కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

36వ కథ

బంగారు దూడ

బంగారు దూడ

అయ్యయ్యో! ప్రజలేమి చేస్తున్నారు? వాళ్ళు ఒక దూడకు ప్రార్థిస్తున్నారు! వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు?

మోషే చాలాకాలం పర్వతంపైనే ఉండిపోయేసరికి ప్రజలు, ‘మోషే ఏమయ్యాడో మనకు తెలియదు. ఇక్కడనుండి మనల్ని నడిపించడానికి ఒక దేవతను చేసుకుందాము రండి’ అన్నారు.

మోషే అన్న అహరోను అందుకు ‘సరే’ అన్నాడు. ‘మీ చెవులకున్న బంగారు పోగులను తీసుకొని నా దగ్గరకు రండి’ అని ఆయన చెప్పాడు. ప్రజలు అలా తెచ్చినప్పుడు అహరోను వాటిని కరిగించి ఒక బంగారు దూడను చేశాడు. అప్పుడు ప్రజలు ‘మనల్ని ఐగుప్తునుండి బయటకు తీసుకువచ్చిన దేవత ఇదే!’ అన్నారు. ఇశ్రాయేలీయులు గొప్ప విందు చేసుకొని ఆ బంగారు దూడను ఆరాధించారు.

అది చూసి యెహోవాకు ఎంతో కోపం వచ్చింది. మోషేతో ఆయన, ‘ప్రజలు చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు వెంటనే కిందికి వెళ్ళు. వాళ్ళు నా నియమాలను మరచిపోయి బంగారు దూడకు మ్రొక్కుతున్నారు’ అని చెప్పాడు.

మోషే వెంటనే పర్వతము దిగి వచ్చాడు. ఆయన కిందికి వచ్చేసరికి ప్రజలు పాటలు పాడుతూ బంగారు దూడ చుట్టూ నాట్యం చేస్తూ కనిపించారు! వాళ్ళను చూసి మోషేకు ఎంతో కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన తన చేతిలోని రెండు రాతి పలకలను విసిరేశాడు. అవి ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి. తర్వాత మోషే ఆ బంగారు దూడను కరిగించి పొడి చేశాడు.

ప్రజలు చాలా చెడ్డ పని చేశారు. కాబట్టి మోషే కొంతమంది పురుషులతో తమ ఖడ్గాలను తీసుకొమ్మని చెప్పాడు. ‘బంగారు దూడను ఆరాధించిన ప్రజలు తప్పక చనిపోవాల్సిందే’ అని మోషే అన్నాడు. అప్పుడు ఆ మనుష్యులు 3,000 మందిని చంపేశారు! మనం యెహోవాను తప్ప ఇతర దేవుళ్ళను ఆరాధించకుండా జాగ్రత్తగా ఉండాలని ఇది సూచించడం లేదా?