కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ కథ

ఒక ధైర్యవంతుడు

ఒక ధైర్యవంతుడు

భూమ్మీద ప్రజలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళలో చాలామంది కయీనులాగే చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు. కానీ ఒక వ్యక్తి భిన్నంగా ఉండేవాడు. ఆయనే ఇక్కడ కనిపిస్తున్న హనోకు. ఆయన ధైర్యవంతుడు. తన చుట్టూవున్న ప్రజలు చాలా చెడ్డ పనులు చేస్తున్నా హనోకు మాత్రం దేవుని సేవ చేస్తుండేవాడు.

ఆ కాలంలోని ప్రజలు ఎందుకు అన్ని చెడ్డ పనులు చేసేవారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి, ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపించి ఆయన తినకూడదని చెప్పిన పండును తినేలా చేసింది ఎవరు? ఒక చెడ్డ దూత. బైబిలు అతనిని సాతాను అని పిలుస్తుంది. అతనే అందరూ చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

యెహోవా దేవుడు, ప్రజలు వినడానికి ఇష్టపడని విషయాన్ని హనోకుతో చెప్పించాడు. ‘దేవుడు ఒకరోజు చెడ్డ వారినందరిని నాశనం చేయబోతున్నాడు’ అని హనోకు చెప్పాడు. ఆ విషయం విన్న ప్రజలకు ఎంతో కోపం వచ్చివుంటుంది. వాళ్ళు హనోకును చంపడానికి కూడా ప్రయత్నించి ఉంటారు. కాబట్టి దేవుడు చేయబోయేదాని గురించి ప్రజలకు చెప్పడానికి హనోకుకు ఎంతో ధైర్యం అవసరమయ్యింది.

అలాంటి చెడ్డవారి మధ్య హనోకును దేవుడు ఎంతోకాలంపాటు బ్రతకనివ్వలేదు. హనోకు 365 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. మనం “365 సంవత్సరాలు మాత్రమే” అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే ఆ కాలంలోని ప్రజలు ఇప్పటికంటే ఎంతో బలంగా ఉండి చాలాకాలం బ్రతికేవారు. అంతెందుకు, హనోకు కుమారుడైన మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు!

హనోకు మరణించిన తర్వాత ప్రజలు అంతకంతకూ చెడ్డవారయ్యారు. ‘వారి ఆలోచన ఎల్లప్పుడు కేవలం చెడ్డదిగానే ఉంది’ అని, దాని ఫలితంగా ‘భూమంతా బలాత్కారంతో నిండిపోయింది’ అని బైబిలు చెబుతోంది.

ఆ రోజుల్లో భూమ్మీద అన్ని సమస్యలు ఉండడానికిగల కారణాల్లో ఒక కారణమేమిటో మీకు తెలుసా? ప్రజలు చెడ్డ పనులు చేసేలా చేయడానికి సాతాను ఒక కొత్త పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించాడు. దాని గురించి మనం తర్వాతి కథలో తెలుసుకుంటాం.