కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9వ కథ

నోవహు ఓడను నిర్మించడం

నోవహు ఓడను నిర్మించడం

నోవహుకు భార్య, ముగ్గురు కుమారులు ఉండేవారు. ఆయన కుమారుల పేర్లు షేము, హాము, యాపెతు. వాళ్ళ ముగ్గురికి భార్యలుండేవారు. అంటే నోవహు కుటుంబంలో మొత్తం ఎనిమిదిమంది ఉండేవారన్నమాట.

దేవుడు నోవహుతో ఒక విచిత్రమైన పని చేయించాడు. ఆయన నోవహుకు ఒక ఓడను నిర్మించమని చెప్పాడు. ఆ ఓడ ఎంతో పెద్దగా ఉండి పొడవాటి పెట్టెలా కనిపించేది. దానిని ‘మూడంతస్తులుగల దానిగా చేసి, దానిలో గదులు ఏర్పాటు చెయ్యి’ అని దేవుడు చెప్పాడు. ఆ గదులు నోవహు, ఆయన కుటుంబం, జంతువులు ఉండడానికి, వాళ్ళకు, వాటికి అవసరమైన ఆహారం నిలువచేసుకొనేందుకే.

ఓడలోకి నీరు జొరబడకుండా, దానిని బిగించాలని కూడా దేవుడు నోవహుకు చెప్పాడు. ‘నేను జలప్రళయాన్ని రప్పించి లోకాన్నంతటిని నాశనం చేయబోతున్నాను. ఓడలోకి ప్రవేశించనివారంతా చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు.

నోవహు, ఆయన కుమారులు యెహోవాకు విధేయత చూపించి ఓడను నిర్మించడం ప్రారంభించారు. కానీ వేరేవాళ్ళు దాన్ని చూసి నవ్వారు. వాళ్ళు తమ చెడుతనాన్ని మార్చుకోలేదు. దేవుడు చేయబోయేదాని గురించి నోవహు చెప్పినప్పుడు ఎవ్వరూ ఆయన మాట నమ్మలేదు.

ఓడ ఎంతో పెద్దది కాబట్టి దానిని కట్టడానికి చాలాకాలం పట్టింది. చివరకు అనేక సంవత్సరాల తర్వాత అది పూర్తయ్యింది. ఆ తర్వాత జంతువులను ఓడలోకి తెమ్మని దేవుడు నోవహుతో చెప్పాడు. కొన్ని రకాల జంతువులను జతలుగా అంటే ఒక ఆడదానిని, ఒక మగదానిని తీసుకొనిరమ్మని దేవుడు చెప్పాడు. మరికొన్ని రకాల జంతువులనేమో ఏడింటి చొప్పున తీసుకొనిరమ్మన్నాడు. అన్నిరకాల పక్షులను కూడా లోపలికి తీసుకొనిరమ్మని దేవుడు నోవహుతో చెప్పాడు. దేవుడేమి చెప్పాడో నోవహు అదే చేశాడు.

తర్వాత నోవహు, ఆయన కుటుంబం కూడా ఓడలోకి వెళ్ళారు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసేశాడు. లోపల, నోవహు ఆయన కుటుంబం ఎదురు చూడడం ప్రారంభించారు. మీరు కూడా వాళ్ళతోపాటు ఓడలో ఉండి ఎదురు చూస్తున్నట్లు ఊహించుకోండి. దేవుడు చెప్పినట్లు నిజంగానే జలప్రళయం వచ్చిందా?