69వ కథ
ఒక బాలిక శక్తిమంతుడైన వ్యక్తికి సహాయం చేయడం
ఆ చిన్న అమ్మాయి ఏమి చెబుతుందో మీకు తెలుసా? ఆమె ఆ స్త్రీతో యెహోవా ప్రవక్తయైన ఎలీషా గురించి, యెహోవా సహాయంతో ఆయన చేసే అద్భుత క్రియల గురించి చెబుతోంది. ఆ స్త్రీకి యెహోవా గురించి తెలియదు, ఎందుకంటే ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు. అయితే ఆ బాలిక ఆ స్త్రీ ఇంట్లో ఎందుకు ఉందో మనం చూద్దాం.
ఆ స్త్రీ సిరియా దేశస్థురాలు. ఆమె భర్త నయమాను, ఆయన సిరియా సైన్యాధిపతి. సిరియనులు ఇశ్రాయేలీయురాలైన ఆ బాలికను చెరగా తెచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు దాసురాలిగా ఉండడానికి తీసుకురాబడింది.
నయమానుకు కుష్ఠు వ్యాధి అనే చెడ్డ వ్యాధి ఉంది. ఆ వ్యాధివల్ల ఒక వ్యక్తి శరీరంనుండి మాంసం ఊడిపోవచ్చు. అందుకే ఆ బాలిక నయమాను భార్యతో, ‘నా యజమానుడు, ఇశ్రాయేలులోనున్న యెహోవా ప్రవక్త వద్దకు వెళితే బాగుంటుంది. ఆ ప్రవక్త ఆయన కుష్ఠు వ్యాధిని నయం చేస్తాడు’ అని చెప్పింది. తర్వాత ఆ స్త్రీ ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది.
నయమాను తన వ్యాధి నయం కావాలని ఎంతగానో కోరుకున్నాడు; కాబట్టి ఆయన ఇశ్రాయేలుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆయన అక్కడకు చేరుకొని ఎలీషా ఇంటికి వెళ్ళాడు. ఎలీషా తన సేవకుని పంపి, నయమానును వెళ్ళి యొర్దాను నదిలో ఏడుసార్లు స్నానం చెయ్యమని చెప్పించాడు. అది విన్నప్పుడు నయమానుకు చాలా కోపం వచ్చింది, ‘మా దేశంలో ఉన్న నదులు ఇశ్రాయేలులోని నదులకంటే చాలా శ్రేష్ఠమైనవి!’ అని చెప్పి నయమాను వెళ్ళిపోయాడు.
కానీ నయమాను దాసులలో ఒకడు ఆయనతో ‘ప్రభువా, ఎలీషా నీకు ఏదైనా గొప్ప కార్యం చేయమని చెబితే నీవు చేసివుండేవాడివి. ఆయన చెప్పినట్లు వెళ్ళి కేవలం స్నానం ఎందుకు చేయకూడదు?’ అన్నాడు. నయమాను తన దాసుని మాట విని యొర్దానులోకి వెళ్ళి నీటిలో ఏడుసార్లు మునిగాడు. అలా చేయగానే ఆయన శరీరము దృఢంగా, ఆరోగ్యవంతంగా మారింది!
నయమాను ఎంతో సంతోషించాడు. ఆయన ఎలీషా వద్దకు తిరిగి వెళ్ళి, ‘ఇశ్రాయేలులోని దేవుడు తప్ప లోకమంతటిలో మరొక దేవుడు లేడని నాకిప్పుడు తెలిసింది. దయచేసి నానుండి ఈ బహుమానం తీసుకో’ అని కోరాడు. అయితే ఎలీషా, ‘నేను తీసుకోను’ అని సమాధానమిచ్చాడు. అలా బహుమానం తీసుకోవడం తప్పు అని ఎలీషాకు తెలుసు, ఎందుకంటే నయమానును బాగు చేసింది యెహోవాయే. కానీ ఎలీషా సేవకుడైన గేహజీ తనకు ఆ బహుమతి కావాలని కోరుకున్నాడు.
అప్పుడు గేహజీ ఇలా చేశాడు. నయమాను వెళ్ళిన వెంటనే గేహజీ ఆయనను కలుసుకోవడానికి పరుగెత్తుకొని వెళ్ళి, ‘ఎలీషాను దర్శించడానికి ఇప్పుడే కొంతమంది స్నేహితులు వచ్చారు, వాళ్ళకు ఇవ్వడానికి తనకు కొంత బహుమానం కావాలని నీకు చెప్పమని ఆయన నన్ను పంపించాడు’ అన్నాడు. కానీ అది అబద్ధం. అయితే నయమానుకు అది అబద్ధమని తెలియదు; కాబట్టి ఆయన గేహజీకి కొంత బహుమానం ఇచ్చాడు.
గేహజీ తిరిగి వచ్చినప్పుడు, ఆయన ఏమి చేశాడో ఎలీషాకు తెలుసు. యెహోవా ఆయనకు తెలియజేశాడు. కాబట్టి ఎలీషా గేహజీతో, ‘నీవు ఈ చెడ్డ పని చేసినందుకు నయమాను కుష్ఠు వ్యాధి నీకు వస్తుంది’ అని చెప్పాడు. వెంటనే అలా జరిగింది!
మనం దీనంతటినుండి ఏమి నేర్చుకోవచ్చు? మొదటిగా, మనం ఆ చిన్న బాలికవలే యెహోవా గురించి మాట్లాడాలి. అది ఎంతో మేలు చేస్తుంది. రెండవదిగా, మనం నయమాను మొదట్లో ఉన్న విధంగా గర్వంగా ఉండకుండా దేవుని సేవకులకు విధేయత చూపించాలి. మూడవదిగా, మనం గేహజీవలే అబద్ధాలు చెప్పకూడదు. బైబిలును చదవడం ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకోమా?