కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సర్పం తలను చితకగొట్టుట

సర్పం తలను చితకగొట్టుట

అధ్యాయం 40

సర్పం తలను చితకగొట్టుట

దర్శనము 14—ప్రకటన 20:1-10

అంశం: సాతానును అగాధంలో వేయడం, వెయ్యేండ్ల పరిపాలన, మానవజాతి అంతిమ పరీక్ష, మరియు సాతాను నాశనము

నెరవేర్పుకాలం: మహాశ్రమల అంతంనుండి సాతాను నాశనం వరకు

1. బైబిలు మొదటి ప్రవచనం ఎలా నెరవేరడాని కారంభమైంది?

బైబిలు మొదటి ప్రవచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలరా? యెహోవా ఆ ప్రవచనాన్ని సర్పంతో చెప్పినప్పుడు యిలా పలికాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దాని మడిమెమీద కొట్టుదువు.” (ఆదికాండము 3:15) ఇప్పుడా ప్రవచన నెరవేర్పు అంతిమదశకు చేరుకుంటుంది. సాతాను యెహోవా యొక్క పరలోక స్త్రీవంటి సంస్థపై యుద్ధం చేసే చరిత్రను మనం ఆరాతీసి చూశాం. (ప్రకటన 12:1, 9) మతం, రాజకీయాలు, పెద్ద వ్యాపారం అనబడే సాతాను సంతానం స్త్రీ సంతానమైన యేసుక్రీస్తును, ఆయన అభిషక్త అనుచరులైన 1,44,000 మందిని యీ భూమ్మీద ఎంతో క్రూరంగా హింసించింది. (యోహాను 8:37, 44; గలతీయులు 3:16, 29) సాతాను యేసును వేదనకరమగు మరణంతో మొత్తాడు. అయితే, యిదొక మానగల్గే పుండువంటిదే అయింది, ఎందుకంటే, దేవుడు తన నమ్మకమైన కుమారుని మూడవ దినమున పునరుత్థానం చేశాడు.—అపొస్తలుల కార్యములు 10:38-40.

2. సర్పమెలా చితకగొట్ట బడుతుంది, సర్పం యొక్క భూలోక సంతానానికి ఏమౌతుంది?

2 సర్పం, అతని సంతానం సంగతేమిటి? సా.శ. 56 ప్రాంతంలో అపొస్తలుడైన పౌలు రోములోని క్రైస్తవులకు ఓ పెద్ద పత్రిక రాశాడు. దాన్ని ముగిస్తూ ఆయన వారికిలా ఉపదేశించాడు: “సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును.” (రోమీయులు 16:20) ఇది పైపైన చితుకగొట్టే దానికంటె ఎక్కువే. సాతాను చితుక త్రొక్కబడాలి! పౌలు యిక్కడ సిన్‌ట్రిబొ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు, దానిభావం పొడిపొడిచేయడం, తొక్కడం, నలగదొక్కి పూర్తిగా నాశనం చేయడమని అర్థం. సర్పంయొక్క మానవ సంతానాన్ని గూర్చియైతే, అది ప్రభువు దినమందు నిజంగా పడద్రోయబడి, మహాబబులోను, యీలోక రాజకీయాలు, వాటితోపాటు ఆర్థిక, సైనిక తొత్తులందరూ మహాశ్రమల కాలంలో సమూలంగా నాశనం కావడంతో ముగింపుకొస్తుంది. (ప్రకటన 18, 19 అధ్యాయాలు) అలా యెహోవా దేవుడు రెండు సంతానాలమధ్యగల వైరాన్ని అంతం చేయనైయున్నాడు. దేవుని స్త్రీ సంతానం, భూసంబంధమైన సర్పసంతానంపై విజయం సాధిస్తుంది, ఆ సంతానమిక లేదు!

సాతాను అగాధంలో వేయబడ్డాడు

3. సాతానుకేమి కాబోతుందని యోహాను మనకు చెబుతున్నాడు?

3 మరైతే, సాతానుకు అతని దయ్యాలకు ఏమి భద్రపర్చబడింది? యోహాను మనకిలా తెల్పుతున్నాడు: “మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యిసంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను.”—ప్రకటన 20:1-3.

4. పాతాళపు తాళపు చెవులుకల్గియున్న దూత ఎవరు, అది మనకెలా తెలుసు?

4 ఎవరీ దూత? ఆయన యెహోవా విరోధిని పడవేయగల మహాశక్తి సంపన్నుడై యుండాలి. ఆయన దగ్గర ‘పెద్దసంకెళ్లును అగాధము యొక్క తాళపుచెవియును’ ఉన్నాయి. ఇది మనకు అంతకుముందున్న దర్శనాన్ని జ్ఞాపకం చేయడంలేదా? అవును, మిడుతల మీద రాజు “పాతాళపు దూత” అని పిలువబడుతున్నాడు. (ప్రకటన 9:11) గనుక యెహోవా ముఖ్య నిరూపణకర్త, మహిమనొందిన యేసుక్రీస్తు కార్యోన్ముఖుడైనట్లు యిక్కడ మరలా మనం గమనిస్తాం. సాతానును పరలోకంనుండి పడద్రోసి, మహాబబులోనుకు తీర్పుతీర్చి, “భూరాజులను వారి సేనలను” అర్మగిద్దోనులో నాశనం చేసిన ఈ ప్రధాన దూత, సాతానును పెద్దదెబ్బతో అగాధంలో పడవేయడానికి తనకంటె తక్కువైన దూతకు అవకాశమివ్వడానికి తాను ప్రక్కకు తప్పుకోడు.—ప్రకటన 12:7-9; 18:1, 2; 19:11-21.

5. పాతాళపు దూత అపవాదియగు సాతానుతో ఎలా వ్యవహరిస్తాడు, ఎందుకు?

5 గొప్ప ఎఱ్ఱని క్రూరమృగము పరలోకంనుండి పడద్రోయబడినప్పుడు అతడు “సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు, సాతాననియు పేరుగల ఆది సర్పము,” అని పిలువబడ్డాడు. (ప్రకటన 12:3, 9) ఇప్పుడు, పట్టబడి అగాధంలో వేయబడిన సమయంలో అతడు మరల “ఆదిసర్పము అనగా అపవాదియు సాతాను అను ఆ ఘటసర్పము”గా వర్ణించబడ్డాడు. ఈ సిగ్గుమాలిన భక్షకుడు, మోసగాడు, అపవాదకుడు మరియు ఎదిరించువాడు బంధింపబడి, “ఇక జనములను మోసపరచకుండునట్లు” మూసి గట్టిగా ముద్రవేయబడిన “అగాధములో” పడవేయబడ్డాడు. సాతాను వెయ్యేండ్లవరకు యిలా బందింపబడతాడు, లోతైన గొయ్యిలోనున్న ఒక ఖైదీ ఎలా నిస్సహాయుడో అలాగే ఇతడు మానవజాతిమీద ఎటువంటి ప్రభావం చూపలేడు. పాతాళపు దూత రాజ్యనీతి విషయంలో ఎటువంటి సంబంధం లేకుండా సాతాన్ను పూర్తి దూరంగా ఉంచుతాడు. మానవజాతికి ఎంతటి ఉపశమనమోగదా!

6. (ఎ) దయ్యాలుకూడ అగాధంలోకి వెళ్తాయనేందుకు ఆధారమేమిటి? (బి) ఇప్పుడేమి ఆరంభమౌతుంది, ఎందుకు?

6 దయ్యాలకేమౌతుంది? వారుకూడ “తీర్పుకొరకు భద్రపరచబడియున్నారు.” (2 పేతురు 2:4) సాతాను “దయ్యముల అధిపతియగు బయల్జెబూల”ని పిలువబడుతున్నాడు. (లూకా 11:15, 18; మత్తయి 10:25) సాతానుతో వారికున్న దీర్ఘకాల సంబంధాన్నిబట్టి, వారికికూడ అటువంటి తీర్పుతీర్చకూడదా? ఆ దయ్యాలు అగాధాన్ని దీర్ఘకాలంగా ఓ భయానక స్థలంగా భావించేవారు, ఒక సందర్భంలో యేసు వారిని ఎదుర్కొనగా “పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనిరి.” (లూకా 8:31) అయితే సాతాను పాతాళంలో పడవేయబడితే అతని దూతలుకూడ అతనితోపాటు నిశ్చయంగా పాతాళంలో పడవేయబడతారు. (యెషయా 24:21, 22 పోల్చండి.) సాతానును అతని దయ్యాలను అగాధంలో పడవేసిన తర్వాత యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభం కావచ్చును.

7. (ఎ) అగాధంలో ఉన్నప్పుడు సాతాను అతని దయ్యాల స్థితి ఏమిటి, అది మనకెలా తెలుసు? (బి) హేడీస్‌, అగాధం రెండూ ఒకటేనా? (అథఃస్సూచి చూడండి)

7 అగాధంలో ఉన్నప్పుడు సాతాను అతని దయ్యాలు చురుకుగా పనిచేస్తాయా? “ఉండెను గాని యిప్పుడులేదు అయితే అగాధమునుండి పైకి లేచివచ్చు” ఎఱ్ఱని ఏడుతలలుగల క్రూరమృగాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. (ప్రకటన 17:8) అగాధంలో ఉన్నప్పుడు అది ‘లేకుండెను.’ అది ఏదియు చేయక నిశ్చలంగా, అన్ని ఉద్దేశాలు, సంకల్పాల విషయంలో మృతమైయుండెను. అలాగే, యేసునుగూర్చి తెల్పుతూ అపొస్తలుడైన పౌలు “ఎవడు అగాధములోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతులలోనుండి పైకి తెచ్చుటకు” అని అన్నాడు. (రోమీయులు 10:7) ఆ అగాధంలోనున్నప్పుడు యేసు మృతుడైయుండెను. * గనుక సాతాను అతని దూతలు వెయ్యేండ్లు అగాధంలో ఉన్నప్పుడు వారు మరణంవంటి నిష్క్రియా స్థితిలో ఉంటారు. నీతిని ప్రేమించే వారికెంత మంచివార్త!

వెయ్యేండ్లపాటుండే న్యాయాధిపతులు

8, 9. సింహాసనములపై కూర్చుండే వారినిగూర్చి యోహాను మనకిప్పుడేం చెబుతున్నాడు, మరి అలాంటి వారెవరు?

8 వెయ్యేండ్ల తర్వాత సాతాను అగాధంనుండి కొంతకాలం విడిచిపెట్టబడతాడు. ఎందుకు? దానికి సమాధానమివ్వక ముందు యోహాను ఆ కాలంయొక్క ఆరంభానికి మన అవధానాన్ని మళ్లిస్తున్నాడు. అక్కడ మనమిలా చదువుతాము: “అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను.” (ప్రకటన 20:4ఎ) మహిమనొందిన యేసుక్రీస్తుతోపాటు పరలోకమందు సింహాసనాలమీద కూర్చుని పరిపాలించే వీరెవరు?

9 “మనుష్యకుమారుని పోలిన” వానితో ఆ రాజ్యంలో పరిపాలన చేస్తారని దానియేలు వర్ణించిన “పరిశుద్ధులు” వీరే. (దానియేలు 7:13, 14, 18) వీరు యెహోవా సముఖమున పరలోక సింహాసనములపై కూర్చునే ఆ 24 మంది పెద్దలవంటివారే. (ప్రకటన 4:4) యేసు వాగ్దానం చేసిన 12మంది అపొస్తలులు అందులో ఉన్నారు, ఆయన వారితో యిలా అన్నాడు: “(ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారికి తీర్పుతీర్చుదురు.” (మత్తయి 19:28) వారిలో పౌలు, నమ్మకంగా నిలిచియున్న కొరింథీ క్రైస్తవులుకూడ ఉన్నారు. (1 కొరింథీయులు 4:8; 6:2, 3) వారిలో జయించిన లవొదికయ సంఘసభ్యులుకూడ చేరియున్నారు.—ప్రకటన 3:21.

10. (ఎ) యోహాను యిప్పుడు 1,44,000 మంది రాజులను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) యోహాను మనకు ముందే తెల్పిన రీతిగా 1,44,000 మందిలో ఎవరు చేరియున్నారు?

10 “దేవునికొరకును క్రీస్తుకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడిన” యీ అభిషక్త విజయులకు 1,44,000 సింహాసనములు సిద్ధపర్చబడి ఉన్నాయి. (ప్రకటన 14:1, 4) యోహాను యింకా యిలా చెబుతున్నాడు: “మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.” (ప్రకటన 20:4బి) గనుక ఆ రాజులలో అభిషక్తులైన క్రైస్తవ హతసాక్షులున్నారు, ఐదవ ముద్రను విప్పినప్పుడు వారు తమ రక్తానికి ప్రతీకారం తీర్చక ఎందాక వేచివుంటాడని యెహోవాను అడిగారు. అప్పుడు వారికి తెల్లని వస్త్రమీయబడి వారు కొంతకాలం వేచియుండాలని తెలుపబడింది. అయితే యిప్పుడు మహాబబులోను నిర్మూలనంతోను, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన వానితో రాజ్యాలు నాశనం చేయబడడంతోను, సాతాను అగాధంలో బంధింపబడడం ద్వారాను వారికి ప్రతీకారము తీర్చబడింది.—ప్రకటన 6:9-11; 17:16; 19:15, 16.

11. (ఎ) “వధింపబడిన” అనే మాటను మనమెలా అర్థంచేసుకోవాలి? (బి) మరి 1,44,000 మందిలో అందరూ బలియాగముగానే చనిపోయారని ఎందుకు చెప్పవచ్చు?

11 ఈ 1,44,000 రాజరికపు న్యాయాధిపతులందరూ నిజంగా “శిరచ్ఛేదనము” చేయబడ్డారా? బహుశ, వారిలో బహుకొద్దిమంది అలా నిజంగానే వధింపబడి వుండొచ్చు. అయితే యీ మాట ఏదోరకంగా హతసాక్షులైన అభిషక్త క్రైస్తవులందరిని తెల్పడానికి నిశ్చయంగా ఉద్దేశించినదై యున్నది. * (మత్తయి 10:22, 28) సాతాను తప్పకుండ వారిని అందరిని వధించాలనుకున్నాడు అయితే యేసు అభిషక్త సహోదరులంతా హతసాక్షులుగా మరణించలేదు. వారిలో అనేకులు రోగంవల్లనో వృద్ధాప్యం వల్లనో మరణించారు. అటువంటివారుకూడ యోహానిప్పుడు చూస్తున్న గుంపులో ఉన్నారు. ఒక భావంలో వారి మరణం త్యాగశీలమే. (రోమీయులు 6:3-5) అంతేగాక వారిలో ఎవ్వరూ లోక సంబంధులు కారు. అందుకే లోకం వారందరిని ద్వేషిస్తుంది, దాని దృష్టిలో వారు మరణించినట్లే. (యోహాను 15:19; 1 కొరింథీయులు 4:13) వారిలో ఎవ్వరూ క్రూరమృగాన్నిగాని దాని ప్రతిమనుగాని ఆరాధించలేదు, మరి వారు మరణించినప్పుడు వారిలో ఎవ్వరూ క్రూరమృగపు ముద్రను కల్గియుండలేదు. వారంతా విజయులుగానే మరణించారు.—1 యోహాను 5:4; ప్రకటన 2:7; 3:12; 12:11.

12. యోహాను 1,44,000 మంది రాజులనుగూర్చి ఏమి చెబుతున్నాడు, వారెప్పుడు బ్రదుకుతారు?

12 ఇప్పుడీ విజయులు మరల జీవిస్తారు! యోహానిలా తెల్పుతున్నాడు: “వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి.” (ప్రకటన 20:4సి) అంటే యీ న్యాయాధిపతులు రాజ్యాలు నాశనమై, సాతాను అతని దయ్యాలు అగాధంలో పడవేయబడే వరకు పునరుత్థానం కారని అర్థమా? లేదు. వారిలో అనేకులు యిప్పటికే జీవించేయున్నారు, ఎందుకంటే వారు అర్మగిద్దోనునందు జనాంగములకు వ్యతిరేకంగా యేసుతోపాటు వెళ్లారు. (ప్రకటన 2:26, 27; 19:14) వాస్తవానికి, వారి పునరుత్థానం 1914 లో యేసు ప్రత్యక్షత ఆరంభమైనప్పటినుండి మొదలౌతుందని పౌలు సూచించాడు, వారిలో కొందరు యితరులకంటె ముందుగా లేపబడియున్నారు. (1 కొరింథీయులు 15:51-54; 1 థెస్సలొనీకయులు 4:15-17) గనుకనే, వారు బ్రతకడమనేది, పరలోకమందు అమర్త్యమనే బహుమానాన్ని వ్యక్తిగతంగా వారు పొందేదాన్నిబట్టి కొంతకాలవ్యవధిలో జరుగుతుంది.—2 థెస్సలొనీకయులు 1:7; 2 పేతురు 3:11-14.

13. (ఎ) మనం 1,44,000 మంది పాలించే వెయ్యేండ్ల పరిపాలనను ఎలా దృష్టించాలి, ఎందుకు? (బి) హైరపొలిస్‌ యొక్క పాపియస్‌ వెయ్యేండ్లను ఎలా దృష్టించాడు? (అథఃస్సూచి చూడండి.)

13 వారి పరిపాలన, తీర్పు వెయ్యేండ్లు సాగుతుంది. ఇది నిజంగా వెయ్యేండ్లేనా, లేక వివరించని దీర్ఘకాలాన్ని సూచించే సాదృశ్యమైన కాలమని మనమనుకోవాలా? మరి 1 సమూయేలు 21:11 లో ఉన్నట్లు “వేలు” అనేమాట పెద్ద, అనిశ్చయ సంఖ్యను సూచించవచ్చు. అయితే యిక్కడ మాత్రం “వెయ్యి” అనేది అక్షరార్థమైందే, ఎందుకంటే అది ప్రకటన 20:5-7 లో “ వెయ్యేండ్లు” అని కనబడుతోంది. పౌలు యీ కాలాన్ని తీర్పు “దినము” అని పిలుస్తూ యిలా తెల్పుతున్నాడు: “తాను [దేవుడు] నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు.” (అపొస్తలుల కార్యములు 17:31) యెహోవా దృష్టిలో ఒక దినము వెయ్యేండ్లని పేతురు మనకు తెల్పుతున్నప్పుడు, యీ తీర్పుదినమును అక్షరార్థమైన వెయ్యేండ్లుగా పరిగణించడం యుక్తమే. *2 పేతురు 3:8.

కడమ మృతులు

14. (ఎ) “కడమ మృతుల”ను గూర్చి యోహాను ఏ మాటను చేర్చి చెబుతున్నాడు? (బి) “బ్రదికినవారై” అనే పదంమీద పౌలు చెప్పినమాటలెలా వివరణ యిస్తున్నాయి?

14 మరి అపొస్తలుడైన యోహాను యిక్కడ “(ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు)” అని చెబుతున్నందున యీ రాజులు ఎవరికి తీర్పు తీర్చుతారు? (ప్రకటన 20:5ఎ) ఇక్కడ “బ్రదుకుట” అనేమాటను సందర్భాన్నిబట్టి అర్థంచేసుకోవాలి. ఈ మాటకు వివిధ సందర్భాల్లో వివిధ అర్థాలున్నాయి. ఉదాహరణకు, పౌలు తోటి క్రైస్తవులను గూర్చి యిలా చెప్పాడు: “మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతోకూడ బ్రదికించెను.” (ఎఫెసీయులు 2:1) అవును, ఆత్మచేత అభిషేకమునొందిన క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో సహితం, యేసుక్రీస్తు బలియందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి “బ్రదికింప బడిరి”.—రోమీయులు 3:23, 24.

15. (ఎ) క్రైస్తవులకు ముందున్న యెహోవాసాక్షులు దేవునితో ఎటువంటి స్థానం కల్గియుండిరి? (బి) వేరే గొఱ్ఱెలు ఎలా “బ్రదుకుతారు,” వారెప్పుడు భూమిని పూర్తిస్థాయిలో స్వతంత్రించుకుంటారు?

15 అదేవిధంగా, క్రైస్తవకాలానికి ముందున్న యెహోవా సాక్షులు దేవుని స్నేహితులైనందున నీతిమంతులుగా తీర్చబడ్డారు; అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబు అనువారు భౌతికంగా మరణించిననూ వారు “సజీవులు”గా తెల్పబడ్డారు. (మత్తయి 22:31, 32; యాకోబు 2:21, 23) అయినా, వారు, పునరుత్థానం చేయబడినవారందరు, అర్మగిద్దోను తప్పించుకునే నమ్మకమైన వేరేగొఱ్ఱెలకు సంబంధించిన గొప్పసమూహము, వీరికి నూతన లోకంలో ఒకవేళ పిల్లలు పుడితే వారును, యింకా మానవ పరిపూర్ణతకు తీసుకుని రాబడాలి. యేసు విమోచనా క్రయధనం ఆధారంగా వెయ్యేండ్ల తీర్పు దినమున క్రీస్తు ఆయన సహరాజులు, యాజకులు దానిని నెరవేరుస్తారు. ఆ దినము గడిచిన తర్వాత “కడమ మృతులు” “బ్రదుకుదురు” అంటే వారు పరిపూర్ణతకు వస్తారని అర్థం. మనం గమనించబోతున్నట్లు, వారు అంతిమ పరీక్షలో నెగ్గాలి, కానీ వారా పరీక్షను పరిపూర్ణులుగా ఎదుర్కొంటారు. వారా పరీక్షలో నెగ్గితే, దేవుడు వారిని సంపూర్ణ భావంలో నీతిమంతులుగా తీర్చి, నిరంతరం జీవించడానికి యోగ్యులని ప్రకటిస్తాడు. వారీ వాగ్దానపు నెరవేర్పును పూర్తిగా అనుభవిస్తారు: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:29) విధేయులైన మానవులకు ఎంతటి దివ్యమైన భవిష్యత్తు ఉన్నదోగదా!

మొదటి పునరుత్థానం

16. క్రీస్తుతోపాటు రాజులుగా పాలించే వారు పొందే పునరుత్థానాన్ని యోహాను ఎలా వర్ణిస్తున్నాడు, ఎందుకు?

16 “బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి” అని చెప్పినవారిని గూర్చి యోహాను మరలా ప్రస్తావిస్తూ, యిలా వ్రాస్తున్నాడు: “ఇదియే మొదటి పునరుత్థానము.” (ప్రకటన 20:5బి) అదెలా మొదటి పునరుత్థానమౌతుంది? అది సమయం విషయంలో “మొదటి పునరుత్థానము,” ఎందుకంటే దాన్నిపొందేవారు “దేవునికిని గొఱ్ఱెపిల్లకును ప్రథమఫల”మై యున్నారు. (ప్రకటన 14:4) ప్రాముఖ్యత విషయంలోకూడ అది మొదటిదే, ఎందుకంటే అందులో భాగం వహించేవారు యేసుతోపాటు పరలోకరాజ్యంలో పరిపాలిస్తారు, మిగిలిన మానవులకు తీర్పుతీరుస్తారు. చివరిగా, గుణంలో కూడ అది మొదటిదే. యేసుక్రీస్తు గాక మొదటి పునరుత్థానం పొందినవారిలో వీరు మాత్రమే అమర్త్యతను పొందుతున్నట్లు బైబిల్లో తెలుపబడ్డారు.—1 కొరింథీయులు 15:53; 1 తిమోతి 6:16.

17. (ఎ) యోహాను అభిషక్త క్రైస్తవుల దీవెనకరమైన నిరీక్షణను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) “రెండవ మరణం” అంటే ఏమిటి, మరి 1,44,000 మంది విజయులపై ఎందుకు దానికి “అధికారంలేదు”?

17 ఈ అభిషక్తులకు ఎంతటి దివ్యమైన బావి నిరీక్షణోగదా! యోహాను యిలా అంటున్నాడు: “ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారము లేదు.” (ప్రకటన 20:6ఎ) యేసు స్ముర్నలోని క్రైస్తవులకు వాగ్దానం చేసినట్లు, “మొదటి పునరుత్థానములో” విజయులైన వీరికి, పునరుత్థాన నిరీక్షణలేని నాశనం, సమూల నాశనమని అర్థమిచ్చే “రెండవ మరణము” యొక్క భయముండదు. (ప్రకటన 2:11; 20:14) అటువంటి విజయులపై రెండవ మరణానికి “అధికారము” లేదు, ఎందుకంటె, వారు అక్షయతను, అమరత్వాన్ని ధరించుకుంటారు.—1 కొరింథీయులు 15:53.

18. యోహానిప్పుడు భూమియొక్క నూతన పరిపాలకులనుగూర్చి ఏమి చెబుతున్నాడు, వారేమి నెరవేరుస్తారు?

18 సాతాను పరిపాలనా కాలంలోని భూలోక పాలకులకు ఎంత భిన్నంగా ఉన్నారు! వీరు ఎక్కువైతే 50 లేక 60 సంవత్సరాలు పరిపాలించి ఉంటారు, అత్యధికులు కేవలం కొన్ని సంవత్సరాలే పాలించారు. వారిలో చాలామంది మానవజాతిని బాధించారు. ఎలాగైనా, నిత్యమూ మారిపోతున్న సిద్ధాంతాలు, నిత్యమూ మారుతున్న పాలకులవల్ల ప్రజలెలా శాశ్వత ప్రయోజనాలు పొందగలరు? బదులుగా, భూమియొక్క నూతన పాలకులను గూర్చి యోహాను యిలా చెబుతున్నాడు: “వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” (ప్రకటన 20:6బి) యేసుతోకలిసి వారు వెయ్యేండ్లు సంపూర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు. యేసు పరిపూర్ణ మానవబలి విలువను వర్తింపజేయడంలో వారి యాజకధర్మం, విధేయులైన మానవులందరిని ఆత్మీయ, నైతిక, శారీరక పరిపూర్ణతకు తెస్తుంది. వారి రాజరికపు సేవ, యెహోవా నీతిని పరిశుద్ధతను ప్రతిబింబించే ప్రపంచవ్యాప్త మానవ సమాజాన్ని నిర్మించడానికి ఉపకరిస్తుంది. వారు వెయ్యేండ్లు న్యాయాధిపతులుగా యేసుతోకలిసి స్పందించే మానవులను నిత్యజీవమనే గురివైపు ప్రేమపూర్వకంగా నడిపిస్తారు.—యోహాను 3:16.

కడమ పరీక్ష

19. వెయ్యేండ్ల పరిపాలనాంతానికి భూమి మరియు మానవజాతిస్థితి ఏమైయుంటుంది, మరిప్పుడు యేసు ఏం చేస్తాడు?

19 వెయ్యేండ్ల పరిపాలనాంతానికి, భూమంతా మొదటి ఏదెనులాగా కనబడుతుంది. అది నిజమైన పరదైసులా ఉంటుంది. ఆదామువల్ల సంక్రమించిన పాపం పూర్తిగా తుడిచివేయబడుతుంది, కడపటి శత్రువగు మరణం లేకుండా పోతుంది గనుక దేవునికి మధ్యవర్తిగా పనిచేయడానికి పరిపూర్ణ మానవజాతికిక ఒక ప్రధాన యాజకుడు అక్కర్లేదు. దేవుని సంకల్పం చొప్పున ఒకే ప్రభుత్వంతో ఒకే లోకాన్ని తయారుచేసే పని క్రీస్తు రాజ్యం నెరవేర్చుతుంది. అప్పుడే, యేసు “తన తండ్రియైన దేవునికి రాజ్యమును అప్పగించును.”—1 కొరింథీయులు 15:22-26; రోమీయులు 15:12.

20. అంతిమ పరీక్ష సమయంలో ఏం జరుగుతుందని యోహాను మనకు చెబుతున్నాడు?

20 అది అంతిమ పరీక్షకు సమయం. ఏదెనులోని మొదటి మానవులకు భిన్నంగా, పరిపూర్ణులుగా చేయబడిన యీ మానవలోకం యథార్థతా పరీక్షకు నిలుస్తుందా? ఏం జరుగుతుందో యోహాను మనకు తెల్పుతున్నాడు: “వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడివేయును.”—ప్రకటన 20:7-9ఎ.

21. సాతాను తన అంతిమ ప్రయత్నంగా ఎలా ప్రయత్నిస్తాడు, వెయ్యేండ్ల పరిపాలనా కాలం తర్వాతకూడ కొందరు అతన్ని అనుసరిస్తారనే విషయంలో మనమెందుకు ఆశ్చర్యపడకూడదు?

21 సాతాను చివరి ప్రయత్నమెలా ఫలిస్తుంది? అతడు “భూమి నలుదిశల యందుండు జనములును . . . గోగు మాగోగు అనువారిని” మోసం చేసి, వారిని “యుద్ధము”నకు నడిపిస్తాడు. ఆనందదాయకమైన, క్షేమాభివృద్ధికరమగు వెయ్యేండ్ల దైవపరిపాలన తర్వాత ఎవరు మాత్రం సాతాను పక్షము వహిస్తారు? సరే, ఏదెను తోటలో సుఖంగా జీవించే పరిపూర్ణులగు ఆదాము హవ్వలను సాతాను మోసం చేయగలిగాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అతడు తొలి తిరుగుబాటు దుష్ఫలితాలను చూచిన పరలోక దూతలను ప్రక్కకు మళ్లించగలిగాడు. (2 పేతురు 2:4; యూదా 6) గనుక దేవుని రాజ్యం వెయ్యి సంవత్సరాలపాటు ఆనందంగా పరిపాలించిన తర్వాత కూడ కొందరు పరిపూర్ణులైన మానవులు సాతాన్ను వెంబడిస్తారనే విషయంలో మనం ఆశ్చర్యపడకూడదు.

22. (ఎ) “భూమి నలుదిశలనున్న జనములు” అనే మాట దేనిని సూచిస్తుంది? (బి) తిరుగుబాటుదారులు ఎందుకు “గోగు మాగోగు” అని పిలువబడుతున్నారు?

22 బైబిలు యీ తిరుగుబాటుదారులను “భూమి నలుదిశల యందుండు జనములు” అని పిలుస్తుంది. అంటే మరల మానవజాతి జాతుల ప్రకారం విభాగించ బడుతుందని దీనర్థంకాదు. వీరు యీ నాటి జనులవంటి చెడు స్వభావాన్నే కనబరస్తూ, యెహోవాకు నీతిగాను యథార్థంగా ఉన్నవారికి భిన్నంగా ఉన్నారని ప్రత్యేకంగా కనబర్చుకుంటారని మాత్రమే దానర్థం. వారు భూమ్మీదనున్న దైవపాలనను ధ్వంసం చేయాలనే దుష్టతలంపుతో, యెహెజ్కేలు ప్రవచనమందున్న గోగు మాగోగువలె “దురాలోచన” చేస్తారు. (యెహెజ్కేలు 38:3, 10-12) అందుకే వారు “గోగు మాగోగు” అని పిలువబడుతున్నారు.

23. తిరుగుబాటుదారుల సంఖ్య “లెక్కకు సముద్రపు ఇసుకవలె” ఉన్నదనే వాస్తవం దేన్ని సూచిస్తుంది?

23 ఇలా సాతాను చేసే తిరుగుబాటులో అతనితో చేయికలిపే వారిసంఖ్య “సముద్రపు ఇసుకవలె” ఉంటుంది. అదెంత? ముందుగానే నిర్ణయించిన సంఖ్య అంటూ ఏమీలేదు. (యెహోషువ 11:4; న్యాయాధిపతులు 7:12 పోల్చండి.) సాతాను మోసపూరిత చెడుక్రియలకు ప్రతివ్యక్తి ఎలా స్పందిస్తాడనే దానిమీద ఆ చివరి సంఖ్య ఆధారపడివుంటుంది. అయినా నిశ్చయంగా అనేకులుండవచ్చు, ఎందుకంటే వారు “పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును” ముట్టడించే శక్తివారికుందని అనుకుంటారు.

24. (ఎ) “ప్రియమైన పట్టణము” ఏమిటి, అదెలా ముట్టడించబడగలదు? (బి) “పరిశుద్ధుల శిబిరము” దేనికి సూచన?

24 “ప్రియమైన పట్టణము” అంటే, మహిమనొందిన యేసుక్రీస్తు తన అనుచరులతో ప్రకటన 3:12 లో పేర్కొన్న పట్టణమే అయ్యుంటుంది, ఆయన దానిని “పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణము” అని పిలిచాడు. ఇదొక పరలోక సంస్థయైనందువల్ల భూలోక సైన్యాలెలా దాన్ని ముట్టడించగలవు? “పరిశుద్ధుల శిబిరాన్ని” ముట్టడించడం ద్వారా అలా చేయగలరు. పట్టణం వెలుపల శిబిరం ఉంది; గావున, “పరిశుద్ధుల శిబిరము” అనేది, పరలోక నూతన యెరూషలేముకు వెలుపల భూమ్మీద యెహోవా ప్రభుత్వ ఏర్పాటుకు యథార్థంగా మద్దతునిచ్చే వారిని సూచిస్తుంది. సాతాను అధీనమందున్న తిరుగుబాటుదారులు ఆ నమ్మకమైన వారిపై దాడిచేసినప్పుడు ప్రభువైన యేసు, వారు తనమీదనే దాడిచేశారని భావిస్తాడు. (మత్తయి 25:40, 45) భూమిని పరదైసుగా మార్చడంలో ఆ పరలోక నూతన యెరూషలేము నెరవేర్చిన సమస్తాన్ని “ఆ జనములు” తుడిచివేయడానికి యత్నిస్తారు. అలా “పరిశుద్ధుల శిబిరమును” ముట్టడించడంలో వారు “ప్రియమైన పట్టణము”ను కూడా ముట్టడిస్తారు.

అగ్నిగంధకాల గుండం

25. తిరుగుబాటుదారులు “పరిశుద్ధుల శిబిరమును” ముట్టడి చేయడం మూలంగా కలిగే ఫలితాన్నిగూర్చి యోహాను ఎలా వర్ణిస్తున్నాడు, దీనివల్ల సాతానుకు ఏమౌతుంది?

25 సాతానుచేసే ఈ చివరియత్నం ఫలిస్తుందా? నిశ్చయంగా ఫలించదు—మనకాలంలో ఆత్మీయ ఇశ్రాయేలుమీద గోగు మాగోగు చేసే దాడి ఎలా ఫలించదో యిదీ అంతే! (యెహెజ్కేలు 38:18-23) యోహాను దానిఫలితాన్ని స్పష్టంగా వివరిస్తున్నాడు: “పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధప్రవక్తయు ఉన్నారు.” (ప్రకటన 20:9బి-10ఎ) ఈసారి, ఆదిసర్పమైన సాతాను, అగాధంలో పడవేయబడటమే గాక, అగ్నితో అన్నట్లుగానే ముక్కలుముక్కలుగా, అంతులేకుండా, పూర్తిగా నాశనం చేయబడతాడు.

26. “అగ్నిగంధకములుగల గుండం” ఎందుకు బాధించే అక్షరార్థమైన స్థలంకాదు?

26 “అగ్నిగంధకములుగల గుండం” అంటే బాధించే అక్షరార్థమైన స్థలంకాదని మనం యిదివరకే గమనించాం. (ప్రకటన 19:20) సాతాను అక్కడ నిత్యం యాతనపెట్టబడుతూ ఉండాలంటే, యెహోవా అతన్ని సజీవంగా ఉంచాల్సి ఉంటుంది. అయినా జీవం బహుమానమే గాని శిక్షకాదు. పాపానికి శిక్ష మరణం, మరి బైబిలు ప్రకారం, మృతజీవులకు బాధంటే తెలియదు, (రోమీయులు 6:23; ప్రసంగి 9:5, 10) అంతేగాక, మృతులలోకం (హేడీస్‌) తోపాటు మరణం అగ్నిగుండంలో పడవేయబడుతుందని మనం తర్వాత చదువుతాం. నిశ్చయంగా మరణం, హేడీస్‌లు బాధననుభవించలేవు!—ప్రకటన 20:14.

27. సొదొమ గొమొఱ్ఱాలకు సంభవించింది, అగ్నిగంధకముల గుండము అనే పదాన్ని అర్థంచేసుకోవడాని కెలా సహాయపడుతుంది?

27 ఇదంతా తెల్పేదేమంటే, అగ్నిగంధకములతో మండు గుండం సాదృశ్యమైనదే. అంతేగాక అగ్నిగంధకం, దేవుడు ప్రాచీన సొదొమ గొమొఱ్ఱా పట్టణాలను వారి దుష్క్రియల నిమిత్తం నాశనం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు, “యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్దనుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించెను.” (ఆదికాండము 19:24) ఆ రెండు పట్టణాలకు సంభవించింది “నిత్యాగ్ని దండన” యని పిలువబడుతుంది. (యూదా 7) అయిననూ, ఆ రెండు పట్టణాలు నిత్యం బాధింపబడలేదు. అయితే, దానిలోని నీచమనుష్యులతో పాటు అది పూర్తిగా తుడిచివేయబడింది, నిత్యంలేకుండ తీసివేయబడింది. ఆ పట్టణాలిప్పుడు లేవు, మరి అవెక్కడ ఉండెనో కూడ కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు.

28. అగ్నిగంధకములతో మండు గుండము అంటే ఏమిటి, అదెలా మరణం, మృతులలోకం, (హేడీస్‌) అగాధం వంటిదికాదు?

28 దీనికనుగుణంగా, అగ్నిగంధకములంటే ఏమిటో బైబిలే యిలా వివరిస్తుంది: “ఈ అగ్నిగుండం రెండవ మరణము.” (ప్రకటన 20:14) అది స్పష్టంగా, దుష్టులు నిరంతరం బాధింపబడక, నాశనమౌతారని యేసు చెప్పిన గెహెన్నా వంటి స్థలమే. (మత్తయి 10:28) అది పునరుత్థాన నిరీక్షణలేని పూర్తి సర్వనాశనం. ఆ విధంగా చూస్తే, మరణము, మృతులలోకము (హేడీస్‌), అగాధములకు తాళపు చెవులున్నట్లు చెప్పబడింది గాని అగ్నిగంధకములుగల గుండమును తెరవడానికి తాళపు చెవి ఉన్నట్టేమీ చెప్పబడలేదు. (ప్రకటన 1:18; 20:1) అదెన్నటికి తన బంధకములలో ఉన్నవారిని విడిపించలేదు.—మార్కు 9:43-47 పోల్చండి.

రాత్రింబగళ్లు నిరంతరం బాధింపబడిరి

29, 30. అపవాదితోపాటు క్రూరమృగము, అబద్ధ ప్రవక్తనుగూర్చి యోహాను ఏమని చెబుతున్నాడు, మరి దీన్నెలా అర్థం చేసుకోవాలి?

29 అపవాదిని, క్రూరమృగాన్ని, అబద్ధప్రవక్తనుగూర్చి చెబుతూ యోహాను మనకిలాతెల్పుతున్నాడు: “వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.” (ప్రకటన 20:10బి) దీని భావమేమై యుండవచ్చు? ముందే తెల్పినరీతిగా, అవి సాదృశ్యమైనవి అంటే క్రూరమృగము, అబద్ధప్రవక్త, అలాగే మరణము, మృతులలోకము (హేడీస్‌) అక్షరార్థంగా యాతన ననుభవిస్తాయని చెప్పడం హేతుబద్ధంకాదు. కాబట్టి, సాతాను నిరంతరం బాధింపబడతాడని మనం నమ్మడానికి ఆధారంలేదు. అతడు నిర్మూలించ బడవలసిందే.

30 “బాధింపబడుట” అని యిక్కడ ఉపయోగించబడిన బాసానిజో అనే గ్రీకుపదానికి ముఖ్యంగా “గీటురాయితో (లోహాలను) పరీక్షించుట” అని అర్థం. “బాధించి ప్రశ్నించుట” అని రెండవ అర్థంకూడ ఉంది. (ది న్యూ థాయర్స్‌ గ్రీక్‌-ఇంగ్లీష్‌ లెక్సికాన్‌ ఆఫ్‌ ది న్యూ టెస్టమెంట్‌) ఈ సందర్భంలో, గ్రీకు పద ప్రయోగం తెల్పేదేమంటే, యెహోవా పరిపాలనా హక్కు, నీతి విషయంలో సాతానుకు సంభవించేది నిరంతరమొక గీటురాయిగా పనిచేస్తుంది. సర్వాధిపత్యపు వివాదాంశం యిక శాశ్వతంగా తీర్చబడుతుంది. యెహోవా సర్వాధిపత్యాన్ని సవాలుచేయడం తప్పు అని రుజువు చేయడానికి దీర్ఘకాలం పొడిగించి పరీక్షించవలసిన అవసరమిక ఎన్నటికీ ఉండదు.—కీర్తన 92:1, 15 పోల్చండి.

31. “బాధించు” అని ఒకే అర్థమిచ్చే రెండు గ్రీకు పదాలు అపవాదియగు సాతాను పొందబోయే శిక్షను అర్థం చేసుకోవడానికి మనకెలా సహాయం చేస్తాయి?

31 అంతేగాక, “బాధించేవాడు” అని అర్థమిచ్చే బాసానిస్టెస్‌ అనే దాని అనుబంధ పదం బైబిల్లో “జైలర్‌” అని ఉపయోగించబడింది. (మత్తయి 18:34, కింగ్‌డం ఇంటర్లీనియర్‌) దీనికనుగుణంగా, సాతాను అగ్నిగుండంలో నిరంతరం బంధింపబడతాడు; అతడెన్నటికీ విడుదలచేయబడడు. చివరకు, యోహానుకు బాగా తెలిసియున్న గ్రీకు సెప్టూజిన్‌ట్‌ బైబిల్లో దానికి సంబంధించిన బాసానోస్‌ అనే పదం మరణానికి నడిపే అవమానాన్ని సూచించడానికి వాడబడింది. (యెహెజ్కేలు 32:24, 30) సాతాను పొందే శిక్ష అవమానకరమైందని, అగ్నిగంధకముల గుండంలో నిత్యమరణం అనుభవిస్తాడని తెలిసికోవడానికి ఇది సహాయం చేస్తుంది. అతని కార్యాలు అతనితోనే చస్తాయి.—1 యోహాను 3:8.

32. దయ్యాలు ఎటువంటి శిక్షననుభవిస్తాయి, అది మనకెలా తెలుసు?

32 మరల, దయ్యాలు యీ వచనంలో తెలుపబడలేదు. వెయ్యేండ్లు ముగిసిన తర్వాత వారు సాతానుతోపాటు విడుదల చేయబడి, పిదప అతనితోపాటు నిత్యశిక్షపొందుతారా? ఉన్న రుజువు అవునని సమాధానం చెబుతోంది. గొఱ్ఱెల మేకల ఉపమానంలో, యేసు మేకలు “అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి” పోతారని చెప్పాడు. (మత్తయి 25:41) “నిత్యాగ్ని” అనే మాట సాతాను తోయబడే అగ్నిగంధకముల గుండాన్ని తప్పక సూచించాలి. అపవాదియొక్క దూతలు అతనితోపాటు పరలోకంనుండి పడదోయబడ్డారు. నిజంగా, వెయ్యేండ్ల పరిపాలనా ప్రారంభంలో వారు అతనితోపాటు అగాధంలోనికి వెళ్లారు. గనుక, వారుకూడ అతనితోపాటు అగ్నిగంధకముల గుండంలో నాశనం చేయబడతారు.—మత్తయి 8:29.

33. అప్పుడు ఆదికాండము 3:15 యొక్క ఏ అంతిమభాగం పూర్తిగా నెరవేరుతుంది, మరిప్పుడు యెహోవా ఆత్మ యోహాను అవధానాన్ని దేనివైపు మళ్లిస్తున్నాడు?

33 ఈవిధంగా, ఆదికాండము 3:15 లో వ్రాయబడిన ప్రవచనం యొక్క అంతిమభాగం నెరవేరుతుంది. సాతాను అగ్నిగుండంలో త్రోయబడిన తర్వాత అతడు ఇనుపపాదం క్రిందపడి తల చితికిన సర్పంవలె చనిపోతాడు. అతడు అతని దయ్యాలు నిరంతరం లేకుండాపోతారు. ప్రకటన పుస్తకంలో యిక వారిపేరు తెల్పబడలేదు. ఇప్పుడు, వీరిని ప్రవచనార్థకంగా తీసివేసినందున, భూనిరీక్షణగల వారికి అత్యంత శ్రద్ధకల్గించే విషయానికి యెహోవా ఆత్మ మళ్లిస్తుంది: “రాజులకు రాజు” మరియు ‘తనతోకూడ ఉండినవారు పిలువబడిన వారు, యేర్పరచబడినవారు, నమ్మకమైనవారి’ పరలోక పరిపాలననుండి మానవజాతి ఏమి పొందుతుంది? (ప్రకటన 17:14) దీనికి సమాధాన మివ్వడానికి యోహాను మరొకసారి వెయ్యేండ్ల పరిపాలనా ప్రారంభానికి మనల్ని తీసుకెళ్తున్నాడు.

[అధస్సూచీలు]

^ పేరా 7 ఇతర లేఖనాలు యేసు మరణించినప్పుడు ఆయన పాతాళంలో (హేడీస్‌ NW) ఉన్నాడని చెబుతున్నాయి. (అపొస్తలుల కార్యములు 2:31) అయిననూ మనం పాతాళమన్నా, అగాధమన్నా ఎల్లప్పుడూ ఒకటేననే ముగింపుకు రాకూడదు. క్రూరమృగము, సాతాను అగాధంలోనికి పోతే, మానవులు మాత్రమే పాతాళానికి వెళ్తారు, పునరుత్థాన మయ్యేవరకు వారక్కడే ఉంటారు.—యోబు 14:13; ప్రకటన 20:13.

^ పేరా 11 గొడ్డలి (గ్రీకు, పెలికస్‌) రోములో పారంపర్యంగా శిరచ్ఛేదనం చేయడానికి ఉపయోగించే సాధనమైయుండొచ్చు, యోహాను కాలానికి ఖడ్గమెక్కువగా వాడుకలోనికి వచ్చింది. (అపొస్తలుల కార్యములు 12:2) అందుచేత, ఇక్కడ ఉపయోగించబడిన పెపిలికిస్‌మెనన్‌ (“[గొడ్డలితో] శిరచ్ఛేదనము చేయబడిరి”) అనే గ్రీకు పదం “వధింపబడిరి” అనే సాధారణ భావమిస్తుంది.

^ పేరా 13 ఆసక్తికరమైన విషయమేమంటే, ప్రకటనను వ్రాసిన యోహాను యొక్క శిష్యులనుండి కొంత బైబిలు జ్ఞానాన్ని పొందినట్లు చెప్పుకుంటున్న హైరపొలిస్‌కు చెందిన పాపియస్‌ అనే వ్యక్తి క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనను అక్షరార్థమైందిగా నమ్మినట్లు నాల్గవ శతాబ్దపు చరిత్రకారుడు, యూసిబియస్‌ తెల్పుతున్నాడు (యూసిబియస్‌కు అతనికి ససేమిరా పడదు).—ది హిస్టరీ ఆఫ్‌ ది చర్చ్‌, యూసిబియస్‌,. III, 39.

[అధ్యయన ప్రశ్నలు]

[293వ పేజీలోని చిత్రం]

మృతసముద్రం. సొదొమ గొమొఱ్ఱా ఉండిన స్థలమైయుండొచ్చు

[294వ పేజీలోని చిత్రం]

“నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువు”