కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

58వ కథ

దావీదు, గొల్యాతు

దావీదు, గొల్యాతు

ఫిలిష్తీయులు మళ్ళీ ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. దావీదు ముగ్గురు పెద్ద అన్నలు సౌలు సైన్యంలో చేరారు. కాబట్టి ఒకరోజు యెష్షయి దావీదుతో, ‘నీ అన్నల కోసం కొంత ధాన్యాన్ని, రొట్టెలను తీసుకొని వెళ్ళు. వాళ్ళ యోగక్షేమాలు విచారించుకొని రా’ అని చెప్పాడు.

దావీదు సైన్య శిబిరం దగ్గరకు రాగానే, తన అన్నలను వెదకడానికి యుద్ధ పంక్తి వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల భారీకాయుడు గొల్యాతు ఇశ్రాయేలీయులను హేళన చేయడానికి ముందుకొచ్చాడు. అతను 40 రోజులనుండి ప్రతిరోజు ఉదయం సాయంకాలం అలా చేస్తూనే ఉన్నాడు. ‘మీలో ఎవరినైనా నాతో యుద్ధం చేయడానికి ఎన్నుకోండి. అతను జయించి నన్ను చంపితే మేము మీకు దాసులమౌతాము. కానీ నేను జయించి అతన్ని చంపితే మీరు మాకు దాసులవ్వాలి. ధైర్యముంటే నాతో యుద్ధం చేయడానికి ఎవరినైనా ఎన్నుకోమని నేను సవాలు చేస్తున్నాను’ అని అతను అవహేళన చేస్తుండేవాడు.

దావీదు సైన్యంలోని కొంతమందిని, ‘ఈ ఫిలిష్తీయుని చంపి ఇశ్రాయేలీయులను ఈ అవమానంనుండి కాపాడే వ్యక్తికి లభించే బహుమతి ఏమిటి?’ అని అడిగాడు.

‘సౌలు ఆ వ్యక్తికి ఎంతో సంపదను ఇస్తాడు. అంతేకాక తన స్వంత కుమార్తెను కూడా అతనికి భార్యగా ఇస్తాడు’ అని ఒక సైనికుడు సమాధానమిచ్చాడు.

అయితే గొల్యాతు చాలా భారీకాయుడు కాబట్టి ఇశ్రాయేలీయులంతా అతనికి భయపడ్డారు. అతను 9 అడుగుల (దాదాపు 3 మీటర్ల) కంటే ఎత్తుగా ఉండేవాడు, అతని డాలు పట్టుకొని మరో సైనికుడు నిలబడి ఉండేవాడు.

దావీదు గొల్యాతుతో పోరాడాలనుకుంటున్నాడు అని కొంతమంది సైనికులు వెళ్ళి సౌలుకు చెప్పారు. కానీ సౌలు దావీదుతో, ‘నీవు ఈ ఫిలిష్తీయునితో పోరాడలేవు. నీవు కేవలం బాలుడవు, అతడు తన జీవితమంతా సైనికునిగానే ఉన్నవాడు’ అని అన్నాడు. దావీదు ‘నేను నా తండ్రి గొర్రెలను ఎత్తుకుపోయిన ఒక ఎలుగుబంటిని, సింహాన్ని చంపాను. ఈ ఫిలిష్తీయుడు కూడా వాటిలాగే అవుతాడు. యెహోవా నాకు సహాయం చేస్తాడు’ అని సమాధానమిచ్చాడు. అప్పుడు సౌలు, ‘వెళ్ళు యెహోవా నీకు తోడైయుండును గాక’ అన్నాడు.

దావీదు యేటి లోయలోకి వెళ్ళి ఐదు నున్నటి రాళ్ళను తీసుకొని సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత తన వడిసెల పట్టుకొని ఆ భారీకాయుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళాడు. గొల్యాతు అతనిని చూసి నమ్మలేకపోయాడు. దావీదును చంపడం చాలా సులభం అని అతను అనుకున్నాడు.

‘నా దగ్గరకు రా, నీ శరీరాన్ని పక్షులకు జంతువులకు అర్పిస్తాను’ అని గొల్యాతు అన్నాడు. దానికి దావీదు ‘నీవు నా మీదకు ఒక కత్తితోను, ఈటెతోను, బల్లెముతోను వస్తున్నావు. నేనైతే యెహోవా నామమునుబట్టి నీ మీదికి వస్తున్నాను. ఈ రోజున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను చంపివేస్తాను’ అని చెప్పాడు.

వెంటనే దావీదు గొల్యాతు వైపు పరుగెత్తాడు. ఆయన తన సంచిలోనుంచి ఒక రాయిని తీసుకొని వడిసెలలో పెట్టి తన బలం కొద్ది విసిరాడు. ఆ రాయి వెళ్ళి నేరుగా గొల్యాతు తలకు తగిలింది, అతను క్రిందపడి చనిపోయాడు! వాళ్ళ శూరుడు పడిపోవడం చూసినప్పుడు ఫిలిష్తీయులు వెనక్కి తిరిగి పారిపోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు వాళ్ళను తరిమి, యుద్ధాన్ని జయించారు.