కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

41వ కథ

ఇత్తడి పాము

ఇత్తడి పాము

ఆ స్తంభానికి చుట్టుకొని ఉన్నది నిజం పాములా కన్పిస్తోందా? అది నిజం పాము కాదు. అది ఇత్తడితో చేసిన పాము. ప్రజలు దానివైపు చూసి బ్రతికి ఉండడానికి యెహోవా మోషేతో దానిని అలా స్తంభంపై పెట్టమన్నాడు. అయితే నేలమీద కన్పిస్తున్న ఇతర పాములు మాత్రం నిజమైనవి. అవి ప్రజలను కాటేయడంతో వాళ్ళు అస్వస్థులయ్యారు. ఎందుకో తెలుసా?

ఎందుకంటే, ఇశ్రాయేలీయులు దేవునికి, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. ‘ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని ఐగుప్తునుండి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ ఆహారమే గాని, నీళ్ళే గాని లేవు. మేము ఈ మన్నాను తినలేము’ అని ఫిర్యాదు చేశారు.

కానీ మన్నా మంచి ఆహారమే. యెహోవా దానిని వాళ్ళకు అద్భుతమైన విధంగా ఇచ్చాడు. వాళ్ళకు అద్భుతమైన విధంగా నీళ్ళు కూడా ఇచ్చాడు. కానీ దేవుడు తమను శ్రద్ధగా చూసుకున్నందుకు వాళ్ళు కృతజ్ఞత చూపించలేదు. అందుకే యెహోవా వాళ్ళను శిక్షించడానికి పాములను పంపించాడు. ఆ పాములు వాళ్ళను కాటేశాయి, వాళ్ళలో చాలామంది చనిపోయారు.

చివరకు ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, ‘మేము యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి పాపం చేశాం. ఈ పాములు మా దగ్గరనుండి వెళ్ళిపోయేలా చేయమని యెహోవాకు ప్రార్థన చెయ్యి’ అన్నారు.

కాబట్టి మోషే ఆ ప్రజల కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా మోషేతో ఒక ఇత్తడి పాము చేయమన్నాడు. దానిని స్తంభంపైన పెట్టాలని, పాము కాటువేయబడినవారు దానివైపు చూడాలని ఆయన చెప్పాడు. మోషే దేవుడు చెప్పినట్లే చేశాడు. అలా కాటువేయబడిన ప్రజలు ఆ ఇత్తడి పాము వైపు చూసి స్వస్థత పొందారు.

దీనినుండి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే మనందరం పాము కాటువేయబడిన ఇశ్రాయేలీయుల్లానే ఉన్నాము. మనందరం మరణించే స్థితిలో ఉన్నాము. ప్రజలు వృద్ధులైపోయి, అనారోగ్యంపాలై చనిపోవడాన్ని మనం చూస్తున్నాము. దానికి కారణం మొదటి స్త్రీ పురుషులైన ఆదాము హవ్వలు యెహోవానుండి వేరైపోవడమే, మనందరం వాళ్ళ పిల్లలమే. అయితే మనం నిరంతరం జీవించడానికి యెహోవా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు.

యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తును భూమిపైకి పంపించాడు. అనేకులు యేసు చెడ్డవాడు అనుకున్నారు, అందుకే ఆయనను మ్రానుపై వ్రేలాడదీశారు. అయితే యెహోవా మనలను రక్షించడానికి యేసును పంపించాడు. మనం ఆయన వైపు చూస్తే, ఆయనను అనుసరిస్తే నిత్యజీవాన్ని పొందవచ్చు. దాని గురించి మనం తరువాత ఎక్కువగా తెలుసుకుంటాం.