15వ కథ
లోతు భార్య వెనక్కి చూడడం
లోతు ఆయన కుటుంబం అబ్రాహాముతోపాటు కనాను దేశంలో నివసించేవారు. ఒకరోజు అబ్రాహాము, ‘మన పశువులన్నిటికి సరిపడేంత ప్రాంతం ఇక్కడ లేదు. మనమిద్దరం విడిపోదాము. నువ్వు ఒక ప్రక్కకు వెళ్తే, నేను మరో ప్రక్కకు వెళ్తాను’ అని లోతుతో చెప్పాడు.
లోతు ఆ ప్రాంతాన్నంతటిని పరిశీలించాడు. నీరు సమృద్ధిగా ఉండి, పశువుల కోసం పచ్చగడ్డి విస్తారంగా ఉన్న ఒక మంచి ప్రాంతము ఆయనకు కన్పించింది. అది యొర్దాను ప్రాంతము. లోతు తన కుటుంబాన్ని తన పశువులను అక్కడకు తరలించాడు. వాళ్ళు చివరకు సొదొమ పట్టణంలో నివసించడం ప్రారంభించారు.
సొదొమ ప్రజలు చాలా చెడ్డవారు. మంచివాడైన లోతు వాళ్ళను చూసి ఎంతో కలవరపడ్డాడు. దేవుడు కూడా వాళ్ళను చూసి కలతపడ్డాడు. చివరకు దేవుడు వాళ్ళ చెడుతనాన్నిబట్టి సొదొమ పట్టణాన్ని, దాని దగ్గరి పట్టణమైన గొమొర్రాను నాశనం చేయబోతున్నట్లు లోతును హెచ్చరించడానికి ఇద్దరు దూతలను పంపాడు.
దూతలు లోతుతో, ‘త్వరపడు! నీ భార్యను, నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఇక్కడనుండి పారిపో!’ అని చెప్పారు. లోతు ఆయన కుటుంబం పారిపోవడంలో ఆలస్యం చేస్తుంటే దూతలే వాళ్ళ చేతులు పట్టుకొని పట్టణం బయటకు తీసుకువెళ్ళారు. అప్పుడు ఆ దూతలలో ఒకరు, ‘మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపొండి! వెనక్కి చూడొద్దు. చావు తప్పించుకోవడానికి ఆ పర్వతానికి పారిపొండి’ అని చెప్పాడు.
లోతు, ఆయన కుమార్తెలు ఆ మాటలకు లోబడి సొదొమ నుండి పారిపోయారు. వారు ఒక్క క్షణం కూడా ఆగలేదు, వెనక్కి చూడలేదు. కానీ లోతు భార్య మాత్రం అవిధేయత చూపించింది. వాళ్ళు సొదొమనుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆమె ఆగి వెనక్కి చూసింది. అప్పుడు ఆమె ఉప్పు స్తంభమయ్యింది. చిత్రంలో ఆమె మీకు కనిపిస్తోందా?
దీనినుండి మనం ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. దేవుడు తనకు విధేయులైన వారిని రక్షిస్తాడని, ఆయనకు విధేయులు కాని వారు తమ ప్రాణాలను కోల్పోతారని అది చూపిస్తోంది.