కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

35వ కథ

యెహోవా తన నియమాలను ఇవ్వడం

యెహోవా తన నియమాలను ఇవ్వడం

ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన రెండు నెలల తర్వాత సీనాయి పర్వతం దగ్గరకు చేరుకున్నారు, అది హోరేబు కొండ అని కూడా పిలువబడుతుంది. మండుతున్న పొదలోనుండి యెహోవా మోషేతో మాట్లాడింది అక్కడే. ప్రజలు అక్కడ కొంతకాలం బసచేశారు.

ప్రజలు క్రింద వేచి ఉండగా, మోషే పర్వతంపైకి వెళ్ళాడు. ఆ పర్వత శిఖరంపైన, ఇశ్రాయేలీయులు తనకు విధేయత చూపించాలని, వారు తనకు ప్రత్యేకమైన ప్రజలుగా తయారు కావాలని తాను కోరుకుంటున్నానని యెహోవా మోషేతో చెప్పాడు. మోషే క్రిందకి దిగి వచ్చి, యెహోవా తెలియజేసిన దానిని ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ప్రజలు యెహోవాకు విధేయత చూపిస్తామని చెప్పారు, ఎందుకంటే వారు ఆయన ప్రజలుగా ఉండాలని కోరుకున్నారు.

అప్పుడు యెహోవా ఒక విచిత్రమైన పని చేశాడు. ఆయన పర్వత శిఖరంపై పొగ లేచేలా చేసి, పెద్ద ధ్వనులు పుట్టించాడు. ‘ఐగుప్తునుండి మిమ్మల్ని తీసుకొని వచ్చిన మీ దేవుడైన యెహోవాను నేనే’ అని ఆయన ప్రజలతో మాట్లాడాడు కూడా. ఆ తర్వాత ‘మీరు నన్ను తప్ప వేరే దేవుళ్ళను ఆరాధించకూడదు’ అని ఆయన ఆజ్ఞాపించాడు.

దేవుడు ఇశ్రాయేలీయులకు ఇంకా తొమ్మిది ఆజ్ఞలను లేదా నియమాలను ఇచ్చాడు. ప్రజలు చాలా భయపడ్డారు. వారు మోషేతో ‘నువ్వే మాతో మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం’ అన్నారు.

ఆ తర్వాత యెహోవా మోషేతో ‘పర్వతం ఎక్కి నా దగ్గరకు రా. ప్రజలు అనుసరించాలని నేను కోరుకుంటున్న నియమాలు వ్రాయబడివున్న రెండు పలకలు నేను నీకు ఇస్తాను’ అని చెప్పాడు. కాబట్టి మోషే మళ్ళీ పర్వతంపైకి వెళ్ళాడు. ఆయన అక్కడ 40 పగళ్ళూ రాత్రులూ ఉన్నాడు.

దేవుడు తన ప్రజలకు ఎన్నో నియమాలు ఇవ్వాలనుకున్నాడు. మోషే ఆ నియమాలను వ్రాసుకున్నాడు. దేవుడు మోషేకు రెండు రాతి పలకలను కూడా ఇచ్చాడు. దేవుడు ప్రజలందరికి చెప్పిన 10 నియమాలను ఆయనే స్వయంగా వాటిపై వ్రాశాడు. అవి పది ఆజ్ఞలు అని పిలువబడ్డాయి.

ఆ పది ఆజ్ఞలు ప్రాముఖ్యమైన నియమాలు. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఇతర నియమాలు కూడా ప్రాముఖ్యమైనవే. వాటిలో ఒకటి: ‘నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ప్రాణముతోనూ నీ పూర్ణ బలంతోనూ ప్రేమించాలి.’ మరొకటి: ‘నిన్నువలె నీ పొరుగువాడిని ప్రేమించాలి.’ యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాటిలో ఈ రెండు నియమాలు ఎంతో గొప్పవని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చెప్పాడు. మనం దేవుని కుమారుని గురించి, ఆయన బోధల గురించి తర్వాత ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.