కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

68వ కథ

తిరిగి బ్రతికిన ఇద్దరు అబ్బాయిలు

తిరిగి బ్రతికిన ఇద్దరు అబ్బాయిలు

మీరు చనిపోయిన తర్వాత, తిరిగి బ్రతికించబడితే మీ తల్లి ఎలా భావిస్తుంది? ఆమె చాలా సంతోషిస్తుంది! అయితే చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకగలడా? ముందు ఎప్పుడైనా అలా జరిగిందా?

ఇక్కడున్న పురుషుణ్ణి, ఆ స్త్రీని, ఆ అబ్బాయిని చూడండి. ఆ పురుషుడు ప్రవక్తయైన ఏలీయా. ఆ స్త్రీ సారెపతు పట్టణానికి చెందిన ఒక విధవరాలు, ఆ అబ్బాయి ఆమె కుమారుడు. ఒకరోజు ఆ అబ్బాయికి జబ్బు చేసింది. అతని పరిస్థితి క్షీణించి, చివరకు అతను చనిపోయాడు. అప్పుడు ఏలీయా ఆ స్త్రీతో, ‘అబ్బాయిని నాకివ్వు’ అన్నాడు.

ఏలీయా ఆ చనిపోయిన అబ్బాయిని మేడగదికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. తరువాత ఆయన, ‘యెహోవా, ఈ అబ్బాయిని తిరిగి బ్రతికించు’ అని ప్రార్థించాడు. అప్పుడు ఆ అబ్బాయి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు! అప్పుడు ఏలీయా అతనిని క్రిందకు తీసుకెళ్ళి ఆ స్త్రీతో, ‘ఇదిగో, నీ కుమారుడు బ్రతికాడు!’ అని చెప్పాడు. అందుకే ఆ తల్లి అంత సంతోషంగా ఉంది.

యెహోవా యొక్క మరో ముఖ్యమైన ప్రవక్త పేరు ఎలీషా. ఆయన ఏలీయాకు సహాయకునిగా పని చేసేవాడు. అయితే కొంతకాలం తర్వాత యెహోవా ఎలీషాను కూడా అద్భుతాలు చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఒకరోజు ఎలీషా షూనేము పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఆయనను ఎంతో దయతో ఆదరించింది. తరువాత ఆ స్త్రీకి ఒక అబ్బాయి పుట్టాడు.

ఆ అబ్బాయి పెద్దవాడైన తర్వాత ఒక ఉదయం, పొలంలో పనిచేస్తున్న తన తండ్రిని కలవడానికి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఆ అబ్బాయి, ‘నాకు తలనొప్పి వస్తుంది!’ అని అరిచాడు. అతనిని ఇంటికి తీసుకెళ్ళగానే అతను చనిపోయాడు. అతని తల్లికి ఎంత దుఃఖం కలిగిందో! ఆమె వెంటనే వెళ్ళి ఎలీషాను తీసుకొచ్చింది.

ఎలీషా వచ్చిన తర్వాత చనిపోయిన అబ్బాయిని తీసుకొని ఒక గదిలోకి వెళ్ళాడు. ఆయన యెహోవాకు ప్రార్థించి ఆ అబ్బాయి శరీరంపై పడుకున్నాడు. కొద్దిసేపటికి అబ్బాయి శరీరం వేడెక్కి, అతను ఏడు సార్లు తుమ్మాడు. అతని తల్లి గదిలోకి వచ్చి తన కుమారుడు బ్రతికివున్నాడని చూసినప్పుడు ఎంతో సంతోషించింది!

ఎంతోమంది ప్రజలు చనిపోయారు. ఆ కారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో దుఃఖించారు. చనిపోయిన వాళ్ళను లేపే శక్తి మనకు లేదు. కానీ యెహోవాకు ఆ శక్తి ఉంది. ఆయన కోట్లాదిమందిని తిరిగి ఎలా బ్రతికిస్తాడో మనం తర్వాత తెలుసుకుంటాం.