కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

19వ కథ

యాకోబు పెద్ద కుటుంబం

యాకోబు పెద్ద కుటుంబం

ఈ పెద్ద కుటుంబాన్ని చూడండి. వాళ్ళు యాకోబు 12 మంది కుమారులు. ఆయనకు కుమార్తెలు కూడా ఉండేవారు. ఆయన పిల్లల్లో ఎవరి పేర్లయినా మీకు తెలుసా? ఇప్పుడు మనం వాళ్ళలో కొంతమంది పేర్లు తెలుసుకుందాం.

లేయాకు రూబేను, షిమ్యోను, లేవి, యూదా పుట్టారు. రాహేలు తనకు పిల్లలు పుట్టలేదని చాలా బాధపడింది. కాబట్టి ఆమె తన దాసురాలు బిల్హాను యాకోబుకు ఇచ్చినప్పుడు బిల్హాకు దాను, నఫ్తాలి అనే ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ తర్వాత లేయా కూడా తన దాసురాలు జిల్పాను యాకోబుకు ఇచ్చింది, జిల్పాకు గాదు, ఆషేరు పుట్టారు. ఆఖరుగా లేయాకు ఇశ్శాఖారు, జెబూలూను అనే మరో ఇద్దరు కుమారులు పుట్టారు.

చివరకు రాహేలుకు ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఆమె యోసేపు అని పేరు పెట్టింది. యోసేపు గురించి మనం తర్వాత మరింత తెలుసుకుంటాము, ఎందుకంటే ఆయన చాలా ప్రముఖ వ్యక్తి అయ్యాడు. యాకోబు రాహేలు తండ్రియైన లాబాను దగ్గర ఉన్నప్పుడు ఈ 11 మంది కుమారులు జన్మించారు.

యాకోబుకు కొంతమంది కుమార్తెలు కూడా ఉండేవారుగాని, బైబిలు వాళ్ళలో ఒక్కరి పేరును మాత్రమే చెబుతోంది. ఆమె పేరు దీనా.

కొంతకాలం తర్వాత యాకోబు లాబానును విడిచిపెట్టి కనానుకు తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. కాబట్టి ఆయన తన పెద్ద కుటుంబాన్ని, విస్తారమైన గొర్రెల మందలను, పశువులను సమకూర్చుకొని దూరప్రయాణం ప్రారంభించాడు.

యాకోబు, ఆయన కుటుంబం కనానుకు తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాహేలు మరో కుమారునికి జన్మనిచ్చింది. అది వారు ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. రాహేలుకు ప్రసవ సమయంలో కష్టమయ్యి చివరకు ఆమె చనిపోయింది. కానీ పిల్లవాడు మాత్రం బాగానే ఉన్నాడు. యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.

మనం యాకోబు 12 మంది కుమారుల పేర్లను గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగమంతా వాళ్ళనుండే వచ్చింది. నిజానికి ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు యాకోబు 10 మంది కుమారుల పేర్లమీద, యోసేపు ఇద్దరు కుమారుల పేర్లమీద పిలువబడ్డాయి. ఈ పిల్లలందరూ పుట్టాక చాలాకాలం వరకు ఇస్సాకు బ్రతికే ఉన్నాడు. అంతమంది మనవళ్ళను కలిగివుండడం నిజంగా ఆయనకు ఎంతో సంతోషాన్ని కలిగించి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఆయన మనవరాలైన దీనాకు ఏమి జరిగిందో చూద్దాం.