కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

38వ కథ

పన్నెండు మంది వేగులవారు

పన్నెండు మంది వేగులవారు

ఈ మనుష్యులు మోసుకొచ్చిన పండ్లను చూడండి. ఆ ద్రాక్ష గెల ఎంత పెద్దగా ఉందో కదా. దానిని ఒక కర్రకు తగిలించుకొని ఇద్దరు మనుష్యులు మోసుకురావల్సి వచ్చింది. ఆ అంజూరపు పండ్లను, దానిమ్మ పండ్లను చూడండి. అంత మంచి పండ్లు ఎక్కడివి? కనాను దేశానివి. కనాను అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఒకప్పుడు నివసించిన దేశమని గుర్తుచేసుకోండి. అక్కడ వచ్చిన కరవు కారణంగా యాకోబు తన కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళాడు. దాదాపు 216 సంవత్సరాల తర్వాత మోషే ఇశ్రాయేలీయులను తిరిగి కనానుకు నడిపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అరణ్యములో కాదేషు అని పిలువబడే ప్రాంతానికి చేరుకున్నారు.

కనాను దేశంలో చెడ్డవాళ్ళు నివసించేవారు. అందుకే మోషే 12 మంది వేగులవాళ్ళను పంపిస్తూ, ‘అక్కడ ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారో, వాళ్ళు ఎంత బలమైనవాళ్ళో కనుక్కొని రండి. పంటలకు ఆ దేశము మంచిదో కాదో చూసి, అక్కడి పండ్లను కొన్నింటిని తీసుకురండి’ అని చెప్పాడు.

ఆ వేగులవాళ్ళు కాదేషుకు తిరిగి వచ్చి మోషేతో, ‘నిజంగా ఆ దేశం మంచి దేశము’ అని చెప్పారు. దాన్ని రుజువు చేయడానికి అక్కడి పండ్లను కొన్నింటిని మోషేకు చూపించారు. అయితే వేగులవాళ్ళలో పదిమంది, ‘అక్కడ నివసించే ప్రజలు చాలా దృఢంగా, బలంగా ఉన్నారు. ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి వెళితే వాళ్ళు మనల్ని చంపేస్తారు’ అని చెప్పారు.

అది వినగానే ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ‘మనం ఐగుప్తులోనో లేక ఈ అరణ్యంలోనో మరణిస్తే మంచిది. మనం యుద్ధంలో చంపబడి మన భార్యలు, పిల్లలు చెరగా పట్టబడతారు. మోషేకు బదులు మరో కొత్త నాయకుడిని ఎన్నుకొని మనం ఐగుప్తుకే తిరిగి వెళ్దాం!’ అన్నారు.

కానీ వేగులవాళ్ళలో ఇద్దరు మాత్రం యెహోవాపై నమ్మకముంచి, ప్రజలను శాంతపరచడానికి ప్రయత్నించారు. వాళ్ళ పేర్లు యెహోషువ, కాలేబు. వాళ్ళు ప్రజలతో, ‘భయపడవద్దు, యెహోవా మనతో ఉన్నాడు. మనం ఆ దేశాన్ని సులభంగా స్వాధీనపరచుకుంటాము’ అన్నారు. కానీ ప్రజలు వినలేదు. యెహోషువ, కాలేబులను చంపాలని కూడా వాళ్ళు అనుకున్నారు.

దానితో యెహోవాకు చాలా కోపం వచ్చింది. ‘ఇరవై సంవత్సరాలు మొదలుకొని ఆ పై వయస్సుగల వాళ్ళెవ్వరూ కనాను దేశములోకి ప్రవేశించరు. నేను ఐగుప్తులోనూ అరణ్యంలోనూ చేసిన అద్భుతాలను చూసినా వాళ్ళు నన్ను నమ్మడంలేదు. ఆఖరివాడు మరణించేంతవరకూ వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలోనే సంచరిస్తారు. యెహోషువ, కాలేబు మాత్రమే కనానులోకి ప్రవేశిస్తారు’ అని ఆయన మోషేతో చెప్పాడు.