కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

49వ కథ

సూర్యుడు అలాగే నిలిచిపోవడం

సూర్యుడు అలాగే నిలిచిపోవడం

యెహోషువ వైపు చూడండి. ఆయన, ‘సూర్యుడా, నిలిచిపో!’ అని అంటున్నాడు. అప్పుడు సూర్యుడు అలాగే నిలిచిపోయాడు. రోజంతా ఆకాశం మధ్యలో అలాగే నిలిచిపోయాడు. యెహోవాయే అలా జరిగేలా చేశాడు! అయితే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉండాలని యెహోషువ ఎందుకు కోరుకున్నాడో చూద్దాం.

కనాను దేశంలోని ఐదుగురు చెడ్డ రాజులు గిబియోనీయులతో యుద్ధం చేయడం ప్రారంభించినప్పుడు గిబియోనీయులు సహాయం కోరడానికి యెహోషువ దగ్గరకు ఒక వ్యక్తిని పంపించారు. ‘త్వరగా మా దగ్గరకు రండి! మమ్మల్ని రక్షించండి! కొండప్రాంతంలోని రాజులంతా మీ సేవకులమైన మాతో యుద్ధం చేయడానికి వచ్చారు’ అని ఆ వ్యక్తి చెప్పాడు.

వెంటనే యెహోషువ, ఆయన యుద్ధశూరులందరూ వెళ్ళారు. వాళ్ళు రాత్రంతా నడిచి వెళ్ళారు. వాళ్ళు గిబియోనుకు రాగానే ఆ ఐదుగురు రాజుల సైనికులు భయపడి పారిపోవడం ప్రారంభించారు. అప్పుడు యెహోవా ఆకాశం నుండి వడగండ్ల వర్షము కురిసేలా చేశాడు, యెహోషువ యుద్ధశూరుల చేతిలోకంటె వడగండ్ల చేతనే ఎక్కువమంది మరణించారు.

అయితే కొంతసేపటికి సూర్యుడు అస్తమిస్తాడని యెహోషువ గ్రహించాడు. చీకటిపడినప్పుడు ఐదుగురు చెడ్డ రాజుల సైనికుల్లో చాలామంది తప్పించుకుపోయే అవకాశం ఉంది. అందుకే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి, ‘సూర్యుడా నిలిచిపో!’ అని అన్నాడు. సూర్యుడు అలాగే ప్రకాశిస్తుండగా ఇశ్రాయేలీయులు యుద్ధంలో విజయం సాధించగలిగారు.

దేవుని ప్రజలను ద్వేషించే అనేకమంది చెడ్డరాజులు కనానులో ఉండేవారు. ఆ దేశానికి చెందిన 31 మంది రాజులను జయించడానికి యెహోషువకు, ఆయన సైన్యానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది. ఆ పని పూర్తైన తర్వాత, యెహోషువ ఇంకా స్థలం కావలసిన ఇశ్రాయేలు గోత్రాలకు కనాను దేశము పంచిపెట్టబడేలా చూశాడు.

అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత చివరకు 110 సంవత్సరాల వయస్సులో యెహోషువ మరణించాడు. ఆయన, ఆయన స్నేహితులు బ్రతికివున్నంతకాలం ప్రజలు యెహోవాకు విధేయత చూపించారు. కానీ ఆ మంచి మనుష్యులు చనిపోయిన తరువాత ప్రజలు చెడ్డ పనులు చేయడం ప్రారంభించి కష్టాల్లో చిక్కుకున్నారు. ఆ సమయంలోనే వాళ్ళకు నిజంగా దేవుని సహాయం అవసరమయ్యింది.