కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ కథ

గొప్ప జలప్రవయం

గొప్ప జలప్రవయం

ఓడ బయట ప్రజలు అంతకు ముందులాగే అన్ని పనులూ చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించారు. జలప్రళయం వస్తుందని వారింకా నమ్మలేదు. బహుశా వాళ్ళు ఇంతకు ముందుకంటె ఎక్కువగా నవ్వి ఉంటారు. కానీ వాళ్ళు ఎంతోకాలం అలా నవ్వలేకపోయారు.

అకస్మాత్తుగా నీళ్ళు కురవడం మొదలయ్యింది. మీరు బకెట్టునుండి నీళ్ళు క్రిందకు పోస్తుంటే ఎలా పడతాయో అలాగే ఆకాశం నుండి నీళ్ళు పడ్డాయి. నోవహు చెప్పింది నిజమే! కానీ అప్పుడు ఓడలోకి వెళ్ళడానికి ఎవ్వరికి అవకాశం లేదు. యెహోవాయే ఓడ తలుపులను గట్టిగా వేసేశాడు.

త్వరలోనే పల్లపు ప్రాంతమంతా నీళ్ళతో నిండిపోయింది. నీళ్ళు పెద్ద నదుల్లా మారాయి. అవి చెట్లను పెకిలిస్తూ, పెద్ద పెద్ద రాళ్ళచుట్టూ ప్రవహిస్తూ, పెద్ద శబ్దాన్ని సృష్టించాయి. ప్రజలు భయపడ్డారు. ఎత్తైన స్థలాలకు ఎక్కారు. అయ్యో, ఓడ తలుపులు తెరిచి ఉన్నప్పుడే నోవహు మాట విని, ఓడలోకి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేదని వాళ్ళు అనుకున్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.

నీళ్ళ స్థాయి అంతకంతకు పెరిగిపోయింది. ఆకాశంనుండి 40 పగళ్ళు, 40 రాత్రుల వరకు నీళ్ళు కురిశాయి. అవి కొండల వరకు చేరడంతో ఎత్తయిన కొండలు కూడా మునిగిపోయాయి. దేవుడు చెప్పినట్లే ఓడ బయట ఉన్న మనుష్యులందరూ చనిపోయారు, జంతువులన్నీ చనిపోయాయి. కానీ ఓడ లోపల ఉన్నవాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు.

నోవహు ఆయన కుమారులు ఓడను చక్కగా నిర్మించారు. నీళ్ళు ఓడను పైకి లేపినప్పుడు అది నీళ్ళపై తేలింది. చివరికొక రోజున వర్షం కురవడం ఆగిపోయింది, సూర్యుడు ప్రకాశించడం ప్రారంభించాడు. అది ఎంత చక్కని దృశ్యమై ఉంటుందో కదా! అంతా ఒక పెద్ద సముద్రంలా మారిపోయింది. కనిపించేదల్లా నీళ్ళపై తేలుతున్న పెద్ద ఓడ మాత్రమే.

రాక్షసులు చనిపోయారు. ప్రజలను బాధించేందుకు వాళ్లిక లేరు. వాళ్ళందరూ తమ తల్లులతోపాటు మిగిలిన చెడ్డవాళ్ళతోపాటు చనిపోయారు. అయితే వాళ్ళ తండ్రుల మాటేమిటి?

ఆ రాక్షసుల తండ్రులు మనలాంటి మానవులు కాదు. వాళ్ళు మనుష్యుల్లా జీవించడానికి భూమిపైకి వచ్చిన దూతలు. అందువల్ల జలప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు మిగిలిన మనుష్యులతోపాటు చనిపోలేదు. తాము దాల్చిన మానవ శరీరాలను వదిలేసి, తిరిగి దూతల్లా పరలోకానికి వెళ్ళారు. అయితే వాళ్ళు దేవుని దూతల కుటుంబంలో భాగంగా మళ్ళీ అంగీకరించబడలేదు. అందుచేత వాళ్ళు సాతాను దూతలయ్యారు. బైబిలులో వాళ్ళు దయ్యాలని పిలువబడుతున్నారు.

ఆ తర్వాత దేవుడు గాలి వీచేలా చేశాడు, జలప్రళయపు నీళ్ళు ఇంకిపోవడం మొదలయ్యింది. అయిదు నెలల తర్వాత ఓడ ఒక కొండ శిఖరంపై నిలిచింది. చాలా రోజులు గడిచాయి, ఓడ లోపల ఉన్నవారు బయటకు చూసినప్పుడు కొండల శిఖరాలు కనబడ్డాయి. నీళ్ళు క్రమక్రమంగా తగ్గాయి.

అప్పుడు నోవహు కాకి అనే ఒక నల్లని పక్షిని ఓడనుండి బయటకు పంపాడు. అది కొంతసేపు ఎగిరి ఎక్కడా కాలు నిలపడానికి స్థలము లేనందువల్ల తిరిగి వచ్చేసింది. అది చాలాసార్లు అలా వెళ్లి తిరిగి చూసి మళ్ళీ వచ్చి ఓడపైన వాలుతుండేది.

ఆ తర్వాత నోవహు భూమ్మీద నీళ్ళు తగ్గాయేమో చూడడానికి ఓడలోనుండి ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ పావురం కూడా కాలు మోపడానికి స్థలం లేనందున తిరిగి వచ్చేసింది. నోవహు దానిని రెండవసారి పంపినప్పుడు అది దాని నోట ఒక ఒలీవ ఆకు తీసుకొని తిరిగివచ్చింది. నీళ్ళు తగ్గిపోయాయని నోవహుకు అర్థమైంది. నోవహు పావురాన్ని మూడవసారి బయటకు వదిలాడు, చివరికి బయట జీవించడానికి దానికి ఆరిన నేల కనబడింది.

అప్పుడు దేవుడు నోవహుతో మాట్లాడాడు. ఆయన, ‘నీతోపాటు నీ కుటుంబాన్నంతటిని, జంతువులను తీసుకొని ఓడ బయటకు వెళ్ళు’ అన్నాడు. వాళ్ళు ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలం ఓడలోపల ఉన్నారు. వాళ్ళు సజీవంగా మళ్ళీ బయటకు వచ్చినందుకు ఎంత సంతోషించి ఉంటారో మనం ఊహించవచ్చు!