కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

34వ కథ

ఒక క్రొత్త రకమైన ఆహారం

ఒక క్రొత్త రకమైన ఆహారం

నేలపైనుండి ప్రజలు ఏమి ఏరుకుంటున్నారో చెప్పగలరా? అది మంచులా ఉంది. తెల్లగా సన్నగా పల్చని కణాలుగా ఉంది. కానీ అది మంచు కాదు; అది ఆహార పదార్థం.

ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చి దాదాపు ఒక నెల గడిచింది. వారు అరణ్యంలో ఉన్నారు. అక్కడ ఆహార పంటలు తక్కువగా పండుతాయి. కాబట్టి ప్రజలు, ‘యెహోవా మమ్మల్ని ఐగుప్తులో చంపేసినా బాగుండేది, అక్కడ కనీసం మేము మాకు ఇష్టమైన ఆహారాన్ని తినేవాళ్ళం’ అని ఫిర్యాదు చేశారు.

అందుకే యెహోవా, ‘నేను ఆకాశంనుండి ఆహారాన్ని కురిపిస్తాను’ అన్నాడు. యెహోవా అలాగే చేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇశ్రాయేలీయులు నేలపై ఉన్న తెల్లని పదార్థాన్ని చూసి ‘ఇదేమిటి?’ అనుకున్నారు.

‘ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారం’ అని మోషే చెప్పాడు. ప్రజలు దాన్ని మన్నా అని పిలిచారు. దాని రుచి తేనెతో చేసిన పల్చని కేకులా ఉండేది.

మోషే ప్రజలతో, ‘మీలో ప్రతి వ్యక్తి తాను తినగలిగినంత ఆహారాన్ని సమకూర్చుకోవాలి’ అని చెప్పాడు. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నే వారు అదే పని చేసేవారు. ఆ తర్వాత ఎండ వచ్చినప్పుడు ఆ వేడికి నేలపై మిగిలివున్న మన్నా కరిగిపోయేది.

‘ఎవరూ కూడా మరుసటి రోజు కోసం మన్నాను దాచుకోకూడదు’ అని కూడా మోషే చెప్పాడు. అయినా కొంతమంది వినలేదు. అప్పుడేమి జరిగిందో తెలుసా? వారు దాచుకున్న మన్నా ఆ మరుసటి రోజు ఉదయానికి పూర్తిగా పురుగులు పట్టి కంపు కొట్టడం ప్రారంభించింది!

అయితే వారంలో ఒకరోజు మాత్రం ప్రజలు రెండింతల మన్నాను దాచుకోవచ్చని యెహోవా తెలియజేశాడు. వాళ్ళు ఆరవ రోజున అలా చేయాలి. వాళ్ళు కొంత మన్నాను మరుసటి రోజుకి దాచుకోవాలని, తాను ఏడవ రోజున ఆహారాన్ని కురిపించనని యెహోవా తెలియజేశాడు. వాళ్ళు మన్నాను ఏడవ రోజు కోసం దాచుకున్నప్పుడు అది పురుగులు పట్టేది కాదు, కంపు కొట్టేది కాదు! అది మరో అద్భుతం!

ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నన్ని సంవత్సరాలు యెహోవా వారిని మన్నాతో పోషించాడు.