల ప్రకటనలు వినబడుతున్నాయి; పంట సమకూర్చే పని జరుగుతోంది.

నెరవేర్పు కాలం: 1914 నుండి మహాశ్రమలవరకు

1. ప్రకటన 7, 12, మరియు 13, అధ్యాయాలను గూర్చి యిప్పటికే మనమేమి నేర్చుకున్నాం, ఇప్పుడేమి నేర్చుకోబోతున్నాము?

యోహాను చూచిన తర్వాతి దర్శనంవైపు అవధానం మళ్లించడం ఎంత ఉపశమనంగా ఉంటుందో! ఘటసర్పంయొక్క భయంకరమైన మృగములవంటి సంస్థలకు పోలిస్తే, మనమిప్పుడు యెహోవా నమ్మకమైన సేవకులను, ప్రభువు దినములో వారి కార్యకలాపాలను చూస్తాం. (ప్రకటన 1:10) ఇప్పటికే, ప్రకటన 7:1, 3 మనకు 1,44,000 మంది అభిషక్త దాసులు ముద్రించబడేవరకు నాశనకరమగు నాలుగు వాయువులు పట్టుకొనబడియున్నవని బయల్పర్చింది. ఆ కాలంలో “[స్త్రీ] సంతానములో శేషించిన వారు” ఘటసర్పమైన సాతానుకు ప్రత్యేక ఎర అవుతారని ప్రకటన 12:17 తెలిపింది. మరియు యెహోవా నమ్మకమైన సేవకులమీద తీవ్రమైన ఒత్తిడి, క్రూరమైన హింసను తేవడానికి సాతాను భూమ్మీద రాజకీయ సంస్థలను లేవదీశాడని ప్రకటన 13వ అధ్యాయం స్పష్టంగా వర్ణించింది. అయితే ఆ ప్రధాన విరోధి దేవుని సంకల్పాన్ని వమ్ముచేయలేడు! సాతాను ద్వేషంతోకూడిన క్రియచేస్తున్నా, 1,44,000 మంది విజయోత్సాహంతో సమకూర్చ బడుతున్నారని మనమిప్పుడు తెలుసుకుంటాము.

2. ప్రకటన 14:1 లో యోహాను ఏ సంతోషకరమైన ముగింపు యొక్క ముందుదర్శనాన్ని గూర్చి తెల్పుతున్నాడు, మరియు గొఱ్ఱెపిల్ల ఎవరు?

2 యోహానుకు, ఆయనతోపాటు యీనాటి యోహాను తరగతికి ఆ సంతోషభరిత ఫలితాన్నిగూర్చి ముందే దర్శనరూపంలో చూపబడింది: “మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి.” (ప్రకటన 14:1) మనం గమనించినట్లు అపవాదిని, అతని దయ్యాలను పడద్రోసి పరలోకాన్ని పరిశుభ్రం చేసిన ఆ మిఖాయేలే ఈ గొఱ్ఱెపిల్ల. ఆయనే యెహోవా నీతితీర్పులను అమలు పరచడానికై “నిలుచు”టకు తానే సిద్ధపడుతూ, “నీ [దేవుని] జనుల పక్షమున నిలుచునట్టి” వాడని దానియేలు వర్ణిస్తున్న మిఖాయేలు. (దానియేలు 12:1; ప్రకటన 12:7, 9) ఈ స్వయం-త్యాగియైన దేవుని గొఱ్ఱెపిల్ల, 1914నుండి సీయోను పర్వతంమీద మెస్సీయ రాజుగా నిల్చొనియున్నాడు.

3. గొఱ్ఱెపిల్ల, 1,44,000 మంది నిలువబడియున్న “సీయోను పర్వతం” ఏమిటి?

3 అది యెహోవా ప్రవచించినట్లే ఉంది: “నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోనుమీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.” (కీర్తన 2:6; 110:2) ఇదిక భూసంబంధమైన సీయోను పర్వతాన్ని, దావీదు వంశావళి నుండి వచ్చిన మానవ రాజులు పాలిస్తూవచ్చిన పట్టణాన్ని, భూసంబంధమైన యెరూషలేమున్న భౌగోళిక ప్రాంతాన్ని సూచించడంలేదు. (1 దినవృత్తాంతములు 11:4-7; 2 దినవృత్తాంతములు 5:2) లేదు, ఎందుకంటే, యేసు, తన మరణ పునరుత్థానముల తర్వాతే పరలోక సీయోను పర్వతముమీద పునాదికి మూలరాయిగా నిలబెట్టబడ్డాడు, అదే ‘జీవముగల దేవుని పట్టణం అంటే పరలోక యెరూషలేము,’ అనగా యెహోవా ఆయనను నిలబెట్టాలని నిశ్చయించుకున్న పరలోక స్థలం. కావున యిక్కడ “సీయోను పర్వతము” అనేది యేసు మరియు రాజ్యముగా అంటే పరలోక యెరూషలేముగా తయారయ్యే తన తోటివారసులయొక్క ఉన్నతపర్చబడిన స్థానాన్ని సూచిస్తుంది. (హెబ్రీయులు 12:22, 28; ఎఫెసీయులు 3:6) ప్రభువు దినములో, యెహోవా వారిని హెచ్చించే మహిమాన్విత రాజరికపు స్థితి. శతాబ్దాలనుండి అభిషక్త క్రైస్తవులు, ‘సజీవమైన రాళ్లవలె,’ మహిమనొందిన ప్రభువైన యేసుక్రీస్తుతోపాటు ఆయన మహనీయమైన రాజ్యములో ఏకమై, ఆ పరలోక యెరూషలేములో నిల్చోవాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ వస్తున్నారు.—1 పేతురు 2:4-6; లూకా 22:28-30; యోహాను 14:2, 3.

4. సీయోను పర్వతంమీద మొత్తం 1,44,000 మంది ఎలా నిలువబడి యున్నారు?

4 యోహాను యేసునేగాక పరలోకరాజ్యంలో ఆయన తోటి వారసులైన 1,44,000 మంది మొత్తం గుంపు కూడ ఆ సీయోను పర్వతంమీద నిల్చోవడం చూశాడు. ఆ దర్శనంలో సూచించబడిన సమయానికి యీ 1,44,000 మందిలో అందరూ కాకపోయినా కొందరప్పటికే పరలోకానికి వెళ్లారు. ఆ తర్వాత అదే దర్శనంలో, యోహాను ఆ పరిశుద్ధులలో కొందరు యింకనూ సహించి నమ్మకంగా చనిపోవాలని తెలుసుకుంటాడు. (ప్రకటన 14:12, 13) అంటే 1,44,000 మందిలో కొందరింకా భూమ్మీదనున్నట్లే. మరలాగైతే, యోహాను ఎలా అందరూ యేసుతోపాటు సీయోను పర్వతంమీద నిలుచున్నట్లు చూస్తాడు? * అంటే, అభిషక్త క్రైస్తవసంఘంగా వారిప్పుడు ‘సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును వచ్చియున్నారు.’ (హెబ్రీయులు 12:22) పౌలు భూమ్మీద నున్నప్పటివలెనే, వీరుకూడ అప్పటికే—ఆత్మీయ భావంలో—క్రీస్తుయేసుతోపాటు పరలోక స్థలములలో ఉండడానికి లేపబడ్డారు. (ఎఫెసీయులు 2:5, 6) అంతేగాక, 1919 లో వారు “ఇక్కడికి ఎక్కిరండని” పిలిచిన పిలుపుకు స్పందించారు, మరియు అలంకార రూపంలో “మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి.” (ప్రకటన 11:12) ఈ లేఖనాలదృష్ట్యా, ఆ 1,44,000 మంది మొత్తం—ఆత్మీయంగా మాట్లాడితే—యేసుక్రీస్తుతోపాటు సీయోను పర్వతంమీద ఉన్నట్లు మనం గమనించవచ్చును.

5. ఎవరి పేర్లు 1,44,000 మంది నొసళ్లమీద లిఖించ బడివున్నాయి, మరి ప్రతినామమునకున్న ప్రాముఖ్యతేమి?

5 ఈ 1,44,000 మందికి, సాదృశ్యమైన 666 సంఖ్యతో ముద్రించబడి, క్రూరమృగాన్ని ఆరాధించే వారితో ఎటువంటి సంబంధంలేదు. (ప్రకటన 13:15-18) దానికి బదులుగా, ఈ రాజుల నొసళ్లమీద దేవుని నామమును గొఱ్ఱెపిల్ల నామమును లిఖించబడియున్నవి. నిశ్చయంగా, యూదుడైన యోహాను, దేవుని పేరును హెబ్రీ అక్షరాల్లో יהוה అని వ్రాయబడినట్లు చూచివుంటాడు. * యేసు యొక్క తండ్రి నామము తమ నొసళ్లమీద సాదృశ్యంగా వ్రాయబడడమంటే యీ ముద్రింపబడిన వారు, తాము యెహోవా సాక్షులని, ఆయన దాసులని అందరికి తెల్పుకుంటున్నారు. (ప్రకటన 3:12) యేసుక్రీస్తు పేరుకూడ వారినొసళ్లమీద ఉందంటే వారాయన సొత్తన్న విషయాన్ని వారంగీకరిస్తున్నారని తెల్పుతుంది. ఆయన వారికి ప్రధానము చేయబడిన “భర్త”, వారు ఆయనకు కాబోయే “పెండ్లికుమార్తె,” పరలోక నిరీక్షణతో దేవున్ని సేవిస్తున్న “ఒక నూతన సృష్టి.” (ఎఫెసీయులు 5:22-24; ప్రకటన 21:2, 9; 2 కొరింథీయులు 5:17) యెహోవాతోను యేసుక్రీస్తుతోను వారికున్న సన్నిహిత సంబంధం వారి తలంపులపై, క్రియలపై ప్రభావం కల్గివుంటుంది.

ఒక క్రొత్త కీర్తన పాడుట

6. యోహాను ఏ కీర్తన వింటున్నాడు, ఆయన దానినెలా వర్ణిస్తున్నాడు?

6 దీనికి అనుగుణ్యంగా యోహాను యిలా చెబుతున్నాడు: “మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దల యెదుటను ఒక క్రొత్త కీర్తన (క్రొత్త కీర్తనలాంటిది NW.) పాడుచున్నారు; భూలోకములోనుండి కొనబడిన ఆ నూటనలువది నాలుగు వేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు.” (ప్రకటన 14:2, 3) యోహాను ఆ 1,44,000 మంది మృదుమధుర బృంద గీతాన్ని విన్నప్పుడు ఆయనకు జలపాతపు గలగలలు, ఉరుముల ఫెళఫెళ ధ్వనులు జ్ఞాపకం వచ్చాయనడంలో ఆశ్చర్యంలేదు. ఆ వీణవంటి నాదస్వర శబ్దమెంత మధురంగా ఉన్నదోగదా! (కీర్తన 81:2) ఆ మనోహర బృందగీత మాధుర్యానికి భూమ్మీదనున్న ఏ బృందమైనను ఎన్నటికైనా సాటిరాగలదా?

7. (ఎ) ప్రకటన 14:3 లోని క్రొత్త కీర్తన ఏమిటి? (బి) కీర్తన 149:1 లోని కీర్తన మనకాలంలో ఎలా క్రొత్త కీర్తన అవుతుంది?

7 మరైతే ఈ “క్రొత్త కీర్తన” ఏమైయున్నది? ప్రకటన 5:9, 10 మనం చర్చించినప్పుడు గమనించినట్లు ఆత్మీయ ఇశ్రాయేలీయులను ‘దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను’ తయారుచేయడానికై యేసుక్రీస్తు ద్వారా యెహోవా చేసే అద్భుతమైన ఏర్పాటుతో, రాజ్యసంకల్పములతో ఆ కీర్తనకు సంబంధమున్నది. అది దేవుని ఇశ్రాయేలు ద్వారాను, దానినిమిత్తమును, యెహోవా చేస్తున్న క్రొత్తసంగతులను ప్రచురంచేస్తూ ఆయనకు చెల్లించే స్తుతికీర్తనయై యున్నది. (గలతీయులు 6:16) ఈ ఆత్మీయ ఇశ్రాయేలీయుల సభ్యులు కీర్తనల రచయిత ఆహ్వానానికి స్పందిస్తారు: “యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్తకీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతోషించుదురు గాక. సీయోను జనులు తమ రాజునుబట్టి ఆనందించుదురు గాక.” (కీర్తన 149:1, 2) నిజమే, ఆ మాటలు శతాబ్దాలక్రితం వ్రాయబడ్డాయి, గాని మనకాలంలో అవి ఒక నూతన గ్రహింపుతో పాడబడుతున్నాయి. మెస్సీయ రాజ్యం 1914 లో ప్రారంభమైంది. (ప్రకటన 12:10) భూమిపైనున్న యెహోవా ప్రజలు 1919నుండి “రాజ్యమును గూర్చిన వాక్యమును” పునరుజ్జీవింపబడిన ఆసక్తితో ప్రకటించడానికి ఆరంభించారు. (మత్తయి 13:19) సొసైటీ 1919కొరకు యిచ్చిన సాంవత్సరిక వచనాన్నిబట్టి (యెషయా 54:17) వారు పురికొల్పబడి, ఆత్మీయ పరదైసునకు పునరుద్ధరించబడినందున ఉత్తేజపరచ బడినవారై, ఆ సంవత్సరంలో వారు ‘వారి హృదయాలలో సంగీతంతో పాటు యెహోవాను గూర్చి పాడుట’ కారంభించారు.—ఎఫెసీయులు 5:19.

8. ప్రకటన 14:3 లోని క్రొత్తపాటను 1,44,000 మంది మాత్రమే ఎందుకు నేర్చుకోగల్గుతున్నారు?

8 అయితే, ప్రకటన 14:3 లో తెలుపబడిన కీర్తనను 1,44, 000 మంది మాత్రమే ఎందుకు నేర్చుకోగల్గుతున్నారు? ఎందుకంటే అది వారు దేవుని రాజ్యానికి ఎన్నుకోబడిన వారసులుగా వారి అనుభవానికి సంబంధించి వుంది. వారు మాత్రమే దేవుని కుమారులుగా స్వీకరించబడి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. వారు మాత్రమే ఆ పరలోకరాజ్యమునకు భాగస్తులుగా ఉండడానికి భూలోకంనుండి కొనబడ్డారు, మరియు వారు మాత్రమే మానవులను పరిపూర్ణస్థితికి తేవడానికై క్రీస్తుతోపాటు వెయ్యేండ్లు “యాజకులై . . . రాజ్యము చేయుదురు.” వారు మాత్రమే యెహోవా సముఖంలో “ఒక క్రొత్త కీర్తన పాడుచు”న్నట్లు కనబడుతున్నారు. * ఈ విశేష అనుభవాలు, బావి నిరీక్షణలు వారికి రాజ్య ప్రశంసనిస్తూ, ఎవ్వరూ పాడలేనిరీతిగా వారు దాన్నిగూర్చి పాడునట్లు చేస్తున్నాయి.—ప్రకటన 20:6; కొలొస్సయులు 1:13; 1 థెస్సలొనీకయులు 2:11, 12.

9. అభిషక్తులు పాడే కీర్తనకు గొప్పసమూహం ఎలా స్పందించింది, అలా చేసేవారు ఏ ఉపదేశాన్ని నెరవేర్చారు?

9 అయిననూ, ఇతరులు వారు పాడేదాన్ని విని స్పందిస్తున్నారు. వేరే గొఱ్ఱెలకు సంబంధించిన ఒక గొప్పసమూహం 1935 నుండి యీ విజయోత్సాహపు కీర్తనవిని, వారితోకలిసి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి పురికొల్పబడ్డారు. (యోహాను 10:16; ప్రకటన 7:9) నిజమే, క్రొత్తగా వస్తున్న వీరు, దేవుని రాజ్యానికి కాబోయే రాజులు పాడే అదే క్రొత్తపాటను అదే విధంగా పాడడానికి నేర్చుకోలేరు. అయితే, వారుకూడ యెహోవాకు మధురమైన స్తుతిగీతంలో అంటే యెహోవా నెరవేర్చుతున్న క్రొత్తసంగతుల నిమిత్తం యెహోవాకు చెల్లించే స్తుతిగీతం అంటే ఆయనను కొనియాడే గీతంలో గళం కలుపగలరు. వారు అలాగు కీర్తనల రచయిత ఉపదేశాన్ని నెరవేర్చుతారు: “యెహోవామీద క్రొత్తకీర్తన పాడుడి. సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి. యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమబలములు యెహోవాకు చెల్లించుడి. . . యెహోవా రాజ్యము చేయుచున్నాడు. . . . ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి.”—కీర్తన 96:1-3, 7, 10; 98:1-9.

10. ఈ 1,44,000 మంది ఎలా 24 మంది పెద్దల “యెదుట” పాడడానికి సాధ్యమౌతుంది?

10 మరైతే యీ 24 మంది పెద్దలంటే మహిమగల పరలోక స్థానంలోనున్న 1,44,000 మందే గనుక యీ 1,44,000 మంది ఎలా పెద్దల “యెదుట” కీర్తన పాడతారు? ప్రభువు దినారంభంలో “క్రీస్తునందుండి మృతులైన వారు” ఆత్మీయ ప్రాణులుగా పునరుత్థానులయ్యారు. ఆ విధంగా, గెలిచిన యీ నమ్మకమైన అభిషక్త క్రైస్తవులు యిప్పుడు పరలోకమందున్నారు, ఆ 24 మంది యాజకులగు పెద్దల విభాగములలోని వారు నెరవేర్చే పనులను సాదృశ్యంగా నెరవేర్చుతున్నారు. వారు యెహోవా పరలోక సంస్థనుగూర్చిన దర్శనంలో చేర్చబడ్డారు. (1 థెస్సలొనీకయులు 4:15, 16; 1 దినవృత్తాంతములు 24:1-18; ప్రకటన 4:4; 6:11) భూమ్మీద 1,44,000 మందిలో యింకను ఉన్న శేషము, పరలోకానికి పునరుత్థానులైన తమ సహోదరుల యెదుట కీలక సముఖములో క్రొత్త కీర్తన పాడుతున్నారు.

11. అభిషక్త విజయులు 24 మంది పెద్దలని, 1,44,000 మంది అని ఎందుకు పేర్కొనబడ్డారు?

11 ఇక్కడ మనమీ విషయం కూడ అడుగవచ్చు: “ఈ అభిషక్తులైన విజయులు ఎందుకు సాదృశ్యమైన 24 మంది పెద్దలుగాను, 1,44,000 మందిగాను పిలువబడుతున్నారు? ఎందుకంటే ప్రకటన యీగుంపును రెండు వేర్వేరు దృక్పథాలతో చూస్తుంది. ఆ 24 మంది పెద్దలు ఎప్పుడూ పరలోకములో రాజులుగా యాజకులుగా యెహోవా సింహాసనం చుట్టూ వారిస్థానాల్లో ఉన్నట్లు చూపించబడుతున్నారు. వీరిలో బహుకొద్ది శేషము యీనాడు భూమ్మీద ఉన్నప్పటికిని, వారు పరలోకమందు వారిస్థానాల్లో ఉండే 1,44,000 మంది గుంపు మొత్తాన్ని సూచిస్తున్నారు. (ప్రకటన 4:4, 10; 5:5-14; 7:11-13; 11:16-18) అయిననూ, ప్రకటన 7వ అధ్యాయం, మానవులలోనుండి కొనబడిన 1,44,000 మందిపై ముఖ్యంగా అవధానాన్ని నిల్పుతుంది, మరియు అది ఆత్మీయ ఇశ్రాయేలీయులలో ఒక్కొక్కరిగా పూర్తిసంఖ్యను ముద్రించే యెహోవా మహాసంకల్పాన్ని గూర్చియు, అసంఖ్యాకులైన గొప్పసమూహపు రక్షణను అనుగ్రహించే విషయాన్ని గూర్చియు నొక్కి తెల్పుతుంది. ప్రకటన 14వ అధ్యాయం, 1,44,000 మంది విజయులగు రాజ్య తరగతికి వారంతా గొఱ్ఱెపిల్లతోపాటు సీయోను పర్వతంమీద ఉంటారని ధృవీకరించే దృశ్యాన్నిస్తుంది. మనమిప్పుడు గమనించబోవు రీతిగా, ఆ 1,44,000 మందిలో ఒకరిగా లెక్కించబడడానికి అవసరమైన అర్హతలుకూడ తెలుపబడ్డాయి. *

గొఱ్ఱెపిల్ల అనుచరులు

12. (ఎ) యోహాను 1,44,000 మందిని గూర్చి ఎలా యింకా వర్ణిస్తూనే వున్నాడు? (బి) ఏ భావంలో 1,44,000 మంది స్త్రీ సాంగత్యం ఎరుగనివారని పిలువబడుతున్నారు?

12 “భూలోకములోనుండి కొనబడిన” యీ 1,44,000 మందినిగూర్చి వర్ణిస్తూ, యోహాను యింకనూ మనకిలా చెబుతున్నాడు: “వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునైయుండి, గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు; వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు. వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు.” (ప్రకటన 14:4, 5) ఈ 1,44,000 మంది “స్త్రీ సాంగత్యము ఎరుగనివారు” అంటే యీ తరగతికి చెందినవారు అవివాహితులై ఉండాలని అర్థంకాదు. అపొస్తలుడైన పౌలు పరలోకపిలుపు కల్గియున్న క్రైస్తవులకు వ్రాస్తూ, క్రైస్తవుడు ఒంటరిగా వుంటే ప్రయోజనాలున్ననూ, కొన్ని పరిస్థితులలో వివాహం కోరదగిందే అంటున్నాడు. (1 కొరింథీయులు 7:1, 2, 36, 37) ఈ తరగతిని గుర్తించేదేమంటే ఆత్మీయ కన్యత్వము. వారు లోక రాజకీయాలతో అబద్ధమతంతో ఆత్మీయ వ్యభిచారం చేయడంలేదు. (యాకోబు 4:4; ప్రకటన 17:5) క్రీస్తుకు ప్రధానము చేయబడిన పెండ్లికుమార్తెగా, వారు పవిత్రంగాను, “మూర్ఖమైన వక్రజనము మధ్య అనింద్యులుగా” ఉంటున్నారు.—ఫిలిప్పీయులు 2:15.

13. ఈ 1,44,000 మంది యేసుక్రీస్తుకు ఎందుకు తగిన పెండ్లికుమార్తె అవుతారు, మరియు వారెలా “గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు”?

13 అంతేగాక, “వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు.” ఈ విషయంలో వారు తమ రాజైన యేసుక్రీస్తువలె ఉన్నారు. పరిపూర్ణ మానవునిగా “ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.” (1 పేతురు 2:21, 22) ఏకకాలంలో నిందారహితులుగాను, సత్యవంతులుగాను ఉంటున్నందున ఆ 1,44,000 మంది యెహోవాయొక్క ప్రధానయాజకునికి పవిత్రమైన పెండ్లికుమార్తెగా సిద్ధపర్చబడుతున్నారు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు సహృదయులు తనను వెంబడించాలని వారిని ఆహ్వానించాడు. (మార్కు 8:34; 10:21; యోహాను 1:43) ఆయన ఆహ్వానాన్ని అందుకున్నవారు ఆయన జీవితమార్గాన్ని అనుకరించారు, ఆయన బోధలకు విధేయులయ్యారు. ఆ విధంగా, వారి భూలోక జీవితంలో, యీ సాతాను లోకంలో ఆయన వారినెక్కడికి నడిపిస్తే అక్కడికెల్ల వారు ‘గొఱ్ఱెపిల్లను వెంబడిస్తారు.’

14. (ఎ) ఈ 1,44,000 మంది ఎలా “దేవుని కొరకును గొఱ్ఱెపిల్ల కొరకును ప్రథమఫలము” అవుతున్నారు? (బి) ఏ భావంలో గొప్పసమూహం కూడ ప్రథమ ఫలములని చెప్పవచ్చును?

14 ఈ 1,44,000 మంది “భూలోకములోనుండి,” “మనుష్యులలోనుండి కొనబడిన”వారిగా, వారు ఆత్మీయ కుమారులుగా స్వీకరించబడ్డారు. వారి పునరుత్థానం తర్వాత వారికను రక్తమాంసాలుగల మానవులుగా ఉండరు. వారు, ప్రకటన 14:4వ వచనంలో తెల్పబడినట్లు “దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలము” అవుతారు. నిజమే, మొదటి శతాబ్దంలో యేసు “నిద్రించినవారిలో ప్రథమఫలము” అయ్యాడు. (1 కొరింథీయులు 15:20, 23) అయితే, యీ 1,44,000 మంది యేసు బలిమూలంగా అసంపూర్ణులైన మానవులలోనుండి ‘నిర్దిష్టమైన ప్రథమఫలములుగా’ కొనబడ్డారు. (యాకోబు 1:18) అయిననూ, ఫలములను సమకూర్చేపని వారితోనే ఆగిపోదు. అసంఖ్యాకులైన గొప్పసమూహం సమకూర్చబడే సంగతినిగూర్చి ప్రకటన గ్రంథం ముందే తెల్పింది, వారు మహాశబ్దంతో ఎలుగెత్తి యిలా చెబుతారు: “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రము.” ఈ గొప్పసమూహము మహాశ్రమలను తప్పించుకుంటుంది, మరి వారు “జీవజలముల” వలన సేదదీర్చుకుంటూ వుండగా భూమ్మీద వారు పరిపూర్ణ స్థితికి తేబడతారు. మహాశ్రమలు గతించిన కొంతకాలానికి హేడిస్‌ ఖాళీ చేయబడుతుంది, లక్షలాది ఇతరమానవులు పునరుత్థానులౌతారు, వారును అదే జీవజలములను త్రాగే అవకాశాన్ని పొందుతారు. దీనిని మనస్సు నందుంచుకొని గొప్పసమూహాన్ని వేరేగొఱ్ఱెలలోని ప్రథమఫలము అని పిలవడం సరియే—వారు భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణతో ‘గొఱ్ఱెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుకుకొని’ తెలుపు చేసుకోవడంలో ప్రథములు.—ప్రకటన 7:9 10, 14, 17; 20:12, 13.

15. మూడురకాలైన ప్రథమఫలాలకు, మోషే ధర్మశాస్త్రము క్రింద చేసిన పండుగలకు పోలికలెలా ఉన్నాయి?

15 ప్రథమ ఫలములైన ఈ ముగ్గురు (యేసుక్రీస్తు, 1,44,000 మంది, గొప్పసమూహము) ప్రాచీనకాలంలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం చేసిన పండుగలతో ఆసక్తికరమైన సారూప్యతను కల్గియున్నారు. పులియనిరొట్టెల పండుగ సమయంలో నీసాను 16 తేదీన యవలపంటలో ప్రథమఫలంగా ఒక పన యెహోవాకు అర్పించబడేది. (లేవీయకాండము 23:6-14) నీసాను 16వ తేదీన యేసు మరణంనుండి పునరుత్థానం చేయబడ్డాడు. నీసాను 16 మొదలుకొని 50వ రోజున, అనగా మూడవనెలలో ఇశ్రాయేలీయులు గోధుమల ప్రథమఫల సంగ్రహ పండుగను ఆచరించారు. (నిర్గమకాండము 23:16; లేవీయకాండము 23:15, 16) ఈ పండుగ పెంతెకొస్తు అని పిలువబడింది, (“యాభయవ” అని అర్థమిచ్చే గ్రీకుపదంనుండి వచ్చింది) ఆ సా.శ. 33 పెంతెకొస్తునాడే యీ 1,44,000 మందిలో ప్రథమ సభ్యులు పరిశుద్ధాత్మచేత అభిషేకించబడ్డారు. చివరకు, పంట అంతటిని సమకూర్చిన తర్వాత ఏడవ నెలలో, పర్ణశాలల పండుగ చేసేవారు, అది ఇశ్రాయేలీయులు ఇతర వస్తువులతోపాటు, ఖర్జూరపు మట్టలతో చేయబడిన పర్ణశాలల్లో ఒక వారం రోజులు నివసించిన దానికి ఆనందంతో కృతజ్ఞత చెల్లించే సమయం. (లేవీయకాండము 23:33-43) అదేమాదిరి, గొప్పసమకూర్పులో భాగమైన గొప్పసమూహానికి చెందినవారు, “ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని” సింహాసనము యెదుట కృతజ్ఞతలు చెబుతున్నారు.—ప్రకటన 7:9.

నిత్యసువార్తను ప్రకటించుట

16, 17. (ఎ) దూత ఎక్కడ ఎగురుతూవుంటే యోహాను చూస్తున్నాడు, మరి ఆ దూత ఏ ప్రకటన చేస్తున్నాడు? (బి) రాజ్యప్రచారపు పనిలో ఎవరు భాగం వహిస్తున్నారు, మరి ఏ అనుభవాలు దీన్ని తెలియజేస్తున్నాయి?

16 తర్వాత యోహాను యిలా వ్రాస్తున్నాడు: “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు—మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.” (ప్రకటన 14:6, 7) దేవదూత పక్షులు ఎగిరేచోటున, “ఆకాశమధ్యమున” ఎగురుతున్నాడు. (ప్రకటన 19:17 పోల్చండి.) కాబట్టి, ఆయన శబ్దం భూమియంతట వినబడగలదు. ఈ దూత దూరదర్శిని వార్తా ప్రసారంకన్నా ఎంతో ఎక్కువగానే ప్రపంచమంతట ప్రకటిస్తున్నాడు!

17 ప్రతివారు క్రూరమృగానికి, దాని ప్రతిమకుకాదు గాని, సాతానుచేత నడిపించబడే ఏ సాదృశ్యమైన క్రూరమృగం కంటెను అసమానమైన శక్తిగల యెహోవాకు భయపడాలని ఉపదేశింప బడుతున్నారు. ఎందుకంటే, యెహోవా భూమ్యాకాశాలను సృజించాడు, మరిప్పుడాయన భూమికి తీర్పుతీర్చే సమయం ఆసన్నమైంది! (ఆదికాండము 1:1; ప్రకటన 11:18 పోల్చండి.) యేసు భూమ్మీదనున్నప్పుడు మనకాలాన్ని గూర్చి యిలా ప్రవచించాడు: “మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) అభిషక్త క్రైస్తవుల సంఘం యీ పనిని నెరవేస్తుంది. (1 కొరింథీయులు 9:16; ఎఫెసీయులు 6:15) అదృశ్యులైన దూతలుకూడ యీ ప్రచారపు పనిలో భాగం వహిస్తున్నారని ప్రకటన యిక్కడ బయలుపరుస్తుంది. వేదనతోనిండి ఆత్మీయ సహాయం కొరకు వెదుకుచూ, ప్రార్థిస్తున్న ఎవరో ఒకరి యింటికి యెహోవాసాక్షులలో ఒకరు వెళ్లడానికి దూతల నడిపింపు ఎన్నోసార్లు లభించింది!

18. ఆకాశమధ్యమున ఎగురుచున్న దూత ప్రకారము, దేనికి సమయమాసన్నమైనది, మరియు ఎవరు యింకా ప్రకటనలు చేస్తుంటారు?

18 ఆకాశమధ్యమందు ఎగిరే దూత ప్రకటించినట్లు, తీర్పుగడియ వచ్చింది. దేవుడు యిప్పుడెటువంటి తీర్పుతీరుస్తాడు? రెండవ, మూడవ, నాలుగవ, మరియు ఐదవ దూత ప్రకటనలు వింటే చెవులు గింగురుమంటాయి.—యిర్మీయా 19:3.

[అధస్సూచీలు]

^ పేరా 4 మరి 1 కొరింథీయులు 4:8 తెల్పుతున్నట్లు, అభిషక్త క్రైస్తవులు యీ భూమ్మీద ఉన్నంతకాలం రాజులుగా పరిపాలన చేయరు. అయిననూ, ప్రకటన 14:3, 6, 12, 13, ప్రకారం వారు తమ భూజీవితాన్ని చాలించేంతవరకు సహిస్తూనే సువార్తను ప్రకటించుటద్వారా ఆ క్రొత్తపాట పాడడంలో పాల్గొంటారు.

^ పేరా 5 ఇతర దర్శనములలో హెబ్రీ పేర్లు ఉపయోగించిన విధానం దీన్ని బలపరుస్తుంది; యేసుకు “అబద్దోననే” (“నాశనము చేయువాడని” అర్థం) హెబ్రీ పేరు పెట్టబడింది, ఆయన “హెబ్రీ భాషలో హార్‌మెగిద్దోనను” స్థలంలో తీర్పుతీరుస్తాడు.—ప్రకటన 9:11; 16:16.

^ పేరా 8 ‘ఒక క్రొత్త కీర్తన లాంటి’దని లేఖనం అంటోంది, ఎందుకంటె, పూర్వం కీర్తనే నిజానికి ప్రవచనార్థకంగా వ్రాయబడింది. అయితే దాన్ని పాడడానికి అర్హుడైన వాడెవడులేడు. ఇప్పుడు ఆ రాజ్యం స్థాపించబడడంతోను, పరిశుద్ధుల పునరుత్థానముతోను ప్రవచన నెరవేర్పుగా వాస్తవాలు బహిర్గతమయ్యాయి, మరియు గళమెత్తి మహోన్నతంగా దాన్ని పాడడానికి అది యుక్త సమయము.

^ పేరా 11 ఈ పరిస్థితిని యింటివారికి తగినవేళ ఆహారాన్ని పంచిపెట్టే నమ్మకమును బుద్ధిమంతుడైన దాసునితో పోల్చవచ్చును. (మత్తయి 24:45) దాసుడు ఆహారాన్ని పంచిపెట్టే బాధ్యత కల్గివున్నాడు, అయితే యింటివారు, అంటే ఆ దాసుని గుంపులోని వ్యక్తులు ఆయాత్మీయాహార ఏర్పాటులో పాల్గొంటూ పోషింపబడుతున్నారు. వారు ఒకేగుంపుకు చెందిన వారే గానీ వేర్వేరు పదాలతో—గుంపుగాను, వ్యక్తిగతంగాను వర్ణించబడుతున్నారు.

[అధ్యయన ప్రశ్నలు]

[202, 203వ పేజీలోని చిత్రం]

1,44,000

24 మంది పెద్దలు

రెండు విభిన్న కోణాలనుండి చూచినప్పుడు కనబడే క్రీస్తుయేసు అనే గొఱ్ఱెపిల్లయొక్క సహవారసులు