కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

3వ కథ

మొదటి పురుషుడు, స్త్రీ

మొదటి పురుషుడు, స్త్రీ

ముందు పేజీలోని చిత్రానికి ఇక్కడున్న చిత్రానికి మధ్య తేడా ఏమిటి? అవును, ఇక్కడ మనుష్యులు కనిపిస్తున్నారు. వాళ్లే మొదటి పురుషుడు, స్త్రీ. వాళ్లను ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుని పేరేమిటో తెలుసా? ఆయన పేరు యెహోవా. ఆయన ఈ పురుషునికి ఆదాము అని, స్త్రీకి హవ్వ అని పేరు పెట్టాడు.

యెహోవా దేవుడు ఆదామును ఇలా చేశాడు. ఆయన నేలనుండి కొంత మట్టిని తీసుకొని దానితో ఒక పరిపూర్ణమైన పురుషుని శరీరాన్ని తయారు చేశాడు. ఆ తర్వాత దేవుడు ఆ పురుషుని నాసికలో గాలి ఊదినప్పుడు, ఆదాము జీవించడం ప్రారంభించాడు.

యెహోవా దేవుడు ఆదాముకు ఒక పని ఇచ్చాడు. ఆయా రకాల జంతువులకు పేర్లు పెట్టమని ఆయన ఆదాముకు చెప్పాడు. వాటన్నిటికి సరైన పేర్లు పెట్టేందుకు ఆదాము బహుశా జంతువులను ఎంతోకాలంపాటు పరిశీలించివుండవచ్చు. ఆదాము వాటికి పేర్లు పెడుతున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాడు. అదేమిటో మీకు తెలుసా?

జంతువులన్నిటికి వాటివాటి జతలున్నాయి. ఆడ ఏనుగులున్నాయి, మగ ఏనుగులున్నాయి. ఆడ సింహాలున్నాయి, మగ సింహాలున్నాయి. కానీ ఆదాముకు మాత్రం జత ఎవరూ లేరు. కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలిగించి, ఆయన ప్రక్కలోనుండి ఒక ఎముకను తీశాడు. ఆ ప్రక్కటెముకను ఉపయోగించి యెహోవా ఆదాము కోసం ఒక స్త్రీని చేశాడు. ఆమే ఆదాముకు భార్య అయ్యింది.

అప్పుడు ఆదాము ఎంత సంతోషించాడో! అలాంటి అందమైన తోటలో జీవించడానికి చేయబడినందుకు హవ్వ కూడా ఎంత సంతోషించివుంటుందో ఆలోచించండి! వారు పిల్లలను కని సంతోషంగా కలిసి జీవించవచ్చు.

ఆదాము హవ్వలు నిరంతరం జీవించాలని యెహోవా దేవుడు కోరుకున్నాడు. వారు భూమినంతటిని ఏదెను తోటలాగే అందంగా మార్చాలని ఆయన కోరుకున్నాడు. ఆదాము హవ్వలు తాము చేయవలసిన ఆ పని గురించి ఆలోచించినప్పుడు ఎంత సంతోషించి ఉంటారో కదా! భూమిని అందమైన తోటగా మార్చే ఆ పనిలో పాల్గొనడానికి మీరు కూడా ఇష్టపడి ఉండేవారా? అయితే ఆదాము హవ్వల ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. ఎందుకో చూద్దాం.